-కె.వి.సుమలత

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘‌హలో! ఎవరూ?’’ అన్నాడు శంభు ప్రసాద్‌ ‌సెల్‌ ఆన్‌ ‌చేసి.

‘‘నేను రా ప్రసన్నని… సారీ రా! నిన్ను ఇప్పుడు ‘రా’ అనొచ్చో లేదో నాకు తెలియడం లేదు’’ అవతల వైపు గొంతులో కొంచెం తడబాటు.

కొన్ని సెకన్లు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఎంతటి క్లిష్టమైన ఆపరేషన్‌ అయినా విజయవంతంగా చేసి ప్రాణాలను కాపాడే డాక్టర్‌గా పేరున్న శంభు ప్రసాద్‌ ‌మనసులో ప్రసన్న జ్ఞాపకం వెలికి రావడానికి కాస్త సమయం పట్టింది.

‘‘శంభూ! నువ్విప్పుడు అమెరికాలో చాలా పెద్ద డాక్టర్‌వి. పాపం! ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ఫ్రెండ్‌ ఎలా గుర్తుంటాడు? మనిద్దరం వేల్పూరు నుండి ఆర్మూర్‌ ‌వరకు బస్‌ ‌పాస్‌ ‌తీసుకుని ఇంటర్‌ ‌వరకూ కలిసే చదువుకున్నాం. ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అడిగాడు ప్రసన్న.

‘‘ఓ మై గాడ్‌! ‌నువ్వట్రా? ప్రసన్నా! నిన్నెందుకు మరచిపోతాను? ఉన్నట్లుండి ఇన్నేళ్ల తరువాత సడెన్‌గా ఫోన్‌ ‌చేస్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది’’ అన్నాడు శంభుప్రసాద్‌.

‘‘‌శంభూ! చాలా సంతోషంరా నేను గుర్తున్నందుకు. నేను రా అంటే నీకు కోపం రాదుగా?’’ అన్నాడు ప్రసన్న నవ్వుతూ.

‘‘ఛ… అదేం మాట. ఇన్నాళ్లకు ఎందుకు గుర్తొచ్చానో త్వరగా చెప్పు. అవతల అర్జంటు ఆపరేషన్‌ ‌కేసుంది’’ అన్నాడు శంభుప్రసాద్‌ ‌వాచీ చూసుకుంటూ.

‘‘మనం చదువుకున్న బడిలోనే హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నాను. మన ఊరిలో నిన్న మీ నాన్న గారికి కలెక్టర్‌ ‌గారి చేతుల మీదుగా ‘‘ఆదర్శ పౌరుడు’’ అవార్డ్‌తో సన్మానం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విన్న కలెక్టర్‌ ‌గారితో పాటు అందరూ అభినందించారు. ఆ వార్త అన్ని పేపర్లలో రావాలని విలేకరులకు ఆదేశాలిచ్చారు. అంతకన్నా ముఖ్య విషయం పాఠ్య పుస్తకాలలో పాఠం రూపంలోకి తెస్తానన్నారు. నాకు మీ నాన్నగారి గురించి తెలిసినంత మటుకు ఆయన గొప్ప ఆయనే చెప్పుకోరు. ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకువి, నీ మానాన నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయావు. ఇక్కడ జరిగేవి నీకు తెలియదు. అందుకే ఈ విషయం చేరవేయాలనిపించింది. అందుకే నీ నంబర్‌ ‌సంపాదించి ఫోన్‌ ‌చేస్తున్నాను’’ అన్నాడు ప్రసన్న.

‘‘డాడీ ఏం మాట్లాడారు?’’ శంభు గొంతులో ఇదివరకటి మృదుత్వం లేదు.

‘‘నువ్వే చూడరా! యూ ట్యూబ్‌ ‌లింక్‌ ‌పెడుతున్నాను. ఇక ఉంటాను’’ అన్నాడు ప్రసన్న.

శంభుప్రసాద్‌ ‌ఫోన్‌ ‌పెట్టేసినాక అతడి ముఖమంతా మాడిపోయింది.

‘డాడీ ఏం మాట్లాడుంటారు? ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం స్నేహాన్ని గుర్తుంచుకుని లింక్‌ ‌పంపాడంటే అందులో నా గురించేమైనా మాట్లాడారా?’ ఆలోచిస్తున్న సమయంలోనే ప్రసన్న నుండి వాట్సాప్‌లో లింక్‌ ‌వచ్చింది. ఆత్రంగా చూడాలని తెరవబోయాడు. తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

‘‘కమిన్‌’’ అసహనంగా అన్నాడు శంభుప్రసాద్‌.

‘‘‌సర్‌! ఎ‌వ్రిథింగ్‌ ఈజ్‌ ‌రెడీ ఫర్‌ ‌ద ఆపరేషన్‌ ‌సర్‌!’’ అం‌ది లోపలకు వచ్చిన నర్సు.

ఫోన్‌ ఆఫ్‌ ‌చేసి టేబుల్‌ ‌మీద పెట్టి ఆపరేషన్‌ ‌థియేటర్‌ ‌వైపు నడిచాడు శంభుప్రసాద్‌. ఆ ‌తరువాత అతడికి ఇంటికి వచ్చేంత వరకు ఆలోచనలు మరే విషయం వైపుకి మళ్లడానికి సమయం దొరకలేదు.

‘‘డాడీ! మీరు ఈ రోజు చాలా ఆలస్యంగా వచ్చారు. కేసులు ఎక్కువగా ఉండి ఉంటాయి. మామ్‌ ఎప్పుడో వచ్చేసింది. తను టైర్డ్‌గా ఉన్నానని డిన్నర్‌ ‌చేసి పడుకుంది. మనిద్దరం తిందాం. మీరు త్వరగా ఫ్రెషయి రండి.’’ అంది స్నేహ.

‘‘ఓహ్‌! ‌నువ్వింకా తినలేదా? ఫైవ్‌ ‌మినిట్స్‌లో వస్తాను’’ గదిలోకి వెళ్తూ అన్నాడు శంభుప్రసాద్‌.

ఈలోగా స్నేహ హాల్లో డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద అన్ని పదార్థాలు సర్దింది.

‘‘ఆలస్యమైందా స్నేహ డియర్‌?’’ అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘‌నో డాడ్‌!…’’ అం‌టూ పళ్లాలు తీసుకుని రెండు పుల్కాలు పెట్టి కూర వేసి తండ్రి చేతికిచ్చింది.

అప్పుడే శంభుప్రసాద్‌ ‌ఫోన్‌కి మెసేజ్‌ ‌వచ్చిన శబ్దం వచ్చింది. వాట్సాప్‌ ఓపెన్‌ ‌చేసి చూసాడు. ఫోన్‌ ‌స్టాండ్‌లో పెట్టి ప్రసన్న పంపిన లింక్‌ ఓపెన్‌ ‌చేసాడు.

‘‘తినకుండా ఏంటి డాడీ?’’ అంటూ మొబైల్‌ ‌వైపు చూసిన స్నేహ ‘‘తాతయ్య…’’ అంటూ తను కూడా తినడం ఆపేసింది.

స్టేజీ మీద మైక్‌ ‌ముందు నిలబడిన తండ్రి గోపాలరావుని చూడగానే శంభుప్రసాద్‌ ‌కళ్లు పెద్దవయ్యాయి. గోపాలరావు మైక్‌ ‌చెత్తో పట్టుకుని ఒకసారి చుట్టూ చూసి మాట్లాడడం ప్రారంభించాడు.

‘‘సభకు నమస్కారం. కలెక్టర్‌ ‌గారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డ్ ఇచ్చినందుకు సంతోషం ఉంది. చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కారణం నేనంత గొప్ప పనేమీ చేయలేదు.

‘జననీ జన్మభూమిశ్చ… స్వర్గాదపి గరీయసి’ అంటారు. అమ్మ ఒడి, పుట్టిన గడ్డ స్వర్గంతో సమానం అంటారు. పుట్టిన ఊరిలో ఎప్పటికీ ఉండడం అందరికీ సాధ్యం కాదు. చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ఆడపిల్లలయితే వివాహనంతరం ఊరు వదిలి వెళ్లాల్సిందే. మా తరం ఊరిని వదలకుండానే, కుటుంబాలను కదపకుండానే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. ఈ కాలం పిల్లలు వారి ఉద్యోగాల కోసం దూరంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు వారిని తప్పు పట్టలేం. యువత ముందు చదువు, తరువాత ఉద్యోగం, ఆ తరువాత అపరిమితమైన సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. చిన్నప్పుడు వారు చదివిన పాఠశాలలు, ఈత నేర్చుకున్న చెరువులు, కలిసి చదువుకున్న స్నేహితులు, ఆటలాడిన పొలం గట్లు, వసతులు లేకపోయినా ఆనందాలు పంచిన కుటుంబాలు, ఇవన్నీ కలగలిపిన స్వంత ఊరుని మరచిపోతున్నారు. ఫలితాలను ఆశించకుండా పిల్లలను పెంచడం, విద్యాబుద్ధులు నేర్పించడం, ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడం తల్లితండ్రుల బాధ్యత. నేటి తరానికి పోటీ ప్రపంచంలో తామే అగ్రగాములు కావాలనే కోరికలు పెరిగి బంధాలు, అనుబంధాలు సంకెళ్లుగా కనిపిస్తున్నాయి. అందుకే తెంచుకొని వాటికి దూరంగా పారిపోతున్నారు. పల్లెటూర్లను కన్నబిడ్డల మమతల జల్లుకోసం పరితపించే ఎడారులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం పల్లెలు వృద్ధ్దులకు ఆశ్రయాలుగా మారిపోతు న్నాయి. ఇది చాలా దారుణమైన విషయం… ప్రతీ ఒక్కరూ పుట్టిన ఊరు రుణం తీర్చుకోవలసిందే! వారు నేర్చుకున్న విజ్ఞానం పుట్టి పెరిగిన ఊరికి అక్కరకు రానప్పుడు అది ఎంత పెద్దదైనా తృణప్రాయమే! నీవు పుట్టిన ప్రాంతానికి నువ్వేం చేశావని మనస్సాక్షి ఎప్పుడోకప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తుంది. అప్పుడు చెప్పేందుకు జవాబు, చేసేందుకు సమయం మన దగ్గర ఉండాలి. అలాగే ఈ ఉరుకుల పరుగులలో జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే తృప్తి అన్న పదానికి తావు లేకపోతే ఎడారిలో చెలమ కోసం వెతికినట్లవుతుంది. అలా నా తృప్తి కోసమే నేను ఊరికి చేయగలిగింది చేసాను. ఎవరి మెప్పు పొందడం కోసం చేయలేదు. ఈ సన్మానాలు, అవార్డులు నాకు ఇష్టం ఉండవు.’’ గోపాలరావు గారు చెప్పడం ఆపి చుట్టూ చూసారు.

‘‘నా కొడుకు అమెరికాలో పెద్ద డాక్టర్‌. అం‌దుకు నాకు గర్వంగానే ఉంది. కానీ, కొడుకు కోసం తపించిపోయిన నా భార్య ఈ ఊర్లో సరైన వైద్య సదుపాయాలు లేక కొడుకు కోసం కలవరిస్తూనే కరోనాతో కన్నుమూసింది. కరోనా కారణంగా అమెరికా నుంచి విమానాలు లేక నా కొడుకు కడసారి కన్న తల్లిని చూడలేకపోయాడు. వైద్యం సరిగా జరగాలంటే పల్లె వదిలి నగరాలకు వలస వెళ్లమంటాడు నా కొడుకు. ఎంతమంది పల్లె వదిలి పట్నాలు వెళ్లగలరు? పల్లెలు వదిలి అంతా పట్నాలకు పోతే మనకు ఆహారం ఎవరు పండిస్తారు? మనిషన్న వాడికి కన్నతల్లి, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవలసిన కనీస బాధ్యత ఉంది. ఈ ఊరిలో మంచి విద్య, వైద్యం ఉంటే ఊరు వదిలి పల్లెని ఎడారిగా మార్చక్కర్లేదు కదా! ఒక్కసారి అందరూ ఆలోచించండి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఊరులో నాకున్న పద్నాలుగు గదుల మండువా ఇల్లును ఎవరైనా వైద్యులు ఆసుపత్రి నడుపుతానంటే ఉచితంగా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు’’ అంటూ ఉపన్యాసం ముగించాడు గోపాలరావు.

వేల్పూరు గ్రామ ప్రజలందరూ చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

‘‘వండర్‌ ‌ఫుల్‌ ‌తాతయ్యా! వండర్‌ ‌ఫుల్‌’’ అం‌టూ స్నేహ కూడా చప్పట్లు కొడుతూ అరుస్తోంది.

శంభు ప్రసాద్‌ ‌తండ్రి మాటలలో తను ఊహించినట్లే ఉండటంతో గుచ్చుకోవలసిన చోటే లోతుగా గుచ్చుకుంది.

‘‘డాడీ! తాతయ్య మళ్లీమళ్లీ ఊరికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆయన నిజంగా రియల్‌ ‌హీరో కదూ!’’ ఎంతో ఉద్వేగంతో అంది స్నేహ.

శంభు ప్రసాద్‌ అవునన్నట్లు తల ఆడించాడు.

‘‘మీరు ఒక సక్సెస్‌ ‌ఫుల్‌ ‌డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. మీరిప్పుడు చాలా తృప్తిగా ఉన్నారా డాడీ?’’ అంది స్నేహ.

 ‘తృప్తిగా ఉన్నాడా తాను?…’ అతడు సమాధానం చెప్పడానికి ఆలోచనలో పడ్డాడు.

‘‘మీరు వేల్పూరు నుండి అమెరికా వచ్చి దాదాపు ఫిఫ్టీన్‌ ఇయర్స్ అవుతోంది. మీ బర్త్ ‌ప్లేస్‌కి ఏదయినా సహాయం చేయాలని ఎప్పుడూ అనిపించలేదా?’’ మళ్ళీ అడిగింది స్నేహ.

ఆ ప్రశ్నలకు సమాధానం అతడి దగ్గర లేదు.

‘‘సారీ డాడీ, మీరు ఏమీ అనుకోనంటే మరో మాట! మీరు, అమ్మ మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. మనకు డబ్బుకి ఎటువంటి లోటు లేదు. బామ్మ కరోనా సమయంలో సరైన వైద్యం లేకే చనిపోయింది. వేల్పూరులో ఒక హాస్పిటల్‌ ‌పెడితే ఎంతో మందికి మంచి వైద్యం అందుతుంది. ఎంతోమంది బామ్మలు, తాతయ్యలు పూర్తికాలం జీవిస్తారు. అలా ఎందుకు మనం పల్లెకు పోకూడదు?’’ అంది స్నేహ.

శంభుప్రసాద్‌, ‌గుమ్మం దగ్గర నిలబడి వీళ్ల మాటలు వింటున్న దివ్య, ఒక్కసారిగా తుళ్లిపడ్డారు. ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

‘‘మామ్‌! ‌లేచావా? నువ్వు అన్ని మాటలు విన్నావని నిన్ను చూస్తే అర్థమైంది. నువ్వు, డాడీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ లోగా నేను తాతయ్యకు అభినందనలు చెప్తాను’’ అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది స్నేహ.

శంభు ప్రసాద్‌, ‌దివ్యల కళ్ల ముందు గతం కదలాడింది.

                                                                                         *       *       *

గోపాలరావు నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూరు గ్రామంలో వృత్తి పట్ల అంకిత భావం, జీవితం పట్ల క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడు. ఆయన ఆలోచనలన్నీ ఆదర్శభావాలతో నిండి ఉంటాయి. భార్య లక్ష్మి ఆయన ఇష్టాలను గౌరవించే అనుకూలవతి. వారికి ఒక్కగానొక్క కొడుకు శంభు ప్రసాద్‌ ‌తెలివైన అబ్బాయి. అతడికి మెడిసిన్‌ ఎం‌ట్రెన్సులో మంచి ర్యాంక్‌ ‌రావడంతో ఉచితంగా యూనివర్శిటీలో సీట్‌ ‌వచ్చింది. ఆ తరువాత ఆలోచించుకునే వ్యవధి లేకుండానే ఎమ్‌బిబిఎస్‌ ‌పూర్తయింది. శంభు ప్రసాద్‌ ‌పేరు పక్కన డాక్టర్‌ ‌డిగ్రీ వచ్చాక తనతో పాటు చదువుకున్న దివ్యను తల్లితండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇద్దరూ పీజీ ఎంట్రెన్సు కోసం కోచింగ్‌ ‌తీసుకోవడానికి హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ఆ సమయంలోనే దివ్య నెల తప్పింది. వారి జీవితంలోకి చిన్నారి స్నేహ అడుగు పెట్టింది. స్నేహ నెలల పిల్లగా ఉన్నప్పుడే వాళ్లకు ఎమ్‌.ఎస్‌ ‌చేయడానికి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. శంభు ప్రసాద్‌ ఈ ‌విషయం తండ్రితో సంప్రదించాడు.

‘‘డాడీ! ఇండియాలో చేసిన ఎమ్‌ ఎస్‌ ‌క్వాలిఫికేషన్‌కు, ఫారిన్లో చేసిన ఎమ్‌ ఎస్‌ ‌క్వాలిఫికేషన్‌కు చాలా తేడా ఉంటుంది. మేమిద్దరమూ ఎమ్‌ ఎస్‌ ‌చేయడానికి అమెరికా వెళ్తాము’’ అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘‌మీరిద్దరూ వెళ్లాలనుకోవడం వరకూ బాగానే ఉంది. మరి స్నేహ?’’ అన్నాడు గోపాలరావు.

‘‘పసిపిల్లను తీసుకుని వెళ్తే మాకు చాలా ఇబ్బందవుతుంది. దివ్య మదర్‌ ‌దగ్గర ఉంచుదామంటే ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండదు. కాబట్టి అక్కడ ఉంచడం కుదరదు. మీ దగ్గరే వదిలి వెళ్తాము.’’ అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘‌శంభూ! పాలు తాగే పసిపిల్ల తల్లితండ్రుల ఒడిలో పెరగాలి కానీ…’’ ఆగాడు గోపాలరావు.

‘‘డాడీ! మూడేళ్లు ఎంతలోకి తిరిగొస్తాయి? కానీ నా బాధల్లా ఈ ఊరులో సరైన వైద్య సదుపాయం కూడా లేదు. ఇక్కడ ఇల్లు అమ్మేసి ఆర్మూర్‌లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. మీరిద్దరూ పెద్దవాళ్లయ్యారు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అప్పటికప్పుడు ఆర్మూరు కానీ నిజామాబాద్‌ ‌కానీ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఎంత సమస్యవుతుంది?’’ అన్నాడు శంభు.

‘‘అందరూ అలా అనుకుంటే పల్లెలు ఎడారులుగా మిగిలిపోతాయి. ఇప్పటికే నీలాంటి యువత చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్నాలకు, విదేశాలకు ఎగిరి పోతున్నారు. మా లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటేనైనా అపుడపుడు వచ్చి ప్రశాంత జీవితం గడుపుతారు’’ అన్నాడు గోపాలరావు.

‘‘మావయ్యగారు! మీరలా మొండిపట్టు పడితే ఎలా? మీ దగ్గర పసిపిల్లను ఉంచుతున్నాం. ఏదయినా ఎమర్జెన్సీ వస్తే ఎలా?’’ నిష్టూరంగా అంది దివ్య.

‘‘అలా అపశకునం మాటలు మాట్లాడకమ్మా. స్నేహ మా ఇద్దరి ప్రాణం, కంటికి రెప్పలా కాపాడుకుంటాము. నీ భర్త కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే క్షేమంగా పెరిగాడు.’’ విషయాన్ని ఖండించాడు గోపాలరావు.

అలా స్నేహను నానమ్మ, తాతయ్యలకు అప్పగించి దివ్య, శంభు ప్రసాద్‌ ‌యూ ఎస్‌ ‌వెళ్లిపోయారు.

                                                                                         *       *       *

వారిద్దరికీ స్నేహతో రోజొక వేడుకగా మూడేళ్లు గడిచాయి. ఒక రోజు స్నేహకు జోలపాట పాడుతూ గోపాలరావు నిద్ర పుచ్చుతున్నాడు.

‘‘జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామ గోవిందా

చిన్నారి స్నేహమ్మ జో…

బంగారు బుజ్జాయి జో’’

‘‘తాతయ్యా! ఆపేసావు… పాడు… డూ…’’ నిద్ర మత్తులోనే అంటోంది స్నేహ.

‘‘అమ్మదొంగా! నిద్ర వస్తున్నా ఆపుకుంటు న్నావా?’’ జో కొడుతూ మురిపెంగా అన్నాడు గోపాలరావు.

సమాధానం రాకపోవడంతో వంగి స్నేహ ముఖం చూసాడు. పాలుగారే బుగ్గలతో స్నేహ చాలా ముద్దుగా ఉంది. మెల్లగా నిద్రలోకి జారుకున్న మనవరాలి నుదుటి మీద పడుతున్న ముంగురులు సవరిస్తూ సుతిమెత్తని ముద్దు పెట్టుకున్నాడు.

‘‘మీ గారాల మనవరాలు పడుకుందా?’’ చీర కొంగుతో చేతులు తుడుస్తూ లోపలకు వచ్చింది లక్ష్మి.

‘‘నాకేనా మనవరాలు? నీకు కాదా?’’ నవ్వుతూ అన్నాడు గోపాలరావు.

‘‘మనిద్దరి మనవరాలు… సరేనా? తాతయ్య జోల పాడనిదే మనవరాలికి నిద్ర రాదుగా?’’ నవ్వుతూ అంది లక్ష్మి.

గోపాలరావు కూడా నవ్వేసాడు. అంతలో ఆయన ఫోన్‌ ‌రింగ్‌ అయింది.

‘‘అబ్బాయి ఫోన్‌ ‌చేస్తున్నాడు’’ అంటూ ఫోన్‌ ‌తెచ్చి ఆయనకు ఇచ్చింది.

‘‘హలో బాబూ! ఎలా ఉన్నారు?’’ అన్నాడు గోపాలరావు.

‘‘ఫైన్‌ ‌డాడీ! మీరెలా ఉన్నారు? అమ్మ బాగుందా? స్నేహ మేలుకుని ఉందా?’’ అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘ఇప్పుడే నిద్రలోకి జారుకుంది బాబూ! ఈ రోజు ఫోన్‌ ‌చేయడానికి ఇంతాలస్యం అయిందేంటి?’’ …

‘‘రోజూ స్నేహాను చూడటానికి మధ్యలో బ్రేక్‌ ‌తీసుకుంటాను డాడీ! ఈ రోజు ఎమర్జెన్సీ కేసులున్నాయి, అందుకే కుదరలేదు. రేపు ఆదివారం కదా హాస్పిటల్‌కి ఆలస్యంగా వెళ్తాము. దివ్య కూడా పాపను చూడాలంటుంది. ఉదయం లేచాక వీడియో కాల్‌ ‌చేస్తాను. బై డాడీ!’’ అని ఫోన్‌ ‌పెట్టేసాడు శంభు.

‘‘లక్ష్మీ! బాబు రేపు ఉదయం ఫోన్‌ ‌చేస్తానన్నాడు’’…

‘‘సరే, ఇక పడుకోండి’’ అని స్నేహకి దుప్పటి కప్పి పక్కనే పడుకుంది లక్ష్మి.

                                                                                         *       *       *

మరుసటి రోజు ఉదయం శంభు ప్రసాద్‌ ‌ఫోన్‌ ‌చేసి వాళ్ల గుండెలు గుభేల్‌ ‌మనిపించే వార్త చెప్పాడు.

‘‘మామ్‌, ‌డాడ్‌! ‌మేము కొంత కాలం ఇక్కడే హాస్పిటల్‌ ‌పెట్టుకుని ప్రాక్టీసు చేయాలను కుంటున్నాము. కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఇండియా వస్తాము. ఈ లోగా స్నేహను అమెరికా తీసుకురావడానికి వీసా ఏర్పాట్లు చేస్తాను’’ అన్నాడు శంభు.

‘‘అదేంటి ఉన్నట్లుండి ఇలాంటి షాక్‌ ఇచ్చావు బాబూ?’’ అంది లక్ష్మి.

‘‘ఇందులో షాక్‌ అయ్యేందుకు ఏముంది మామ్‌? ‌పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కదా ఉండవలసింది. కొన్నాళ్లు ఇక్కడ ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నాడు శంభు.

‘‘మీరు అక్కడ కొంత కాలం ఉండటమనేది మీకు ఆనందమైతే ఉండండి. కానీ స్నేహ మా దగ్గర బాగానే ఉంది, తను లేకుండా మేముండలేము’’ అన్నాడు గోపాలరావు.

‘‘అదెలా కుదురుతుంది మావయ్య గారు? తన ఎడ్యుకేషన్‌కి ఇబ్బంది అవుతుంది’’ అంది దివ్య.

‘‘శంభు ఇక్కడ చదివే అమెరికా వెళ్లాడు’’ అన్నాడు గోపాలరావు.

దివ్య ముఖం మాడ్చుకుంది. అది శంభు ప్రసాద్‌ ‌గమనించాడు.

‘‘డాడీ! మేము త్వరలో స్నేహను తీసుకు వెళ్తాం. ఇక ఈ విషయాలు వదిలేయండి’’ అని ఫోన్‌ ‌పెట్టేసాడు శంభు.

                                                                                         *       *       *

కొద్ది రోజుల తరువాత ఒక రోజు ఉదయం స్నేహ నిద్ర లేవడమే కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టింది.

‘‘ఇదేంటి పాప ఒళ్లు వేడిగా ఉంది?’’ నుదుటి మీద చేయి వేసి అన్నాడు గోపాలరావు.

‘‘అయ్యో! నాలుగు రోజుల నుండి ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదండీ. నులి పురుగుల మందేమైనా వేయాలేమో అనుకుంటున్నాను’’ అంది లక్ష్మి.

కాసేపటికి స్నేహకు టెంపరేచర్‌ ‌పెరిగింది. గోపాలరావు ఊర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. డాక్టర్‌ ఇచ్చిన మందులు వేసిన కాసేపటికి టెంపరేచర్‌ ‌తగ్గింది, కానీ మళ్లీ జ్వరం వచ్చింది. ఆగి ఆగి వస్తున్న జ్వరం, వాంతులతో సాయంత్రానికి బాగా నీరసంగా అయింది. చంక దిగకుండా ఏడుస్తూనే ఉంది. రెండవ రోజు ఉదయం ఇద్దరూ కలిసి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూరులోని పిల్లల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.

‘‘పాప పొట్టలో కొన్ని పెద్ద పరిమాణంలో లింఫోనోడ్స్ ఉన్నాయి. వాటి సైజు తగ్గడానికి యాంటీబయాటిక్స్ ‌వాడాలి’’ పరీక్షలయ్యాక చెప్పారు డాక్టర్‌.

‘‘‌సరే నండి’’ అని ఇద్దరూ పాపను తీసుకుని ఇంటికి వచ్చారు.

రెండవ రోజు కూడా స్నేహకు జ్వరం తగ్గలేదు. వాంతులు కూడా తగ్గలేదు. నీళ్లు తాగితే వాంతుల రూపంలో వస్తున్నాయి. ఇద్దరూ బాగా కంగారు పడ్డారు. రిపోర్ట్సన్నీ వాట్సాప్‌లో శంభు చూసాడు. స్వంతంగా తను కూడా కొన్ని మెడిసిన్స్ ‌చెప్పాడు. ఏమీ ఉపయోగం లేకపోయింది. సాయంత్రానికి స్నేహ తోటకూర కాడలా వేలాడిపోయింది. లక్ష్మి ఏడుపు మొదలు పెట్టింది దానితో గోపాలరావుకి కంగారు ఎక్కువైంది.

‘‘నేను ఆ రోజే చెప్పాను పల్లెటూరిలో సరైన వైద్యం అందదని సిటీకి షిఫ్ట్ అవ్వమని. మీ నాన్నగారు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి పిల్ల పరిస్థితి’’ కోపం, దుఃఖం కలగలిపి అంది దివ్య.

‘‘డాడ్‌! ‌పాపకు వాటర్‌ ‌లెవెల్స్ ‌తగ్గిపోతున్నాయి. డి హైడ్రేట్‌ అయితే కష్టం హాస్పిటల్‌కి తీసుకువెళ్లండి’’ అన్నాడు శంభు.

అప్పటికప్పుడు స్నేహను ఆర్మూర్‌ ‌తీసుకువెళ్ళారు. బ్లడ్‌ ‌టెస్ట్ ‌చేసి తెల్ల రక్తకణాలు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. బ్లడ్లో ఇన్ఫెక్షన్‌ ఉం‌దన్నారు. పాప డీ హైడ్రేట్‌ అయింది కాబట్టి వెంటనే సెలైన్‌ ‌పెట్టాలని ఆస్పత్రిలో జాయిన్‌ ‌చేసుకున్నారు.

స్నేహా ఒకటే ఏడుస్తోంది. అది చూసి లక్ష్మీ ఏడుపుకి అంతులేదు… గోపాలరావుకి దిక్కు తోచడం లేదు. రాత్రంతా జ్వరం తగ్గుతూ, పెరుగుతూ ఉంది. వాంతులవుతూనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటల తరువాత కాస్త జ్వర తీవ్రత తగ్గింది. కానీ మరుసటి రోజు కూడా అడపా దడపా వాంతులవుతున్నాయి. సెలైన్‌ ‌పెట్టే ఉంచారు. స్నేహా నిద్ర పోయినప్పుడు మినహాయించి మేలుకుని ఉన్నంత సమయం సెలైన్‌ ‌తీసేయమని ఏడుస్తూనే ఉంది. పగలు, రాత్రీ రెప్ప వేయకుండా స్నేహ చేయి పట్టుకుని లక్ష్మి, గోపాలరావు కూర్చునే ఉన్నారు.

‘‘లక్ష్మీ! తెల్లవారింది. నువ్వు కాసేపు పడుకో! నాలుగు రోజుల నుండి నీకు తిండీ, నిద్ర లేవు’’ అన్నాడు గోపాలరావు.

‘‘నేనే కూర్చుంటాను. మీరు కాసేపు పడుకోండి’’ అంది లక్ష్మి.

అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. గోపాలరావు వెళ్లి తెరిచాడు.

‘‘శంభూ! నువ్వేనా?’’ ఆశ్చర్యంగా అంటున్న గోపాలరావుకి ఆ వెనుకే దివ్య కూడా కనిపించింది.

కొడుకు, కోడళ్లను చూసి లక్ష్మి కూడా నోరు తెరచింది. దివ్య ముఖంలో కోపం ఇద్దరూ గమనించారు.

‘‘స్నేహా!’’ అంటూ పక్కలో కూర్చుని పిలిచింది దివ్య.

స్నేహా కళ్లు తెరచి అయోమయంగా దివ్యను చూసింది. మెల్లగా చూపు నానమ్మ వైపు తిప్పి ఏడ్చింది. లక్ష్మి గబుక్కున వచ్చి’’ తగ్గిపోతుంది తల్లీ, ఏడవకు’’ అని బుజ్జగించింది. దివ్య విసురుగా పైకి లేచింది.

‘‘శంభూ! ఇండియా వస్తున్నట్లు చెప్పలేదేంటి?’’ అని ప్రశ్నించాడు గోపాలరావు.

‘‘స్నేహాకి బాగాలేదని దివ్య గొడవ చేసింది డాడీ! అందుకే అప్పటికప్పుడు బయలుదేరాము’’ క్లుప్తంగా అన్నాడు శంభు.

‘‘సరాసరి ఇక్కడికే వచ్చినట్లున్నారు. మీరిద్దరూ ఇంటికి వెళ్లిరండి’’ అంది లక్ష్మి.

‘‘డాక్టర్‌ ‌గారు వచ్చాక వెళ్తాము’’ అన్నాడు శంభు.

కాసేపటి తరువాత డాక్టర్‌ ‌వచ్చి స్నేహను పరీక్షించారు. మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచాలని చెప్పారు.

‘‘డాడీ! ఈ పరిస్థితికి కారణం మీరే! సరైన వైద్యసదుపాయాలు లేని పల్లెటూర్లో ఉండటం వల్లనే స్నేహ ఇంత అనారోగ్యానికి గురైంది’’ అప్పటి వరకు ఆపుకున్న మాటలను కక్కేసాడు శంభు.

‘‘ఏం మాట్లాడుతున్నావు శంభు? నువ్వు ఏ ఊర్లో పుట్టావు… ఏ ఊర్లో పెరిగావు? చిన్న పిల్లలకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నీ చిన్నప్పుడు నీకు రాలేదా? రావలసినవి పల్లెటూరులో ఉన్నా, పట్నంలో ఉన్నా రాకమానవు. నువ్వు పెరిగింది పల్లెలోనే అని గుర్తుంచుకో’’ విస్తుపోతూ అన్నాడు గోపాలరావు.

‘‘మీరు మారరు డాడీ! స్నేహ కోలుకున్నాక మేము తీసుకెళ్లిపోతాము’’ అన్నాడు శంభు.

‘‘నీ ఇష్టం’’

లక్ష్మి కళ్ల నిండా నీరు నింపుకుని కొడుకుని చూస్తోంది. గోపాలరావు మౌనంగా ఉండిపోయాడు. రెండు రోజుల తరువాత స్నేహను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసారు. ఇంటికి వచ్చాక లక్ష్మి కొడుకు కోడళ్లతో స్నేహను తమ దగ్గరే ఉంచమని బ్రతిమిలాడింది. కానీ వారు ససేమిరా వినలేదు. నానమ్మ, తాతయ్యల నుండి వేరుచేస్తూ ఏడుస్తున్న స్నేహతో శంభు, దివ్య పది రోజుల తరువాత అమెరికా వెళ్లిపోయారు. స్నేహ తల్లితండ్రులకు చేరిక కావడానికి ఎంత సమయం? పట్టిందో, మనవరాలికి దూరంగా బ్రతకటానికి నానమ్మ, తాతయ్యలకు అంతే సమయం పట్టింది.

స్నేహ రెండు కుటుంబాల వారధి కాబట్టి రోజూ ఫోన్లో వాళ్లతో మాట్లాడుతుంది. ఈ పదేళ్లలో రెండు సార్లు ఇండియా కూడా వచ్చి వెళ్ళింది.

                                                                                         *       *       *

‘‘దివ్యా! స్నేహా అడిగిన ప్రశ్నకు సరైన జవాబు నా దగ్గర లేదు. మొదటిసారిగా నేను తప్పు చేసాననిపిస్తుంది’’ గతం నుండి బయటకు వచ్చిన శంభు ప్రసాద్‌ అన్నాడు.

‘‘శంభు! స్నేహా మాటలు మీరు పట్టించుకోవద్దు. మనం ఆ పల్లెలో ఉండకుండా అభివృద్ధ్ది చెందిన దేశంలో ఉన్నామంటే తృప్తిగా ఉన్నామనే కదా?’’ అంది దివ్య.

‘‘లేదు దివ్యా! ఎంత ఆలోచించినా తృప్తికి నిర్వచనం తెలియడం లేదు. ఎంత పురోగమించినా నాలో ఏదో వెలితి కనిపిస్తుంది. అదేమిటో ఇన్నాళ్లు స్పష్టంగా తెలియలేదు. నేను కన్నఊరిని, కన్నవాళ్ల బాధ్యతను విస్మరించాను. కన్నతల్లిని బతికించుకోలేకపోయాను. కన్నవూరు రుణం తీర్చుకోలేకపోయాను. ఎంత సంపాదించి ఏమిటి ఉపయోగం? మనిద్దరం మా ఊరిలో హాస్పిటల్‌ ‌పెట్టుకుంటే మా అమ్మ దక్కేది. ఎంతో మందికి మంచి వైద్యం అందించేవాళ్లం. ఆ తృప్తి ముందు ఏదయినా దిగదుడుపే! ఇక మనం తొందరలోనే పల్లెకు పోదాం!’’ స్థిరమైన స్వరంతో అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘‌శంభూ! అది కాదు. నా మాట విను’’ ఏదో చెప్పబోయింది దివ్య.

‘‘నువ్వు ఏది చెప్పినా ఇన్నాళ్లు విన్నాను. ఇప్పుడు నా నిర్ణయంలో ఎటువంటి మార్పుండదు’’ నిశ్చలంగా అన్నాడు శంభు ప్రసాద్‌.

‘‘‌డాడీ! మీరేం నిర్ణయం తీసుకుంటారోనని భయపడ్డాను. నేను మళ్లీ నానమ్మ, తాతయ్యలతో ఉంటాను. థ్యాంక్‌ ‌యూ సో మచ్‌!’’ అం‌టూ తండ్రి మెడ చుట్టూరా చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది స్నేహ.

వచ్చేవారం కథ..

వసంతం

– బి. నర్సన్‌

About Author

By editor

Twitter
YOUTUBE