భారత రాష్ట్ర సమితిగా మారిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి దివాళా తీసిందా? చేసిన తప్పుల నుంచి బయటపడేందుకు ఇతర పార్టీలకు దాసోహం అంటోందా? తమ పార్టీ అధినేతను, అధినేత కుటుంబాన్ని మానసిక ఆందోళన, భయం నుంచి బయటపడేసేందుకు భారీ ఆఫరే ఇచ్చిందా? అయినా.. వాళ్లకు ఊహించని పరాభవం ఎదురైందా? తమ ప్రతిపాదన తిరస్కరణతో బీఆర్‌ఎస్‌ ‌కీలక నేతల మైండ్‌ ‌బ్లాంక్‌ అయిపోయిందా?తాజా పరిణామాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలే ఇస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చను లేవనెత్తుతున్నాయి.

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇప్పుడు విలీన వివాదంలో చిక్కుకుంది. బీజేపీ లోక్‌సభ సభ్యుడు సీఎం రమేష్‌ ‌చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు తన ఇంటికి వచ్చి ‘అవినీతి, అక్రమాలకు సంబంధించిన అభియోగాలను కప్పిపుచ్చేందుకు తమ పార్టీని బీజేపీలో విలీనానికి ప్రతిపాదన చేశారు’ అని సీఎం రమేష్‌ ఆరోపించారు. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో కవితను జైలు నుంచి విడుదల చేయించాలని, ఆ కేసు నుంచి తప్పించాలని కోరుతూ, కేటీఆర్‌ ‌స్వయంగా తమ ఇంటికి వచ్చి విజ్ఞప్తి చేశారని, ఈ అంశాలపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలని బతిమిలాడారని ఎంపీ రమేష్‌ ‌చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. బీఆర్‌ఎస్‌ అవినీతి పాలన అని అప్పటి ప్రభుత్వ పనితీరుపై విపక్షాల విమర్శలు కొత్తేమీ కాదు. అయితే, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ‌నేరుగా కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘‘కేటీఆర్‌ ‌మా ఇంటికి వచ్చి కాళ్లావేళ్లా పడ్డాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ‌కూడా ఉంది. కవితను లిక్కర్‌ ‌కేసు నుంచి బయటకు తీసుకురావాలని, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమని బతిమిలాడాడు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కేటీఆర్‌కు సంబంధించిన బండారమే కాదు.. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో రూ. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఎలా మాఫియా స్టైల్‌లో పంచారో కూడా బయటపెడతానని రమేష్‌ ‌హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను దీనిపై చర్చకు సిద్ధమని, తెలంగాణ భవన్‌ ‌కానీ, ప్రెస్‌క్లబ్‌ ‌కానీ ఎక్కడికైనా రావచ్చని సవాల్‌ ‌విసిరారు.

 కేటీఆర్‌ ఆరోపణలు బూమరాంగ్‌

‌వాస్తవానికి, కేటీఆర్‌ ‌చేసిన ఆరోపణలే ఆయనకు బూమరాంగ్‌ అయ్యాయి. తెలంగాణలో ఫ్యూచర్‌ ‌సిటీ కాంట్రాక్టుల వ్యవహారంలో చేసిన ఆరోపణలకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ‌గట్టిగా సమాధానం ఇచ్చారు. హెచ్‌సీయూ భూముల విషయంలో రేవంత్‌ ‌సర్కారుకు ఎంపీ రమేశ్‌ ‌రూ.10 వేల కోట్ల రుణం ఇప్పించారని, ఇందుకు ప్రతిఫలంగా రమేశ్‌కు చెందిన రిత్విక్‌ ‌కన్‌‌స్ట్రక్షన్స్‌కు ఫ్యూచర్‌ ‌సిటీలో రూ.1,660 కోట్ల విలువైన రహదారుల పనులను రేవంత్‌ ఇచ్చారంటూ కేటీఆర్‌ ఆరోపించారు. దానికి సీఎం రమేశ్‌ ‌ప్రతిస్పందిస్తూ,‘ పదేళ్ల పాటు ప్రభుత్వంలోనే ఉన్నావు. మంత్రిగా కూడా చేశావు కదా? రూ.5 లక్షలకు మించిన పనులు నామినేషన్‌ ‌పద్ధతిలో ఇస్తారా? ఇవ్వరా? ఈ నిబంధనలు కూడా తెలియని అజ్ఞానివా?’ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్‌ ఇలా బురదజల్లాలని యత్నించడానికి కుటుంబ సమస్యలే కారణమనిపిస్తోందని అన్నారు. ఆంధప్రదేశ్‌లో జగన్మోహన్‌ ‌రెడ్డికి ఆయన సోదరితో ఎదురవుతున్న ఇబ్బందులే, తెలంగాణలో కేటీఆర్‌కూ తప్పడంలేదని , ఆ అంశం నుంచి జనం దృష్టి మళ్లించడానికి తనపైనా, రేవంత్‌రెడ్డిపైనా కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నార•ని రమేష్‌ ‌మండిపడ్డారు. రోడ్‌ ‌వర్క్ ‌టెండర్లు పక్రియ పూర్తిగా సర్వ సామాన్యంగా జరిగిందని స్పష్టం చేశారు. తాను రిత్విక్‌ ‌ప్రాజెక్టస్‌లో తాను డైరెక్టర్‌ను కూడా కాదని, మేనేజ్‌మెంట్‌లో కూడా లేనని ఆయన చెప్పారు.

ఫ్యూచర్‌ ‌సిటీలో రోడ్డు కాంట్రాక్ట్‌ను ఆంధ్రా బీజేపీ ఎంపీకి ఇచ్చారని, తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా అని కేటీఆర్‌ అం‌టున్నారని, ‘పదేళ్ల పాటు.. కేటీఆర్‌ ‌ప్రభుత్వంలో ఉన్నారు. అప్పట్లో అన్ని డిపార్ట్‌మెంట్లలో కలిపి రూ. ఆరేడు లక్షల కోట్ల పనులు జరిగితే, ఒక్క కాళేశ్వరానికే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారు. అలాంటివి ఎన్నో పనులు చేశారు. ప్రభుత్వం నామినేషన్‌పై రూ.5 లక్షలకు మించి పనులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. మరి మీ ప్రభుత్వం ఆ పనులన్నీ ఎవరికి ఇచ్చింది’ అనే దానికి కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి తనకు స్నేహితుడు కనుక, పనులు ఇచ్చినట్లు కేటీఆర్‌ అం‌టున్నారని, అయితే సీఎం ఒక కంపెనీకి రూ.1,660 కోట్ల విలువైన పనులు వర్క్ ‌నామినేషన్‌పై ఇవ్వగలరా? రమేష్‌ ‌నిలదీశారు.

సీసీఫుటేజ్‌ ‌రట్టు చేయనా? సీఎం రమేష్‌

‘‌కేటీఆర్‌..! ‌మీ చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది నిజం కాదా? వచ్చి ఏం చెప్పావో మరిచిపోయావా? మీ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటకు రాకుండా చూడాలని, సీబీఐ, ఈడీ దాడులు చేయొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని.. ఇందుకోసం బీజేపీలో చేరుతామని కాళ్లా వేళ్లా పడ్డది వాస్తవం కాదా? అదంతా మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. బయటకు తీయమంటావా?’ అని ఎంపీ రమేశ్‌ ‌నిలదీశారు. ‘‘మేం ఇబ్బందుల్లో ఉన్నాం. మా నాన్న ఆరోగ్యం బాగాలేదు..మధనపడిపోతున్నారు. నువ్వు సాయం చెయ్యి. లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు బెయిల్‌ ‌వచ్చేలా చూడు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు అమిత్‌ ‌షా సహా పార్టీ పెద్దలతో మాట్లాడు’’ అని కేటీఆర్‌ ‌తనను ప్రాధేయపడ్డాడని, అప్పుడు తాను బీజేపీ పెద్దలతో మాట్లాడానని చెప్పారు. కానీ, ‘బీఆర్‌ఎస్‌ ‌పతనమైన పార్టీ అని, అదో అవినీతి పార్టీ అని, దానితో కలిసేదే లేదని బీజేపీ అధిష్టానం తెగేసి చెప్పింది. ఇదే విషయం కేటీఆర్‌కు చెప్పాను. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు’’ అని సీం రమేష్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. తన ఇంటికి వచ్చిన సమయంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను నోటికొచ్చినట్లు తిట్టాడని, అవమానకరంగా మాట్లాడాడని సీఎం రమేష్‌ ‌చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులను ఎందుకు దూరం చేసుకున్నారని తాను అడిగితే ‘చంద్రబాబు నాయుడు కమ్మ. వాళ్లు మాకు అవసరం లేదని అన్నావు. అప్పుడు కొంచెం నోరు తగ్గించుకుని మాట్లాడమని నేను చెప్పాను’ అని రమేష్‌ ‌గుర్తు చేశారు. రెడ్లను నమ్మితే ప్రభుత్వం మారిన మరుసటి రోజే పోయారని వారిని కూడా తిట్టారని, రాజకీయాల్లో దీర్ఘకాలం ఉండాలంటే ఇలా మాట్లాడటం సరికాదని తాను హితబోధ చేశానని పేర్కొన్నారు. ‘అప్పుడు కూడా రేవంత్‌ ‌రెడ్డిని చూసి రెడ్లు పోయారు. చంద్రబాబు నాయుడును చూసి కమ్మ వాళ్లు పోయారు. మా బీఆర్‌ఎస్‌కు మిగిలింది జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఒక్కడే . జగన్‌ ‌కోసం ఉంటాం’ అనీ చెప్పాడు అని అని రమేష్‌ ‌గుర్తు చేశారు. కేటీఆర్‌ ‌తన గురించి మాట్లాడాడు కాబట్టే ప్రైవేట్‌ ‌సంభాషణలనైనా బయటకు చెప్పవలసి వచ్చిందని, కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేటీఆర్‌కు జ్ఞాపకాలు గుర్తు చేసిన బండి సంజయ్‌

ఈ అం‌శంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కూడా స్పందించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీ నాయక•లు లేరని, అది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. పార్టీని నడపలేకనే బీజేపీలో విలీనం చేస్తామన్నారని ఆరోపించారు. ‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్‌ ఇప్పించాలని సీఎం రమేశ్‌ని కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్‌ ‌టికెట్‌ ఇప్పించారు. ఆర్థికసాయం కూడా చేశారు. రమేశ్‌ ‌సవాల్‌పై కేటీఆర్‌ ‌చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు. .

 ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ ‌కూతురు, కేటీఆర్‌ ‌సోదరి కల్వకుంట్ల కవిత రెండు నెలల క్రితమే ఈ ప్రస్తావన చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత..ఆమె మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలని 101 శాతం ప్రయత్నించారంటూ బాంబు పేల్చారు. అయితే, తాను మాత్రం ఒప్పుకోలేదని, అవసరమైతే జైలులోనే ఉంటాను కానీ, పార్టీని విలీనం చేయొద్దని చెప్పానన్నారు. ‘నన్ను జైలు నుంచి విడిపించే సాకుతో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు పన్నారు. ఆ పని చేయవద్దని నా తండ్రికి తేల్చి చెప్పాను. అవసరమైతే ఇంకొన్నాళ్లు జైలులోనైనా ఉంటాను గానీ.. బీజేపీలో విలీనాన్ని ఒప్పుకోబోనని స్పష్టం చేశాను. నా తండ్రి గట్టిగానే ఉన్నా.. కొందరు కావాలనే బీజేపీలో విలీనానికి ప్రయత్నించారు’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత పరోక్షంగా వ్యాఖ్యానించారు. అప్పుడు కవిత వ్యాఖ్యలు అంత సీరియస్‌గా వైరల్‌ ‌కాలేదు కానీ, ఇప్పుడు కేటీఆర్‌ ఆరోపణలతో సీఎం రమేష్‌ అసలు విషయం బయటపెట్టడం బీఆర్‌ఎస్‌ ‌నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అవుతోంది.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. బీఆర్‌ఎస్‌ ‌క్రమంగా కోలుకోలేనంతగా పతనం దిశగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. విలీనంపై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్లు మౌనంగా ఉండటం, లోపల మాత్రం తీవ్రంగా మధనపడటం పార్టీలో అస్థిరతకు సంకేతంగా మారింది. పైగా, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం, అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ ఎ‌ర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం నాయకత్వం శక్తి క్షీణతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మరోవైపు.. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగబోదని సీఎం రమేష్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాల కోసం సిద్ధంగా ఉండమని సూచించారు. మొత్తానికి, ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్‌ ‌తమ ప్రజాప్రతినిధులను, సిద్ధాంతాలను ఎలా పణంగా పెట్టిందో అన్నదానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. కేవలం కుటుంబ భద్రత, వ్యాపార లావాదేవీలు, అక్రమాల నుంచి బయటపడే ఆలోచనలు వెరసి.. బీఆర్‌ఎస్‌ ‌నాయకుల వ్యూహాల్లో తెలంగాణ ప్రజల నమ్మకం కూడా తుడిచిపెట్టుకు పోయిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సుజాత గోపగోని

సీనియర్‌ ‌జర్నలిస్ట్,

About Author

By editor

Twitter
YOUTUBE