మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. బయట ముసురుగా ఉంది. పట్టాభి ఇంట్లో అంతకంటే ఎక్కువ ముసురుగానే ఉంది.
‘‘మీ ధర్మ పన్నాలతో బతుకంతా కష్టాలమయం చేసుకున్నారు. మీ ఉపేక్ష చట్రంలోనే మమ్మల్నీ ఇరికించి కాళ్లూ చేతులూ కట్టిపడేశారు’’ తండ్రిమీద కారాలూ, మిరియాలూ నూరుతున్నాడు మౌళి.
‘‘నలభై ఏళ్లుగా మూడెకరాల పొలం ఫల సాయాన్నీ చక్కగా ఆరగిస్తున్నారు వాళ్లు. ఇవాళ అసలు పొలమే తమది అంటూ ఏవో తప్పుడు కాగితాలు సృష్టించి మనల్ని ఛీ కొడుతున్నారు. ఇదెక్కడి ధర్మమో మీకే తెలియాలి’’ రెండో కొడుకు రాజేశ్వర్ అగ్గికి గాలిని తోడుజేస్తున్నాడు.
‘‘తాడో పేడో తేల్చుకుందామంటుంటే, ఆ వెన్నెల మీసాల మధ్య నుంచీ సన్నని నవ్వూ, ‘పోనీండర్రా, వాళ్లేం పరాయివాళ్లు కారుగా’ అని ‘అమిత అపేక్షా!’ శాంతమ్మ కొడుకులకి మద్దతుగా భర్త స్వభావానికి కినుకని జూపింది. క్రీగంట భార్యని చూసి చూపు మరల్చుకున్నాడు పట్టాభి.
‘‘చింతగుంటపాలెంలో పాత ఇంటిని రెండంత స్తుల మేడ చేసుకున్నారు. వేరే స్థలాలు మాత్రం ఉండి ఉండవూ? అంతా ఆ అయివేజులోంచీ వచ్చిన వేగా? మీ తమ్ముడి పెద్దకొడుకు విశ్వం చదువుని గుంట పెట్టి గంట వాయించి రాజకీయప్పక్షి అయ్యాట్ట. వాడికి చాలా బలగంఉందిట. అదీ పొగరు. అందుకనే మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.’’ మౌళి దిగ్గున లేచి నిలబడ్డాడు.
‘‘బందరులో రేపోమాపో బీపీసియల్ వచ్చే అవకాశాలున్నైట. ఎటూ పోర్టు బాగుపడుతుంది. దాన్తో భూముల ధరలకు రెక్కలొస్తున్నయ్. మన పొలం మూడెకరాల ధర కోట్లల్లో పలుకుతుంది’’ అన్నాడు రాజేశ్వర్.
‘‘శివగంగ దాటితే నాలుగు కిలోమీటర్లు. అందునా ఈ పొలం నుంచీ చల్లపల్లి రోడ్డు, కూతవేటు దూరంరా. నేను చూశానుగా. యాభై ఏళ్ల క్రితం అంటే – అంతా బురదమయం, లోయగా ఉండేది. ఇప్పుడు సుక్షేత్రంగా మాగాణి అయిందిట’’ శాంతమ్మ వివరాల్లోకి వెళ్లింది.
‘‘ఈసారి మనమే పోయొద్దాం రా రాజూ’’ అన్నాడు మౌళి, హాలంతా అలంగం తిరుగుతూ. ముగ్గుర్నీ నిశితంగా చూశాడు పట్టాభి. తల్లీ కొడుకులు గతాన్ని తవ్వుతున్నారు.
అవును. అప్పుడు పరిచయమైన మిత్రుడు గురురాజన్. ఎల్‌ఐసీలో ఉద్యోగి. అతనిది ఒక ముందుచూపు ప్రణాళిక. ఊరికి దూరంగా ఉన్న భూమిని చవుకలో కొని తాను బదిలీ మీద వెళ్లేప్పుడు ఎక్కువధరకు అమ్మి సొమ్ము చేసుకుని పోవటం. ఆ దూరదృష్టిని శతపోరి తనకెక్కించి ఆ పొలాన్ని చాలా చవగ్గా కొనిపించాడు. ప్రైవేటు టీచరుగా పనిచేస్తు న్నాడు తను. ఆ భూమిని ఒక దారికి తేవాలంటే చేయాల్సిన పనుల గురించీ, కావలసిన వనరుల గురించీ తెలుసుకునేసరికీ గుండె బేజారెత్తింది. ఆ అవస్థలకి పూనుకోకుండా వదిలేశాడు. ఈలోగా మౌళి చదువు పూర్తయింది. హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతి ఏడాదే రాజేశ్వర్ కూడా బీహెచ్‌ఇఎల్ లో ఉద్యోగి అయ్యాడు. దాన్తో, కుటుంబాన్ని భాగ్యనగరానికి మార్చటం, అక్కడే స్థిరపడటం జరిగింది. పట్టాభి మెడికల్ ల్యాబ్‌లో ఎకౌంటెంట్‌గా చేరాడు. అక్కడ కొత్తల్లో ఉమ్మడి కుటుంబమే. పిల్లల పెళ్లిళ్లు అయిన తర్వాత మూడు కుంపట్లయినై. ఏఏస్‌రావు నగర్‌లో ఒక అంటుమిద్దెలో సగభాగం కొనుక్కుని, దాన్లో తానూ శాంతా మిగిలేరు.
ఆ రోజుల్లోనే ఓసారి బందరునుంచీ తమ్ముడు ఈశ్వర్రావూ అతని భార్య శారదా హైదరాబాద్ వచ్చారు. పొలం విషయం ప్రస్తావిం చారు. ‘ఎటూ నేను బందరు వదల్లేని వాడినే. ఏదో ఆ బియ్యం వ్యాపారంతో భార్యా, ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ల సంసారాన్ని బరువుగా లాక్కొస్తున్నాను. విశ్వంకి సరైన చదువు అబ్బలేదు. ఎవరో ఒక మంచి రైతుని చూసి, నీ పొలాన్ని ఒక దారికి తెప్పిస్తాను. అక్కడ కొంత మంది పొలాల్లో పంటలు వేస్తున్నారు. నువ్ పెద్ద మనసుతో ఆ పొలాన్ని నన్ను సాగుచేసుకోనిస్తే నీకు ఋణపడి వుంటాం.’ అని కళ్లనీళ్ల పర్యంత మైనాడు. ‘బంధుత్వం సంగతి కంటే, ఓ పేద సంసారాన్ని ఆదుకుంటున్నా మనుకొని ఈ సహాయం చేయండి అక్కయ్యా’ అన్నది శారదమ్మ కూడా, తోడికోడలు చేతులు పట్టుకుని.
తనకు ఇష్టం లేదని చెప్పింది శాంత. ఆ రాత్రి తానే ఆమెకు నచ్చచెప్పాడు. ‘మన ఇద్దరు పిల్లలూ జీవితాల్లో స్థిరపడ్డారు. కోడళ్లిద్దరూ కూడా ఉద్యోగినులు. రేపోమాపో ఇళ్లు కొనుక్కుంటారు. మనకు పనికిరాని దానిని వాడు బాగు చేసుకుంటా నంటున్నాడు. బతుకంటే బాధ్యత తెలిసినవాడు. నిజం గానే ఆ భూమిని ఒక పద్ధతికి తెస్తే మంచిది గదా’- ఇదీ తన ఆలోచన. అర్థ్ధాంగీకారంగానే మౌనం వహిం చింది శాంత. తన మనస్సు నిండా బంధుత్వపాశం కన్నా కారుణ్యం పాలు ఎక్కువేమో! శాంత, కొడుకులూ అంటున్నట్టు ఇతరుల కష్టాల్ని చూసి అతిగా స్పందించే గుణమేమో! మర్నాడు -‘అలాగే చేసుకోండిరా’ అని సంతోషంగానే పంపించాడు- తమ్ముడినీ, మరదలినీ. ఆ తర్వాత మౌళికీ, రాజేశ్వర్‌కీ చెప్పింది శాంత.
ఏళ్లు గడిచాయి. మా పొలంలో వరి పండు తోందని తెలిసింది. ఎవరో అన్నట్టు ‘పిట్టలు వేసిన రెట్టలమీదే చిగుళ్లు మొలిపించాడు’ ఈశ్వర్రావు. నాళ్లు గడుస్తున్నాయి. విషయాలు వివరంగా తెలుస్తున్న కొద్దీ – శాంతకీ, కొడుకులకీ కడుపులో గలపరింత మొదలైంది. గుండెల్లో ఇరుకుతనం, మనసులో కుమ్మపొగలా సెగ మొదలైనై. పదిసార్లు గృహ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేయటం, పొలం చర్చనీయాంశంగా పెట్టి తనని విపక్షంగా మాటల పాల్జేయటం! తనలోని బలహీనతల పొరల్ని విడదీసి తన ముందే కుప్పపోయటం. తన ముఖ్యమైన అవాంఛనీయ లక్షణాలు -‘ధర్మ పన్నాలు’, ‘మెతక తనం’ ‘డబ్బంటే తృణప్రాయమైన దృష్టి’ అని ఉపసంహారం!!
– తన ఆంతరంగికాన్ని సమీక్షించుకున్నాడు పట్టాభి.
– ఇప్పుడు సాయంత్రం ఆరుదాటింది. బయట ఈదురుగాలీ, చిరుజల్లూ ఆగి, దడదడ వాన చినుకులు రాలుతున్నై.
‘‘మేమిద్దరం బందరుపోయి ఈ వ్యవహారం తేల్చుకొస్తాం’’ అన్నాడు మౌళి. మాట కరుకుగా వచ్చింది. ‘నా వరకూ నేను ఈ నలభై ఏళ్లల్లో వచ్చిన ఆదాయంలో భాగం కూడా ఇక్కడ పెట్టమని అడుగుతాను’ రాజేశ్వర్ తాను మరో అడుగుముందే ఉన్నానన్నట్టు – మొహం చెండుకున్నాడు.
‘‘అందులో తప్పేముందీ’’ సన్నగా రాగం తీసి, తలవంచి భర్తవైపు పక్క చూపు చూసింది శాంతమ్మ.
క్షణం విరామం కలిగింది. అప్పడు పెదవి విప్పాడు పట్టాభి, ‘‘ఎదుటివారి దృష్టిలోనూ మీదే ధర్మమనీ, తమది తప్పనీ అనిపించి, జ్ఞానోదయం కలిగితే అప్పుడు మీది ధర్మ, న్యాయం అవుతుంది. ఇదీ ధర్మరాజు చెప్పిన ధర్మసూక్ష్మం. అందుకనే దీన్ని ధర్మజ గీత అంటారు’’.
‘‘మీదంతా డొంకతిరుగుడు భాష. మా కర్థం కాదు లెండి’’ అని మూతివంకర్లు తిప్పింది శాంతమ్మ.
‘‘అమ్మ మాటతో తామిద్దరూ ఏకీభవిస్తున్న భంగిమలతో ‘అవును’ అన్నారు కొడుకులు. మనుషుల స్వభావాలు ఇలాంటి భంగిమల్లోనూ, మాటల స్వరాల స్థాయిలోనూ వెల్లడవుతూనే ఉంటాయి- అనిపించింది పట్టాభికి. ‘‘ఆదాయంలో భాగం కూడా అన్న కొడుకు మాట’’ వలన తన హృదయోద్వేగంతో తాను సతమతం కాసాగేడు.
– సరిగ్గా ఇప్పుడు చినుకుల్ని విదుల్చుకుంటూ, వడివడి అడుగులతో లోపలికి వచ్చాడు నీలకంఠం. శాంతమ్మ తమ్ముడు. ముందు- వానా ముసురూ గురించీ, ఆ తర్వాత కూతురింటికి తన రాక గురించిన మాటలూ, ఆ తరువాత పరామర్శలూ అయినై. శాంతమ్మ లేచి వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చి, మళ్లీ వంటింట్లోకి నడిచింది.
అందర్నీ చూస్తూ, ‘‘ఏదో చర్చల్లో ఉన్నట్టున్నారు’’ అని, ఆ మరుక్షణం విజయవాడలో మారిన రాజకీయ పరిస్థితుల్లోకీ, తన కాఫీ టీ పొడుల వ్యాపారంలోకీ దిగి పోయాడు నీలకంఠం. ఎదుటి ముగ్గురూ మౌన శ్రోతలైనారు.
శాంతమ్మ కాఫీలు తెచ్చింది. కూచుంది. నీలకంఠం తన ధోరణిని ఆపి, ‘‘చెప్పక్కయ్యా!’ అన్నాడు ఆమె వైపు చూస్తూ. కాఫీ సేవిస్తూ, ఆమె సమాధానానికి ఆగేడు.
‘‘ఏం ఉందిరా! మీ బావగారి అతి మంచితనం, మా మరిదిగారి అంతస్తుని పెంచుతోంది. అదే మాట్లాడుకుంటున్నాం’’ అని. ‘‘బందరు పొలం వ్యవహారం నీకూ తెలుసుగా’’ అన్నది. నీలకంఠం కాఫీ కప్పుని పక్కన పెట్టి- ‘‘ఆఁ తెలియకేం. ఆయన పెద్దకొడుకు విశ్వం పెద్ద బటాఛోరు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు. నాకు తెలుసు- వాడే మీ పొలానికి అసలు కబ్జాదారుడు!’’ అని నవ్వేడు. మౌళీ, రాజేశ్వర్, శాంతమ్మ మొహమొహాలు చూసుకున్నారు. ఈ మాటలు పట్టాభికి ఇబ్బంది పెట్టాయి. కుర్చీలో ఉసురుసురనుకున్నాడు. ‘‘అందుకనే వీళ్లిద్దరూ బందరు వెళ్లి పొలం సంగతి తేల్చుకొద్దామనే ఆలోచనలో ఉన్నారు’’ శాంతమ్మ చెప్పింది.
బావగారేమైనా చెబుతాడా అని పట్టాభివైపు మెడ తిప్పాడు నీలకంఠం. ఆయనేమీ అనలేదు.
‘‘విషయం తెలిసినవాడివి. నువ్వొకసారి వాళ్లతో మాట్లాడితే…’’ అని అర్థోక్తిలో ఆగేడు మౌళి.
‘‘ఆ మాటమీద ఉండండి. నా దగ్గర ఆ పోకిరి రాయుడి ఆటలు సాగవు. బెదిరింపులూ, దబా యింపులూ పన్జెయ్యవు. వాడి వెనుక రాజకీయముంటే, నేనూ రాజకీయంగానే వెళ్తా. యుద్ధమంటే, యుద్ధానికీ సిద్ధమే. అసలెందుకూ, కోర్టులోనే తేల్చుకుందాం’’ నీలకంఠం మాటల్లో ఆవేశంతో పాటు ఆత్మోత్కర్షా పెల్లుబికాయి.
‘‘అదీ మాట, అట్టా ఉంటేగానీ ఇట్టాంటి వాళ్ల కుతంత్రాల్ని ఎదుర్కోలేం’’ అన్నాడు మౌళి. అవునన్నట్టు తల వూపేడు రాజేశ్వర్.
పట్టాభి ఇప్పుడు మాటకలిపేడు. ‘‘యుద్ధాలూ, దాష్టీకాలూ, కోర్టులూ ఎందుకయ్యా నీలకంఠం? వాళ్లూ మన వాళ్లేగా! ఎనభై ఏళ్లొచ్చి కోర్టు మెట్లెక్కు తానా?’’ అన్నాడు. శాంతమ్మ ఠక్కున అందుకుంది, ‘‘చూడరా తమ్ముడూ, ఇదీ ఈయనగారి అతి మంచి తనం. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూనూ ఇట్టా నీళ్లు నముల్తారురా ఈయన’’ అన్నది.
‘‘ఇదంతా ఎందుగ్గానీ, నువ్ ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురా మామయ్యా., మా శ్రేయస్సు కోరే వాడివి. నీకు చెప్పేదేముంది’’ అన్నాడు మౌళి. కొద్దిసేపు విషయాలు చర్వితచర్వణం అయ్యాయి.
శాంతమ్మ విషయం మారుస్తూ ‘‘ఎటూ వచ్చావు గదా. రాత్రికి ఉండి వెళ్లరా’’ అన్నది. ‘‘లేదు, లేదు వెళ్లాలి. మా మణీ, అల్లుడూ ఎల్లుండి అమెరికా పోతున్నారు. వాళ్లని చూద్దామని వచ్చాం. మీ మరదలు అక్కడ పనుల్లో ఉంది’’ అన్నాడు. ‘‘సరే… టిఫిన్ చేస్తాను’’ అంటూ లేచింది. మిగిలిన వాళ్ల సంభాషణ మళ్లీ మొదలైంది!
* * *
పదిహేను రోజుల తర్వాత- పట్టాభికి ఫోన్ చేశాడు నీలకంఠం. ‘‘నా రాయబారం ఫలించలేదు బావా’’ అని ‘‘ఫోన్‌ని అక్కకివ్వు’’ అన్నాడు. భార్యకి ఫోన్‌ని అందించాడు పట్టాభి. ఆమె స్పీకర్ పెట్టింది. ‘‘ఆ విశ్వం చాలా దారుణంగా మాట్లాడుతున్నాడే అక్కయ్యా. ‘పొలం మాది. నీ మధ్యవర్త్తిత్వమేందయ్యా’ అని ఈసడించేశాడు. నేను పెట్టాల్సిన గడ్డి పెట్టేవచ్చాన్లే. మీ మరిది ఓ సాధు జంతువులా కూచు న్నాడు. రెండో కొడుకు రాంబాబుకి విజయవాడలో ఏదో చిన్న ఉద్యోగంట. ఇవేవీ పట్టవు. కోర్టులో తేల్చుకోవటమే మంచిది’’ అని ‘‘ముందు ఓ లాయర్ నోటీస్ పడేయించమని చెప్పు పిల్లలకి’’ అంటూ ముగించాడు. ‘‘అంతే… అంతే…. అట్టాగే’’ అంటూ పూర్తి చేసింది శాంతమ్మ.
పట్టాభి మ్లానంగా చూస్తూ ఉండిపోయాడు. ‘‘అప్పుడే వాళ్లకేదో జరిగిపోతున్నదని మీరేమీ కుంగిపోవఖ్ఖర్లేదు. అన్యాయం జరిగింది మనకూ’’ అంటూ విసవిసా లోపలికి వెళ్లిపోయింది భార్య.
పేలవంగా నవ్వుకున్నాడు పట్టాభి. తమ్ముడి కుటుంబం పొలం మీది ఆదాయం అనుభవించిన మాట వాస్తవం. కానీ, అది ఎంత? సేద్యం ఖర్చులూ, అతివృష్టీ, అనావృష్టీ నష్టాలూ… అంతా పోను చేతికందింది ఏ నాలుగు రాళ్లో! అందులోనే, పిల్లల పెళ్లిళ్లూ, పేరంటాలూ… అన్నీ నిభాయించుకొచ్చారు గదా – అనిపించింది. ఈ తలపుతో పాటు, ఆ విశ్వం ప్రవర్తనే మరీ బాధిస్తోంది అనీ మనసు నొచ్చుకుంది. కానీ, ‘కానున్నది కాక మానదు’ అని ఆలోచననుంచీ తేరుకున్నాడు.
ఈశ్వర్రావుకి – లాయర్ నోటీసు వెళ్లింది. సమాధానం లేదు. నెల దాటింది.
మౌళీ, రాజేశ్వర్ లాయర్ని సంప్రదిస్తే, కేసు వెయ్యదలచుకుంటే అయ్యే కోర్టు ఖర్చులూ, తన ఫీజూ లెక్కలు చెప్పాడాయన. ఆలోచించుకోమన్నాడు. ఆ అంకెల భయం – ఆలోచనల్లో, తర్జనభర్జనలో మరో రెణ్ణెల్లు వెనకబడ్డాయి. నీలకంఠంతో చెబితే, ‘‘అవును ఒకసారి అడుసు తొక్కితే… అంతే మరి…’’ అని లౌక్యంగా అనేశాడు.
* * *
ఈ శతాబ్దపు మానవాళి విషాదం – కరోనా – వచ్చింది, వెళ్లింది. బందరులో ఈశ్వరరావునీ, శారదమ్మనీ, విశ్వంనీ, ఈశ్వర్రావు పెద్దకూతుర్నీ కరోనా తీసుకుపోయింది. నీలకంఠం వాళ్లు కులాసా అని పట్టాభివాళ్లకు తెలిసింది. వ్యాపారాలూ, వ్యవహారాలూ కుదేలైనాయి. అసలే యుగలక్షణంగా పురి సడలిన మానవ సంబంధాలు మరీ పుటుక్కుమనే స్థితికి దిగజారేయి. పట్టాభి పొలం వ్యవహారం గొంగళి సామెతగానే ఉండిపోయింది. మౌళి, రాజేశ్వర్ కూడా ఉద్యోగాలూ, సంసారాల సమస్యలతో అవస్థ పడుతున్నారు. శాంతమ్మకి ఏ కలత నిద్రలోనో బందరు సంగతులు గుర్తుకొచ్చి కలత బెడుతున్నా ‘నా చేతిలో ఏం ఉంది?’ అని చెప్పుకుని సమాధాన పడే స్థితికి వచ్చిందామె. క్రమశిక్షణ, అలవాట్లూ, సదాలోచనా, అంతకుమించి స్థిత ప్రజ్ఞా పట్టాభిని ఏ అనారోగ్యం పాలు చేయకుండా కాపాడుతున్నాయి.
– ఏడాది తిరిగింది.
ఆ వేళ-
స్నానాదికాలూ, పూజా పూర్తిచేసుకుని హాల్లోకి చేరారు.. పట్టాభీ, భార్యా. ఆయన పత్రికను పట్టుకు న్నాడు. ఆమె తనలో తాను నిదానంగా స్తోత్ర పాఠమేదో చదువుకుంటోంది.
గుమ్మం దగ్గర అలికిడైంది. చూశారు.
పట్టాభి గుర్తు పట్టాడు. ఈశ్వర్రావు రెండో కొడుకు రాంబాబు, పక్కన పాతికేళ్ల యువతి. ‘‘రా… రా…. రాంబాబూ… ’’ అని స్వాగతించాడు పట్టాభి. ‘‘ఈమె నా భార్య రమణి’’ అని పరిచయం చేశాడా యువతిని. ఇద్దరూ లోపలికి వచ్చి పెద్దవాళ్లకి పాదాభివందనం చేశారు. కుర్చీల్లో కూచున్నారు. శాంతమ్మే మాట కలిపింది, ‘‘కరోనా చేసిన విలయం విన్నాం. ఎవరూ ఎక్కడికీ కదిలే పరిస్థితులు కావుగా నాయనా’’ అన్నది.
జరిగిన సంభవాలే కదిలేయి సంభాషణలో. తన వివాహం సంగతీ చెప్పాడు రాంబాబు. ‘‘మాది ప్రేమవివాహం. ఈమె టీచర్ గా పనిచేస్తున్నది. హైదరాబాద్ వాళ్లే. మీ దయ వలన నేనూ- చిన్న జెరాక్సూ, స్టేషనరీ, బుక్‌షాపు పెట్టుకున్నాను’’. కాఫీలు తెచ్చిచ్చింది శాంతమ్మ. ఆమెను అనుసరిస్తూ, తమ సంగతులు చెబుతూ తిరిగింది రమణి. కాఫీ తాగ•ం అయిన తర్వాత నేల చూపులు చూస్తూ చెప్పసాగేడు రాంబాబు. ‘‘చివరి రోజుల్లో నాన్న మీ పొం గురించి చాలా బాధపడ్డాడు. మీ మంచిత నాన్ని చెప్పుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అన్నయ్య తప్పుడు ప్రవర్తనే అన్ని అనర్థాలకీ కారణం’’ అని ఆగి ఉద్విగ్నతతో కళ్లొత్తుకున్నాడు. తలవొంచుక్కూచు న్నాడు. కొద్దిసేపటికి తలెత్తి పట్టాభి వైపు చూస్తూ అన్నాడు, ‘‘పొలం కాగితాలు చూశాను. కౌలు రైతు తోనూ, లాయర్ తోనూ కూడా మాట్లాడాను. మిగిలిన వాళ్లం నేనూ, అక్కాబావలిద్దరూ …’’ అని ఆగేడు.
ఏ భావమూ వ్యక్తం చేయని మొహంతో అతను చెప్పేది వింటున్నాడు పట్టాభి. ఆ తర్వాత ఏం చెప్పబోతున్నాడా అనే ఉత్కంఠతో చూస్తున్నది శాంతమ్మ.
బిడియంతోనూ, సిగ్గుతోనూ ఇబ్బంది పడుతూ, ‘‘లోకంలో క్షమించాల్సిన దోషాలే కానీ, శిక్షించాల్సిన నేరాలు లేవు’’ అన్నార్ట ఎవరో మహాకవి. మీకు చెప్పేంతవాణ్ణి కాదు’’ అని చేతులు నలుపుకుంటూ, మళ్లీ తలవొంచుకుని కూచున్నాడు. నెమ్మదిగా ‘‘అన్నయ్యలతో చెప్పి ఆ రాత కోతల పని పూర్తి చేయించండి’’ అన్నాడు.
పట్టాభి శాంతమ్మ వైపు చూశాడు. ఆమె భర్త మొహంవైపే చూస్తున్నది. ఆయన నొసటి మడతల్లో ఆమెకు ధర్మజ గీతే కనిపిస్తున్నదిప్పుడు!!
– విహారి