ఆం‌ధప్రదేశ్‌ ‌వ్యవసాయ రంగం ప్రస్తుత ఖరీఫ్‌ ‌సీజన్‌లో ప్రకృతితో పెద్ద పోరాటమే చేస్తోంది. తొలకరి పలకరింపుతో చిగురించిన ఆశలు, ఆపై వర్షాభావంతో నెలకొన్న ఆందోళనలు, తిరిగి భారీ వర్షాలతో వచ్చిన ఊరట, ఇప్పుడు ఎరువుల కొరత రూపంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లు… ఇలా రాష్ట్రంలోని అన్నదాతల పరిస్థితి నిత్యం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. డెల్టా రైతులు కాలువల నీటితో భరోసాగా ఉంటే, మెట్టప్రాంత రైతులు పూర్తిగా వరుణుడి కరుణను నమ్ముకున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వం కూడా రైతులకు క••డా తగిన చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంది. రైతులు ప్రతి సంవత్సరం వర్షాలు, నీటి పారుదల వ్యవస్థలపై ఆధారపడి సాగు చేస్తారు. ఈ ఏడాది జూన్‌, ‌జూలై నెలల్లో రైతులు ఎదుర్కొన్న పరిస్థితులు ఆశాజనకంగానూ, ఆందోళనకరంగానూ మారాయి. జూన్‌లో తొలకరి వర్షాలు కొంత ఆశాజనకమనిపించాయి. ఈ వర్షాలతో ఉత్సాహం పొందిన రైతులు పొలాలను సాగుకు సిద్ధం చేసుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప, పత్తి, కంది వంటి పంటలను వేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ పంటలు సాధారణంగా ఈ ప్రాంతాలకు అనుకూలమైనవి, మంచి దిగుబడులను ఇస్తాయి. రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ, మినుము వంటి పంటలు తక్కువ నీటితో సాగుకు అనుకూలంగా ఉంటాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాలువల నుంచి నీళ్లు విడుదల కావడంతో రైతులు సంతోషించారు. ఈ నీటి సరఫరా వరి సాగును సులభతరం చేసింది. అయితే, వర్షాధారిత సాగు చేసే మెట్ట ప్రాంత రైతులు మాత్రం నిరాశలో మునిగారు. జూన్‌ ‌వారంలో కొద్దిగా వర్షాలు కురిసినప్పటికీ, జూలై 16 వరకు వర్షాలు లేకపోవడంతో వరి నారు ఎండిపోవడం, పత్తి, కంది, మినుము•, వేరుశనగ తదితర విత్తనాలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

జూలై వర్షాలతో కొత్త ఆశలు

జూలై 20 నుంచి కురిసిన భారీ వర్షాలు మెట్ట ప్రాంత రైతులకు ఊపిరి పోశాయి. విత్తనాలు మొలకెత్తడానికి, పంటలు బాగా పెరగడానికి అవసరమైన నీటిని అందించాయి. ఈ భారీ వర్షాలు రైతుల ఆందోళనలను తగ్గించి, సాగు కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఖరీఫ్‌ ‌పంటలు కళకళలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో పాటు బంగాళాఖాతంలో వాయు గుండంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. దీంతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. జులై 17కు ముందు 37.5 శాతంగా ఉన్న వాన లోటు 26 తేదీ నాటికి 18 శాతానికి తగ్గింది. వాయుగుండం ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురియడం దీనికి కార•ణం. విశాఖ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షం లోటు ఉన్నప్పటికీ వరి సాగుకు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతోంది. అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 22-48 శాతం వాన లోటు కొనసాగుతోంది.

ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 31.16 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మిర్చి, చిరుధాన్యాలు సహా వివిధ పంటలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌ ‌పైర్లన్నీ జీవం పోసుకున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు రావడంతో కృష్ణా, గోదావరి, వంశధార ఆయకట్టుల్లో వరి సాగుకు ప్రభుత్వం కాలువల ద్వారా నీటిని విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లో వరి సాగు ముమ్మరంగా సాగుతోంది. కోస్తా, రాయలసీమలో పత్తి సాగు పుంజుకుంది. అయితే వర్షాలు ఆలస్యంగా పడటంతో అపరాల సాగు తగ్గింది. ప్రస్తుత వర్షాలు ఖరీఫ్‌ ‌సాగుకు ఊతమిచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాయలసీమలోని కొన్ని మండలాల్లో సగటు వర్షపాతం తక్కువగా ఉండటంతో మరికొద్ది రోజులు వేచి చూసి, కరవు మండలాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఉద్యమంగా ఉద్యానపంటల సాగు

