‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
కొద్ది సమయంలోనే కాకతీయ మెరుపువీరుల పైకి దేవగిరి సైన్యం అంచెలంచెలుగా వచ్చి పడుతోంది.
వచ్చినవారిని వచ్చినట్లుగా ఎదుర్కొని మట్టుబెడు తున్నారు మెరుపువీరులు.
సంకుల సమరం జరుగుతోంది.
మరో ప్రక్క బందీలను నిశ్శబ్దంగా వాయువేగంతో కోట అంచులకు చేర్చి అంతే వేగంతో బయటకు దింపేస్తున్నారు.
మందడి కాటయ కొందరు వీరులతో గణపతి దేవుని కోసం ప్రతి భవనాన్ని వెదుకుతున్నాడు. గణపతిని సాధారణ కారాగారం నుండి రాజ ప్రాసాదంలోకి మార్చారని.. అతని కోసమే ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేశారని ముందే తెలుసు కాని, ఆ ప్రత్యేక కారాగారం ఏ భవనంలో ఉందో తెలియదు. దాని కోసమే కాటయ ప్రతి భవనం గాలిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలించడంలేదు. గణపతి రక్షణ కోసమే నియమించిన గూఢచారి నాగతిస్య ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతనికి మెరుపుదాడి వార్త ముందే పంపినా ఇంతవరకు తన వద్దకు రాకపోవడంతో పళ్లు పటపట కొరుకుతూ ప్రతి భవనంలో ప్రతి గదిని పరిశీలిస్తున్న కాటయకు రానురానూ ఓపిక నశిస్తోంది.
అప్పుడే అతనికి ఓ వార్త వచ్చి చేరింది. పెళ్లి మండపం తగలబడుతోందని..
అది మన ఎత్తుగడలో భాగం కాదు కదా! ఎలా తగలబడుతోంది.. ఎవరు ఎందుకు చేసినట్లు??
***
కాబోయే కాకతీయ రారాజు గణపతిదేవుడు పుట్టుకతో గొప్ప మేధావి. భారత గడ్డ మీది రాజ్యలకు కాబోయే చక్రవర్తిగా అందరూ అంచనా వేసిన రాజనీతి కోవిదుడు, కాకలుతీరిన ఖడ్గ యుద్ధవీరుడుగా పేరెన్నికగన్న కాకతీయ రుద్రదేవుని వారసునిగా.. ఆయన దత్తత తీసుకుని మరీ శిక్షణనిచ్చిన గణపతి దేవుని తాత్కాలికంగా ఆవరించిన నివురు ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయింది. ముడుచుకు పడుకున్న మహానాయకుడు నిద్రలేచినట్లు.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ కవ్వల చేయి విడువకుండా పరుగులు పెడుతూ ఆ అర్ధరాత్రి దేవగిరి కోటలో ఓ చతుష్పధం వద్ద నిలబడి పోయాడు.
చేతిలో తనను నమ్మిన ఆడది.. తను వలచిన ఓ అమాయకురాలు.. తనవంక బేలగా చూస్తూ దేవుని ప్రార్ధించినట్లు తనను ప్రార్ధిస్తోంది. తన చేతిలో ఆమె చెయ్యి. తన మనసులో ఆమె మనసు. అతి తక్కువ కాలంలోనే తన గుండెల్లో మహావనాలను సృష్టించి అక్కడకు లక్ష వసంత రుతువులను రప్పించి పువ్వులు పూయించి తనను ఊగించి శాసించిన ఈ అతివను వదలి.. తనను రక్షించడానికి తన వారు వచ్చారని.. గుర్తించినా ఈమెను వదలి వెళ్లి పోవడం.. ‘ఓ దేవుడా అది నా వల్ల కాదు, అంటే కాదు.’
‘‘కవ్వలా.. అటు అటు పోదాం..’’ పరిగెత్త బోయాడు.
కవ్వల అంది. ‘‘నన్ను.. నన్ను. నా చేయి వదలవు కదా యువరాజా..?!’’
అప్పటికి ఆమె ఆ మాట అనడం వెయ్యవసారి!
చటుక్కున ఆగిపోయాడు. ‘‘నేను కాకతీయవంశ సంజాతుడను. ఇచ్చిన మాట తప్పను. ఆ పరిస్థితే వస్తే ఇదిగో ఆ మంటల్లోకి నడచుకుంటూ వెళ్లి పోతాను. నీ నామస్మరణతో మంటల బాధను తట్టుకుని మౌనంగా ఈ లోకం నుండి నిష్క్రమిస్తాను. సరేనా..’’
ఆమె నివ్వెరపోయి చూస్తోంది. వడలిపోయిన లేతమొక్కకు నీటి ఊటలాంటి అతని మాటలతో వెర్రిగా మిణుకు మిణుకుమనే ఆశతో చూస్తోంది. ‘‘పద పద.. పరిగెత్తు.. పరిగెత్తు..’’
ఇద్దరూ లేత కౌమారులు. అతనికి పదిహేడేళ్లు, ఆమెకు పదిహేను ఉండవచ్చు. లేత యవ్వన ఉద్వేగ వయసులో.. అది స్నేహమో.. మోహమో.. ఆవేశమో.. పెనవేసిన అనురాగమో.. జీవితాంతం కలిసి బ్రతకాలన్న ఆశయమో.. ఇద్దరిని పరుగులు పెట్టిస్తోంది.
దగ్గరగా ఎవరో సైనికుల బృందం వస్తున్నట్లు శబ్దాలు.
ఆగాడు. అతని చెయ్యి ఆమె విడువడం లేదు. పరిగెడుతూ ఆగినప్పుడల్లా కవ్వల అతని మీద తూలి పడిపోతోంది. మరుక్షణం అతని ముఖంలోకి కళ్లప్పగించి చూస్తోంది.
అంత తీవ్ర ఆపద సమయంలోనూ గణపతికి నవ్వొచ్చింది. ఈ అమ్మాయేనా ఆ రాజప్రసాదపు గదిలో తనపై లేడిలా దూకి దూకి.. రంకెలు వేసి వేసి.. బెదిరించి నువ్వూ గివ్వూ అంటూ పెత్తనం చెలాయించిన ఆమె!
ఈమేనా.. ఈ తామరతూడులా ఊగిపోతూ చెయ్యి వదలకుండా నాలుగడుగులువేసి రొప్పుతూ ప్రాణభయంతో వణికిపోతున్న ఈమె.. ఆమేనా.. వాళ్ల రాజ్యంలో వాళ్ల కోటలో వాళ్లకు శత్రువునై చేతికి చిక్కి కారాగారంలో ఉన్న బందీని తనను రక్షించమని అడగడం.. వాడు ఆ సింఘణ పెళ్లి చేసుకుంటాను అంటే ఈమె అంత కంటే మృత్యువే నయం అన్నట్లు తనను రక్షించమని.. ప్రాధేయ పడటం..
ఆ సైన్యం దగ్గరవుతోందనగా చటుక్కున ప్రక్కనున్న ఓ శిథిల భవనంలోకి దూకాడు. అంతే వేగంగా వచ్చి మీద డబ్బున పడిపోయింది. చేయి వదలలేదు.
వీళ్ల బరువుకు ఆ శిధిల భవనపు గోడలనుండి రెండు మూడు రాళ్లు రాలి క్రిందపడ్డాయి.
ఆ శబ్దానికి గుడ్లగూబల వంటి రాత్రిపిట్టలు రెక్కలు టపటపకొడుతూ పైకి లేచాయి. ఆ సవ్వడికి ఆ సైనికులు భవనాన్ని చుట్టుముట్టారు. కవ్వల గణపతిని కరుచుకుపోయింది. ఆమె వణకడంవల్ల అతని శరీరం కూడా వణుకుతోంది.
‘‘ఎవరు లోపల?’’ ఓ కరుకు గొంతు అడిగింది.
మౌనం.. ఊపిరి ఆపి కళ్లు పెద్దవి చేసి చెవులు రిక్కించారు.
వెంటనే కేవ్వున కేక.. అప్పుడే మరో యాదవ సైనిక బృందం కాబోలు వచ్చి పడిరది.. గుర్రాల సకిలింపులు.. గోల గోల.. కత్తుల కణకణలు, అరుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు.. పాదరక్షాల గరగరలు.. పరుగులు..
కాసేపటికి నిశ్శబ్దం.. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చారిద్దరు.
ఎవ్వరూ లేరు కానీ మంటలు.. పెళ్లి మండపం దాటి మంటలు ఇతర భవనాలకు వ్యాపించాయి. ఎటు చూసినా మంటలు. భవనాల ఎత్తున మండుతున్న దేవగిరికోట. పరుగులు పెడుతున్న జనం. బాకులు, కత్తులు, బరిసెలు చేతపట్టి శత్రువులను వెదుకుతూ పరుగులు పెడుతున్న సైనికులు..
పొగ.. కళ్లను మండిస్తూ గొంతులోకి వెళ్లి దగ్గు తెప్పిస్తోంది.
దగ్గరగా ఓ వీరుల బృందం తమనే చూడటం గుర్తించాడు గణపతి. ఇంతటి ప్రాణాపాయస్థితిలో ఓ అమ్మాయి, అబ్బాయి చేతులు పుచ్చుకుని పరుగులు పెట్టడం.. వాళ్లలో ఆసక్తి కలిగించినట్లు.. అనిపించింది.
వాళ్లు శత్రువులైనా ప్రాణాపాయమే.. తనవారైనా ప్రాణాపాయమే.. తనవారైతే కవ్వలను ఇక్కడికిక్కడే నరికేస్తారు. తనను ఎత్తి కోట అవతలకు విసిరేస్తారు.
తిరిగి ఓవైపు వేగంగా పరుగు లంఘించు కున్నారు. కాస్త దూరం వెళ్లాక మరో సైనికబృందం. మంటల వెలుగులో ఇద్దరిని పరిశీలనగా చూస్తు న్నారు. మళ్లీ దారి మార్చి పెరుగుపెట్టారు. మళ్లీ అదే పరిస్థితి. ఎవరో పరిశీలనగా చూస్తున్నారు తామిద్దరినీ. అప్పుడు బయట పరుగులు క్షేమం కాదని ఇద్దరికి తోచింది. దగ్గరగా వున్న భవనంలోకి పరుగు పెట్టారు.
భవనం నిండా ఏవేవో వస్తువులు.. లోపల కాపలా ఏమీలేదు.
అంతా కోటలోకి జొరబడిన శత్రు సైనికుల పైకి వెళ్లినట్లున్నారు. అనేకానేక వస్తు సముదాయంతో నిండుగా ఉన్న ఆ భవనం ఇద్దరికి బాగా నచ్చింది. పైగా మనుషులెవరూ లేరు.కాస్తో కూస్తో బయటి మంటల వెలుతురు పడుతోంది. ఇద్దరూ కూర్చోవ డానికి పల్యంకాలు, పడుకోవడాని శయన తల్పాలు ఉన్నాయి. వాటిపైకి అనేకానేక పట్టు బాలీసులు, దుప్పట్లు, శాలువలు.. ఓప్‌ా.. ఒకటేమిటి అనేకానేక దుస్తులు, ఉష్నీషనాలు, ఉత్తరీయాలు.. ఇద్దరూ ఆ భవనంలోని విశాల మందిరాలలో అన్ని గదుల్లోకి పరుగులు పెడుతూ ఆక్కడున్న వస్తు, పరికరాలను చూసి పరవశించారు.
అప్పుడు కవ్వలకు చటుక్కున స్పురించింది. అది కోష్టాగారం.
‘‘యువరాజా! ఇది కోష్టాగారం..’’ అంది విపులంగా చెబుతున్నట్లు.
అంతా పరికించి చూసి, ‘‘అవును.. అవునవును..’’ అన్నాడు చెమట తుడుచుకుంటూ.
రాజకుటుంబీకులకు కావలసిన అన్నిరకాల వస్తువులను తెప్పించి సిద్ధపరచి వారి వారి మందిరాలకు చేరేవేసే నియోగాన్ని కొట్టారం అని.. దాని అధికారిని కొట్టారువు అంటారు. ప్రతి కోటలో ఆయన అధీనంలో ఇలాంటి కోష్టాగారాలు నాలుగైదు ఉంటాయి. అక్కడ ఇదొకటి.
‘‘ఇది దుస్తుల కోష్టాగారం కావచ్చు’’ అంది పరిశీలనగా.
ఇద్దరూ ఇక్కడ కాస్త సేదతీరారు. బయటనుండి అరుపులు, పరుగులు, గుర్రాల గిట్టల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మంటలు మరింత విస్తరిస్తున్నట్లు వెలుతురు చిక్కబడుతోంది కూడా.
కాని ఇద్దరికి సౌకర్యవంతమైన ఏకాంతం దొరికింది.
ఇద్దరూ ఓ విశాలమైన పల్యంకంపై దగ్గర దగ్గరగా కూర్చున్నారు.
అప్పుడే పెద్ద అరుపు. ఎవరో దగ్గర నుంచే అరిచారు.
***
ఎక్కే భవనం దిగే భవనంలా ఉంది మందడి కాటయ పరిస్థితి.
భవనాలన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ పెళ్లిమండపం వద్ద ఉండటంతో అడగ డానికి, అడిగినా చెప్పేవాళ్లు ఒక్కరూ కనిపించడం లేదు.
బయట కారాగారాల నుండి బందీలను కోట గోడ దగ్గరున్న మంచెల వరకు తరలించే పనిని మెరుపుదళం ఆపకుండా కొనసాగిస్తోంది. అడ్డొస్తున్న దేవగిరి సైనికులపై మెరుపువీరులు నిర్దాక్షణ్యంగా విరుచుకుపడుతున్నా దేవగిరి సైనికులు కూడా దీటుగానే స్పందిస్తున్నారు. ఇరువర్గాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మరోవైపు మంటలు చండ ప్రచండంగా కోట అంతా వ్యాపిస్తున్నాయి. అనుకోకుండా చాలామంది కోటలోని రాజ వంశీకులు వివాహానికి హాజరు కావడంవల్ల భవనాలు తగలబడుతున్నా ప్రాణాపాయం బహుశా లేదు. పొగ వల్ల ఉక్కిరిబిక్కిరై దగ్గుతూ జనం అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు.
ఓ భవతిలోకి ప్రవేశించాడు మందడి కాటయ.. వెంట నలుగురు వీరులు.
నిర్మానుష్యం.. పెద్ద పెద్ద వరండాలు.. పొడవైన చావడులు.. నడుస్తూ ప్రక్కనున్న మందిరాలలోకి, గదులలోకి సహాయకులు వెళుతూ.. చేతులు తలలు అడ్డంగా ఊపుతూ పెదవి విరుస్తూ.. ముందు ముందుకు పోతుండగా.. ఓ నడవాలో దూరంగా మునగ దీసుకుని మోకాళ్లపై తలపెట్టి కూర్చుని ఉన్నాడో.. నిద్రపోతున్నాడో తెలియని సమాధిస్థితిలో ఓ వ్యక్తి..
చటుక్కున అప్రమత్తమై మెల్లమెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ దగ్గరగా వెళుతుండగా అలికిడివిని చటుక్కున తలెత్తాడా ముడుచుకున్న మనిషి.
నాగతిస్య!!
కాటయను చూడగానే ముడుచుకున్న మనిషి చువ్వలా లేచి నిలబడి అనంతరం వంగి వినయ వందనం చేశాడు. అప్పటికే భయంతో కొంచం కంపిస్తున్నాడు నాగతిస్య.
అతనిని చూడగానే కాటయ ఆగ్రహోదగ్రుడ య్యాడు. కోపాన్ని అణచుకుని, ‘‘ఏడి.. యువరాజుల వారు??’’
ఏదో చెప్పబోయాడు నాగతిస్య. మరో అడుగు వేసి గద్దించాడు కాటయ.
‘‘వారిని నిర్బంధించిన కారాగారం ఎక్కడో.. సమాచారం పంపలేదు ఎందుచేత?’’ మండపంలోని మంటంతా ఆయన మాటలోకి చొరబడినట్టే ఉంది.
మాటలు తడుముకుంటున్నాడు నాగతిస్య.
‘‘సరే. సమయం లేదు. ఏడి.. ఎక్కడ? ఆయన ఉన్నగది ఏది?’’
అడుగుతూనే తలతిప్పి అన్ని వైపులా చూస్తున్నాడు.
‘‘లే.. లేడు.. ఆయన..’’
ఆదిమ మానవుని రాతి గొడ్డలి లాంటి చేయి బలంగా నాగతిస్య ముఖానికి తాకింది. మూడు ప్రదక్షిణాలు తిరిగి క్రింద పడబోయాడు. వెనుకనున్న వీరుడు చటుక్కున ముందుకొచ్చి పడకుండా పట్టుకున్నాడు. మరోదెబ్బ. ఊపిరి ఆగిపోయినట్లు బిర్రబిగదీసుకుపోయాడు నాగతిస్య.
‘‘వెదకండి అన్ని మందిరాలు.. గదులు.. ఊ.. వేగంగా..’’ వెనుకనున్న వీరులు తలో గదిలొకీ వెళ్లి అంతే వేగంగా వచ్చి, ‘‘లేరు మందడి..’’ అన్నారు.
బాధతో విలవిలలాడుతున్న నాగతిస్యను అసహ్యంగా చూస్తూ.. అతన్ని పూచికపుల్లలా లేపి మెడ వెనుగ్గా ఓ చెయ్యి వేసి మరోచేయ్యి బిగించి పొట్ట వైపు చూస్తూ అన్నాడు.
‘‘చెప్పు. సమయంలేదు. ఎక్కడ యువరాజు?’’
చెప్పేది నచ్చకపోతే అతడు చేయబోయే పని నాగతిస్యకు తెలుసు.
‘కుక్షి భేదనం..’ పొట్ట చీల్చి పేగులు బయటకు తీస్తాడు.
దబ్బున క్రిందికి జారిపోయి కాటయ కాళ్లపై పడ్డాడు. ‘‘క్షమించండి దేవరా.. తప్పు.. తప్పు నాదే. యువరాజు గణపతిదేవులవారు పెళ్లిమండపానికి వెళతానని ఆసక్తి చూపి నన్ను తీవ్రంగా ఇబ్బందిపెడితే.. నేనే పంపాను. రెండు లిప్తలలో వచ్చేస్తానని వెళ్లినవాడు..’’
మాట పూర్తి కాకుండానే కాటయ కాళ్లతో తన్నిన తన్నుకు దాదాపు అంత దూరం జర్రున వెళ్లి పడి స్పృహ తప్పాడు.
కాటయ బృందం మంటల్లో తగలబడుతున్న పెళ్లిమండపంలోకి ప్రవేశించింది.
***
కోష్టాగారంలో లేత జంట..
ఆయాచితంగా వచ్చి పడ్డ సౌకర్యవంతమైన మరుగు.
బయట యుద్ధం.. పరుగులు అరుపులు.. కత్తులు.. గుర్రాలు.. వీటిని మించి అగ్నిదేవుని వీరాలాపాలు.. మొత్తం కోటనే చుట్టేస్తున్నాడు. ఆయన చాస్తున్న మంటల నాలికలు దగ్గరగా వచ్చి పోతున్నాయి. అయినా ఆ జంట కొంతలో కొంత ఊపిరి పీల్చుకోవడానికి.. దగ్గరగా కూర్చోవడానికి.. సమయం, ప్రదేశం దొరికినట్లు చిరుమందహాసపు కోసగాలులు ఏవో ఇద్దరి ముఖాలలో..
‘‘ఎలా ఉన్నావో ఇదిగో ఈ దర్పణంలో దర్శించుకో..’’ పాత కవ్వలలా అల్లరిగా అంది కవ్వల. అప్పటికే ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ చమట తుడుచుకుంటూ కంచుకాన్ని సరిచేసు కుంటోంది.
గణపతి కూడా ఖాళీగా లేడు. అక్కడున్న వేలాది దుస్తులలో కవ్వలను తన అభిరుచి మేరకు ఆ చిన్న వెలుతురులోనే బట్టలు వెదకుతున్నాడు.
ఓ పచ్చని ఓణి ఆమెకు అందించాడు.
‘‘చూడు చూడు.. ఇది నీకు బాగా నప్పుతుంది.’’ అంటూ వెళ్లి అద్దంలో చూసుకున్నాడు. తానిప్పుడు ఉన్నది నాగతిస్య ఆహార్యంలో. మీసం, బుగ్గనున్న నల్లని పులిపిరి తొలగించుకున్నాడు. మళ్లా ఆ బట్టల్లో వెదికి ఓ పట్టు పంచెను తీసి కట్టుకున్న పంచెను తొలగించుకుని ఆ కొత్త పంచె కట్టుకోబోయాడు. ఆమెకో చిలిపి ఊహ. చిరునవ్వుతో కదిలింది.
అప్పుడు జరిగిందిది.
దగ్గరలో ఏదో భవనం పెద్ద శబ్దంతో కుప్పకూలిన శబ్దం.
భయపడి అతన్ని కరుచుకుపోయింది. బలిష్టమైన వృక్షాన్ని ఓ లేలేత తీగె అల్లుకున్నట్లు.. ఆమెను తనవైపు అదుముకున్నాడు ఆర్తిగా. ఏదో అనబోయాడు.
మళ్లీ ఫెళఫెళ ధ్వని. ఏదో పెద్ద చెట్టు దగ్గరగా.. లేదా ఇదే భవనంపై పడినట్లు.. ఆమెను అలాగే ఎత్తుకుని లోపలి గదుల్లోకి పరుగుపెట్టాడు. ఓ చోట మూలగా ఓ గవాక్షం. అందులో కూర్చుని ఆమెను అలాగే హత్తుకుని మరి కొంత తన వైపు అదుముకున్నాడు. అతని ప్రతి చర్యా ఆమెను మరింత మురిపిస్తోంది. భయపడుతున్న మనసుకు స్వాంతన కలిగిస్తోంది. కొత్త బ్రతుక్కు ఆశలు కలిగిస్తోంది. ఇప్పుడామెకు మరుక్షణం ఏమౌతుంది అనే భయం లేదు. ఈ బలిష్ట కౌగిలింత శాశ్వతమైతే చాలు.
లిప్తలలోనే ఆ కౌగిలి మరింత బిగిసింది.
అలాగే మరి కాసేపు.. ఆ గాఢ పరిష్వంగంలో.. అది కేవల స్నేహమో, ప్రేమో, కామమో, వాంచో.. కుర్రతనమో, అప్పుడే వికసిస్తున్న అనుబంధమో.. మరేదో ఆ బంధం శాశ్వతమని.. ఇద్దరూ ప్రగాఢంగా నమ్ముతున్నవేళ..
దగ్గరగా మంటలు.. భవనం వెనుక వైపుగా అంటుకుని భవనమంతా వ్యాపించినట్లు.. మొత్తంగా విపరీతమైన పొగ, దగ్గు ఆ గాఢ పరిష్వంగాన్ని విడదీశాయి. దట్టంగా వ్యాపించిన పొగలో ఏమీ కనిపించక.. విపరీతమైన దగ్గుతో.. ఇద్దరూ విడివడి దబ్బున క్రిందికి పడిపోయారు. దగ్గు ఊపిరి సలపనివ్వడం లేదు.
దగ్గరగా ఎవరో లోపలికి వస్తూన్న చప్పుడు తెలుస్తోంది కానీ కంటికి ఏమీ కనిపించడంలేదు. మంటల వేడి తీవ్రత మరీ దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నట్లు అర్ధమౌతోంది.
ఎవరో చివ్వున లాగినట్లు కవ్వల పెనుకేక వేసింది. గణపతిదేవుడు కదిలి వేగంగా చేతులు ఊపాడు. ఎవ్వరూ ఏమీ తగలలేదు.
‘‘అమ్మో..’’ మళ్లీ చావుకేక వేసింది కవ్వల.
గణపతి లేచి ఏదో కాలికి తగిలి పడిపోయాడు. కవ్వల భీకరమైన అరుపులు.. ఎవరో ఆమెను నేలపై ఈడ్చుకుంటూ లాక్కుపోతున్నట్లు.. చావుకేకలు.. అయ్యా.. దేవుడో.. ఏడ్పులు.. ఆర్తనాదాలు.. మధ్య మధ్య ‘‘మమ్మల్ని వేరు చెయ్యొద్దు..’’
బరబరా ఈడ్చుకుపోతున్నట్లు.. చావుకేకలు.. అరుపులు.. ఏడ్పులు.. పెడబొబ్బలు..
అలా ఆ ఆర్తనాదాలు.. లాక్కోనిపోతున్నట్లు.. కొమ్మలని గొడ్డలితో నరుకుతున్నట్లు.. వినిపిస్తోంది. దుస్తులు చింపేసినట్లు..
‘‘దేవుడా నన్ను చంపేయ్..’’ కవ్వలదే ఎప్పటికీ చెవులలో మార్మోగే దయనీయ వేడుకోలు.
‘‘ఎవడ్రా నువ్వు.. నన్ను చంపేయ్..’’ ఆ గొంతు లోని ఆర్తి భయపెడుతోంది. అవతల చీకట్లో, కమ్మేసిన పొగలో ఎంత దారుణం జరుగుతున్నదో చెబుతోంది.
భవనమంతా మంటలు వ్యాపిస్తున్నాయి. లేచి నడవబోయి పడటం.. అక్కడక్కడే లేవడం.. పడటం.. గణపతి అశక్తునిలా.. కవ్వలపై జరుగుతున్న దారుణ హింస అర్ధమవుతోంది. కానీ అశక్తుడు. అడుగు ముందుకు వేయలేని అశక్తుడు. భవనమంతా వ్యాపించిన మంటల నుంచి తప్పుకోవడమే పెను ప్రయాసకు గురి చేస్తోంది.
మరి వినలేనట్లు చెవులు మూసుకున్నా.. మరి కాసేపు.. అలా అలా మరో కొన్ని నిమిషాలు ఆమె ఆర్తనాదాలు వినవస్తూనే ఉన్నాయి. మంటల చిటపటలు.. పెద్దపెద్ద ప్రేలుళ్ల మధ్య ఆమె ఆర్తనాదాలు మూలుగులా మారి, క్రమేపి నిలిచి పోయాయి. గుండె నిండా ఘాటు పొగ. గణపతి కొన్ని లిప్తలాగితే ప్రాణం పోతుందనిపిస్తోంది. అప్పుడే ప్రక్కనున్న గవాక్షం పెద్దశబ్దంతో పేలి పడిపోగా అక్కడ పెద్ద కంత ఏర్పడిరది. చటుక్కున అటు దూకి మందిరం నుండి బయట పడ్డాడు. పెళ్లిమంటపం వెలుగులో అంతా కనిపిస్తున్నది.
వినిపించకుండా రోదిస్తూ అంతా వెదుకుతు న్నాడు. కవ్వల… ఇక్కడే ఎక్కడో.. కళ్లు చిట్టించి చూస్తున్నాడు. అప్పుడే ఆమె కట్టుకున్న ఓణిముక్క గాలికి ఎగిరొచ్చి కాలికి చుట్టుకుంది. పిచ్చికేక పెట్టాడు. జీవితంలో తొలిసారి భయంతో వణికి పోతూ విహల్వంగా.. గుండె పగిలేలా ఏడుస్తు న్నాడు కాకతీయ యువరాజు గణపతిదేవుడు. ఏడుస్తూనే దగ్గరగా దూరంగా నేలంతా చేతులతో తడుముతున్నాడు.
తెగిన ఓ చెయ్యి.. ఇంకా రక్తం స్రవిస్తోంది. అది సన్నగా కోమలంగా.. సందేహం లేదు. ఓ ఆడదాని చెయ్యి.. కుప్పకూలిపోయాడు అక్కడే. తనను గాఢంగా పట్టుకున్న.. తన శరీరాన్ని పెనవేసుకున్న.. రకరకాలుగా వెక్కిరింతతో తనను వేళాకోళం చేసిన ఆ చెయ్యి.. ఎవరికి అన్యాయం చేసిందీ పిచ్చిది.. అంతఃపురం తప్ప అన్యం తెలియని అసూర్యంపశ్య..
ఎవరు? ఎందుకు?.. ఖండ ఖండాలుగా నరికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది??
వణికిపోతున్నాడు. ముందుకు, ప్రక్కలకు చూస్తూ వెదకుతున్నాడు. నిప్పుల వెలుగులో. అదిగో అక్కడ కాలు. గబగబా పాక్కుంటూ వెళ్లి చూశాడు. అతని అనుమానం నిజమయ్యింది.. అది కవ్వల కాలు. వెచ్చని రక్తం కారుతున్న కాలు. మరింత దూరం చూపు సారించి చూశాడు. అదిగో అది మరో కాలు. అది మరో చెయ్యి. అదిగో సగం తెగిన శరీరం. ఖండఖండాలైన అందమైన శరీరం. ఆవలగా సగం నరికిన తల.. జుత్తున్న తల భాగం..నరికినట్లు.. అవతలగా సగం నరికిన ముఖం. ఓ కన్ను తెరచి ఉంది. తనకోసమే వేచి చూస్తున్నట్లు. ఒళ్లోకి తీసుకున్నాడు. తనివితీరా చూశాక మూసుకుంది.
స్పృహ తప్పాడు గణపతి.. పదిహేడేళ్ల లేత ప్రేమికుడు!!
(సశేషం)