భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– శరత్ చంద్ర
‘‘శాంతా.. నేను టీ తాగానా?’’ అడిగాడు సదాశివం. ‘‘ఇందాక నేనే కదండీ ఇచ్చాను..’’ అంది శాంత కుమారి.
‘‘ఏంటోనోయ్ తాగినట్టే లేదు. పాలున్నాయేమో ‘టీ’ పెట్టరాదూ..’’ అడిగాడు. ‘‘పెట్టరాదు..’’ అంది శాంత.
‘‘నువ్వెందుకు ఇంత కఠినంగా మారిపోయావు శాంతా..?’’ అన్నాడు సదాశివం
‘‘మనం కొనేది ఖరీదైన డిలైట్ పాలు. కోడలు పిల్ల నీళ్లు కూడా తక్కువే కలిపేది. ఉదయాన్నే నీకు నాకు టీ, బుజ్జిగాడికి హార్లెక్స్, పెద్దాడికి కాఫీ. కోడలు పిల్ల టీ, కాఫీ తాగదు కాబట్టి సాయంకాలం నీకూ నాకు ‘టీ’ కి వస్తున్నాయ్’’ అంది.
‘‘కోడలు పిల్ల టీ తాగక పోతే నేం పాలల్లో బోర్నవిటా వేసుకొని తాగుతుంది గా..’’ అన్నాడు సదాశివం.
‘‘హుష్.. హుష్.. నోటికొచ్చింది వాక్కండి..’’ అంది శాంత.
‘‘నా నోరు కప్పెట్టింది చాలు కనీసం ‘టీ’ డికాషన్ అయినా కలుపుకొని రా..’’ చెప్పాడు.
‘‘టీ పొడి మాత్రం ఊరకే వస్తుందా?తాజ్‌మహల్ టీ పొడి కేజీ ధర ఎంతో తెలుసా?’’ అడిగింది.
‘‘టీ పొడి ధర తెలియకుండానే ఇంతకాలం నేను నీతో కాపురం చేశానా?’’ అన్నాడు సదాశివం.
‘‘మీరు తెచ్చింది అప్పట్లో లూజ్ ‘టీ’ పొడి, ఇప్పుడు పిల్లాడు తెచ్చేది కంపెనీ ‘టీ’పొడి. పొదుపు గానే వాడాలి’’ అంది.
‘‘సరే.. చిల్లర ఒక పది రూపాయలు పట్రా.. అలా రోడ్డు మీద వరకూ పోయి వస్తా..’’ అన్నాడు సదాశివం.
‘‘మీరు తప్పిపోతే మిమ్మల్ని వెతకడానికి ఆటోకి మాకు రెండొందలు అవుతుంది..’’ అంది శాంత.
‘‘నీతో పెద్ద చావొచ్చిపడిందే..’’ కాస్త కోపంగానే అన్నాడు సదాశివం స్వరం పెంచి.
‘‘కాస్త చిన్నగా మాట్లాడండి మావయ్యా.. పండుగాడు ఇప్పుడే పడుకున్నాడు..’’ అంది లావణ్య లోపలి నుంచి బయటకు వచ్చి.
‘‘ఎంత చెప్పినా ఈన గారికి అర్థ•ం కాదమ్మా. ఈయన రంధి ఈయనదే’’ అంది.
కాసేపటి తర్వాత అటుగా తమ పని మనిషి బుజ్జమ్మ పోవడం గమనించింది శాంత. తమ ఇంటికి దగ్గర్లోనే మరో రెండిళ్లల్లో కూడా పని చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ. పనులు పూర్తి చేసుకొని వెళ్లేటప్పుడు కనిపిస్తూ కూడా ఉంటుంది. గోడ దగ్గరకు వచ్చి ‘‘బుజ్జీ.. బుజ్జీ’’ అని పిలిచింది.
‘‘ఏంటమ్మగారూ..’’ అంటూ వచ్చింది బుజ్జమ్మ.
‘‘మీ అయ్యగారికి కాస్త పొలిథిన్ కవర్లో టీ తెచ్చి పెట్టవే..’’ అంది. ‘‘ఎందుకమ్మా.. ఇంట్లో పాలు లేవా?’’ అడిగింది.
‘‘అవి పిల్లాడికి కావాలి లేవే..’’ అంది.
‘‘ఏంటోనమ్మా. మీ పొదువు.’’ గొణిగింది. ఇంతకు ముందు అంట్లు తోమి గచ్చుమీద తడి బట్ట వేసేది బుజ్జమ్మ. ‘‘నువ్వు అంట్ల వరకు తోము బుజ్జమ్మా..’’ అంది లావణ్య.
‘‘ఎందుకనమ్మగారూ..’’ అడిగింది. ‘‘ఇంట్లో ఇద్దరం ఆడవాళ్లం ఖాళీగా ఉన్నాం.. ఇల్లు తుడుచుకో లేమా?’’ అంది.
‘‘ఇలా అందరూ అనుకుంటే మాకెలా పనులు దొరుకుతాయమ్మా..’’ అంది బుజ్జమ్మ.
‘‘నీకు పని కావాలని మేం శక్తికి మించిన భారం మోయలేంగా? చెప్పు.. గిన్నెలు తోమడం వరకే పరిమితం అవుతావా?అవి కూడా మమ్మల్నే చేసుకోమంటావా?’’అంది.
‘‘అంతమాటనకండి అమ్మగారూ! నా కడుపు కొట్టకండీ.’’ అంది.
‘‘మా ఒక్కళ్ల వల్ల మీకేం కడుపు నిండదు లేవే’’ అంది లావణ్య.
‘‘నాలుగిళ్లల్లో పని చేస్తేనే కదమ్మా..మాకు ఒక పదివేలు వచ్చేది..’’ అంది బుజ్జమ్మ. అది గుర్తుకొచ్చింది ఇద్దరికీ. ఇరవై రూపాయలు ఇచ్చింది శాంత. ‘‘స్పెషల్ ‘టీ’ తేనా అమ్మా..’’ అడిగింది.
‘‘మామూలుది చాలు లేవే..’’ అంది.
‘‘స్పెషల్ ‘టీ’ అంటే అప్పుడే ‘టీ’ పొడి వేసి ఫ్రెష్‌గా జలీల్ పెట్టి ఇస్తాడమ్మా. నార్మల్ టీ అంటే అదే టీ పొడిలో వేడి నీళ్లు పోసి ఇస్తాడు. రంగు రుచి వాసన అవేవి ఏవీ ఉండవ్. చిక్కదనం కూడా ఉండదు..’’ అంది.
తనతో వాదించలేక ‘‘ఏదో ఒక టీ తీసుకు రావే..’’ అంది.
‘‘సరే అమ్మగారూ..’’ అంటూ వెళ్లింది.
బుజ్జమ్మ వెళ్లాక లోపలికి వచ్చి ‘‘బుజ్జీని పంపాలే టీ కోసం కాస్త ఓపిక పట్టయ్యా..’’అంది.
‘‘బయట ఏ ‘టీ’పొడి వాడుతారో?’’ గొణిగాడు సదాశివం.
‘‘ఇక మీ రాచరికం అలవాట్లు ఆపండి’’ అంది.
‘‘టీ తాగడం రాచరికమా?’’ అన్నాడు సదాశివం.
‘‘టీ తాగడం రాచరికం కాదు. మీలా రెండు మూడుసార్లు తాగడం మనలాంటి వాళ్ల ఇళ్లల్లో రాచరికంతో సమానమే’’ అంది.
‘‘అవేం మాటలు శాంతీ..’’ అన్నాడు. ‘‘వాస్తవంలోకి రండి..’’ అంది.
‘‘తిండి విషయంలో ఎప్పుడైనా రాజీపడ్డామా? పిల్లల కెరీర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యామా? మన ఆర్థిక పరిస్థితి బావోలేక పోయినా పెద్దోడు దొరబాబులా ఉన్నాడు కాన్వెంట్ చదువులు చదివిద్దాం అంటే నీ మాటలు కాదన్నానా?’’ అన్నాడు.
‘‘ఏం మీకు మాత్రం అప్పుడు లేదా?’’ అంది.
‘‘ఉందనుకో…గవర్నమెంట్ స్కూల్స్ బావున్నాయ్ కదా అని అందరూ అంటున్నా నిన్ను సంతోషపెట్టా లనే కాన్వెంట్ చదువులు చదివించా. కాకపోతే ఆ రోజుల్లో ఖర్చుకి వెనుకాడలేదని చెప్పడం నా ఉద్దేశ్యం’’ అన్నాడు.
‘‘సరే..మీ ఉద్దేశ్యం మడిచి చొక్కా జేబులో పెట్టండి..’’ అంది వ్యంగ్యంగా, అంతలోకి బుజ్జమ్మ ఒక పొలిథీన్ కవర్లో ‘టీ’ దాంతోపాటు రెండు పేవర్ కప్పులు కూడా తెచ్చింది.
‘‘మీరు కూడా తాగుతారా అమ్మా..’’ అడిగింది.
‘‘నాకొద్దు..’’ అంది శాంత.
‘‘మీరు కూడా తాగుతారేమోనని రెండు కప్పులు తెచ్చానమ్మా. జిలానీ స్పెషల్ టీ చేసిచ్చాడు. ఫ్రెష్‌గా టీ పొడి కూడా వేసి కాసిచ్చాడు.’’అంది ‘టీ’ కప్పులో వంచుతూ.
‘‘ఆ టీ నువ్వు తాగేయ్ బుజ్జమ్మా..’’ అంది.
‘‘నాకెందుకు లేమ్మా..’’ అంది బుజ్జమ్మ.
‘‘దాన్నెందుకు ఒత్తిడి చేస్తావ్. మిగతా టీ గ్లాసులో పోసి పెట్టు, తర్వాత కాగబెట్టుకొని తాగవచ్చు కదా..’’అన్నాడు సదాశివం.
‘‘కాచి ఇస్తావుంటే సాయంత్రం దాకా తాగుతూనే ఉంటారు.’’ అని బుజ్జమ్మ వైపు తిరిగి ‘‘బుజ్జీ నువ్వు తాగేయ్’’ అంది.
‘‘సరే అమ్మగారూ’’ అని బుజ్జమ్మ ‘టీ’ తన గ్లాసులో ఒంపుకుంది.
‘‘కోడలు గారు లోపల ఉన్నారామ్మా..’’ అడిగింది.
‘‘అవును.. పిల్లాడ్ని నిద్ర పుచ్చుతుంది.’’అంది.
‘‘ఇల్లు తుడవడం నేను ఆపేసినప్పటినుంచి మీకు పని ఎక్కువైనట్టు ఉంది అమ్మగారూ..’’ అంది శాంతి మొఖంలోని అలసట చూస్తూ.
‘‘అదేం లేదు. నా ఇంట్లో పని నేను చేసుకోవడం శ్రమ ఎందుకవుతుందే పిచ్చి మొద్దా…’’అంది శాంత.
