మీరు కొంతమంది వ్యక్తులపై వారికి తెలియకుండానే ద్వేషాన్ని పెంచుకుంటారు. గురు గోల్వాల్కర్ చాలా కాలంగా నేను ద్వేషించే వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు! మత కల్లోలాల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర, మహాత్ముడి హత్య, భారతదేశాన్ని లౌకికరాజ్యం నుండి హిందూరాష్ట్రంగా మార్చాలనే చర్చను నేను మరచిపోలేను కాబట్టి. అయితే, ఒక జర్నలిస్టుగా నేను ఆయనను కలిసే అవకాశాన్ని తిరస్కరించలేకపోయాను.
నేను యూనిఫామ్‌లో ఉన్న స్వయంసేవకుల సమూహాన్ని ఎదుర్కొంటానని అనుకున్నాను. నా కారు నంబర్‌ను తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు. సరికదా కనీసం మఫ్టీలో ఉన్న సీఐడీ అధికారులు కూడా నాకు తారసపడలేదు. అది ఒక మధ్యతరగతి అపార్ట్‌మెంట్. లోపల పూజలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బయట వరుసగా చెప్పులు. అగర్బత్తి సువాసన. లోపల ఎక్కడో మహిళల సందడి. గిన్నెల చప్పుడు. ఒక చిన్న గదిలో మచ్చలేని తెల్లటి కుర్తాలు, ధోతీలలో డజను మంది పురుషులు కూర్చొని ఉన్నారు.స్వచ్ఛంగా, నిష్కల్మషంగా కనిపిస్తున్నారు. మహారాష్ట్ర బ్రాహ్మణులు మాత్రమే అలా ఉండగలరు. భుజాల వరకు నల్లటి జుట్టు, నోటిని కప్పుతూ మీసం, వేలాడుతూ మెరిసే గడ్డం, చెరగని చిరునవ్వు, కళ్లద్దాల వెనుక కాంతిమంతమైన నల్లటి కళ్లతో, అరవైల మధ్యలో ఉన్న బక్కపలచని వ్యక్తిలా గురు గోల్వాల్కర్ కనిపించారు. ఆయన చూడ్డానికి అచ్చం భారతీయ హో చి మిన్ లాగా ఉన్నారు. ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకు న్నారు. అయినప్పటికీ అసాధారణంగా ఆరోగ్యంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు.
గురుస్థానంలో ఉన్న ఆయన నా నుంచి ఒక శిష్య సంప్రదాయాన్ని ఆశిస్తారని నేను భావించాను.
కానీ ఆయన నాకు అలా చేసే అవకాశం ఇవ్వలేదు. నేను ఆయన పాదాలను తాకడానికి వంగు తుండగా, తన ఎముకలకు చర్మం అంటించినట్టు ఉన్న సన్నని వేళ్లతో నా చేతిని పట్టుకున్నారు. తన పక్కన ఉన్న ఆసనంపైన నన్ను కూర్చుండపెట్టారు. వెంటనే మాట కలుపుతూ మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. నేను కొంతకాలంగా అదే ఆశిస్తున్నాను అని చెప్పారు. ఆయన పలుకులు స్వచ్ఛమైన హిందీ భాషలో వినిపించాయి.
నేను కూడా అని నేను పొడిపొడిగా జవాబి చ్చాను. నేను మీ బంచ్ ఆఫ్ లెటర్స్ చదివినప్పటి నుండి.. అని నేను చెబుతుండగా, బంచ్ ఆఫ్ థాట్స్ (గురూజీ లేఖావళి, పాంచజన్యం తెలుగు అనువాదం) అని నన్ను సరిదిద్దారు. ఆయనకు దానిపై నా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని లేదు. ఆయన నా చేతుల్లో ఒకదాన్ని తన చేతుల్లోకి తీసుకుని దానిపై సుతారంగా తట్టారు. ఆయన నావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఆ తర్వాత? అని అడిగారు.
నాకు ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియడం లేదు. మీరు ప్రచారానికి దూరంగా ఉంటారని, మీ సంస్థ రహస్యంగా ఉంటుందని విన్నాను
మేము ప్రచారం కోరుకోవడం లేదు అనేది నిజమే కానీ మా గురించి రహస్యం ఏమీ లేదు. మీరు కావాలంటే ఏదైనా నన్ను అడగండి!
జాక్ కుర్రాన్ రాసిన ది ఆర్‌ఎస్‌ఎస్ అండ్ హిందూ మిలిటరిజంలో మీ ఉద్యమం గురించి చదివాను. ఆయన ఇలా అంటారు…
అది పక్షపాతంతో కూడుకున్న కథనం అని అంటూ గురూజీ జోక్యం చేసుకున్నారు. (ఆ అభిప్రాయం) అన్యాయమైంది, సరికానిది. అతడు నాతో పాటుగా చాలా మందిని తప్పుగా ఉటంకిం చాడు. మా ఉద్యమంలో సైనికవాదం లేదు. మేము క్రమశిక్షణకు విలువ ఇస్తామనేది వేరే సంగతి అని అన్నారు. నేను కుర్రాన్‌ను ఐరోపా, ఆఫ్రికాలో సీఐఏ కార్యకలాపాల అధిపతిగా వర్ణించే ఒక కథనాన్ని చదివానని ఆయనతో అన్నాను. నేను దానిని ఎప్పుడూ శంకించలేదు అని చెప్పాను. అతడు నాకు ఇరవై సంవత్సరాలుగా తెలుసు అని నేను చాలా అమాయకంగా అన్నాను.
గురూజీ నావైపు నవ్వుతూ చూస్తూ ఇది నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు అని అన్నారు. ఈ వ్యాఖ్య కుర్రాన్‌ను సీఐఏకి చెందిన వ్యక్తి అని నేను అన్నదానిపైననా? లేక నా అమాయకత్వంపైన చేసిందా? అనేది నాకు అర్థం కాలేదు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన ఒక విషయం నన్ను కలవరపెడుతోంది. మీరు అనుమతిస్తే, నేను వీలైనంత నిర్మొహమాటంగా వివరిస్తాను అని అన్నాను
అలాగే కానివ్వండి! అని గురూజీ అన్నారు.
మైనారిటీల పట్ల, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింల పట్ల మీ వైఖరి అని అడిగాను.
క్రైస్తవులు రోగులకు మందులు లేదా ఆకలితో ఉన్నవారికి రొట్టె ఇస్తూనే తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి అలాంటి వారి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకూడదు. భారతీయ చర్చిలను రోమ్ నుండి విముక్తి కల్పిస్తూ, వాటికి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ తీసుకున్న చర్య పట్ల నేను సంతోషిస్తున్నాను అని బదులిచ్చారు
ముస్లింల సంగతేంటి? అని అడిగాను.
వాళ్ల సంగతి ఏంటి? అని గురూజీ ఎదురు ప్రశ్నించారు.
చాలా మంది ముస్లింలు భారతదేశం, పాకిస్తాన్ రెండింటి పట్ల ప్రదర్శిస్తున్న ద్వంద్వ విధేయతలకు చారిత్రక కారణాలే హేతువని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. హిందువులు కూడా దీనికి కారణమని చెప్పవచ్చు. విభజన తర్వాత వారిని బాధపెట్టిన అభద్రతా భావన నుండి కూడా ఇది పుడుతుంది. ఏదేమైనా, కొంతమంది చేసిన తప్పులకు మొత్తం సమాజాన్ని బాధ్యులుగా చేయలేము.
గురూజీ, మనతో పాటుగా ఇక్కడ ఆరు కోట్ల మంది భారతీయ ముస్లింలు ఉన్నారు అని అన్నాను. మనం వారిని నిర్మూలించలేము, వారిని వెళ్లగొట్ట లేము, వారి మతం మార్చలేము. ఇది వారి ఇల్లు. వారిలో ఇది నాది అనే భావన కలిగేలా మనం వారికి భరోసా ఇవ్వాలి. వారి హృదయాలను ప్రేమతో గెలుచుకుందాం. ఇది ఒక కథనంలో.. అని నేను అంటుండగా, ఆయన మధ్యలో కల్పించు కుంటూ నేను దీని వరుస మారుస్తాను అని అన్నారు. నిజానికి ముస్లింల పట్ల ఒక్కగానొక్క విధానం ఏదైనా ఉందంటే అది ప్రేమతో వారి విధేయతను గెలుచు కోవడమే అని నేను అంటాను అని తెలిపారు.
ఆయన మాటలతో ఆడుకుంటున్నారా? లేక ఆయన ఆ మాటలను సరైన అవగాహనతోనే అన్నారా? అని నేను ఆశ్చర్యపోయాను. ఆయన తన వాదనకు మరింత బలం చేకూరుస్తున్నట్టుగా మాట్లాడుతూ జమాతే-ఇ-ఇస్లామీ ప్రతినిధి బృందం నన్ను చూడటానికి వచ్చింది. ముస్లింలు భారతదేశాన్ని పాలించిన సంగతిని మర్చిపోవాలని నేను వారికి చెప్పాను. వారు విదేశీ ముస్లిం దేశాలను తమ మాతృభూమిగా చూడకూడదు. వారు భారతీయతా ప్రధాన స్రవంతిలో చేరాలి అని అన్నారు.
ఎలా? అని అడిగాను.
మనం వారికి విషయాలను వివరించాలి. కొన్నిసార్లు ముస్లింలు చేసే పనులకు వారిపై కోపం వస్తుంది, కానీ హిందూ రక్తం ఎప్పుడూ ఎక్కువ కాలం ద్వేషాన్ని కలిగి ఉండదు. కాలం దివ్యమైన ఔషధం. అది దేన్నయినా మాన్చివేస్తుంది. నేను ఆశావాదిని. హిందూత్వం, ఇస్లాం ఒకదానితో ఒకటి కలిసిమెలిసి జీవించడం నేర్చుకుంటాయని ఆశిస్తు న్నాను అని అన్నారు.
అందరికీ టీలు వచ్చాయి. గురూజీ చేతిలోని గాజు మగ్గు అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. మిగతా వారిలాగా పింగాణీతో చేసిన కప్పులో ఎందుకు తాగరని నేను ఆయన్ను అడిగాను. నేను ఎప్పుడూ ఈ మగ్గులోనే తీసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా దీనిని నాతో తీసుకెళ్తాను అని గురూజీ నవ్వుతూ చెప్పారు. ఆయన సన్నిహిత సహచరుడు, ఆర్‌ఎస్‌ఎస్‌కి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ థాట్టే దాని గురించి మాట్లాడుతూ పింగాణీ అరిగి పోయి లోపల ఉన్న బంకమట్టిని బహిర్గతం చేస్తుంది. బంకమట్టి సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. అని చెప్పారు.
ప్రపంచంలో అనేక మంది మతం లేనివారుగా, అజ్ఞేయవాదులు(స్త్రఅశీఱమీఱ)గా మారుతున్నప్పుడు మీరు మీ విశ్వాసాన్ని మతంపై ఎందుకు ఉంచు తారు? అని అడిగాను.
హిందూత్వం ఎటువంటి సిద్ధాంతం లేని కారణంగానే దృఢంగా ఉంది. గతంలో అందులో అజ్ఞేయవాదులు ఉన్నారు. అది మరే ఇతర మత వ్యవస్థ కంటే కూడా మతతత్వపు అల తాకిడిని బాగా తట్టుకుంటుంది అని అన్నారు.
మీరు అలా ఎలా చెప్పగలరు? నిదర్శనం మరో విధంగా ఉంది. స్థిరంగా నిలబడి, ప్రజలపై తమ పట్టును పెంచుకుంటున్న కాథలిక్కులు, వారి కంటే ఇస్లాం మతాలు సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి అని అడిగాను.
ఇది ఒక సంధి కాలం. అజ్ఞేయవాదం వాటిని అధిగమించినట్టుగా హిందూత్వను అధిగమించలేదు. నిఘంటువు అర్థంలో మనది ఒక మతం కాదు అది ఒక ధర్మం, ఒక జీవన విధానం. హిందూత్వం అజ్ఞేయవాదాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది అని చెప్పారు.
నేను గురూజీ నుంచి అరగంట కంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నప్పటికీ. ఆయనలో ఎలాంటి అసహనం కనిపించలేదు. నేను సెలవు తీసుకుంటున్న ప్పుడు నేను ఆయన పాదాలను తాకకుండా నా చేతులను ఆయన మరోసారి నిలువరించారు.
నేను ఆయనకు ప్రభావితుడనయ్యానా? అంటే అయ్యాననే అంగీకరిస్తున్నాను. ఆయన తన అభిప్రాయంతో నన్ను ఏకీభవించేలా చేయడానికి ప్రయత్నించలేదు. అదేసయమంలో నాతో ఏకీభవించ డానికి తాను సిద్ధంగా ఉన్నానని అభిప్రాయాన్ని నాలో కలిగించారు. నాగపూర్‌లో జరిగేవి స్వయంగా చూడాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని నేను స్వీకరించాను. బహుశా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమైన హిందూ-ముస్లిం ఐక్యతకు నేను ఆయనను దగ్గర చేయవచ్చు. లేకుంటే నేను ఒక సగటు సర్దార్జీగా ఉండిపోతానా?
‘RSS an Open Book
Less Known Dimenstions’ నుంచి
ట్రెయిన్ టు పాకిస్తాన్ రచయిత మజిలీ
కుశ్వంత్ సింగ్ (1915-2014) ప్రఖ్యాత ఇండో-ఆంగ్లియన్ రచయిత. పత్రికా రచయిత. నవలాకారుడు. విఖ్యాత కాలమిస్ట్. ఢిల్లీ, లాహోర్, లండన్‌లలో (ఎల్‌ఎల్‌ఎం) చదివారు. కొద్దికాలం లాహోర్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని అభ్యసిం చారు. బ్రిటిష్‌వారు దేశం విడిచి వెళ్లడానికి కొద్ది ముందే భారత విదేశాంగ విభాగంలో చేరారు. ఆకాశవాణిలో, యునెస్కోలో పనిచేశారు. కొన్ని దినపత్రికలలో, వారపత్రికలలో పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. ఇందిరా గాంధీ సిఫారసుతో హిందూస్తాన్ టైమ్స్‌కు సంపాదకుడయ్యారు. ఎన్నో కథలు రాశారు. ఆయన నవల ట్రెయిన్ టు పాకిస్తాన్ దేశ విభజన నాటి విషాదాన్ని, విద్వేషాలను చిత్రించింది. రంజిత్‌సింగ్ చరిత్ర, సిక్కుల చరిత్ర, గదర్ పార్టీ చరిత్రల గురించి కూడా ఆయన రాశారు. 1980-1986 మధ్య రాజ్యసభ సభ్యుడు. 1974లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అయితే ఆపరేషన్ బ్లూస్టార్ (అమృత్‌సర్ స్వర్ణాలయంపై సైనిక చర్య)కు నిరసనగా ఆ పురస్కారాన్ని వాపసు ఇచ్చారు.అయితే 2007లో మళ్లీ పద్మ విభూషణ్ పురస్కారం స్వీకరించారు.