‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

ద్వారసముద్ర పట్టణం.. హోయసల రాజధాని..

బల్లాలదేవుని మంత్రాంగ మందిరం. బల్లాల దేవుడుది నిండైన విగ్రహం. బలిష్టమైన శరీరం. ముఖం కూడా కరుగ్గా దృఢంగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా కనిపించే నాసిక. పైన పెద్ద పెద్ద కనుదోయి. వాటితో వాత్సల్యం కురిపించగలడు. ఆగ్రహాన్ని ప్రకటించగలడు. వాత్సల్యమైనా ఆగ్రహ మయినా ఏది ఎంతవరకు ప్రకటించాలో తెలిసిన మహా జాణ.

ఇప్పుడాయన ముఖం ముప్పిరిగొన్న విశేష ఆనంద, సంతోష, వాత్సల్యాల సందోహంతో పులకించిపోతోంది.

కారణం- దేవగిరి కారాగారాల నుండి దాదాపు వందమంది హోయసల బందీలను క్షేమంగా దేవగిరి కోట దాటించి కాకతీయ బందీలలో పాటు హోయసల బందీల ఆరోగ్యాలను కూడా బాగుచేసి ద్వారసముద్రం తీసుకు వచ్చి తనకు అప్పగించడం.

ఆయన ఈ సంగతి విని ముందు నిజమా కలా అని గందరగోళమైపోయాడు.

తన ముందు నిలబెట్టిన తన వీరులను చూసుకుని పులకాంకితుడయ్యాడు.

వారిని తోడ్కొని వచ్చిన కాకతీయ మహాసేనాని రేచర్ల రుద్రయను, మహాప్రధాని గంగాధరుని.. ఒకరో ఇద్దరో కాదు వెయ్యిమంది కాకతీయ బందీలను, వందమంది హోయసల బందీలను క్షేమంగా బయటకు తెచ్చిన దళం నిర్వాహకుడు మందడి కాటయను.. సంభ్రమాశ్చర్యాల మధ్య గాఢంగా హత్తుకుని వారికీ భూరి బహుమతులను ప్రకటించి పరవశించాడు భల్లాలుడు.

‘‘గొప్ప ఉదంతం ఇది. ఇలా గతంలో జరిగినట్లు వినలేదు గంగాధరా! రుద్రయ వీరవిక్రమ విన్యాసాలు నాకు కరతలామలకమే గాని.. ఇది.. ఇది..’’

ఆయన సంతోషాతిరేకాలలో అందరూ పాలు పంచుకున్నట్లు నవ్వుతూ ఆయనను మరింత సంతోషపెట్టారు.

ఆ సమావేశంలో హోయసల సంధివిగ్రహి కన్నడదాసు, కాకతీయ సందివిగ్రహి పాపయ భట్టారకుడు కూడా ఉన్నారు. అంతా ఈ సంతోష సమయాన్ని పండుగలా జరుపుకున్నారు. భల్లాలుడు విందు ఏర్పాటు చేశాడు. గతంలో కాకతీయ మహావీరులు రుద్రదేవుడు, మహాదేవుడు, గంగాధరుడు, రేచర్ల రుద్రయ లతో తనకున్న సాన్నిహిత్యం.. వారు పరస్పరం చేసుకున్న సహాయ సహకారాలు చెబుతూనే ఉన్నాడు. అదే సమయంలో రేచర్ల రుద్రయ, గంగాధరుని ముఖంలో కనిపిస్తున్న విషాద వీచికలను గమనిస్తూనే ఉన్నాడు.

‘‘గంగాధరా.. ఇంతటి సంతోష సమయంలో ఏవిటి నీ ముఖంలో ఆ విషాదం?’’

‘‘ఏముంది మహారాజా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కదా..’’ అన్నాడు శోక వదనంతో.

‘‘సర్వకాల సర్వావస్థలలోనూ మీకు అండదండగా ఈ భల్లాలుడున్నాడు..’’ భుజం తడుతూ ‘‘చెప్పు.. ఏవిటి అసలు సంగతి?’’

రుద్రయ కనుసైగ చేయగా కాకతీయ సంధివిగ్రహి పాపయ భట్టారకుడు లేచి నిలబడి, ‘‘మా యువరాజా వారు గణపతిదేవుల వారు ఇంకా దేవగిరి కారాగారంలోనే ఉన్నారు మహారాజా.. అదే అసలు చింత..’’

భల్లాలుడు తెల్లబోయాడు. ‘‘అదేమి? మెరుపు దాడి చేసి వెయ్యిన్నూటమందిని కోట దాటించిన మందడి.. యువరాజు ఒక్కడిని తీసుకు రాలేకపోయారా..  విచిత్రంగా ఉందే?..’’

రుద్రయ అన్నాడు, ‘‘వాస్తవం అదే ప్రభూ! దాడి విజయవంతమే కాని  ప్రధాన లక్ష్యం యువరాజును రక్షించడం. కాని.. ప్చ్.’’

అవమానంగా తలవంచుకున్నాడు మందడి కాటయ.

పూర్తిగా అర్ధమైంది భల్లాలదేవునికి. భోజన పళ్లెరాన్ని దూరంగా తోసి చివ్వున లేచాడు.

‘‘ఇక దేవగిరి మీద మరొక యుద్ధమే. ఇప్పటికే ఓ సైనిక పటాలాన్ని దేవగిరి హద్దుల్లో ఉంచాను, మీ కోసమే. ఇక ఉపేక్షించలేను. మెరుపుదాడి ఇలా విఫలం అయ్యాక ఇక మనం చేయగలిగింది సరాసరి యుద్ధమే..’’

ఆయన ఉద్రేకం చూసి కాకతీయ బృందం కంగారుపడింది. గంగాధరుడు లేచి, ‘‘సంతోషం మహారాజా. తమరి కృపాకటాక్ష వీక్షణలపై మాకు ఎప్పుడు నమ్మకమే. కానీ కానీ మా యువరాజు.. అక్కడ బందీగా ఉన్నాడు. మనం ఏమాత్రం తొందరపడినా..’’

చప్పగా చల్లారిపోయాడు భల్లాలుడు. గాబరాగా అన్నాడు.

‘‘ఔనౌను. ఆ జైత్రపాలుడు తిక్కమనిషి. వాడి తిక్క నిర్ణయాలు మన సంధివిగ్రహీలకు తెలిసే ఉంటుంది. ఏమంటావ్‌ ‌పాపయా?!’’ అన్నాడు కాకతీయ సంధివిగ్రహితో.

‘‘లెస్స పలికితిరి మహారాజా. ఆయన తిక్క నిర్ణయాల వల్ల అక్కడ ఎన్నో అనర్ధాలు జరుతున్నాయని విన్నాను.’’

అతనితో ఏకీభవించాడు కన్నడదాసు, హోయసల సంధివిగ్రహి.

‘‘అబ్బో.. ఆయన తిక్క మాకు అనుభవమే. సరిహద్దు గ్రామాలను కల్లోలితం చేస్తున్నాడు. అందుకే అక్కడ సైన్యాన్ని నిరంతరం నిలిపి ఉంచుతున్నారు మహారాజులు. వీ •కోసం మరిన్ని పటాలాలను సిద్ధం చేస్తున్నారు భల్లాలదేవులు..’’

భల్లాలుడు వెంటనే, ‘‘మరి రెండు సైనిక పటాలాలను పంపుదాం దాసూ. ఏమంటారు రుద్రయా..?’’

రుద్రయ లేచి చేతులు జోడించి, ‘‘అంతకంటే కావలసింది ఏముంది ప్రభూ! అయితే మన ప్రయ త్నాలు దేవగిరిని గందరగోళ పరచి మా యువ రాజులవారికి ఏదైనా హానీ తలపెడితే మాత్రం..’’

భల్లాలుడు కూర్చున్నాక పరిచారికలు  భోజన పళ్లెరం ఆయన దగ్గర ఉంచగా లాక్కుని తింటూ.. ఆలోచిస్తో అన్నాడు. ‘‘ఆలోచించిన కొద్దీ ఇది చాలా సున్నితమైన సమస్యగా మారుతోంది గంగాధరా!’’

‘‘మీరే ఈ సున్నితమైన చిక్కుముడిని విడదీయాలి ప్రభూ! ఇప్పుడు మేము సంధి కోసం పాపయను పంపినా, వాడు అంగీకరించడు. మనం దారుణంగా నష్టపరిచామని కోపంతో రగిలిపోతున్నాడని గూఢచారుల వార్త.’’

భల్లాలుడు సాలోచనగా తింటూ.. అందరిని ముందు భోజనం కానీయవలసినదిగా చేయి ఊపాడు.

భోజనాలు పూర్తయ్యాయి. పరిచారిక తాంబూల పళ్లెరంతో రాగా భల్లాలుడు అందరికి స్వయంగా తాంబూలం అందించాడు.

‘‘సరే.. సరే. అతిథిగృహంలో విశ్రాంతి తీసుకోండి. ఇది జటిల సమస్య. ముళ్లకంపపై పడ్డ మన వస్త్రాన్ని తెలివిగా తీసుకోవాలి. బహుశా సైనిక ప్రయోగం మీరన్నట్లు వికటించవచ్చు. ఆలోచిద్దాం..’’

అందరూ భల్లాలునికి నమస్కరించి కదిలారు. ఆయన భోజనాలయం నుండి విశ్రాంతి మందిరానికి వెళ్లాడు.

హోయసల సంధీవిగ్రహి కన్నడదాసు అందరిని సగౌరవంగా సాగనంపి తిరిగి విశ్రాంతి మందిరానికి వచ్చాడు. ఊయల పల్యంకంపై విశ్రాంతిగా పరున్న భల్లాలుడు సాలోచనగా అన్నాడు.

‘‘దాసూ ఆ అతిథిని లోపలోకి రమ్మనండి..’’

ప్రక్క గదిలో ఉండి అన్ని వింటున్న ఆ అతిథి వచ్చి భల్లాలునికి నమస్కరించాడు.

ఆ అతిథి చాముండశర్మ.. దేవగిరి సంధివిగ్రహి.

*     *      *

అందరూ ఊహించినట్లే కోపంతో అవమానంతో రగిలిపోతున్నాడు జైత్రపాలుడు.

కాకతీయం అనే మెరపుదాడి సఫలం అయిందని అటు కాకతీయ రాజ్యం.. విఫలమయ్యిందని ఇటు దేవగిరి రాజ్యం.. ఇద్దరూ ప్రకటించలేదు.

ఆ కాళరాత్రి తెల్లవారే సమయానికి కాకతీయ మెరపుదళం అదృశ్యమయింది. నలభై రెండు కారాగారాలలోని యుద్ధ బందీలను ఒక్కరినీ వదలకుండా తీసుకుపోయారు. కాని యువరాజు గణపతిదేవుడు దేవగిరికోటలోనే బందీగా క్షేమంగా ఉన్నాడు. కోష్టాగారం వద్ద స్పృహ లేకుండా పడి ఉన్న గణపతిదేవుని గుర్తించి తెచ్చి కారాగారంలో ఉంచారు.

దేవగిరి కోటంతా పీనుగుల పెంటలా స్మశానంలా మిగిలింది. అటు కాకతీయుల మెరపు దాడి.. అదే సమయంలో చెలరేగిన అగ్నిప్రమాదం వల్ల చాలామంది చనిపోయారు. కాకతీయ మెరుపుదళ వీరులవల్ల చాలామంది దేవగిరి సైనికులు, భటులు, గూఢచారులు చనిపోయారు. ఎన్నో భవనాలు భస్మీపటలమయ్యాయి.

కానీ  మెరుపుదళం గణపతిదేవుడిని దక్కించు కోలేకపోవడం దేవగిరికి దక్కిన ఓ ఊరట.

సమస్య ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంది.

ఇంత గొప్ప ప్రయత్నం జరిగినా కాకతీయ అభిషిక్త యువరాజు దేవగిరి కారాగారంలోనే బందీగా ఉన్నాడు.

అక్కడ కాకతీయులు స్కంధావారం వదలి వెళ్లడంలేదు. ఇటు హోయసల భల్లాలుడు పటాలం తర్వాత పటాలం పంపిస్తున్నాడు.

ఇద్దరికి బుద్దిచెప్పాలంటే గణపతిదేవుడిని చంపి శవాన్ని అనుమకొండకు పంపాలి.

గట్టి నిర్ణయానికి వచ్చాడు మహారాజు జైత్రపాలుడు.

‘‘మహాప్రధానిని పిలవండి..’’ పిచ్చికేక పెట్టాడు.

