భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– డా. పేరం ఇందిరాదేవి
‘‘నీ చిన్నప్పటి విషయాలు చెప్పు నాన్నా !’’ అడిగాను. యథాప్రకారం నాన్న నేను తీరిగ్గా కూర్చుంటే ఆయనకు తన చిన్నప్పటి విషయాలు చెప్పడం ఇష్టం, నాకు వినడం ఇష్టం. నాన్న చిన్నగా నవ్వి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఆయనేదో చెప్పబోతున్నారని నాకు అర్థమైంది. అమ్మకు నాన్నకు పాలు వేడి చేసి చెరొక కప్పులో ఇచ్చి కూర్చున్నా.
నాన్న నెమ్మదిగా గొంతు సవరించుకున్నారు. ఈ మధ్య ఆయన గొంతు మరీ దగ్గరగా ఉంటే తప్ప వినపడ్డం లేదు. అయినా జీరబోయిన గొంతుతోనే చెప్పడం మొదలు పెట్టారు.
‘‘పెళ్లి చేసుకోకపోతే, అయిన వాళ్లు ఎవరూ లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? ఒంటరితనం బాధాకరం అని అందరు అనుకుంటారు, ముఖ్యంగా వృద్ధాప్యంలో. చాలా మంది విషయంలో అది నిజమే. జల్సారాయుళ్లు యవ్వనంలో విచ్చల విడిగా గడిపి, వార్ధక్యంలో జబ్బులతో ఇబ్బంది పడి, ఒంటరి వాళ్లు, కుటుంబం, పెళ్లాం, పిల్లలు లేనివారు ఇలాంటి పరిస్థితి వస్తుందనే నీతిని చాటుతారు. ఎందుకంటే నీవు ఎలా ప్రవర్తించినా క్షమించేది నీ కుటుంబం మాత్రమే అన్నది మనలో ఉన్న నమ్మకం. అందుకే ప్రతి వ్యక్తి, పెళ్లి ద్వారా ఏర్పడే కుటుంబం కావాలనుకుంటాడు. జగమంతా కుటుంబం అనుకునేవారికి సొంత కుటుంబం అవసరం లేదు. అలాంటి వారికి జగమంతా అతని అవసరంలో నిలబడుతుందా? ఇది కేవలం ఆ వ్యక్తి ప్రవర్తన మీద ఆధారపడుతుంది కదా!’’ అన్నారు నాన్న .
నేను అంగీకారంగా తలూపాను.
నాన్న కాసేపు ఆగి చిన్న నాటి స్మృతులను తలచుకుని చిరునవ్వు తెచ్చుకుని మళ్లీ మొదలెట్టారు ‘‘మా చిన్నతనంలో గ్రామాల్లో జన జీవనం చాలా నిరాడంబరంగా సాగేది. ఉన్నవాళ్లు లేనివాళ్ల మధ్య అసూయ ద్వేషాలు అసలు లేవని కాదు కానీ, అవి బయటకు తెలియవచ్చేవి కావు. పనుల కాలంలో మగాళ్లు ఎవరి పనులు వాళ్లు చేసుకుని సాయంత్రాలు కమ్మాల కట్ట దగ్గర చేరుకొని ఓ గంటపాటు పిచ్చాపాటి మాట్లాడుకుని చీకటి పడగానే ముద్ద మింగి ముసుగేసుకుని పడుకునేవారు, ఆడాళ్లు పనులు చేసుకుని, పిల్లలకు అత్తమామలకు, బావలకు, మరదులకు వడ్డించి తామింత తిని తోడికోడళ్లు సఖ్యంగా ఉంటే కాసేపు ఊసులు చెప్పుకుని దీపాలార్పుకుని పడుకునేవారు. ఊర్లో ఎవరిళ్లల్లో అయినా పెళ్లి జరిగినప్పుడు, గ్రామఫోన్ రికార్డు పెట్టినప్పుడు, పీర్ల పండగకో, రామనవమి భజన జరిగే రోజుల్లోనో, నాలుగు ఊర్ల వాళ్లందరూ కలిసి వేసే నాటకాలకు సాధన చేసేటప్పుడు, నాటకం వేసేటప్పుడు తప్ప సాయంత్రాల్లో ఏడు తర్వాత పిట్ట కూడా తిరిగేది కాదు, ఏ శబ్దం వినపడేది కాదు. చదువుకునే పిల్లలు కూడా తక్కువుండేవాళ్లు, దీపం పెట్టుకుని చదువుకునేవాళ్లు ఉన్నా, వాళ్లు నిశ్శబ్దంకు భంగం కలిగించే వారు కాదు. ఆనాటి పల్లె భారతం కొత్తగా వచ్చిన స్వాతంత్య్రాన్ని ఏం చేసుకోవాలో తెలియని అమాయకత్వంలో ఉండేది. స్వాతంత్య్రం వచ్చేనాటికి నాకు పదేళ్లు.’’
