భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– ‌కటుకోజ్వల మనోహరాచారి

రఘునాథం చాలా అదృష్టవంతుడు.

ఒక్కగానొక్క కొడుకు వరుణ్‌.. ‌పెద్ద డాక్టర్‌. అదీ అమెరికాలో! ఊళ్ల్లో అంతా అతని గురించి గొప్పగా చెప్పుకోవడమే కాక, వీలైనప్పుడల్లా రఘునాథాన్ని పొగిడేస్తుంటారు. వాళ్లూరు ధర్మారం నుంచి అప్పటికి కనీసం ముంబాయ్‌ ‌వెళ్లిన వాళ్లు కూడా లేరు. అలాంటిది ఏకంగా అమెరికా వెళ్లి చదువుకోవడమే కాక పేద్ద డాక్టరవడం, అది కూడా అక్కడే వైద్యం చేయడమంటే మాటలా?

అదే విషయం సందర్భం వచ్చినప్పుడల్లా ఊరిజనం గుర్తుచేస్తూ రఘునాథాన్ని పొగిడేస్తుంటారు.

ఆయనకీ గర్వంగానే అనిపిస్తుంటుంది. నిజంగానే తాను అదృష్టవంతుడుగా అనుకుంటూ పొంగి పోతుంటాడు. ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన రఘునాథం వరుణ్‌ను హైస్కూల్‌ ‌చదువుల వరకు వీధి బడిలోనే చదివించాడు. ఇంటర్మీడియట్‌ను పట్నంలో చదివిన వరుణ్‌, ఎం‌బీబీఎస్‌ ‌చదువుకోసం మాత్రం పట్టుబట్టి అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ ‌పూర్తిచేసిన ప్రముఖ వైద్యశాలలో కొంతకాలం పనిచేసి, ప్రస్తుతం సొంతంగా కార్డియాలజీ సెంటర్‌ ‌నిర్వహిస్తున్నాడు.

అందరూ అనుకొంటున్నట్లు రఘునాథం అదృష్టవంతుడే! లేకుంటే.. కార్పొరేట్‌ ‌కళాశాలల్లో వేలకు వేలు ఫీజులు పోసి చదివించినా, లాంగ్‌ ‌టర్మ్ ‌కోచింగ్‌లకు పంపించినా సాధించని మెడికల్‌ ‌సీటును స్థానికంగా చదివి సింగిల్‌ అటెమ్ట్‌లో సాధించడం అదృష్టమేకదా! అప్పట్లో తన మిత్రులు చాలాసార్లు అన్న విషయమే.. ఊరివాళ్లు అప్పుడప్పుడూ గుర్తుచేస్తుంటే పొంగిపోతుంటాడు రఘునాథం.

మేడారం హైస్కూల్లో క్రాఫ్ట్ ఇన్స్‌ట్రక్టర్‌గా పదవీ విరమణ చేసిన రఘునాథానికి విద్యార్థులతో అనుబంధం తక్కువే అయినప్పటికీ తన జీవితాన్ని తాను బాగానే చక్కదిద్దుకున్నాడు. తండ్రి ఆ ఊళ్లో ఐదొందల గజాల స్థలంలో సొంతిల్లిచ్చిపోయాడు. తన ఉద్యోగ జీవితంలో పాతింటి పక్కనే రెండంతస్తుల భవనం లేపాడు రఘునాథం. ఒక్కగానొక్క కొడుకు, అనుకూలవతియైన భార్య, ఏ బాదరబందీ లేని జీవితం.

కొడుకు అమెరికాలో సెటిలయ్యాక నలుగురి ముందూ నాలుగంగుళాల ఛాతిని పెంచి తిరుగాడు తున్న రఘునాథానికి నాలుగేళ్ల క్రితం భార్యను కోల్పోవడం తొలిదెబ్బ. జీవితంలో పెద్దగా ఆటుపోట్లు ఎదుర్కోని ఆతను భార్యలేని జీవితాన్ని కాస్త ఇబ్బందిగానే వెళ్లదీస్తున్నా.. ఇప్పటికీ తాను అదృష్టవంతుడిగానే భావిస్తాడు.

