భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
-పి.వి.ఆర్. శివకుమార్
‘‘ఎవరా పక్కన కనబడుతున్నదీ – వంటింట్లో?’’ అనుమానంగా అడిగాడు వేదాద్రి.
‘‘క్రింది ఫ్లోర్ వాళ్లమ్మాయి, పరీక్ష.’’
‘‘ఎందుకు వచ్చింది?’’
‘‘నేను ఫిల్టర్ కాఫీ బాగా పెడతానని వాళ్ల ఫీలింగ్. మనవైపు వాళ్లే అయినా, మొదటినుంచీ ఈ వైపునే స్థిరపడిపోయారుట. అందుకే వాళ్లకి టీ తప్ప కాఫీ అంతబాగా కుదరదు. నిన్ననే వాళ్ల అమ్మ, నేను ఫిల్టర్ కాఫీ ఎలా పెడతానో వివరంగా చెప్పించుకుని వెళ్లింది. పెడుతున్నప్పుడు స్వయంగా చూస్తాననీ, నేర్చుకుంటాననీ ఈ పిల్ల అంటుంటే, ఈ పూట నేనే పిల్చాను.’’
‘‘అనుకున్నాను ఇలాంటిదే ఏదో ఉందని. అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎవరితోనూ పరిచయాలు పెట్టుకోవద్దని.’’
మౌనంగా ఉండిపోయింది విద్యాధరి.
‘‘వాడెక్కడ?’’
భద్రి గురించి అడుగుతున్నాడని తెలుసు. రెండు క్షణాల గ్యాప్ తరవాత నెమ్మదిగా చెప్పింది,
‘‘అక్కడే ఉన్నాడు – వంటింట్లో. కాఫీ కలపటం చూస్తున్నాడు.’’
‘‘అక్కడకదొక బ్రహ్మవిద్య- నువ్వు నేర్పుతున్నావు- ఆమె నేర్చుకుంటోంది- వీడు చూస్తున్నాడు!
బాగుందమ్మా, చాలా బాగుంది. అసలే వీడొక క్రాక్. తెలిసో, తెలియకో ఆ అమ్మాయితో ఏమైనా మిస్ బిహేవ్ చేస్తే మన ప్రాణాల మీదకు వస్తుంది!’’
‘‘అదేం మాటరా? ఈ పిచ్చి సన్యాసికి మిస్ బిహేవ్ చేయటం ఏం తెలుస్తుంది?’’ కోపంగా అడిగింది విద్యాధరి.
‘‘పిచ్చి సన్యాసి అని వాడి వయసుకి తెలియదు కదా.’’ చిరాగ్గా చెప్పాడు వేదాద్రి.
విద్యాధరికి మండింది, ‘‘చాల్లే, ఊరుకో. తమ్ముడి గురించి ఇలాగేనా మాట్లాడేది?’’ అంటూ అరిచింది, పరీక్ష అక్కడే ఉందన్న విషయం కూడా మర్చిపోతూ.
‘‘అమ్మా, నీకు అర్థ్ధం కావటం లేదు. ఆఖరిసారి చెప్తున్నాను. ఇరుగు పొరుగులతో పరిచయాలు మానుకో.’’
వీడియో కాల్ ఆగిపోయింది. ప్రయోజకు డైన పెద్దకొడుకు, కనిపిస్తూ మాట్లాడా డన్న సంతోషం కరిగిపోగా గాయపడ్డ మనసుతో కూర్చుండిపోయింది విద్యాధరి.
అతడు ప్రతిసారీ వీడియో కాల్ మాత్రమే చేస్తాడు. ‘అది తనని ప్రత్యక్షంగా చూడటం కోసం కాక, వీడియో అయితే ఇంటినీ, తనున్న పరిసరాలనీ శల్య పరీక్ష చేయవచ్చు అనేనా?’ అనిపిస్తోంది ఆమెకీమధ్య.
విద్యాధరి మొహంలో మారిపోయిన రంగులు, గొంతులో జారిపోయిన ఉత్సాహం గమనించింది పరీక్ష.
