ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి సాధించిన చరిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ కీలక సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో ప్రధాన పాత్ర వహిస్తున్న, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా, ఆయన ముందు అనేక సవాళ్లు, అవకాశాలు ఉన్నాయి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వైఎస్‌ఆర్ సీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పునరుద్ధరించడం, విశాఖ, అమరావతి వంటి కీలక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు సాధించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, సంస్కృతి, భాషా పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, కూటమి ప్రభుత్వంలో ఒక కీలక భాగస్వామిగా ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు వంటి అంశాలపై కొత్త అధ్యక్షునితో జరిపిన ప్రత్యేక ముఖాముఖి ఇది.
అభినందనలు! రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈ కీలక సమయంలో బాధ్యతలు స్వీకరించినందుకు మీకు శుభాకాంక్షలు. మీ ముందున్న తక్షణ కర్తవ్యం, ప్రధాన సవాలు ఏమిటని భావిస్తున్నారు? పార్టీని క్షేత్రస్థాయిలో, అంటే గ్రామ, మండల స్థాయుల్లో బలోపేతం చేయడానికి మీ తొలి ప్రాధాన్యం ఏమిటి?
నమస్కారం! ధన్యవాదాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈ కీలక సమయంలో నాకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాకి, అలాగే పార్టీ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దేశ రాజకీయాల్లో బీజేపీది ప్రభావవంతమైన పాత్ర. ప్రతి గ్రామానికి పార్టీని తీసుకెళ్లి జెండా ఎగురవేస్తా. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా. కేంద్ర రోడ్ మ్యాప్ మేరకు పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని అంశాలను అధ్యయనం చేసి సద్విమర్శ చేస్తూ కూటమి బలోపేతం చేసేందుకు కృషి చేస్తా.
మీ తండ్రి వారసత్వం కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందని బయట మాట్లాడుకుంటు న్నారు. ఈ విషయంలో మీ స్పందన ఏమిటి?
జనసంఘ్, జనతా, బీజేపీ వరకు మా కుటుంబం సేవ చేస్తోంది. చలపతిరావు, ఆనురాధ దంపతుల కొడుకుగా పుట్టడం గర్వకారణంగా భావిస్తున్నా. మాది వారసత్వాన్ని నమ్మని కుటుంబం. కానీ సిద్దాంత వారసత్వాన్ని తీసుకుంటాం. మా నాన్న చలపతిరావు గారి బాటలో నడుస్తాను. చిన్నప్పటి నుంచి వివిధ కార్యక్రమాల్లో సంఫ్‌ు, పార్టీ మాధ్యమంలో పూర్తి స్ధాయిలో పనిచేశా. సంఫ్‌ులో ద్వితీయ వర్ష పూర్తిచేశా. కాలేజీ విద్యార్ధి నాయకుడిగాను, పార్టీలో వివిధ స్ధాయిలో పనిచేస్తూ ఎమ్మెల్సీగా కూడా గెలిచా. మా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా, ప్రజాసేవ, నిబద్ధత ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీ కోసం నేను చేసిన కృషి, నా అంకితభావం, అలాగే నా కమ్యూనికేషన్ నైపుణ్యాలను గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించింది.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటి? ఎప్పటిలోగా దీనిని పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు? బనకచర్ల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారు? ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి కూటమి నేతగా మీ వ్యూహం ఏమిటి?
పోలవరం ఏపీకి జీవనాడి. ముందుచూపుతో దానికి జాతీయ హోదా సాధించారు. ప్రతినెలా సమీక్ష చేసి నిధులు అందిస్తున్నారు. పోలవరం రూ.13 వేల కోట్ల ప్రాజెక్టు. దానిని పూర్తిచేసేందుకు కృషి చేస్తాం. వైకాపా పోలవరాన్ని జాప్యం చేశారు. పోలవరం కుడి కాలువ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 24.88 టీఎంసీలు విశాఖ, ఉత్తరాంధ్రకు సాగునీరు, తాగునీరు, విశాఖకు పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేస్తుంది. పట్టిసీమ వల్ల గోదావరి – కృష్ణ డెల్టాలను స్ధిరీకరణ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రాంతీయ వివాదాలకు తావులేదు. కృష్ణా గోదావరి బేసిన్‌లో మిగులు జలాలపై అభ్యంతరాలుండవు. బచావత్ ట్రిబ్యునల్, సెంట్రల్ వాటర్ వర్క్స్ అనుమతితో రాయలసీమకు తప్పనిసరిగా వచ్చే నీటిని బనకచర్లద్వారా రాయల సీమకు అందించేలా కృషిచేస్తాం.
ప్రధాని మోదీ అమరావతికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం నిర్దేశించు కున్నట్లుగా 2029 నాటికి కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమవు తుందా?
ఇది ప్రధానమైన అంశం. కూటమి ప్రభుత్వానికి అయిదేళ్ల సమయం ఉంటుంది. అమరావతితో పాటు అపరిష్కృత అంశాలలో ముఖ్యమైన వాటిని నిర్దేశించు కుని పూర్తిచేయాలని మోదీ చెప్పారు. అమరావతి ప్రజల రాజధాని. రెండేళ్లలో అలరారుతుంది.
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, అందిన కాడికి దోచుకున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆరోపణలపై, విశాఖ అభివృద్ధికి నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ముఖ్యంగా మెట్రో రైల్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపు వంటి అంశాలపై మీ ప్రణాళిక ఏమిటి?
వైఎస్‌ఆర్ సీపీ అవినీతికి పరాకాష్టగా నిలిచింది. భూములు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అవినీతితో రుషికొండ భవంతులు నిర్మించారు. వాటిని సక్రమంగా, ప్రజోపయోగంగా వినియో గించాలి. ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. విశాఖ సుందర, ప్రగతిశీల నగరం. విశాఖను నిజమైన ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది. స్టీల్‌ప్లాంటు, రైల్వే జోన్ తదితర విషయాల్లో చొరవ చూపి అభివృద్ధి చేస్తాం. విభజన చట్టంలో అన్ని అంశాలు పూర్తిచేస్తాం.
ఏపీ లిక్కర్ కుంభకోణంపై బీజేపీ వైఖరి ఏమిటి?
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో లిక్కర్ స్కాం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై తొలి పోరాటం బీజేపీ చేసింది. డిజిటల్ పేమెంట్ లేకుండా లిక్కర్ సొమ్ము దోచేశారు. ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వం పైన ఆనాడు బీజేపీ పోరాడిరది అది నేడు దర్యాప్తులో తేలింది. లిక్కర్ స్కాం దర్యాప్తులో చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. లిక్కర్ స్కాం దర్యాప్తును ఏపీ పోలీసులు సమర్ధ వంతంగా నిర్వహిస్తున్నారు. అరెస్టులు జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లపై చేస్తున్న ఆందోళనలను, పరామర్శలను మీరు ఎలా చూస్తున్నారు? ఆయన ప్రజా సమస్యలపై పోరాడు తున్నారా లేక శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? కూటమి ప్రభుత్వ వైఖరి ఏమిటి?
ప్రజలకు జగన్‌పై విశ్వాసం లేదు. అందుకే అయనను 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ మానసిక స్థితి, ఆలోచనా ధోరణి పూర్తిగా తప్పు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి బలవంతంగా ప్రజలను సమీకరించి హడావిడిగా పరామర్శలు చేస్తున్నారు. అమాయక దళితుల ప్రాణాలు పోయే పరిస్థితులు తీసుకువస్తున్నాడు. గత ఐదేళ్లుగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని చెప్పడం హాస్యాస్పదం. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, శాంతిభద్రతల సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి మీ వ్యూహం ఏమిటి? ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, కీలక నిర్ణయా లలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది?
కూటమి మంచి అవగాహనతో ఏర్పడిరది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన అనే ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. కూటమిలో బీజేపీ క్రియాశీలకంగా ఉంటుంది. చంద్రబాబు వినూత్న ఆలోచన పి`4 అనేది సమాజంలో చిట్టచివరి పేదవాడికి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే బీజేపీ లక్ష్యానికి దగ్గరగా ఉంది. పార్టీ సంస్ధాగత నిర్మాణాన్ని రాష్ట్ర భాగ స్వామ్యంతో దేశంలోనే నంబరు 1 గా నిలబెడతాం.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హామీల సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మీరు వారధిగా ఎలా వ్యవహరించ బోతున్నారు?
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప వరం. విభజిత సమస్యలపై జరిగిన పలు కార్యక్రమాల్లో నేనూ పాల్గొన్నా. రాష్ట్రానికి అవసరమైన నిధులు, జాతీయ ప్రాజెక్టులు, ఇతర హామీల సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌లకు కేంద్రంతో ఉన్న విస్తృత పరిచయాలతో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకొస్తా.
పార్టీకి వెన్నెముక లాంటివి అనుబంధ విభాగాలు. యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ మోర్చా వంటి విభాగా లను క్షేత్రస్థాయిలో క్రియాశీలం చేయడానికి, వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో భాగస్వాములను చేయడానికి ఎలాంటి కార్యక్ర మాలు చేపడతారు?
అనుబంధ విభాగాలు పార్టీకి చాలా ముఖ్యం. వాటిని మరింత క్రియాశీలం చేస్తాం. ప్రతి మోర్చాకు ఒక అజెండా ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తాం. ఇప్పటికే ఓబీసీ మోర్చా ఆధర్యంలో అనేక బీసీ సదస్సులు నిర్వహించాం. ఆగస్టు 30న సంచార జాతుల సదస్సు విజయవాడలో నిర్వహిస్తాం. వారి సంస్కృతి, పండుగలను వెలుగులోకి తెస్తూ ముందుకు తీసుకెళ్తాం.
ఎన్నికల విజయం తర్వాత కార్యకర్తల్లో నూత నోత్సాహం ఉంది. ఈ ఉత్సాహాన్ని నిలబెడుతూ, పార్టీ సీనియర్లను, యువతను ఏకతాటిపైకి ఎలా తీసుకువస్తారు? వారిని నిరంతరం ప్రజాసేవ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ఎలా ప్రేరేపిస్తారు?
ఎన్నికల విజయం మన కార్యకర్తల కృషికి దక్కిన ఫలితం. ఈ ఉత్సాహాన్ని నిలబెట్టడానికి, నిరంతరం ప్రజలకు సేవ చేసేలా వారిని ప్రోత్సహిస్తాం. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతలోని నూతన ఆలోచనలకు వేదిక కల్పిస్తాం. పార్టీ కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజా సేవకు అంకితమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తాం.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు మీకు, పార్టీకి తొలి అగ్నిపరీక్ష వంటివి. ఈ ఎన్నికల్లో కూటమి పక్షాలతో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది? గెలుపే లక్ష్యంగా మీ వ్యూహం ఏమిటి?
అసెంబ్లీ ఎన్నికలకు కలసి పోటీ చేశాం. ప్రజలు 94 శాతం విజయం అందించారు. నామినేటెడ్, నీటి సంఘాలు, కో అపరేటివ్ సంస్థ పదవుల్లో కలసి ముందుకెళ్తున్నాం. స్ధానిక సంస్థలకోసం పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి పక్షాలతో కలసి ముందుకెళ్తాం.
గత దశాబ్ద కాలంగా ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు శాతం ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇప్పుడు కూటమిలో ఉండటం పార్టీ విస్తరణకు అవకాశమా లేక పరిమితం చేస్తుందా? రాష్ట్రంలో బీజేపీని సొంతంగా ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దడానికి మీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటి?
అన్ని పరిమితులను దాటుకుని చిట్టచివరి గ్రామం వరకు శక్తి కేంద్రాల ఆధారంగా బూత్‌లను బలోపేతం చేస్తాం. నాయకత్వాన్ని క్షేత్రస్ధాయిలో పెంచుకునే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే నా దీర్ఘకాలిక లక్ష్యం. యువతను, విద్యావంతులను, మేధావులను పార్టీలోకి ఆకర్షిస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటాం.
ప్రస్తుత ప్రభుత్వం ‘పారదర్శక పాలన’ అందిస్తా మని హామీ ఇచ్చింది. ప్రభుత్వంలో అవినీతికి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడటంలో ఒక భాగస్వామ్య పక్షంగా బీజేపీ పాత్ర ఎలా ఉంటుంది?
సుపరిపాలన, పారదర్శకత అనేది బీజేపీ ముఖ్య లక్ష్యాలు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంలో మేము కూటమిలో భాగస్వామిగా క్రియాశీల పాత్ర పోషిస్తాం. ప్రభుత్వంలో అవినీతి లేని పాలన అందించడానికి మా వంతు కృషి చేస్తాం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూస్తాం.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి ఉగ్రవాద సంబంధిత ఆందోళనలపై మీరు లేవనెత్తిన సమస్యల గురించి, ఈ సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎలాంటి చర్యలు సూచిస్తుంది?
ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. డీజీపీని కలిస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. విజయనగరంలో ఉగ్రవాది పోలీసు ఉద్యోగిగా కూడా చేరడానికి ప్రయత్నం చేశాడు. బాంబులు తయారు చేసి విస్పోటనం చేసి భయోత్పాతం కలిగించే ప్రయత్నం చేశాడు. తమిళనాడు నుంచి రాయచోటికి చేరి కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు. స్ధానిక ముస్లిం యువతను ఆకర్షించి పురికొల్పాడు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్ధాయిలో నిఘా పెట్టాలి.
విజయవాడలోని లెనిన్ సెంటర్ పేరును మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలన్న మీ డిమాండ్ గురించి వివరించండి. గుంటూరులో జిన్నా టవర్ పేరు కూడా మార్చాలని గతంలో బీజేపీ డిమాండ్‌తో పాటు ఆందోళనలు చేసింది. ఇలాంటి విదేశీ వ్యక్తుల పేర్లతో ఉన్న ప్రాంతాలపై పేర్లు మార్చాలనే డిమాండ్ ఏదైనా ఉందా? ఈ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక, రాజకీయ గుర్తింపును ఎలా బలోపేతం చేస్తుంది?
పార్టీ పగ్గాలు చేపట్టేముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, విశ్వనాథ సత్యనారాయణ విగ్రహాలకు పూలమాల వేసేందుకు వచ్చాం. కాని విశ్వనాథ విగ్రహం వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన గురించి అక్కడున్న వారికి తెలియదు. చాలా బాధ కలిగింది. 1956 తర్వాత తెలుగును శాసనభాషగా న్యాయ పరిపాలనగా మార్చాలని విశ్వనాథవారి అధ్యక్షతన కమిటి ఏర్పాటుచేశారు. విశ్వనాథ వారిని విజయవాడ లేదా తెలుగు వారు ఎవరూ మర్చి పోరాదు. ఆయన రాసిన వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం వంటి రచనలు నేటి తరం తెలుసుకోవాలి. లెనిన్‌కు విజయవాడతో సంబంధం ఏమిటి? ఆంధ్రప్రాంత అభిమానంతో ఉన్నవారి పేర్లు ప్రతిప్రాంతానికి పెట్టాలి. అనేక లక్షల మంది భారతీయులను ఊచకోతకు గురిచేసిన వారి తరపున వాదించిన మహమ్మద్ అలీ జిన్నా పేరును గుంటూరులో ఇంకా కొనసాగించడం సరికాదు. దానిని ఆజాదీ టవర్‌గా మార్చాలి. అలాగే కింగ్‌జార్జి ఆసుపత్రి ఇత్యాది పేర్లు బానిసత్వానికి ఉదాహరణ. వాటి పేర్లు మారుస్తాం.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు జాతి గర్వించదగ్గ సాహిత్యమూర్తి. ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్‌లో ఒక విశ్వవిద్యాలయం లేదా ఉన్నత స్థాయి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాద నను మీరు వ్యక్తిగతంగా ముందుకు తీసుకెళ్తారా? ఈ బృహత్తర కార్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు కూడగట్టడానికి మీ వంతుగా ఏం చేస్తారు?
విశ్వనాథతో పాటు తెలుగు సాహిత్యానికి ఎంతో కృషిచేసిన గుర్రం జాషువ, అవధాన ప్రక్రియలో ప్రవీణులైన తిరుపతి వెంకటకవులు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వంటి వైతాళికులకు ప్రాధాన్యత ఇస్తూ అధ్యయన కేంద్రాలు, విద్యాసంస్థలకు పేర్లు పెట్టే ప్రతిపాదనలు చేస్తాం. విశ్వనాథ తెలుగు సాహిత్యానికి గొప్ప నిధి. ఆయన పేరు మీద ఒక విశ్వవిద్యాలయం లేదా ఉన్నత స్థాయి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నేను వ్యక్తిగతంగా ముందుకు తీసుకెళ్తాను. ఈ బృహత్తర కార్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి మద్దతు కూడగడతాను. తెలుగు భాషాభివృద్ధికి, సాహితీ పరిశోధనలకు ఇదొక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.
