నేనొక రోజు రాత్రి తిరప్తి బస్టాండ్లో పడుకొని, తెల్లార్జావన బస్టాండు ముందుడే అంబేద్కర్ విగ్రహం ముందొచ్చి కూసున్నాను. తెల్లారి పొద్దు పుట్టింది. ఆకిలికి కడుపులో పేగులు మెలి తిరగతా వుండాయి. వొచ్చి పోయే బస్సుల్తో జనాల్తో రోడ్డంతా తోమ్రంగా ఉంది. నాకెదురుగా టీ అంగిట్లో పర్సోళ్లు అంటే, కొండకొచ్చినోళ్లు టీ నీళ్లు ఉఫ్! ఉఫ్! అని ఆర్సి ఆర్సి తాగతా వుండారు.
ఆ టీనీళ్లన్నా తాగదావనుకొంటే నా చేతిలో చిల్లి గవ్వలేదు. పోనీ యవుర్నన్నా అడగదావనుకొంటే ‘‘యాం నీకు కన్ను గుడ్డా? కాలు గుడ్డా? దున్న పోతు మాదిరిగా వుండావు. పన్జేసుకొని బతకచ్చు గదా!’’ అంటారేవో ననే భయం.
రోడ్లో ఒక మడిసి బియ్యం మూట ఎత్తీ ఎత్తలేక అవస్త పడ్తావుంటే, నేనెత్తక పొయి బస్టాండ్లో దించేసి రూపాయో అర్ద రూపాయో ఇస్తాడనుకొని చూస్తే, ఆ మడిసి సల్లంగా బతుకు నాయనా! అని పొయినాడు. ఇదంతా చూస్తే నాకు ఇచిత్రంగా తోస్తాది ఆ మడిసి బియ్యం మూటను కొనగలిగినాడు కాని, మొయ్యలేడు. నేను మొయ్యగలను కాని, కొనలేను యట్టుందో చూడండి.
ఇట్ట ఆలాసెన జేసుకొంటా మల్లా వొచ్చి ఆడనే కూసున్నాను. నా బతుకు జూసి నాకే అయ్యో మనిపించి దుఃఖం తన్ను కొచ్చింది. కండ్లల్లో నీళ్లు కమ్మి జలజలా రాలతా వుంటే పై గుడ్డ తీసి తుడుసు కొంటా ఉండాను. ఇంతలో ఎవురో ఒక మడిసొచ్చి ‘‘ఏ వూరయా! నీది అంబేద్కర్ విగ్రహం ముందు కూసోని యాడస్తా వుండావు’’ అని అడిగినాడు.
నేనా మాటకు సవాదానం చెప్పకుండా గమ్మోనై పొయినాను. అయినా ఆ మడిసి వొదల్లేదు. ‘‘ఏవూరని అడిగితే చెప్పనంటా వేంది’’ అని మల్లా అడిగినాడు.
నాకు కోపమొచ్చేసి ‘‘రొండ్రోజుల్నించి నేను పస్తు. నీకు చెప్పితే నువ్వేవన్నా అర్సబోతావా? తీర్సబో తావా? అని అడిగినాను.
ఆ మడిసి ‘‘ఆకిల్తో ఉండావా? అయితే రా! టీ తీసిస్తాను తాగుదువ’’ అని పిల్సకపొయి, నాకొక టీ తీసిచ్చి, ఆ మడిసొక టీ తాగినాక ‘‘ఇప్పుడు చెప్పు ఏ వూరు? నీది’’ అని అడిగినాడు.
నేను ‘‘అయా! నా పేరు యంగటేసు మావు యానాదోళ్లం. మాది పచ్చాపలం కాడ సామిరెడ్డి కండిగ’’ అన్నాను.
ఆయన మల్లా అడిగినాడు ‘‘నీది పచ్చాపల వయితే అంబేద్కర్ విగ్రహం ముందు కూసోని ఎందుకేడస్తా వుండావు’’ని.
