– ‌పాండ్రంకి సుబ్రమణి

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఆ ‌రోజు గరుడ పౌర్ణమి. ఊరు నలువైపులా గుడిగంటలు వివిధ మంగళకర అంకితార్చనలకు గుర్తుగా వినసొంపుగా మోగుతూనే ఉన్నాయి. మాధవి త్వరత్వరగా వంటగదిని శుభ్రం చేసుకుని ఎక్కడివక్కడ పడి ఉన్న సామానంతటినీ సర్ది కూతుర్నీ కొడుకునీ ఇక టీవీ చూడటం చాలించమని పురమాయించి ఇద్దర్నీ పడుకోబెట్టి, నిలువుటద్దం ముందు నిల్చుని పొడవాటి పూలజడను తృప్తిగా సరిచూసుకుంది. తన జీవన సహచరుడికి తన ఒత్తయిన కేశ సంపదంటే వల్లమాలిన ఇష్టం. పెళ్లినాడు తన వాల్జడ చూసి యేదో హృద్యంగా అన్నాడు. ‘అరాళ కుంతల’ అని అర్థం, పాములా మెలికలు తిరిగిపోయే సిరుల కురుల సంపదన్న మాట. మనసున నవ్వుకుంటూ గుండ్రటి బొట్టుని మరింత గుండ్రంగా దిద్దుకుని తన కోసం ఎదురు చూస్తూన్న రఘునందన్‌ ‌గదిలోకి అడుగులు వేసింది. అందంతో అల రారుతూ గంధర్వస్త్రీ వరూధినిలా హోయలు పోతూ ఎట్టెదుట నిల్చున్న భార్యను చూసి నవ్వాడు రఘునందన్‌ ‌మోహనకరంగా- ‘‘నిన్నిప్పుడు ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఇద్దరు బిడ్డల తల్లివనుకోరోయ్‌’’ అన్నాడు. దానికామె వెంటనే స్పందించకుండా దగ్గరకు వచ్చి మరింత మోహనకరంగా నవ్వింది-‘‘మరెలా అనుకుంటారు?’’మళ్లీ నవ్వి అన్నాడతను-‘‘ఎంత దూరం నుంచి చూసినా ఏ కోణం నుంచి ఫోకస్‌ ‌చేసి చూసినా జక్కన చెక్కిన శిల్పంలాగే ఉంటావు. ఈ అందం ఈ సొగసు రేపు పెరిగి పెద్దయిన తరవాత నా బంగారు కూతురుకి వస్తాయో లేదో మరి! అన్నట్టు• నాకిప్పుడు చటుక్కున చెళ్లపిళ్ల వారి ముత్తాత నర్సన్నకవిగారి శృంగార భరిత పద్యం మనసున మల్లెల వాసనలా గుఫ్పుమంటుందోయ్‌! ‌చెప్పకపోతే గుండె తరిగిపోతుందోయ్‌’’ అన్నాడు.

మాధవి మరింత మురిపెంగా నవ్వుతూ- ‘‘అలాగా! మరి ఆగడం దేనికి? తెలుగులో మీది ఎమ్‌.ఏ ‌కదూ! మరిక పడక గదిని తెలుగుపదాల సౌరభాలతో గుబాళింప చేయండి’’.

అతడీసారి మత్తయిన కళ్లతో కైపుగా చూసాడు-‘‘ఊహుఁ! నా వంతు నాకు పడేస్తేగాని నాకు మూడ్‌ ‌రాదు’’

‘‘ఇదేవిటండీ సర్కారువారి ఆఫీసుల్లో చేతులు చాచినట్టు పెళ్లాం వద్దకూడానా!’’ అంటూ రఘునందన్‌ ‌నుదుట మృదువుగా ముద్దుపెట్టుకుంది మాధవి. ఇప్పుడామె అంచెలంచెలుగా ఓ యోచన ప్రకారం భర్తకు చేరువవుతూంది. విషయం ఉచ్ఛ• ఘట్టానికి రానంత వరకూ ఆమె అలాగే భర్త చెప్పినట్టు గిరిగీసుకున్నట్లు అనుసరిస్తూ కోర్కెల చెడుగుడు ఆట ఆడాలన్న తీర్మానంతోనే వచ్చింది. ‘‘అబ్బ!ఎంత హాయిగా ఉందనుకున్నావు!’’ అప్పడామె కళ్లింతలు చేసుకుని చూసింది-‘‘నేను మురిపెంగా ఒక్క సారేగా తాకాను! అంతలో ఇంతటి మోహమేమిటి? తెలుగు ఎమ్‌.ఏ ‌వారు మరీ అతిశయంగా మాట్లాడరు కదా!’’

‘‘వాస్తవం! నీ నిండు రూపం, నీ మేని సౌరభం-రెండూను నన్ను మైమరపించాయి. ఇక నర్సన్న కవిగారి కవితాత్మక ఝలక్‌ ‌గురించి ఇప్పుడెందుకు గాని. ఇక మన కవితా వసంత మండపంలోకి చెట్టపట్టాలేసుకుని వద్దామా! ‘‘ఉఁ అందామె. అలా సానుకూలంగా స్పందిస్తూ రఘునందన్‌ని గుండెలకు హత్తుకుంది. అతడు భార్య చెంతన ఆనందానుభూతి చెందుతూ అడిగాడు ‘‘అదేమిటి, ఈ రోజు నా సతీమణికి అనంత ప్రేమానురాగాలు పుట్టుకొస్తున్నట్టున్నాయి ఈ దీనుడిపైన… కారణమేదైనా ఉందా?’

‘‘ఉంది అందామె’’

‘‘అలాగా! మరి తమ కారణాన్ని పద్య రూపంలోనా లేక గానం రూపంలోనా చెప్తావు?’’ అడిగాడతను. ‘‘పద్యం గురించి కాదు-గానం గురించి కాదు. జీవిత సత్యం గురించి’’

అదేమిటన్నట్టు చురుగ్గా చూసాడతను. మాధవి విషయానికి రాసాగింది. ‘‘ఒకసారి కాదు. రెండుసార్లు కాదు చాలా సార్లే చెప్పాను. మీకు మగపిల్లాడితో బాటు ఒక ఆడపిల్లకూడా ఉందనుకోండి. కొడుకుతో బాటు దానిని కూడా చదివించి పెద్దచేయాలని. కాబట్టి గట్టితనం, ప్లస్‌ ‌చతురత సముపాళ్లలో అలవర్చుకోమని-’’

రఘునందన్‌ ‌వింతగా చూసాడు. ‘‘అదేమిటోయ్‌ ‌నాగురించి ఏమీ తెలియనట్టు అలాగంటావూ! నేను రెగ్యులర్‌గా జిమ్‌ ‌కి వెళ్తున్నానని నీకు తెలవదూ! ఆరోగ్యం విషయంలో సమతుల్యత పాటిస్తున్నానన్నది తెలియదూ!’’

మాధవి అతడి మాటల్ని కట్‌ ‌చేసింది. ‘‘ఇంతటితో ఈ సరసమూ పరిహాసమూ ఆపుచేస్తారా! ఇది మన కుటుంబ భవిష్యత్తు గురించిన విషయం-కొంచెం సీరియస్‌ ‌గానే మాట్లాడుకుందాం’’

‘‘నువ్వు సీరియస్‌గా ఉన్నావు కాబట్టి నేను కూడా సీరియస్‌గానే ఉంటాను. ఇక కానివ్వు ‘‘చూడండి, మంచితనం-అందునా మరీ మంచితనం – ఈరోజుల్లో పనికిరాదంటే పనికిరాదు. మంచితనాన్ని మెతకతనం అనుకుంటారు. ఒకరిని వెనక్కి నెట్టేయకూడదే గాని, స్వప్రకాశం గల వ్యక్తిత్వంతో ముందుకు సాగడంలో తప్పులేదు. అంతేకాక మీ ఆదర్శాలు ఆశయాలూ మీవద్దే ఉంచుకోవాలి, ఎదుటివారిపై రుద్దకూడదు.. వచ్చీపోయినప్పుడల్లా మా ఇద్దరు చెల్లెళ్లూ ఏదో ఒకటి చంకన పెట్టుకుని చక్కా వెళ్లిపోతుంటారు. మీరేమో వార్షిక సంబడంలా సంవత్సరానికి ఒక్కసారే నన్ను మా పుట్టింటికి తీసుకు వెళ్తారు. అదీ… నేను అడగ్గా అడగ్గా. అలా ఎప్పుడో ఒకప్పుడు వెళ్తున్నామనుకోండి-వాళ్లిచ్చింది చప్పుడు లేకుండా అందుకుంటున్నామా. అదీలేదు. మీరడగరు-నన్నడగనీయరు. ఇంతకూ ఎందుకు వచ్చిన బెట్టండీ ఇదంతా నా కోసమా అవన్నీ అడగమంటున్నాను? మన బిడ్డలకోసమే కదండీ! మరొకటి దీనికి బదులివ్వాలి. నా పుట్టింట్లో నాకంటూ యేదీ చెందదా? అంతా నా బుజ్జి చెల్లెళ్లకే చెందుతుందా? నోరున్నవాడిదే రాజ్యమన్నట్టు? ఇంతకూ మా మరదుళ్లిద్దరూ లేని వారా? బెల్ట్ ‌షాపులూ., షాపులూ-మెడికల్‌ ‌షాపులూ ఎన్నెన్ని ఉన్నాయని? వాళ్లక్ణు ఉన్న తేడా చెప్పి మిమ్మల్ని కించపర్చాలన్నది కాదు గాని మీకున్నది ఒక బైకు మాత్రం. కాని మా ఇద్దరు చెల్లెళ్లకూ బైకుతో బాటు కారులు కూడా ఉన్నాయి ‘‘అంతా విన్న రఘునందన్‌ ఏమీ అనలేదు. గుండ్రటి భార్య ముఖంలోకి తదేకంగా చూస్తూండిపోయి మెల్లగా పెదవి విప్పాడు- ‘‘నువ్వు చెప్పింది నేను పూర్తిగా విన్నాను, కాబట్టి నువ్వు కూడా అడ్డు చెప్పకుండా నేను చెప్పేది వినాలి.. వినమంటున్నాను. అంతే. సరేనా!’’

తలూపుతూ భర్త ప్రక్కన వచ్చి కూర్చుంది మాధవి. రఘునందన్‌ ‌చెప్పసాగాడు ‘‘ప్రతి మనిషి అభిప్రాయాలు ఆలోచనలూ చాలావరకు ఆ వ్యక్తి జీవిత నేపథ్యంపైన ఆధారపడి ఉంటాయి బంగారం! ఒక విధంగా చూస్తే ఆ మనిషి వ్యక్తిత్వం కూడా అలానే రూపాంతరం చెందుతూ ఉంటుంది. నాకు ఇద్దరు అక్కయ్యలు. అమ్మానాన్నా మమ్మల్ని బాగా పెంచి పెద్దచేసారు. కాని మా అక్కయ్యలిద్దరి పెంళ్లిళ్ల వ్యవహారానికి వచ్చేటప్పటికి తాము తీసిన గోతుల్లో తామే పడ్డారు. మంచి సంబంధాల కోసం వెతుకులాట ఆరంభించారు. కూతూళ్లిద్దరూ సుఖపడతారన్న యావతో పెద్దింటి వాళ్లతో వియ్యమందారు. లాంఛనాల ఒత్తిడి ఎదుర్కొన్నారు. అప్పులపాలయ్యారు. ఎంతగా అంటే అరకు లోయలోని ఊబంత• తీసుకున్న అప్పులు వడ్డీతో సహా కట్టలేక చివరకు ఇంట్లో వంట కూరల్ని తగ్గించారు. సన్నబియ్యం పోయి దొడ్డు బియ్యం వచ్చాయి. అలా క్రమక్రమంగా మా ఇంటి ఆర్ధిక పరిస్థితి ఎంతటి అధ్వాన్న దశకు చేరుకుందంటే ఒకరోజు నా హైస్కూలు ఫీజు కట్టడానికి డబ్బులు చాలక అమ్మ అన్నిటినీ తాకట్టుపెట్టింది. మెడలోన ఆ ఒక్క సూత్ర గొలుసు తప్ప సర్వమూ బోసిగా తయారవాల్సి వచ్చింది. ఇదంతా నా చదువు కుంటుపడకుండా ఉండటానికి అమ్మే నాన్నకు తెలియకుండా చేసింది.. ఇప్పుడు చెప్పు ఇటువంటి దుస్థితి మా ఇంటికి ఎందుకు దాపురించిందని? ఎడతెగని మా బావలిద్దరి కోరికల చిట్టాల వల్లనే కదా! అదంతా కళ్లారా చూసిన తరవాత మనిషన్నవాడు అటువంటి అత్యాశలకు కాదు అటువంటి దుశ్చర్యలకు పాల్పడతాడా? ఇద్దరే ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేసేటప్పటికే మా అమ్మా నాన్నా చింకి చాపలా చితికిపోయి నడిరోడ్డున కూర్చుండిపోతే మరి ఏకంగా ముగ్గురు అమ్మాయిల్ని వరుసగా కన్న మీ అమ్మా నాన్న ఎన్ని అవస్థలు పడి ఉంటారని? మీ ముగ్గురినీ ఓ దరికి చేర్చడానికి ఎన్ని ఇక్కట్లు పడి ఉంటారో. నిజం చెప్పాలంటే మగపిల్లల్లు లేని కుటుంబం మీది. మనమే వాళ్లకు ఆసరాగా ఉండాలి. అందరిలాగే అది కావాలి, ఇది కావాలి అని ఆబగా కినుక బెడుతూ వాళ్లను అవస్థల పాలు చేయాకూడదు’’

అప్పుడు మాధవి చటుక్కున భర్త నోటికి చేతిని అడ్డం పెట్టింది ఇక చాలన్నట్టు సైగ చేస్తూ అంది ‘‘కోపగించుకున్నారా ఆదర్శవీరా!’’

‘‘నిజంగా నేను కోపగించుకోవడం లేదు మాధవీ! ఫీలవుతున్నాను. ఈ ఫీలింగుతో చెప్తున్నాను. ఇక నీకెదురవుతూన్న సమస్యల్లా సైకలాజికల్‌. అన్నీ ఉన్నా ఏదో లేదన్నట్టు ఒక విధమైన శూన్యంలో కొట్టు మిట్టాడుతున్నావు. చివరి వ్యాక్యంగా చెప్తున్నాను. నీకెప్పుడెప్పుడు మీ పుట్టింటికి వెళ్లాలనిపిస్తుందో అప్పుడు నువ్వెళ్లిరా నేను ఆపను. ఎన్నిరోజులంటే అన్ని రోజులుండిరా నేను కాదనను. కాని అక్కణ్ణించి మాత్రం దేనినీ పట్రాకు. పట్టుకు వచ్చి నాలో అలజడి రేకెత్త నీయకు. ప్లీజ్‌ ‌బి రీజనబుల్‌•’’

‘‘‌మరి వచ్చే దసరాకి మనల్నీ పిల్లలిద్దరినీ తీసుకుని ఊరికి రమ్మన్నారు ఎన్నిరోజులు లీవు వేస్తారు?’’ చూసి చెప్తానన్నాడు.

నిజానికి భార్యతో ఆ సంభాషణ జరిగిన తరవాత రఘునందన్‌కి లీవు వేసే అవసరం కలగలేదు. వారం రోజుల్లోపల అతడు ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్‌ ‌ట్రైనింగు కోసం తెలుగుగడ్డ విడిచి ఈశాన్యం వైపు వెళ్లాల్సి వచ్చింది. దట్టమైన అడవుల ప్రాంతం, ఎత్తైన కొండల ప్రదేశం కావడాన టవర్స్ ‌సిగ్నల్స్ ‌సరిగ్గా అందక మాధవితో పిల్లలిద్దరితో మాట్లాడే అవకాశం అనుకున్నప్పుడల్లా దొరికేది కాదతనకి. ఎట్టకేలకు రంఘునందన్‌ ‌నెలరోజుల ట్రైనింగ్‌ ‌పోగ్రాం పూర్తి చేసుకుని ఇల్లు చేరాడు. ఇల్లు చేరానన్న ఆనందం పూర్తిగా అనుభవించకముందే అతడు షాక్‌కి గురయాడు భార్య ఇచ్చిన భోగట్టాతో.

పురోహితుల్ని, పంచాంగ నిపుణుల్ని సంప్రదించి హోమ కర్మాదులు కూడా చేసి మాధవి అమ్మానాన్నలి వారణాశి వెళ్లిపోయారు నిరంతరం అక్కడే ఉండిపోవడానికి. విశ్వనాథుడి పాదాల చెంత జపతపాలు చేసుకుంటూ గడపడానికి. కొన్ని క్షణాల వరకూ రఘునందన్‌ ‌షాక్‌ ‌నుండి తేరుకోలేకపోయాడు. ‘‘ఏమైంది? అంత అకస్మాత్తుగా అంతటి వైరాగ్యం పెంచుకుని వెళ్లిపోయారు కారణం ఏమై ఉంటుంది మాధవీ?’’

‘‘మీరనుకుంటున్నట్టు ఏమీ అకస్మాత్తుగా జరగలేదండి. మా నాన్న వారణాశిలో ఉన్న మన తెలుగువాళ్ల సత్రపు ట్రస్టులో చాలా కాలం నుంచే జీవితకాల సభ్యుడు. గంగానది ఆ సత్రపు అటకను ఒరుసుకునే ప్రవహిస్తుంటుంది. జీవనయాత్రలో మిగిలిన రోజులు జపతపాలు చేస్తూ పవిత్ర గంగానది చెంతన ఉండిపోవాలని తీర్మానించారు.

మనల్ని కావాలంటే రావచ్చన్నారు గానివాళ్లు మాత్రం ఇక్కడకు మళ్లీ రానన్నారు మీకు మాత్రం ఈ ఉత్తరం ఇవ్వమన్నారు’’ అంటూ వాళ్ల నాన్నగారు రాసిన ఉత్తరాన్ని భర్తకు అందిచ్చింది మాధవి. దానిని అందుకుని చదివిన రఘునందన్‌ ‌బరువుగా నిట్టూర్చాడు. ‘‘నాన్నగారేమన్నారండీ?’’ ఆతృతగా అడిగిందామె.

‘‘నా వంటి కొడుకు తమకు లేకపోయాడు కదానని ఆర్ద్రతతో కూడిన బాధ వ్యక్తం చేసాడు మీనాన్న‘‘

‘‘ఆ తరువాత ఏమన్నారు?’’

‘‘ఇప్పుడువాళ్లుంటూన్న ఇంటినీ-ఊళ్లోని ఐదెకరాల పంటపొలాన్నీ నా పేర రాశారట. పత్రాలు మీ ఫ్యామిలి లాయర్‌ ‌వద్ద ఉన్నాయట-వెళ్లి తెచ్చుకోమన్నారు. కాదనకుండా ఇక బాడుగింట్లో ఉండకుండా మనల్ని ఆ ఇంటికే వచ్చి ఉండమన్నారు. వాళ్ల ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుందని దీవించారు.

మాధవి కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుండి పోయింది. అంటే.. అమ్మానాన్నలిద్దరూ తననుకుంటున్నట్టు ఉదాసీనంగా ఉపేక్షగా కాలం గడపలేదన్నమాట. ఇంటికి వస్తూపోతూన్న వాళ్లందరి పోకడనూ గమనిస్తూనే ఉన్నారన్నమాట! చేతనున్న అన్నపు కుండను కుదురులో పెట్టడానికి తగు తరుణం కోసం కాచుక్కూర్చున్నారన్నమాట! అల్లుడికి వారందించినది ఆశీర్వచనం కాదు-వేదాశీర్వచనం!

About Author

By editor

Twitter
YOUTUBE