భారతీయ జనతాపార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా, సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశంలోనే అతి పెద్ద పార్టీ అని అందరికీ తెలుసు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవాళ్లకు, నిబద్ధతతో ఉండేవాళ్లకు సముచిత స్థానం కల్పించే పార్టీ. ఆ పరంపరలోనే తెలంగాణ కమల దళపతిగా నారపరాజు రాంచందర్‌రావు అవకాశం పొంది, బాధ్యతలు స్వీకరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా రాజకీయ జీవితం ఆరంభించి, బీజేపీలో పలు పదవులను నిర్వహించి, శాసనమండలి వరకు వెళ్లిన రాంచందర్‌రావు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తెలంగాణలో కీలక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన దారి ఉందని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో రాంచందర్‌రావుకు అధిష్టానం అధ్యక్ష బాధ్యతలు భుజానకెత్తింది. న్యాయవాది, పార్టీలో సీనియర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పార్టీ నిర్మాణాన్ని ఎలా వేగవంతం చేస్తారో, అధికార పీఠానికి చేరువగా తెస్తారో అన్న అంశాలే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అవకతవకల మీద, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాచాలత మీద రాంచందర్‌రావు తనదైన శైలిలో నిర్మొహమాటంగా విమర్శలు కురిపించారు. కొత్త అధ్యక్షునితో జాగృతి జరిపిన ముఖాముఖీలోని కొన్ని అంశాలు:
నమస్కారం. కొత్తగా అధ్యక్షులైన సందర్భంలో జాగృతి తరఫున శుభాకాంక్షలు. దేశాన్ని నడిపిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శుభాకాంక్షలు. మీ అనుభూతి ఏమిటి?
బాధ్యతతో కూడిన పెద్ద లక్ష్యాన్ని అధిష్టానం నాకు అప్పగించింది. రెండోది నా మీద నమ్మకం పెట్టుకుంది. దీనిని అవకాశం అని కాకుండా బాధ్యతగా స్వీకరించి పార్టీని బలోపేతం చేయడానికి, రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశలో నడపటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. అందరినీ కలిసి, కలుపుకొని సమగ్ర నాయకత్వంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.
పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత పోటీ తత్త్వం ఇప్పుడు ఉంది. అధిష్టానం మీకే బాధ్యతలు అప్పగించింది. మీకున్న సానుకూల అంశం ఏమిటి?
నాకు ఇచ్చినంత మాత్రాన ప్లస్, రానివాళ్లకు మైనస్ కాదు. నా కన్నా పెద్ద నాయకులు కావచ్చు. నా కన్నా శక్తిసామర్ధ్యాలు కలిగిన వారూ కావచ్చు. అధిష్టానం ఇలా ఆలోచించి ఉండొచ్చు. ఒక పదవి ఉంది. పదిమంది అడుగుతారు. అందులో నేనొక్కణ్ణి. నేను ఇప్పుడు మరొక పదవిలో లేను. అంటే ఎంఎల్‌ఏగానీ, ఎంపీగానీ. ఆ పదవీలో ఉన్నవాళ్లు నియోజకవర్గం గురించి, ప్రజల సమస్య గురించి పట్టించుకోవాలి. నేను గతంలో బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా, పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా, ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం నాకున్నాయి. సంస్థాగతంగానూ అనుభవం ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎదుగుదల కోసం నాకీ అవకాశం ఇచ్చారని భావిస్తాను.
రేవంత్ సర్కారు మీద మీ అభిప్రాయం? ఏకంగా ముఖ్యమంత్రే ఖజానా దివాలా తీసింది అన్నారు. అసలు దీని మీద మీ అంచనా ఏమిటి?
ఖజానా దివాలా తీయడం అంటే పర్లేదనుకోవచ్చు. అసలు వాళ్లు అన్నింట్లో దివాలా తీసినారు. వాళ్లు చెప్పినవన్నీ కూడా అమలుకు సాధ్యం కానివే. మేనిఫెస్టోలో పెట్టినదేదీ అమలు పరచలేదు. డిక్లరేషన్‌లు చేశారు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ చేశారు. చివరికి ప్రభుత్వం ఏమీ చేయలేదని చేతులెత్తేస్తారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ‘సార్, నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ. ఎందుకంటే, 18 నెలల నుంచి పెన్షన్ రావట్లేదు సార్, నాకు అప్పులెక్కువయినాయి, ఈఎంఐలు కట్టలేకపోతున్నా, మీరు ప్రభుత్వానికి రాయండి సార్ అన్నాడు. నేను రాయడానికి సిద్ధమే. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో ఉన్నదా? కౌన్సెలింగ్ చేసి, ఆత్మహత్య చేసుకోవద్దు. అని చెప్పాను. ఇటువంటివి ఎన్ని! ఎంతమంది ఆ పరిస్థితులలో ఉన్నారో! దానికి ఈ ప్రభుత్వం కారణం. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతు బంధు ఇస్తానన్నారు. ఇంతవరకు ఇయ్యలేదు. రూ. 6000 ఇచ్చేసి, చేతులు దులుపుకుంటే ప్రజల్ని తప్పుదారి పట్టిం చినట్టే. వారు అధికారంలో వచ్చిందే అబద్ధాలతో. ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
బాద్యతలు స్వీకరించగానే రంగంలోకి దిగారు. నల్లగొండలో రెండు రోజులు పర్యటించారు. అధ్యక్షునిగా మొదటి పర్యటన అనుభవాలు ఎలా ఉన్నాయి?
ఒకటి-నాకు కళ్లల్లో నీళ్లు తెచ్చే అనుభవమది. మా స్వంత ఊరుకి వెళ్లాను. రాజకీయాలకు అతీతంగా ఊరంతా కలసి వచ్చింది. అక్కడ ఒక ఎస్‌సి కుటుంబం ఇంట్లో భోజనం చేసి, రాత్రి బస చేశాను. ఆ ఊరి ప్రజలు నేను వస్తుంటే కన్నీటి పర్యంతమయ్యారు. నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని చాలా భావోద్వేగానికి గురైనారు. రెండోది నా జన్మభూమి. కాబట్టి నా స్వంత ఊరికి వెళ్లి నేనొక సందేశమిచ్చాను. రాబోయే రోజులలో ఇదే నల్లగొండ జిల్లాలో భారతీయ జనతాపార్టీ అన్నీ సీట్లు గెలిపించుకునే స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను.
మీరు రాజకీయాలలోకి రావడానికి ప్రేరణ ఎవరు?
విద్యార్థి దశలోనే. 1977లో డిగ్రీలో చేరాను. అపుడు కేవీపీ సెంట్రల్ స్కూల్‌లో మాకు సీబీఎస్ సిలబస్ ఉండేది. లెవెంత్ తర్వాత నేరుగా డిగ్రీ. అప్పుడే ఎమర్జెన్సీ ఎత్తేశారు. తరువాత ఏబీవీపీ వారు పరిచయమయ్యారు. నేను కాలేజీలో 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా గెలిచాను. ఆర్ట్స్ కాలేజీలో నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడాను, లా కాలేజీలో గెలిచాను. అడ్వకేట్స్ అసోసియేషన్‌లో, బార్ అసిసోయేషన్‌లో గెలిచాను. ఈ విధంగా రాజకీయ ప్రయాణానికి బీజం పడిరది. రాజకీయాలలోకి వచ్చే అవకాశం అత్యవసరపరిస్థితి ఎత్తెయ్యగానే విద్యార్థి ప్రతినిధి రూపంలో వచ్చింది. విద్యార్థి పరిషత్ ఇచ్చిన రాజకీయ జీవితమిది. ఆ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు అడుగులు వేస్తున్నాను.
విద్యార్థి దశలో మీరు ఏబీవీపికి అసెట్‌గా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా, దాడులు జరిగినా మీరు వెనక్కు తగ్గలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీలో కూడా మీ మీద దాడి జరిగింది. ఆ సమయంలో మీరు మరచిపోలేని ఏదైనా ఒక సంఘటన గురించి చెబుతారా?
దాడులు చాలా జరిగాయి. ఏ హాస్టల్, బి హాస్టల్ మధ్యన కొట్లాట జరిగింది. పొద్దున చూసేసరికి రక్తం మడుగులు ఉన్నాయి. చాలామందికి గాయలైనాయి. అది భయంకరమైన రాత్రి. అందరూ పారిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఎప్పుడో, ఎక్కడో, ఎవర్నో పొడిస్తే నామీద అటెమ్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మాకు సంబంధం కూడా లేదు. నేను ఓడినా నాకు విశ్వవిద్యాలయంలో గుర్తింపు ఉండేది. ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నప్పుడు పీడీఎస్‌యూ, ఆర్‌ఎస్‌యూ వారు దాడి చేశారు. అయినా ఆర్ట్స్ కాలేజీ ముందు నా మొదటి ఉపన్యాసం ఇచ్చాను. మైక్ లేదు, వేలమంది ఏబీవీపీ విద్యార్థులున్నారు. వాళ్లందరినీ ఎక్కడికీ పోవద్దని, ఇక్కడే ఉండి పోరాడుదామని పిలుపు నిచ్చాను. మొదటిసారిగా కమ్యూనిస్టులకు దీటుగా ఏబీవీపీ గట్టిగా నిలబడిరది. ఇప్పుడు కూడా ఓయు క్యాంపస్‌లో ఏబీవీపీకి గట్టి పట్టు ఉన్నది. నాడు ఆర్ట్స్ కాలేజీలో గెలవటం చాలా కష్టంగా ఉండిరది. అయినా మేము గెలిచాము. క్యాంపస్ అంతా ఏబీవీపీ మయమైయింది. 1982లో అది టర్నింగ్ పాయింట్. ఎన్నికలలో నేను ఓడిపోయినా క్యాంపస్ అంతా ఏబీవీపీ విస్తరించింది. ఎన్నో కొట్లాటలు జరిగాయి. ఒక ఇన్స్‌డెంట్ ఏమిటంటే, సయ్యద్ హషీం అలీ వైస్‌ఛాన్సలర్. మేం వారి దగ్గరికి వెళ్లి శ్రీరాములు కమిషన్ రిపోర్టు విడుదల చేయాలని కోరాం. ఆయన చేయనన్నారు. అప్పుడు ఆనంద గజపతి విద్యాశాఖ మంత్రి. ఈయన వస్తే ఘెరావ్ చేశాం. దాని తర్వాత రోజే వైస్‌ఛాన్సలర్ మా ఇంటికి వచ్చాడు. మా తండ్రి యూనివర్సిటీ ప్రొఫెసర్. కాళ్లు, చేతులు పట్టుకొని మీ అబ్బాయికి చెప్పండి, బాగా గొడవ చేస్తున్నాడు, మమ్మల్ని పని చేయనీయట్లేదని చెప్పాడు. మా ఫాదర్ ఒకే మాట చెప్పాడు, ఆయన (కొడుకు) మేజర్. ఒక సిద్ధాంతాన్ని నమ్మిండు. నేను వదిలేసాను. చెప్పను అని అన్నాడు.
తెలంగాణలో హైడ్రా పెద్ద చర్చనీయాంశమైంది. వివాదస్పదంగానూ ఉంది. దాని మీద మీ అభిప్రాయం?
హైడ్రాను పెద్ద హైడ్రామా లాగా తీసుకొచ్చారు. దాన్ని మనం చూసాం. ఒక పేదవాడి ఇల్లు కూలగొడితే, ఒక మధ్య తరగతి కుటుంబీకులు రుణం తీసుకుని, కట్టుకున్న ఇంటిని గృహప్రవేశం తరువాతి రోజే కూలగొడితే మనుషులేం కావాలి? కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ హైడ్రా కొన్ని పరిధులలో ఓకే. పర్యావరణ రక్షణ కోసమైతే బీజేపీ మద్దతు ఇస్తుంది. కానీ పర్యావరణ రక్షణ, మానవతావాదం అని చెప్పి ఫాతిమా కాలేజీని ముట్టుకోవట్లేదు. అక్కడ వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ల చదువు పాడైపోతుంది. పరీక్షల తరువాత కూలగొడతాం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మానవతా దృష్టితో కూలగొట్టడం లేదంటున్నారు. ఆ మానవతా దృష్టి బీదవాడిపై లేదేం? నిన్న గృహప్రవేశం చేస్తే ఇవాళ కూల గొట్టారు? ఇది మానవతావాదమా? ప్రభుత్వం ఎంపిక చేసినవారిపైనే హైడ్రాను ప్రయోగిస్తున్నది. ప్రభుత్వం హైడ్రా అమలులో వివక్ష చూపుతోంది. ఒక వర్గానికి చెందిన అక్రమ నిర్మాణాల జోలికి పోవడంలేదు.
సరిగా ఆలోచిస్తారని ఆయనకు నమ్మకం కాబోలు!
తప్పకుండా. మా ఇంట్లో రాజకీయాల్లో ఎవరు లేరు. మా ఫాదర్ మా తమ్ముడు కూడా ప్రొఫెసర్‌లే. తమ్ముడు ఎన్‌ఐటి డైరెక్టర్. మా సిస్టర్ గైనకాలజిస్ట్. ఇంకో తమ్ముడు అమెరికాలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. ఒక బావగారు బ్యాంక్ మేనేజర్.. ఇట్లా. ఒక్కడినే రాజకీయాల్లోకి వచ్చాను. మా అబ్బాయిని కూడా రాజకీయాల్లో తీసుకురాలేదు. అడ్వకేట్‌గా పాక్టీస్ చేసుకుంటున్నాడు. మా అమ్మాయి కూడా సాప్ట్‌వేర్. ఆమె ఆస్ట్రేలియాలోఉంది.నాకు కుటుంబ పాలన ఇష్టం లేదు. వ్యక్తిగత ఆశలు ఏం లేవు. ఒకటే ఆశ` భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ దిశలో కృషి చేయాలని నా సంకల్పం.
మీరు ప్రతిపక్ష ం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. దానికి స్పందన వచ్చిందా?
రాలేదుగానీ, దాని మీద కచ్చితంగా చర్చ జరుగు తుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ల ఎమ్మెల్యేలు కూడా చర్చిస్త్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాకు ఫోన్ చేశారు. ‘అన్న! మంచిగా అడిగినవు, మాకు అదే అనిపిస్తుంది. మా ప్రభుత్వమే వైఫల్యం చెందింది’ అంటూ ముఖ్యమంత్రిని బాగా అడిగారు అన్నారు. తర్వాత దాని మీద పొన్నం ప్రభాకర్ స్పందించారు, ఎట్లా రాస్తాడు ఉత్తరం అని చెప్పేసి. ఎట్లా రాసాడు అంటే.. కవిత తండ్రికి రాయగలదా? ఆ ఉత్తరం రాయించింది మీరే కదా ఆమెతోని!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఎలా ఉండాలి? కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్. సమన్వయం ఎలా?
సర్కారియా కమిషన్ సూత్రాలు, నియమాల ప్రకారమే కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలతో సత్సం బంధాలు నెరుపుతుంది. ఆ మేరకు అవకాశాలు ఇస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండి అలయన్స్ ప్రభుత్వాలు మాత్రం బీజేపీని అప్రతిష్ట పాల్జేసేందుకు కేంద్రం సవతి ప్రేమ అంటున్నాయి. అన్ని రాష్ట్రాలని మేము టీం ఇండియా కింద భావిస్తాం. అదే నిజమైన ఫెడరలిజం. ఈరోజు ఆ ఫెడరలిజం టీమ ఇండియా సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ సబ్‌కా విశ్వాస్ అని మేము చెప్తున్నది వ్యక్తులకే కాదు వర్గాలకి కాదు.. రాష్ట్రాలకీ వర్తిస్తుంది. మమతా బెనర్జీ, ఆమె టీఎంసీ, బెంగాల్లో బీభత్సం చేస్తున్నారు. కానీ ఆమె వచ్చి హోమ్ మినిస్టర్‌ను కలుస్తుంది, ప్రధానినీ కలుస్తుంది. ఎందుకు? ఆ రాష్ట్ర అవసరాల కోసమే. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చడం మా బాధ్యత. కాబట్టి మేం ఫెడరలిజం స్ఫూర్తితోనే వ్యవహరిస్తున్నాం.
బీజేపీ, బీఆర్‌ఎస్‌కు అండగా ఉందన్న వాదన లేవనెత్తుతున్నారు.
ఎవరి పార్టీ వాళ్లకి ఉంది. అసలు ఆ పార్టీ ఉంటే కదా ఇప్పుడు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థే దొరకలేదు. ఇలా ఎట్లా ఆలోచిస్తారు వాళ్లు?
బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత వివాదాస్పదమైంది. దానితో సంబంధం ఉన్నవాళ్లని అరెస్టు చేస్తున్నారు. వాళ్ల ఆస్తులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. దాని మీద ఏసీబీ దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈడీ కూడా. దాని గురించి మీ అభిప్రాయం!
అధికారుల దగ్గరకే అంత వచ్చిందంటే, ముఖ్యమంత్రి దగ్గరకు ఎంత వెళ్లి ఉండాలి? ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరకి ఎంత చేరి ఉండాలి? మంత్రుల దగ్గర ఎంత చేరి ఉండాలి? ఒకసారి ఊహించు కుందాం. మేం మొదటి నుంచి చెబుతున్నాం, కాళేశ్వరం ఓ ఏటీఎం. ఆ ప్రాజెక్ట్ మంచిదా? చెడ్డదా? తర్వాత చర్చ. మొదట మేము మంచిది అన్నాం, కొంతమంది సపోర్ట్ చేశాం. ఇప్పుడు అలా కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ ప్రభుత్వానికి ఏటీఎం అయింది.
రాంచందర్‌రావుగారంటేనే సిద్ధాంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. వివాదాలకు అతీతులని ఒక అభిప్రాయం. సిద్ధాంత నిబద్ధతతో పనిచేసే మీరు సంఘటన చాతుర్యాన్ని అనుసరించాల్సిన సమయం వచ్చింది. మీరు తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారు?
కార్యకర్తలు పార్టీకి బలం. సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోతూనే, పార్టీని పెంచాలి. పార్టీలోకి కొత్త వాళ్లు రావాలి. వారు సిద్ధాంతాన్ని అంటిపెట్టుకోవాలి. వేరే పార్టీల నుంచి కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే పునాది బలోపేతం కావాలి. మనం అంటుంటాం, సర్వవ్యాపి, సర్వస్పర్శి. బీజేపీ అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో విస్తరించాలి. అన్ని వర్గాలను పార్టీలో తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తులు కావచ్చు. ఇతర పార్టీల వారు కావచ్చు. లేకుంటే బీజేపీ తోనూ, నరేంద్ర మోదీ గారితోనూ ప్రేరణ పొంది, రాజకీయాలలోకి వచ్చి చేరవచ్చు. పార్టీ పునాది పెరగాలి. ఇది నా ప్రధాన ఆలోచన. ఇటు గ్రామీణ ప్రాంతంలో, అటు పట్టణ ప్రాంతంలో పెరగాలి. ఇంతకుముందు బీజేపీ హైదరాబాద్‌లోనే ఉందనేవారు. ఇప్పుడు అట్లా కాదు. బీజేపీ విస్తృత పునాది ఏర్పరుచుకుంది. ఆ ధోరణిలోనే పార్టీ ముందుకు పోవాలి.
యువతరాన్ని ఆకర్షించేందుకు మీరు చేపట్ట బోయే కార్యాచరణ ప్రణాళిక!
పార్టీలోకి రావాల్సింది యువత, మహిళలు. ఎందుకంటే సీట్లలో 33% రిజర్వేషన్ వారిదే. ఇక భారత్, యువత అధికంగా ఉన్న దేశం. 60, 70% యువతరం ఉన్నదే భారత్. నరేంద్ర మోదీ గారి కార్యక్రమాల ద్వారా, దేశభక్తి సిద్ధాంతం ద్వారా, త్యాగధనులైన మహానీయుల ఆశయాలు నేరవేర్చేం దుకు, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల త్యాగాలను గౌరవిస్తూ, దేశ సమగ్రతను కాపాడాలన్న ఆశయంతో ఉండే యువకులందరూ బీజేెపీలోకి రావాలని నేను కోరుతున్నాను. మన దేశాన్ని రక్షించాలంటే బీజేపీ ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. ఆపరేషన్ కార్గిల్ కావచ్చు, ఆపరేషన్ సిందూరు కావచ్చు. ఇవన్నీ కూడా బీజేపీ దేశాన్ని ఒక సమగ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో చేసింది. దేశం మరొకసారి విడిపోకుండా, ఇతర దేశాలను ఎదురొడ్డి నిలిచే శక్తితో బలోపేతం కావాలి. కాబట్టే యువకులు ముందుకు వచ్చి బీజేపీని బలపరచాలి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఉంది. తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు. వీటికి మీ కార్యాచరణ ఏమిటి?
ఇవి నిశ్చయంగా సవాళ్లే. రాజకీయ పార్టీ అంటే ఎలక్షన్లో పోటీ చేయాలి, గెలవాలి. రాజకీయ పార్టీ ఒక చారిటబుల్ ట్రస్ట్ కాదు. ఒక రాజకీయ పార్టీగానే పోటీ చేస్తాం. గెలుపు దిశలో వెళతాం.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గెలుస్తారు. అక్కడ కార్పొరేటర్లు గెలవరు. ఎక్కువ ప్రాంతాల్లో కార్పొరేటర్లు గెలుస్తారు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవరు. దీన్ని విశ్లేషిస్తారా?
ఎన్నికలలో సరళి మారడం సహజం. స్థానిక అంశాలు, రాష్ట్ర అంశాలు, జాతీయ అంశాలు ఆయా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ.. అసలు పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఓటింగ్ సరళి మారిపోతుంది. ప్రతి ఎలక్షన్స్‌ని ఒకే రకంగా చూడలేం. రాజకీయాలలో యథాతథ స్థితి ఉంది. రాజకీయాలు మారుతూనే ఉంటాయి. ప్రజల ఆలోచన మారుతుంది, ఎవరికి ఓటు వేయాలి అనే ఆలోచన రెండు నిమిషాల్లో మారొచ్చు.
కొన్నేళ్లుగా దేశంలో ఉన్న ధోరణి చూస్తే మోదీ వల్లనే బీజేపీకి ఓటు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మోదీని చూసే ఓటు వేస్తారా?
మీకు ముందే చెప్పాను. స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వం ప్రధానం. అవి బలపడతాయి, బలపడాలి. మోదీని చూసి ఓటు అంటే బీజేపీకే. బీజేపీకి ఓటు వేస్తున్నప్పుడు ఓటర్ తాను మోదీకి ఓటు వేస్తున్నాననే అనుకుంటాడు. ఇక్కడ మోదీ గారు వచ్చి చెప్పడం ఉండదు. అయినా బీజేెపీ అంటేనే మోదీ గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ముద్రా లోన్స్, జన ఔషధి కేంద్రాలు, ప్రధానమంత్రి మాతృవందన యోజన వంటి కార్యక్రమాలు. అన్నీ కేంద్ర నిధులతో చేసే కార్యక్రమాలు. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు తమవి చెప్పుకుంటున్నాయి. తమిళనాడులో అన్నామలై గారు కేంద్ర పథకాలతో లబ్ధి పొందిన వారందరినీ ఒకే వేదిక వైకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు. మీరు కూడా తెలంగాణలో అట్లాంటి కార్యక్రమం ఏదైనా చేస్తారా?
మా కార్యవర్గం ఏర్పడ్డాక చర్చిస్తాను. ఇది కూడా బాగుంది. మంచి సూచన. అన్నామలై చేపట్టిన పద్ధతిలో మేము చేసే ప్రయత్నం చేస్తాం.
ఏపీ, తెలంగాణలలో ఒకేసారి రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. పార్టీ వ్యవహారాలలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఒక తేడా ఏంటి?
అక్కడ రాజకీయ పరిస్థితి వేరే, ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే. అక్కడ అంశాలు వేరే, ఇక్కడ వేరే. ప్రజల ఆకాంక్షలు కూడా అంతే. రెండు తెలుగు రాష్ట్రాలే అయినా రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. ఆ రాజకీయాలు అనుకూలంగా అక్కడ భారతీయ జనతా పార్టీ, టీడీపీతో కలిసింది. ఇక్కడ పరిస్థితులను బట్టి బీజేపీ ఒంటరిగా ప్రయాణిస్తుంది.
రోహిత్ వేముల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడితే, లీగల్ నోటీస్ పంపించారు. అసలు ఆ వివాదం గురించి కొద్దిగా…
రోహిత్ వేముల ఒక విద్యార్థి. పాపం ఆత్మహత్య చేసుకున్నాడు, సెంట్రల్ యూనివర్సిటీలో. దురదృష్టకర సంఘటన. అబ్బాయి మీద, ఆ అబ్బాయి కుటుంబం పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ వాస్తవాలు వేరు. రోహిత్ వేముల దళితుడు కాదు. రాహుల్ గాంధీకి ఈ వాస్తవం తెలిసి వచ్చినా, తెలియక వచ్చినా లోతుపాతులు ఆయనకేం తెలుస్తాయి? ఆ అబ్బాయి వడ్డెర. ఆయన తప్పుడు పత్రాలతో యూనివర్సిటీలో చేరాడు. రోహిత్ వేముల చేసిన పని ఏమిటి? అఫ్జల్ గురు ` ఒక దేశద్రోహి. అఫ్జల్‌కి కోర్టులు మరణ శిక్ష విధిస్తే అతడికి మద్దతుగా ఈ అబ్బాయి పోస్టర్ వేశాడు. దాన్ని ఏబీవీపీ వారు వ్యతిరేకించి, వీళ్లను కొట్టారు. సుశీల్ కుమార్ అనే పరిశోధక విద్యార్థి హాస్పిటల్‌లో పడితే నేను వెళ్లాను. అంతే. మరి రోహిత్ మరణంతో నాకు ఏం సంబంధం ఉంటది? ఆ అబ్బాయి ఆత్మహత్యను కాంగ్రెస్‌వారు నా మీద పెడుతున్నారు. నాకు సంబంధమే లేదు. ఆ తర్వాత పోలీసే కేస్ క్లోజ్ చేసింది కదా! వాళ్ల పోలీసే కదా, మూసేసింది!
బనకచెర్ల ఇప్పుడు వార్తలలో ఉంది. కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ కూటమి ఉంది. కాబట్టి వారికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. దాన్ని మీరు ఎలా చూస్తారు?
ఇవన్నీ ప్రచారాలు. వాస్తవాలు కావు. అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ పెరుగు తున్నది. దీనికి భయపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ విధానం ఏంటి?
బీజేపీ బీసీ రిజర్వేషన్‌కు వందశాతం మద్దతు పలుకుతుంది. అయితే తెలంగాణలో కొన్ని చిక్కులు ఉన్నట్టున్నాయి. ఎక్కడైనా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అంటే కొద్దిగా వారు దాన్ని కొన్ని అంశాల్లో విభేదిస్తున్నారు. మేము ఒక అంశంపైనే విభేదిస్తున్నాం. ముస్లింలకు పదిశాతం రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తున్నాం. బీసీలకు పథకాలు పెడితే వ్యతిరేకించట్లేదు. 42% పెడితే దానికి కూడా మేము సపోర్ట్ చేసినాం. వారు ఎప్పుడైనా మాట ఇచ్చిన తర్వాత అమలు పరచట్లేదు అంటున్నాను.
తెలంగాణ కమల దళపతిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం!
గతంలో మీరు బీఆర్‌ఎస్‌కు అవకాశంఇచ్చారు. కాంగ్రెస్‌కీ ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి ఇచ్చి చూడండి. మార్పు వస్తుంది. తెలంగాణనే మన బంగారు తెలంగాణగా ఒక వికసిత తెలంగాణగా మార్చుకుందాం.
సంఘ శతాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఇచ్చే సందేశం కొంతమందితో మొదలై, ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఎదిగినది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఆ సంస్థతో అనుబంధాన్ని గర్వంగా భావిస్తు న్నాను. ఈ దేశ ప్రజలకే కాదు, రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే ఈ న్యూస్ ఛానల్ చూస్తున్నారో ఆ యువతకు చెప్తాను, శాఖకు వెళ్లండి, దేశభక్తి వస్తుంది, దేశభక్తుడిగా మారండి దేశద్రోహుల్ని అంతం చేద్దాం. ఈరోజు దేశాన్ని రక్షించేది అదే.
ఇంటర్వ్యూ : గోపగోని సప్తగిరి
ఎమ్.ఫిల్ (పి.హెచ్‌డి), సీనియర్ జర్నలిస్ట్