నాకు ఊహ వచ్చినప్పటి నుండి పాత నారాయణ తెలుసు. అతను చలికాలం అంతా మా వరండాలోనే పడుకునేవాడు. నా చిన్నతనంలో నన్నెప్పుడూ ఆప్యాయంగా ఎత్తుకునేవాడు. ఆ ప్రత్యేకమైన ప్రేమకు కారణం నేను తల్లి లేని పిల్లాడినని తర్వాత ఎదిగాక అర్థమైంది. నారాయణ ఎర్రటి మనిషి. కాయకష్టం చేసేవాడు కాబట్టి ముదురు గోధుమ రంగులోకి తేలాడు. బక్కటివాడు కాడు, అలాగని లావుకాదు, మధ్యరకంగా ఉండేవాడు. నాకు గుర్తున్నంత వరకు అప్పటికే అతనికి జుట్టు బాగా తెల్లబడి ఉండింది. కోటేరు ముక్కుతో ఆకర్షణీయమైన ముఖం అతనిది. కళ్లు తీక్షణంగా ఉన్నా, నవ్వితే కళ్లలో కూడా నవ్వు కనపడేది. ఎక్కువ మాట్లాడేవాడు కాదు కానీ, తానే పోస్ట్ ఆఫీస్ నుంచి తెచ్చే దినపత్రికలో వచ్చే వార్తల గురించి ముఖ్యంగా రాజకీయాల గురించి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేళ్లలో దేశ ప్రగతి గురించి, నెహ్రూ పాలన గురించి పాత నారాయణ నాన్నతో, ఇంకా మా ఇంటికి వచ్చే కొద్దిమంది స్నేహితులతో మాట్లాడ్డం వింటుండేవాడ్ని. అతను వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని చదవగలిగే వాడు, మరి బడికి వెళ్లి చదువుకున్నాడో, చదువుకున్న వాళ్ల దగ్గరికి వెళ్లి నేర్చుకున్నాడో గానీ ముఖ్యమైన వార్తల గురించి చర్చించేవాడు. నా జ్ఞాపకాల్లో అతను ఇప్పటికి ముతక ఖద్దరు బట్టల్లో ఆనాటి భారతీయ రైతు కూలికి ప్రతిబింబంగా నిలిచి వున్నాడు.
పాత నారాయణకు ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, అప్పుడు తెలుసుకోవాలని తట్టలేదు. మా నాన్న దగ్గరికి వచ్చే స్నేహితుల్లో ఐదారు మంది నారాయణలు ఉండేవారు. గుర్తు కోసం ఒక్కో నారాయణ పేరుకు ఒక పిల్ల పేరు తగిలించేవారు. వాళ్లలో కుంటి నారాయణ, పిల్ల నారాయణ, ఎర్ర నారాయణ, కర్రి నారాయణ.. మన పాత నారాయణ కూడా వున్నారు. అయితే పాత నారాయణకు ఆ పేరు రావడానికి బహుశా అతను పాతవాడు, వయసులో పెద్దవాడు అవడం వలన అనుకుంటా. కానీ అసలయిన కారణం చెప్పడానికి ఇప్పుడెవరూ లేరు. పాత నారాయణ తప్ప మిగతావాళ్లంతా చిన్నవాళ్లు. నారాయణ గుంపులోకి తర్వాత వచ్చిన వాళ్లనుకుంటా. ఏమైతేనేం పాత నారాయణకు ఆ పేరైతే శాశ్వతంగా ఉండిపోయింది.
