ఏప్రిల్ 22న పచ్చగా ఉన్న జమ్ము కాశ్మీర్ లోని పెహల్గావ్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు చేపట్టి మన దేశ పౌరులను పొట్టనపెట్టు కున్నారు. శ్వేతసౌధంలాగా వెలిగిపోతున్న కశ్మీర్‌లో నెత్తుటి ఏర్లను పారించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిం చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవా దులు మొత్తం పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద తండాలను నేలమట్టం చేసింది. అయినప్పటికీ పెహల్గావ్ దాడుల్లో పాల్గొన్న వారు సురక్షితంగా ఉండడం భారత భద్రతా దళాలకు, భారతీయులకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు.
అప్పటినుంచి అదును కోసం ఎదురుచూస్తున్న భారత భద్రతా దళాలు జూలై 28న ఆపరేషన్ మహదేవ్ చేపట్టాయి. పెహల్గావ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. దాడులకు సూత్రధారి సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను మన జవాన్లు మట్టుబెట్టారు. హషీమ్ మూసా గతంలో పాక్ ఆర్మీలో పని చేశాడు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులను యాసిర్, అబు హమ్జాగా గుర్తించారు. ఆపరేషన్ మహదేవ్‌లో చీనార్ కార్పస్, 24 రాష్ట్రీయ రైఫిల్స్, నాలుగు ప్రత్యేక పారామిలటరీ బలగాలు పాల్గొన్నాయి. రెండు వారాలుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. దాచిగాం నేషనల్ పార్క్ పరిసర ప్రాంతంలో ఉగ్ర వాదులు సంచరిస్తున్నట్టు భద్రత దళాలకు తెలిసింది. అక్కడ ఉన్న సంచారజాతులవారు కూడా ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అడవిలో దట్టమైన చెట్ల కింద తవ్విన ఒక గుహలో తలదాచుకున్నట్టు పక్కా సమాచారంతో భద్రతా దళాలు వారిని చుట్టుముట్టి ఒక్కసారిగా మట్టు పెట్టాయి.
ఆ పేరు ఎందుకు పెట్టారంటే..
దాచిగాం సమీపంలో మహదేవ్ అనే పర్వతం ఉంటుంది. అందువల్లే ఈ ఆపరేషన్‌కు మహదేవ్ అని పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం జబర్వన్, మహదేవ్ పర్వతాల మధ్య ఉంది. అందువల్లే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టారు. ఇక్కడ మహదేవ్ పర్వతంలో శివుడు నడయాడాడని.. అందువల్లే ఈ పర్వతం మహిమాన్వితమైనదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి దట్టమైన అడవిలో శివుడు తపస్సు చేశాడని.. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని అంటారు.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకొన్నాయని ఆయన పేర్కొన్నారు.
రెండుసార్లు సంకేతం..!
ఆపరేషన్ మహదేవ్ గురించి విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు ఉపయోగించిన చైనీస్ ఉపగ్రహ ఫోన్ నుంచి జూలై 26న వచ్చిన సిగ్నళ్లతో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికి 17 రోజుల క్రితం అదే తరహా సిగ్నల్ వచ్చి ఉండడంతో అది ఉగ్రవాదు లకు సంబంధించిందేనని భావించి వేట కొనసాగిం చారు. ఆ సిగ్నల్ ఆధారంగా డ్రోన్ల సాయంతో వారిని అన్వేషిస్తూ శ్రీనగర్ శివార్లలో ఉన్న దాచిగాం అడవులు, జబర్వాన్ పర్వతశ్రేణిలో మహదేవ్‌పీక్ సమీపంలోని ముల్నార్ పీక్ వద్దకు చేరుకున్నారు.
ఆపరేషన్ ఆరంభం
జూలై 28 తెల్లవారుజామున 2 గంటలకు మహదేవ్ పర్వతంపైన దట్టమైన అడవిలో చైనీస్ ఆల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్‌గా ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. ఈసారి ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించడంలో చైనీస్ శాటిలైట్ ఫోన్ సిగ్నల్ కీలక పాత్ర పోషించింది. నిషేధిత టీ82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్ అనుకోకుండా యాక్టివేట్ కావడంతో వారి ఆచూకీ బయటపడింది. ఈ ఫోన్ చైనాకు చెందిన హువావే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. గత వారం చివర్లో ఫోన్ యాక్టివేట్ కావడంతో ఢిల్లీలోని యూనిట్లు సిగ్నల్‌ను గుర్తించాయి. దీంతో భారత బలగాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. భారతదేశం ఈ శాటిలైట్ ఫోన్‌లను 15 ఏళ్ల క్రితమే నిషేధించింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత హువావే, జెడ్‌టీయీ ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఫోన్‌లు చైనాకు చెందిన టియాం టాంగ్-1 శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తాయి. ఉగ్రవాదుల పెహల్గావ్ దాడికి ముందు రెక్కీ కోసం కూడా ఈ ఫోన్‌లనే ఉపయోగించారు. ఉగ్రవాదుల సిగ్నల్స్‌ను పట్టుకోవడానికి మన ఇంటెలిజెన్స్, ఆర్మీ.. దేశీయంగా తయారుచేసిన పరికరాలనే ఉపయో గించాయి. అప్పట్నుంచీ ఉగ్రవాదుల సిగ్నల్స్‌ను వెతుకుతూ.. మన ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఆర్పీఎఫ్ అధికారులు ఉత్తకాళ్లతో పలు పర్వతాలను అధిరో హించారు. బైసరన్ లోయలో మూడు శాటిలైట్ ఫోన్ సిగ్నళ్లను గుర్తించారు. వీటితోనే ఉగ్రవాదుల చివరి కదలికలు బయటపడ్డాయి. భారత బలగాలు శత్రువులను వేటాడటమే కాకుండా, వారి టెక్నాలజీని వారికే ఉచ్చుగా మార్చాయి. టీ82ను సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులే ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌ల కోసం ఉపయోగిస్తుంటారు. వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఉదయం 8 గంటలకు డ్రోన్ ఎగురవేశారు. డ్రోన్ పంపిన విజువల్స్ ఆధారంగా 9.30 కల్లా టెర్రరిస్టులు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. దట్టమైన అడవిలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్‌వేసుకొని టెర్రరిస్టులు దాక్కున్నట్లు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో.. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ఉగ్రవాద నిర్మూలన దళం, 4 పారా స్పెషల్ ఫోర్స్‌తో కలిసి మహదేవ్ శిఖరంపైకి ఎక్కడం ప్రారంభించారు. అరగంటలోపే ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. 11 గంటల సమయంలో వారిపై కాల్పులు ప్రారంభించి మట్టుబెట్టారు. 11.45 గంటలకల్లా ఆపరేషన్ మహదేవ్ ముగిసింది. ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. చుట్టు పక్కలా కూంబింగ్ చేపట్టారు. 12.45 గంటలకు మృతదేహాలను గుర్తించారు. ఫొటోలు తీసుకున్నారు. మొత్తం 3 గంటల్లోనే ‘ఆపరేషన్ మహదేవ్’ను విజయవంతం చేశారు. ఈ ఆపరేషన్‌లో టెక్నాలజీ వినియోగం అత్యుత్తమంగా పనిచేసిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. దేశ భద్రత కోసం ఇది మరో విజయ గాధగా నిలిచింది.
వారి దగ్గర పాక్ చాక్లెట్లు కూడా ఉన్నాయి: అమిత్ షా
పెహల్గావ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ను, అతడి ఇద్దరు సహచరులను మట్టుబెట్టిన మన భద్రతా దళాలు అసలు వారి ఉనికిని ఎలా పసిగట్టాయి? వారి దాకా ఎలా చేరుకున్నాయి? అంటే.. ఆ వివరాలన్నింటినీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. అమాయక ప్రాణాలను బలిగొన్న పెహల్గావ్ ఉగ్రదాడి జరిగిన రోజు రాత్రి నుంచే ఆపరేషన్ మహదేవ్ ప్రారంభమైందని, ఆ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి, వారిని వేటాడడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆయన తెలిపారు.
ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారా అని కాంగ్రెస్ నేత చిదంబరం అడుగుతున్నారని.. టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచే వచ్చారనడానికి ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను మట్టుపెట్టిన చోటు నుంచి ఆయుధాలతో పాటుగా పాకిస్తాన్‌లో తయారైన చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమాయక పౌరులపై దాడి చేస్తే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని అమిత్ షా హెచ్చరించారు.
– ఆనంద్,
హిందూపురం