డా. శ్రీదేవి శ్రీకాంత్
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘వెన్నెల కాంతుల్లా తారల జిలుగుల్లా విరిసిన సన్నజాజి, విరజాజి, మొల్లల తీగలు మూడు ఒకటిగా పెనవేసుకుని పాకిన పందిరి. ఆ పూలపందిరి కింద కూర్చున్న నాలో వారి ఆలోచనలు. ఏ చల్లగాలి తగిలిందో పందిరి ఊగింది. కుసుమ వానతో నా తలనిండి పోయింది.. మత్తెక్కే సుమతావులతో మనసంతా సందడి.
వారు నా తలలో పూలు తురుమున్న భావన… ఆయన వేళ్లు నా జుట్టును తాకినట్లు అనిపించింది.
మనసు ఒక్కసారి గంతులు వేసింది. పక్కగా చూసాను. వారు లేరుగా!? ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. నా తలలో పూలు. ప్రకృతి చేసిన చిన్న ఆట. సంతోషించనా!? దుఃఖించనా!? గుండె చెరువు అయ్యింది.నన్ను నేను తమాయించుకున్నాను.
‘భారతీ అనే పేరు నాకు చాలా ఇష్టం. అందుకే ఈ పెళ్లి చూపులకు వచ్చాను.. నువ్వు ఎంతో నచ్చావు. సంప్రదాయ చీరకట్టు, నుదుటున బాల భానునిలా ఎర్రని సిందూరము, కాటుక పెట్టిన నీ కలువ రేకుల కళ్లు, అతివ చేతికి గాజులు అందం. గలగలమనే మట్టిగాజుల నిండుతనం పున్నమిలా మెరిసిపోతున్నావు’ అన్నాడు అ ఆప్యాయంగా నన్ను చూస్తూ. సిగ్గు పడుతూనే కృతజ్ఞతలు అన్నాను.
‘భారత రక్షణ వ్యవస్థలో మా సైనికదళ ప్రధాన కర్తవ్యం మన భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు, దేశంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తాము. మా సరిహద్దులకు కులం మతం లేవు. దేశభక్తే మా ప్రధాన లక్ష్యం. ఈనాడు ప్రజలు కులమతాల ఉచ్చులో ఎలాంటి సంక్షోభాలు సృష్టిస్తున్నారో!? ఒక దేశభక్తుడి భార్యగా, దేశ సంక్షేమాన్ని కోరే విధేయురాలిగా నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో నాకు తోడు ఉండాలన్నది నా కోరిక’ అన్నారు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఆయనకు వాగ్దానం చేశాను. ఒక దేశ రక్షకుడి భార్యకు అంకితభావం ఉండాలి…
వారి మాటల్లోనే కాదు చేతల్లో ఎంతో పట్టుదల అంకిత భావం ఉన్నాయి.
కాసేపు పక్కపై వాలితే!?… అక్కడి నుండి లేచిపడక గదిలోకి వచ్చి కిటికీ వేశాను. కొన్ని కొన్ని ఆలోచనలు సంతోషం ఇచ్చినట్లే ఇచ్చి బాధను పరుస్తాయి. జీవితం నటించేది కాదు. జీవితం అంటే ఇదే అనుకున్న నా జీవితం మారిపోయి ఇంచుమించు ఒక సంవత్సరం ముందుకు వెళ్లిపోయింది. కాలం పరుగులు… గత స్మృతుల లాస్యం, వేదన ఇదే చిత్రం కదా!
దిండుపై తలను వాల్చాను. మళ్లీ ఆలోచనల ముసురు. ‘నిండు పౌర్ణమి రాత్రి. ఎంత ఆహ్లాదంగా ఉంది. చైత్రమాసంలో నీ అందం వసంతోత్సవంలా ఉంటుంది’ అన్నారు వారు. సిగ్గుతో ‘మీఅందం కూడా’ అన్నాను.
ఆ రోజులు.. ఆ తియ్యని కబుర్లు ఇప్పుడు ఏవి?
ఓరకంటగా నన్ను చేశారు. మల్లెలు నవ్వుతూ మా ఇద్దరిపై కురిశాయి. ఆ రాత్రులు, ఆ మల్లెల మొల్లల వానలు మా ఇద్దరినీ ఒక్కసారిగా తాకవుగా!?
నాలో మార్పు నాకు తెలుస్తోంది. గుండెలో ఆపలేని శోకం. ఈ మానవ సుఖం వదిలి ఏ అరణ్యా లకో వెళ్లిపోతే!? ఒక్క చిరుగాలి స్పర్శ కోసం… మబ్బుల గుంపులు అసహనంగా ఉన్నట్లు… ఆయన రాక కోసం ఎదురుచూపు. అంతలోనే కట్టలు తెంచుకున్న దుఃఖం. వారు… వారు ఎలావస్తారు?
ఆర్ద్ర నేత్రాలతో చుట్టూ చూస్తూన్నాను. నాకన్నీటికి విరామంలేదు. నాకళ్లలో కడలుల పొంగులు గగనాన్ని తాకుతున్నాయి. ‘నా ఆలోచనల గాయం రోజు రోజుకూ పెరుగుతూ…మనసు మిమ్మల్ని పలవరిస్తున్న ప్రతిక్షణం నొప్పితో కనులు చెమ రించడం నిత్య క్రమం అయ్యిందండీ!’ అని నేను అన్నా… వారి నుండి జవాబు లేదు.
‘నాలుగు దిక్కులా నా వేదనల జ్వాలలు మిన్ను ముట్టాయి. స్వేచ్ఛగా ఎగురుతున్న గాలిపటం మీద వడగళ్లు పడినట్లు, నేను భువికి వంగిపోతున్నాను. కుంగిపోతున్న మనసులో మీరు నా చెంతనే ఉన్నారు అనే భావన తాత్కాలిక ఆనంద గుడారం వేస్తుంది. మీరు కనిపించని, వినిపించని నా మనోకిరణం. నా బుగ్గలపై మాయని చారికలు. బాధాతప్త కన్నీరు తన గురుతులు వొదుల్తూ ఉంటుంది ఒంటరి నా ఒంటరి ఉనికికి సాక్షిగా.
ఏం తెలుస్తుంది నాకు…? ఊహల్లో బేరీజులు వేసుకునే మనసు. మసక వెలుతురు నీడల్లో గుండెనిండా పేరుకున్న అనుభూతులు పరుగులు తీసే మధుర భావమై కనురెప్ప మాటులో దాగిన మీరు…గగనంలో… ఎండా, వానా కలిసి మమతతో పెట్టిన రంగుల ముగ్గు…ఇంద్రధనుస్సు. ఈ రంగురంగుల కిరణాల మెరుపులు భువిపై పడుతున్న దీక్ష. నాతో ఎన్నో తీయని ఊసులు చెబుతున్నాయి, మిమ్మల్ని నా సమక్షాన నిలిపి.
దూరం నుండి ‘‘భారతీ’ అనే మీ పిలుపు… నేను వెంటనే పలకకపోయేసరికి ‘‘రతీదేవీ’’ అనిపిలిచారు మీరు. తల తిప్పి చూశాను.‘‘ఈ పేరుతో పిలిస్తే నువు వెంటనే పలుకుతావోయ్!’’ అనే మీమాటలు గుర్తుకు వస్తున్నాయి.
* * *
తూనీగలు గుంపులు గుంపులుగా వచ్చి పరిహాసం చేస్తున్నాయి. ఒక్క చుక్క వాన పడబోయేలోపు అన్నీ మాయం అయ్యాయి వాటిరహస్య స్థావరాలకు. ప్రకృతిలో తూనీగలకు తెలుసు ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడొస్తాయో. వాతావరణంలో సర్దుబాట్లు అన్నీ మనిషికన్నా పశుపక్ష్యాదులకే బాగాతెలుసు. మరి మనిషికి మూడవ కన్ను లేదుగా! ముందే ప్రకృతిని తెలుసుకునే అద్భుతాలు లేవుగా! అందుకే విజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్నాడు. నా మానస కడలి ఆటుపోట్లను మాత్రం గుర్తించలేడు.
