బ్రిటిష్ పాలకుల నుండి వారసత్వంగా అందుకున్న విభజించు, పాలించు సూత్రాన్ని అమలు పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే తెలంగాణలో నిర్వహించిన కులగణనను, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు అంశాలపై జాతీయ స్థాయిలో చర్చకు, ప్రచారానికి ప్రాధాన్యతను ఇస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగణన కోసం డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆ పార్టీ వైఫల్యాలను పరిశీలిస్తే బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కే లేదని గత చరిత్ర చెబుతోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం కీలకాంశాలను పక్కదారి పట్టించేలా కులగణన, రిజర్వేషన్ల విషయాలను తెరమీదకు తెస్తోంది. తెలంగాణలో నిర్వహించిన కులగణనను ఒక నమూనాగా తీసుకోవాలని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా డిమాండ్ చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకొని హస్తినలో చేస్తున్న హడావిడికి తెలుగు మీడియాలో ప్రచారం లభిస్తున్నా జాతీయ స్థాయిలో, ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునే వారే లేరు. ప్రజెంటేషన్ అంటూ ఒక రోజు, మరుసటి రోజు బాగీదారీ న్యాయ్‌సమ్మేళన్ పేరుతో కులగణనపై కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలని ఊదర గొడుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో గతంలో నిర్వహించిన కులగణన విఫలమైనట్టు ఒప్పుకున్నట్టే. అంతేకాక గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన కులగణన కూడా తప్పుడు లెక్కలంటూ ఆమోదించినట్టే.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీలో ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తరహాలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఖర్గే చెప్పడం మరింత హాస్యాస్పదం. తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టినా ఆ నివేదికను బట్టబయలు చేయకుండా రాష్ట్రంలో మరోసారి కులగణన చేపడుతామని చెప్పడం వెనుక కారణాలేమున్నాయో ఆయన చెబితే బాగుంటుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశంలోని ఓబీసీలు అందరూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని ఖర్గే ఆయనను స్తుతించారు. దేశ వ్యాప్తంగా ఓబీసీలందరూ రాహుల్ గాంధీ వెంటే ఉంటే లోక్ సభ ఎన్నికల్లో, అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు పరాయం మూటగట్టుకుందో ఖర్గేతో పాటు ఆయన పార్టీకే తెలియాలి.
రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004లో కులగణన చేపట్టకపోవడం తన తప్పేనని, పార్టీ తప్పు కాదని మొక్కుబడి వివరణ ఇచ్చారు. ఆయన ప్రకటనలోనే అహంభావం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ కాదని, అంతా వారి కుటుంబ కబంధ హస్తాల్లోనే ఉంటుందని ఈ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే జరిగేవా..? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సొంతంగా నిర్ణయాలు తీసుకునేదా..? యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏ అధికారాలు లేని రాహుల్ అప్పుడు కులగణన చేయకపోవడం తన తప్పేనని ప్రకటించడంలో ఆంతర్యమేమిటి..?