తల్లి చనిపోయినపుడు వచ్చి వెళ్లిన వరుణ్‌ ఇప్పటివరకూ మళ్లీ ఇటువైపు రాలేదు. పేరుమోసిన కార్డియాలజిస్టుగా బిజీ షెడ్యూల్‌తో గడిపే అతనికి జన్మభూమికి వచ్చిపోయేంత సమయం ఉండదు. అయితే.. పుట్టినూరు అని కాకున్నా తనకు పుట్టుకనిచ్చిన తండ్రి ఉన్నాడన్న విషయం ఆ కొడుక్కి బాగానే గుర్తుంది. అందుకే వారంలో రెండుసార్లు తండ్రితో వీడియోకాల్‌లో మాట్లాడుతునే ఉంటాడు.

                                                                                                 *      *        *

‘‘ఏం రఘునాథం బావా! భోజనం అయిందా..?’’ అన్నాడు అటుగా వచ్చిన శేఖరం.

మిట్టమధ్యాహ్నం బయట వరండాలో కూర్చొని పేపర్‌ ‌చదువుతూ కునికిపాట్లు పడుతున్న రఘునాథం తేరుకొని అటువైపు చూశాడు. ‘‘నువ్వా శేఖరం.. రా.. రా..’’

భుజం మీద టవల్‌ ‌వేసుకొని అటుగా వెళ్తున్న శేఖరం అగి వరండాలోకొచ్చి కూచున్నాడు. అతను ఆ ఊరివాడే! రఘునాథానికి దూరపు బంధువు. బావమరిది వరసవుతాడు. ఏదైనా పని ఉండి అటువైపుగా వచ్చినపుడు కలుస్తూ ఉంటాడు. ‘‘వంట చేసుకున్నావా..’’ అన్నాడు.

‘‘ఆ.. అయింది..’’ అన్నాడు. భార్య పోయాక రఘునాథానికి వంట చేసుకోవడం తప్పింది కాదు. రిటైర్‌ అయ్యాక ఇంటి వెనుక ఖాళీ స్థలంలో స్వయంగా కూరగాయలు పండిస్తున్నాడు. చేసే పని కూడా ఏమీ లేకపోవడంతో కూరగాయ చెట్లకు నీళ్లు పట్టడమూ, వాటి బాగోగులు చూసుకోవడమూ కాలక్షేపంగా మారింది. ఏరోజుకారోజు తాజా కూరగాయలతో స్వయంగా వంట చేసుకొని ఆరగిస్తాడు. మిగిలిన కూరగాయలను అవతలి వీధిలో ఉండే యాదమ్మ వారానికోసారి తెంపుకెళ్లి మార్కెట్‌లో అమ్మేస్తుంది. ఆయనకివ్వాల్సింది ఆయనకు ముట్టజెప్పుతుంది.

‘‘ఈ వయసులో ఎందుకు నీకీ కష్టం. నువ్వూ మీ కొడుకుతో వెళ్లరాదూ. అంతపెద్ద డాక్టర్‌ ‌కదా! నీకు ఏ అనారోగ్య సమస్య రాకుండా చూసుకుంటాడు’’

‘‘ఇప్పుడు నాకు ఏ అనారోగ్య సమస్యా లేదు కదా! అక్కడిదాకా వెళ్లడం ఎందుకు?’’

‘‘పోనీ ఇక్కడకే రప్పించుకోలేకపోయావా? ఎట్లాగూ పెళ్లి చేయాలి కదా!’’

‘‘అవుననుకో! కానీ పెళ్లి విషయంలో ఇంకా వాడేమీ చెప్పడం లేదు శేఖరం. ఎన్నిసార్లు కదిలించినా చూద్దాం.. చేద్దాం.. అంటున్నాడు’’

‘‘అదికాదు బావా! ముందు అతని స్థాయికి తగిన ఓ మాంచి అమ్మాయిని చూడు. ఫోటో పంపించు. నచ్చితే డైరెక్టుగా పెండ్లి చూపులు.. ఆటెనుకే పెళ్లీ. ఆళ్లతో పాటు నువ్వూ అమెరికాలో సెటిల్‌ ‌కావచ్చు’’

‘‘నాకు అమెరికాలో సెటిల్‌ ‌కావాలనేంత ఆశలేమీ లేవు శేఖరం. కానీ నువ్వన్నట్లు పెళ్లి మాత్రం ఇక్కడే ఘనంగా చేయాలనుంది. అమ్మాయి విషయంలో నీకు తెల్సినవాళ్లకు చెప్పి నువ్వూ సాయం చెయ్యి’’అడిగాడు రఘునాథం.