తల్లీకొడుకుల సంభాషణ ప్రతి మాటా వినబడక పోయినా, వినబడినంత మేర సారాంశం ఊహించు కోగలిగింది.
‘కారణం తెలియక పోయినా, తాము ఇక్కడికి రావటం అతడికి ఇష్టం లేదు’ అనుకుంది. ముఖం చిన్నబుచ్చుకుని, ‘‘వెళ్తున్నాను ఆంటీ’’ అనేసి, సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికి నడిచింది.
‘‘ఎందుకు? ఎందుకు?’’ అంటూ తల్లి ముఖం లోకి వెర్రి చూపులు చూస్తున్న భద్రిని దగ్గరకు తీసుకుని కళ్ల నీళ్లు పెట్టుకుంది విద్యాధరి.
* * *
మూడు నెలలు కావస్తోంది విద్యాధరి, చిన్నకొడుకుతో ఆ ఫ్లాట్ లోకి వచ్చి.
బ్యాంక్ ఉద్యోగంలో ఉన్న పెద్దకొడుకు వేదాద్రి ఆగమేఘాలమీద కొన్నాడు ఆ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్.
మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చిన వేదాద్రికి అకస్మాత్తుగా గౌహతికి బదిలీ అయింది.
‘‘ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని ఆ రాష్ట్రానికి వెళ్తే, అక్కడి వాతా వరణానికి అడ్జస్ట్ కావటం కష్టం. నేను ఎలాగో అలా ప్రయత్నించి, ఒక ఏడాది తిరగ్గానే మళ్లీ ముంబైలోనే ఏ సబర్బ్‌కో వేయించుకుంటాను. అంతదాకా నువ్వూ, తమ్ముడూ ఇక్కడే ఉంటే బాగుంటుంది.’’ అని చెప్పాడు తల్లితో.
యాభయ్యవ పడిలో ఉన్న తల్లినీ, మానసిక ఆరోగ్యం సరిలేని తమ్ముడినీ ఉంచటానికి ఇల్లు అద్దెకి దొరకటం అంత తేలిక కాదు. అందుకే, కొద్దిగా ఇబ్బంది అయినా బ్యాంక్‌లోన్ తీసుకుని ఈ పాత ఫ్లాట్ కొన్నాడు. తల్లినీ, తమ్ముడినీ అక్కడికి తరలిం చాడు.
‘‘నీకు ముంబై సంగతి అంతగా తెలియదు. ఇన్నాళ్లు నేనున్నాను గనుక సరిపోయింది. ఇప్పుడు నువ్వొక్కదానివే, మతిలేని తమ్ముడితో… ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ పరిచయాలు చేసుకోవద్దు. ఇది మన బెదురుపల్లి కాదు- అక్కడిలాగా ఇక్కడ ‘ఇరుగు పొరుగు’ అంటూ చుట్టుపక్కల అందరితో అక్కర•లేని కబుర్లూ, సహాయాలూ మొదలుపెట్టకు.
ఇక్కడ అందరూ ఆర్థికంగానే కనిపిస్తున్నారు.
ముంబైలో కోట్ల జనాభా ‘ఎవరికెవరం’ అన్నట్టే ఉంటారు తప్ప, ఎవరి విషయంలోనూ మరొకరు తల దూర్చరు. కానీ, మనం మెతకగా కనబడితే నిలువునా ముంచెయ్యటానికి వెనుదీయనివాళ్లూ ఉంటారు. అందుకే, నీకేం కావాలన్నా, నాకు ఫోన్ చేస్తే చాలు. నేనే చూసుకుంటాను-అక్కడినుంచే! వీడికి అసలే అయోమయం. ఆ సంగతి ఎంత తక్కువ మందికి తెలిస్తే, అంత క్షేమం.’’ సవాలక్ష జాగ్రత్తలు చెప్పి, గౌహతి వెళ్లిపోయాడు వేదాద్రి.
తమ ఫ్లోర్‌లోనే ఆరు కుటుంబాలు ఉన్నాయి. వేదాద్రి చెప్పినట్టు ఎవరింట్లో ఎవరున్నారో తెలియదు. తెల్లవారక ముందే లేచి, ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోతూ ఉంటారు. ఏ వేళల్లో వస్తారో గమనించే తీరిక, ఆసక్తి కూడా ఎవరికి ఉన్నట్టు కనిపించదు. ఏ లిఫ్ట్‌లోనో కనిపిస్తే, ‘హలో’ అనేసి మొహం తిప్పుకునే వాళ్లు కొద్దిమంది. అదీ లేనివాళ్లు ఎక్కువ మంది.
తనకి వచ్చిన కొద్దిపాటి హిందీ పరిజ్ఞానంతోనైనా, ఎవరితోనూ మాట్లాడటానికి లేదు. ఎవరైనా పొరబాటున చిరునవ్వుతో చూసినా, ప్రతిగా నవ్వబోయేసరికి వేదాద్రి కళ్లముందు నిలబడి హూంకరిస్తాడు. నోరు మూగబోతుంది.
ఒకరోజు సాయంత్రం అనుకోకుండా పరిచయం అయింది పరీక్ష.
ఆ సాయంత్రం, కాంపౌండ్‌లో ఉన్న చిన్న గార్డెన్‌లో కొడుకుతో కలిసి కూర్చుని ఉంది విద్యాధరి.
అప్పటిదాకా బెంచ్ మీదే కూర్చున్న భద్రి, ఉన్నట్టుండి నేల మీదకు దిగిపోయి, అక్కడి మట్టిని ముద్దగా చేసి, పక్కనున్న పూల మొక్కమీదికి విసిరేశాడు. ‘తప్పు భద్రీ! మట్టితో ఆడకు’ అంటూ కొడుకుని లేవదీసింది విద్యాధరి.
‘‘పువ్వులని కుడుతోంది పురుగు. అందుకే దాన్ని కొడుతున్నా.’’ అన్నాడు భద్రి.
అటుకేసి చూసింది విద్యాధరి. పూలమీద వాలిన తుమ్మెదలు ఎగిరిపోతూ కనిపించాయి.
‘‘మీరు తెలుగు వాళ్లా ఆంటీ?’’
సంభ్రమంగా వినిపించిన గొంతు! అటు తిరిగిన విద్యాధరికి నవ్వుతూ నిలబడ్డ పరీక్ష కనిపించింది,
‘‘మేమూ తెలుగువాళ్లమే. సెకండ్‌ఫ్లోర్‌లో ఉంటాం. మీరు?’’ చొరవగా అడిగింది.
జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది విద్యాధరి.
‘‘మేము నాలుగోఫ్లోర్‌లో ఉంటాం.’’ ఫ్లాట్ నంబర్ చెప్పింది.
‘‘మా నాన్నగారు శంకర్రావు. కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు. అక్కకి పెళ్లయింది. అక్క, బావ కళ్యాణ్‌లో ఉంటారు.’’ గడగడ చెప్పింది పరీక్ష.
‘‘తీరినప్పుడు అమ్మని తీసుకుని మా ఇంటికి రా’’ ఆమె కలుపుగోలు మాట తీరుకి లొంగిపోయిన విద్యాధరి ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. ఎడారిలో తిరుగుతున్న వ్యక్తికి ఒయాసిస్ కనిపించినట్టు అనిపించి, ఆ నిమిషంలో పెద్ద కొడుకు గుర్తుకి రాలేదు.
నెమ్మదిగా రెండిళ్ల మధ్య రాకపోకలు మొదల య్యాయి. ఈ విషయం వేదాద్రికి తెలియకుండా జాగ్రత్త పడింది విద్యాధరి. అయితే అనుకోకుండా ఈ రోజు అతడు సాయంత్రం వేళ విడియో కాల్ చేయటం, ఆ సమయంలో వంటింట్లో ఉన్న పరీక్ష అతడి కంట పడింది.
తల్లి అన్న గౌరవం కూడా లేకుండా దురుసుగా వేదాద్రి విధించిన ఆంక్ష కంటే, విషయం పరీక్షకి అర్థ్ధమై, ఆమె మొహం చిన్నబుచ్చుకు వెళ్లిపోవటం విద్యాధరికి మరింత అవమానకరంగా తోచింది.
దానికి తోడు భద్రి గురించి అతడన్న మాటలు మనసుని మరీ మెలిపెట్టాయి.
‘ఇంత మేధకుడు అయినా, వీడికి వయసు తెలుస్తుందా? చెప్పుకోలేని బాధతో ఇకముందు మరింత నలిగిపోనున్నాడా?’
ఈ సంఘటనతో, ఆలోచనలతో ఆమె మనసు అతలాకుతలమైంది. నిస్త్రాణగా వెళ్లి మంచంపై కూలిపోయింది.
* * *
మర్నాడు పొద్దునే తను స్వయంగా కాచిన కాఫీ ఫ్లాస్క్ నిండుగా పోసి, పరీక్షను పిలిచింది స్నేహమయి.
‘‘ఈ కాఫీ తీసుకెళ్లి ఆంటీకి ఇచ్చిరా. తాగిచూసి ఎలా ఉందో చెప్పమను.’’
‘‘నేను వెళ్లను’’ ముభావంగా చెప్పింది పరీక్ష.
‘‘ఏమయిందే? ఎందుకు వెళ్లవు?’’ విస్మయంగా అడిగింది స్నేహమయి.
విద్యాధరి ఇంట్లో నిన్న తను విన్న ఫోన్ సంభాషణ గురించి తల్లికి చెప్పలేదు పరీక్ష- ఆమె బాధపడుతుందని. ఇప్పుడు వెళ్లనని మొండికేస్తే, కారణం చెప్పాల్సి వస్తుంది.
అందుకే, ‘‘సరే. ఇచ్చి వస్తాను.’’ అనేసి ఫ్లాస్క్ తీసుకుని బలవంతాన బయల్దేరింది.
కాలింగ్ బెల్ చప్పుడుకి ఎప్పటిలాగే విద్యాధరి రాలేదు, భద్రి వచ్చాడు. ఆమె వంక అభావంగా చూశాడు.
‘‘ఆంటీని పిలు’’ అంది పరీక్ష.
‘‘నిద్దరపోతోంది’’ చెప్పాడు.
‘‘ఇంకానా?’’ ఆశ్చర్యంగా అడిగింది పరీక్ష. అప్పుడు ఎనిమిది కావస్తోంది.
‘‘ఇంకానూ.’’ అన్నాడు భద్రి. పరీక్షకి ఏమనాలో తోచలేదు.
చేతిలోని ఫ్లాస్క్ అతడికి అందించింది.
‘‘కాఫీ… మా అమ్మ పెట్టింది. తాగి చూసి, కుదిరిందో లేదో చెప్పమంది. నువ్వు కూడా తాగు.’’
‘‘తాగుతాను.’’ భద్రి ఫ్లాస్క్ అందుకుని, తల ఊపాడు.
వెనక్కి తిరిగి వచ్చేసింది పరీక్ష.
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, అలవాటు ప్రకారం కునుకు తీసి లేచిన స్నేహమయి, నాలుగు దాటుతుండగా పై అంతస్తుకి బయల్దేరింది. బెల్ విని వచ్చి భద్రి తలుపు తీశాడు.
‘‘అమ్మ ఏం చేస్తోంది?’’ అని అడుగుతూనే లోపలికి వెళ్లింది.
‘‘నిద్దరపోతోంది.’’ చెప్పాడు భద్రి.
‘‘ఇప్పుడేం నిద్ర? మీ అమ్మ మధ్యాహ్నం పడుకోదుగా?’’
‘‘పడుకోదు.’’
‘‘మరి? నిద్రపోతోందన్నావు?’’
‘‘రాత్రి నిద్దర పోయింది. పొద్దున లేవలేదుగా.’’
‘‘పొద్దుటినుంచీ లేవలేదా? పొద్దుటి నుంచీ మీరు టిఫిన్, భోజనాలు ఏమీ చేయలేదా?’’ అయో మయంగా అడిగింది.
‘‘ఎలా? అమ్మ ఇంకా లేవలేదుగా!’’ చెప్పాడు భద్రి.
బిత్తరపోయింది స్నేహమయి. గబగబా పడక గదిలోకి వెళ్లింది.
నిస్తేజంగా పడుకుని ఉంది విద్యాధరి. ఆమె పక్కనే కప్పులో చల్లారిపోయిన కాఫీ!
‘‘నేనే పెట్టాను. లేచినప్పుడు తాగుతుంది.’’ చెప్పాడు భద్రి.
విద్యాధరి నుదుటిమీద చేయి వేసింది స్నేహమయి. విద్యాధరిలో కదలిక లేదు.
‘‘విద్యా… విద్య గారూ’’ పిలిచింది. జవాబు లేదు.
కంగారుగా బయటకు నడిచిందామె. రెండేసి మెట్లు చొప్పున దిగుతూ ఇంటికి పరుగెత్తింది. పరీక్షకి విషయం చెప్పి, మళ్లీ విద్యాధరి దగ్గరకి పరుగెత్తింది. పరీక్ష వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. ఆంబులెన్స్ రావటంతోనే విద్యాధరిని అంబులెన్స్‌లోకి చేర్చారు.
విషయం అర్థంకాని పరిస్థితిలో భద్రి, ‘‘ఎందుకు? ఎక్కడికి?’’ అంటున్నాడు. వాడికి ఎవరూ జవాబు చెప్పలేదు. తమతో పాటు హాస్పిటల్‌కి తీసుకు వెళ్లారు.
అప్పటికే తండ్రికి ఫోన్లో విషయం చెప్పింది పరీక్ష. శంకర్రావు పావుగంటలో హాస్పిటల్ చేరుకున్నాడు. అడ్మిషన్ ఫీజు, మందుల సంగతి చూసుకున్నాడు.
అరగంటలో ప్రాథమిక పరీక్ష పూర్తి చేసి చెప్పాడు డాక్టర్,
‘‘ఆమెకు బీపీ పెరిగింది. మెదడు మీద తీవ్రమైన ఒత్తిడి పడింది. అది తట్టుకోలేక నిద్రలోనే కోమా లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, వివిధ రిఫ్లెక్స్‌లు అనుకూలంగానే ఉన్నాయి గనుక, ప్రాణానికి ప్రమాదం ఉండక పోవచ్చు. ఐసీయూలో ఉంచి, గమనిస్తుండాలి.
అయినా, పేషంట్ ఉదయం నిద్ర లేవకపోతే, అప్పుడే ఎందుకు తీసుకు రాలేదు?’’
స్నేహమయి, పరీక్ష ముఖాముఖాలు చూసు కున్నారు.
‘‘ఆమె మా నైబర్. ఉదయం నుంచీ లేవలేదన్న విషయం మధ్యాహ్నమే మాకు తెలిసింది. తెలిసిన వెంటనే తీసుకు వచ్చాం.’’ చెప్పారు.
‘‘ఆమెతో ఎవరూ ఉండరా? ఈ అబ్బాయి ఎవరు?’’
‘‘ఆమె కొడుకే. తనతోనే ఉంటాడు. కానీ, అతడికేం అర్థ్ధ్ధం కాదు. పెద్ద కొడుకు గౌహతిలో ఉంటాడు.’’
‘‘అతడిని వెంటనే పిలిపించండి.’’ చెప్పాడు డాక్టర్. తల ఊపారు వాళ్లు.
వేదాద్రి నంబర్ వాళ్లకి తెలియదు. విద్యాధరి ఫోన్ లాక్‌లో ఉంది. భద్రిని అడిగే విఫల ప్రయత్నం చేసింది పరీక్ష.
‘‘అమ్మకి తెలుస్తుంది. ఇదే, ఈ ఫోన్‌లోనే మాట్లాడుతుంది. చెయ్యండి’’ అంటూ ఆందోళనగా చూడటం తప్ప మరేం చెప్పలేకపోయాడు భద్రి. తల్లికి ఏదో అయిందని అతడికి తెలిసినట్టే ఉంది. కానీ, అందుకు తనేం చేయాలో తెలిసినట్టు లేదు. వార్త వేదాద్రికి ఎలా చేరవేయాలో అర్థ్ధ్ధం కాక శంకర్రావు, స్నేహమయి బుర్రలు పగలకొట్టు కుంటున్నారు.
అంతలోనే, విద్యాధరి ఫోన్ మోగింది. వేదాద్రి చేస్తున్న విడియో కాల్!
చటుక్కున ఆన్సర్ చేసింది పరీక్ష. ఫోన్లో పరిచయం లేని మనిషిని చూస్తూనే, వేదాద్రి ముఖం జేవురించింది.
‘‘ఎవరు మీరు? మా అమ్మ ఇంట్లో లేదా? లేక ఫోన్ తీసే తీరిక కూడా లేనంత బిజీ అయి పోయిందా? పరాయివాళ్ల ఫోన్ తీయించేదాకా వెళ్లిందా?’’ అరిచినట్టే అన్నాడు. మండిపోయింది పరీక్షకి.
‘‘మిస్టర్. ఇది మీ ఇల్లు కాదు. హాస్పటల్. మీ అమ్మ ఐసీయూల• ఉన్నారు.’’
మరొక్క మాట మాట్లాడటానికి కూడా అసహ్యం వేసి, ఫోన్ తండ్రి చేతికి ఇచ్చేసింది.
‘‘అమ్మకేమయింది?’’ కంగారుగా అడుగుతున్న వేదాద్రికి ఆమె తండ్రి జవాబు చెప్పాడు.
వేదాద్రి నిశ్చేష్టుడైపోయాడు.
‘‘సార్, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. దయచేసి, అంతదాకా మా అమ్మనీ, తమ్ముడినీ చూసుకోండి.’’
అతి కష్టం మీద చెప్పాడు. దుఃఖంతో అతడి స్వరం పూడుకుపోయింది.
* * *
వేదాద్రి ముంబై చేరుకునే సరికి మర్నాటి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. నేరుగా హాస్పిటల్‌కి వెళ్లాడు. అక్కడే ఉన్నారు స్నేహమయి, పరీక్ష. వాళ్ల పక్కనే వెర్రి చూపులతో, దీనంగా మొహం పెట్టుకుని కూర్చున్న భద్రి, అన్నయ్యని చూస్తూనే భోరున ఏడ్చాడు. వేదాద్రి వాడిని దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నాడు.
స్నేహమయి అతడిని సానుభూతిగా పలకరించి ధైర్యం చెప్పింది.
‘‘మీ అమ్మకి ఏమి భయం లేదు బాబూ! డాక్టర్ చేతుల్లో పడింది గనుక, మనకింక భయం లేదు. నువ్వు వర్రీ అవ్వబోకు.’’
అపరిచితులైనా, ఆత్మీయంగా వ్యవహరిస్తున్న ఆమె తీరు చూసి, వేదాద్రి సిగ్గుతో చితికిపోయాడు. జవాబు చెప్పటానికి కూడా మొహం చెల్లలేదు. తమ్ముడిని దగ్గరకు తీసుకుని స్తబ్దుగా ఉండిపోయాడు.
వేదాద్రి వచ్చిన విషయం తెలియగానే శంకర్రావు హాస్పటల్‌కి చేరుకున్నాడు. అతడితో కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
విద్యాధరికి అంతకుముందున్న ఆరోగ్య సమస్యల గురించి అడిగాడు డాక్టర్. మామూలు డయాబెటిస్, బీపీ తప్ప ఆమెకు మరేమీ అనారోగ్యాలు లేవని వివరించాడు వేదాద్రి.
‘‘ఇప్పటి వరకు పేషంట్ పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. అయితే, నెగటివ్ సింప్టమ్స్ కూడా లేవు కాబట్టి ఫరవాలేదు.
ఆమెకు ఇంకేమీ కంప్లెయింట్స్ కూడా లేవు అంటున్నారు గనుక, మానసిక విశ్రాంతితో తొందర గానే కోమా నుంచి బయట పడే అవకాశం ఉంది.’’ చెప్పాడు ఆయన.
వేదాద్రి కళ్లలోకి వెలుగు వచ్చింది.
‘‘థాంక్యూ డాక్టర్’’ అన్నాడు.
‘‘నాకంటే ముందు మీ నైబర్స్‌కి థాంక్స్ చెప్పండి. కొన్ని గంటల తరవాత అయినా గమనించి,వాళ్లే మీ అమ్మగారిని హాస్పటల్‌కి తీసుకు వచ్చారు.’’
‘‘వాళ్లకి రుణపడిఉంటాను,’’ అన్నాడు వేదాద్రి.
‘‘ఒక్క మాట చెబుతాను. మీ అమ్మగారు వయసు మీరుతున్న మనిషి. మీ తమ్ముడు మెంటల్లీ ఛాలెంజ్డ్. వాళ్లు ఒక్కరే ఉండవలసిన పరిస్థితుల్లో, ఇరుగు పొరుగు ఎవరైనా వాళ్ల మంచిచెడ్డలు విచారిస్తూ ఉండటం అవసరం.
మీరు అటువంటి ఏర్పాటు ఏదైనా చేసుకోవటం మంచిది.’’
మౌనంగా తల ఊపాడు వేదాద్రి- తేలుకుట్టిన దొంగలా!
‘ఈ డాక్టర్‌కి తన ఆలోచనలు తెలుసా? ఈ శంకరరావుగారి కుటుంబాన్నే దూరం పెట్టమంటూ, తను తల్లిని పోరుతూ వచ్చాడు. అదే జరిగి ఉండి, వాళ్లు నిన్న తమ ఇంటికి వచ్చి ఉండకపోతే ఏం జరిగేది?!’’
ఊహా మాత్రానికే భయం వెన్నులో జరజర పాకగా, వణికిపోయాడు వేదాద్రి.
ఇరుగు పొరుగు సంబంధాలు ప్రాణవాయువు కన్నా ముఖ్యం అనిపించింది ఆ క్షణం.
* * *
మూడు నెలల తరవాత…
తల్లిని ఇంటికి తీసుకు వచ్చిన వేదాద్రి, ఆమెనూ, తమ్ముడినీ తీసుకుని తమ బిల్డింగ్ లో ఉన్న పదహారు ఫ్లాట్లకీ స్వయంగా తిరిగాడు. మిఠాయి పంచుతూ, అన్ని కుటుంబాలవారిని కలిశాడు.
‘ఫ్లాట్ తీసుకున్నప్పుడు, డ్యూటీలో చేరాల్సిన హడావిడిలో మీ ఎవరిని కలియ కుండానే వెళ్లి పోయాను. అందుకే ఇప్పుడు కలుద్దామని వచ్చాను. ఇక్కడ అమ్మా, తమ్ముడే ఉంటారు. మీరు కాస్త కనిపెడుతూ ఉండాలి.’ అని చెప్పాడు.
‘‘నన్ను కనిపెట్టుకోవటానికేమీ లేదమ్మా, నాకేమీ సమస్యలు లేవు. మీకే నా నుంచి ఏ సాయం కావలసి వచ్చినా సంకోచం లేకుండా అడగండి. వీలున్నప్పుడు మా ఫ్లాట్‌కి వస్తుండండి. కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపం.’’
చిరునవ్వుతో చెప్పింది తేలిక పడిన మనసు తెచ్చిపెట్టిన ఆరోగ్యంతో విద్యాధరి.
కొత్త ఉత్సాహంతో, ప్రశాంతమైన మనసుతో వెనక్కి బయలుదేరాడు వేదాద్రి.
గురజాడ వారు ప్రత్యక్షమై, ‘అడ్డుగోడలు పగుల గొట్టుకు, పొరుగువారితో కలిసిపోవోయ్’ అని చెప్తున్నట్టు తోచిందతడికి!
వచ్చేవారం కథ..
కిరాయిబంధం
– కటుకోజ్వల మనోహరాచారి