బీజేపీ రాష్ట్ర శాఖఅధ్యక్షులుగా మీరు ‘‘తెలుగు సాంస్కృతిక వారసత్వం, వైభవానికి ప్రాధాన్యం ఇస్తాం’’ అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలను ఆచరణలో పెట్టడానికి మీ వద్ద ఉన్న నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు?
రాష్ట్రంలో ప్రాథమిక స్ధాయిలో తెలుగు మాధ్యమం లేకపోవడం బాధాకరం. నిరాశకు గురిచేసింది. భాషపట్ల దురభిమానం ఉంటే బాధ కలుగుతుంది. మన సంస్కతి, భాషను రక్షించాలి. పక్క రాష్టాలల్లో అనుసరిస్తోన్న పోరాటాల స్ఫూర్తిగా ఇక్కడ అనుసరించడానికి పనిచేస్తాం. మాతృభాష పరిరక్షణకు మోదీ పనిచేస్తున్నారు. ఆరో తరగతి వరకు మాతృభాషగా ఉండాలి.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోయాయి. గత ప్రభుత్వం దాని పేరును ‘తెలుగు-సంస్కృత అకాడమీ’గా మార్చినా, క్రియాశీలత శూన్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు. ఈ అకాడమీని పూర్తి స్థాయిలో పని చేయించడానికి, నిధులు కేటాయిం చేలా రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఏ విధమైన ఒత్తిడి తీసుకువస్తారు? దీనికి ఒక కాలపరిమితిని నిర్దేశించుకోగలరా?
తెలుగు అకాడమీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడమీ అని పేరు మార్చినా చేసిందేమీ లేదు. అకాడమీకి తగిన నిధులు కేటాయించి, అర్హులైన నిపుణులను నియమించి, అది ఒక క్రియాశీలక సంస్థగా మారేలా చూస్తాం. దీనికి ఒక నిర్దిష్ట కాలపరిమితిని రూపొందిస్తాం.
‘తెలుగును శాసనభాషగా, పరిపాలనా భాషగా పూర్తిస్థాయిలో అమలు చేయడం’’ అనేది దశాబ్దాల కల. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకో బోతున్నారు? శాసనసభలో బిల్లుల ముసాయిదా లను తొలుత తెలుగులోనే ప్రవేశపెట్టేలా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తారా?
తెలుగును శాసనభాషగా, పరిపాలనా భాషగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా పార్టీ ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బిల్లుల ముసాయిదాలను తొలుత తెలుగులోనే ప్రవేశపెట్టేలా, పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చూడటానికి కృషి చేస్తాం. అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు తప్పకుండా తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
కొత్తగా యువతను, విద్యావంతులను, వివిధ రంగాల నిపుణులను పార్టీ వైపు ఆకర్షించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా? సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసే ఆలోచన ఉందా?
కచ్చితంగా, యువత, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులను వారిని ఆకర్షించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వం, సుపరిపాలనపై విశ్వాసం ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం. యువత కోసం ‘యువ మోర్చా’ ఆధ్వర్యంలో ఉపాధి శిబిరాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే, అన్ని జిల్లాల్లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం.
చివరగా, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది బీజేపీ కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ‘భారతమాత కి జై’ అనే నినాదంతో, మన సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌర వాన్ని నిలబెడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేద్దాం. మన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రతీ కార్యకర్తా తాను కూడా అధ్యక్షుడిగా భావిస్తూ గర్వపడేలా పార్టీని ముందుకు తీసుకెళ్తా. సేవ, నిబద్ధత, సుపరిపాలన అనే మూడు మూలస్తంభాలపైనే మన పార్టీ భవిష్యత్తును నిర్మిస్తాం. జై హింద్.
ఇంటర్వ్యూ : తురగా నాగభూషణం