భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– జె. రమాదేవి

ఐదేళ్లపసివాడి మనస్సు అల్లకల్లోలం అవుతున్న సముద్రాన్ని కసిగా చూస్తోంది. వాడి చూపుల్లో ద్వేషం. చెప్పులు లేని వాడి కాళ్లని సముద్రపు జలాలు ఉండుండి అభిషేకిస్తున్నాయి. పదేపదే క్షమించమని పసివాడిని ప్రాధేయ పడుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం అంతా ముగిసిపోయింది. వాడి కలలు ఇంకా రూపు దాల్చకుండానే నేలరాలిన పువ్వుల్లా వాడిపోయాయి. అవసరాలు తీర్చే అమ్మ లేదు. ఆడుకునే నాన్న లేడు. నాన్నమ్మ, తాతయ్య ఓపిక ఉన్నంత వరకూ బుజ్జగిస్తారు. తర్వాత అలసిపోయి ఒదిలేస్తున్నారు.

అమ్మ ఆకలి తీర్చేవరకూ వెంట తిరిగేది. నాన్న ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చి ఇచ్చేవాడు.

రాత్రి పగలూ ఏడుస్తూ బెంగటిల్లిపోతున్నాడు చిన్ను. అర్ధరాత్రి అయినా తలుపులు మూయనివ్వడం లేదు. ‘అమ్మానాన్న వస్తారు నాన్నమ్మా’ అంటూ గోల చేస్తాడు. ఆ పసివాడిని ఓదార్చడం చేతకావడం లేదు ఎవరికీ. ‘నాన్న సోఫాలో కూర్చున్నాడు’ అంటూ పరుగెత్తుతాడు. నాన్నమ్మ కన్నీళ్లతో పసివాడిని గుండెకు హత్తు కుంటుంది. తాతయ్య తనలో తనే దు•ఃఖ పడుతున్నాడు. జరిగింది తలుచుకుని ఏడుస్తున్నాడు చిన్ను.

‘‘చిన్నూ! బీచ్‌కి వెళదాం అని అడిగావు కదా! వెళదామా!’’ అడిగాడు ప్రభాకర్‌. ‌కొడుకును రెడీ చేసి తనూ రెడీ అయ్యింది సుమలత.

‘‘నాన్నా! నా బాల్‌’’ అం‌టూ తెచ్చుకున్నాడు చిన్ను. దారంతా చిన్నూ మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి ముద్దుముద్దు మాటలకు అమ్మానాన్నలు మురిసి పోయారు. దారిలో ఐస్‌ ‌క్రీం కొనమంది సుమలత. ‘‘బీచ్‌ ‌దగ్గర కొనుక్కుందాం’’ అన్నాడు చిన్నూ.

‘‘సరే అక్కడే తీసుకుందాం’’ అన్నాడు ప్రభాకర్‌. ‌చిన్నూ కారు దిగగానే బాల్‌ ‌తీసుకుని పరుగెత్తాడు. సుమలత కంగారుగా పిలవబోతుంటే వారించాడు ప్రభాకర్‌.

‘‘‌చిన్నూ! ఎప్పట్నించో కేమిల్‌ ఎక్కాలంటున్నావుగా ఎక్కు’’ అన్నాడు ప్రభాకర్‌.

‌చిన్నూ సంతోషంగా తండ్రి చెయ్యి పట్టుకొని ఊపేసాడు. ఎప్పుడూ వద్దనే నాన్న ఒప్పుకున్నందుకు.. బాల్‌ ‌తల్లి చేతికిచ్చి కేమిల్‌ ఎక్కికూర్చుని ఆనందంగా అమ్మానాన్నలకు టాటా చెప్పాడు.

తిరిగి వచ్చిన చిన్నూకి అమ్మానాన్నలు కనబడలేదు. అందరూ కంగారుగా మాట్లాడుకుంటూ సముద్రపు అలల వైపు చూస్తున్నారు. ఎవరో పోలీసులకు, తర్వాత అంబులెన్స్‌కు ఫోన్లు చేసారు.

ఏడ్చి ఏడ్చి అలసిపోయిన వాడి కళ్లకు దూరంగా అలలపై తేలుతున్న తన బ్లూ కలర్‌ ‌బాల్‌ ‌కనబడింది. రెండు గంటలతర్వాత రెండు మృతదేహాలతో అంబులెన్స్ ‌బీచ్‌ ‌దాటి పరుగెత్తింది.

పసి మనస్సు దుఃఖం ద్వేషంలోకి మళ్లింది. ఇప్పుడు వాడికి సముద్రపు అలలతో ఆడుకోవాలని లేదు. ‘‘నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఎన్నిసార్లు నా కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగినా క్షమించను…’’

బంధువులు ఈటెల్లాంటి మాటలతో గుచ్చు తున్నారు. ‘‘అప్పు చేసి పప్పు కూడు తినాలనుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఉన్నదంతా పెట్టి రిచ్‌ ఏరియా అంటూ ఇంత పెద్దిల్లు కొన్నారు. కారు.. అబ్బో రిచ్‌ ‌పార్టీలు, పంక్షన్‌లు… అవ్వ పిల్లాడి బర్తడేకి యాభైవేలు ఖర్చుపెట్టారంట. ఆఫీసులో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడని ఉన్న జాబు ఊడిందట కదా!’’

తాతయ్యా నానమ్మ వినలేక చెవులు మూసు కుంటున్నారు. పాతికేళ్ల నాటి గతం అతనికి నిన్నో మొన్నో జరిగినట్లు కళ్లముందు కనబడుతూ హెచ్చరిస్తూనే ఉంటుంది.

‘‘హలో హీరో! బ్యాంకుకే కదా వెళ్లేది! నన్ను కొంచెం చౌరస్తా దగ్గర డ్రాప్‌ ‌చేస్తావా?’’ అడిగింది మాలతి.

పునీత్‌ ఆమె వైపు ఒక్కక్షణం చూసి ‘‘రండి డ్రాప్‌ ‌చేస్తాను. ట్వంటీ రూపీస్‌ ‌మీకు ఒకే కదా’’ అనడంతో ఆ అమ్మాయి మొహం ఎప్పటిలాగే చిన్నబుచ్చుకుంది.

ఓ అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే చాలు చొంగలు కార్చుకుంటూ ఎగబడతారు. అలాంటిది ఈ పునీత్‌ ఎప్పుడూ డబ్బు గురించి తప్ప మరోమాట మాట్లాడడు. ఏంటసలు ఇతగాడు? డ్రాప్‌ ‌చెయ్య డానికి ట్వంటీ రూపీస్‌ ఇవ్వమని నిర్మొహమాటంగా అడుగుతున్నాడు. మొన్నటికి మొన్న కేంటీన్లో కాఫీ తాగుదామా అంటే, ‘ఎవరి బిల్‌ ‌వాళ్ళదే అయితే సరే ‘అన్నాడు.

ఓసారి అతన్ని భోజనానికి రమ్మని పిలిచింది.

‘‘వద్దు మాలతీ! ఇప్పుడు నువ్వు భోజనానికి పిలుస్తావు. తర్వాత నేను పిలుస్తానని ఆశిస్తావు. ఇలా ఇచ్చి పుచ్చుకుంటూ పోతుంటే అంతుండదు. అలాగే మనీ ఖర్చు కూడానూ’’ అంత విపులంగా అతను చెప్పాక ఆమె మౌనం వహించక తప్పలేదు.

 మొదటిసారి పునీత్‌ ‌బ్యాంకులో అడుగుపెట్టగానే నచ్చేసాడామెకి. ఆమెకు అతను కొలీగ్‌. ఆరడుగుల అందగాడు బ్యాంకు జాబు. ఎలాంటి బేడ్‌ ‌హేబిట్స్ ‌లేవని మనసు పడింది కానీ, ఇలా ప్రతి దానికి బడ్జెట్‌ ‌బ్రహ్మానందంలా మాట్లాడతాడని అనుకోలేదు. ఆమెతో ఇష్టంగా, సరదాగానే కాలక్షేపం చేస్తాడతను.

‘‘అసలు డబ్బులు అంటే ఎందుకు నీకంత పిచ్చి? డబ్బు అందరికీ అవసరమే కానీ, ప్రతిదానికీ డబ్బుతో ముడిపెడితే నీకంటూ ఎవరూ మిగలరు పునీత్‌! ‌చివరికి ఆ డబ్బు కూడా నిన్ను వ్యతిరేకిస్తుంది’’ అంటూ క్లాస్‌ ‌పీకిందామె.

‘‘డబ్బంటే నాకు వ్యామోహం లేదు మాలా! భయం. నాకు అమ్మానాన్నలను లేకుండా చేసింది ఆ డబ్బే. మా అమ్మానాన్నలు డబ్బును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అది ఆడించినట్లు ఆడేరు. చివరికి దానికోసం బలయిపోయారు. నాకు అందుకే డబ్బంటే భయం. దానితో వచ్చే ఏ సంతోషాలు నాకు అవసరం లేదు. అందుకే దాన్ని నా చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాను. అర్థం అయితే అందరూ పాటిస్తారు. లేదంటే మానేస్తారు. నో ప్రోబ్లం’’ అంటూ భుజాలెగరేసేడు.

ట్వంటీ రూపీస్‌ అతని చేతిలో పెట్టి అతని వెనక బైక్‌ ‌మీద కూర్చుందామె. దారంతా అతన్ని కిందికి తోసెయ్యాలన్నంత కోపాన్ని పంటి బిగువున దాచుకుని కూర్చుంది.

పునీత్‌తో పరిచయం అయిన కొత్తలో ఇద్దరిది ఒకే ఏరియా కాబట్టి, అతని బైక్‌ ‌మీద లిఫ్ట్ అడిగి బ్యాంకుకు వచ్చెయ్యొచ్చు ఎంచక్కా అనుకుంది. డబ్బులు పోతాయని కాదు. పరిచయం పెరిగితే తన లైఫ్‌ ‌సెటిల్‌ అయిపోతుందని. తనకంటూ ఉన్నది తల్లి మాత్రమే. తనకు పెళ్లి చేసే స్థోమత గానీ, సంబంధాలు వెతికే వోపిక గానీ ఆవిడకు లేవు.

తన చిన్నప్పుడే తండ్రి చనిపోతే, నాలుగు చోట్ల ఎవరేం పని చెబితే అది చేసి, అవమానాలు పొంది తనకోసం బతికింది. గాడి పొయ్యిల దగ్గర వంటలు చేసింది. విందు భోజనాల్లో విస్తర్లు ఎత్తింది. పని దొరకని రోజున తనకు కడుపు నింపి ఆవిడ పస్తు పడుకుంది. తను చిన్నతనం నుంచి ఆవిడ కష్టాలు చూసింది. రూపాయి కోసం దినదిన గండంగా ఉండేది. మంచి బట్టలు వేసుకోవాలన్నా… మంచి తిండి తినాలన్నా… ఫ్రెండ్స్‌తో ఎటైనా వెళ్లాలన్నా డబ్బు లేదు. తన చదువుకోసం, తన పొట్ట నింపడం కోసం అమ్మ పడిన కష్టాలు తనకు తెలుసు.

అమ్మకు కష్టమనేది లేకుండా చూసుకోవాలనే ఆశతో శ్రద్ధగా చదువుకుంది. బ్యాంకు టెస్టులకు కోచింగ్‌ ‌లేకుండానే, వాళ్లనీ వీళ్లనీ ప్రాధేయపడి బుక్స్, ‌నోట్స్ ‌సంపాదించుకుని ప్రిపేరయింది. జాబుకు సెలక్ట్ అయ్యాక అమ్మను తనతో తెచ్చుకుంది. అమ్మ చాలా అలసిపోయింది. ఓపిక లేకపోయినా తనకు పెళ్లి చేయలేకపోతున్నందుకు ఎప్పుడూ దిగులుపడుతూ ఉంటుంది. ఆమె దిగులు పోగొట్టడం కోసమైనా తనే వరుణ్ణి వెతుక్కోడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ఆమెకి పునీత్‌ ‌చాలా నచ్చేసాడు. ఇంక తనకి పెళ్లయిపోయినట్టే అనుకుంది. దానిక్కారణం అతను తనంటే ఇష్టంగానే ఉంటున్నాడని.

కానీ అతనిలా ప్రతీదాన్నీ డబ్బుతో ముడిపెట్టడం నచ్చడంలేదు. ఐదు పదుల జీతం వస్తుంది. ఒంటరివాడు. ఏ బాధ్యతలూ లేనివాడు. హాయిగా బిందాస్‌గా ఎంజాయ్‌ ‌చేయకుండా, డబ్బు డబ్బు అంటూ మూటగట్టడం ఆమెకి నచ్చడం లేదు. పెళ్లి చేసుకుంటే రేపు కాపురం చేసే ప్రతిరోజుకూ డబ్బుతో ముడేస్తాడేమో? అతనితో జీవితం షేర్‌ ఆటోలెక్క అవుతుందేమోననే భయం పట్టుకోడంతో, ఆమె ఆ సాహసం చేయలేక దూరంగా ఉండిపోతోంది.

ఆరోజు ఆదివారం. పునీత్‌ ఉదయమే హడావిడిగా బయలుదేరాడు. ఆమె కూడా కుతూ హలంగా వెంబడించింది. అతని బైక్‌ ఓ అనా థాశ్రమం ముందు ఆగింది. ‘ఓ ఇతనికి ఇంత మంచి బుద్ధి కూడా ఉందా? నాలుగు చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి ఓ సెల్ఫీ దిగి గొప్పగా చెప్పుకుంటాడు కాబోలు’ అనుకుంది. అతను అక్కడ చాలాసేపు టైం స్పెండ్‌ ‌చేసాడు. ఆమె ఇంటికి వచ్చేద్దాం అనుకుం టూండగా లోపలికి రమ్మంటూ కబురొచ్చింది. అతను గమనించేశాడని తెలిసి సిగ్గేసింది.

‘‘రండి మాలా! ఎందుకు గేటుదగ్గరే ఆగి పోయారు? ‘‘నవ్వుతూ అడిగాడు పునీత్‌.

‘‘‌చెప్పండి మేడమ్‌! ‌మీరుకూడా ఎవరినైనా ఎడాప్ట్ ‌చేసుకుంటారా? అలా చేసుకుంటే కొంతమంది పిల్లలకైనా లైఫ్‌ ఇచ్చినవాళ్లు అవుతారు. పునీత్‌ ‌సార్‌ ‌రెండేళ్ల క్రితం ఇదిగో ఈ ఇద్దరు పాపల్ని ఎడాప్ట్ ‌చేసుకుని చదివిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉండి వాళ్ల అవసరాలు తీరుస్తున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి వాళ్లతో గడుపుతారు. వాళ్లు చూడండి మేడమ్‌ ఎం‌త సంతోషంగా ఉన్నారో’’ సీట్లో కూర్చున్న పెద్దావిడ గుక్క తిప్పుకోకుండా చెబుతోంది.

ఎందుకో అదంతా ఆమెకు నమ్మాలనిపించలేదు. చిన్న పంచదార పలుకు కింద పడితే ఎక్కడ దాన్ని చీమ పట్టుకు పోద్దోనని తీసి డబ్బాలో వేసుకునే రకం అతను. ఇద్దరు అనాథ పిల్లల్ని ఎడాప్ట్ ‌చేసుకుని, వాళ్ల ఖర్చులు భరిస్తున్నాడంటే తను చచ్చినా నమ్మదు. ఊరికే వచ్చేస్తే అతని ముందు షేమ్‌గా ఉంటుం దని, హేండ్‌ ‌బేగ్‌లోంచి ఐదువేలు తీసి డొనేట్‌ ‌చేసి ఇంటికొచ్చింది. తర్వాత అతను ఆ విషయాలేమీ కదిలించలేదు. ఆమె కూడా పట్టించుకోడం మానేసింది.

ఆరోజు పబ్లిక్‌ ‌హాలిడే. సెలవు కావడంతో ఉదయమే గబగబా పనులు పూర్తి చేసుకుంది. ఊళ్లో ఉంటున్న ఫ్రెండ్స్‌ని కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా కలవలేకపోతోంది. అందుకే అన్ని పనులూ పూర్తి చేసి, తల్లికి కావల్సిన మెడిసిన్‌ అవీ సర్దిపెట్టి, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు చెప్పి ఆటోలో బయలుదేరింది. ఏదైనా అవసరం అయితే ఫోన్‌ ‌చెయ్యమంది.

చీకటి పడేవరకూ వాళ్లు వదల్లేదు. ఎంజాయ్‌ ‌మెంటుతో అలసిపోయి ఇంటికొచ్చింది. ఇంటికి తాళం వేసుంది. ఆమె కంగారుగా చుట్టూ ఉన్నవాళ్లని అడిగింది. ఎవరికీ ఏమీ తెలీదంటున్నారు. అమ్మ తనని వదిలి ఎటెళ్లిపోయింది? ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. తను లేకుండా ఎటూ వెళ్లలేని మనిషి ఏమైపోయినట్టు?.. గుక్క పట్టి ఏడవాలనుంది. తాళం తీసిలోపలికి వెళ్లాలనే ధ్యాసే లేకుండా మెట్లమీద కూర్చుని ఉండిపోయింది.

ఎవరో వచ్చి లైటు వేసేవరకూ ఆమెకు చీకటిలో కూర్చున్నాననే ధ్యాసే లేదు.

‘‘ఏంటి మాలా! ఇక్కడ కూర్చున్నావు లోపలికి వెళదాం రా!’’ అంటూ రెండు చేతులు ఆమెను పైకి లేపాయి. అమ్మా! అమ్మా! అంటూ చుట్టుకుపోయి ఏడ్చింది మొదటిసారి. చిన్నప్పుడు గాడి పొయ్యిలదగ్గర అమ్మ వంట చేస్తున్నప్పుడు తనూ చేస్తానంటే కోప్పడేది. ‘‘నువ్వు చదువుకుని మహారాణిలాగా బతకాలి మాలా! నా ఆయుష్షు కూడా పోసుకుని నిండునూరేళ్లూ చల్లగా బతకాలి’’ అని కౌగిట్లోకి తీసుకుంటే తను గింజుకునేది. అమ్మ దగ్గర చెమట వాసన వస్తోందని తను అన్నా ఆవిడ ఎప్పుడూ తనని దూరం చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఆమె దగ్గర చెమట వాసన వస్తోంది. అయినా పెన్నిధి దొరికినట్లు వదలాలని లేదు.

‘‘ఏంటి మాలగారూ! అనారోగ్యంతో ఉన్నావిడను వదిలి వెళ్లేప్పుడు ఆవిడ బాధ్యత ఎవరికైనా అప్పజెప్పాలి కదా! సమయానికి నేను వచ్చి చూశాను. కళ్లుతిరిగి పడిపోయున్నారు. ఆ టైం లో మీకు ఫోన్‌ ‌చెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు. వెంటనే హాస్పిటల్‌ ‌కి తీసుకెళ్లాను. బాగా వీగ్గా ఉన్నారంట. సెలైన్‌ ‌పెట్టడం వల్ల ప్రోబ్లం అవుతుందని ఇంజెక్షన్‌ ‌చేసారు. ఇప్పుడు ఓ కె ‘‘ఫ్రూట్స్ ‌బేగ్‌ అం‌దిస్తూ అన్నాడు పునీత్‌.

అతన్ని గురించి తనేమనుకుంది! పంచదార పలుకు కిందపడితే చీమ ఎత్తుకు పోద్దని ఎత్తి డబ్బాలో వేసుకుంటాడు అనుకుంది కదా! సిగ్గుతో ఆమె కళ్లు పాతాళంలోకి దిగబడ్డాయి.

‘‘థేంక్యూ పునీత్‌ ‌గారూ! నా లైఫ్‌లో మా అమ్మ చాలాచాలా ఇంపార్టెంట్‌ ’’ అం‌టూ చేతులు జోడించింది మనస్ఫూర్తిగా. పునీత్‌ ఆమె థేంక్స్‌ని యాక్సెప్ట్ ‌చేసి వెళ్లిపోయాడు.

‘‘మాలా! నువ్వు పునీత్‌ని పెళ్లి చేసుకోమ్మా!’’ అనడుగుతున్న తల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదామెకి ఆ రాత్రి.

                                                                                                    *      *       *

‘‘ఎప్పటిలాగే ఇద్దరం మనీ షేరింగ్‌ ‌చేసుకుందాం’’ అందామె అతని వెనక బైక్‌ ‌మీద కూర్చుని. ఆమె మెడలో పచ్చని పసుపుతాడు నవ్వుకుంది.

‘‘నిజమే షేరింగ్‌లోనే ఆనందం ఉంటుంది మిసెస్‌ ‌మాలతీదేవి గారూ!’’ నవ్వేడతను.

వెళుతున్న ఇద్దరివైపూ ఆనందంగా చూసింది ఆమె తల్లి. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి.

వచ్చేవారం కథ..

వెన్నెలకి ఆవల

– భమిడిపాటి గౌరీశంకర్‌

About Author

By editor

Twitter
YOUTUBE