రాహుల్ గాంధీ ప్రకటనతో దీర్ఘకాలికంగా కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు చేసిన అన్యాయం బట్టబయలైంది. చివరిసారిగా దేశంలో అధికారికంగా బ్రిటిష్ పాలకుల హయాంలో 1931లో నాభా లెక్కల్లో నిర్వహించిన కులగణనలో కూడా ఓబీసీలు 50 శాతానికిపైగా ఉన్నారు. అంటే దేశంలో ఓబీసీలే అధికంగా ఉన్నా వారిని పట్టించుకోకుండా స్వాతంత్య్రానంతరం దీర్ఘకాలికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తే, ఇప్పుడు రాహుల్ గాంధీ 2004 తర్వాత అది కూడా ప్రత్యేకించి నరేంద్ర మోదీ హయాంలోనే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ముత్తాత జవాహర్‌లాల్ నెహ్రూ 1951లో జనగణనలో భాగంగా కులగణన చేపట్టవద్దని, కేవలం ఎస్సీ, ఎస్టీ లెక్కలనే సేకరించాలని ఆదేశించారు. కులా వారీగా లెక్కలు చేపడితే దేశంలో సామాజిక వర్గాల్లో విద్వేషాలకు తావిస్తుందనే భావనతో ఆయన కులగణనను నిలిపివేశారని చెప్పుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓబీసీలకు తానేదో తప్పు చేశానని అనుకుంటే, గతంలోనే కులగణనను ఆపేసిన నెహ్రూ అంతకంటే పెద్ద తప్పే చేశారని రాహుల్ ఒప్పుకున్నట్టేనా..? అనంతరం 1961 జనాభా లెక్కల్లో కూడా ఇదే పంథాను కొనసాగించిన నెహ్రూ ప్రభుత్వం, కులగణనను కావాలంటే రాష్ట్రాలు సొంతంగా చేసుకోవచ్చని సూచించడంతో దేశంలో అప్పటి నుంచి కులాలవారీగా ఓబీసీ లెక్కలకు తెరపడింది.
ప్రతి పదేళ్లకు దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల సేకరణ సమయంలో కులగణన డిమాండ్లు వచ్చినా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 1971, 1981, 1991, 2001లో జనగణనలు కులరహిత లెక్కలతోనే చేపట్టాయి. 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జనగణనతో పాటు సామాజిక, ఆర్థిక, కుల వివరాలను సేకరించినా, అప్పుడు కేవలం జనాభా లెక్కలనే బహిరంగపరిచి మిగతా అంశాల గణాంకాలను దాచిపెట్టింది. 2011 జనగణన సమయంలో లోక్‌సభలో నాటి ప్రతిపక్ష బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కోరగా, దీనికి సమాధానంగా అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం కులగణన నిర్వహించడం అసాధ్యమని చెప్పారు. దీనికి భిన్నంగా ఇప్పుడు పదేళ్లు అధికారానికి దూరం ఉన్న కాంగ్రెస్ కులగణనను అస్త్రంగా చేసుకోవాలని చూస్తోంది. అప్పుడు కుదరదని చెప్పిన చిదంబరం నేటికీ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరు. అప్పుడు సాధ్యంకాదని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, తమ ఒత్తిడితో నరేంద్ర మోదీ కులగణనకు ఒప్పుకున్నారని ప్రగల్భాలు పలకడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో భారత రిజిస్ట్రార్ నేతృత్వంలో 2011లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో దేశంలోని కులాలను, ఉపకులాలను, ఇతరులను 46,73,034 వర్గాలుగా విభజించి గందరగోళం సృష్టించారు. ఈ వివరాలపై అభిప్రాయాలు కోరుతూ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆ జాబితాలు పంపగా, వీటిలో 8,19,58,314 పొరపాట్లున్నట్లు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కేంద్రానికి సమాచారం అందింది. వీటిలో 6.7 కోట్ల పొరపాట్లను సరిచేసినా, మరో కోటికిపైగా అవకతవకలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. దీంతో స్వాతంత్య్రం అనంతరం అనేక తర్జనభర్జనల తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా చేపట్టిన కులాల లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు శాస్త్రీయంగా కులగణన చేపట్టిందని కోడై కూస్తున్న కాంగ్రెస్ బృందం ముందుగా గత యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా కులాల లెక్కలు నిర్వహించిందని బహిరంగంగా ఒప్పుకోవాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న దశలో ఆయన ప్రత్యర్థులు కులగణనను ఒక పాచికగా చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కర్ణాటక ప్రభుత్వం, నితీష్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో కులగణన చేశారు. కర్ణాటకలో 2015లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడితే అది అటకెక్కింది. సామాజిక కుల, ఆర్థిక, విద్యా అంశాల వివరాల సేకరణ కోసం 2014లో కమిషన్‌ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్, 2015లో సర్వే ప్రారంభించింది. ఈ సర్వేపై అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పటిలానే హడావిడి చేసింది. క్షేత్రస్థాయిలో జూన్, 2015 నాటికి సర్వే పూర్తి కాగా, జులై , 2015 నాటికి డాటా ఎంట్రీ కూడా పూర్తయ్యింది. దీర్ఘకాలం తర్జనభర్జనల తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మార్చి 2, 2018న కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్చించినా సిద్ధరామయ్య ప్రభుత్వం వివరాలను బయట పెట్టలేదు. మార్చి 27, 2018న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ పక్రియ అంతా చూస్తే నాటకాలను రక్తి కట్టించడంలో కాంగ్రెస్‌కు ఎవరూ సాటి రారని చెప్పవచ్చు. సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో చేపట్టిన సర్వే తప్పులు తడకలుగా ఉండడంతోనే నివేదిక వచ్చిన తర్వాత ఎన్నికల ప్రకటనకు 25 రోజుల సమయమున్నా బహిరంగపర్చలేదు. అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కులగణన చేసిన కాంగ్రెస్‌ను కర్ణాటక ప్రజలు ఓడించారు.