‘‘నాకు చెప్పావుకదా.. ఇక చూస్కో.. అదేపనిలో ఉంటా. వెళ్లస్తా బావా! ఆరోగ్యం జాగ్రత్త’’ అంటూ వెళ్లిపోయాడు శేఖరం.

అతను వెళ్తుంటే ఆలోచన్లో పడిపోయాడు రఘునాథం.

కొడుక్కి ముప్పై ఏళ్లు పైబడ్డాయి. ఇంకా పెళ్లి ఆలోచన చేయడం లేదు. వాళ్లమ్మ ఉన్నప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేసినా ‘అప్పుడే తొందరేమిటమ్మా..’ అనేవాడు. ఇపుడు వాళ్లమ్మ పోయి నాలుగేళ్లవుతుంది. తను విషయాన్ని లేవనెత్తిన ప్రతిసారీ ఎటూ చెప్పకుండా మాటమారుస్తాడు. అసలేంటీ ఇతగాడి ఉద్దేశం? అక్కడే ఎవర్నైనా కట్టబెట్టుకోవాలని చూస్తున్నాడా? లేదు లేదు. అలాంటి ఉద్దేశమే ఉంటే చెప్పేవాడు. శేఖరం చెప్పినట్టు మనమే అమ్మాయిని చూపెట్టి లైన్లోకి లాగాలేమో..! అదీ చూద్దాం.. అనుకుంటుండగా పడక్కుర్చీలోనే సన్నగా కునుకు పట్టేసింది.

                                                                                                 *      *        *

అశనిపాతంలాంటి వార్త.

వరుణ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నాన్నగారు చనిపోవడం ఏంటి?

ఏ బాదరబందీ లేకుండా సొంతూరులో హాయిగా జీవితం గడుపుతున్న ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నాడు. వార్త తెలియగానే హాస్పిటల్‌ ‌వదిలి ఇంటికొచ్చి కూర్చున్నాడు వరుణ్‌.

ఎలా.. ఇప్పుడెలా..?

నిన్న రాత్రి బాగున్నాడు. తనతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు. ఒకమ్మాయి ఫోటో పంపించి తమకు దగ్గరివాళ్లు.. చేసుకోవాలంటాడు. ఇండియా వచ్చేస్తే నేరుగా పెళ్లిచూపులకు వెళ్లొచ్చంటాడు.

ఎకాఎకిన ఓ అమ్మాయి ఫోటో చూసి ఎట్లా ఓకే చేసేది? సడెన్‌గా ఇండియా వెళ్లడం కుదిరే పనేనా? అయినా నాన్నకు నచ్చినంత మాత్రాన తనకూ నచ్చాలనేముంది?

ఎప్పుడూ లేంది తను కాస్త చీరాగ్గానే చెప్పాడు. ‘అసందర్భంగా విసిగించకు నాన్నా’ అన్నాడు. ఎప్పుడూ లేంది నాన్న కూడా అసహనంగానే మాట్లాడాడు. ‘అక్కడే ఎవర్నైనా కట్టబెట్టుకుంటావా..’ అనికూడా అన్నాడు. తను మరింత అసహనానికి లోనై ‘ఏదైనా మీకు చెప్పే చేస్తాలే’ అంటూ విసురుగానే ఫోన్‌ ‌పెట్టేశాడు తను.

నాన్న నొచ్చుకొని ఉంటాడా? ఇంతదానికే మనసుకెక్కించుకొని మధనపడ్డాడా? దాని ఫలితమేనా ఈ హార్ట్ ఎటాక్‌?

ఎం‌త దయనీయం?! కొడుకు అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్టు. తండ్రి ఇండియాలో హార్ట్ ఎటాక్‌తో మరణం. ఇంతకంటే విషాద•ం ఏముంటుంది?

వరుణ్‌ ‌కాలుగాలిన పిల్లిలా హాల్లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.

తను.. తను.. అంత కఠినంగా మాట్లాడుండా ల్సింది కాదేమో! దూరాబారాన ఉన్న తండ్రిని నొప్పించి ఉండాల్సింది కాదేమో!

అతను ఉద్విగ్న స్థితిలో పచార్లు చేస్తుంటే వాట్సాప్‌ ‌కాల్‌ ‌రింగయింది. ఇండియా నుంచే. జానకిరాం. ఇందాక నాన్నగారు తెల్లవారుజామున చనిపోయారన్న వార్త తెల్పిన వ్యక్తి అతనే. నాన్నగారిని అప్పుడప్పుడూ కలిసి పోతుండే స్నేహితుడు. ఊళ్లోనే ఆ చివరలో ఉంటాడు. అప్పుడప్పుడూ నాన్నగారి యోగక్షేమాలు కనుక్కొని తెలియజేస్తుంటాడు.

ఫోన్‌ ఎత్తి ‘‘హలో అంకుల్‌’’ అన్నాడు వరుణ్‌. ఇం‌డియాలో వాళ్లకు ఉదయమే అయినా ఇక్కడ చీకటిపడిన సమయం.

అట్నుండి ‘‘కాగల కార్యం గురించి ఇంకా ఏం చెప్పలేదు బాబూ!?’’ అన్నాడు.

‘‘నేనే.. నేనే కాల్‌ ‌చేద్దాం అనుకుంటున్నాను అంకుల్‌. ‌ట్వంటీఫోర్‌ అవర్స్ ‌పైగా ఫ్రిజర్వ్ ‌చేయాల్సి ఉంటుంది బాడీని. చాలా దూరాన ఉన్నాను కదా..’’ అన్నాడు సిన్సియర్‌గా బాధపడుతూ.

‘‘అంటే.. రేపు పొద్దున దాంక అన్నట్లు.. సరేలే! అట్లానే చూస్కుంటాం. ఫ్రీజర్‌ ‌కూడా తెప్పిస్తున్నాం. బంధుమిత్రులందరికీ చెప్పేదా..?’’ అన్నాడు అట్నుండి.

‘‘పర్లేదు అంకుల్‌. ‌నేను చూసుకుంటాను. మీకు వీలైన మేరకు చెప్పండి’’ అంటుంటే కాల్‌ ‌కటైంది.

వరుణ్‌ ‌కుర్చీలో కూర్చొని ఒకరిద్దరికి కాల్‌ ‌కలిపాడు. లిఫ్ట్ ‌కాలేదు. అతనలాగే ఫోన్‌ ‌నంబర్లు సెర్చ్ ‌చేస్తూ ఆలోచిస్తున్నాడు.

నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. పెన్షన్‌ ‌మీద ఆధారపడి బతికారు కనుక ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. ఇల్లు, పరిసరాలు ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే మరీ దగ్గరి బంధువులు లేకపోవడమే కాస్త విచారించదగిన విషయం. ఆయనకు పెద్దగా మిత్రులు కూడా లేరు.

వరుణ్‌ ‌తల విదిలించాడు. ఎవరున్నా లేకున్నా నాన్నగారి అంత్యక్రియలు ఘనంగా జరుగుతాయి… జరగాలి. అతను టకటకా ఫోన్లు కలపడంలో నిమగ్నమైపోయాడు.

                                                                                                 *      *        *

మరునాడు సరిగ్గా పదిగంటలకు ఏర్పాట్లు ముమ్మురమయ్యాయి.

రఘునాథం ఆత్మీయ బంధుమిత్రులందరూ ఒకేసారి కట్టగట్టుకొని వచ్చినట్లు ఒక్కసారిగా హడావిడి మొదలైంది. వచ్చిన వాళ్లలో ఓ పదిమందిదాకా మహిళలు వస్తూనే గొల్ల్లుమన్నారు. రఘునాథం పార్థివదేహం చుట్టూ చేరి తలలు బాదుకుంటూ రోదిస్తున్నారు. తమలో తాము కుమిలిపోతున్న కొంతమంది మగవారు కూడా ఇక తమాయించుకోలేమన్నట్లు భోరున విలపించారు.

స్థానికంగా అక్కడ చేరుకున్నవారికి అదనంగా సుమారు వంద మందిదాకా తోడయ్యారు. కాసేపు విలపించారు. రఘునాథం వ్యక్తిత్వం, మంచితనం గురించి తోటివారితో చర్చించుకున్నారు.

తర్వాత.. కాగల కార్యం గురించి విచారించారు. ఓసారి అక్కడి పరిస్థితులన్నీ సమీక్షించాక అంతిమయాత్రకు ఏర్పాట్లు మొదలుపెట్టారు వచ్చినవారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బృందాల వారీగా, విడివడిగా ఎవరి పాత్ర వారు సమర్థ వంతంగా పోషిస్తున్నట్లు తమ పని చేసుకుపోతున్నారు. వాళ్లంతా రఘునాథానికి ఆత్మీయులో, అభిమానులో స్థానికులకు అర్థం కాలేదు. ‘ఇంతమంది అభిమానుల్ని కూడబెట్టుకున్న రఘునాథం మాత్రం ధన్యుడేలే’ అనుకున్నారు.

ఓ పది మంది దాకా పూనుకొని అరగంటలో పూలపల్లకీ లాంటి పాడె నిర్మాణం చేశారు. ఫ్రీజర్‌ ‌చుట్టూ చేరి తలలు బాదుకుంటూ రోదిస్తున్న మహిళల ఆవేదన హృదయాల్ని కదిలించేలా ఉంది. వాళ్లను ఓదారుస్తూనే నెమ్మదిగా పార్థివ దేహాన్ని బయటకు తీసి కుర్చీలో కూర్చోబెట్టారు నలుగురు. స్నానాది కార్యక్రమం, అనంతరం కొత్త వస్త్రాలు చుట్టి, పెద్దగా బొట్టు పెట్టి పూలమాలలతో అలంకరించారు. రకరకాల పూలతో అలంకరించిన పాడెను మోయడానికి ఆ నలుగురు సిద్ధంగా ఉన్నారు. భుజాలు మార్చుకోవడానికి మరో నలుగురు చేరారు. స్థానిక పెద్దలతో మాట్లాడి ఓ పదిమందిదాకా అప్పటికే ఊరి శివారు శ్మశానవాటికలో దహన సంస్కారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

అక్కడ వచ్చినవారి రోదనులు వింటుంటే మాత్రం గుండెలు తరుక్కుపోతున్నాయి. ‘‘కాకా.. నీకేం కష్టమొచ్చిందే.. ఇంత తొందరగ మాకు దూరమై పోతివీ.. అన్నిట్లా మాకు అండనుంటివి. ఇప్పుడు మాకు దిక్కెవరు కాకా..’’ అక్కడ కొందరు యువకుల రోదన చూసేవారి హృదయాలను కదిలించి వేస్తుంది.

స్త్రీమూర్తులైతే కంటికి మింటిగా ఏడుస్తున్నారు. ‘‘బాపూ..! బంగార మసుంటి మనిషివి. మా బతుకులు బండలపాలు చేసిపోతివా..? మమ్ముల్ని దిక్కులేని పక్షుల్ని చేస్తివే బాపూ..’’ వాళ్లు తల్లడిల్లుతున్న తీరు కఠిర హృదయుల కరుకు గుండెల్ని కూడా కరిగించేదిలా ఉంది.

‘‘ఏం చేయగలం..’’ స్థానికులు కొందరు వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. రఘునాథానికి ఆత్మీయులు, అభిమానులూ బాగా ఎక్కువే అనుకుంటూ వాళ్లతో పాటు వీళ్లూ గొంతుకలిపి వేదన పంచుకొన్నారు. ఎవరితో పెద్దగా సత్సంబంధాలు నెరపినట్టుగా అనిపించని రఘునాథం, తెరవెనుక తనకోసం మంటికి మింటికి ఏకథాటిగా ఏడ్చే మనసున్న మనుషుల్ని మాత్రం తయారు చేసుకొన్నాడు.. అని అబ్బురపడ్డారు.

అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తికాగానే అందరూ ఒకరొకరుగా పాదాలవైపు వచ్చి నమస్కరించి పక్కకు తప్పుకొంటున్నారు.

బ్యాండు మేళం, సన్నాయి వాయిద్యంవారు ఎప్పుడో వచ్చేశారు. అగ్ని సంస్కారం కోసం ఉట్టిచిప్పలో అగ్నితో సిద్ధ్దమయ్యాడు ఓ యువకుడు. కదిలే ముందు అందరూ వచ్చినట్లేనా మనవారు.. అన్నాడు వేదనాభరిత వదనంతో చుట్టూ చూస్తూ. నలుగురు పెద్దమనుషులు ఔనన్నట్లు తలాడించారు.

రఘునాథం అంతిమయాత్ర ఆరంభమైంది. స్థానికులు, దూరపు బంధుమిత్రులు, అభిమానులతో కలిపి దాదాపు మూడొందల మంది వరకు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గంటపాటు సాగిన యాత్రలో గంపలకొద్ది పూలు, కర్పూర చందనాది సుగంధ పొడులు, రకరకాల స్ప్రేలు, చిల్లర డబ్బులతో పాటు నోట్లు కూడా వెదజల్లుతూ అత్యంత వైభవంగా రఘునాథం పార్థివదేహాన్ని ఊరేగించారు శ్మశానం వరకు.

ఎవరు బంధువులో, ఎవరు మిత్రులో, ఎవరూ ఎవరికీ అర్థం కానంత వైభవంగా సాగింది యాత్ర. రఘునాథం పార్థివదేహం చితిపైకి చేరింది. దాని చుట్టూ మూడుసార్లు తిరిగిన ఆ యువకుడు అగ్నిసంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు.

‘‘ఒక్క నిమిషం ఆగు బాబూ!’’ అని వినిపిం చడంతో తలయెత్తి అటువైపు చూశాడు ఆ యువకుడు.

శేఖరం ముందుకు వచ్చాడు.

‘‘వరుణ్‌ ఎక్కడ బాబూ? రాలేదా?’’

అతను కొంచెం తటపటాయించి ‘‘రాలేదు. రాలేకపోయారు..’’ అన్నాడు చుట్టూ చూస్తూ.

‘‘ఇంతకీ మీరెవరు బాబూ! వీళ్లంతా ఎవరు?’’

అతను తమాయించుకొంటూ ‘‘మేమంతా పేయిడ్‌ ‌రిలేటీవ్స్. ‌డబ్బిస్తే అంతా మేమే చూసుకుంటాం. దాదాపు వందమంది దాకా వచ్చాం హైదరాబాద్‌ ‌నుంచి. వరుణ్‌ ‌గారి అభ్యర్థన మేరకు రంగంలోకి దిగాం’’ అన్నాడు తడుముకోకుండా.

చాలా మందికి విషయం అర్థం కాలేదు ముందు. అర్థంకాగానే ఒక్కసారిగా విస్తుబోయారంతా.

శేఖరం మరో ప్రశ్న వేశాడు. ‘‘మీ బృందానికి ఎంత చెల్లించాడు?’’

అతను చెప్పాడు ‘‘ఇరవై లక్షలు!’’

అందరూ నోరెళ్లబెట్టారు.

సమీప బంధుమిత్రుల మాదిరి నటించి, ఏలోటు రాకుండా అంత్యక్రియలు సజావుగా పూర్తిచేసి మరునిమిషంలో మాయమయ్యే బృందానికి ఇరవై లక్షల ప్యాకేజీ!? ఏర్పాట్లూ, పాల్గొన్న సంఖ్యను బట్టి మినీ, మెగా వంటి ప్యాకేజీలు ఉండవచ్చు!!

తల్లిదండ్రుల అంత్యక్రియల్లో పాల్గొనడం కంటే తమ మనుగడే ముఖ్యమనుకునే అపుత్రులైన వారి సౌకర్యార్థం పుట్టుకొచ్చిన దిక్కమాలిన సంప్రదాయ మేమో! ఈ వింత సంప్రదాయాన్ని జీర్ణించుకోవడానికి అక్కడి వాళ్ల మనసులు సహకరించకపోయినా చేసేదేమిలేక అట్లాగే నివ్వెరపోయి చూస్తున్నారు.

అతనో విజిటింగ్‌ ‌కార్డు అందిస్తూ ‘‘అవసరమైన వాళ్లు సంప్రదించొచ్చు.. రేటును బట్టి ఏర్పా ట్లుంటాయి..’’ అన్నాడు తర్వాతి కార్యానికి ఉద్యుక్తుడవుతూ.

వచ్చినవారు అట్లాగే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. కాలంలో వస్తున్న మార్పులను జీర్ణించుకోనట్లుగా భారంగా నిట్టూరుస్తుంటే.. చేసేదేమీ లేక ఆ యువకుడి చేతిలో నుండి కొరివి తీసుకొన్నాడు శేఖరం.

కునారిల్లుతున్న కుటుంబ బంధాల విషయమై లోలోనే కుములుతున్నట్లుగా అనిపిస్తుంటే.. వచ్చిన స్థానికులు, బంధుమిత్రులవైపు ఓసారి నిర్వికారంగా చూసిన శేఖరం తనే తలకొరివి పెట్టేందుకు ఉద్యుక్తుడయ్యాడు.

మనసు పొరల్లో ఎగిసిపడుతున్న మంటలను మించి క్రమక్రమంగా రఘునాథం చితి మంటలు పైకెగుస్తుంటే, భారమైన గుండెల్ని బిగబట్టుకొని ఒకరొకరుగా నిష్క్రమిస్తున్నారు శ్మశానవాటిక నుంచి.

About Author

By editor

Twitter
YOUTUBE