వెంటనే మహాప్రధాని బసవరసుడు రావడం.. ఆ వెంటనే అత్యున్నత స్థాయి న్యాయ నిపుణుల బృందాన్ని సమావేశ పరచడం జరిగాయి.

విషయం- బందీగా పట్టుబడిన కాకతీయ యువరాజు కోసం దేవగిరి మీద దొంగదాడి జరిగింది. దీనికి శిక్షేమిటి?

చివరికి గణపతికి ఉరిశిక్ష విధించాలని న్యాయ నిపుణులు ఇచ్చారు.

శిక్ష అమలుకు సమయాన్ని కూడా నిర్ణయించారు.  వంటి మీద ఆనాటి రాత్రి నుంచి అదే కౌపీనం. పిచ్చివాడిలా శూన్యంలోకి చూస్తూ నిర్వికారంగా భావ రహితంగా. కారాగారంలో కూడా అంతే. దేనిమీద ఆసక్తి లేదు. పెడితే తింటాడు లేకుంటే ఉంటాడు. ఎవ్వరితోనూ మాట్లాడడు. నవ్వడు. తలెత్తి చూడడు. ఏమీ చెప్పడు. అదొక నిర్వకల్ప సమాధి..

ప్రధాన న్యాయాధికారి చెరసాలకు వెళ్లి అతనికి ఉరిశిక్ష విధించినట్లు చెప్పాడు.

‘‘ఇప్పటికి పదవనాడు చైత్రమాసం ఏకాదశి సప్తమి ఉదయం నీకు ఉరి శిక్ష అమలు చేయాలని, అదే నీ తప్పులకు రాజధర్మం ప్రకారం తగినశిక్ష అని న్యాయమండలి నిర్ణయించింది.’’

ఏమీ మాట్లాడకుండా విన్నాడు. న్యాయాధీశులు వెళ్లిపోయారు. మార్పు ఏమీలేదు. నేలపై మెల్లగా వాలాడు. కళ్లు మూసుకున్నాడు. అదే సమాధిస్థితి.

ఆరోజు రానే వచ్చింది. ఆ ఉదయం ఉరి కంబానికి గొలుసులతో బంధించిన గణపతిని తీసుకువచ్చారు. అప్పటికే ఐదుగురు న్యాయాధీశులు తలారి, కోట దండనాయకుడు, సైన్యాధిపతి జెల్లన కాకుండా మరి కొందరు భటులు తదితరులున్నారు.

అప్పుడు మహారాజు జైత్రపాలుడు వస్తున్నట్లు ప్రతీహారి ప్రకటించగా ఆయన లోపలికి ప్రవే శించాడు. అందరూ లేచి వినమ్రంగా నమస్కరించగా జైతుగి ప్రత్యేక ఆసనంలో కూర్చున్నాడు.

సాధారణంగా ఇలాంటి ఉరి కార్యక్రమం దండనాయకుని నేతృత్వంలో జరుగుతుంది. కానీ మహాప్రధాని, సర్వసైన్యాధ్యక్షుడు, ఇతర ప్రధానులు తదితరులు హాజరవడం తక్కువ. సాక్షాత్తూ మహారాజే హాజరయిన సంఘటన ఇదొక్కటే. దాంతో అందరూ అప్రమత్తంగా చురుగ్గా అక్కడి ఏర్పాట్లు చేశారు.

ఓ ఇనుపచట్రంతో చేసిన కంబానికి ఉరి తాడు వ్రేలాడుతోంది. దాన్ని శుభ్రపరచి అమలు సమ యంలో ఆటంకాలు ఏర్పడకుండా అన్ని సరిగా ఉన్నట్లు భటులు, తలారి ముందుకు వచ్చి సరి చూసుకున్నాక.. అందరూ మహారాజు వైపు చూశారు.

భటులు చేస్తున్నవన్ని పళ్ల బిగివునా కళ్లలో పొంగే వికృత ఆనందంతో మొత్తంగా కాకతీయ సామ్రాజ్యాన్నే సర్వనాశనం చేసి భూస్థాపితం చేస్తున్నట్లు భావిస్తున్న జైత్రపాలుడు లేచి నిలబడి గణపతిని చూస్తూ వ్యంగంగా అన్నాడు.

‘‘నీ చాపుకు కొన్ని లిప్తలకాలమే మిగిలి ఉంది. చెప్పు.. ఆఖరికోరిక ఏమైనా ఉంటే చెప్పు!’’

గణపతి కనీసం కన్నెత్తలేదు.

ఆయన మరింత పైశాచికానందం పొందుతు న్నట్లు అటూ ఇటూ తిరుగుతూ, ‘‘చెప్పవయ్యా..! ఎవన్నా తినాలనుందా?..’’ అన్నాడు నవ్వుతూ. దాంతో అక్కడున్న యావన్మంది పెద్ద పెట్టున నవ్వారు. నవ్వుతూనే ఉన్నారు.

గణపతిదేవు గొంతు సవరించుకోవడం.. వల్ల నవ్వులకు ఆనకట్ట పడింది.

అందరూ విభ్రమంగా అతని వంక చూశారు. కళ్లు మూసుకునే గొంతు సవరించుకుని అన్నాడు చిన్నగా.

‘‘మా పెదనాన్నగారి ఆశయం తీర్చాలని ఉంది.’’

అందరూ సాలోచనగా.. అర్ధం అయికాకుండా ఉందన్నట్లు చూశారు.

జైత్రపాలుడు కూడా సందిగ్ధంగా చూస్తూ అడిగాడు మళ్లీ. ‘‘మళ్లీ చెప్పు.’’

ఈసారి గణపతి కంఠం పెద్దదయ్యింది. ‘‘పెదనాన్న రుద్రదేవుల కోరిక. అది తీర్చాలి..’’

‘‘ఏవిటి.. వాడి కోరిక??’’

‘‘తెలుగు సామ్రాజ్య స్థాపన..’’

లిప్తకాలం నిశ్శబ్దం. క్షణకాలంలో గిలగిల గింజుకుని చావబోయే వీడు తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడా..

పిచ్చెక్కినట్లుంది వీడికి అనుకున్నాడు. అప్పుడే బయట కలకలం..

‘‘క్షమించండి మహారాజా. మహారాణి వారు వేంచేయుచున్నారు.’’

అంతఃపుర కంచుకి, ప్రతిహారీ, భటులు ఉరిమండప ద్వారం వద్దకు వచ్చేశారు.

జైత్రపాలుడు చిరాగ్గా చూసి చివ్వున కదిలి బయటకు వెళ్లాడు.

అందరూ మ్రాన్పడిపోయి చూస్తుండిపోయారు. ఉరి మండపానికి మహారాజు రావడమే విచిత్రమైతే.. మహారాణి గారు రావడం..?? ఏమి జరుగు తోంది..? ఏమి జరగబోతోంది??

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఘడియలు.

ఉరి కంబ దగ్గర అంతా నిశ్సబ్దం. మహారాజు జైత్రపాలుడు లోపలికి రాలేదు. అంతఃపుర ప్రతీహారీ లోపలికి వచ్చి దండనాయకునికి నమస్కరించి, ‘‘ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా వేయడమైనది దేవరా! కాకతీయ యువరాజును గతంలో ఉంచిన అంతఃపుర కారాగారంలో ఉంచాలని మహారాజుల నిర్ణయం.’’

*     *      *

దేవగిరి పట్టణం, బ్రాహ్మణవీధి

మరో నాలుగుమాసాల తర్వాత శ్రావణమాసం..

హేమాద్రి పంత్‌ ఇం‌ట పెళ్లి బాజాలు మ్రోగుతున్నాయి.

అత్యంత రమణీయంగా అలంకరించిన వివాహ వేదిక. దానిపై ఉజ్జ్వలంగా మండుతున్న అగ్నిహోత్రం. అన్ని ప్రక్కలా కూర్చుని ఏకకంఠంతో వేదగానం చేస్తోన్న వేదవేదాంగ పారంగతులు, మహా రుషులు. బ్రాహ్మణ వివాహవేడుక కావటాన అక్కడ అట్టహాసాలకన్నా వైదిక సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తున్నది.

అది సాధారణ బ్రాహ్మణుని ఇంట పెళ్లి వేడుక కాదు. సాక్షాత్తూ మహారాజు గారి అంతరంగిక సలహాదారు, మహామంత్రి హోదా కలిగిన పండితోత్త ముడు, మహాకవి, శాస్త్రకోవిదుడు హేమాద్రి గారి ఇంట పెళ్లి.

వియ్యాలవారు కూడా సామాన్యులు కారు. కాకతీయ రాజ్య మహాప్రధాని గంగాధరమంత్రి గారు.

గతంలో ఎప్పుడో కాకతీయ మహారాజు మహా దేవుడు యుద్ధం ప్రకటించకముందే గంగాధరమంత్రి కుమారునికి హేమాద్రి పంత్‌ ‌కుమార్తెకు వివాహం నిశ్చయించుకున్నారు.

యుద్ధాల వల్ల, దాడుల వల్ల కొంత ఆలస్య మైయినా చివరికి వివాహ ఘడియ రానే వచ్చింది.

నిజానికి విరోధాలు రాజుల మధ్యనే గాని సాధారణ రాజ్యవాసుల మధ్య లేవు. ఎన్నో విషయాలలో ప్రతి వారు ప్రక్క గ్రామం వారి పైన ఆధారపడినట్లే  ప్రక్క రాజ్యాలవారిపై కూడా ఆధార పడక తప్పదు. ముఖ్యంగా నిత్యావసరాలు, వివాహాలు, వ్యాపార వాణిజ్యసంబంధాలు వీటికి రాజ్యాలు హద్దులు పెట్టలేవు. ప్రక్క ప్రక్క రాజ్యాలయిన కాకతీయ, దేవగిరి, హోయసల రాజ్యాల ప్రజల్లో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోడాలు.. రాకపోకలు పుష్కలంగానే ఉన్నాయి.

వివాహం నిశ్చయించుకుని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు సరే. ఇంత బీభత్సకాండ జరుగు తుండగా నిశ్చయించిన ముహూర్తానికే వివాహం జరిపిస్తున్నారు. అదే ఆశ్చర్యం!!

అదే ప్రశ్న పెళ్లి పెద్ద దేవగిరి రాజ్య సందివిగ్రహి చాముండశర్మను అడిగితే, ‘‘అది అంతేనండి. కల్యాణ మొచ్చినా కక్కు వచ్చినా ఆగదు..’’ అన్నాడు నవ్వుతూ.

సంధి విగ్రహీ అంటే చిన్న పదవి కాదు. రెండు రాజ్యాల మధ్య సయోధ్య సాధించగలడు.. విరోధం ప్రజ్వరిల్ల జేసి రెండింటిని నాశనం చేయగలడు. శత్రురాజ్యంతోనైనా మిత్ర రాజ్యంతోనయినా చర్చలు జరపాలంటే అందుకు మంచి మాటకారితనం, నైపుణ్యం రెండు రాజ్యాల ప్రధాన అంశాలపై పట్టున్న వాడిని ఎంచుకుంటారు మహారాజులు. ఈ విషయంలో చాముండశర్మ సరైన ఎంపిక అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. అగశ్రేణి వీరులు కాకతీయులపై దేవగిరి జైత్రపాలుడు పైచేయి సాధించాడంటే అందులో చాముండశర్మ మంత్రాం గం కూడా ఓ ప్రధాన అంశం.

హేమాద్రి పంత్‌, ‌సర్వసేనాని జల్లన, చాముండ శర్మ.. ముగ్గురిది ఒకటే మాట ఒకటే బాట. ఒకటే ఆలోచన అంటారు తెలిసినవారు. ముగ్గురూ మహారాణి చిల్లాదేవికి నమ్మినబంట్లు. ముగ్గురూ చిల్లాదేవి గారిని కలిసి ఈ వివాహం జరిపించడానికి ఒప్పించగా ఆమె రాజుగారిని ఒప్పించింది అంటు న్నారు హేమాద్రి బంధువులు.

నిజానికి ఈ వివాహం కూడా కోటలోనే ధగద్ధ గాయమానంగా జరగాలి. కాకతీయుల మెరుపుదాడి వలన కోట తన సొగసును, సౌకర్యాలను కోల్పో యింది. ప్రస్తుతం చీమ కూడా దూరడానికి సాధ్యం కాని విధంగా కోట భద్రత•ను పటిష్టం చేశాడు జైతుగి. అందువల్ల వివాహవేదిక హేమాద్రి ఇంటికి మార్చారు.

ఇక్కడైనా వివాహం అట్టహాసంగానే జరుగు తోంది.

ముందుగా వివాహమండపానికి విచ్చేసింది మహారాణి చిల్లాదేవి, కుమార్తె సోమలదేవి సహా. సుమారు ఎత్తులో అంతంత మాత్రపు ఛాయలో నిండైన అలంకరణలో రాణితనపు హోదాతో హుందాగా ఉన్న సోమలదేవిని అందరూ ఆశ్చర్య చకితులై చూస్తుండగా అందరిని పలకరిస్తూ.. పెళ్లి కుమార్తె సుజలాంబను ఆట పట్టిస్తూ చిల్లాదేవి కొత్త చైతన్యం తెచ్చింది. వచ్చిన ఆమె ఉచితాసనంలో కూర్చోలేదు. పెళ్లి పనులన్నీ చక్కబరుస్తోంది.

సాక్షాత్తూ తన స్వంత కుమార్తె వివాహంలా హడావిడి పడిపోతోంది.

యువరాణి సోమల, పెళ్లికుమార్తె సుజలాంబ మంచి మిత్రులు. ఈ ఇద్దరి మిత్రురాళ్ల బృందంతో పెళ్లిపందిరి చిలుకలు వాలిన తోటలా సందడిగా ఉంది.

మేళతాళాలు మారుమ్రోగుతున్నాయి. వాటి మధ్య పెళ్లికుమారుడు విడిది నుండి వచ్చి అందరికి నమస్కరించి పెళ్లిపీట ఎక్కాడు. పెళ్లికూతురిని మేనమామలు బంగారుతాపడం చేసిన పెళ్లిబుట్టలో ఎత్తుకుని తెస్తున్నారు. పెళ్లి కుమార్తెతో సోమల.. ఇతర మిత్రురాళ్లు మేలమాడుతూ వెంటరాగా.. నవ్వులతో సరదాలతో వేదఘోషతో ఆ పెళ్లిపందిరి అంతా కళకళలాడుతోంది.

హేమాద్రి చేసిన ఏర్పాట్లకు తగ్గట్లు వియ్యాల వారు కూడా భారీగానే తరలివచ్చారు. నాలుగురోజుల పెళ్లికి పక్షం రోజులుగా అనుమకొండ నుండి దేవగిరి వరకు మేనాలు, పల్లకీలు, రథాలు, అంబారీల ఏనుగులు, గూడు ఎడ్లబళ్లు.. ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి. అంతమంది తరలిరావడం ఆశ్చర్యంగానే ఉంది దేవగిరివాసులకు.

ఎవ్వరూ ఊహించకుండా దేవగిరి పాలకుడు జైత్రపాలకుడు ఛత్ర చామర కేతన లాంచనాలతో మహామత్తగజంపై తరలి వచ్చాడు. ఆయనను అంత దగ్గరగా చూడటం కూడా దేవగిరి పౌరులకు అబ్బురమే.

అందరూ ఆయనకు ముందు సాష్టాంగపడి దండాలు పెడుతుండగా హేమాద్రి సతీసమేతంగా ఎదురేగి పూర్ణకుంభ స్వాగతంతో పెళ్లి పందిరిలోకి ఆహ్వానించి సమున్నతాసనం చూపి కూర్చుండబెట్టాడు.

హాజరైన రాజ్యపాలక ప్రముఖులు చాలామంది ఆయనతో ముచ్చట్లు చెబుతున్నారు. అందరితో మాట్లాడుతున్నా.. కాకతీయ సంధివిగ్రహి పాపాయ భట్టారకుడు, హోయసల సంధివిగ్రహి కన్నడశర్మ.. ఇక్కడే పందిరిలోనే ఉన్నట్లు జైతుగి గుర్తించాడు. కంటి సైగతో తన సందివిగ్రహి చాముండశర్మను అడిగాడు. చాముండ నవ్వి, ‘నేనున్నాగా..’ అన్నట్లు తలపంకించి సమాధాన పరచాడు. కాని జైతుగి అనుమానాలు తీరలేదు. చాముండకు తెలిసే ఇక్కడ ఉన్నారా శత్రురాజ్య సందివిగ్రహిలు?! హేమాద్రికి, వీళ్లకు దగ్గరి బంధుత్వముందా..??

మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE