భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

ఇంద్రగంటి నరసింహమూర్తి

సెల్‌లో వాట్సప్‌ ‌మెసేజెస్‌ ‌చూస్తున్నాను.

‘ఈరోజు దసరానాడు మా కుటుంబ సభ్యులు, బంధువులందరం కలిసి మా ఇంట్లో హుషారుగా పండుగ జరుపుకున్నాం. నా బాబయ్యలు, మావయ్యలు వారి పిల్లలు అందరం ముప్పైమంది ఒకేచోట కలవడం మర్చిపోలేని అనుభూతి’ అంటూ వారి ఫొటోతో కూడిన సందేశం ఒక సమూహంలో చూస్తూంటే నా మనసు ఆనందంతో పులకరించింది. ఈ కాలంలో బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. పెళ్లిళ్లలో కలిసినా ముహూర్త సమయానికి రావడం, అక్షింతలు వేయడం, భోజనాలు చేయడం, వీడ్కోలు పలకడంతో సరిపోతోంది.

శ్రీవారికి గ్రూపులో వచ్చిన ఫొటో, వివరాలు చూపించాను.

‘‘బాగుంది’’ అన్నారు సింపుల్‌గా. వంటింట్లో అడుగుపెట్టాను.

వంట చేస్తుంటే మదిలో ఆలోచనలు మెదల సాగాయి. వంట పూర్తి చేసేసరికి నా ఆలోచనలు కొలిక్కి వచ్చాయి.

‘‘శ్రీవారూ..! నాకో మంచి ఆలోచన వచ్చింది’’ అన్నాను చీరకొంగుకు చేతులు తుడుచుకుంటూ.

 ‘‘ఆలోచన నీది.. కార్యాచరణ నాది. చెప్పు శ్రీమతీ..!’’ అంటూ పేపర్‌ ‌పక్కన పడేసారు.

‘‘ఈసారి సంక్రాంతికి మన ఆత్మీయులందరినీ మన ఇంటికి ఆహ్వానిద్దాం. మన పిల్లలను, అక్కగారిని, మీ అన్నయ్యలను ,మా అన్నయ్యను, తమ్ముణ్ణి, చెల్లిని, వాళ్ల పిల్లలను అందరినీ ఆహ్వానిద్దాం. పండుగ మూడు రోజులు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ హౌసీ లాంటి ఆటలు ఆడుకుంటూ గడుపుదాం. ఏమంటారు?’’ అన్నాను.

‘‘వావ్‌.. ‌మంచి ఆలోచన.. మన అమ్మాయి పెళ్లి తరువాత గత ఏడెనిమిది సంవత్సరాలుగా మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమీ లేవు. నేను పదవీ విరమణ చేసి అయిదేళ్లవుతోంది. మన ఆత్మీయులు వారి పిల్లలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌, ‌బెంగళూరు వంటి నగరాలలో స్థిరపడడం మనం ఈ రాజమహేంద్ర వరాన్ని వదలకపోవడంతో మన ఇంటికి చుట్టాలు రావడం తగ్గిపోయింది. ఏదో ఒక అకేషన్‌ ‌లేకుండా ఎవరూ రావడం లేదు. అందుకే సంక్రాంతి సెలబ్రేషన్స్ అం‌టూ అందరినీ పిలుద్దాం.ముందర మన పిల్లలకు ఫోన్‌ ‌చేద్దాం. వాళ్లు వస్తానంటే కార్యక్రమం ప్లాన్‌ ‌చేద్దాం’’ ఉత్సాహంగా చెప్పారు శ్రీవారు.

రాత్రి బెంగుళూరులో ఉన్న అమ్మాయి సాహితికి ఫోన్‌ ‌చేశాను.

‘‘సంక్రాంతి పండుగకు తప్పక వస్తాం. ఓ వారం రోజులు అందరితో సరదాగా గడుపుతాం. పిల్లలతోటి పృథ్వి తోటి మాట్లాడి కన్ఫర్మ్ ‌చేస్తా’’ చెప్పింది సాహితి.

‘‘అన్నయ్యతో కూడా మాట్లాడు. మీరు కుటుంబాలతో వస్తానంటే మిగిలిన వారికి చెప్తా’’ అన్నాను. యోగక్షేమాలు మాట్లాడి ఫోన్‌ ‌కట్‌ ‌చేశా.

మరునాడు ఢిల్లీలో ఉన్న అబ్బాయి హేమంత్‌ ‌ఫోన్‌ ‌చేశాడు.

‘‘అమ్మా.. నువ్వు సంక్రాతికి గెట్‌ ‌టుగెదర్‌ ‌ప్లాన్‌ ‌చేశావుటగా’’ అడిగాడు హేమంత్‌.

‘‘అవునురా.. అందరం కలిసి చాలా రోజుల యింది. మావయ్య పిల్లలు, మీ పెదనాన్న గారి పిల్లలు అందరం కలుద్దాం. మీరు ఒకరినొకరు చూసుకుని చాలా ఏళ్లయిందిగా’’ అన్నాను.

‘‘అవునమ్మా. మావయ్య పిల్లలను పెదనాన్నగారి పిల్లలను చూసి చాలా ఏళ్లయింది.’’అన్నాడు హేమంత్‌.

 ‘‘అవునురా. ఉద్యోగరీత్యా అందరూ తలోచోట ఉన్నారు. అందరినీ ఒకసారి కలపడానికే ఈ మూడు రోజుల సమావేశం.’’ అన్నాను.

‘‘మేము వస్తాం.’’ అన్నాడు హేమంత్‌..

‘‘సంక్రాంతి పండుగకు రిజర్వేషన్స్ ‌రెండు నెలల ముందుగా చేసుకోవాలి. అందుకే మనవాళ్లందరికి చెపుతాను’’ అన్నాను ఉత్సాహంగా.

                                                                                                 *        *       *

అనుకున్నట్టే మా అన్నయ్యకు, తమ్ముడికి ఫోన్‌ ‌చేశాను. తమ్ముడు హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యాడు. వాడి పిల్లలు బెంగళూరు. అన్నయ్య విజయవాడలో సెటిల్‌ అయ్యాడు. వాడి పిల్లలు అమ్మాయి పూణే. అబ్బాయి భోపాల్‌. ‌తమ్ముడికి నలుగురు మనుమలు, అన్నయ్యకు ముగ్గురు మనుమలు. అన్నయ్య పిల్లలకు, తమ్ముడి పిల్లలకు ఫోన్‌ ‌చేసాను. నా చెల్లెలుకి ఫోన్‌ ‌చేశాను. అది విశాఖపట్నంలో ఉంటుంది. పిల్లలు కాలేజీ చదువులు.

శ్రీవారు ముంబైలో ఉంటున్న ఆయన అక్కయ్యకు, వారణాసి నివాసి పెద్ద అన్నయ్య, బెంగుళూర్‌ ‌వాసి చిన్నన్నయ్యలకు ఫోన్‌ ‌చేశారు. వాళ్ల పిల్లలకూ సమాచారం వెళ్లింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న అందరూ మా ఇంటి సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోవడానికి ఉత్సాహం చూపించారు.

వెంటనే శ్రీవారు ఆయన పేరున ‘‘కృష్ణకాంత్‌ ఆప్త కదంబం’’ అని వాట్సప్‌ ‌గ్రూప్‌ ఏర్పాటు చేశారు. అందులో మేము ఆహ్వానించిన వాళ్లందరి సెల్‌ ‌నంబర్స్ ‌చేర్చాం.

‘‘సంక్రాంతి ఆత్మీయ సమావేశం’’ అని శ్రీవారొక ఆహ్వానపత్రం తయారు చేశారు. ఆ ఆహ్వానపత్రం గ్రూప్‌లో షేర్‌ ‌చేశారు.

ఆత్మీయుల నుండి సందేశాలతో గ్రూప్‌ ‌నిండిపోసాగింది. శుభోదయాలు, వైద్య చిట్కాలు వంటి సందేశాలు హోరెత్తసాగాయి.

రోజులు పరిగెడుతున్నాయనిపించింది.

డిసెంబర్‌ ‌పదో తారీకున అందరికీ మరోసారి ఫోన్‌ ‌చేసాం. మొత్తం ఇరవై నాలుగు మంది వస్తున్నట్లు లెక్క తేలింది.

మేము గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో ఉంటాం. నెలక్రితమే ఫస్ట్‌ప్లోర్‌లో అద్దెకున్న వాళ్లని ఖాళీ చేయమన్నాం. వాళ్లు  రెండురోజుల క్రితం వెళ్లిపోయారు.

మేము మూడురోజులు అందరికీ సౌకర్యంగా ఉండడానికి ఏర్పాట్లు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం. పైన నాలుగు గదుల్లో పరుపులు అద్దెకు తెచ్చి పరిపించాలనుకున్నాం. మూడురోజులకు వంటలక్కను మాట్లాడాం.

కావలసిన సరుకులు మూడు రోజుల ముందే తెచ్చుకోవాలనుకుంటూ లిస్ట్ ‌తయారుచేసాం. పెద్దలకు, పిన్నలకు వారికి తగ్గ బట్టలు పెట్టాలని ఈ నెలలోనే బట్టలు కొనాలని నిర్ణయించాం.

మూడు రోజులు బ్రేక్‌ఫా•స్ట్‌కు, లంచ్‌, ‌డిన్నర్లకు ఐటమ్స్ ‌లిస్ట్ ‌తయారు చేశాం.

‘‘ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, అరిసెలు ముందురోజు కొందాం. వంట మనిషి చేత ముందురోజు జంతికలు, చక్కిలాలు, గులాబ్జామ్‌, ‌మైసూర్‌ ‌పాక్‌ ‌చేయిస్తాను.’’ అన్నాను హుషారుగా.

 ‘‘అలాగే చేయించు. అటకమీద ఉన్న కేరమ్స్ ‌బోర్డు దింపుదాం. హౌసీ కొంటాను. అందరం కలిసి ఆడుకోవచ్చు. చెస్‌ ఎలాగూ ఉంది.’’ అన్నారు కృష్ణకాంత్‌.

‘‘సాయంత్రం స్నాక్‌గా మొదటి రోజు బోండా, రెండో రోజు బజ్జి, మూడోరోజు సమోసా చేయిస్తాను’’ అన్నాను.

 ‘‘కిచెన్‌ ‌వ్యవహారం నీ ఇష్టం. బజార్‌ ‌నుండి ఏం తేవాలో లిస్ట్ ‌తయారుచేయడం నీ పని. ఆ వస్తువులు తెచ్చి నీకు అందించడం నా కర్తవ్యం’’ చెప్పారు కృష్ణకాంత్‌.

‌వంటలక్క సహాయంతో కూరలతో సహా కావలసిన పదార్థాల లిస్ట్ ‌తయారయింది.

గ్రూప్‌ ‌లో మరోసారి ఆహ్వానపత్రం పెట్టాం.

                                                                                                 *        *       *

జనవరి పన్నెండు…..నాలో ఒకరకమైన ఆనందంతో కూడిన ఆత్రుత… భావోద్వేగం… ఆ సాయంత్రం మా అబ్బాయి, కోడలు, మనవలు వచ్చారు.

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రిసీవ్‌ ‌చేసుకున్నాం. ఆప్యాయంగా అందరినీ దగ్గరకు తీసుకున్నాం. నా మనసు ఆనందభరితమైంది.

ఇంటికి బయలుదేరుతుంటే. అబ్బాయి హోటల్‌లో రూం బుక్‌ ‌చేసానన్నాడు.

‘‘మన బంధువులందరూ వస్తున్నారు. ఇల్లు సరిపోదు.. మేం హోటల్‌కు వెడతాం.. రేపు ఉదయమే ఇంటికి వస్తాం. పగలు మన ఇంట్లో, రాత్రి  హోటల్లో గడుపుతాం.’’ అంటూ వాళ్లు వేరే టాక్సీలో హోటల్‌క•• వెళ్లారు. మరో గంట తరువాత బెంగళూరు విమానంలో అమ్మాయి, అల్లుడు, మనవడు దిగారు.

కాసేపు పలకరింపులతో పులకరించాం.

‘‘అన్నయ్య దిగిన హోటల్‌లోనే మాకు స్పెషల్‌ ‌రూం బుక్‌ ‌చేశాడు.’’ అంటూ వాళ్లు  వెళ్లిపోయారు. మాలో నిరుత్సాహం…నెమ్మదిగా కార్లో ఇంటికి వచ్చాం. పిల్లలు రాగానే తింటారని చేసిన ఆహార పదార్థాలు చూస్తూ నిట్టూర్చాను. నాకు రాత్రి ఏమీ తినాలనిపించలేదు. శ్రీవారు మజ్జిగ అన్నంతో సరిపెట్టుకున్నారు. తెల్లవారగానే.. భోగి పండుగ..

బంధువుల నుంచి  ఫోన్స్ ‌వస్తున్నాయి. రైల్లో దిగినవారు స్టేషన్‌ ‌నుండే హోటళ్లలో  రూంలు బుక్‌ ‌చేసుకున్నామంటూ వెడుతున్నారు.

‘‘మేం స్నానాలు చేసి దాక్షారం, కోటిపల్లి వెడు తున్నాం. సాయంత్రం నాలుగింటికి మీ ఇంటికొస్తాం’’ చెప్పాడు అన్నయ్య.

తమ్ముడు చెల్లెలి కుటుంబాలు ర్యాలీ, వాడపల్లి వెడుతున్నారుట. ఆడపడుచు బావగార్లు వెదురుపాక గాడ్‌ ‌గారిని కలిసి అక్కడ నుండి బిక్కవోలు వెడతారుట. సాయంత్రం నాలుగింటికి మా ఇంటికి వస్తామన్నారు. ఎవరికి వారు వారి పోగ్రామ్స్ ‌తెలియజేసారు.

మా అమ్మాయి నీరసంగా ఉందని, ఈ పూటకు రెస్ట్ ‌తీసుకుని సాయంత్రం వస్తామని చెప్పింది. ‘‘అదేంటమ్మా.. పాతిక మందికి వంటచేయాలని చెప్పి ఇప్పుడు అరుగురికే వంట చేయమంటున్నారు. పాతిక మంది కదాని మా అక్కను సహాయానికి తీసుకు వచ్చాను’’ అంటున్న వంటలక్కకు ఈ పూటకు ఇంతే అంటూ చెప్పాను.

అబ్బాయి, కోడలు, మనవలు ఉదయమే వచ్చారు. పెద్ద మనవడు ఎనిమిదో క్లాస్‌, ‌చిన్నవాడు ఆరో క్లాస్‌లో ఉన్నారు.

బ్రేక్ఫాస్ట్ ‌చేసాక ఫస్ట్ ‌ఫ్లోర్‌ ‌ఖాళీగా ఉండడం చూసి అబ్బాయి, కోడలు లాప్టాప్‌తో ఫస్ట్ ‌ఫ్లోర్‌కు వెళ్లిపోయారు. నేను శ్రీవారు మనవలతో కేరమ్స్ ఆడాం.

బంధువులందరం కలిసి భోగి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలను కున్నాను. కాని అందరు తలోదిక్కు వెళ్లడంతో కాస్త నిరుత్సాహ పడ్డాను.

లంక అబ్బాయి, కోడలు దిగారు.

అందరం డైనింగ్‌ ‌టేబుల్‌ ‌దగ్గర చేరాం. వంకాయ కొత్తిమీర కారంతో చేసిన కూర.. ఆమ్మో నూనె బాగా ఉంది…వద్దు అన్నాడు అబ్బాయి. పులిహార కొంచెం పెట్టించుకున్నా…బొబ్బట్లకు చెయ్యి అడ్డంపెట్టాడు. సుగర్‌,  ‌కొలెస్ట్రాల్‌ ‌పెరుగుతాయాని స్వీట్స్ ‌మానేసారుట. అన్నం తగ్గించారుట. కోడలూ మనవలదీ అదే తీరు.

‘‘అదేమిట్రా.. సంవత్సరం క్రితం అన్నీ తినేవాడివిగా’’ అన్నాను.

‘‘ఇప్పుడు రోజులు మారాయి అమ్మా. వాట్సప్‌ ‌లో రోజూ వచ్చే సందేశాలు చూడు. ఇప్పుడు ఏది తినాలో, ఏమి తినకూడదో పిల్లలకు కూడా తెలుస్తోంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే రోగాల బారిన పడతాం’’ చెప్పాడు అబ్బాయి.

వాళ్లు నలుగురు పప్పు, మజ్జిగతో సరిపెట్టు కున్నారు. వండిన పదార్థాలు అలాగే ఉండిపోయాయి. సాయంత్రం నాలుగు గంటలకు బిలబిలమంటూ ఆత్మీయులందరు మా ఇంటికి చేరుకున్నారు. పిన్నలు పెద్దలకు పాదాబి •వందనాలు… అరేయ్‌ ఒరేయ్‌ ‌పలకరింపులు.. బ్రో..పిన్నీ బాబాయ్‌ అం‌టూ ఆత్మీయ కౌగలింతలు…కరచాలనాలు… సందడి మొదలయింది. గంట హడావిడి తరువాత టీలు వచ్చాయి. గ్రీన్‌ ‌టీ అన్నవారికి గ్రీన్‌ ‌టీ అందింది.

చాలా ఫొటోలు తీసుకున్నాం. మా పెరట్లో మామిడి చెట్టు క్రింద చాలా గ్రూప్‌ ‌ఫోటోలు వివిధ భంగిమలలో తీసుకున్నాం.

డిన్నర్‌ ‌ప్రస్తావన వచ్చింది. నా మెనూ చూపించాను.

అమ్మో.. అన్ని ఐటమ్స్ ‌తినలేం… రెండు చపాతీలు.. ఆలు కర్రీ చాలన్నారు.

వాళ్లు చెప్పినట్టు చేయమని వంటలక్కకు చెప్పాను.

ఇంతలో.. పది… ఇరవై.. ముప్పయ్‌… అం‌టూ లెక్కలు.. బావగార్ల పిల్లల అరుపులతో హాల్‌ ‌దద్దరిల్లింది. ‘‘ఏమిటా లెక్కలు’’ అంటున్న శ్రీవారికి

‘‘ఆప్త కదంబం సంక్రాంతి సంబరాలు కాప్షన్‌తో మన ఫొటోలు పేస్‌బుక్‌లోను, వాట్సప్‌ ‌గ్రూప్స్‌కి షేర్‌ ‌చేశాం. అంతే.. వెంటనే లైక్స్ ‌రావడం మొదల యింది. అభినందన సందేశాలు వర్షంలా కురుస్తు న్నాయి.. మా ఆనందానికి కారణం ఇదే’’ అన్నారు అబ్బాయిలు, అమ్మాయిలు.

‘‘మన గ్రూప్‌ ‌ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.. వావ్‌.. ‌గ్రేట్‌.’’ అం‌టూ డాన్స్ ‌చేస్తున్నారు యువతీ యువకులు.

వాళ్లని చూస్తున్న పెద్దల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

అందరు అందరితో ఉత్సాహంగా కబుర్లు, వాళ్ల ప్రాంత విశేషాలు చెబుతుంటే నాలుగు గంటలు  నాలుగు నిమిషాల్లా దొర్లిపోయాయి. చపాతీ ప్లేట్స్ అం‌దరికీ అందించాను.

రెండు అన్నారు కాని కొందరు ఒక చపాతీ మాత్రమే తిన్నారు. స్వీట్లు ఎవరూ ముట్టుకోలేదు. పెద్దలకు సుగర్‌.. ‌పిల్లలకు సుగర్‌ ‌వస్తుందేమోనని భయం…

డిన్నర్‌ అయిందనిపించారు. మళ్లీ  ల•కాభి రామాయణం …ముచ్చట్లు… రాత్రి పదిగంటలకు అందరూ బయలుదేరుతుంటే

‘‘రేపు సంక్రాంతి. అందరూ ఉదయమే వచ్చేయండి’’ అన్నాను.

‘‘అబ్బే.. రేపుకూడా ఇలాగే సాయకాలం వస్తాం.. ఉదయం గోదావరిలో స్నానం చేసి చుట్టుపక్కల దేవాలయాలన్నీ చూడడానికి వెడతాం..టాక్సీలు ఆల్రెడీ బుక్‌ ‌చేసుకున్నాం’’ అన్నారు.

అమ్మాయిని రమ్మంటే

‘‘మీ అల్లుడి స్నేహితులు వస్తానన్నారు. వాళ్లతో పట్టిసీమ వెడదామని ప్లాన్‌ ‌చేశాం. సాయంత్రం వస్తాగా’’ అంది.

నేనింక మాట్లాడలేదు.

వచ్చిన వాళ్లు వెళ్లిపోయారు. అబ్బాయి, కోడలు, మనవలు హోటల్‌కు వెళ్లారు.

ఎప్పటిలాగే మేం మిగిలాం. ఒకరికొకరం …

ఆరు గంటల ఆత్మీయ సమావేశం మనసును మురిపించింది. కాస్త ఉత్సాహం.. కొంచెం నిరుత్సాహం… కలగలిసిన భావోద్వేగం… ఆ రాత్రి కలత నిద్ర అయింది.

సంక్రాంతి పండుగ..

ఉదయమే ఇంటిముందు పెద్ద ముగ్గు పెట్టాను. హేమంత్‌, ‌కోడలు మనవలు హోటల్‌ ‌నుండి వచ్చారు. పెద్ద పండుగనాడు మనవలతో కలిసి భోజనం చేయడం ఆనందదాయకమైంది.

మధ్యాహ్నం రెండింటికి మా అన్నయ్య హడావుడిగా వచ్చాడు. ‘‘నాలుగింటికి మా ట్రైన్‌. ‌మీ ఆతిథ్యానికి  థాంక్స్’’ అన్నాడు.

‘‘రేపు కూడా ఉంటారనుకున్నాం’’ అన్నాను కంగారుగా.

‘‘కనుమ నాడు బయలుదేరకూడదుగా. అందుకే ఈరోజు ప్రయాణం’’ అంటూ ఓ గంట కూర్చుని నాకూ, కృష్ణకాంత్‌కు మరోసారి థాంక్స్ ‌చెప్పి మా కుటుంబ సభ్యులతో ఒక సెల్ఫీ తీసుకుని బయలు దేరాడు. మిగిలిన వారు కూడా ఒక్కొక్కరు  రావడం… ట్రైన్‌ ‌టైం.. ఫ్లయిట్‌ ‌టైం అవుతున్నాయంటూ బయలు దేరడం జరిగింది.

అమ్మాయి వాళ్ల అత్తగారింటికి వెళ్లాలని బయలు దేరింది.

‘‘పండుగ రెండు రోజులు మీ ఇంట్లో ఆనందంగా జరుపుకున్నాం. ఓ రెండు రోజులు మా అత్తయ్య గారింట్లో గడుపుతాం’’ అంటూ వాళ్లు వెళ్లిపోయారు.

ఇంటి ముందు కాబ్‌ ఆగింది. ఎవరి కోసమో అనుకుంటుంటే…

‘‘రేపు కనుమకదా. అందుకే ఈ రోజు మీ కోడలు పుట్టింటికి వెడుతున్నాం. ఈ రెండు రోజులు మనవలతో బాగా ఎంజాయ్‌ ‌చేసారనుకుంటాను. పిల్లలకు వేసవి శలవులలో మీరు ఢిల్లీ రండి.’’ అంటూ తల్లితండ్రులకు పాదాభివందనం చేసి బయలుదేరాడు హేమంత్‌… ‌భార్యా బిడ్డలు అనుసరించారు.

వాళ్లను  సాగనంపాక వంటలక్క వచ్చింది.

‘‘రాత్రి డిన్నర్‌కు ఎంతమందికి ఏం చేయ మంటారు’’ అడిగింది.

 ‘‘మీ అవసరం లేదు. వెళ్లి రండి’’ అన్నాను.

ఆమెకు ఇవ్వవలసిన మొత్తం ఇచ్చేసాను.

అందరూ వెళ్లిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం.

కుర్చీలో కూర్చున్నాను.కళ్లమ్మట నీళ్లు… మనసులో తెలియని బాధ…

‘నేనూహించిందేమిటి… జరిగిందేమిటి… మూడు రోజులు అందరం కలిసి ఆనందంగా గడపాలను కున్నాను. అందరూ రెండు రోజులు రాజమండ్రిలో ఉన్నా మా ఇంట్లో గడిపింది ఆరు గంటలే’ అనుకుంటే ఏదో అసంతృప్తి…

నా మనసులో భావాలు శ్రీవారితో పంచు కున్నాను.

‘‘ఆత్మీయులతో మూడురోజులు గడిపామా… ఆరు గంటలా అని లెక్కించకు. వారి మనసులో మనమీద ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదని గ్రహించు. ఈ మలి సంధ్యలో మన బలం ఈ ఆప్త కదంబమే. మన శక్తి మన బంధువులే. దగ్గర్లో ఉన్నా దూరంలో ఉన్నా ఈ అభిమానమే మన భద్రత. కాలం వేగంగా మారుతోంది వసుధా..! మనమూ మారాలి. ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ప్రస్తుత యువత జీవన స్థితిగతులు మారాయి. అంతా స్పీడ్‌.. ‌స్పీడ్‌..

‌తీరిక లేని జీవితం గడుపుతున్నా మన అభ్యర్థనను మన్నించి అంత దూరం నుండి ఖర్చుకు వెనకాడకుండా మన ఊరు వచ్చికొన్ని గంటలు మన మనసులను ఉల్లాసపరచిన బంధువులను అభినందిద్దాం. ఇక్కడ ఉన్న రెండురోజులు చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు దర్శించి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారి ఉత్సాహానికి జేజేలు పలుకుదాం. రేపు ఏఐ (కృత్రిమ మేధ) ఆవిష్కరణతో ఇంకా ఎన్నో మార్పులు చూడబోతున్నాం. మన పాతతరం కూడా ఆ నూతన ఆవిష్కరణల స్ఫూర్తినందుకోవాలి. లే.. టీ పెట్టు.. టీ తాగుతూ టీవీలో సినిమా చూద్దాం’’ అన్నారు కృష్ణకాంత్‌. ‘అవును కదా ఆ ఆరు గంటలు చిన్నారుల కేరింతలు, యువతీ యువకుల ముచ్చట్లు, పెద్దల హితోక్తులతో మన ఇల్లు కళకళ లాడింది.’ అనుకుంటూ ఆ ముచ్చట్లు మదిలో పదిల పరచుకుంటూ ఉత్సాహంగా వంటగదిలో అడుగుపెట్టాను.

About Author

By editor

Twitter
YOUTUBE