‘‘మీకు నడుము నొప్పి కదా అమ్మగారూ.. అందుకే అడిగా..’’ అంది. సదాశివం వింటూ ‘‘నువ్వు అంట్లు తోమడం మానేస్తే ఆ డ్యూటీ కూడా మీ అమ్మగారి మీదే పడుతుందే’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అమ్మగారి చేతి గోర్లు అంట్లుతోమితే ఖరాబు అవుతుంటాయి కదా అయ్యగారూ.. ఆ మధ్య నేను రాకపోతే రెండు రోజులు తోమిందంట. మురికంతా గోళ్ల్లలో చేరి తెగ ఇబ్బంది పడింది..’’ అంది. అటు ఇటు చూస్తూ
‘‘ఇక నువ్వు బయలుదేరు..’’ చెప్పింది శాంత.
‘‘తాగుతూ ఎలా వెళతానమ్మా. తాగనీయండి..’’ అంది.
మళ్లీ లావణ్య బయటకువచ్చింది. బుజ్జమ్మతో బయట నుండి ‘టీ’ తెప్పించు కున్నారని అర్థ్ధమైంది.
‘‘బయట నుండి టీ తెప్పించుకొని డబ్బులు హోటల్ వాళ్లకి ధారపోయడం ఎందుకు? కాసేపు అయితే లంచ్ టైమ్ అవుతుంది కదా అత్తయ్యా..’’ అంది. ‘‘అప్పుడే లంచ్ చేయడం నాకు అలవాటు లేదు కదమ్మా.’’ అన్నాడు సదాశివం కోడల్ని చూస్తూ.
‘‘డబ్బులేం చెట్లకి కాయవు కదా మావయ్య? వృథా చేయకండి..’’ అంది లావణ్య.
పరిస్థితి అర్థమై అక్కడ్నించి జారుకుంది బుజ్జమ్మ.
‘‘ఏం మనిషో ఈయన చెప్పింది వినడు..’’ అంది.
‘‘పప్పు తాళింపు వేసావా అత్తయ్యా?..’’ అడిగింది.
‘‘వేస్తానమ్మా..’’ అంది శాంత.
‘‘ఆయన వచ్చే టైమ్ అవుతుంది. ఫ్రిజ్‌లో బంగాళాదుంపలు ఉన్నాయ్.. తాళింపు కూడా చేయండి. మీరు బాగా చేస్తారు కదా’’ అంది.
‘‘నే చేసేస్తాలే అమ్మా..’’ అని వంటగదిలోకి వెళ్లింది శాంత.
ఇద్దరూ లోపలికి వెళ్లిన వైపుచూస్తూ ‘‘ఉదయం టిఫెన్ తర్వాత టీ తాగలేదు కదా.. ఏంటి తను నేను ‘టీ’ తాగాను అని అంటుంది.’’ అనుకున్నాడు సదాశివం. వంట చేస్తున్న శాంత కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. భర్త అలవాటు శాంతకు తెలుసు. ఇంట్లో ఉంటే ప్రతి రెండు గంటలకి ‘టీ’ అడుగుతాడు. అతడికి వచ్చిన జబ్బు తనకో వరమైందని మొదటిసారి భావించింది. ఉదయం పాల పాకెట్ కట్ చేస్తుంటే.. ‘‘పిల్లాడికి పాలు తగ్గుతున్నాయ్. కాస్త టీలో పాలు తగ్గించండి అత్తయ్యా..’’ అంది.
‘‘సరేలేమ్మా..’’ అంది. ‘టీ’ తాగకపోతే ఏమౌవు తుందిలే అని అసలు టిఫి•న్ చేశాక ‘టీ’ నే పెట్టలేదు.
* * *
‘‘కాసేపటి క్రితమేగా తిన్నది. మళ్లీ ప్లేటులో తెచ్చావ్..’’ అన్నాడు సదాశివం. ‘‘మీ మతిమండా.. మీరెప్పుడు తిన్నారు? ఇప్పుడేగా తేవడం’’ అంది శాంత. ‘‘అసలు అల్జీమర్ జబ్బు నీకొచ్చినట్టుంది. నా ఆకలి నాకు తెలీదా?’’ అన్నాడు.
అప్పుడే అక్కడికొచ్చిన లావణ్య ‘‘తిన్నాను కదా అని మావయ్యగారు అంటున్నారు కదా అత్తయ్యా? ఆకలయితే మళ్లీ అడుగుతారులే..’’ అంది.
‘‘ఇవి ఖరీదైన బియ్యం కదమ్మా.. రాత్రికి ఎవరూ ఈ అన్నం తినరు. వీధి కుక్కలకి వేయాలి. మీ మావయ్య నైట్ చపాతీలే కదా తింటారు.’’ అంది. ‘‘పర్వాలేదత్తయ్యా.. ఆ రొట్టె ఆపేసి అన్నమే పెట్టండి. ఒక రోజుకేం షుగర్ పెరిగిపోదులే..’’ అంది.
‘‘ఈయనకి షుగర్ పెరిగిపోతే లేనిపోని సమస్యలు వస్తాయమ్మా. వాటికి పెట్టే ఖర్చులు మనకి తడిసి మోపెడవుతాయి.’’ అంది.
‘‘అదీ నిజమే.. ఏదోలా మీరే కన్విన్స్ చేయండి..’’ అంది.
సాయంత్రం అవుతుండగా సదాశివం స్నేహి తుడు రామచంద్రం వచ్చాడు. పడుకొని ఉన్న మిత్రుడి దగ్గరకు వచ్చి ‘‘ఏంట్రా సదా! పడుకొని ఉన్నావ్? ఒంట్లో బాగాలేదా?’’ అడిగాడు.
‘‘అదేం లేదురా.? ఏంటి సంగతులు?’’ అడిగాడు. అప్పుడే అటుగా వచ్చిన శాంతను చూసి.. ‘‘నాకేం ‘టీ’ పెట్టవద్దమ్మా. నేనూ సదా అలా బయటకు వెళ్లి వస్తాం’’ అన్నాడు.