నేను ‘‘యాందిరా ఈ మడిసి వొదిలేటిగా లేదని, యాష్టగానే ‘‘నన్నీ గెతులు పట్టిచింది ఆ మహన్న బావుడే గదా! అందుకే ఆయన దగ్గిరే కూచోని నా గోష్టంతా సెప్పుకొని యాడస్తా వుండా’’ అన్నాను.
ఆయన నాకల్ల యగాదిగా చూసి ‘‘ఆయన నిన్ను గెతులు పట్టించినాడా? ఆయన రాసిన రాజ్యాంగవే గదా ఇప్పుడు నడస్తా వుండేది. మీ యానాదోళ్లకు రిజర్వేషన్లు వచ్చినాయంటే అది ఆయన దయవల్లే గదా!’’ అన్నాడు.
నేను ‘‘అదే గదయా! ఆయన జేసిన మిస్టీకు’’ అన్నాను.
ఆయన ఎట్ట మిస్టీకు మీకు రిజర్వేషన్లు తెచ్చింది మిస్టీకా? రాజ్యాదికారం కల్పించింది మిస్టీకా? అని అడిగినాడు.
నేను ‘‘అయా! ముందు నేను చెప్పేది ఇంటావా? మల్లి గావాలంటే నువ్వెనైనా మాటాడుదువు’’ అన్నాను.
ఆయన ‘‘సరే! నువ్వే చెప్పబ్బా!’’ అని నా పక్కన్నే కూసున్నాడు.
నేను ‘‘సెప్పేది మొదులు బెట్టినాను. అది యండాకాలం పన్లేవీ లేదు. మళ్లంతా కోసి వొబ్బుళ్లయి పొయి యలికలు పట్టే దానిక్కూడా యవురూ పలిచేదిలేదు. పాములు పట్టి తోళ్ళుదీసి అమ్మదావను కొంటే ఈ గవుర్మెంటోడు యప్పుడో తెగీ తెగని కత్తితో మా గొంతు కోసేసినట్టు పాములు పట్ట గూడదని రూలొకటి జేసేసినాడు. కూలి నాలీలికి పోదావన్నా పిల్సేవోళ్లు లేరు.
పోనీ గమ్మోనుందావనుకుంటే నేను గమ్మో నుంటాను నా కడుపు ఊరికా ఉంటిందా? ఉండదు గదా! మా ఇండ్లల్లో రేపు మాపుకని ఇరుపు పెట్టుకోం రేపెట్ట మాపెట్టని మాకు లేదు. ఆ పొద్దు గడ్సే దాని గురించే ఆలాసెన జేస్తాం యాం జేద్దావా? అని ఆలాసెన జేసి నేను మా ఇంట్లే దాన్ని యావే! ఆ తంగపారా! ఊదర దుత్తెత్తుకొని రా! యాడన్నా పొయి యలిక కలుగులు లోడకొద్దావ’’ ని సెప్పినాను.
ఆవె యత్తకొచ్చి ఇచ్చింది. ముందు నేను తంగపారా ఊదర దుత్తెకొని పోతావుంటే, యనక అలివేలు సిక్కం సంకకు తగిలించుకొని కత్తి చేత బట్టుకొచ్చింది ఇద్దురూ యలబారినాం. యలికలు పల్తె కాలంలో వడ్ల గిలకలు తిసకపొయి మనం గాదెల్లో దాసి పెట్టుకున్నట్టు అయి కలుగుల్లో దాసిపెట్టుకుంటాయి. పైరు పచ్చ లేని కాలంలో తినే దానికని. అట్టా కలుగొకటి లోడుకొంటే సాలు ఇంచు మించు పది పొళ్ల వడ్ల గింజలు దొరకతాయి. పైగా కూరకూ యత్తుక్కోవలసిన పనిలేదు ఆ యలికలే సరిపోతాయి.
అందుకని పాపిరెడ్డని ఉండాడు ఆయని మడికాడికి పొయి కలుగొకటి కనబడితే తొవ్వుకుంటా ఉండాము. మా ఇంట్లేది కలుగులో మట్టి తీస్తా వుంది. అప్పుడొచ్చి యవురో యంగటేసయ్యా! యంగటేసయ్యా! అని పిలిస్తే, యవురబ్బా! అని తిరిగి చూసినాను. పిల్సింది యవురో గాదు మాజీ సరపంచి కొండారెడ్డి.
ఆయనికి నాతో పెద్దగా పనుండదు ఉన్నా ఇంత గవురంగా యప్పుడూ పిల్సింది లేదు. వొరే! యానాదోడా! అనే పిలస్తాడు ఈ పొద్దేదేందో యంగటేసయ్యా! అని పిలిస్తే నాకే అరుసోద్దెవై పొయి ‘‘యాందయో! ఇట్టా వొస్తివి’’ అని అడిగినాను.
ఆయన ‘‘వొరే! నువు నక్క తోక తొక్కినావురా’’ అన్నాడు.
నేను ‘‘నానేడ నక్క తోక తొక్కినానయా!’’ అన్నాను.
ఆయన ఇసుక్కుంటా ‘‘వొరే! నీ బోటి బుర్ర లేనోణ్ణి యద్దల బేరానికి పంపిస్తే ఎర్రగా వుండే యద్దును ఎనపైకి నల్లగా వుండే యద్దును నలపైకి అడిగినాడంట అట్టుంది నీ యవ్వారం. నక్క తోకంటే నక్క తోక కాదురా! నీకు అదురుష్టం పట్టిందని అర్థం’’ అన్నాడు.
నేను నవ్వతా ‘‘దేనికయా! అదురుష్టం యలికి బొక్కలు పంది కుక్క బొక్కలు లోడుకొనే దానికా’’ అన్నాను.
ఆయన ‘‘ఈ సారి అదురుష్టం ఎలిక బొక్కలు లోడుకొనే దానికి గాదు గాని, ముందు నువ్వు ఎలబారు తరవాత చెప్పతాను’’ అన్నాడు.
ఆయన సెప్పేది నాకు ఒకిటీ అర్దం కాలా. అందుకే మల్లా అడిగినా ‘‘యాందయో! నక్క తోకంటావు అదురుష్టవంటావు ఇంతకూ యాంది ఇసోసవు’’ అన్నాను. ఆయన అసలు సంగతి బైట పెట్టకుండా ‘‘ఈ తంగపారా ఊదర దుత్త ఆడ పారేసి ఇంటికి పొయి తెలంగా గుడ్లేవన్నా ఉంటే కట్టుకొని యలబారు మండలాఫీసుకు పోవాల’’ అన్నాడు.
నేను ‘‘తెల్లంగా గుడ్డలు నాకేడివయా! కావాలంటే ఇట్టనే వొస్తాను’’ అన్నాను.
ఆయన ‘‘ఇట్టనే రాకూడదురా! నువ్వీ ఇరవై యూళ్లకూ కాబోయే సరపంచివి’’ అని సెప్పినాడు. నేను ‘‘ఈ సరపంచులు గిరపంచులూ నాకెందుకయో! నేనేదో ఈ కలుగులు తొవ్వుకొంటే నాలుగు పొళ్ల వొడ్లగింజలొస్తాయి ఈ పూట డిస్థింది నాకు’’ అన్నాను.
ఆయన ‘‘వొరే! నీకు ఓకు వొంపులు తెల్దు, వొగాతగా లేదు. గాడిదకేం తెల్సు గందోడి వాసనని ఉండాది నీ కత యలబారు రా! పోదాం’’ అన్నాడు.
నేను ‘‘ఇంగెవుర్నన్నా సూడు నా వల్ల కాదయో!’’ అన్నాను. ఆయన వదల కుండా ‘‘వొరే! ఈ పంచాయ తీలో ఉండేది నువ్వొక్కడివేరా యానాదోడివి. అంబేద్కర్ పోతా పోతా గమ్మోని పోకుండా. మీ యానాదోళ్లకు గూడా రాజ్యాధికారం ఉండాలని రాసేసి పొయినాడు. దానికి తగినట్టు ఈ గవర్న మెంటోడు ఎద్దీనిందంటే గాట్లో కట్టేయండని ఈ పంచాయతీలో యానాదోళ్లుండారా? లేదా? ఉంటే ఎంత? మందుండారనేది చూడకుండా మీకు రిజిర్వేషన్ చేసి పంపిచ్చేసినారు. నువు రాక తప్పదు’’ అన్నాడు.
కొండంత రెడ్డొచ్చి కొంగు బట్టుకొంటే ఎట్ట గాదనేదని సామెత. ఆయనొచ్చి ఇన్ని చెప్పినాక గూడా పోకపోతే బాగుండదని నేను తంగపారా ఊదరదుత్త మా అలివేలు చేతికిచ్చేసి, పోతా పోతా దోవలో ఉండే బాయిలో గబుళ్లని దూకి మట్టీ గిట్టీ కడుక్కొని పైకొచ్చినాను.
మారు కట్టుకొనే దానికి నా దగ్గిర గుడ్లేడివి? ఆయనే ఒక పంచా సొక్కాయి తెచ్చిచ్చినాడు. పంచెట్టనో ఒకట్ట మడ్సి మొలతాడులో దోపేసినాను. మట్టగోసి పెట్టుకొని తిరిగేనాకు యనిది మూర పంచ మడతేసి కట్టుకొనే కొద్దికి గాలి గూడా ఆడలేదు.
యలబారేటప్పుడు మా అలివేల్ను గూడా రమ్మని పిల్సినాను ‘‘నువు గూడా రాయే! పోదావని. అదేవో వస్తాననింది ఆయనే వొప్పుకోలేదు. ‘‘అదెందుకు రా! ఇంటి కాడుంటిందిలే నువు రా! సాలు’’ అన్నాడు.
నేను ‘‘అయా! దాన్నొదిలి పెట్టి నేను యాడికీ పొయింది లేదు. యాడికి పోవాలన్నా జతగా పోతాం వస్తాం’’ అన్నాను.
ఆయన ‘‘ఒక్క పూటకే దాన్ని నక్కెత్తక పోదు గాని, అది ఈణ్ణే ఉంటింది నువు యలబారురా!’’ అని నన్ను పిల్సకపొయినాడు.
పోవాలంటే నా దగ్గిర దమ్మిడీ యాడిది. ఆయనే రానూ పోనూ చార్జీ పెట్టి పిల్సక పొయినాడు. ఆడ మండలాఫీసులో ఆఫీసర్లు కొన్ని కాయితాల మింద నా దగ్గిర ఏలి ముద్రలెయ్యించుకొని పంపిచ్చేసినారు. అంతే ఆయనే నన్నొక పూటకూళ్ల అంగిడికి పిల్సకపొయి రొండు సంగటి ముద్దలు అంత తలకాయ కూర పెట్టించినాడు. కూర బలే రుతువుగా ఉండింది సందేళ ఇంటికొచ్చేసినాను.
మల్లొక వారానికి నన్ను పంచాయతీ ఆపీసుకు పిల్సకపొయి కుర్జీ ఏసి కూసోబెట్టి నాకొక శాలవా కప్పి పూల మాలేసి ‘‘నువ్వే సరపంచ’’ ని సెప్పినారు. మల్ల పంచాయతీ మీటింగు గూడా జరిగింది ఆడ గూడా నేనేవీ మాటాడలేదు అంతా ఆయనే మాటాడినాడు.
మల్లొక రొండ్రోజులు మనవూ సరపంచి అయి పొయినావని కలలు గంటా ఇంట్లో ఉండి పొయినాను. మనం సరపంచి అయిపొయినావని ఉంటాం కడుపు ఊరికా ఉంటిందా? ఉండదు గదా! అందుకే తెల్లార్తో లేసి యాడన్నా రొండు ఎలికి బొక్కలు లోడుకుంటే వడ్ల గిలకలన్నా వస్తాయని తంగ పారా ఊదర దుత్తెత్తుకొని యలబారి నెల్లేపల్లి గోయిందరెడ్డని ఉండాడులే ఆయని సేనికాడికి పొయినాను. ఆడ రొండు కలుగులు కనబడితే తొవ్వుకుంటా వుండాను.
ఇంతలో ఆ నెల్లేపల్లి గోయిందరెడ్డి పరిగెత్తుకొంటా వొచ్చి ‘‘వొరే! యంగటేసా! ఏం జేస్తా వుండావురా! సరపంచిగా ఉండి ఎలికి బొక్కలు లోడ్తావా’’ అని అడిగినాడు.
నేను ‘‘యావయా! సరపంచికి కడుపుండదా? ఆకిలుండదా? పస్తయా! కడగా పో! నేనీ బొక్కలు లోడుకొంటే ఒక పూట పొద్దు పోతాది’’ అన్నాను.
ఆయన ‘‘వొరే! వొరే! దొరక్క దొరక్క నా చేనే దొరికిందా? నీకు. పలాని గోయిందరెడ్డి సరపంచి దగ్గిర కూడా ఎలికలు పట్టిస్తా వుండాడు అనుకొనే దానికా వొద్దు కడగా పోరా! సావీ!’’ అని పంపిచ్చేసి నాడు.
మల్లొక నాడు పాపిరెడ్డేళ్లని ఉండారులే వాళ్లు మడి కోస్తావుండారని తెల్సి మా ఇంట్లో దాన్ని పిల్సుకొని పొయినాను. ఇరవై ముప్పై మంది కోస్తావుండారు. మేవూ పొయి వొంగినాం కోస్తామని పాపిరెడ్డి బార్య మమ్మల్ని మడిలో కాలు పెట్టనియ్య లేదు ‘‘వొద్దంటే వొద్దు నువు సరపంచిగా వుండి మాకు పనికొస్తే పలానోళ్లు సర్పంచి అని గూడా చూడకుండా మడి కొయ్యించుకుంటా ఉండారని మమ్మల్నంటారు. కావాలంటే పదిపొళ్ల గింజలిస్తాను’’ పొండి అనేసింది.
ఆవె పదిపొళ్ల గింజలిస్తే రొండు దినాలకు పొద్దు పోతాది మల్ల మావూలే గదా! అందుకని దానికి శాస్పిత పరిష్కారం సూద్దావని కొండారెడ్డి దగ్గిరికి పొయి ‘‘అయా! నువు జేసిన పనికి నీళ్లల్లో ఉండే చాపను గెడ్డనేసినట్టు అయిపొయింది నా పని. పేరుకు సరపంచినే గాని ఇంట్లో పొయి రగల్లేదు.
యవురికి పనికి పొయినా నువు సరపంచివి రాగూడదంటా వుండారు. పనీబాట లేకుండా నేనేట్ట బతకాల. నాకేవన్నా భూవులా నేలలా వొరగడ్డానుండే వోడిని బాయిలో తోసేసినట్టు వొద్దూ వొద్దూ అని సెప్పతా వుంటే గూడా నన్ను తీసకపొయి ఈ రొంపిలో దించేస్తివి
ఇంట్లో పొయి రగిలి నాలుగు దినాలేమో అవతావుంది. నా పెండ్లామొక పక్క నన్ను ‘‘మింగను మెతుకు లేదు మీసాలకు సంపంగి సమురా ఈ సరపంచులూ గిరపంచులు మనకొద్దు ఈ మాట కొండారెడ్డికి సెప్పేయి మన బతుకేరవ మనం సూసుకొందాం అంటావుంది’’ అని సెప్పినాను.
ఆయన కొంసేపు ఆలాసెన జేసి ‘‘నిజవే! నువు సర్పంచిగా ఉండి పన్లకు పోయేది లోటు. ఆ లోటు నీకే గాదు మాకు గూడా. నువు సర్పంచి వనే సంగతి ఇక్కడ మాకు సుట్టు పక్కలుండే వోళ్లకు దా తెల్సు. తిరపతి అట్ట బోతే తెలియదు గదా! అందుకే నువు తిరపతి కల్ల బొయి పన్లు జేసుకొని వారానికొకసారి ఇంటికొచ్చి పో! వచ్చినప్పుడు యాడన్న సంతకాలు ఏలిముద్రలు పెట్టాల్సినవి ఉంటే పెట్టి పోదువులే’’ అన్నాడు.
నేను ‘‘ఆడ బొయి నేనేం పని చేసేదయా! ఆడేవన్నా యలికలు పట్టే పనుంటాదా? కుందేళ్లు యంట్రవలు దొరకతాయా? యాటాడే దానికి’’ అని అడిగినాను.
ఆయనికి కోపమొచ్చేసినట్టుంది ‘‘వొరే! నీ యానాది బుద్ది పోనిచ్చుకున్నావు గాదు. ఆడ చేసుకోవాల్నే గాని లెక్కలేనన్ని పన్లుంటాయి. తిరపతిలో రిక్షా తొక్కుకొంటే బతికి పోవచ్చు. రిక్షావోళ్లు, ఎక్కితే పది దిగితే పది రూపాయలు పెరుక్కొంటారు. లేదా మూట్లు మోసే పనికిపో ఇట్టుండే మూట అట్టేస్తే మూటకు రూపాయ పెరుక్కొంటారు’’ అని సెప్పినాడు.
ముందు నేను మా బాసేల్ని గూడా పిల్సక పోదావనుకున్నాను యందుకంటే మా యానాదోళ్లం యాడికి పొయినా జతగా పోతాం వొకర్నొదిలి ఒకరుండలేం. మల్ల పొయిన సోట యట్టుందో యావోనని దాన్తో ‘‘నువు ఈడనే వుంటే నేను వారం దినాలుండి ఇల్లూ గిల్లూ చూసుకొస్తాను. మల్ల గావాలంటే కాపరం పెడదావ ’’చెప్పేసి తిరప్తి కొచ్చేసినాను.
ఆడ నాకు తెల్సినోడుంటే ‘‘యాడన్నా ఒక రిక్షా బాడిక్కి తీసియబ్బా! తొక్కుకుంటాన’’ని అడిగితే తొడక్కపొయి తీసిచ్చినాడు. దినానికి పణిండు రూపాయల బాడిగని. నేను రిచ్చా తీసకపొయి కిష్టాపరం ఠానా కాడ బెట్టుకొంటే పక్క రిచ్చా వోడు ‘‘నీది యా యూనియన్’’ అని అడిగినాడు.
నేను ‘‘రిచ్చా తొక్కాలంటే యూనియన్లో ఉండాల్నా’’ అని అడిగినాను. ఆ మడిసి ‘‘నువ్వు యాదో ఒక యూనియన్లో ఉంటేనే రిచ్చా తొక్కాల లేదంటే తొక్క గూడదు’’ అన్నాడు.
నేను ‘‘యూనియన్లో జేరాలంటే యాం జెయ్యాల’’ అని అడిగినాను. ఆ మడిసి ‘‘యూనియన్లో చేరాలంటే నూరు రూపాయలు గట్టి రసీదు తీసుకోవాల’’ అన్నాడు.
ఆ మాటతో నాకు అర్థవై పొయింది నేనా నూరు రూపాయలు కట్టలేను. రిచ్చా తొక్కలేనని, రిచ్చా తీసకపొయి ఇచ్చేసి వొచ్చేసినాను. రొండు దినాలు రైలు టేసన్లల్లో పడుకొని పస్తు ఆకిలికి నిద్ర పట్టలేదు. తెల్లార్తో లేసి కర్నాలీదికి పొయినాను అడేవన్న పని దొరకదేవోనని.
ఆడ లారీకి మూట్లెక్కిస్తా వుంటే ‘‘నేనూ యక్కిస్తా’’ ని పొయినాను.వాళ్లు ‘‘నువు యూనియన్లో ఉండావా’’ అని అడిగినారు. నేను లేదని సెప్పినాను. వాళ్లు ‘‘లేకపోతే కుదర్దన్నారు’’ వొచ్చేసినాను.
పోనీ బష్టాండులోనన్నా మూటలు మోద్దావని పోతే ఆడ గూడా యూనియన్లో ఉండాల్నారు. ‘‘ఇంగ నేనెట్ట బతకాల’’ అని ఆయన్ని అడిగినాను.
ఆయన ‘‘ఇప్పుడు బతికేదానికి నీకేం గావాల’’ అని అడిగినాడు. నేను ‘‘ముందు మాకు భూమో బుట్రో ఇచ్చి బతుకేరవ సూపెట్టి, మేం పస్తు లేకుండా ఉంటే, అప్పుడు కూటి మింద కూర మాదిరిగా ఈ పదవులు గిదవులు. మింగను మెతుకులేదు మీసాలకు సంపంగి సమురని తినే దానికి తిండి లేకుండా ఈ పదవులూ గిదవులెందుకు మాకు’’ అన్నాను.
ఆయన పది రూపాయలు నా చేతిలో బెట్టి ‘‘మద్యాణం తిను మల్లీ వొచ్చి కనబతాను’’ అని పొయినాడు అంతే, మల్ల రానేలేదు. ఇద్దో వస్తాడు అద్దో వస్తాడని నేను చూస్తావుంటే, ఊర్లోనించి కొండారెడ్డి గసపోసుకుంటా వొచ్చి ‘‘ఏవిరా! ఎన్ని సోట్ల నిన్ను ఎతికేది’’ అని అడిగినాడు.
ఆ మాటతో నాకు కోపమొచ్చేసి ‘‘నా బతుకు బష్టాండై పొయ్యుంటే ఇంగేడ ఉండమంటావయా!’’ అన్నాను.
ఆయన ‘‘సరే గాని యలబారు పోదాం’’ అన్నాడు.
నేను ‘‘వొచ్చి ఆడేం సెయ్యాలయా!’’ అన్నాను.
ఆయన ‘‘నిన్ను గురించి ఈ పొద్దు మెయిన్ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏసుకున్నాను గదా! అంబేద్కర్ విగ్రహం ముందు కూసోని తన గోడు యళ్లబోసు కున్న ఎస్టీ సర్పంచి యంగటేసయ్యని అందుకే నిన్ను చూసేదానికి రేపు మనూరికి కలెక్టర్ వొస్తా వుండాడు యలబారు’’ అన్నాడు
అప్పుడర్థ వయ్యింది నాకు నిన్న మాట్లాడిన మడిసే నా గురించి పేపరుకిచ్చి ఇదంతా చేసి నాడని అంతే యలబారి ఇంటికి పొయినాను. మర్సరోజు కలెక్టర్ మా గుడిసెకొచ్చి నాతో గూడా కూసున్నాడు. నన్ను ఆయన పక్కన కూసోబెట్టుకొని నా భుజం మింద చెయ్యేసి ‘‘యంగటేసయ్యా! నీకు నేనుండాను బయపడొద్దు నువు బతికేదానికి అయిదెకరాల భూవిస్తాను’’ నీకు ఇల్లు కట్టిస్తాను సాలునా’’ అన్నాడు.
నేను ‘‘నాకు సాలు సారూ! నా మాదిరిగా మా యానాదోళ్లు ఇంగా శానా మందుండారు. ఆళ్లకు గూడా నాకు ఇచ్చినట్టే ఇస్తే, పైరు జేసుకొని బతకతారు’’ అని సెప్పినాను. ఆయన తప్పకుండా చేస్తాన’’ ని ఆఫీసర్లకు చెప్పేసి పొయినాడు.
మల్లొక రొండు నెల్లుకంతా ఎమ్మార్వో వొచ్చి నా పేరు మీద అయిదెకరాల భూమి పట్టా ఇచ్చి రైతుల్తో సవానంగా నాకు మిద్దిల్లు కూడా కట్టిచ్చినాడు. ఇప్పుడు నేనా అయిదెకరాల భూవి పైరు జేసుకొంటా నన్ను నమ్ముకున్నోళ్లకు మంచి జేస్తా ఆ అంబేత్కర్ దర్మాన బాగనే ఉండాను.
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– మూరిశెట్టి గోవింద్