భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– రత్నాకర్ పెనుమాక
మా మరదలు స్వేచ్ఛ ఇయ్యాల మజ్జానం బేగ్గేసుకుని ఒక్కతే వొచ్చింది ఇంటికి. సాధారణంగా ఒక్కతే రాదు. ఎప్పుడొచ్చినా ఆళ్లాయినతోనే వొత్తాది. ఎందుకంటే ఆళ్లుండే హైద్రాబాద్ నించి మా ఊరు సేరిలంక రావాలంటే రాత్రంతా రైల్లో ప్రయాణించి సామర్ల కోటలో దిగి ఆ తర్వాత బస్సెక్కి మురమళ్లలో దిగి ఆటో ఎక్కితే కానీ రాలేం. తను పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలే అయింది. మా ఆయినగారు, ఇంట్లోవోళ్లు సైంటిస్ట్ సంబంధం తీసుకొత్తే తనకి నచ్చలేదు. అతను సినిమా హీరోలా ఉన్నా, బోల్డన్ని ఆస్తిపాస్తులున్నా, సుచి కాలేజీలో ఒకతన్ని ప్రేమించానని నాకైతే ఎప్పుడో చెప్పింది కానీ, ఇంట్లోవోళ్లకి మొన్న సంబంధం తీసుకొచ్చాకే చెప్పింది.
ప్రేమించిన అబ్బాయి పేద్ద అందగాడేమీ కాదు. సమానమైన పొడుగుతో అటు పొడవు ఇటు పొట్టి కాకండా, చామనఛాయతో తప్పిడి ముక్కుతో ఉన్నా, చాలా స్టైల్‌గా, సోగ్గా ఉన్నాడు. పెద్ద అందంగా లేపోయినా ఉన్న కాతంత అందానికే మెరుగులు దిద్ది అందంగా కనిపిత్తన్నాడు. అతనికి పెద్ద ఆస్తిపాస్తులు లేపోయినా, సుచితోపాటే సమానంగా చదువుకుని ఉజ్జోగం చేత్తన్నాడని, అన్నాట్లికంటే ముఖ్యంగా మా మరదలు మహా మంకుది. అందుకే మా మరదలి మాట ఇనక తప్పక, తను ప్రేమించిందని అతన్నే పెళ్లి చేసారు. ఇద్దరూ వేరే వేరే మల్టినేషనల్ కంపెనీల్లో ఆర్కిటెక్ట్‌లుగా పనిచేత్తా హైద్రాబాద్ తార్నాకలో ఒక ఫ్లాట్‌లో ఉంటన్నారు. ఏ ఫంక్షనూ మిస్సవరు. ఇంట్లో ఏ కారిక్రమం జరిగినా ముందుంటారు. చూట్టానికే కాదు, నిజంగానే ఆళ్లిద్దరూ ఎంతో ప్రేమగా ఉంటం వొల్ల కుటుంబంలో ఉత్తమ జంటగా గుర్తింపొచ్చింది.
ఆయిన చుట్టాలని ఈవిడి, ఈవిడి చుట్టాలని ఆయిన చేలా బాగా చూసుకోటం, కలుపుగోలుగా ఉంటం వొల్ల ఈళ్ళ పెళ్ళిచేసి చేలా మంచి పని చేసాం అనుకుంటన్నాం. నేను, సుచి వొదినా మరదళ్లమే అయినా నా పెళ్లయినఈ ఐదేళ్లలో మా ఇద్దరి అంతరంగిక ఇసయాలు కూడా దాచుకోకండా చెప్పుకునేంత అనుబంధం. తను ప్రేమిత్తన్న ఇసయం, తను ఆ అబ్బాయికి, అదే మా తమ్ముడు ఆదర్శ్‌కి చెప్పటానికి ముందే నాకు చెప్పింది. అందుకే ఆళ్లిద్దరి పెళ్లి అందరికంటే ఎక్కువ నన్నే సంతోషపెట్టింది. రోజూ వీడియో కాల్ చేసి మాటాడుకుంటాం. ఒక నెల రోజుల కితం ఒక ఇసయం చెప్పింది. అది మీకు చెప్పటానికి ముందు అసలు తనెందుకు ఒంటరిగా వొచ్చిందో కనుక్కుందాం రండి.
తనలా ఒంటరిగా రాటం ఇంట్లో అందరికీ ఇడ్డూరంగా ఉంది. వొచ్చిన ఎంటనే అడిగితే బాగోదని ఆ రోజంతా అందరం మామూలుగానే ఉన్నాం. సాయంత్రం ఆఫీసునించొచ్చిన ఆళ్లన్నియ్య నాతో ‘‘సుచి ఎందుకలా అకస్మాత్తుగా ఒక్కతే వొచ్చింది. నీకేమైనా చెప్పిందా. ఆదర్శ్ లేకండా రాటమేంటి? ఏమైందట? ఏద్కెనా సమస్యా? నీకు చెప్పిందా?’’ అనడిగాడు. ‘‘లేదండీ నేనూ అడగలేదు. తను చెబుతుందేమోనని చూత్తన్నా’’ అన్నాను. ‘‘సమయం చూసుకుని రేపు నెమ్మదిగా నువ్వే అడుగు’’ అని చెప్పి తువ్వాలు సబ్బు అట్టుకుని గౌతమీ నదికి తానానికెళ్ళాడు. మా అత్తగారు మాంగారు కూడా నన్నే అడగమన్నారు. ఎందుకంటే తనతో ఏ ఇసయమైనా మాటాడగలిగిన, అడగగలిగిన చనువు, స్నేహం ఉన్నది నాకు మాత్రమే, తన కోపం గురించి ఈళ్లందరికీ తెలుసు అందుకే ఇలాగ!
మరసటిరోజు నేను కాఫీ కాసుకుని ఇత్తడి గ్లాసులో ఏసుకుని వేడివేడిగా అట్టుకెళ్లి ఇత్తే బద్దకంగా మంచం మీంచి లేచి కాఫీ తాగింది. తాగుతుంటే అడిగాను. ‘‘సుచి ఒక్కతివే వచ్చావే, ఆదికి సెలవుల్లేవా?’’ అని. ‘‘ఏం ఆడు రాపోతే ఈ ఇంటికి నన్ను రానివ్వరా?’’ అంది కోపంగా. ‘‘అదేంటే అలా అంటావ్. పెళ్లయినా ఈ ఇల్లు నీ సొంతమే, నీ ఇంటికి నువ్వు ఎప్పుడ్కెనా రావొచ్చు. ఎలాగైనా రావొచ్చు. ఎప్పుడూ కలిసే వొచ్చీవోరు ఇలా వొక్కత్తివే వొత్తే ఇంట్లో అందరికీ కంగారుగా ఉంది. మీ ఇద్దరిమజ్జ ఏమైందో అని, అంతే!’’ అన్నాను. ‘‘సరే ఒదినా నాకు మనసు బాగున్నపుడు చెబుతాను. ఇప్పుడా ఇసయాలేమీ అడగొద్దు’’ అంది. ‘‘సరేలేవే నీకెప్పుడు చెప్పాలనిపిత్తే అప్పుడే చెప్పు అంత కంగారేమీ లేదులే. నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి వొత్తే టిఫిన్ రెడీ చేత్తాను’’ అంటా లేచాను. ఆ రోజంతా మేవిద్దరం ఎంతో సంతోషంగా తన పెళ్లికి ముందు ఇసయాలు మాటాడుకుంటా గడిపాం.
మరసటిరోజు నేను కూరకి ఉల్లిపాయలు తరుగుతంటే తనూ వొంట గదిలోకొచ్చింది. కప్‌బోర్డులో ఉన్న పెళ్లి పత్రిక అట్టుకుని ‘‘వొదినా ఈ పత్రిక మా ఫ్రెండ్ వాసంతిదేనా లవ్ మేరేజ్ చేసుకుంటాదనుకుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటందేంటి?’’ అనడిగింది. ‘‘ఓ అదా, ఆళ్ల ఇంట్లో వోళ్లు ఒప్పుకోలేదంట అందుకని’’. ‘‘పోన్లే ఏ పెళ్లయినా అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయేంటి ఎవరి రాత ఎలా వుంటే అలా జరుగుతాది’’ అంది. వేదాంత ధోరణిలో! ‘‘అదేంటే అంత మాటనేసావ్. లవ్ మేరేజ్ చేసుకున్న నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఇంట్లో అందరికీ తెలుసు. ఆదర్శ్‌లాంటి కుర్రోణ్ణి మీ అమ్మ నాన్న తేగలరేంటి? ఇంట్లో అందరూ మిమ్మల్ని చూసి ఎంత ముచ్చట పడతన్నారో’’ అంటంటే ‘‘చాల్లే వొదినా అన్ని ఇసయాలు పైకి కనిపించినంత బాగుండవు’’ అంది సుచి.
‘‘ఏవైందే అలా అంటన్నావ్, ఆదర్శ్ మంచోడు కాదా? ఎంతో ప్రేమగా ఉంటాడు. నువ్వే లోకం అన్నట్టుంటాడు, కదే అదంతా నటనేనా?’’ అనడిగాను. ‘‘కాదులే వొదినా కానీ…’’ అని చెబుతా ఆగింది. ‘‘ఏ తనకేమైనా మానసిక ఇకారాలున్నాయా, ఏవైనా నిన్ను బాధపెట్టే పైశాచిక ఆనందాల్లాంటియ్యి?’’ అనడిగాను. ‘‘అంటే వొదినా’’ అంటా ఆగింది. తనేదో చెప్పలేక ఇబ్బంది పడతందని గ్రహించి నేను లోగొంతుతో ‘‘చేలామంది మగోళ్లు బయటికి ఎంత బాగున్నా ల్కెంగికంగా అసమర్ధులుగా ఉంటారంట, అలాంటి అసంతృప్తి ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలాంటి ఇసయాలు చెప్పుకోవటానికి నేను తప్ప ఇంకెవరున్నారు నీకు? చెప్పవే సుచి నేనెవరికీ చెప్పను. నీ కష్టం అర్ధం చేసుకుంటానంతే’’ అంటా ఎన్ను నిమిరాను ఓదార్పుగా. ‘‘అయ్యో వొదినా అలాంటి సమస్య అసలు కాదు. ఆడు ఆ ఇసయంలో చేలా నిపుణుడు’’ అంది. సుచి ఆళ్లాయిన్ని ‘‘ఆడు’’ అనే సంభోదిత్తాది సొంతం అనే భావనతో అంతే కానీ కోపంతో కాదు.
సుచి చెప్పింది ‘‘మేము పెళ్లికి రెండు సంవత్సరాల ముందునించే ప్రేమించుకున్నాం. ఫీల్డ్ ట్రిప్ కెళ్లినపుడు, ప్రోజెక్ట్ కోసం ఎళ్లినపుడు ఇలా చేలాసార్లు ఒంటరిగా కలుసుకునే అవకాశం వొచ్చింది మా ఇద్దరికీ. కానీ తనెప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. పెళ్లి కాకండా కలిత్తే ఒకేళ పెళ్లి జరక్కపోతే ఆ అపరాధ భావన తనని జీవితాంతం ఎంటాడుతుందనీవోడు. పెళ్లయ్యాక కూడా మొదటిరాత్రి అంతా కబుర్లాడుకుంటానే గడిపాం. అప్పుడు తను చెప్పిన ఒక అద్భుతమైన ఇసయం ఏంటంటే మనిషికి ఉన్న భాషల్లో అన్నాట్లికంటే అద్భుతమైన భాష బాడీ లాంగ్వేజ్. ఒకరిమీద మనకి అభిమానం కలిగినపుడు ఒకరు శభాష్ అని నోటితో చెబుతారు. కొందరు భుజం తడతారు. అలాగే ఒకరికి ఒకరిమీద ఇష్టం కలిగినపుడు నువ్వంటే నాకిష్టం అని చెబుతారు. ఆ ఇష్టం ఇంకా ఎక్కువుంటే కొందరు కావిలించు కుంటారు. ఆ ఇష్టం ఇంకా ఎక్కువుంటే ముద్దు పెట్టుకుంటారు. అదే ఇష్టం, ప్రేమ ఒక ఆడమనిషి మీద మగోడికి భరించలేనంత ఎక్కువున్నపుడు అతని తీవ్రమైన ప్రేమకి భావవ్యక్తీకరణే సంభోగం. కాబట్టి సంభోగం రెండు శరీరాల కలయిక కాదు. రెండు మనసుల సంయోగం, సమభోగం, సంభోగం. అలాంటి భరించలేనంత మోహావేశం, కలిగిన సమయంలో సంభోగంలో పాల్గ్గొందాం’’ అంటా ఆ రాత్రంతా కబుర్లాడుకున్నాం.
‘‘మరి ఇంత బాగున్నపుడు ఇంకేంటి సమస్య?’’ అనడిగాను. తను ఓ మూడు సెకన్లాగి ‘‘నాకు రేప్ జరిగింది’’ అంది. ఆ మాట ఇనగానే అవాక్కయ్యాను. తేరుకోటానికి పది సెకన్లట్టింది. ‘‘అవునా?’’ ‘‘అవును’’ అంటా అసలు ఇసయం చెప్పింది. ‘‘ఎవరు చేసారే ఇంత దుర్మార్గం?’’ అనడిగాను. భయం భయంగా ఎలాంటి ఇవరాలు ఇనాల్సివస్తుందోనని భయపడతా… ‘‘ఇంకెవరు? ఆడే ఆ ఆదిగాడే’’ అంది. ‘‘ఏంటి మీ ఆయనే నీ మీద అత్యాచారం చేసాడా? భర్త భార్య మీద చేస్తే అది రేప్ ఎలా అవుతుందే?’’ అన్నాను. ‘‘రేప్‌కి నిర్వచనం ఏంటో తెలుసా? ఒక మనిషికి ఇష్టం లేకండా చేసే ఏ సంభోగ మైనా అత్యాచారమే అవుతుంది. అది భార్యైనా సరే! కోర్టులు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయే వొదినా’’ అంది.
‘‘అలా ఇష్టంతో పనిలేకుండా కొన్ని వొందలసార్లు మీ అన్నియ్య నన్ను కలిసుంటాడు. అలా అనుకుంటే మీ అన్నియ్య మీద కూడా కేసెట్టాలి’’ అన్నాను నవ్వుతా.
‘‘ఎవరి అభిప్రాయం ఆళ్లది. ఎవరి ఆలోచన ఆళ్లది. నేను నీ అంత అమాయకురాలిని కాదు వొదినా. ఆడు, నేను ఓ మూడేళ్లదాకా పిల్లలు వొద్దను కున్నాం. అన్నివిధాల స్థిరపడ్డాక కానీ పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుని, నేను కాపర్ టి ఏయించుకున్నాను. అది ఆడికి ఇబ్బందిగా ఉంది, అంటే ఓ రెండు నెలల కితం తీయించేసుకు న్నాను. మళ్లీ ఏయించుకుందాం అనుకున్నాం.
ఈలోగా ఓరోజు రాత్రి నాకు ఒళ్లంతా పులపరంగా ఉండి మజ్జానం ఆఫీసుకి సెలవెట్టుకుని వొచ్చీసాను. ఇసయం ఆడికి చెబుదామని ఎన్నిసార్లు చేసినా ఫోనెత్తలేదు. కేబ్ బుక్ చేసుకుని ఇంటికొచ్చి టాబ్లెట్లేసుకుని పడుకున్నాను. ఆడు రాత్రి ఎప్పుడులా కాకండా లేటుగా వొచ్చాడు. వొత్తా వొత్తా మల్లెపూలు అట్టుకొచ్చాడు. మల్లెపూలు తెత్తే మా ఇద్దరికీ ఆరోజు కలుసుకోవాలనీది చెప్పకనే చెప్పుకునే ఓ కొండగుర్తు. ఆడు ఆఫీసునించి వొత్తానే ఎప్పుడూ లేంది ఫుల్‌గా తాగీసి వొచ్చాడు. కాలింగ్ బెల్ కొడితే లేవలేక లెగిసి నెమ్మదిగా తలుపు తీసీసరికి ఆడు మూడడుగుల దూరంలో ఉండగానే మందుకంపు, చేతిలో మల్లెపూలవోసన గొంతు నులిమేత్తా నా కడుపు దేవింది. నాకు అసలు నచ్చని వాసన ఆడి నోటిలోంచి. కళ్లు మూతలు పడుతన్నా బలవంతంగా లేపుతా అడుగులు అదుపు తప్పుతన్నా పడకండా నడవడానికి ప్రయత్నిత్తా లోపలికొచ్చి ‘‘డాళింగ్ సుచి ఈ రాత్రంతా స్వర్గం చూద్దాం పద ఈ పూలెట్టుకో నేను కాళ్లు మొహం కడుక్కుని వొత్తాను’’ అంటా లేప్‌టేప్ బేగ్ సోఫాలో అడేసి మల్లెపూలు కవర్ నా చేతికిచ్చి బాత్‌రూంలో కెళ్ళాడు.
ఓ పది నిమిషాల తర్వాత బట్టలు మార్చుకుని బెడ్‌రూంలో కొచ్చాడు. నేను ఎల్లి పడుకుంటంటే నా దగ్గరకొచ్చి ‘‘పూలెట్టుకోలేదే?’’ అంటా నాఏపు చూసి ‘‘అలా చూత్తన్నావేంటి కోపంగా, ఓ మందు కొట్టాననా? సాయంత్రం మా కొలీగ్‌కి ప్రమోష నొచ్చిందని ట్రీటిచ్చాడు అందుకే తాగాను. రోజూ తాగుతానా ఏంటి? ఏదో అప్పుడప్పుడు ఇలా తప్ప నపుడు. ఈ పూలెట్టుకో నాకు చేలా హార్నీగా ఉంది లేట్ చెయ్యకు’’ అంటంటే, ‘‘నాకు మజ్జానం నించి ఫీవర్ సింప్టమ్స్ ఉన్నాయి. ఒళ్లంతా పచ్చి పుండులా ఉంది. ఈరోజొద్దు ప్లీజ్ పడుకో’’ అన్నాను ప్రాధేయ పడతా! కానీ ఆడికయ్యేమీ అర్ధం కాట్లేదు. మందు మత్తులో ఆడికి నేను కోపంగా ఉండి అలా అబద్దం ఆడుతున్నానకుంటన్నాడు. కానీ నా బాధ అర్ధం కాలేదు ఆడికి.
ఆడి కళ్లు కామంతోటి, మందుమత్తు తోటీ మూతలు పడుతంటే నా మొఖంలో భావాలు, నా బాధ ఆడికేం అర్ధమౌతాది? అందుకే నేను వొద్దని ఎంత బతిమాలతన్నా ఇనకండా మొరటుగా నా మీదికి దూకి బలవొంతంగా నన్ను అనుభవించాడు. ఇన్నాళ్లు సమభోగం గురించి రొమెన్స్ గురించి ఎన్నో కొత్త కొత్త ఇసయాలు చెప్పి, నాకు స్వర్గం చూపించీ వోడు ఆ రాత్రి ఆడి మందు కంపు నా కడుపులో దేవేత్తంటే ఒళ్లంతా పచ్చిపుండులా కమిలిపోతంటే కర్కశంగా, మొరటుగా, పాశవికంగా నన్ను అనుభ వించి నరకం చూపించాడు. ఆ బాధ నా శరీరాన్ని మూడు రోజులుదాకా, ఆడి ప్రవర్తన నా మనసును ఈ రోజుదాకా వేదిత్తానే ఉంది.
ఆ పొద్దుట ఏమీ ఎరగనట్టు మావూలుగా ఉన్నాడు. నేను మూడు రోజులు మాటాడలేదు ఆడితో. మూడోరోజు మాటాడాను. ఆడెంత బాధ పెట్టాడో చెప్పాను. అంతా ఇన్నాక కూడా ఆడి మాటల్లోకాని, ఆలోచనల్లోకానీ అపరాధ భావం గానీ, పశ్చాత్తాపం కానీ కనిపిచ్చలేదు. ఆ నెలంతా ఎలాగో గడిపాం ఇద్దరం. పోయిన నెల నెలసరి రాలేదు. అనుమానమొచ్చి టెస్టింగ్ కిట్ తెచ్చుకొని నీరుడు పరీక్ష చేసుకుంటే గర్బం వొచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కానీ ఆ ఇసయం తెలిసీసరికి నెల దాటింది. అందుకే అబార్షన్ తప్ప ఏరే మార్గం లేదని ఆడితో అబార్షన్ చేయించుకుంటానంటే వొద్దంటా పేద్ద గొడవెట్టాడు. ఇది జరిగిన దగ్గిర్నించి మా ఇద్దరి మజ్జ కలయికలు లేవు, ప్రేమగా మాటలు లేవు, ఒకే ఇంట్లో ఉంటా శత్రుదేశ సైనికుల్లా ఉంటన్నాం.
చివరగా ‘‘నువ్వు తీసుకెళ్లి అబార్షన్ చేయిత్తావా లేదా?’’ అనడిగాను. ‘‘నేను చేయించను సరికదా నువ్వు చేయించుకోవాలన్నా నా సంతకం లేకండా ఏ డాక్టరూ చెయ్యదు, ఎలా చేయించుకుంటావో నేనూ చూత్తాను’’ అంటా ఛాలెంజ్ చేసాడు. అందుకే సెలవెట్టుకొని వొచ్చాను, అబార్షన్ చేయించుకునే ఎళ్తాను’’ అంది.
‘‘ఇలా ఇష్టం లేకండా భర్తలు కలవటం సర్వ సాధారణమే తల్లీ! దీనికంత రార్ధాంతం దేనికి? అబార్షన్ దేనికి? తనకి ఇష్టం లేనపుడు ఉంచుకో’’ అన్నాను. నా జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకుని. దానికి ‘‘వొదినా మిగతా ఆడాళ్ల గురించి నాకు తెలీదు. నా దృష్టిలో ఆ రాత్రి జరిగింది అత్యాచారమే. ఆ కారణంతో ఆణ్ణేమీ ఇడాకులు అడగట్లేదు కదా! మానవ సహజంగా జరిగిన తప్పిదంగా పరిగణించి క్షమించేసాను.
పిల్లల్ని కనే ఇసయంలో నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయ్ వొదినా! సంభోగ సమయంలో భార్యాభర్తలు ప్రేమగా సంతోషంగా కలిస్తే ఆ కలయిక వల్ల కలిగీ పిల్లలు మనుషుల పట్ల ప్రేమగా ఉంటారు. సెక్స్ సైకాలజి ప్రకారం భార్యాభర్తలు కలుసుకునీటపుడు ఏ ఆలోచనలతో కలుత్తారో పుట్టీ పిల్లల ఆలోచనలు కూడా అలాగే ఉంటాయంట. దీని ప్రకారం మా ఆరాత్రి కలయిక వల్ల కలిగీ సంతానం కచ్చితంగా ఏ సంఘ విద్రోహక శక్తిగానో మారీ ప్రమాదముంది. ఈ సమాజానికి నేను ఉత్తమ పౌరులనివ్వాలనుకుంటన్నాను. సంఘ విద్రోహక శక్తులను కాదు!
అందుకే ప్రేమైక సమభోగం ద్వారా కలిగీ సంతానం కచ్చితంగా ఉత్తమంగా ఉంటాది. అందుకే ఇప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకుంటన్నాను’’ అంది.
దానికి నేను ‘‘సుచి మీ ఆయన సంతకం లేపోతే అబార్షన్ చెయ్యరేమో కదే, మరెలా?’’ అన్నాను.
‘‘ఆడికి చట్టం తెలియనట్టుంది ఈ మజ్జే సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంటిచ్చింది. అబార్షన్ చేయించు కోవటం, చేయించుకోకపోవటం స్త్రీ హక్కు దానికి ఎవరి అనుమతి అవసరం లేదు. స్త్రీ మేజర్ అయితే చాలు. కాబట్టి ఆడి పర్మిషన్ అవసరం లేదు వొదినా. ఈ ఇసయాలన్ని అన్నియ్యతోటి, అమ్మనాన్నల తోటీ చెప్పి ఒప్పించాల్సిన బాద్యత నీదే’’ అంది సుచి.
నేను ఆళ్లందరికీ చెప్పి ఒప్పించాను. మా మాంగారు, మా ఆయినగారు ఆదర్శ్‌కి ఫోన్ చేసి రప్పించారు. సుచి ఎందుకు అబార్షన్ కావాలంటందో ఆదర్శ్‌కి అర్ధమయ్యీలా చెప్పింది. తను కోరుకున్నట్టే అబార్షన్ చేయించుకుంది. వోరం రోజులుండి అన్ని కుదిరాక ఆది, సుచి హైద్రాబాద్ ఎళ్లారు. ఈ సంఘటన నాలో చేలా మార్పు తీసుకొచ్చింది. నాకు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నా లేపోయినా సంభోగం దగ్గిర మాత్రం నా స్వేచ్ఛకు భంగం రానియ్యట్లేదు.
వచ్చేవారం కథ..
ముంచెత్తేముప్పు
– మీనాక్షి శ్రీనివాస్