‘‘బ్రతికించారు..’’ అనుకుంది శాంత.
‘‘ఇప్పుడు బయటకు ఎందుకు లేరా?’’ అన్నాడు సదాశివం.
‘‘లెగరా..మీ ఇంటి పక్కన పార్కు ఉంది కదా. కాసేపు నడుద్దాం’’ అన్నాడు.
‘‘సరే పదా..’’ అన్నాడు సదాశివం. సదాశివం కాస్త దూరంగా ఉన్న చెప్పులు స్టాండ్ దగ్గరకి వెళ్లడంతో తన బొడ్లో ఉన్న యాభయ్ రూపాయలు ఇచ్చి ‘‘ఆయనకి టిఫిన్ చేయించండి..’’ అంది.
‘‘నా దగ్గర ఉన్నాయి లేమ్మా..’’అన్నాడు.
‘‘పర్వాలేదు ఉంచండి. ప్రతిసారి బయటకు తీసుకెళ్లి మీరే కదా ఖర్చు పెడతారు..’’ అంది. అయిష్టంగానే తీసుకున్నాడు. బయటకొచ్చాక ‘‘అరే… శేషమ్మ పునుగులు బాగా చేస్తుంది కదా. ఒక ప్లేటు తిని వెళదాం’’ చెప్పాడు.
‘‘సరే పదా.. ఆకలిగానే ఉంది’’అన్నాడు సదాశివం.
వాళ్లని చూసి శేషమ్మ రెండు ప్లేట్లలో వేడివేడి పునుగులు ఇచ్చింది. సదాశివం ఆవురావురమని తిన్నాడు. ‘‘ఏంట్రా మధ్యాహ్నం లంచ్ చేయలేదా?’’ అడిగాడు.
‘‘చేసానురా.. షుగర్ ఎక్కువై ఆకలేస్తుందేమో..’’ చెప్పాడు.
‘‘టిఫిన్ చేసాక ‘టీ’ తాగి వెళదాం’’ చెప్పాడు రామచంద్రం.
‘‘మళ్లీ తాగుదాం పార్కుకి వెళ్దాం పదా..’’ అన్నాడు సదాశివం. పార్కులోకి వెళ్లిన మిత్రులిద్దరికి కేరింతలు కొడుతూ ఆడుకొనే పిల్లలు కన్పించారు.
‘‘రాఘవని పార్కులోకి తీసుకెళ్లరా అని చెబు తాను. వాడు పని ఉంది నాన్నా అని కంప్యూటర్లోకి తల దూరుస్తాడు.’’అన్నాడు.
‘‘ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయిస్ రక్తం పిండుకుంటున్నాయ్. మా గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడు ఐదుకల్లా బయటకు వచ్చేస్తాం’’ అన్నాడు. రామచంద్ర ప్రావిడెంట్ ఆఫీస్‌లో పని చేసి ఆ మధ్యే రిటైర్ అయ్యాడు.
‘‘సండే అన్నా తీసుకు పోవచ్చు కదా’’ అన్నాడు రామచంద్ర.
‘‘చిన్నప్పుడు వాడిని పార్కులోకి తీసుకొచ్చి జారుడుబండ, రంగులరాట్నం అన్నీ ఆడించే వాడిని’’ చెప్పాడు
‘‘చెప్పు.. రంగులరాట్నం తిరుగుతావా?’’ అడిగాడు రామచంద్రం నవ్వుతూ, ‘‘వద్దులే విరిగి పోతుంది..’’అన్నాడు నవ్వుతూ.
‘‘మీ చిన్నోడు కేశవ ఫోన్ చేస్తున్నాడా?’’ అడిగాడు రామచంద్రం.
‘‘నెలకోసారి వాళ్ల అమ్మకే చేస్తాడు’’చెప్పాడు.
‘‘వాడి ఫ్యామిలీ ఎలా ఉంది?’’ అడిగాడు రామచంద్రం.
‘‘పర్లేదు. డబ్బులు వేయమని రాఘవ వాడితో గొడవ పడుతూ ఉంటాడు.’’ చెప్పాడు సదాశివం.
‘‘పాపం రాఘవ ఒక్కడే మిమ్మల్ని భరించడం కష్టమే కదా..’’ అన్నాడు రామచంద్ర.
‘‘అవును. నాకు, శాంత మందులకే నెలకు పదివేల వరకూ ఖర్చవుతుంది. ఎలాగూ తిండీ తిప్పలు తప్పపు కదా’’ అన్నాడు సదాశివం.
‘‘అన్నీ సంగతులు బాగానే గుర్తుంటున్నాయి కదా? మరి నీకు అల్జీమర్ సమస్య ఉందంటాడేంటి మీవాడు’’ అడిగాడు రామచంద్ర.
‘‘వాడు అనడం కాదు.. మెడికల్ రిపోర్టస్ అలా చెబుతున్నాయి. కొందరి ముఖాలు గుర్తొస్తే పేర్లు గుర్తు రావు. ఈ మధ్య శాంత ‘టీ’ ఇచ్చాను అంటుంది. నా కసలు గుర్తే వుండట్లేదు.
అందుకే మళ్లీమళ్లీ అడుగుతుంటాను. ఈ రోజు ఒక విచిత్రం జరిగింది ‘‘అంటూ ఆగాడు సదాశివం.
‘‘ఏంటది..?’’అడిగాడు రామచంద్ర.
‘‘భోజనం చేయలేదని శాంత అంటుంది. చేశానని నేను అంటాను ’’ చెప్పాడు.
‘‘నిజమేంటి..?’’ అడిగాడు.
‘‘తెలీదు’’అన్నాడు సదాశివం.
‘‘నిజం ఏంటంటే నువ్వు లంచ్ చేయలేదు..’’ అన్నాడు నవ్వుతూ..
‘‘గుర్తుంది కానీ శాంతికి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను..’’ అన్నాడు నవ్వుతూ. ‘‘శాంతకి నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు కూడా బాధ పెడితే ఎలా?’’అడిగాడు.
‘‘మరి ‘టీ’ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పవచ్చా..?’’ అడిగాడు కోపంగా. ‘‘ఇంటి కష్టాలు ఆడవాళ్లకే తెలుస్తాయి..’’అన్నాడు రామచంద్ర.
‘‘ఎన్ని కష్టాలు ఉన్నా.. నిజాలే చెప్పాలి’’ అన్నాడు సదాశివం.
‘‘సర్లే పదా.. టీ తాగి వెళదాం..’’
ఇద్దరూ టీ తాగి ఇంటిదారి పట్టారు. ఇంటికి వెళ్లాక సదా వాష్ రూంకి వెళ్లడం చూసి, ‘‘నువ్వు అబద్దం ఆడుతున్న విషయం సదా గుర్తు పట్టాడు..’’ చెప్పాడు రామచంద్ర.
‘‘నేనేం చెయ్యగలను అన్నయ్యా.. ఈయన కోసమే రాఘవ దగ్గర డబ్బులు తీసుకొని దాచి ఖర్చు చేస్తున్నా. కోడలు పిల్లతో అన్ని విషయాలపై గొడవ పెట్టుకోలేను కదా..?’’ అంది.
‘‘మీ వదిన అన్ని విషయాలు చెప్పిందమ్మా.. ’’చెప్పాడు.
‘‘ఇక నా కష్టాలు చెప్పుకోడానికి ఎవరు ఉన్నారు అన్నయ్యా..’’ అంది. రామచంద్ర భార్య సుమతితో శాంతకి మంచి స్నేహం. ఆ రోజు ఉదయం సుమతితో ‘‘ఈయన అలవాట్లు ప్రాణానికి వస్తున్నాయి సుమతీ! పిల్లాడికి పాలు సరిపోవడం లేదు. ఈయన గారు ఇస్తే రోజుకు నాలుగు సార్లైనా ‘టీ’ తాగుతారు’’. అంది.
‘‘పిల్లాడికి తల్లి పాలే బలం కదా ఎందుకు ఇవ్వడం లేదు మీ కోడలు..?’’ అడిగింది సుమతి.
‘‘కారణాలు తను ఎక్కడ నాకు చెబుతుంది? అందం పోతుందని ఇవ్వడం లేదో.. పాలు సరిగ్గా పడక ఇవ్వడం లేదో తెలీదు. పిల్లాడికి పోతపాలే అలవాట య్యాయి..’’
సుమతికి ఏం మాట్లాడాలో తోచలేదు. సదాశివం ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో్ల పని చేసేవాడు. అప్పట్లో అచ్చు యంత్రాలే ఉండేవి. అక్షరాలు పేర్చి ప్రింట్ చేసేవాళ్లు. సదాశివం మంచి కంపోజర్. కదలకుండా పని చేసేవాడు. వర్క్ డిస్టర్బ్ కాకూడదని గంటకో రెండు గంటలకో ‘టీ’ తెప్పించేవాడు ఓనర్ నారాయణ అప్పట్నించి ‘టీ’ అలవాటు అలా స్థిరపడింది. కాలక్రమంలో యంత్రాలు మారాయి. కంప్యూటర్ల ద్వారా డి.టి.పి.చేసే రోజులు రావడంతో ఆ పని మాసుకోవల్సి వచ్చింది. పిల్లలు రాఘవ, కేశవ ఇద్దరూ కాలేజీ చదువులకు రావడంతో మరో పని చేతకాక ఇనుప లేత్ వర్డ్‌లో పనికి కుదిరాడు. అక్కడ కూడా పని నిరాఘాటంగా కొనసాగడం కోసం ‘టీ’ అలవాటు కొనసాగింది. పిల్లల చదువుల తర్వాత సెటిల్ అయ్యారు గానీ సదాశివం సెటిల్ కాలేదు. కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. పోషణకు పిల్లల మీద ఆధారపడే పరిస్థితి. అల్జీమర్ పలకరించింది అతడ్ని. పెద్దకొడుకు రాఘవ ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాడు. రెండోవాడు ఉద్యోగం పేరుతో బెంగళూర్ వెళ్లాడు. గింజుకొని.. గింజుకొని నెలకి ఐదువేలు వేస్తుంటాడు. ‘‘మీ ఒక్కడిదేనా పేరంట్స్ బాధ్యత.. ’’అని లావణ్య గుంజు కుంటూ దెప్పుతూ ఉంటుంది. సదాశివం, శాంతి ఇద్దరూ గమనిస్తూనే ఉంటారు.
* * *
‘‘ఏంటన్నయ్యా.. నువ్వు చెప్పేది..’’ అడిగాడు కేశవ.
‘‘అవున్రా.. నాన్న తప్పి పోయాడు..’’ చెప్పాడు రాఘవ.
‘‘ఎలా జరిగింది అన్నయ్యా అమ్మ ఎప్పుడూ నాన్నను కనిపెట్టుకొనే ఉంటుందిగా..’’అడిగాడు.
‘‘నాన్నకి ‘టీ’ ఎక్కువ తాగే అలవాటు ఉంది కదా? ‘టీ’ పెట్టి ఇవ్వమన్నాడట. ఇందాకే కదా తాగావ్ అందట అమ్మ. ‘టీ’తాగే పిచ్చి ఆపుకోలేక అమ్మ నిద్ర పోతున్న సమయం చూసి బయటికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు’’ చెప్పాడు.
‘‘కంప్లైంట్ ఇస్తేనే కదా అన్నయ్యా పోలీసులు వెదకగలరు.. ’’ అన్నాడు. ‘‘సరే’’ సని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు రాఘవ. సదాశివం ఫొటోలు కూడా ఇచ్చాడు. అవి పాతవి. ఈ మధ్య కాలంలో సదాశివం ఫోటోలు ఏవీ తీసుకోలేదు.
మనవడి ఫంక్షన్లో కూడా ఫొటోలు ఏవీ తీసుకోలేదు. సదాశివం స్నేహితుడు రామచంద్ర మిత్రుడ్ని ఊరంతా వెతికాడు.ఒక రోజు అలిసిపొయ్యి వచ్చిన రామచంద్రని చూసి. ‘‘ఎన్ని రోజులు వెతుకుతారు అన్నయ్యా వది లేయండీ..’’అంది శాంతి.
అప్పటికి సదాశివం ఇల్లు వదిలి వెళ్లి పది రోజులు అవుతుంది.
‘‘వాడు వెళ్లాక ఎలా ప్రశాంతంగా ఉండగలుగు తున్నావమ్మా..?’’ అడిగాడు రామచంద్ర. ‘‘రోజూ అబద్దాలు చెప్పే శ్రమ తగ్గింది అన్నయ్యా.. ’’అంది శాంత.అర్థం కానట్టు చూశాడు రామచంద్ర.
లోపలి నుండి బయటకు వచ్చిన లావణ్య.. ‘‘రామచంద్ర అంకుల్‌కు ‘టీ’ పెట్టుకురానా అత్తయ్యా..?’’ అడిగింది.
‘‘అన్నయ్య ‘టీ’ తాగడం మానేశారటమ్మా..’’ చెప్పింది.
ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర. శాంత మాటలు అర్థమై.. ‘‘అవునమ్మా టీ మానేశాను..’’ చెప్పాడు.
‘‘ఇక మీరు శ్రమ పడి వెదక్కండి అన్నయ్యా.. పిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా?’’ అంది. ‘‘సరే’’ అని పైకి లేచి ‘‘సదా సమాచారం ఏం తెలిసినా చెప్పమ్మా..’’అన్నాడు. రామచంద్ర వెళ్లిన వైపే చూస్తుండి పోయింది శాంత. ఒక రోజు రాత్రి భర్త అన్న మాటలు ఆమె చెవుల్లో గింగిర్లు తిరిగాయి. ‘‘చిన్నోడి కంటే పెద్దోడే మంచోడు. మనల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు. చిన్నోడి చదువుల కోసం అయిన అప్పులు కూడా వాడే తీరుస్తున్నాడు. చిన్నోడికి అంత బాధ్యత తీసుకొనే స్వభావం లేదు. పెద్దోడి జీవితం బావుండాలి. అమ్మగా ఎప్పటికీ నీ మద్దతు వాడికే ఉండాలి. కోడలి పిల్ల కాస్త పొదుపరి. మనలాగాఉంటే కుదరదు కదా? కాస్త పొదుపు చేస్తేనే కదా వాళ్ల పిల్లలకు కాస్త మిగిలించి ఇవ్వగలరు. మనలా కాదు కదా? నువ్వేం ఆ అమ్మాయిని అపార్థ చేసుకోకు. వాడి దృష్టికి ఏమీ తీసికెళ్లకు’’ ఇదీ సదాశివం ఇచ్చిన సందేశం.
తర్వాత శాంత నోరు కుట్టేసుకుంది. కోడలి గురించి ఎప్పుడూ ఏమీ బయటకు చెప్పలేదు. ఇంటి పనంతా తానే చేసేది. ‘‘పెద్దోడా ఇల్లు తుడవడానికి ఒక మనిషిని చూడరా.. నాకు నడుములు పట్టేస్తున్నాయ్..’’ అని చెప్పాలనుకుని ఆగిపోయింది. రెండుమూడుసార్లు ‘‘లావణ్యా.. అమ్మ ఎక్కడ తుడుస్తుంది? ’’ అన్నాడు రాఘవ.
‘‘పిల్లాడు పాలుతాగాక నేనే వచ్చి తుడుస్తానని చెప్పానండీ. మీ అమ్మ గారు ఊరుకుండే మనిషి కాదు కదా? పైగా శుచీ, శుభ్రత ఎక్కువ..’’అంది. రాఘవ భార్యని ఆ రోజు ఎగాదిగా చూశాడు.
‘‘లావణ్యా.. అమ్మ చేతికి కొంచెం డబ్బులు ఇచ్చిపెట్టు. నాన్నకు ఏమైనా అవసరం ఉంటే చూసుకుంటుంది గదా? నా పనుల్లో నేను ఉంటాను కదా?’’ అన్నాడు. రెండుమూడుసార్లు ‘‘కొంచెం డబ్బులు కావాలిరా..’’ అని తల్లి అడగ్గానే ‘‘నన్ను అడగడం ఎందుకమ్మా? నా జేబులో ఉంటాయి కదా తీసుకెళ్లు’’ చెప్పాడు.
శాంత ఇబ్బందిగా చూస్తుంటే.. ‘‘నువ్వు నిద్రపోయేప్పుడు నీ కొంగుకు కట్టిపెట్టుకున్న డబ్బుల్ని ఎన్నిసార్లు విప్పి తీసుకు వెళ్లాను కదామ్మా! నీ కొడుకు దగ్గర నీకు మొహమాటం ఏంటి ’’ అనేవాడు..
