-బి నర్సన్‌

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

పెళ్లయిన ఆర్నెల్లకే సుష్మ జీవితం ఇంత తలకిందులవుతుందని ఎవరూ ఊహించలేదు. భర్త కిశోర్‌ ‌జైల్లోకి వెళతాడని, తాను పుట్టింటికి తిరిగి వస్తానని కలలో కూడా అనుకోలేదామె. చేసుకున్నోడే జైలుపాలయ్యాక ఈ ముసలాళ్లకు సేవ చేస్తూ బానిసగా ఇక్కడ బతుకుతావా? దాని వల్ల నీకు వచ్చే ఫలమేమిటి? అని అన్నలు సుష్మను ఇంటికి తీసుకెళ్లారు.

తోబుట్టువులే తనకు దిక్కు అనుకొని అన్నల వెంట వచ్చిన సుష్మకు కొన్నాళ్లకే మార్పు కనబడింది. ఇప్పుడు ఆమె వారికి ముద్దుల చెల్లెలు కాదు. పుట్టింటి మమకారంలోంచి ‘మమ’ లుప్తమవుతున్నట్లు గ్రహించింది. అయ్యో చెల్లెలి బతుకు ఇట్లయిందే అన్న బెంగ ఆ ఇంటి నుంచి ఆవిరై పోయింది. అంతా మరిచినట్టు సుష్మ కళ్ల ముందే ఎవరి భార్య పిల్లలతో వాళ్లు హాయిగా ఉంటున్నారు. ఈ మాత్రం దానికి తనను మెట్టినింటి నుంచి బలవంతంగా ఎందుకు తెచ్చినట్లు అని ఎన్నోసార్లు అనుకుంది. ఇక్కడ ఎంతకాలమున్నా తాను పరాయిదాన్నే. కన్నవారు పోయాక పుట్టింటి బంధం చిరిగిన బట్టను కుట్టిన్నట్లే ఉంటుంది. పెళ్లి కాక ముందు ‘మా చెల్లెలికి ఈ పని ఎందుకు చెప్పావ్‌!’ అని వదినల్ని కసురుకొనే అన్నలు ఇప్పుడు చూసీచూడనట్లు ఉంటున్నారు. ఇక్కడ చాకిరీ చేసేకన్నా అత్తమామలకు సేవ చేసినా పుణ్యమైనా వస్తుంది కదా అని సుష్మలో కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది. మొత్తానికి ఏడాది గడిచాకనైనా అసలు వాళ్లే తనవాళ్లు, అక్కడే తన ఇల్లు అని అనిపించిందామెకు.

ఓసారి అత్తమామలను చూసొస్తానని అన్నలకు చెప్పింది.

‘ఎందుకే ఆ ముసలాళ్ల సంత, ఇక్కడేం తక్కువైంది నీకు!’ అన్నారు.

‘గుర్తొస్తున్నారు, నిన్న కలలోకి వచ్చారు. ఓసారి వెళ్ళొస్తా!’ అని నిజమో అబద్దమో చెప్పి బయలుదేరింది. కొడుకే లేనపుడు నీవెందుకు మాకు అన్నట్లు వారుంటే మళ్లీ వెనక్కి రావడమేనా నా బతుకు అని తలుచుకుంటూ అత్తవారింటి తలుపు తట్టింది.

అయితే కోడలిని చూడగానే ఆ వృద్ధ దంపతులు చేజారిన వజ్రం దొరికినంత ఆనందపడిపోయారు. ఆ ఊహించని ఘటనకు వారిలో దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. ఒకరి దుఃఖానికి మరొకరు ఓదార్పు అయినట్లు ముగ్గురు దగ్గరగా కూచున్నారు.

విప్పారిన ముఖంతో సుశీలమ్మ కోడలు చేయి నిమురుతూ ‘నీవు మళ్లీ పెళ్లి చేసుకొని ఉంటావనుకున్నాం!’ అంది.

లేదన్నట్లు తల దించుకుంటూ అడ్డంగా ఊపింది సుష్మ.

‘ఎందుకు చేసుకోలేదు. మీవాళ్లు అడగలేదా! చేసుకోవాల్సింది. మా వాడు ఎన్నాళ్లకు బయటికొస్తాడో ఎవరికీ తెలియదు. నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? నీవు ఒప్పుకుంటే మేమైనా ఓ సంబంధం చూస్తాం!’ అన్నాడు మామ బాలయ్య.

‘నాకు మీ కొడుకుతో పెళ్లయింది. మరో పెళ్లి, ఇంకొకరిని చేసుకోవడం నాకిష్టం లేదు. మీరు చేసుకోమన్నా నేను చేసుకోను. నాకు భర్త ఉన్నాడు. మీ బిడ్డ ఎక్కడున్నా నాకు భర్తనే కదా! మీరు ఆయన్ని కన్నవారు. ఈ ఇంటి మర్యాదను నేను. మీకు సేవ చేయవలసిన బాధ్యత నాది’ అని కొంత మొండిగా, కొంత గౌరవంగా చెప్పింది సుష్మ.

కాలం గడుస్తోంది. పెద్దవాళ్ల ఆదరణ సుష్మకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. చెల్లెలు ఎలా ఉంది అని చూడ్డానికైనా అన్నలెవరు రాలేదు. అంతా సవ్యంగా గడుస్తున్నా బాలయ్య మాత్రం కోడలి పరిస్థితి పట్ల లోలోపల బాధని అనుభవిస్తున్నాడు. ఆ బాధకు అర్థం వేరు.

జైలు పాలైన కిశోర్‌ ‌వారికి సొంత కొడుకు కాదు. బాలయ్య, సుశీలమ్మలకు ఇద్దరికి నలభయ్‌ ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో అనాథాశ్రమం నుంచి కిశోర్‌ను చిన్నప్పుడే తెచ్చి పెంచుకున్నారు. బాలయ్యది బట్టల వ్యాపారం. ఆదాయం బాగున్నా, అలా అంగళ్లు తిరగడం తనతో కాని పని అని కిశోర్‌ ఒక్కమాటగా చెప్పాడు. అతనికి డ్రైవింగ్‌ అన్నా, కార్లలో తిరగడమన్నా ఇష్టం. ఓ కారు కొని టాక్సీగా తిప్పుతున్నాడు. అంతా సజావుగా సాగుతున్నదని పెళ్లి చేశారు.

పెళ్లయిన ఆర్నెల్లకే కిశోర్‌ ‌చేయరాని తప్పు చేశాడు. తెలిసిన వారింట్లో ఏదో ఇంటి పండుగకు వెళ్లి రాత్రి దాకా మద్యం సేవించి ఇంటికొస్తూ ఓ వాకిట్లో నల్ల దుప్పటి కప్పుకొని పడుకొన్న ఐదారేళ్ల ముగ్గురు పిల్లలను గమనించక వారి పైనుండి కారు పోనిచ్చాడు. పిల్లలు బిగ్గరగా అరుస్తూ అక్కడే ప్రాణాలు విడిచారు. ఇది అనుకోని ప్రమాదం కాకుండా పూర్తిగా నిర్లక్ష్యపు హత్య అని భావించిన కోర్టు అతనికి ఐ.పి.సి. సెక్షన్‌ 304 ఏ ‌ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షను వేసింది.

ఓ రోజు కిశోర్‌ను కలిసేందుకు ముగ్గురు జైలుకెళ్లారు. ఇనుప జాలికి అటు అతను. ఇటు సుష్మ, వృద్ధ దంపతులు. సుష్మాను చూసిన కిశోర్‌లో ఆశ్చర్యం, ఆనందం, పొరలు పొరలుగా గుండెను పిండే దుఃఖం కలిసి పొంగాయి. సుష్మ అతడిని చూస్తూ రాయిలా ఉండిపోయింది. ముసలాళ్లు కన్నులు తుడుచుకుంటూ గుండెలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. తీరం చేరని అలలా ములాఖత్‌ ‌ముగిసింది.

 రాత్రి పడక గదిలో మెల్లగా బాలయ్య భార్యతో ‘మనమీడ.. కొడుకాడ. కోడలు బతుకు ఇట్లా. మనకు పిల్లలు పుట్టలేదని పిల్లగాన్ని తెచ్చి సాదుకున్నా చెట్టు ఇగురించక కూలిపోతున్నట్లే ఆయె. కొడుకు, కోడలు ఉన్నా వాళ్ల పిల్లల్ని ఎత్తుకొనే యోగం లేకపాయె. మన తర్వాత కోడలుకు దిక్కెవలు? ఆమెకు సంతానం కలిగితే మన వంశానికి ఒక కాత కాసినట్లు. ఆమెకు ఓ ఆసరా ఉన్నట్లు. కని బయటవడే దారే కనబడ్తలేదు.’ అన్నాడు తడిసిన కళ్లను చాటుగా తుడుచుకుంటూ.

ఈ వేదనలోంచి బయటపడే మార్గం ఏదైనా చూయిస్తాడేమోనని ఆశతో ఓ రోజు బాలయ్య తన కొడుకు కేసుని వాదించిన వకీలు అర్జున్‌ ‌రావు దగ్గరికి వెళ్లాడు.

‘మా కొడుకు తప్పే చేసిండు. వాడికి శిక్ష తప్పదు. మరి కోడలి జీవితం ఇంతేనా! ఆమె ఏమి పాపం చేసిందని. మా వంశం మట్టిలో కలిసిపోవుడేనా?’ అని చేతులు జోడించాడు..

‘ఇంకేముంటుంది, అంతేకదా!’ అన్నట్లు ఫైళ్లు తిరిగేస్తున్న అర్జున్‌ ‌రావు చిత్రంగా బాలయ్య వైపు చూశాడు.

ఆ చూపు బాలయ్యను రెచ్చగొట్టింది. తన వేదననంతా ఒక్క వాక్యంలో కూర్చినట్లు ‘మాకు మనవడో, మనవరాలో కావాలి!’ అన్నాడు.

‘కొడుకు జైల్లో ఉంటే అదెట్లా కుదురుద్ది. మీ కోడలు మరో పెళ్లి చేసుకుంటే..’ అని ఆగాడు అర్జున్‌రావు. అనకూడని మాటేమో అని ఆయన సగంలోనే ఆగాడు.

ఆ మాటను తప్పు పట్టుకోకుండా ‘ఆమెను అడిగి చూసినం, చేసుకోనంటుంది’ అని ఆగి… ‘మా కొడుకుతోనే ఆమెకు సంతానం కలగాలి’ అన్నాడు బాలయ్య.

‘మూణ్ణెల్లకోసారి ములాఖత్‌కు పిల్లలు పుడతారా?’ అని వకీలు నవ్వాడు.

ఆ ఎగతాళిని సహిస్తూ ‘ఆలుమగలు కలిస్తేనే పుడతరు’ అన్నాడు బాలయ్య బాధగా.

‘అదే కుదురదంటున్నాను కదా!’ అంటూ ఇక నీవు వెళ్లొచ్చు అన్నట్లు అర్జున్‌రావు లేవబోయాడు.

‘మా వంశం ఆగిపోవద్దని నేను కోర్టులో పిటిషన్‌ ‌వేస్తా. మా కోడలు భర్తను కలిసే అవకాశం ఈయమని వేడుకుంటా!’ అన్నాడు బాలయ్య కాస్తా అసహనంగా.

బాలయ్య వేదన, మాటలు చట్టాన్ని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.

దాంతో లేవబోయిన వకీలు ఆగి ‘ఇంతవరకైతే ఇలాంటి కేసు ఎవరూ వేయలేదు’ అని కొద్ధి సేపు తల నిమురుకుని ‘అడగడంలో తప్పేమి లేదు. తీర్పు జడ్జిగారికి వదిలేద్దాం!’ అన్నాడు.

బాలయ్య విన్నపం కోర్టు దాకా వెళ్లింది..

కేసు వివరాలు చదివిన న్యాయమూర్తి ఎవరీ పెద్ద మనిషి అన్నట్లు బాలయ్య వంక చూశాడు. బాలయ్య చేతులు జోడిస్తూ బెంచిపై కూచున్న సుశీలమ్మ, సుష్మల వైపు చేయి చూయించాడు. వారి ముఖాల్లో దైన్యాన్ని గమనించి జడ్జి ఆలోచనలో పడ్డాడు. సతీసావిత్రి కథ గుర్తుకొచ్చింది ఆయనకు.

తన భర్త ద్వారా పిల్లలను కోరుకోవడం భార్య కనీస హక్కు. పిల్లలను కనకుండా ఖైదీని కట్టడి చేయడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ భంగకరమే. భర్త శిక్ష అనుభవిస్తున్నా భార్యకు సంతాన భాగ్యం కలిగించి వంశవృక్షానికి నీరు పోయడం అనుబంధాల సాంప్రదాయిక ధర్మం. మానవత్వ కోణంలో ఇన్ని అనుకుంటున్నా న్యాయమూర్తిగా వారికెలాంటి భరోసా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారాయన.

 ఇంట్లో కేసులు, ఫైళ్లు, తీర్పుల రాతలతో బిజీగా ఉన్న జడ్జి మెదడంతా కిశోర్‌ ‌కుటుంబమే ఆవరించి ఉంది. పని ముందుకు సాగక కుర్చీలో వెనక్కి ఒరిగి కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. ఉన్నది ఉన్నట్లే ఉండగా వారి ఇంట్లో పసిబిడ్డ కేరింతలు రావాలి. ఇంత దుఃఖంలో వారికి ఓ ఆనందం, జీవితంపై ఆశ, వంశం కొనసాగింపుపై సంతృప్తి దక్కాలి అనుకుంటూ లేచి అన్ని రకాల పుస్తకాలను తిరిగేశారు.

ధర్మ, అర్థ, కామ, మోక్షాలు నాలుగు పురుషార్థాలు. వీటిలో ఒక దానికి దూరం చేసి పురుష జీవన పరిపూర్ణతను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఒకరు జైలులో ఒకరు బయట ఉన్న దంపతుల మధ్య శారీరక సంబంధాల సదుపాయాన్ని కెనెడా, జర్మనీ లాంటి దేశాలు అనుమతిస్తున్నాయి.

ఇచ్చిన తేదీ ప్రకారం బాలయ్య పిటిషన్‌ ‌విచారణ మొదలైంది. ఆలోచనల్లోంచి జడ్జి తల పైకి ఎత్తడంతో అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూస్తున్నారు.

అందరి ఆతృతని గమనించిన జడ్జి నోరు విప్పారు. ‘చట్టంలో దీని కోసం ఎలాంటి వెసలుబాటు లేదు. జైలు నియమావళి కూడా దీనిని ఒప్పుకోదు. అయితే సంతానం పొందాలనే ఆమె కోరికలో న్యాయమున్నది. దీని కోసం చట్టాలనే కాకుండా ఎన్నో విషయాలను పరిశీలించాను. నిజానికి కుటుంబ సభ్యుల అనారోగ్యం, మరణం, పెళ్లి లాంటి సందర్భాల్లో మాత్రమే మన చట్టాలు ఖైదీకి బయటకు వెళ్లే అనుమతినిస్తాయి. జైలులో ఆయన ప్రవర్తన బాగుంటేనే అది సాధ్యపడుతుంది.’ అని ఆగారు.

దాంతో ముందుకొచ్చిన బాలయ్య చేతులు జోడించి నోరు విప్పాడు. ‘అయ్యా! మా కొడుకుకు పడ్డ శిక్షనెప్పుడు మేము తప్పు పట్టలేదు. అది వాని కర్మఫలం. అయితే ఆ శిక్షను వాడు జైలులో ఉండి అనుభవిస్తే మేము ఇంట్లో అనుభవిస్తున్నాము. మావోడు ఎన్నడు బయటికస్తడో కాని మా కోడలి కడుపు పండి మా వంశం సాగాలి. అప్పుడే మా శిక్షను తగ్గించినవారయితరు’ అని ఆగాడు .

సావధానంగా విన్న జడ్జి అందరి ముఖాలు చూస్తూ ‘వంశాన్ని కొనసాగించే బాధ్యత ఆడవాళ్లదే. స్త్రీగా సుష్మ తల్లి అయ్యే హక్కును ఏ శక్తి ఆపలేదు. న్యాయాన్ని నిలబెట్టడానికే చట్టాలున్నాయి. పదిహేను రోజులపాటు పెరోల్‌పై బయటికి వెళ్లేందుకు కిశోర్‌కు అనుమతిని ఇస్తున్నాను. పిల్లల కోసం భార్యను కలిసేందుకు ఖైదీకి పెరోల్‌ ‌మంజూరు నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఇది చట్టం కావాలి.’ అన్నారు.

కోర్టు హాలు చప్పట్లతో మారుమోగింది. వరం పొందిన భక్తుడిలా బాలయ్య కొంత ముందుకొచ్చి ‘అయ్యా! తమరు చేసిన మేలు జన్మజన్మలకు మరచిపోలేము. తమరి పేరేమి? ఎవరు పుట్టిన మీ పేరే పెట్టుకుంటాం!’ అన్నాడు .

 ‘వసంతం’ అన్నారు జడ్జిగారు.

వచ్చేవారం కథ..

వేదాశీర్వచనం

– పాండ్రంకి సుబ్రమణి

About Author

By editor

Twitter
YOUTUBE