‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది –

‌మీనాక్షి శ్రీనివాస్‌

నిశ్శబ్దంలో ఊరంతా ఆదమరచి నిద్రపోతోంది. అమావాస్య కావడంతో, అక్కడొకటీ అక్కడొకటీ నక్షత్రాలు మాత్రం మిణుకు మిణుకుమంటూ చీకటిని పారదోలే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రభుత్వం ప•క్కా ఇళ్లు కట్టి ఎన్నాళ్లో అవలేదు. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతూ, దీనంగా ఉన్నాయి.
అలాంటి ఓ ఇంట్లో, గౌరి పిల్లల మీద చెరో చెయ్యీ వేసి వెల్లకిలా పడుకుని, కిటికీ నుంచి కనబడుతున్న ఆకాశాన్ని చూస్తోంది.
‘మావ ఇంకా రాలేదు. రాకపోడం తనకి కొత్త కాదు’ కానీ సందేల జరిగింది పదే పదే గుర్తొచ్చి నిద్ర లేకుండా చేస్తోంది.
మావ..గంగులు మంచోడే. కష్టపడి సంపాదిస్తాడు. సంపాదించినది అట్టే కష్టపడకుండా ఏ రోజుదారోజే ‘కల్లు దుకాణం కనకం’ దగ్గర కరిగిస్తాడు.
చెప్పిచెప్పీ విసిగిపోయిన గౌరి, అతనినీ, అతని సంపాదననీ కల్లు దుకాణానికి వదిలేసి, పదిళ్లలో పని చేస్తూ, పిల్లలిద్దరినీ మున్సిపల్‌ ‌బడిలో చదివిస్తూ, గుట్టుగా సంసారం లాక్కొస్తోంది.
పిల్లలిద్దరూ తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని బుద్ధిగా చదువుకోవడం గౌరికి ఎనలేని సంతోషాన్ని, తృప్తినీ ఇస్తోంది.
‘రోజులు ఈ మాత్రంగా గడచి, పిల్లలిద్దరూ బాగా సదువుకోని పైకొత్తే అంతే సాలు దేవుడా!’ అనుకుంటూ నిబ్బరంగా ఉన్న గౌరికి ఉరుములేని పిడుగులా ఇప్పుడీ దురవస్థ.
‘ఏటీ సంగతి?’ ఆరా తీత్తే, తెల్సిన విషయానికి ఆమె గుండె నీరైపోయింది.
రెక్కాడితే కానీ, డొక్కాడని బతుకులు. ఆపైన మొగుడికున్న మాయదారి అలవాటు. అది తన ఒక్కదాని సమస్యే కాదు, కష్టం చేసుకు బ్రతికే సానామంది ఇళ్ళలో ఉన్న గొడవే.
ఏ మగాడూ కూలి డబ్బు పెళ్లాం దోసిట్లో పొయ్యడు. వాడి సంపాదన అంతా కల్లు దుకాణాలకే.
అయినా బాధపడకుండా ఎట్టానో నెట్టుకొచ్చేవాళ్లే ఎక్కువ.
కానీ ఈడికి ఏటుందని సెల్‌ ‌ఫోన్లో అప్పులిచ్చారో, ఇప్పుడు ఆ అప్పు తీర్చమని ఇంటి మీద పడడం ఏటో! ఏటీ, అర్థంకాటం లేదు గౌరికి.
అసలు సెల్లు ఫోన్‌లో అప్పులీయడం ఏటో అర్థం అయి సావటం లేదు.
రాళ్లు కరిగేటంత దీనంగా కాళ్లావేళ్లా పడితే పది రూకలు అప్పు పుట్టని ఈ కాలంలో ఈ యిసిత్రం ఏటో! అప్పు సేసినోడినొదిలేసి ఇలా ఇంటి మీద పడడం ఏటో!
మొగుడు మొబైల్‌ ‌లోన్‌ ‌యాప్‌లో ఇరవైవేలు రుణం తీసుకున్నాడనీ, రెండు నెలలుగా దమ్మిడీ కట్టలేదనీ, ఇప్పుడు అసలూ, వడ్డీ కలిపి యాభైవేలు అయిందనీ, అప్పటికప్పుడు తీర్చకపోతే వల్లకాదని గొడవపెడితే ఇంటి కాగితాలు తమకిచ్చాడనీ, వెంటనే ఖాళీ చెయ్యమనీ ఇంటిమీదకొచ్చి అల్లరి పెట్టారు.
తల దాచుకుందుకు ఈ గూడుంది కనకే, మొగుడలా ఉన్నా, తిన్నా తినకపోయినా ఎట్టానో నెట్టుకొస్తోంది. ఇప్పుడు ఉన్న పళంగా ఇంట్లోంచి పొమ్మంటే, ఏటి దారి?
బగమంతుడా ఇప్పుడేటి సెయ్యాల?
అయినా ఇళ్లన్నీ బాంకి తనఖాలో ఉన్నాయి కదా, కాయితాలు యీళ్లకెట్టా ఇస్తాడు ఆ దొంగ సచ్చినోడు. ఆళ్లెట్టా తీసుకుంటారు?
ఏటో! ఎట్టాగో రోజులు నెట్టుకొస్తంటే, మద్దెలో ఈ గోలేంటో?’ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రకొరిగింది గౌరి.
లిలిలి
‘‘ఇదిగో! రేపటి లోగా ఆ అప్పు తీర్చకపోతే వాళ్లు నావే కాదు, మార్ఫింగ్‌ ‌చేసి నీ న్యూడ్‌ ‌ఫోటోలు కూడా నెట్‌ ‌లోనూ, సోషల్‌ ‌మీడియాలోనూ పెడతారు. ఇద్దరం సిగ్గుతో ఉరేసుకుని చావాలి.
ఏదో రకంగా తీర్చక తప్పదు. ఇంటిని అమ్మేద్దాం. బ్యాంక్‌ ‌లోన్‌ ‌పోగా వచ్చింది ఆ అప్పు తీర్చేద్దాం. నా మాట విను జానూ!’’ చాలా సేపటిగా అదే చెబుతున్నాడేమో, అసహనంగా అన్నాడు రవి.
‘‘నీకసలు బుద్ధుందా! ఏమంత అవసరం వచ్చిందని అన్ని లక్షలు అప్పు చేసావ్‌? ‌పైగా దాని కోసం ఆఫీస్‌ ‌డబ్బు వాడేస్తావా! ఉద్యోగం పీకేసి, కేస్‌ ‌పెట్టారా, అవన్నీ ఇప్పుడు చల్లగా చెబుతున్నావా! అసలు నీకు ఏం అవసరం వచ్చింది అన్ని లక్షలు అప్పు చేయడానికి? ముందు అది చెప్పు.’’ కోపంతో భద్రకాళిలా ఊగిపోతోంది జాను.
‘‘అరే! అదే మాట ఎన్నిసార్లు అంటావు? ఏదో పాపం అన్నీ వదిలేసుకు వచ్చావు. బాగా చూసుకుందాం, ఈ అరకొర సంపాదనతో ఎన్నాళ్లని, జాక్పాట్‌ ‌కొట్టచ్చని ఆ బెట్టింగ్‌ ‌కట్టాను. ఓడిపోయి, దానికోసం చేసిన అప్పు తీర్చాలని నిన్నడిగితే లేవన్నావ్‌. ‌సర్లే నెమ్మదిగా తీర్చేయచ్చని, ఈజీగా వచ్చేస్తుంది కదా అని లోన్‌ ‌యాప్‌ ‌వాడాను.
వాళ్లు అంత తడిసి మోపెడయ్యేలా చేస్తారని కలగన్నానా?’’ నిర్లక్ష్యంగా అన్నాడు రవి.
‘‘ఆ! ఇప్పుడు తీరిందిగా. గొప్పగా చూసుకోవడం కాదు, నే కొనుక్కున కొంప కూడా లేకుండా చేసేలా ఉన్నావు.
పైగా ఉద్యోగం పోయి ఇన్నాళ్లవుతుంటే, చల్లగా ఇప్పుడు చెబుతావా పీకల మీదకొచ్చాకా!
అయినా ఏ బాధ్యతా లేకుండా జులాయి వేషాలేసే నిన్ను ప్రేమ, ప్రేమ అంటూ పెళ్లాడడం నాదే తప్పు. నాకీ శాస్తి జరగాల్సినదే.’’ ఒళ్లు తెలియని కోపంలో అరిచింది జానూ.
‘‘నన్ను పెళ్లాడి నువ్వు తప్పు చేయడం కాదు, నీలాంటి రాక్షసిని చేసుకున్నందుకు నేను ఏడవాలి. నాకంటే ఈ కొంపా, డబ్బే ఎక్కువ అని తెలియక నిన్ను అడిగాను. ఇప్పుడు తెలిసిందిగా ఇంక నా చావు నే చస్తాను. ఉట్టి కట్టుకుని ఊరేగు.’’ విసురుగా లేచాడు రవి.
‘‘ఎక్కడికీ! ఆగు, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం, ఇల్లు మాత్రం అమ్మను. ఈవేళ ఇల్లమ్ముతావు, రేపు నన్నే అమ్మేస్తావు. అసలు బెట్టింగ్‌ ‌కట్టడం ఏమిటీ? కష్టపడి సంపాదించుకోవాలే కానీ ఇలా ఈజీ మనీ క్రేజ్‌ ఏమిటీ? కేరెక్టర్‌ ‌లెస్‌’’ ‌కసిగా అన్న మరుక్షణం జానూ రెండు చెంపలూ పేలిపోయాయి.
‘‘యూ బిచ్‌! అం‌తమాట అంటావా! ఛ..వెధవ బతుకు, నా చావు నే ఛస్తా. నీ చావు నువ్‌ ‌చావు.’’ విసురుగా వెళ్లిపోయాడు రవి.
ఏడుస్తూ పడుకున్న జానూకు కాసేపటిలోనే ఒళ్లు తెలియని జ్వరం వచ్చేసింది.
చిన్నప్పటి నుండీ పద్దతిగా పెరిగిన ఆమె ఇలాంటి వాడి వలలో ఎలా పడిందో! అదే కదా విధి విలాసం.
ళి ళి ళి
ఉదయం పిల్లలిద్దరూ లేచి, తాము తయారై బడికి వెడుతూ తల్లిని లేపారు.
‘అయ్యయ్యో మొద్దు నిద్ర పోయానే’ అనుకుంటూ ఆదరాబాదరా పిల్లలకింత రాత్రన్నంలో మజ్జిగ నీళ్లు పోసి కలిపి, నంజుకు చింత తొక్కేసి ఇచ్చి, తిన్నాకా బడికి పంపి తను పనిలోకెళ్ళింది.
‘అయ్యయ్యో! తొమ్మిదవుతోంది. బ్యాంకి టైం అయిపోతోంది. ఆలీసానికి ఇప్పుడు ఏటంటందో! అసలికే ముక్కు మీదుంటది కోపం’.
‘‘అమ్మా! ‘‘అంటూ తలుపు తోసింది. ఇల్లంతా ప్రశాంతంగా, ఏ అలికిడీ లేకుండా ఉంది.
‘అదేటిదీ! ఈ పాటికి వంట గదిలో కిందా మీదా పడుతూండాలే!’
‘‘అమ్మా!’’ మళ్లీ పి•లిచింది.
‘‘గౌరీ! ‘‘ నీరసంగా వినబడింది మాట.
‘అయ్యో తల్లీ! ఏటైందీ! ఇంకా నెగనేదా!’ పడకగదిలోకి వెళ్లింది గౌరి.
‘‘రాత్రి నుంచీ జ్వరం, లేవలేకపోతున్నా గౌరీ!’ నీరసంగా అంది.
‘అయ్యో! అయ్యగారేరి, మిమ్మల్నిలా ఒగ్గేసి ఆపీస్‌ ‌కెళ్లిపోయారా!’ ఒంటి మీద చెయ్యేసి చూస్తూనే అదిరిపడింది.
‘‘ఓలమ్మోలమ్మ అగ్గి నిప్పులా కాలిపోతుందే! అయ్యయ్యో, సెంపల మీద ఆ సారలేటీ! బుగ్గలు బూరెల్లా పొంగిపోయాయేటి! అయ్యగాని కొట్టాడా!’ రోజూ తన్నులు తినే గౌరికి, చూడగానే అర్థమై పోయింది.
సిగ్గుతో తల తీసేసినట్లైంది జానూకు.
‘అదేటమ్మా అయ్యగారికిగానీ తాగుడలవా టుందా!’ అడగలేక అడిగింది గౌరి.
గౌరి అలా అడుగుతుంటే అప్పటిదాకా అణిచి పెట్టుకున్న దుఃఖం లావాలా పొంగింది.
‘పెళ్లాన్ని కొట్టడానికి మొగాడికి తాగుడొక్కటే కాదు, సవాలక్ష కారణాలు. అందులోనూ సంపాదించే పెళ్లాముంటే, సంపాదన లేని…’ ఆపై చెప్పలేక చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది.
‘అదేటమ్మా! అయ్యగారి ఉద్యోగం…’’ ఆపై అడగలేకపోయింది.
‘‘పోయింది. పీకేసారు. మొబైల్‌లో వస్తున్న లోన్‌ ‌యాప్‌లలో సులువుగా దొరుకుతోంది కదాని.
ఇప్పుడవి తడిసి మోపుడయ్యేసరికి, తీర్చమని ఒత్తిడి చేస్తే ఆఫీస్‌ ‌డబ్బు వాడేసాడు. వాళ్లూరు కుంటారా! ఉద్యోగం పీకేసారు.
చాలదన్నట్టు ఇప్పుడు ఆ యాప్‌ ‌నిర్వాహకులు వెంటనే అప్పు తీర్చకపోతే మా ఇద్దరివీ న్యూడ్‌ ‌ఫోటోలు సోషల్‌ ‌మీడియాలో పెడతాం, మా కాంటాక్టస్‌లో ఉన్న అన్ని నంబర్లకీ పంపుతాం’ అంటూ నిన్న రాత్రి మా ఫోన్స్‌కు ఆఖరి వార్నింగ్‌ ఇచ్చారు.’’ జలజలా కంట నీరు కారిపోతుండగా అంది.
‘‘అదేటిదమ్మా! పుటోలేటి? మీ పుటోలు ఆళ్ల దగ్గర ఎట్టుంటాయి?’’ అయోమ యంగా అడిగింది గౌరి.
‘‘కర్మ! ఆ లోన్‌ ‌యాప్‌లోకి వెళ్లీవెళ్లగానే, మన ఫోన్‌లో ఉన్న కాంటాక్టస్‌కు యాక్సెస్‌ అడుగుతుంది. తొందరలో వెనకా ముందూ ఆలోచించకుండా, చేతిలో పని కదా, నొక్కేస్తాం. దాంతో మనంతట మనమే మన జుట్టు తీసికెళ్లి వాళ్ల చేతిలో పెడతాం.
జుట్టేమిటి నా తలకాయ్‌, ‌మానం, మర్యాదా, సర్వస్వం వాళ్ల చేతుల్లో పెట్టినట్టే.’’ కసిగా అంది.
‘‘పోనీ ఎట్టుకోనీండి, ఏటవుద్ది, మహా అయితే ఈళ్లు మాకు బాకీ పడ్డారూ!’ అంటారు అంతేగా!’’ ఊరడింపుగా అంది గౌరి.
ఒక్కసారిగా భోరుమంది జానూ.
‘‘ఫోటోలంటే మామూలు ఫోటోలు కాదే. గుడ్డలూడదీసి పెడతారు. అది చావుతో సమానం. అందుకే కదా ఆ ఊబిలో దిగినవాళ్లు బయటపడలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. అయినా! ఇద్దరం సంపాదించుకుంటున్నాం. చాలదా! ఖర్మ కాకపోతే! తాగుడే కాదు, మితి మీరితే ఏదైనా వ్యసనమే’’మళ్లీ భోరుమంది.
‘అయ్యయ్యో! అందుకే కాబోలు మా మావ సచ్చినోడు ఇంటి కాగితాలు వొవులుకో ఇచ్చేసి, ఆ అప్పు మాఫీ సెయ్యమంట.
ఐనా, వెంటబడి అప్పులిచ్చి, అలా రుబాబు సేయడాకి ఆల్లకి మనసెట్టా ఒప్పుద్దో!
మరేటి సెయ్యడం? ఏదోటి సేసి ఆ అప్పు తీర్చేయండమ్మా! నేకుంటే సిగ్గు పోద్ది.’’ గాభరాగా అంది గౌరి.
‘‘అదే కదా బాధ, ఒళ్లు పై తెలియకుండా అప్పు చేసింది వాళ్లు. ఇప్పుడు డబ్బుతో పాటు పోయేది మన పరువు. ఇంటిని అమ్మేద్దామని నిన్నంతా వేధించాడు, కాదనడంతో నన్ను కొట్టి వెళ్లిపోయాడు.’’
‘‘ఇదంతా చేచేతులా చేసుకున్నదే. ప్రేమ… ప్రేమ అంటూ ఇంట్లో వాళ్లు వద్దంటున్నా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు అనుభవిస్తున్నాను.’’ ఆ క్షణంలో గౌరి పనమ్మాయి అని కానీ, తన బాధ పంచుకునే స్థాయి కానీ, తన కష్టాలను తీర్చే శక్తి కానీ ఆమెకు లేవనీ గుర్తు రాలేదు.
గౌరి తన బాధను పంచుకునే ఆత్మీయురాలిలా కనబడింది.
‘‘అయ్యో తల్లీ! మిమ్మల్నీ ఆ పురుగే కుట్టిందా! నానింకా సదువూ, సందే లేక మా మావే అమాయ కంగా దాని పాల పడ్డాడనుకున్నా! రేతిరి, అప్పిచ్చి నోళ్లు మా ఇంటి మీద పడ్డారమ్మా!
ఈ దొంగ సచ్చినోడు డబ్బు లేదని, ఇంటి కాయితాలేవో ఇచ్చాడనీ, యెంటనే ఇల్లు కాళీ సేయమంటా ఒకటే అల్లరి పెట్టారమ్మా! రేతిరంతా కంటి మీద కునుకు లేదు తల్లీ!
అమ్మా! అసలికే మీరే కట్టంలో ఉన్నారు గానీ, మరి నాకు మీరు తప్ప ఎవులున్నారు?
అందుకే అడగతున్నా, ఇళ్లన్నీ బ్యాంకిల్లో లోన్లున్నై కదా, మరి ఆళ్లకెట్టా తాకట్టెడతాడు! అసలు సెల్లుద్దా!’’ అమాయకంగానూ, ఆశగానూ అడిగింది.
‘‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనీ’ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో చాలామటుక్కి అలా చేతులు మారిపోయినవే గౌరీ. కాగితాలు బ్యాంక్‌లోనే ఉంటాయి.
అటు బ్యాంక్‌ ‌కిస్తా కట్టరు, ఇటు ఇళ్లనీ నిలుపుకోరు, ఇలా అప్పులు తీర్చడానికో, సొమ్ము కోసమో దొంగదారిలో అమ్మేస్తారు. వాటికి పత్రాలూ, గట్రా ఏం ఉండవు.
ఏమిటో! అప్పు తీర్చే తాహతు ఉందా, లేదా అని కూడా చూడకుండా అత్యధిక వడ్డీతో ఇలా లోన్‌ ‌యాప్‌ అం‌టూ అప్పులిచ్చేయడం, తీర్చమని ఒత్తిడి తేవడం.
వాళ్లది వ్యాపారం, వీళ్లది వ్యామోహం.
సాంకేతికత మంచికి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడుతోంది.
మరిప్పుడు ఏం చేస్తావు? అవునూ ఇల్లు నీ పేర్నుందా? మీ ఆయన పేర్న ఉందా!’’ కళ్లు తుడుచుకుంటూ అడిగింది తాత్కాలికంగా తన బాధ మరచిపోయి.
‘‘నా పేర్నే! ఆడికేటుంది? తాడూ, బొంగరం లేవ్‌?’’ ‌నిరసనగా అంది గౌరి.
‘‘సరే! ముందు నాక్కాస్త కాఫీ కలిపియ్యి, నువ్వు కూడా తాగు.
ఈలోపల పోలీస్‌ ఇనస్పెక్టర్‌ ఒకరు తెలుసు, మా ఖాతాదారుడే.
బ్యాంకుకు ఫోన్‌ ‌చేసి ఆయన నంబర్‌ ‌తీసుకుని, మాట్లాడి, ఎక్కడ ఫిర్యాదు చేయాలో అడుగుతాను. కట్టుకున్నాకా తప్పదు కదా!’’ నీరసంగా అంది.
‘ఏటో సదువునేక నాకూ తిప్పలే, సదూకుని, సంపాదిత్తా కూడా మీకూ తిప్పలే. అందుకే అన్నారు కాదేటి ‘ఆడదై పుట్టే కన్నా, అడివిలో మానై పుడితే మంచిదని’ గొణుక్కుంటూ వంటింట్లోకెళ్లింది గౌరి.
‘ఏమిటో! ఉన్నదానితో సర్దుకు ప్రశాంతంగా బతకడం చేతగాక, అవసరమా, అనవసరమా అన్న యోచన లేకుండా పెరిగిపోతున్న వస్తు వ్యామోహం, వ్యసనాలు, అందిన చోటల్లా అప్పులూ, తీర్చలేక తిప్పలూ. బతికే ధైర్యం లేని వాళ్లు చావు దారి పడుతుంటే, కొందరు ఇంట్లో వాళ్లని చంపుతున్నారు.’ తనలో తనే అనుకుంటూ బ్యాంకుకు ఫోన్‌ ‌చేసింది.
మేనేజర్‌ ఇచ్చిన నంబర్‌ ‌తీసుకుని, జ్వరం అనీ, తగ్గేదాకా రాలేననీ, మెయిల్‌ ‌పెడతానని, ధన్య వాదాలు చెప్పి ఫోన్‌ ‌పెట్టేసింది.
ఆ ఇనస్పెక్టర్‌ ‌తను ఫలానా అని చెప్పగానే గుర్తుపట్టి బాగానే మాట్లాడాడు.
‘ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయనీ, వాటిని సైబర్‌ ‌క్రైం వాళ్లకు ఫిర్యాదు ఇవ్వాలని’ చెప్పాడు.
‘మన ఊళ్లో లేదు కనక, హెల్ప్ ‌లైన్‌ ‌కానీ, ఆన్‌ ‌లైన్‌లో కానీ ఫిర్యాదు చేయండి’ అంటూ వివరాలు ఇచ్చాడు.
రవి ఆ రోజంతా ఇంటికి రాలేదు. మర్నాడు మధ్యాహ్నం అవుతుండగా కాళ్లీడ్చుకుంటూ వచ్చాడు.
ళి ళి ళి
గౌరి మావనీ, తన భర్తనీ కూర్చోబెట్టి ఆన్‌ ‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయించింది.
‘సూక్ష్మ రుణాలంటూ, సింపుల్‌ ‌ప్రాసెస్‌’ అం‌టూ ఇచ్చే ఏ రుణాలయినా అది ఊబేననీ, డెట్‌ ‌ట్రాప్‌ ‌మాత్రమే కాదు డెత్‌ ‌ట్రాప్‌ ‌కూడా’’ అంటూ వాళ్లకు వివరంగా చెప్పిన ఆమె మాటలు అక్షర సత్యాలు.
అలాంటి తప్పు మరోసారి చెయ్యద్దు అని గట్టిగా చెప్పింది.
‘తెలిసో తెలియకో ఇరుక్కుపోయాకా అప్పు చేసింది ఎవరైనా, ఆ ఫలితం, ప్రభావం మాత్రం మొత్తం కుటుంబం మీదనే పడుతుంది’ అన్న విషయం మనసుకు నచ్చ చెప్పుకుంటూ, మేనేజర్‌తో మాట్లాడి రిపేర్స్, ‌రిన్నొవేషన్‌ అన్నట్టుగా కొత్త రుణం తీసుకుని ఆ యాప్‌ ‌లోన్‌ ‌తనది మాత్రమే కాక గౌరిది కూడా మొత్తం కట్టేసి, విముక్తి కలిగించింది.
మొబైల్‌, ‌సమాచార సాధనంగా మాత్రమే ఉపయోగించుకుంటే, అందం, ఆనందం.
అంతే కానీ మొబైల్‌ ‌చేతిలో ఉంటే యావత్‌ ‌ప్రపంచం చేతిలో ఉన్నట్టే అని మురిసి, భ్రమసి హెచ్చులకు పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది.
ప్రతీ దానికీ ప్రభుత్వాలనే బాధ్యులను చేయడం కూడా తప్పే, ‘నిప్పు ముట్టుకుంటే కాలుతుంది’ అని ఒకరు చెప్పక్కరలేదు కదా. ఓ పక్క లోన్‌ ‌యాప్‌ల గురించి, కష్ట నష్టాల గురించి వార్తా కథనాలు కుప్ప తెప్పలుగా వస్తున్నా, లక్ష్య పెట్టక, అర్థం చేసుకోక అగ్నికి ఆకర్షితమయ్యే శలభాల్లా ఆ ఉచ్చులో పడడం ఎందుకూ, ఆత్మార్పణలెందుకు?
ఇప్పటికే ఎన్నో లోన్‌ ‌యాప్‌లను ప్రభుత్వం నిషేధించినా, రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటిని నిషేధించడం అలవి కాని పని.
‘అప్పు కాదది ముంచెత్తే ముప్పు’ వాటికి దూరంగా ఉండడం తక్షణ కర్తవ్యం’, అంటూ ఎలుగెత్తి చాటుతూ, ‘తమ కష్టం మరొకరు పడకుండా చేయాలనుకున్నారు ఆ ‘రుణోపహతులు’.

About Author

By editor

Twitter
YOUTUBE