అతని చాలా చిన్నప్పుడే అమ్మానాన్న కలరాతో చనిపోయారు. తోబుట్టువులు ఎవరూ లేరు. ఇల్లు వాకిలి లేదు. ఎవరు ముందు పనికి పిలిస్తే వాళ్ల పొలంలోకి పోవడం, ఆ రోజుకు వాళ్ల ఇంట్లోనే తినడం… రాత్రికి మా ఊరి మధ్యలో ఉండే సత్రం ‘‘కమ్మాల కట్ట’’ దగ్గర పడుకునేవాడు. ఎవరూ పనికి పిలవని రోజుల్లో మా ఇంట్లో నిస్సంకోచంగా అడిగి అన్నం పెట్టించుకుని తినేవాడు. అయితే ఆ రోజు మా ఇంట్లో ఏదో ఒక పని చేసేవాడు, నారతో పగ్గాలు అల్లడమో, కట్టెలు కొట్టడమో, కల్లం శుభ్రం చేయడమో, సంగటికి జొన్నలు దంచడమో, ఇసుర్రాయితో రొట్టెకు జొన్న పిండి ఇసరడమో చేసేవాడు. ఊర్లో ఎవరు ఏమి చెప్పినా పలికే వాడు. నారాయణకు మా ఊర్లో అందరు తెలుసు, తన కులం, పరాయి కులం అని పట్టించుకునేవాడు కాదు. అతని దృష్టిలో అది ముఖ్యం కాదు గుణం ముఖ్యం. నాన్న స్నేహితులందరూ బీడీ కాల్చేవారు, కానీ నారాయణకు ఒక్క చెడు అలవాటు ఉండేది కాదు. కనీసం కాఫీ కూడా తాగేవాడు కాదు.
మా ఊర్లో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, నారాయణ పెద్దరికం తీసుకునేవాడు. చుట్టు పక్కల పల్లెల్లో ఉండే దూరపు చుట్టాలకు పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్లేవాడు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వార్తని వాళ్ల బంధువులకు తెలియజేయడానికి కూడా తనే వెళ్లేవాడు. ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చినా, ఎవరికీ ఆరోగ్యం బాగా లేకున్నా పిలిస్తే చాలు వెళ్లేవాడు. అందరి బంధువు అతను. అతనికి రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవి ఒకటి ఒంటి మీద, ఇంకొకటి తానే చవుడుతో ఉతికి ఆరేసుకున్నాక సంచిలోకి పెట్టేవాడు. ఆ సంచిని మా పెరట్లో గోడకున్న కట్టెకు తగిలించేవాడు. అందులో ఏమి దాచాడో అని పిల్లలం కుతూహలంతో వెతికేవాళ్లం. కానీ ఒక పంచ ఒక బనియన్ తప్ప ఏమీ ఉండేవి కాదు. అతనికి కూలి పనికి పోయినప్పుడు వచ్చిన డబ్బులు అన్నీ అప్పసామి గుడికే ఇస్తాడని అనే వాళ్లు. పనికి పోతే సాయంత్రం తోటల్లో బావి దగ్గర స్నానం చేసుకుని ఉతికిన తడి బట్టలే వేసుకునేవాడు. పెళ్లిళ్లలో చేసిన పనికి గుర్తింపుగా ఆ ఇంటివాళ్లు కొనిచ్చిన బట్టలు తప్ప అతనెప్పుడూ సొంతానికి చిన్న వయసులో ఉండగా కూడా బట్టలు కొనేవాడు కాదని నాన్న చెబుతుంటే విన్నాను. అతను బ్రహ్మచారిగానే ఉండిపోయాడు, యవ్వనంలో కూడా ఏ స్త్రీని తలెత్తి చూసేవాడు కాడని విన్నాను. పెద్దవాళ్లని ‘అమ్మా’ అని చిన్న వాళ్లని ‘అక్కయ్యా’ అని పిలిచేవాడని అతనంటే అందరికి గౌరవం. నమ్మకం కూడా అని నేను గ్రహించాను. కోడలిని పుట్టింటికి పంపడానికి, కూతుర్ని అత్తగారింటి దగ్గర వదలడానికి నారాయణనే తోడుగా ఇచ్చి పంపేవాళ్లు. ఊర్లో అందరు ఆడవాళ్లకి రక్త సంబంధం లేని సోదరుడు.
నారాయణకు పిల్లలంటే చాలా ఇష్టం. మేము చిన్నప్పుడు కల్లంలో ఆడుకుంటుంటే అప్పుడప్పుడు వచ్చి గోడ మీద కూర్చునే వాడు. చిల్లాకట్టే ఆడేప్పుడు ఒక పిల్లాడు కొట్టిన చిల్లా.. నారాయణ నుదుటికి తగిలి రక్తం వచ్చింది. వేరేవాళ్లకు తగిలి ఉంటే అక్కడి నుండి అందరం పారిపోయేవాళ్లం, కానీ నారాయణ కాబట్టి మేము ఆయన దగ్గరకు పరుగుతీసి దెబ్బ తగిలిందని బాధ పడ్డాం. నారాయణ రక్తం పంచెతో తుడుచుకుని నవ్వి, ‘‘ఆడుకోపోండి పెద్ద దెబ్బేమీ తగల్లేదులే’’ అని మమ్మల్ని కుదుట పరిచాడు. తీరిక వేళల్లో మా బడి గోడ దగ్గర కూర్చునేవాడు. మా అయ్యవారు చెప్పే వేమన, సుమతి పద్యాలు. శ్రీ కృష్ణ రాయబారం, తులాభారం నాటకంలో పద్యాలు నారాయణకు కంఠతా వచ్చేవి. రాగయుక్తంగా వాటిని పాడేవాడు. వేమన శతకంలోని పద్యాలను నన్ను అప్పజెప్పమని వాటి అర్థాన్ని మా వరండాలో కూర్చుని నాన్నకు ఇతర స్నేహితులకు వివరించేవాడు, అప్పటికి నాకు పద్యాలు కంఠతా వచ్చినా దాని భావం తెలిసేది కాదు, వాళ్ల చర్చ కూడా అర్థం అయ్యేది కాదు. పద్యాలు చక్కగా అప్పజెప్పానని ‘‘రోశిరెడ్డీ! నీ కొడుకును బాగా చదివించాలోయ్ తెలివైనోడు’’ అని నన్ను మెచ్చుకున్నట్లే అందరి పిల్లల్ని మెచ్చుకుని వాళ్లను బాగా చదువుకోమని ప్రోత్సహించేవాడు. సంతకు వెళ్లిన తల్లులు సరుకుల్ని, పిల్లల్ని మోయలేక ఇబ్బంది పడుతుంటే తన భుజం మీద ఎక్కించుకుని ఇంటిదగ్గర దించేవాడు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఆయనకు పిల్లలపై ప్రేమకు ఉదాహరణలుగా, అందుకే పిల్లలకు కూడా ఆయనంటే ఇష్టం.
నారాయణకు పని చెప్పడానికి గానీ, సహాయం అడగడానికి గానీ ఎవరికీ మొహమాటముండేది కాదు. అలాగే ఊర్లో ఏ ఇంటికైనా అతను ఏ సమయంలో అయినా ఆ ఇంటి మనిషిలాగా ఆత్మీయునిలాగా వెళ్లే చనువు ఉన్నా, దాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేసుకునేవాడు కాదు. చలి కాలంలో మా ఇంటి వరండాలో పడుకున్నా, దుప్పటి కప్పుకునేవాడు కాదు. కింద ఏమీ పరచుకునేవాడు కాదు..కటిక నేలమీదే పడుకునేవాడు. మా నాన్న కంబళి ఇచ్చినా వద్దనేవాడు. చలి తగ్గాక కమ్మాలకట్ట దగ్గర మాత్రమే పడుకునేవాడు. ఎవరి పని మీద వేరే ఊరికి పోయినా, తినడం అయ్యాక ఆ ఊరి సత్రంలో తప్ప ఎవరింట్లోనూ పడుకునేవాడు కాదు. తన జీవితమంతా ఒకేరీతిలో బతికాడు, వార్ధక్యంలో సైతం ఆయన జీవన శైలిలో మార్పు ఉండేది కాదు.
నేను మదనపల్లిలో ఇంటర్ పరీక్షలు రాసి వచ్చినప్పుడు, ‘‘మనూళ్లో చదువుకున్నోళ్లు తక్కువబ్బా, ఇప్పటికి నువ్వే ఎక్కువ చదివావు, ఇంకా పెద్ద సదువు సదివి పేరం వోళ్ల పేరు, మీ నాయన కమాను రోశిరెడ్డి పేరు నిలపాల’’ అన్నాడు. తర్వాత నేను తిరుపతిలో బియ్యే చదువుతూ ఇంటికి వచ్చినప్పుడు ‘‘ఇంకెన్నేళ్లు చదువుతావు?’’ అని అడిగాడు.
‘‘బియ్యే రెండేళ్లు ,ఎమ్మె రెండేళ్లు చదువుతే అప్పుడు పూర్తవుతుంది’’అన్నాను.
నవ్వి ‘‘అయితే నేనది చూడాల’’ అన్నాడు.
నా బియ్యే అయ్యాక చుట్టుపక్కల ఊర్ల నుండి బియ్యే చదివిన నన్ను చూడ్డానికి వచ్చారని విన్నప్పుడు ఆశ్చర్యపోయా. తర్వాత తెలిసిందేమంటే పాత నారాయణ చదువు కోవడం ఎంత మంచి పనో, చదువుకున్నవాడు ఎంత ఎదుగుతాడో, ఎందరికి ఉపయోగపడతాడో.. వెళ్లిన చోటల్లా చెప్పడం వలన వాళ్లకు చదువుపై గౌరవం పెరిగి నన్ను చూసి తమ పిల్లల్ని చదివించేందుకు వచ్చారు. కొంచం సంతోషం, కొంచం సిగ్గు కలిగాయి వాళ్లని కలిసినప్పుడు. నారాయణ చేసిన పని కొంచం కూడా చిరాకు కలిగించలేదు. పైగా విద్య ప్రాధాన్యతను చాటి చెప్పాడని నాతో పాటు అందరు భావించారు. ఇంటింటికి వెళ్లి చదువు చెప్పించమని అందరికీ చెబుతున్నాడని మనూర్లో హైస్కూల్ రావడంతో పిల్లలకు 4 మైళ్లు నడిచి సింహాద్రిపురం పోయి చదివే బరువు తగ్గిందనే విషయం చెప్పి బడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెంచాడని నాన్న చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను.
ఎమ్మే ఎకనామిక్స్‌లో చేరడానికి అప్లికేషన్ పెట్టడానికి తిరుపతి వెళ్లడానికి తయారవుతున్న నాకు బయట కోలాహలం వినపడితే బయటికి వచ్చాను. పొలం పనికి వెళ్లిన పాత నారాయణ అక్కడే గుండె ఆగి సునాయాస మరణం పొందాడని చెప్పారు. కాసేపట్లోనే ఆతని శవాన్ని కమ్మాలకట్ట దగ్గరికి తీసుకొచ్చారు. నా తిరుపతి ప్రయాణం మానుకున్నాను. పాత నారాయణ చనిపోయాడని వార్త చుట్టుపక్కల పల్లెలకు సైతం పోయింది. గుంపులు గుంపులుగా ప్రజలు వస్తున్నారు. మా ఊర్లో పెద్ద మనుషులందరూ చేరి నారాయణ దేహాన్ని ఊరంతా తప్పెట్లతో తిప్పారు. కంట తడి పెట్టని పిల్లలు, పెద్దలు లేరు. ఆడవాళ్లు శోకాలు పెట్టి ఏడ్చారు. ఒక ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటివాళ్లు, అతని బంధువులే ఏడుస్తారు. కానీ పాత నారాయణ కోసం కన్నీరు పెట్టని వాళ్లు ఊర్లోనే లేరు. మా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్ల నుండి చాలా మంది అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఏ పెద్ద రెడ్లకు, రాజకీయ నాయకునికి కూడా పాత నారాయణకు జరిగినట్టు చివరి వీడ్కోలు జరగలేదు. అనాథగా పెరిగి, అందరి బంధువుగా ఎదిగి, అందరి హృదయాల్లో ఆత్మీయుడుగా నిలిచిన పాత నారాయణకు లోకమంతా బంధువులే. జగమంతా ఆయన కుటుంబం అనుకున్నాడు కాబట్టి జగమంతా ఆయన్ని ప్రేమించింది. ప్రపంచానికి మనమేది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ప్రపంచం నుంచి అనిపించింది.
‘‘ఈ నాటికి 60 ఏళ్ల తర్వాత కూడా మన ఊర్లో నారాయణ గురించి తెలిసిన వాళ్లు, ఆయన గురించి విన్నవాళ్లు ఆయన్నీ గొప్పగా తలుచుకుంటూనే ఉంటారు. నేను ఇవాళ తలుచుకుని ఆయన కథను నీకు చెప్పినట్లు. సరే మరి, పాత నారాయణ కథ రాస్తావామ్మా?’’ నాన్న గొంతు మరింతగా జీరబోయింది, కళ్లలో పల్చటి కన్నీటి తెర. గత కాలపు జ్ఞాపకాల నెమరు వేసుకోవడంతో. బరువెక్కిన గుండెతో సరే అన్నట్లు తలూపాను.
వచ్చేవారం కథ..
ధర్మజ గీత
– విహారి