2018 కర్ణాటక ఎన్నికల్లో పరాజయం పొందిన కాంగ్రెస్ జేడీ (ఎస్)తో చేతులు కలిపి మళ్లీ అధికారాన్ని పంచుకున్నా కులగణపై ప్రస్తావనే తేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన జేడీ(ఎస్) నేత, ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ తేనెతుట్టెను కదపలేదు. అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం లోపభూయిష్టంగా ఉన్న ఈ కులగణన నివేదికను తృణీకరించింది. 2023లో ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వం 2015 కులగణన నివేదికను కేబినెట్‌లో ప్రవేశపెట్టినా దానిపై పార్టీలో విభేదాలు రావడంతో అటకెక్కించి, ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ తాజాగా కులగణన చేస్తామని ప్రకటించడం ఓట్ల రాజకీయమే. కర్ణాటకలో బలమైన లింగాయత్, వొక్కలింగాల సామాజిక వర్గాల నుండి 2015 కులగణన నివేదికపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కులగణనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తొలుత కర్ణాటక కులగణనలో తాము పూర్తిగా వైఫల్యం చెందామని ప్రకటిస్తే బాధ్యతాయుతంగా ఉండేది.
కర్ణాటక తర్వాత బిహార్‌లో కులగణన చేపట్టారు. ఆ రాష్ట్రంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వం రెండు దశలలో కులగణన పూర్తి చేసింది. జనవరి, 2023లో సర్వే ప్రారంభించింది. మే, 2023లో ముగించింది. తొలుత సర్వేపై స్టే విధించిన రాష్ట్ర హైకోర్టు అనంతరం ఆగస్టు, 2024లో దానిని తొలగించింది. అక్టోబర్ 2, 2023న, గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం నివేదికను అధికారికంగా విడుదల చేసింది. ఈ గణాంకాల్లో రాష్ట్రాల్లోని కులాలను, ఉపకులాలను పరిగణనలోకి తీసుకోవడంలో శాస్త్రీయత పాటించలేదని, పలు అవకతవకలు, గందరగోళం జరిగిందని, న్యాయ బద్ధంగా జరగలేదని అధికార జేడీ(యూ)లోని కొందరు నేతలతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఆరోపించాయి. లెక్కల్లో పలు తప్పుడు తడకలున్నాయనే విమర్శలొచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో కులగణన అధికార మార్పుకు కూడా కారణమైంది.
కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్నప్పుడే బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం కులగణన పూర్తి చేయగా, అందులో అనేక లోపాలున్నాయనే విమర్శలున్నాయి. ఇటు ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా తొలుత చేసిన కులగణనపై విమర్శలు రావడంతో ఇప్పుడు మళ్లీ చేపడుతామని అంటున్నారు. కులగణనను శాస్త్రీయంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నమూనాగా తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణనలో కూడా అనేక లోపాలున్నాయనే వార్తలున్నాయి. విమర్శలను ఆధారాలతో తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రకటనలు చేయడానికే ప్రాధాన్యతనిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా, ఆ లెక్కలను అధికారికంగా విడుదల చేయలేదు. అయితే పలు అధ్యయనాలు, విశ్లేషణల ద్వారా వెలుగులోకి వచ్చిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీ సామాజిక వర్గం 51 శాతంపైగా ఉన్నట్టు బయటపడింది. దీనికి ముస్లింలోని 10 శాతం బీసీలను కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా 61 శాతం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీలు 46.25 శాతం, ముస్లింలోని బీసీలు 10.08 శాతం కలుపుకొని మొత్తం బీసీల శాతం 56.33 శాతంగా తేల్చడంతో దుమారం రేగుతోంది. కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకిస్తే అసలైన బడుగు, బలహీన సామాజిక వర్గాలకు కోతపడి వారికి 32 శాతమే లభించి నష్టం జరగడం ఖాయం. దీనిపై ప్రశ్నిస్తే ముస్లింలలో పేదలు లేరా అంటారు.
అన్ని వర్గాల్లోని పేదలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే 10 శాతం ఈబీసీ కింద రిజర్వేషన్లను కల్పిస్తుందనేది గమనార్హం. ఇక త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందనేది సుస్పష్టం. విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టసభల్లో బిల్లును ఆమోదించిన రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వం బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్దత కల్పించడం లేదనే సాకుతో రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బిల్లులో పేర్కొన్న విద్య, ఉపాధి అంశాలు ఆర్డినెన్స్‌లో మాయం కావడమే కాంగ్రెస్ ఎన్నికల రాజకీయాలకు నిదర్శనం.
భారత తొలి ప్రధాని నెహ్రూ కులగణనను ఆపేశారు. తర్వాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, అనంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా దీనిపై ముందుకు సాగలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశంలోని ఓబీసీ వర్గాలకు తానే న్యాయం కల్పిస్తున్నట్టు రోజుకో ప్రకటనతో రోజుకో కొత్త నాటకానికి తెరదీస్తుండటం కులగణన అంశంతో ఈ కుటుంబం దేశ ప్రజలను ఎంత వంచిస్తుందో అర్థమవుతోంది. కర్ణాటకలో పార్టీ చేపట్టిన కులగణనలో వైఫల్యం చెంది, ఇప్పుడు తెలంగాణను ఓ నమూనాగా తీసుకోవాలని డిమాండ్ చేయడం వారికే చెల్లింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కుతుందనే అక్కసుతోనే తెలంగాణను ముందుకు తెచ్చి రాజకీయ పాచికను వేస్తోంది. మరోవైపు రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదో దేశ ప్రజలకు చెప్పాలి.
తెలంగాణ కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేపట్టిన కార్యక్రమాలలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఒకరిని ఒకరు పొగుడుకుంటూ బీజేపీ ప్రభుత్వంపై, మోదీపై విమర్శలు గుప్పించారు. ఒకరితో ఒకరు స్ఫూర్తి పొందామంటూ ప్రకటించు కున్నారు. అదే స్ఫూర్తి ప్రత్యర్థులను విమర్శించడంలో కూడా కొనసాగింది. ‘మోదీకి సామర్థ్యం లేదని’ రాహుల్ గాంధీ అంటే, ‘నరేంద్ర మోదీ కన్వర్డెడ్ బీసీ’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం పార్టీలో వారి వారి బలాలను నిరూపించు కునేందుకు కులగణనపై కాకి లెక్కల కబుర్లతో సాగిందే కానీ నిజంగా బడుగు, బలహీన వర్గాల వారి మీద ప్రేమతో మాత్రం కాదు. వారికి బడుగు, బలహీన వర్గాల సామాజిక న్యాయంపై ఏ మాత్రం విశ్వాసం, నిబద్ధత లేదని కులగణనపై దేశంలో జరిగిన చరిత్రే నిరూపిస్తుంది.
– శ్రీపాద