సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు శ్రావణ బహుళ దశమి – 18 ఆగస్ట్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
పెహల్గావ్ నెత్తుటికాండకు పాల్పడి భారత్ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు. భారత్ పట్ల అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉంది. వియన్నా సదస్సు నిబంధనలను ఉల్లంఘించి ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలకు వంట గ్యాస్, వార్తాపత్రికలు, ఆఖరికి తాగు నీరు కూడా నిలిపివేసినట్టు తాజాగా వెల్లడైంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నదో అధికారికంగా బహిర్గతం కాకున్నా, అంతిమంగా పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఐఎస్‌ఐ పేరే వినిపిస్తున్నది. రెండు మూడు దేశాలు తప్ప, ప్రపంచమంతా చీదరించుకుంటున్న ఈ వ్రణానికి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త లేపనం పూసి, ఊపిరి కూడా పోసే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ మీద కడుపు మంటతో సుంకాలు పెంచి, పనిలో పనిగా పాకిస్తాన్‌ను దువ్వడం మొదలెట్టారు టారిఫ్‌ల ట్రంప్. దీనితో దృశ్యం పరమ వికృతంగా మారిపోయింది.
పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్‌మార్షల్ ఆసిమ్ మునీర్‌ను ఈ మధ్య శ్వేతసౌధం విందులు కుడిపిస్తూ, ముద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో మునీర్ వెర్రెత్తినట్టు వదరుతున్నాడు. షెహబాజ్ షరీఫ్‌ను ఈడ్చి తన్ని, తానే పాకిస్తాన్ భావి ప్రధాని కాబోతున్నాడన్న తీరులో మునీర్ అమెరికాలో మాట్లాడాడు. భారత్ భవిష్యత్‌లో తమ దేశం మీద యుద్ధానికి దిగితే జరగబోయేదేమిటో చెప్పి బెదిరించాడు. తాము నాశనం కావడమే కాకుండా, సగం ప్రపంచాన్ని కూడా తమతో నాశనమయ్యే అవకాశం కల్పిస్తారట. భారత్ మెర్జిడెజ్ బెంజ్ కారులా ధగధగలాడే దేశమే కావచ్చు. పాకిస్తాన్ చెత్తాచెదారం, రాళ్లూరప్పలు మోసుకెళ్లే డంప్‌ట్రక్ కావచ్చు. కానీ ట్రక్ వెళ్లి బెంజ్‌ను గుద్దితే ఎవరికి నష్టమో తెలుసుకోవాలంటూ యావత్ విశ్వం ముక్కు మూసుకునేటంత స్థాయి కంపు మాట వదిలాడు. అమెరికా చంకనెక్కిన మునీర్‌కు మళ్లీ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్న సంగతి అమాంతం గుర్తుకు వచ్చింది. అమెరికాలోని ఫ్లారిడాలోని టాంపా అనే చోట మునీర్ ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడాడు. కశ్మీర్ గురించి నోరు పారేసుకున్నాడు. కశ్మీరం తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే నరం అంటూ కవిత్వం వెలగబెట్టాడు. ఈ విషయం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మదలీ జిన్నాయే చెప్పాడని సాక్ష్యం తెచ్చుకున్నాడు. పైగా కశ్మీర్ అంశం అంతర్జాతీయ అంశమని పాచి పాట వినిపించాడు. ఇటీవలి ఘర్షణలో (ఆపరేషన్ సిందూర్) ఘన విజయం సాధించింది తామేనంటూ పాకిస్తానీలే విస్తుపోయే రీతిలో కోతలు కోశాడు. ఆఖరికి సింధు నది భారత్ సొత్తేమీ కాదని కూడా ప్రకటించాడు మునీర్.
ఇదంతా ఒక ఎత్తయితే, గుజరాత్‌లోని రిలయన్స్ వారి అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద టాంపాలోనే చేసిన వ్యాఖ్య మరొక ఎత్తు. భారత్ ఎదుగుద లను చూసి పాకిస్తాన్ ఎంత కుళ్లుకుంటున్నదో ఈ వ్యాఖ్యతో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంగణమది. దానిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని తప్పుడు పేలాపన పేలాడు మునీర్. భారత ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్న పారిశ్రామిక వాడల మీద పాకిస్తాన్ కన్నేసి ఉంచిందన్న మన నిఘా వర్గాల సమాచారం నిజమని దీనితో వెల్లడైంది. ప్రధానంగా పాకిస్తాన్‌కు సరిహద్దుగా ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రంలోని సంపద సృష్టి కేంద్రాల మీదనే పాకిస్తాన్ కన్ను చిరకాలంగా ఉందన్నదీ నిజం.
శ్వేతభవనం అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక సర్కస్ కంపెనీలా, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఒక బఫూన్‌లా కనిపిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేసింది తానే అంటూ ఎన్నిసార్లు అరిచాడో ట్రంప్! స్వీడిష్ అకాడమీకి ఆ అరుపులు, పెడబొబ్బలతో చెవులు గంట్లు పడి, ఇక భరించలేక శాంతి నోబెల్ పురస్కారాన్ని తెల్లారేసరికి తిరుగు టపాలో పంపుతారని ట్రంప్ ఆశ. యుద్ధం తానే నిలిపేశానంటూ ట్రంప్ అన్నసార్లు టాం టాం వేసుకున్నా, ఆ మాటకు మన ప్రధాని నరేంద్ర మోదీ పూచికపుల్లకు మించి విలువేమీ ఇవ్వలేదు. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయమని తమకు ఏ దేశాధినేత నుంచి కబురు అందలేదని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాని ప్రకటించారు. మోదీ సర్వస్వతంత్రుడైన నాయకుడు. కాబట్టి ఇలాంటి ప్రకటన చేయగలిగారని అనుకోనక్కరలేదు. అమెరికా కాంగ్రెస్ ప్రముఖులు, భద్రతా వ్యవహారాల మాజీ సలహాదారు వంటివారు కూడా ట్రంపరితనాన్ని తూర్పార పడుతున్నారు. ఒక నిపుణుడైతే ట్రంప్ సుంకాల వ్యూహం డాలర్‌ను మరణశయ్యకు చేర్చిందని ప్రకటించేశారు కూడా. భారత్-అమెరికాల మధ్య కొన్ని దశాబ్దాలుగా గట్టి పడుతూ వచ్చిన సత్సంబంధాలను సుంకాల వంకతో నాశనం చేయడం సరి కాదని, రెండు దేశాల ప్రజల మధ్య గొప్ప సుహృద్భావ వాతావరణం ఉందన్న సంగతి విస్మరించరాదని ఆ దేశ ప్రముఖులు చెబుతున్నా ట్రంప్ పెడచెవిన పెడుతున్నాడు. నిజానికి ఈ దేశాధ్యక్షుడు, ఆ సైన్యాధ్యక్షుడు మొదట తమ ఇళ్లు చక్కబెట్టుకోవాలి. ఒకరి కోతలు చూసి ఒకరు డంగైపోతే వాళ్లే భంగపడతారు.
పాకిస్తాన్ నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు సృష్టిస్తామని వారి దగ్గర ఏదో మంత్రదండం ఉన్నట్టే ట్రంప్ ప్రకటించాడు. ఇది ఎంత హాస్యాస్పదమో ట్రంప్‌కు తెలియదా? ఇంతకీ అమెరికా గడ్డ మీద నుంచి పాక్ సైన్యాధ్యక్షుడు వాగిన ఈ వాగుడును అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించ గలరా? ఇది ప్రపంచం అడగవలసిన ప్రశ్న. అలాగే రిలయన్స్ వారి చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుంటామన్న పాకిస్తాన్ మునీర్ మాట గురించి మన ప్రతిపక్ష నేత స్పందన ఏమిటి? రిలయన్స్ అంబానీలది కాబట్టి, ఆ పారిశ్రామికవేత్తలు మోదీకి సన్నిహితులని రాహుల్ నమ్మకం కాబట్టి మునీర్ నిర్ణయం సరైనదేనంటారా? ఇది భారత ప్రజానీకం అడగవలసిన ప్రశ్న.