ముసురుకున్న ఆలోచనల్లో సుడులు తిప్పుతున్న పీడకలలు. ఏ దుష్ట ముహూర్తం తలుపు తట్టిందో!? ప్రేమ ఓనమాలు దిద్దుకునే బడిలో దీక్షతో ఉన్న ప్రేమైక్యను…
కొత్త చరిత్ర పుటలంటూ… వేదనా వనంలో శోకంతో నిల్పాయి.
గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న దౌర్భాగ్యాన్ని మూటగట్టి ఇచ్చిన విధికి నాపై ఎంతటి కక్ష. రేయింబవళ్లు ముసురు పట్టిన ఆకాశం కింద దిగులు తాకిన దీనత్వం నాది.
ఒక క్షణం కోసం, కాలచక్రం ఆగిపోయి ఆయన వస్తే!? వారిని చూడడం… ఈ ఆలోచన ఎన్ని పున్నాగ వానలు నన్ను తడిపినట్లు ఉందో కదా!
నా మనసు వారికి తెలియందా!? నేను గట్టిగా వినిపించేట్లు అరచి చెబితే!? ఏదీ చెప్పలేను. వారికి వినబడదు. అందుకే చెప్పలేను కూడా. నాలో నాకు ఒక నవ్వు. వెనువెంటనే పొంగే దుఃఖం.
హృదయం మరో హృదయాన్ని వెలిగించగలదా!? ఒక అద్దం మరో బింబాన్ని చూపుతుంది. మరి మనిషో!? నా నిరీక్షణ…నా అనుకున్నా నా అనే నావారి కోసం..నన్ను ఆదరణతో చూసే ఒక్క చూపు కోసం. అనురాగం కోసం..నా సర్వస్వం అనుకున్న వారికోసం.
నిన్న కలలో కనిపించారు వారు. మళ్లీ అదే నవ్వుతో చూశారు. నేనే కవయిత్రిని అయితే ఎన్ని కావ్యాలు రాస్తాను ఆ నవ్వుపైన! నా పెదవులు వణి కాయి. ఆ నవ్వు నా పెదాలను తాకింది అని గ్రహించాను. ఏదో మత్తు నన్ను ఆవహించింది.
నేను చంద్రుణ్ణి చూస్తున్నాను. ఆయన గగనంలో ఉండి నాలాగా తారల్ని చూస్తున్నారా!?
‘చందమామా నా మనసును అతనికి నువ్వైనా తెలుపవా?’ అంటున్న నా కనుపాపల్లో రెండు పక్షులు వచ్చి వాలాయి. అవి రెండూ ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి. వాటి మధ్య నుండి పరవళ్లు తొక్కే తెమ్మెర సిగ్గుతో పక్కకు తప్పుకుంది.
ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. ముళ్ల దువ్వెన అరలోనుండి నాపై పడింది. ఛ! చాలా నిరుత్సా హంగా అనిపించింది. ఒక్కసారి నా ముందుకు వారు మళ్లీ వస్తే!? కనీసం ఈ జన్మకు వారానికి ఒకసారి నాకు కనిపించే ఒప్పందం భగవంతుడు చేస్తే!?
బాబు నిద్ర లేచినట్లున్నాడు.’
(పిల్లవాడి ఏడుపు…)
‘రాకేందు నిద్ర లేచావా నా తండ్రి. ఏడవకు నాన్నా! దా దా అమ్మ ఒడిలో బొజ్జో…ఆకలిగా ఉందా,!? ఎందుకు నాన్నా ఇంత గుక్కపట్టి ఏడుస్తున్నావు. పాలు పట్టడానికి ప్రయత్నిస్తున్నానుగా.. నోరు అటూ ఇటూ తిప్పుతూ ఏమిటా కంగారు చిట్టి తండ్రీ! కడుపు నిండా పాలు తాగు. ఏమిటో అమ్మ ముఖంలోకి చూస్తున్నావు. నిన్ను వదిలి నేను ఎక్కడికీ వెళ్లను.
ఈ రోజు దీపావళి. క్రిందటి దీపావళికి నేను చక్కగా పట్టు చీర కట్టుకుని నేను తయారు చేసిన రంగుల దీపాలు పెట్టాను.’
‘నీలో మంచి కళలున్నాయి’ అన్నారు వారు.
‘బాగున్నాయా’ అన్నాను మంద్ర స్థాయిలో.
‘నీలా అందంగా ఉన్నాయి…’
‘నీ నవ్వులు పున్నమిలా వెలుగుతున్నాయి’ అన్నారు.
‘నీకు చిచ్చు బుడ్డి అంటే ఇష్టం అన్నావుగా…!? ఇవి చూడు చాలా పెద్దవి. అరగంట వరకు రకరకాల పువ్వులతో, వర్ణాలతో వెలుగుతాయి. వెలిగిస్తావా?’ అన్నారు.
బుగ్గ మీదవాలిన దోమను తరుముతున్నాను. పండగ కదా జీవహింస చేయకూడదు అని.
‘నా భారతి బుగ్గపైన వాలడానికి నీకు ఎంత ధైర్యం?’ అన్నారు.
నేను పకపకా నవ్వాను. ‘మీరు మానవేతరులతో కూడా మాట్లాడతారా!? ’అన్నాను.
‘నీ గులాబీ బుగ్గను దోమ కుడుతుంటే మరి మాట్లాడాలిగా!?’
‘ఏవోయ్! దీపావళి తరువాత కొన్ని రోజులు దోమలు ఉండవు. మతాబులు కాలిస్తే పోతాయంట. నీకు మతాబులు కూడా ఇష్టం ఆన్నావుగా!? కానీ, చేత్తో పట్టుకుని కాల్చకు. ఒక్కోసారి మతాబు చీదుతుంది. చెయ్యి కాలుతుంది. అందుకే ఈ చువ్వకు గుచ్చికాల్చు.
లక్ష్మీ టపాసులు, తాటాకు టపాకాయలు, మతాబులు, మెరుపుల చిత్రాలు, భూచక్రాలు, పాము బిళ్లలు…వెన్న ముద్దలు, కాకర పుల్లలు, టపాసు మాలలు ఎన్నో తెచ్చాను.’
‘దుకాణమే తెచ్చారు?’
‘‘మన పెళ్లి తరువాత మొదటి దీపావళి. పైగా మన కుటుంబం మొత్తం మన ఇంటికి వస్తున్నారు. నా స్నేహితులు కూడా వస్తారు భారతీ’.
‘ఎండలో పెడతాను’ అని అట్ట పేర్చి అన్నీ ఎండలో పెట్టాను.
‘ఏమోయ్ కళ్లు మూసుకో’ అని భుజం చుట్టూ పట్టుచీర చుట్టారు.
‘అదేమిటండీ! దేవుడి దగ్గర పెట్టి కట్టుకోవాలి కదా!’ అన్నాను.
‘శబరి గుర్తుంది కదా!’
‘ఆ’ అన్నాను.
‘గోదాదేవి గుర్తుంది కదా!’
‘భగవంతునికి పెట్టే ముందు ఎలా ఉందో ఒక ట్రైల్ వేసి చూస్తే తప్పులేదు’ అన్నారు.
‘ఏమండీ! నా జీవితంలో ఏ దీపావళి ఇంత సంతోషంగా గడవలేదు’ అన్నాను.
‘‘పెళ్లంటే గొప్ప ఒప్పందం, తియ్యని బంధం, మధురాతి మధుర సరాగం తెలుసా!’ అన్నారు. నేను మనసారా నవ్వాను.
ఇద్దరం వెళ్లి అత్తయ్యకు, మామయ్యకు, ఆడపడుచులకు బంధువులు అందరికీ బట్టలు తెచ్చాము.
‘మీ సాహచర్యంతో ఈ రోజు నాకు ఎంతో సంబరంగా ఉంది’
‘నేను ఉన్నా లేకున్నా… ఇలాగే దీపాలు పెట్టి ప్రతి దీపంలో నన్ను చూసుకోవాలి భారతీ!’ అన్నారు.
‘అదేమిటి మీరు లేకున్నా అంటారేమిటి?’
‘మాకు ఎప్పుడు ఏ క్యాంప్ ఉంటుందో! ఎప్పుడు యుద్ధం ఉంటుందో? ఏమీ తెలియదు’.
‘కానీ ప్రతి దీపావళికి మాత్రం మనిద్దరం కలిసే చేసుకోవాలి’ అన్నాను.
‘మళ్లీ దీపావళికి మనం ముగ్గురం అవుతాం’ అని నవ్వారు. మరి మీరు ఎక్కడండీ!
కిందటి దీపావళి ఎంత సంబరంగా గడిచింది… ఈరోజు దీపావళి. మళ్లీ నా ఆలోచనలు నిలవనీయడం లేదు. ఆలోచనల మబ్బులు పట్టాయి. ‘మనకు అమ్మాయి పుట్టాలి భారతీ!’ అన్నారు ఒకరోజు వారు.
‘నాకు దూర దృష్టి ఉంది. కొన్ని జరగబోయేవి కనిపిస్తాయి. అబ్బాయే పుడతాడు. మీతో ఆడుకోడులే! అమ్మతోనే ఆడుకుంటాడు’
‘పోనీ ఇద్దరూ పుడితే!?’ అన్నారు.
‘నేను పకపకా నవ్వాను. నన్నుదగ్గరగా తీసుకుని గట్టిగా కౌగలించుకున్నారు. ఆ కౌగిలి ఇక లేదు. రాదు.ఇప్పుడు నా దుఃఖం ఆగేది కాదు.
అయ్యో! బాబు ముఖంపై పడుతున్నాయి నా కన్నీళ్లు… (తుడుస్తూ) ఆయనను ఇంకెన్నటికీ పొందలేకపోయినప్పుడు, హృదయం ఎంతగా రోదిస్తుంది. ఏ శాపమో నాది.
నవ్వుతున్న ఆయన ఫోటో నన్ను చూస్తూ ఉంది.
ఆయనతో ఉన్న ఆ జ్ఞాపకాలు మధురాతి మధురాలు.
ఆయన భుజంపై పడుకుని ఆలోచిస్తున్నాను. ఏదీ ఆ భుజం. ఊహే కదా!?
శరీర కోరికలపై కంటే, ఆత్మకు వేరే బంధనాలు చాలా ఉంటాయి. అదే కనీసం ఒకసారి వారిని చూడాలి అనే ఇష్టం.అంతే కాదు వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం.
సాయంత్రపు అలజడి గాలి అడుగుతోంది వారి చిరునామా. నాకు తెలియదు. ఆయన నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయారో!? నాతో కలిసి జీవిస్తాను అన్నారు. ఇంకెప్పుడూ కనబడరా!? దేశ రక్షకునిగా, గొప్ప సైనికునిగా విరిగి పడిన మంచు శిఖర లోయల అడుగుల్లోవారు … నేను భరించలేను ఈ దుఃఖం. నా స్వగతంలో దేశరక్షణ అనే బీజాలని బీజాలను నాటాలి. వాస్తవంలో జీవించాలి.
దీపావళికి మీరు లేక పోయినా దీపాలు పెట్టాలి అన్నారుగా పెడుతున్నా… కొండెక్కని దీపాలు ఇవి. ఈ దీపంలో మీ నవ్వు కనిపించాలి నాకు. మీరు కోరినట్లు మనదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలి.
కులమతాలకు అతీతమైన ఆదర్శ రాజ్యం కావాలి. నా తోటివారిలో స్నేహ సౌహార్ద్రతలను పంచే వీర సైనికుని అర్ధాంగిగా దేశభక్తితో జీవిస్తూ నా బిడ్డను అదే భావాలతో పెంచుతాను. మన రా కేందు మౌళి మీ వారసుడు అవుతాడు.
వీర జవాన్ మీరు. నేను మీ నిత్య ఆరాధ్యను. మీ భారతిని.’