మరో వైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం నిధుతో రాష్ట్రంలోని అనువైన మెట్టప్రాంతాలలో ఉద్యానపంటల సాగే చేపట్టేలా ఉద్యానశాఖ కృషి చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి లక్ష ఎకరాల్లో మొక్కలు నాటాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 7 లక్షల ఎకరాల్లో మొక్కల నాటారు. 4.65 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరింది. ఈ ప్రోత్సాహంతో లబ్ధిదారుడు 0.25 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు పండ్ల మొక్కలను పెంచవచ్చు. మూడు సంవత్సరాలలో ఎకరానికి రూ.1.09 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందచేస్తుంది. వాటితో భూమి తయారీ, మొక్కలు, ఎరువులు, నీరు తడపడం, కంచె వేయడం వంటి వాటికి ఖర్చు చేయాలి. ఉద్యానశాఖ అధికారులు నాణ్యమైన మొక్కల సరఫరా, సాంకేతిక సహాయం, పెంపకంలో శిక్షణ కూడా అందిస్తారు. మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. మొక్కల మనుగడ 50% కంటే ఎక్కువగా ఉంటేనే ఈ సహాయం కొనసాగుతుంది. గ్రామీణ ఉపాధిని కేవలం తాత్కాలిక కూలీ ఆదాయంగా కాకుండా, పంటల కోత తర్వాత ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.80 వేల నుంచి రూ.లక్షకు పెంచి వ్యవసాయ ఆదాయంగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఆర్థిక ప్రోత్సాహకాల వివరాలు

ఎకరానికి 70 మామిడి మొక్కలు నాటితే ప్రభుత్వం మూడేళ్ల వరకూ ప్రోత్సాహకాలు అందిస్తుంది. రూ.1.10 లక్షల వరకూ సాయం వస్తుంది. ఎకరానికి 100 బత్తాయి మొక్కలు నాటితే… వీటికి మూడేళ్లకు కలిపి రూ.1. 38 లక్షలు ఇస్తుంది. నిమ్మకు ఎకరానికి 110 మొక్కలు నాటితే. రూ.1.46 లక్షలు ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుంది. నాటు జామ ఎకరానికి 110 మొక్కలు నాటితే రూ.1.47 లక్షలు అందుతుంది. సపోట 60 మొక్కలకు రూ. 95 వేలు, నేరేడు 40 మొక్కలకు రూ.69 వేలు వస్తుంది.హైబ్రీడ్‌ ‌చింతకు రూ.69 వేలు వస్తుంది. 240 సీతాఫలం మొక్కలు పెంచితే రూ.1. 68 లక్షలు, డ్రాగన్‌ ‌ఫ్రూట్‌ 900 ‌మొక్కలకు రూ.1.68 లక్షలు అందుతాయి. యాపిల్‌ ‌బేర్‌ 320 ‌నాటితే. రూ. 1.30 లక్షలు, మునగ 448 చెట్లు పెంచితే రెండేళ్ల కాలానికి రూ.1.10 లక్షలు పొందవచ్చు. పొలం చుట్టూ టేకు, మహాగని మొక్కలు నాటితే రూ.26 వేలు వస్తుంది.

ఎరువుల అధిక వినియోగం, కొరత

రాష్ట్రవ్యాప్తంగా రైతులు అధిక దిగుబడుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా యూరియా, ఇతర ఎరువుల కొరత ఏర్పడింది. అధిక ఎరువుల వాడకాన్ని నిరోధించాలని వ్యవసాయాధికారులు ప్రయత్నిస్తున్నా, రైతులు ఈ సలహాలను పట్టించుకోవడం లేదు.పరిమితికి మించి రసాయనిక ఎరువులు వినియోగించవద్దని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా ఫలితం లేదు. ఎడాపెడా రసాయన ఎరువులు వినియోగించడం రెండు విధాలుగా చేటు తెస్తుంది. మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వినియోగం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు రైతుపై అదనంగా పెట్టుబడి భారం పడుతోంది. రాష్ట్రంలో సగటున 36.5 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారని అంచనా. వాటి వినియోగంలో 4 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు అంటే 11 శాతం మేర తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే దిశగా రైతులలో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా లక్ష మెట్రిక్‌ ‌టన్నులు, సేంద్రియ ఎరువులు. వర్మి కంపోస్ట్, ‌పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు తదితర వాటిని నేలకు అందించడంతో మరొక లక్షన్నర టన్నులు, జీవఎరువులు.. నైట్రో బాక్టీరియా ఫాసో బాక్టీరియా, వేప పిండి, నానో యూరియా, నానో డీఏపీ ద్వారా లక్ష టన్నుల వరకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించకుండా రహితంగా నత్రజని సంబంధిత ఎరువు యూరియాను వరి, మొక్కజొన్న పంటలలో ఎక్కువగా వాడటం వల్ల పైర్లలో మెత్తదనం, సున్నితత్వం పెరిగి తెగుళ్లు, పురుగులు ఎక్కువగా ఆశించి పంటలను దెబ్బతీస్తున్నాయి. వాస్తవానికి వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేతల సూచనల మేరకు హెక్టారుకు 140 కిలోల ఎరువులను వినియోగించాలని చెబుతుండగా రైతులు 155 కిలోలు వినియోగిస్తున్నారు. దీంతో పంటలకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా భూసారం దెబ్బతింటోంది. పరిమితికి మించి ఎరువులు వినియోగం కారణంగా రైతులు ఏటా కోట్ల రూపాయిలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. పంటలకు కావాల్సిన పోషకాలు అందాలంటే తగిన మోతాదులో మాత్రమే ఎరువులు వినియోగించాల్సి ఉంది.

భూసార కార్డులున్నా… ఉపయోగంలేదు

రైతులకు తమ పంటపొలాల్లో ఉన్న పోషకాలకు అనుగుణంగా అధికారులు భూసార పరీక్ష కార్డులను ఏటా అందిస్తున్నారు. ముందుగా పంటపొలాల్లో మట్టి నమూనాలను సేకరించి వాటి ఆధారంగా పోషకాలు వినియోగించేలా కార్డులు అందిస్తున్నా… రైతులు వీటిని అనుసరించడంలేదు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులు… తమకున్న అవగాహనతోనే ఎరువులు వినియోగిస్తున్నారు. ఇలా అవసరానికి మించి ఎరువులు వినియోగించడం పంటకు, భూమికి మంచిదికాదంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో రైతులకు ఈ కార్డులు సకాలంలో అందని పరిస్థితి ఉంది. ఈ కారణంగానూ రైతులు తమ పొలాల్లో అధిక ఎరువులు వినియోగానికి కారణమవుతోంది.

అమలుకాని బయోమెట్రిక్‌ ‌విధానం

రైతులు పరిమితిమికి మించి ఎరువులు వినియోగించేందుకు వీలులేకుండా గత ఏడాది ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాల్లో రైతుల వేలిముద్రల ఆధారంగా ఎరువులు అందించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బయోమెట్రిక్‌ ‌యంత్రాలు సైతం వ్యాపారులకు అందించింది. కానీ ఇవి ఆదిలోనే మూలనపడ్డాయి. రైతులకు ఎంత అవసరమైతే అంత మొత్తంలో ఎరువులు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ ఏడాదైనా ఈ విధానం అమలైతే అదనపు ఎరువుల వినియోగానికి అడ్డుకట్టపడుతుంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రైతుల్లో అవగాహన

లక్ష్యాన్ని సాధించే దిశగా రసాయనిక ఎరువులకు ప్రత్నామ్నాయ పద్ధతులను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను కరపత్రాలు, గోడ పత్రికలు, వివిధ ప్రచార సాధనాల ద్వారా, ‘పొలం పిలుస్తోంది’ వంటి కార్యక్రమాల ద్వారా రైతులలో మరింత అవగాహన పెంచేలా అధికారులు కృషి చేస్తున్నారు. సేంద్రియ పదార్థం నేలలకు అందడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం పెరుగడం ద్వారా భూమి గుల్లబారి నీటిని నిల్వ చేసుకుని, పట్టి ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. నేలలో సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది మొక్కలకు కావలసిన ఎంజైములు, హార్మోన్లులను అందించడం వల్ల పంటలకు అందిస్తున్న ఎరువుల సారం మొక్కలకు త్వరగా అందుతుంది. సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు రాకుండా ఉంటాయి. భూసారం మెరుగుపడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి ఎరువులు వినియోగిస్తే ఇటు రైతుకు అటు పంటకు మేలు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE