భారత్ సెక్యులర్ దేశమని రాజ్యాంగం చెబుతుంది. కానీ అక్కడ అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేదు. వారి విశ్వాసాల పట్ల మైనారిటీలకు మర్యాద లేదు. చిరకాలంగా పాలిస్తున్న రెండు రాజకీయ పార్టీలకు గౌరవం లేదు. ఇక హిందూ దేవీదేవతలకు భద్రత ఎక్కడిది? ఒక మసీదుకో, చర్చ్‌కో నష్టం జరిగితే రాజకీయ పక్షాలు, మీడియా అక్షరాలా వీరంగం వేస్తాయి. ఈ పరిస్థితికి మొదటి కారణం ఇస్లాం మతోన్మాదులు. తరువాతి స్థానం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే. ముస్లింలను బుజ్జగిస్తూ ఆ రెండు పార్టీలే గుత్తాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే హిందువులకు, హిందూ దేవస్థానాలకు కనీస రక్షణ ఉంటుందా? ఆ రెండు పార్టీలు అధికారం దగ్గర మాత్రమే విరోధులు. హిందువుల హక్కులను భగ్నం చేయడంలో దేని రికార్డు దానిదే. ముస్లిం మతోన్మాదం, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడి తిష్టవేసినదే కేరళ అనే దేవభూమి బిరుదాంకిత రాష్ట్రం. అక్కడి రెండు ప్రధాన దేవాలయాలు అయ్యప్ప, కృష్ణుడి దేవాలయాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సీపీఎం నాయకులు బందిపోట్లతో దీటుగా కోట్లు కోట్లు కొల్లగొట్టారు. బీజేపీ వంటి ‘హిందువుల పార్టీ’, విశ్వహిందూ పరిషత్ వంటి పోరాట సంస్థ నినాదాలు, ఘోష తప్ప మరెవ్వరూ నోరెత్తడం లేదు.
కేరళలోని పురాతన ఆలయాలు దేవసం బోర్డు అనే వాటి పరిధిలో ఉంటాయి. దేవసాల చేతిలో గుళ్లు ఉంటే, దేవసాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ వీటిని రాజకీయ నిరుద్యో గులతో నింపుతుంది. అందుకే దేవసాలు అవినీతి నిలయాలుగా ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 20న శబరిమలై, పంపా తీరంలో కేరళ సీపీఎం అంతర్జాతీయ అయ్యప్ప భక్తుల సదస్సు నిర్వహిం చింది. కానీ అప్పటికి అయ్యప్ప ఆలయంలో చోటా మోటా సీపీఎం నాయకులు బందిపోట్లను తలపిస్తూ ఆస్తులు కాజేశారు. హిందూ పురాణాలే ఇతివృత్తంగా కళా ప్రదర్శనలు జరగవలసిన దేవాలయ ఉత్సవా లలో ఎర్రజెండాలను ఎగరేసి, సుత్తులూ, కొడవళ్లూ, పిడికిళ్లు చిత్రించిన వేదికల మీద కమ్యూనిస్టు గీతాలను పాడే నీచ సంప్రదాయం ప్రవేశ పెట్టారు.
అయ్యప్ప, గురువాయూర్ ఆలయాలలో తాజాగా బయటపడిన బంగారం, వస్తువులు, పద్దులు, ఏనుగు దంతాల అక్రమాలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. ఆ రెండు ఆలయాలలోనే రూ. 25 కోట్లు విలువ చేసే బంగారాన్ని కమ్యూనిస్టుల పాలనలోని దేవస్థానం బోర్డులు, ఉద్యోగులు మేసేశారు. న్యాయ స్థానాలు రంగంలోకి దిగితే తప్ప వీటి అసలు రహస్యం బయటకు రాలేదు. శబరిమలై ఆలయంలో జరిగిన బంగారం గోల్‌మాల్ మీద వేగంగా దర్యాప్తు చేయడానికి కేరళ హైకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. శబరిమలై ఆలయంలో దొంగతనం వెనుక పెద్ద కథే ఉంటుందని సాక్షాత్తు కేరళ హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది విస్తృతమైన పెద్ద ప్రణాళికతో చేసిన దొంగతనమని భావించవలసి ఉంటుందని కూడా అభిప్రాయపడిరది. అందుకే ఇంతకు ముందు ఉన్న స్పెషల్ కమిషనర్ పెట్టిన విధానాలను పక్కన పెట్టి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగే విధంగా ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.
శబరిమలై బంగారం దోపిడీ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 దేవాలయాలు ట్రావెన్కూర్ దేవసం బోర్డు అధీనంలో ఉన్నాయి. శబరిమలై గుడి బంగారం వ్యవహారం ఏమిటి? గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకుల విగ్రహా లకు తాపడం చేయించిన (రాగి మీద) బంగారుపూత ఉండేది.30 కిలోల 24 కేరెట్ల బంగారంతో ఆ పూత పూశారు. వీటిని మరమ్మతుల పేరుతో బయటకు తీసుకువెళ్లారు. కానీ తిరిగి బంగారుపూత రాగిరే కులు దేవస్థానానికి తిరిగి వచ్చేసరికి 4.5 కిలోలలకు పైగా బంగారు తగ్గినట్టు బయటపడిరది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. శబరిమలై స్పెషల్ కమిషనర్, న్యాయస్థానాల అనుమతితో మరమ్మతులు జరగాలి. కానీ ఈ ప్రధాన నియమాన్ని దేవసం ఉల్లంఘించింది. శబరిమలై స్పెషల్ కమిషనర్ సెప్టెంబర్ 10న రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడంతో ఇవన్నీ బయట పడ్డాయి. ప్రధాన ఆలయం గర్భగుడికి ఇరువైపులా ఉండే పీఠాలు, ద్వారపాలకు లకు చేసిన బంగారు తాపడం రేకులు మరమ్మతు పేరుతో తొలగించారని, ఆ విషయం తనకు తెలియ కుండానే జరిగిందని స్పెషల్ కమిషనర్ ఫిర్యాదులో తెలియచేశారు. అదృష్టం ఏమిటంటే, నీవు వెళ్లి ఈ విషయం అయ్యప్పకు చెప్పుకోమని న్యాయస్థానం అనలేదు. కమిషనర్ ఫిర్యాదుతో హైకోర్టు తనకు తానే దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించింది. 2019లో జరిగిన మరమ్మతులనూ, ఇప్పుడు జరిగిన మరమ్మతులలోనూ సరిచూసుకుని తూకంలో వచ్చిన తేడాను గమనించింది. కోర్టు కూడా నిర్ఘాంతపోయేటంత దారుణం బయట పడిరది. దర్యాప్తు చేయవలసిందిగా అక్టోబర్ 6న ఇచ్చిన ఆదేశాలలో కోర్టు ఆ విషయం స్పష్టం చేసింది కూడా. మరమ్మతుకోసమంటూ ట్రావెన్కూర్ దేవసం బోర్డు 2019లో రాగి రేకులుగా పేర్కొన్నది. నిజానికి 1999లో ద్వారపాలకుల విగ్రహాలను, పీఠాలను బంగారంతో తాపడం చేశారు. ఎలాంటి శషభిషలు లేకుండా కోర్టు దేవసం బోర్డును నిలదీసింది. బంగారు తాపడాన్ని మీరు రాగిరేకులు మాత్రమే అన్నట్టు రాసి, ఎలా బయటకు పంపారు? ఒక నమ్మదగని స్పాన్సరర్‌కు ఎందుకు ఇచ్చారు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో సరైన రికార్డులు ఎందుకు లేవు? ఇవి కోర్టు వేసిన ప్రశ్నలు. ఆ తరువాతే న్యాయమూర్తి కేటీ శంకరన్ నాయకత్వంలో ఆలయంలో విలువైన వస్తువుల స్థితిగతులపై దర్యాప్తు సంఘాన్ని నియమిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ మొత్తం అవినీతి వ్యవహారమంతా సీపీఎం పదేళ్ల హయాంలోనే జరిగింది. ట్రావెన్కూర్ దేవసం బోర్డు అధ్యక్షుడు, సభ్యులు అంతా అధికార పార్టీ వారే. అంటే సీపీఎం సభ్యులే. దోపిడీ అయిన బంగారాన్ని కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కర్ణాటకలోని బళ్లారిలోని ఒక బంగారం దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నది. బంగారం తస్కరణలో దేవసం శాఖ మంత్రి వీఎన్ వాసవన్ హస్తం ఉందని కేరళ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
శబరిమలై ఆలయంలో గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులు, సన్నిధానంలో కొన్ని భాగాలు, శ్రీకోవిల్ ప్రవేశద్వారం, పైకప్పులకు బంగారు తాపడం కోసం 1998లో ఒక దాత విరాళం ఇచ్చాడు. ఆయనే యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ అధ్యక్షుడు విజయ్ మాల్యా. అప్పుడు ఆయన ఇచ్చినది రూ. 18 కోట్లు. అయితే వాటి మీద ఉన్న బంగారం తాపడం సంగతి ప్రస్తావించకుండా రాగిరేకులని రాశారు. రాగి రేకుల మీద పూత రూపంలో ఉన్న ఆ బంగారాన్ని దోచేయడానికే ఇదంతా జరిగింది. బంగారం తాపడం కోసం 30.291 కిలోల బంగారం ఉపయోగించినట్టు ఆ గ్రూప్ తెలియ చేసింది. ఈ తాపడం రేకుల మరమ్మతు పనిని బెంగ ళూరుకు చెందిన మలయాళీ వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పుట్టికి అప్పగించారు. ఆదరాబాదరా ఈ పని కోసం, అంటే తాపడం రేకులను మళ్లీ తయారు చేయడానికి తాను చెన్నయ్ లోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థకు అప్పగించానని పుట్టి తెలియచేశాడు. కానీ ఇలా బంగారు తాపడం చేసే సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఆ సంస్థ వద్ద లేవు. మరి దానికి ఎందుకు ఎంపిక చేశారు? ఇదే అసలు ప్రశ్న.
ఎవరీ ఉన్నికృష్ణన్ పుట్టి? దేవుడికి ఇంత ద్రోహానికి ఒడిగట్టిన ఈ వ్యక్తి ఒకప్పుడు దేవస్థానం లోని వాడేనంటే నమ్మక తప్పదు. పరికార్మి అనే బాధ్యతను నిర్వహించేవాడు. అంటే ప్రధాన అర్చకుడు (మేల్‌శాంతి) కింద సహాయకులలో చిట్టచివరివాడు. ఇప్పుడు వ్యాపారవేత్త అవతారం ఎత్తాడు. మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధిక వడ్డీరేట్లకు రుణాలు ఇస్తాడని పేరు ఉంది. ఆలయం ద్వారా వెనకేసిన సొమ్ముతో రియల్ దందా కూడా నడుపుతున్నాడు. ఈ నిర్వాకమంతా కేవలం పుట్టి ఘనతేనని అనుకోరాదని, వెనుక ట్రావెన్కూర్ దేవసం బోర్డు పెద్ద తలలే కాకుండా, రాజకీయ పార్టీల పెద్దమనుషులూ ఉన్నారని మాజీ ప్రధాన అర్చకుడు జjరామన్ నంబూద్రి ఆరోపించారు. నిజానికి పుట్టి చేసిన దోపిడీ గతంలో దేవసం బోర్డు అధికారులు, మంత్రులు చేసిన దోపిడీతో పోలిస్తే పెద్ద ఎక్కువేమీ కాదని ప్రధాన భద్రతాధికారి గోపాలకృష్ణ చెప్పారు. ఈ బందిపోటుతనంలో కేరళ ఆలయాల మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, ట్రావెన్కూర్ దేవసం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ. పద్మకుమార్ కీలకమని చెబుతున్నారు. ఇప్పుడు దోషులు ఎంతవారైనా శిక్షిస్తాం, బాదేస్తాం అని సీపీఎం ప్రభుత్వం చెప్పడానికి కారణం` పుట్టి చాలా పేర్లు బయటపెట్టే అవకాశం ఉందని భయపడడమే.
నిజానికి ఇలా శబరిమలై నుంచి స్వామివారి ఆస్తులను బయటకు తీసుకువెళ్లడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఆ నిబంధనలను కూడా తిరువాన్కూర్ దేవసం బోర్డే తయారు చేసింది. ఈ మరమ్మతు అయినా ఆలయ ప్రాంగణంలోనే చేయించాలి. దేవసం బోర్డు సభ్యులు బయటకు పంపించినవి బంగారు తాపడం రేకులు. కానీ రాగిరేకులను పంపినట్టు రాశారు. మొత్తం 42.8 కిలోల బరువు ఉన్న12 రాగిరేకులట.ఇదీ ఇచ్చిన సమాచారం. మరమ్మతులు అయ్యాక తిరిగి వచ్చాయి. అప్పుడు వాటి బరువు 38.258 కిలోలని తేలింది. అంటే 4.541 కిలోలు ఎక్కడో కరిగిపోయాయి. అయితే తూకంలో దాదాపు ఐదు కిలోలు ఎందుకు తగ్గిందని అడిగినవాడు ఎవడూ లేడు. ఇంత బంగారం నొక్కేసినా 2025లో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనిని ఆ ఉన్నికృష్ణన్‌కే అప్పగించారు. అయితే సరిగ్గా హైకోర్టు అడ్డుపడిరది. 2019లో మరమ్మతులకు ఇచ్చినప్పుడు ఆ పనిచేసిన వాళ్లు ఇచ్చిన వారంటీ 40 ఏళ్లు. మరి 2025లో మళ్లీ ఎందుకు మరమ్మ తులు? ఇదే న్యాయస్థానం ప్రశ్న.
తరువాత పోయిన బంగారు వస్తువులన్నీ ఉన్నికృష్ణన్ సోదరి మిని ఇంటిలో చీఫ్ విజిలెన్స్ అధికారి, సెక్యూరిటీ అధికారి కనుగొన్నారు. అయితే ఆ వస్తువులను తన సోదరుడే తెచ్చి పెట్టాడని ఆమె చెప్పారు. ఉన్నికృష్ణన్ కూడా చాలాసార్లు మాట మార్చాడు. తాను మరమ్మత్తు కోసం స్పాన్సర్ చేసిన పీఠాల మీది రేకులు కనిపించడం లేదని మొదట అన్నాడు. తరువాత అవి రాగి రేకులని, బంగారం మాత్రం కాదని చెప్పాడు. మరమ్మతుల పేరుతో తతంగం పూర్తి చేసిన తరువాత వాటిని విరాళాల సేకరణ కోసం ఉన్నికృష్ణన్ బెంగళూరు, తమిళనాడు లలో ప్రదర్శనకు పెట్టాడు. అప్పుడు మాత్రం బంగారు తాపడం రేకులనే ప్రదర్శనకు పెట్టాడు.
అక్టోబర్ 23న ప్రత్యేక దర్యాప్తు బృందం శబరిమలై పరిపాలనాధికారి మురారిబాబును అరెస్టు చేసింది. ద్వారపాలకులకు చేసిన బంగారు తాపడం సంగతి దాచి అవన్నీ రాగిరేకులంటూ 2019 లోను, 2025లోను కూడా రాసింది ఇతడే. 1998-99 సంవత్సరాలలో విజయ్ మాల్యా ఇచ్చిన బంగారాన్ని దొంగిలించడానికే ఇదంతా జరిగిందని దర్యాప్తు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఉన్నికృష్ణన్‌తో పాటు దేవసం మాజీ అధ్యక్షుడు ఏ పద్మాకర్, మరొక ఇద్దరు సభ్యులను, తొమ్మిదిమంది అధికారులను కూడా అరెస్టు చేశారు. ఈ పద్మాకర్ సీపీఎం సీనియర్ సభ్యుడే. ఈ నేరమంతా నా మీదే మోపితే ఎలా? ఇంకా జవాబుదారులు చాలా మంది ఉన్నారు కదా అని అమాయకంగా అడుగుతున్నాడు పాపం. ఈ బంగారం దొంగతనానికి, ప్రస్తుత బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ చెప్పాడు. కాబట్టి తమ మీద ఆరోపణలు చేయడం తగదని అంటున్నాడు. కమ్యూనిస్టు కాబట్టి దోషం అంటగట్టక్కరలేదు. కానీ జరిగిన అవకతవకలను ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం దృష్టికో, కోర్టు దృష్టికో ఎందుకు తీసుకువెళ్లలేదు. తన పార్టీ అడ్డంగా సాగించిన దోపిడీ బయటపడుతుందనే కావచ్చు.
ఈ మధ్య అయ్యప్ప భక్తుల మీద, అయ్యప్ప మీద ఆపేక్ష పెరిగిపోయిన సీపీఎం ప్రభుత్వంలో భాగమైన బోర్డు ఇంకొక మాట కూడా చెబుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో త్వరలో జరగబోయే అయ్యప్ప దీక్షకు ఎలాంటి విఘాతం కలిగించరాదని కోరుతున్నట్టు కూడా ప్రశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అరవై లక్షలమంది అయ్యప్ప భక్తులు శబరిమలై వస్తారు. వారి గురించి ప్రశాంత్ ఇప్పటి నుంచి గుబులు పడుతున్నాడని మనం నమ్మక తప్పదు. అయితే ఇదంతా దొంగతనం కంటే తక్కువ దేమీ కాదని కేరళ ఆలయాల మంత్రి వీఎన్ వాసవన్ ఒక మాటయితే అన్నారు. ఇక నిజాయితీకీ నీతికీ, పాలనా దక్షతకీ నిలువెత్తు రూపమని మేధావులు, పురోగమన వాదులు చిత్రించే ముఖ్య మంత్రి పినరయి విజయన్ అయితే అక్రమాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం ఏనాడూ విడిచిపెట్టదని తేల్చి పారేశారు. ఇది జోక్ కంటే తక్కువేమీ కాదు.
గురువాయూర్ ఆలయంలో
నిజానికి శబరిమలై గుడిలో బంగారం అవకతవ కల మీద గగ్గోలు మొదలయిన నేపథ్యంలో గురు వాయూర్ రగడ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం గురువాయూర్ దేవసం ఆస్తుల మీద 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాలలో జరిపిన ఆడిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. మరమ్మతుల పేరుతో, మెరుగుల పేరుతో బయటకు పంపించిన బంగారు, వెండి వస్తువులు తిరిగి యథాతథంగా ఆలయానికి చేరాయా లేదా అన్న ఆరా దేవసం చేయలేదని ఆడిట్‌లో వెల్లడయింది. దేవసం ఏలుబడిలో బంగారు, వెండి వస్తువుల విషయంలో ఆశ్రద్ధగా ఉండడమే కాదు, ఆదాయ వ్యయాల మధ్య పెద్ద అగాథమే ఉందని, పద్దులు కూడా ఏమాత్రం సజావుగా లేవని ఆడిట్ గుట్టు విప్పింది. గురువాయూర్ ఆలయంలో జూలై 2012 తరువాత జరిగిన నిర్ణయాలను ఆడిట్‌కు తెలియ కుండా దాచారని కూడా నివేదిక వెల్లడిరచింది. తాము ఆ కాలంలో తీసుకున్న ఏ నిర్ణయాలను ఆడిట్‌కు సమర్పించరాదని 2015లోనే దేవసం సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇది కదా కమ్యూనిస్టు నిజాయితీ!
2019-2020 సంవత్సరంలో ఆడిట్ చేసిన వారికి ఇంకొన్ని విస్తుపోయే విషయాలు కూడా తెలిశాయి. బడ్జెట్‌కూ, వాస్తవంగా వచ్చిన ఆదాయా నికి, వ్యయానికి మధ్య పొంతన లేదు. మదుపు చేసిన మొత్తాల మీద వచ్చిన ఆదాయం, విరాళాలు, కేపిటల్ రిసీట్లు, పన్ను చెల్లింపులకు సంబంధించి పొంతన లేని లెక్కలే ఉన్నాయి. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమని వేరే చెప్పక్కరలేదు. గురువాయూర్ దేవసం నిబంధనలు 1980 ప్రకారం గుడి నిర్వహణాధికారి అన్ని విలువైన వస్తువులకు సంబంధించిన జాబితాను దగ్గర ఉంచుకోవాలి. మేనేజ్‌మెంట్ కమిటీలు ఆ జాబితానూ, అందులో నమోదు చేసిన వస్తువులనూ ప్రతి ఏటా తనిఖీ చేయాలి. దీనికి సంబంధించిన నివేదికను దేవసం కమిషనర్‌కు నివేదించాలి. కానీ ఇలాంటి పనేదీ కూడా ఆ నిబంధనలు అమలులోకి వచ్చిన 1980 నుంచి ఏ ఒక్క ఏడాది జరగలేదు. గురవాయూర్ ఆలయానికి సంబంధించిన విలువైన వస్తువులకు సంబంధించిన పత్రాలను 2019లో ఆడిటర్లు కోరితే వాటి ఊసే ఎత్తలేదు. చట్టబద్ధమైన అకౌంటింగ్ విధానం కూడా ఆలయంలో లేదు. బంగారు, వెండి కానుకలకు తప్ప, మిగిలిన వాటికి ఎలాంటి రసీదులు ఇవ్వలేదు. 2020-2021లో అయిన వ్యయం రూ 25 కోట్లుగా చూపించారు. అయితే అది ఆదాయానికి కంటే చాలా ఎక్కువ. దాని పరిధిలోని ఆలయాల వ్యయం వాటి ఆదాయం కంటే మూడు రెట్లు కనిపించింది.
2019 సంవత్సరం ఆదాయ వ్యయాల మీద జరిపిన ఆడిట్ ప్రకారం గురువాయూర్‌లో కొన్ని ఆస్తులకు కాళ్లు వచ్చాయని తేటతెల్లమయింది. బంగారంతో పాటు, ఏనుగు దంతం కూడా మాయ మయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న బంగారం పథకంలో పెట్టుబడుల వల్ల రూ. 79 లక్షల నష్టం వాటిల్లింది. గురువాయూర్ దేవసం పరిధిలో 12 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో చాలా ఆస్తులకు జవాబుదారీ లేదు. రెండువేల కిలోల బరువైన వంట పాత్రలు పోయాయి. వీటి విలువ రూ. 15 లక్షలు. ఇవేమీ ఆడిట్ అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ వంట పాత్రలు పాలక్కాడ్‌కు చెందిన ఒక వ్యక్తి విరాళంగా ఇచ్చారు. పున్నాథూర్ ఏనుగుల కోట నుంచి 530 కిలోల ఏనుగు దంతాల లెక్క లేదు. కానీ ఈ తేడాపాడాలన్నీ సరిచూసి హైకోర్టుకు నివేదిక ఇచ్చామని దేవసం చెబుతోంది. 2020-2021 ఆడిట్‌లో ఆలయాల అతిథి గృహాలు సహా ఇతర అన్ని వ్యవస్థల మీద చేసిన ఖర్చు రూ 25 కోట్లుగా చూపారు. కానీ అది ఆదాయానికి మించి చాలా ఎక్కువ. ఆ ఆర్థిక సంవత్సరంలోనే దేవాలయాల మీద చేసిన వ్యయం ఆదాయం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. ఇదంతా కేరళలోని హిందూ దేవాలయాల మీద ఎర్ర బందిపోట్ల దోపిడీలకు పరాకాష్ట. ఈ ఆగడాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
సిబ్బంది, అర్చకుల చేతివాటం
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, దేవసం బోర్డులుతో పాటు కొందరు అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా అయ్యప్పస్వామికి యథాశక్తిన అన్యాయం తలపెట్టారు. ధర్మం అనే మహోన్నత దృష్టికి మహాద్రోహం తలపెట్టారు. ట్రావెన్కూర్ దేవసం బోర్డు మాజీ అధ్యక్షుడు సీకే గుప్తన్ వెల్లడిరచిన ఒక విషయం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. అయ్యప్ప ఆలయంలో తంత్రి (ప్రధాన అర్చకుడు)గా మోహనారు కాంతారురు గతంలో పనిచేశాడు. కానీ ఇతడు ఎర్నాకులంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక కాల్‌గర్ల్‌తో పట్టుబడ్డాడు. దీనితో ఆయనను ఆలయం నుంచి బహిష్కరించారు. అతడు మళ్లీ గర్భగుడిలో విధులు నిర్వర్తించేందుకు మార్గం సుగమం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని అతడి కుటుంబం బేరమాడిరదని గుప్తన్ తెలియచేశాడు. ఈ గుప్తన్ ఎవరో కాదు. సీపీఎం ప్రముఖుడు ఈఎంఎస్ నంబూద్రి అల్లుడు. తంత్రి, మేల్‌శాంతిల ఆగడాలకు హద్దు లేదు. ఇటీవలి కాలంలోనే వాజీ వాహనం (దేవుడి వాహనం) గురించి ఒక వార్త వచ్చింది. జెండా కర్ర వంటి దానికి పైన బంగారు గుర్రం ఉంటుంది. దీనిని కొడిమరం అంటారు. ఇది కనిపించకుండా పోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వాహనం బాధ్యత తంత్రిదే. దీని మీద దర్యాప్తు చేయించాలని ప్రస్తుత తంత్రి రాజీవ్ కాంతారును కొందరు భక్తులు కోరారు. వాజీ వాహనం తన వద్ద మాత్రమే ఉంటుందని చెప్పాడు. అంత ఖరీదైన వాహనం మీ దగ్గర ఎందుకు ఉండాలని నిలదీస్తే అతడి నుంచి సమాధానం లేదు. తంత్రి కావచ్చు, మేల్‌శాంతి కావచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఈ పదవులలో ఉన్నవాళ్లు దోచే తీరు కూడా భయానకం. మేల్‌శాంతి పూజాదికాలు నిర్వహిస్తాడు. వాటిని సరైన సమయంలో నిర్దేశించే విధంగా పర్యవేక్షించేవాడు తంత్రి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కేరళలో హిందూత్వకు బెడద ఏర్పడిరది. కోర్టులు, రాజకీయ పార్టీలు, ముస్లిం మతోన్మాదులు మూకుమ్మడిగా హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది గమనించడానికి హిందువులకు ఇంకా ఎంతకాలం పడుతుందో అర్ధం కావడం లేదు. హిందూ ఆలయాల పట్ల అత్యంత అమర్యాదకర ధోరణితో ఉన్న కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కూ ఇప్పటికీ ఓటు వేయడానికి వారికి మనసు ఎలా ఒప్పుతుందో అసలే అర్ధం కాదు.
హిందూద్వేషులే ఆలయాల ధర్మకర్తలు
కేరళలో ఐదు దేవసం బోర్డులు ఉన్నాయి. ఒక బోర్డు పరిధిలో అనేక ఆలయాలు ఉంటాయి. ట్రావెన్కూర్ (1249 ఆలయాల మీద అజమాయిషీ), మలబార్ దేవసం బోర్డు (1401 ఆలయాలు), కొచ్చిన్ బోర్డు (ఒకనాటి కొచ్చిన్ రాష్ట్రంలోని అన్ని ఆలయాలు), గురువాయూర్ (12 ఆలయాలు), కూడల్‌మానిక్కం (ఒకే ఆలయం ఉంది. కానీ ఐదు దేవసాలలోను సభ్యత్వం ఉంది) అనే ఐదు బోర్డులు అక్కడ హిందూ దేవుళ్ల సంపదను అడ్డంగా బొక్కుతున్నాయి. కానీ తిరువనంతపురం పద్మనాభస్వామి దేవస్థానం స్వతంత్రంగా ఉంది. ఆ దేవస్థానాన్ని కూడా కబ్జా చేయాలని కమ్యూనిస్టు ప్రభుత్వం చాలా ఎత్తులే వేసింది. కానీ అర్చక స్వాముల పట్టుదల, స్థానికుల పోరాటం, వంశ పారంపర్య ధర్మకర్తల ఆశయం కమ్యూనిస్టుల ఆటలు సాగనివ్వడం లేదు. మొత్తంగా ఆ ఐదు దేవసాల పరిధిలో 3000 దేవాలయాలు ఉన్నాయి. కానీ తాజాగా బయటపడిన అక్రమాలు కేవలం రెండు ముఖ్య ఆలయాలకు సంబంధించినవే.
దేవసం బోర్డులు పెద్ద సంఖ్యలో ఆలయాలను అజమాయిషీ చేస్తాయి. దేవసం బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది. ఆ బోర్డుల అధ్యక్షులుగా, సభ్యులుగా అధికార పార్టీ సభ్యులనే నామినేట్ చేస్తారు. ప్రతి బోర్డుకు ఒక మంత్రి ప్యవేక్షకునిగా ఉంటాడు. కేరళలో హిందూ ఆలయాలను కమ్యూనిస్టులు జాతీయ చేశారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యాఖ్యానించారు కూడా. దీనితో ట్రావెన్కూర్ దేవసం బోర్డు మాజీ చైర్మన్ కె. అనంతగోపన్ మండిపడ్డారు. కోర్టులు కూడా చాలాసార్లు సీపీఎం సర్కారు దుండగీడుతనం మీద ఘాటుగానే స్పందించాయి. ట్రావెన్కూర్ దేవసం బోర్డు కమిషనర్‌గా సీఎన్ రామన్ అనే అతడిని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే అతడు సీపీఎం నాయకుడు. డిసెంబర్ 14, 2023న అతడిని నియమించారు. కానీ పదవీ విరమణ రోజునే ఈ తీర్పు వచ్చింది.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వీటి అధ్యక్షులు, సభ్యులు మారుతూ ఉంటారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల రాజకీయ నిరుద్యోగులకు ఇవి పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి సభ్యులు మారినప్పుడల్లా కొత్త దోపిడీ మొదలవుతూ ఉంటుంది. వీళ్ల ఘనకార్యం ఒక్కటే దేవస్థానాల ఆస్తులను పీకల దాకా బొక్కడం. కానీ కేరళలో ప్రభుత్వం అధీనంలో కాకుండా వ్యక్తులు, కుటుంబాలు, ఇతర సంస్థలు నడుపుతున్న దేవాలయాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ముఖ్యంగా అవినీతి లేకుండా సజావుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మోటారు వాహనాల శాఖ, వాటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తాలూకా ఆఫీసులు ఉంటాయి. వీటిలాగే దేవస్థానాలు కూడా అవినీతి మయమైపోయాయి.దేవసం బోర్డులను తక్షణం రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది.
ఈ మకిలి దేవసాలన్నీ 2023లో పెద్ద ఘనకార్యం చేయబోయాయి. దేవసం బోర్డుల అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయ ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు నిర్వహించరాదని, శిక్షావర్గలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే పని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చేసింది. అయ్యప్ప ఆలయంలో బంగారం కాజేసిన ట్రావెన్కూర్ దేవసం బోర్డు గుళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు నడిపితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించడమే వింత. శాఖల నడపడం వల్ల ఆలయాల పవిత్రకు భంగం వాటిల్లుతున్నదని భక్తులు గగ్గోలు పెట్టారని దేవసం ఆరోపణ. అయితే క్రైస్తవులను, ముస్లింలను రోజువారీ కూలీలు కింద ఈ ఆలయాలలో పని చేయడానికి నియమించడానికి ఈ బోర్డులు ప్రయత్నించాయి.
దేవాలయాలలో జరిగే ఉత్సవాలను కమ్యూనిస్టులు పార్టీ ప్రచార కార్యక్రమాలుగా తయారు చేవారు. గడచిన ఐదేళ్లలో ఈ ధోరణి బాగా ముదిరింది. హిందూ దేవాలయంలో జరిగిన ఒక ఉత్సవం వీడియో ఆ మధ్య బయటపడిరది. కానీ అది ఎక్కడా హిందూ ఆలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలా లేదు. వేదిక వెనుక డీవైఎఫ్‌ఐ (సీపీఎం విద్యార్థి విభాగం) పేరు రాశారు. అదొక సంగీత కార్యక్రమం. అందులో కమ్యూనిస్టు లను ఆకాశానికి ఎత్తేస్తూ పాట ఉంది. కడక్కల్ దేవి (కొల్లాం జిల్లా) ఉత్సవాలలోను ఇదే జరిగింది. ఇదే ఆలయంలో ఏడాది క్రితం నవ కేరళ ఉత్సవం జరపతలపెట్టారు. కానీ హైకోర్టు జోక్యంతో వేరే చోటికి వేదిక మారింది. ఆలయ ప్రాంగణాలు రాజకీయ ప్రచారానికి కాదని కోర్టు గుర్తు చేయవలసి వచ్చింది. హిందువులు జరుపుకునే ప్రతి పండుగను కమ్యూనిస్టులు హేళన చేస్తారు. కానీ ఆ పండుగలను, ఆలయాలలో జరిగే ఉత్సవాలను తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవ డానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోరు. కడక్కల్ దేవి ఆలయం గొడవ సద్దుమణగక ముందే ప్రముఖ గాయని గౌరీలక్ష్మి ఒక ఆలయంలో పాడిన విప్లవగీతం మళ్లీ రగడ రేపింది. గౌరీలక్ష్మి అక్కడ ఒక్కచోటే కాదు, ఎక్కడ హిందూ ఆలయంలో ఉత్సవం జరిగినా ఆ పాటే పాడుతుందని తరువాత బయటపడిరది.
తీర్పులే ఆసరాగా రెచ్చిపోయిన కామ్రేడ్లు
కేరళలో వరసగా రెండు పర్యాయాలు కమ్యూనిస్టు ప్రభుత్వం ఎన్నిక కావడం హిందూ ఆలయాలకు, ధర్మానికి పెద్ద ముప్పుగానే పరిగణించిందంటే అసత్యం కాదు. కొన్ని కొన్ని సమయాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగానే ఉంది. భక్తుల మనోభావాలను, ఆలయ సంప్రదాయాలకు, విశ్వాసాలకు విలువ ఇవ్వకుండా కోర్టులు వ్యవహరించాయి. ఇది అత్యంత దురదృష్టకరం. అయ్యప్ప
ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు 2018లో హిందువులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ తీర్పు ఇచ్చింది.అది అయ్యప్ప ఆలయం సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమైనదని చెప్పడానికి ఎవరికీ సందేహం లేదు. రుతుస్రావం మొదలు కాని, లేదా ముగిసిన స్త్రీలకే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంది. కాబట్టి అయ్యప్ప దర్శనం స్త్రీలకు లేనేలేదని చెప్పడం, దానిని వివక్షగా చిత్రించడం శుద్ధ అబద్ధం. కానీ అన్ని వయసుల వారిని ప్రవేశపెట్టవలసిందేనని సమాన హక్కు పేరుతో సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి ఇప్పటికీ మసీదులలో స్త్రీలకు ప్రవేశం లేదు. కానీ దాని గురించి ఏ మహిళా సంఘం ఇంతవరకు కోర్టుకు వెళ్లలేదు. ముస్లిం మహిళల సమాన హక్కు కోసం ఏ కోర్టూ సుమొటొగా తీసుకోనూలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగమేఘాల మీద అమలు చేశాడు. ఆ వ్యాజ్యం వేసినదే హిందూత్వానికి ఎలాంటి సంబంధం లేని, నీతి నియమాలు లేని, సెక్యులరిస్టులమని చెప్పుకునే కొందరు స్త్రీలు. ఇంకా చెప్పాలంటే అమ్ముడుపోయిన మేధావులు. అయితే కోర్టు ఆదేశం తరువాత ఆ వ్యాజ్యం నడిపిన వారిలో చాలామంది అసలు అయ్యప్ప దర్శనానికి రాలేదు. కానీ ముగ్గురు కరుడగట్టిన హిందూ వ్యతిరేకులైన మహిళలను పినరయి విజయన్ ప్రభుత్వం ఏరుకొచ్చి మరీ లోపలికి ప్రవేశపెట్టదలిచింది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో ఆ పనిచేసింది కూడా. కనకదుర్గ, రహన్ ఫాతిమా, బిందు అమ్మాణి అనే ఆ ముగ్గురుని పవిత్ర అయ్యప్ప గుడిలోకి తీసుకువెళ్లే ముందు ఓ అతిథిగృహంలో పెట్టి గొడ్డుమాంసం, పరాటాలతో మేపారు. ఆ తరువాతే గుడిలోకి (సన్నిధానం) తీసుకువెళ్లారు. ఈ సంగతి కొందరు ప్రముఖులు పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఇటీవల బయట పెట్టారు. కాగా, హిందూ ద్వేషులను ఆచారానికి విరుద్ధంగా గుడిలోకి ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరిన ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను రద్దీ పేరుతో తిప్పి పంపడం, మెడలోని రుద్రాక్షలను తొలగించమని ఆదేశించడం వంటి నీచమైన పనులు చేయడానికి మాత్రం చాలా సందర్భాలలో వెనకాడడం లేదని విమర్శలు ఉన్నాయి.
హిందూ ద్వేషులైన మహిళల ప్రవేశాన్ని హిందూ సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిలో స్త్రీలు కూడా ఎక్కువే. అయితే మహిళలు అని కూడా చూడకుండా పినరయి విజయన్ పశుబలం ప్రదర్శించి, తనలోని ఎర్రపశువును లోకానికి ప్రదర్శించారు. అప్పుడు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కె. సుధాకరన్ పినరయి చర్యకు నిరసనగా ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కానీ ఢల్లీిలోని టెన్త్ జనపథ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గిపోయారని చెబుతారు. ఈ కాంగ్రెస్ ఇప్పుడు బంగారం దొంగతనం గురించి ఘోషిస్తున్న అయ్యప్ప భక్తులకు మద్దతు అంటూ బయలు దేరింది. మద్దతు ఇవ్వవచ్చు. కానీ సనాతన ధర్మం వంటి మాటలు ఏ సభలలోను వినిపించరాదని టెన్త్ జనపథ్ నుంచి ఆదేశాలు మళ్లీ వచ్చాయని కూడా చెబుతున్నారు.
– జాగృతి డెస్క్