‘‘అమ్మ దగ్గర కొడుక్కి వున్న స్వేచ్ఛ కొడుకు దగ్గర అమ్మకి ఉంటుందా? అందులోనూ పెళ్లైన కొడుకు దగ్గర’’ స్వగతంగా అనుకునేది.
‘‘నీకైమైనా అవసరాలు ఉంటే లావణ్యకు చెప్పమ్మా.. చూసుకుంటుంది..’’ అనేవాడు. రెండు మూడుసార్లు అడిగినప్పుడు….
‘‘అసలు చేతిలో డబ్బులు నిలవడం లేదు అత్తయ్యా.. ఆయన ఇవ్వడం అయిపోవడం వెంటవెంటనే జరుగుతున్నాయి. ఆయన జీతంలో సింహ భాగం కొత్తగా మనం తీసుకోబోయే ఫ్లాట్‌కే పోతున్నాయి. మీ చిన్నబ్బాయి ఒక నెల పంపితే మరో నాలుగు నెలలు పంపడు. సర్లే! ఈసారి తీసి పెడతాను ఎంత అవసరమో చెప్పండి’’ అంది గానీ తాను తీసి పెట్టింది లేదూ తనకి ఇచ్చిందీ లేదు.
అల్జీమర్ సమస్య రాకముందు భర్త మొహమాట పడుతున్నాడని తానే డబ్బులు ఖర్చుకు తీసి ఇవ్వడానికి ట్రై చేసేది. ఒకసారి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నది. బహుశా వాళ్ల అక్కయ్య అయ్యి ఉంటుంది. ‘‘మా అత్త బాగా దుబారా అక్కా!మామయ్య అవసరాల పేరుతో తీసుకుంటుంది. ఆ డబ్బులు ఏం చేసు కుంటుందో అసలు తెలుసుకోలేం.’’అంది. అవతల నవ్వుతున్న శబ్దం తనకి విన్పిస్తూనే ఉండేది. చెల్లి పిల్లలు ‘‘పెద్దమ్మా ..’’ అని ఆప్యాయంగా వస్తే.. కనీసం జాకెట్ ముక్క కూడా తీసివ్వడానికి డబ్బులు లేని పరిస్థితి శాంతది.
* * *
ఒక నెల గడిచింది సదాశివం జాడలేదు. శాంత బాగా కుంగిపోయింది. అన్నం కూడా సహించడం లేదు.
‘‘నువ్విలా బెంగ పెట్టుకుంటే ఎలా అమ్మా? నాన్నను వెతికిస్తున్నాం కదా?’’ అన్నాడు రాఘవ. చిన్న కొడుకు కేశవ కూడా ఒకసారి వచ్చి సముదా యించ బోయాడు. తృణీకారంగా చూసింది కేశవను.
‘‘ఎలాగోలా అడ్రస్ తెలుసుకొని మావయ్య వస్తార్లే అత్తయ్యా..’’ అంది లావణ్య. పిల్లాడు నానమ్మ మీదికి దూకాడు. ‘‘వీడికి నాన్న పేరే పెట్టాను కదమ్మా. వీడిలో నాన్నను చూసుకోమ్మా..’’ అన్నాడు రాఘవ. కొడుకుని నిర్వికారంగా చూసింది.
‘‘మావయ్య వెళ్లి పోవడం మీరిలా కావడంతో ఈయన పూర్తిగా మనశ్శాంతి కోల్పోయారు అత్తయ్యా. ఈ మధ్య డ్యూటీకి కూడా సరిగ్గా పోవడం లేదు.’’ దిగాలుగా చెప్పింది లావణ్య.
కొడుకు వైపు చూస్తూ.. ‘‘నాకేం కాదు.. లేరా నువ్వు డ్యూటీకి వెళ్లు’’ చెప్పింది శాంత.
‘‘నిన్న రాత్రి నాకో విషయం ఈయన చెప్పారు అత్తయ్యా.. ’’అని భర్త వైపు చూసింది.
‘‘ఏంటి..?’’ అన్నట్టు చూసింది శాంత
‘‘కొత్తగా తీసుకుంటున్న ఇల్లు మీ కోసమేనట అత్తయ్యా. మనం అద్దె ఇంట్లోనే ఉండి అమ్మా.. నాన్న ప్రైవసీగా ఉంటారు కొత్త ఇల్లు ఇద్దాం అన్నారు. నేనేం కాదనలేదు’’ చెప్పింది లావణ్య.
‘‘మీ నాన్న లేని ఇల్లు నాకు ఎందుకురా’’ అంది శాంత.
‘‘వెదుకుతున్నాం కదా అమ్మా! నాన్న ఎక్కడున్నా త్వరలో పోలీసులు పట్టుకుంటారు. తమ్ముడు పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు’’ చెప్పాడు రాఘవ. ‘‘అసలు ఆయన భూమి మీద ఉన్నారో లేదో..’’ మనసులో అనుకుంటూ పైకే అనేసింది.
మరో నెల గడిచింది. సదాశివం జాడలేదు. శాంతి తీవ్రంగా జ్వరానికి లోనైంది. పిల్లాడికి ఇనెక్షన్ సోకుతుందన్న భయంతో లావణ్య అత్తగారి దగ్గరకి రాలేదు. రాఘవే తల్లికి దగ్గరగా ఉండి చూసుకుంటు న్నాడు.
తనకి జ్వరం వస్తే రాత్రింబవళ్లు మేల్కొని తల్లి సేవలు చేసిన రోజులు గుర్తుకొచ్చాయి అతడికి. వాలు కుర్చీవేసుకొని అందులోనే పడుకున్నాడు రాఘవ. ఎందుకో భయం అన్పించి తమ్ముడికి ఫోన్ చేశాడు. విషయం విని.‘‘పి.ఎఫ్ పెట్టాను అన్నయ్యా.. డబ్బులు చేతికి రాగానే అమ్మకి పూర్తిగా బాడీ చెకప్ చేయిద్దాం. మీ మరదలు వసుంధర కూడా పాజిటీవ్‌గానే ఉంది. నువ్వేం బెంగపెట్టుకోకు పైసలు తీసుకొని మేం వచ్చేస్తాం..’’ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. అది తల్లి ఫోన్‌కు. అప్రయ త్నంగా ఫోన్ చేతికి తీసుకొని మెసేజ్ ఓపెన్ చేశాడు.
‘‘బావున్నావా శాంతీ.. ఇంట్లో నుండి బయటకి వచ్చాక మళ్లీ వెనక్కి రాబుద్ది కాలేదు. మన ఇద్దరి పోషణ పిల్లలకు కష్టం అన్పించింది. నీ కన్నా ఇంట్లో పని వుంది. నాకేం పని ఉంది.? నేను ‘టీ’ అడిగినప్పు డల్లా ఇందాకే తాగావ్ కదా? అని నువ్వు అనడం ‘అబద్దం’ అని నాకూ తెలుసు. నాకూ అబద్దం ఆడాలి అన్పించి ‘అన్నం’ తిన్నా కదా.. అని కొన్నిసార్లు చెప్పాను. చెల్లుకి చెల్లు అయ్యింది కదా? నేను భోజనం చెయ్యకుండా మతిమరుపు పేరుతో నటిస్తున్నానని అర్థ్ధమై.. న•న్ను ఎలా కన్విన్స్ చేయాలో తెలియక ఒకసారి రామచంద్రని పిలిపించి నాకు నువ్వు టిఫెన్ ఏర్పాటు చేయడం నాకు తెలుసు. మన ఇద్దరిని భరించడం పిల్లలకు కష్టం అని నాకూ అర్థమైంది. అందుకే బయటకు వచ్చేశాను. రైల్వే స్టేషన్‌కు వెళ్లి కన్పించిన రైలు ఎక్కాను. అది పోయినంత దూరం వెళ్లాను. నన్ను గమనించిన ఒక పెద్దమనిషి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. జీవితం ముగించాలని ‘కాశీ’కి అని చెప్పాను. ఏమను కున్నాడో ఏమో తానే దగ్గరుండి ఒక రైలు ఎక్కించాడు. కాశీలో దిగాక మళ్లీ ఎక్కడికి ఎలా పోవాలో తెలియలేదు.
గంగలో మునకేశాను. కడుపులోకి నీళ్లు వెళ్లాయి. కళ్లు మూతలు పడ్డాయి. కళ్లు తెరిచాక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. కొన ఊపిరితో ఉన్న తెచ్చి హాస్పిటల్‌లో చేర్చారట. ఇక్కడే నా కథ మరో మలుపు తిరిగింది.
నా పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తిది ప్రింటింగ్ ప్రెస్సేనట. అందులోనూ అతడు తెలుగు వాడు. ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి అతడు కూడా ఆ హాస్పిటల్లో నే చేరాడు. నాకు గుర్తు ఉంది చెప్పాక నన్ను తనతో తెచ్చేసుకున్నాడు. వైద్యంకూడా చేయించాడు. తెలుగు డి•.టి.పి నేర్పించడమే కాకుండా ప్రూఫ్‌రీడర్‌గా పెట్టుకున్నాడు. ఇరవై వేలు జీతం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. శాంతీ.. నేను వచ్చి నిన్ను తెచ్చేసుకుంటాను. కోడలు దయతో ‘టీ’ తాగాల్సిన పని లేదు. నో ప్రాబ్లమ్ లీటర్ పాలు తీసుకో మనం కట్టేదాం.
నేను అడిగేది రోజుకు రెండు మూడుసార్లే కదా?మాటి.. మాటికి చెయ్యడానికి నీకు ఇబ్బంది అయితే ప్లాస్కో వాడుదాం. ప్రతి సారి టీ ప్రెష్‌గా పెట్టివ్వమని వేధించనులే. మన ఖర్చులూ ఇంటి అద్దెకు పోను ఐదారు వేలు మిగుల్తాయి. పెద్దాడి ఫోన్ నెంబర్‌కు ఫోన్ పే చేద్దాం. పాపం వాడికి చాలా అప్పులు ఉన్నాయి కదా? ఆఖరిగా ఒక మాట ఈ మెసేజ్ చూసిన వెంటనే డిలీట్ చెయ్యి. రాఘవ చూస్తే బాధ పడతాడు- నీ సదాశివం రాఘవ కళ్లలో నీళ్లు తిరిగాయి.
మంచం మీద వున్న తల్లిని చూస్తూ.. ‘‘అమ్మా.. అమ్మా..’’ అని కదుపుతూ.. ‘‘నాన్న బతికి ఉన్నా డమ్మా.. వస్తున్నాడమ్మా..’’ అని తట్టి లేపాడు. తల్లిలో ఎంతకీ కదలిక లేకపోవడంతో ‘‘అమ్మా.. ‘‘అని పెద్దగా అరిచాడు. ఆ కేకకు పక్క గదిలో ఉన్న లావణ్య ఒక్క ఉదుటన బయటకు వచ్చింది. అప్పటికే ఆమెకి అర్థమైంది. తన అత్తగారు లోకం విడిచి పోయారని.
వచ్చేవారం కథ..
కలకానిది విలువైనది
– జె. రమాదేవి