‘రామాయణం’, ‘భారతం’, ‘యోగవాసిష్ఠం’, ‘శివరహస్యమ్‌’` మహేతిహాసాలని పెద్దలు చెప్పారు. మహాభారతం కంటే విస్తృతిలో పెద్దది-‘శివరహస్యమ్‌’.

భారతం లక్ష శ్లోకాల మహత్తర గ్రంథం. శివరహస్యమ్‌ మరొక ఇరవై ఆరువేల శ్లోకాలు అదనంగా కలిగి ఉంది. గ్రంథాలు నిక్షిప్తమైన గ్రంథమన్న పేరు. ప్రవచనాలన్నీ పక్కన పెట్టి కాశీక్షేత్రంలో కూర్చుని ప్రఖ్యాత ప్రవచనకారులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శివరహస్యమ్‌’ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు. శివునికి సంబంధించినవి శివరహస్యమ్‌లో ఉన్నవే ఎక్కడైనా ఉన్నాయి. అందులో లేనివి ఎక్కడా లేవని చెప్పవచ్చునంటారు షణ్ముఖశర్మ. శివోపాసనకీ, శివజ్ఞానానికీ ఇది చిరునామా. ఈ గ్రంథం కూడా ‘మహేతిహాసం’ అని తనను తాను పరిచయం చేసుకుంది. ఇలాంటి గ్రంథాన్ని చదివి (ప్రవచనంగా) చెప్పే భాగ్యం తెలుగువాడిగా ప్రప్రథమంగా తనకు దక్కడం శివానుగ్రహమేనని సవినయంగా చెప్పారు షణ్ముఖశర్మ.


ఈ గ్రంథం వేద-ఉపనిషత్తులను పేర్కొంటూ శివపారమ్యాన్ని (పరమ సిద్ధాంతం) నిరూపిస్తున్నది. ప్రధానంగా అద్వైతమే పరమ సిద్ధాంతమని ప్రబోధిస్తున్నది. ఆరవ అంశ (శంకర) రుభుగీత అద్భుతంగా ఉపనిషత్తత్త్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఆసేతుశీతాచలం ఉన్న శివక్షేత్రాల విశేషాలు శివధర్మాలు మహిమాన్విత స్తోత్రాలు, నామాలు వివరంగా ఉన్నాయి. గంగ కూడా భువికి చేరని కాలం నాటి కాశీని వర్ణించారు. అనేక స్తోత్రాలలో చక్కని వృత్తాలు ఛందోశైఖరి, శబ్దాలంకార శోభ సౌష్టవంగా ఉండి రసజ్ఞులను అలరిస్తాయి. ఉదాత్త భావనలు, వేదోపనిష్మంత్రాలకు భాష్యరూపాలు ఈ స్తోత్రాలలో కోకొల్లలు.

తొమ్మిదో అంశ (సదాశివ)లో ఆదిశంకరులు, అప్పయ్యదీక్షితుల చరిత్రలతో పాటు నాయనార్ల వృత్తాంతాలు చెప్పారు. అదీ భవిష్యత్తులో కలియుగంలో జరగనున్న కథలుగా చెప్పినప్పటికీ జరిగిన తరువాత రాసినవిగానే పరిగణించాలని కొందరికి అనిపించవచ్చు. అయినా భక్తుల గాథలకు చోటు కల్పించిన గ్రంథంగా చూడవచ్చు. ప్రసిద్ధి చెందిన పుష్పదంత కృత ‘శివ మహిమ్నఃస్తవం’, దుర్వాస కృత ‘దేవీ మహిమ్నః స్తవం’ వంటివి ఈ గ్రంథంలో ఉన్నాయి.

నాన్నగారే గురువుగా నేర్చిన సూత్ర భాష్యగ్రంథాలు, ఉపనిషద్‌ భాష్య గ్రంథాలు, పురాణాలు, కావ్యాలు ఒక సంస్కారంతో, స్మృతిలో ఉండటం చేత శివరహస్యమ్‌ చదువుతుంటే గుర్తుకు వచ్చాయని తన హృదయావిష్కారంలో షణ్ముఖశర్మ చెప్పారు. అంటే ఆ ప్రామాణిక గ్రంథాలలోని అంశాలన్నీ ఇందులో ఉన్నాయనే. వేదం వలె ఆగమాలు, స్మృతులు కూడా మనకు ప్రమాణాలు. ‘శివరహాస్యమ్‌’ కూడా అంతటి ప్రామాణికం. దీని కర్త ఎవరు? అని పరిశీలిస్తే గ్రంథమంతా స్కందుడు జైగీషవ్య మహర్షికి బోధిస్తున్నట్టుగా ఉన్నది. కొన్నిచోట్ల సూతుల వారు చెప్పినట్టుగా ఉన్న కారణంగా వ్యాసప్రోక్తమేమో అనిపించవచ్చు. వ్యాస ప్రోక్తమంటే అవుననే. కానీ ఇది సూత పౌరాణికుడు మహేశ్వర సత్రయాగం జరుగుతూ ఉండగా నైమిశారణ్యంలో చెప్పారు అన్నట్టుగా ఉంది. సూతుడు చెప్పాడు అంటే వ్యాస శిష్యుడైన సూతుడు చెప్పినట్లే భావించాలి. మహాభారతం కూడా సూతప్రోక్తంగానే కనబడుతుంది. ఇక యోగవాసిష్ఠం, ఇది వాల్మీకికృతమని ఉంది. అక్కడ సూతుల ప్రస్తావన లేదు. అది వాల్మీకికృతం అవచ్చు కాకపోవచ్చు. అయినా ఇతిహాసమనడానికి కావలసిన లక్షణాలున్న పూర్తి ప్రామాణిక గ్రంథం. విద్యారణ్యుల వంటి మహాత్ములు అనేకచోట్ల యోగవాసిష్ఠాన్ని ఉటంకించారు.

 శివరహస్యానికి పురాణ, ఇతిహాస, కావ్య లక్షణాలు మూడూ ఉన్నాయి. ఇందులోని అధ్యాయాలని ‘అంశ’లన్నారు. వాటి నామాలు కూడా శివునివే` 1మహేశ్వర 2 భగ 3 హర 4 శివ 5 భర్గ 6 శంకర 7ఉగ్ర 8 భీమ 9 సదాశివ 10 ఈశ్వర 11 మహాదేవ 12 ఈశాన. ఏ అంశ తీసుకున్నా అనేక విషయాలు వస్తాయి. రచనలో శార్దూలము, మత్తేభము, దర్ధరి వంటి దీర్ఘవృత్తాలు ఉంటాయి, కొన్నిచోట్ల సంస్కృతంలో అనుష్టుప్‌లోను ఎక్కువ వృత్తాలు, కొన్నిచోట్ల అరుదైన, స్వతంత్ర వృత్తాలు కనబడుతాయి, గేయరూపాలలో. అవి చదువుతుంటే ఒక ఆనందం, అనుభూతి కలుగుతుంటాయి. శివరహస్యమ్‌లో వృత్తాలు అనేదే పెద్ద పరిశోధనాంశం. బ్రహ్మసూత్రంలో కొన్ని ప్రధాన సూత్రాలు తీసుకుంటూ, ఆ సూత్రం శ్లోకంలో ప్రథమవాక్యంగా ఉండేటట్టు చేస్తూ మిగిలిన భాగమంతా వ్యాఖ్యానంలా రాశారు. శార్దూల, మత్తేభాలతో బ్రహ్మసూత్రాలను శ్లోకాలుగా చేసి భాష్యాలనందించిన శ్లోకాలు ఇందులో ఉన్నాయంటే ఎలాంటి గ్రంథమో ఊహించవచ్చు. సుమారు 7,8 శివ సహస్రనామ స్తోత్రాలు, వేదాలలో చెప్పిన అనేక శివనామాలు,రుద్ర సంబంధమైన శివనామాలతో కూర్చిన సహస్రనామాలు ఉన్నాయి. బాగా ప్రసిద్ధమైన శివమహిమ స్తోత్రం, ‘చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వైయమః’ స్తోత్రం ఉన్నాయి. స్తోత్ర సాహిత్యం వచ్చిన తరువాత శివసంబంధమైన విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి, గుదిగుచ్చారని ఎవరైనా అనుకున్నా అనుకోవచ్చు కూడా.

తొమ్మిదవ అంశ ప్రధానంగా శివభక్తుల గురించినది. కృత, త్రేతా, ద్వాపర యుగ లక్షణాలు చెబుతారు. ఇక కలియుగం ఎలా ఉంటుంది? ఇలాంటి కలిలో కూడా మనను తరింపచేయడానికి భగవదంశంతో కూడిన మహాత్ములు వస్తారు. అందులోనే ఆదిశంకరుల చరిత్ర, పరతత్త్వాచార్యులవారి చరిత్ర, అప్పయ్య దీక్షులవారి చరిత్రలు చెప్పారు. మహర్షుల గురించి లేదా మహాత్ముల గురించి చెప్పేటప్పుడు ఇది చెప్పారు. అటు తరువాత నయనార్‌ చరిత్ర పెరికి పురాణం ఉన్నాయి. కొందరు నయనార్‌లు `సుందర, అప్పర్‌, జ్ఞానసంబంధన్‌ ఇత్యాదుల కథలు ఉన్నాయి. అంటే ఇది భవిష్యత్‌తరాల కోసం చెప్పారు. అలా చెప్పినపుడు భవిష్యత్‌ కథలను మనం ఒప్పుకోవచ్చా? అంటే భాగవతాది గ్రంథాలలో కూడా భవిష్యత్‌ కథలు ఉన్నాయి. రుషుల రచనలలో వర్తమానం, గతం, భవిష్యత్‌ అని ఉండదు. వారి దృష్టే వేరు. అందుకే వారిది తపోదృష్టి అన్నారు. శివధర్మం అంటే శివభక్తులు పాటించవలసిన నియమాలు ఏ విధంగా ఉండాలి? అందులో బిల్వ మహాత్మ్వం, భస్మ మహాత్మ్వం, రుద్రాక్ష మహాత్మ్వం, వాటి ధారణ, విధానాలు గురించి చెబుతారు. ఒక్క రుద్రం అనే దాని గురించే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఆ రుద్రంలో ఏ మంత్రాలకు ఏ శక్తి ఉంది? ఎలా ప్రయోగిస్తే ఎలా లోకోపకారం కలిగించగలం? అని చెబుతూ రుద్రం బ్రహ్మ విద్య ఎలా అవుతుందో చెప్పడమే కాకుండా రుద్ర మంత్రాత్మక శివస్తోత్రమ్‌ అని ఒకటుంది ఇందులో, సుబ్రహ్మణ్యుడు చెప్పినట్టు. శార్దూల, మత్తేభం వృత్తాల్లో రుద్రం, నమకం; అందులో భాష్యం కూడా కలిపారు. అంటే భక్తులు జీవితాంతం చదువుకొనే గ్రంథంగా నిర్మించారు.

పేరుకు శివరహస్యమైనప్పటికీ, అమ్మవారి గురించి విశేషంగా వివరించారు. శ్రీవిద్యకు సంబంధించిన విషయాలు కొన్ని అద్భుత రీతిలో కనపడుతుంటాయి. కైలాస వర్ణన ఇందులో ఉన్నంత విస్తారంగా ఎక్కడా కనబడదు. శ్లోకాలు, స్తోత్రాలు ఇందులోవి ఎన్నో ఈనాడూ వాడుకుంటున్నాం. ఉదాహరణకు శివ మహిమల స్తుతి. పుష్పదంతుడు రాశాడు. దుర్వాసుడు దేవి మహిమ స్తుతి రాశాడని ఎవరు చెప్పారు? ‘చంద్రశేఖరమాత్రయే’ మార్గండేయ మహర్షిదని ఎవరు చెప్పారు? స్తోత్రరత్నాకరంలో చూస్తే మార్కండేయ కృతమని ఉంటుంది. మార్కండేయుడే ఆ అష్టకం రచించాడని ఎవరు చెప్పారు? శివరహస్యమ్‌ చెప్పింది. శివుడి పంచముఖానికి సంబంధించి శ్లోకాలు ఇందులోనే కనబడుతుంటాయి. శివార్చనలు చేసేటప్పుడు ‘శివరహస్య విధానేన’ అంటారు. శివరహస్యాన్ని ప్రమాణంగా తీసుకొని అనుష్టాలను తీసుకోవడం కనబడుతుంది.

ఈ మహేతిహాసం ఎక్కడ జన్మించింది! ఉత్తరాదినా? దక్షిణాదినా? దక్షిణాది మహాపురుషులైన ఆదిశంకరులు గురించి చెప్పారు కనుక దక్షిణాత్యులు ఎవరో రాసి పెట్టారు! పైగా దక్షిణాది గ్రంథాలయాలలో ఇవి దొరుకుతున్నాయి గనుక దాక్షిణాత్యులు రచించారు! అని వెంటనే నిర్ధారణకు వచ్చేవారుంటారు. కానీ ఔత్తరాహులకూ తెలియని శివక్షేత్ర వర్ణన ఇందులో ఉన్నది. అది హిమాలయాలలో, కేదారనాథ్‌ మొదలుకొని, కాశీ మహాక్షేత్రం అంతా చెబుతూ ఇందులో కాశీనే పరమక్షేత్రంగా చెబుతారు. అన్ని క్షేత్రాల యాత్రా పుణ్యం కాశీ వెళితే వస్తుందంటారు. అదే సమయంలో కాంచీపుర వర్ణన అత్యద్భుతంగా చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, చిదంబర మహాక్షేత్రాల గురించి అద్భుత రచనలు కనిపిస్తాయి. విశేషంగా సప్త శివక్షేత్ర మహిమ వర్ణన ఉంది.

ఇక రుభుగీత` ఇది రుభు`నిదాఘ అనే ఇద్దరు రుషుల సంవాదం. అది బ్రహ్మ ఉపదేశంగా కాక, బ్రహ్మానుభూతిగా కనబడుతుంది. ఒక అనుభూతి చెప్పినవాడు పలవరిస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుందే తప్ప, గురువు శిష్యునికి ఉపదేశిస్తున్నట్లు ఉండదు. ఆ తాదాత్మ్యం ఇందులో కనబడుతుంది. ప్రవచన రూపంలో రుభుగీతను విన్నవారికి కూడా అనుభూతులు ఉన్నాయి. రమణుల వారు ఈ గ్రంథంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఇంకాస్త ప్రాముఖ్యం లభించింది. కుంజుస్వామి అనే ఆయనను పిలిచి రమణులు చదవించుకునే వారని చెబుతారు, భక్తులు.అంత ప్రేమ. రుభుగీత నూటికి నూరుపాళ్లు అద్వైత సిద్ధాంతమే. రుభుగీత అద్వైతాన్ని ఎంత గట్టిగా చెబుతుందంటే,అది చెప్పనలవి కాదు.బ్రహ్మానుభూతి అని అద్భుతమైన మాట ఇందులో చూపిస్తారు. అంటే బ్రహ్మము తప్ప మరేది లేదు అనే విషయాన్ని జీవజగత్‌ భావనలో కూడా మిథ్యయే. మిథ్యాసక్త ప్రయోగం సహా అద్వైతాన్ని చూపిస్తారు రుభుగీతలో.

వేదంలో కర్మకాండలో వాడే మంత్ర విషయాలు ఇందులో ఉన్నాయి. చాలా ఉపనిషద్‌లు బయటకు వస్తాయి. అంతేకాదు కర్మకాండలో వాడేటటువంటి సోమయాగ మంత్రము మొదలైనవి కూడా ప్రస్తావన చేస్తారు. శివతత్వ ప్రాభవాన్ని రుజువు చేయడంలో వేదప్రామాణంగా చేశారు.కాశీమహాత్మ్యాన్ని ప్రత్యేకించి ఒక అంశగా కేటాయించారు. ఇంకా కథలు, ఇతివృత్తాలైతే ఎన్నో అద్భుతమైనవి  అవి చదువుతుంటే భక్తుల మనస్సు ద్రవించిపోతుంది. నమక, చమక స్తోత్ర రూపాలు, ‘రత్నసాను శరాసనమ్‌’ మొదలైన శ్లోకాలు కనబడుతుంటాయి.

 సికింద్రాబాద్‌లో కాంచి యతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఒక సందర్భంలో అన్నారు. శివరహస్యమే గొప్ప గ్రంథం. అందులో రుభుగీత ఇంకా గొప్పది` భారతంలో భగవద్గీతలాగా అని. అలాగే, ఇది ఉపనిషద్‌ సమానమైన గ్రంథం అని మరొక మాట. అదేవిధంగా మనకు యోగశాస్త్రాలు వీటిలో చూస్తే స్కాంద పురాణంలో సూత్రసంహిత ఎలాంటిదో, భారతంలో భగవద్గీత ఎలాంటిదో ఇది అలాంటిది అని చెప్పారు. మరోరకంగా చూస్తే మరొక్కటి కలుపుకోవచ్చునంటారు షణ్ముఖశర్మ` రామాయణంలో సుందరకాండలాగా అని.

శివరహస్యమ్‌ అచ్చురూపంలో మొట్టమొదటగా 1912 వచ్చింది. సదాశివ చెట్టియార్‌ అని, మహాశివభక్తుడు అచ్చు వేయించాలని తాళపత్ర గ్రంథాలను పండితులకు ఇచ్చారు. అప్పటికే శిథిలమైపోయాయి. ఒక తాళపత్ర గ్రంథాన్ని పరిష్కరించే పనిలో కొన్ని శ్లోకాల దగ్గర ఛందోబద్ధత, కొన్ని అక్షరాలు ఏవో అటో ఇటో అయినట్టు, వ్యాకరణ పరంగా కొన్ని వికృతులు సాధారణం. కానీ ఇందులో మహాశ్లోకాల రచనలలో ఇవి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రచనలను చూస్తుంటే సామాన్యకవులు రచించలేదనిపిస్తుంది. కాళిదాసాదులను మించిన రచన. వ్యాకరణదోషాలకూ, ఛందోభగ్నానికీ అవకాశం ఉండదు. కానీ అక్కడక్కడ ఎందుకు కనబడతాయంటే, అప్పుడు ఆ ఉపోద్ఘాతం రాసేటప్పుడు వాళ్లే వివరించారు, కొన్ని రచనలు శిథిలమై ఉన్నాయి, పండితులు కూడా పరిష్కరించడానికి వీలులేనట్టి విధంగా ఉన్నాయి. కనుక అవి ఎలా కనపడ్డాయో ఆ మేరకు రాశారు. కాబట్టి తాళపత్రాలు లభించాక దాన్ని పాఠాలలో కొందరు రాసుకుంటూ ఉంటారు. అవీ తాళపత్రాల మీదే. అవీ గ్రంథాలయాలలో దొరుకుతాయి. చాలా పరిష్కృతాలతో వచ్చిన పుస్తకం 1912లో మొదటి ప్రచురణగా వచ్చింది. దానికంటే ముందే రుభుగీత అచ్చులో వచ్చింది. తమిళ్‌ వృత్తాలతో ఛందోబద్ధంగా, తమిళ్‌ ఛందస్సుతో రచించారు మొట్టమొదటిగా, అనువాదంతో. తరువాత దానిని సంస్కృతంలోకి తీసుకువచ్చారు. 1912 తరువాత మూల శివరహాస్యమ్‌ కూడా వచ్చింది. అలా రుభుగీత ప్రత్యేకతను వెలికితెచ్చారు, మైసూర్‌లో.

శివరహస్యం ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాలంటే, విన్న తరువాత అనేకమంది ఆలోచనాధోరణులలో మార్పు వచ్చింది. జీవితంలోని అనేకరకాల భయాలను నుంచి బయటపడ్డారు. కొంతమంది నిరంతర శివార్చన మొదలుపెట్టారు. కొంతమంది ఆస్తిపాస్తులను త్యజించి కాశీక్షేత్రంలో స్థిరపడిపోయారు. ఇలా చూస్తూంటే ఇలాంటి శివరహస్యాలు పుస్తకరూపంలో తీసుకురావడం కూడా శివ సంకల్పం, ఈశ్వరాగ్రహం అన్నారు షణ్ముఖశర్మ.

మొత్తం భూగోళం ప్రశాంతత కోసం పరితపిస్తున్న వేళ 2020 డిసెంబర్‌లో ఆరంభించి 42 రోజుల పాటు ప్రవచనంగా ఆన్‌లైన్‌ ద్వారా శివరహస్యమ్‌ చెప్పారు షణ్ముఖశర్మ. ఆ ప్రవచనమే ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడిరది. సనాతన ధర్మాన్ని ఒక్కటిగా చూడగలిగే సంస్కారాన్ని కలిగిస్తుంది గనుక, శివరహస్యమ్‌ ఎంతో ఉపయుక్త గ్రంథం. ఇందులోని ప్రతి అక్షరం వేదప్రామాణ్యం ఉన్నదే. అక్టోబర్‌ 19న హైదరాబాద్‌లోని స్కందగిరి కల్యాణ మంటపంలో కంచి కామకోటి పీఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి ఆవిష్కరించారు. డాక్టర్‌ టీవీ నారాయణరావు, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ఆచార్య పెన్నా మధుసూదన్‌ పాల్గొన్నారు. చిట్టిమిల్ల శ్రీనివాస్‌, జయశ్రీ దంపతుల ఆర్థికసాయంతో ఈ గ్రంథం వెలువడిరది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE