భారత్‌-‌యు.కెల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు  కుదిరింది. దీన్నే సంక్షిప్తంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం- ఎఫ్‌టీఏ అని వ్యవహరిస్తున్నారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 112 బిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లాలన్నది ఈ వాణిజ్య ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌ ‌పరంగా చూస్తే యూరప్‌ ‌దేశాలతో కుదుర్చుకున్న రెండో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమిది. మొదటిది యూరోపియన్‌ ‌ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌తో (ఐస్‌ల్యాండ్‌, ‌లీచ్‌టెన్‌స్టైన్‌, ‌నార్వే, స్విట్జర్లాండ్‌) ‌కుదిరిన ఒప్పందం కాగా, రెండవది ప్రస్తుతం యు.కె.తో కుదుర్చుకున్నది.

ఐరోపా సమాఖ్య దేశాల కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లండ్‌ ‌కుదుర్చుకున్న మూడో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమిది. ఈ ఒప్పందం ప్రకారం మనదేశం నుంచి బ్రిటన్‌ ‌దిగుమతి చేసుకునే వస్తువుల్లో 99% వరకు ఎటువంటి సుంకాల విధింపు ఉండదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 56 బిలియన్‌ ‌డాలర్ల వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. జులై 24న ఇరుదేశాల ప్రధానులు నరేంద్రమోదీ, కెయిర్‌ ‌స్టార్‌మెర్‌ ‌సమక్షంలో లండన్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మనదేశ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌, ‌యు.కె. వాణిజ్యశాఖ మంత్రి జొనాథన్‌ ‌రేనాల్డస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎఫ్‌టీఏపై గత మూడేళ్లుగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఒప్పందం ద్వారా భారతీయ యువతకు నైపుణ్యాభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడటంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మేనేజ్‌మెంట్‌ ‌కన్సల్టెన్సీ, ఆర్కిటెక్చరల్‌, ఇం‌జినీరింగ్‌ ‌రంగాల్లో మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ ఎఫ్‌టీఎ ఎంతగానో దోహదపడ గలదు. అంతేకాదు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బ్రిటన్‌లో తమ కెరీర్‌ను వృద్ధి చేసుకోవాలనకునేవారికి ఎఫ్‌టీఏ మంచి ప్రోత్సాహాన్నిస్తుంది.

భారత్‌ ఒకవైపు యూరోపియన్‌ ‌యూనియన్‌ -ఈయూ, యు.ఎస్‌.‌లతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తునే మరోవైపు యు.కె.తో ఎఫ్‌టీఏ కుదర్చుకోవడం గమనార్హం. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లోకి ప్రవేశించేందుకు ఈయూ, అమెరికాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొత్తంమీద పరిశీలిస్తే ఎఫ్‌టీఏకు లోబడి భారత్‌ ‌నుంచి యు.కె. దిగుమతి చేసుకునే 90శాతం వస్తువులపై సగటున సుంకాలను 15% నుంచి 3%కు తగ్గించడం గమనార్హం. స్కాచ్‌ ‌విస్కీపై విధిస్తున్న టారిఫ్‌ ‌సగానికి సగం తగ్గించడం మద్యపాన ప్రియులకు ఆనందం కలిగించవచ్చు. వచ్చే పదేళ్లకాలంలో ఈ టారిఫ్‌ ‌మరో 40% తగ్గనుంది. జర్మనీ వంటి యూరోపియన్‌ ఎగుమతిదారులతో సమానంగా మన వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల విధింపు, వస్త్రాలు, తోళ్ల ఉత్పత్తులపై సుంకాలు ఎత్తేయడం వల్ల బాంగ్లాదేశ్‌, ‌కంబోడియా వంటి దేశాలకు మనదేశం గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఈ ఒప్పందం వల్ల మనదేశానికి చెందిన తోళ్లపరిశ్రమకు వచ్చే రెండేళ్ల కాలంలో అదనంగా 5% యు.కె.మార్కెట్‌ అం‌దుబాటులోకి రాగలదని అంచనా. 2030 నాటికి ఎలక్ట్రానిక్స్, ఇం‌జినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు కూడా రెట్టింపు కాగలవు. రసాయనాల ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 30% నుంచి 40% వరకు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు వచ్చే మూడేళ్లకాలంలో రెట్టింపునకు చేరుకుంటాయని అంచనా. ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తర్వాత వార్షికంగా యు.కె.కు వెళ్లే సాఫ్ట్‌వేర్‌ ‌నిపుణుల సంఖ్య మరో 20% పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భారత్‌కు, బ్రిటిష్‌ ఉత్పత్తుల ఎగుమతులు 60% వరకు పెరుగుతాయని యు.కె. అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రిటిష్‌ ‌కంపెనీలు మనదేశంలో నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం కూడా ఆ దేశానికి కలిసొచ్చే అంశమే. ఎఫ్‌టీఏను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ఆమోదం కూడా దీనికి అవసరం. దీంతో పాటు రెండు దేశాల మధ్య మరో ద్వైపాక్షిక ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతుండటం విశేషం.

యు.కె.నుంచి దిగుమతులు

ఎఫ్‌టీఏ ప్రకారం యు.కె.నుంచి మనదేశానికి దిగుమతి అయ్యేవాటిల్లో శీతల పానీయాలు, చాక్లెట్లు, బిస్కెట్లు మొదలైనవి తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. వెండిపై దిగుమతి సుంకం వచ్చే పదేళ్లకాలంలో క్రమంగా తొలగిస్తారు. లెన్సెస్‌, ‌మైక్రోస్కోప్‌లపై విధిస్తున్న 11% సుంకాలు, వైద్య, మెడిటెక్‌ ఉపకరణాలపై విధిస్తున్న 13.75% సుంకాలు, సబ్బులు, పర్‌ఫ్యూమ్‌లు, నెయిల్‌పాలిష్‌ ‌వంటి వాటిపై విధిస్తున్న 10% సుంకాలు రద్దవుతాయి. విద్యుత్‌ ‌వాహనాలకు కొన్ని ప్రత్యేక కోటాలపై 110% నుంచి 10%కు సుంకాలు తగ్గుతాయి. అదేవిధంగా రోల్స్ ‌రాయిస్‌, ‌ల్యాండ్‌ ‌రోవర్‌, ‌బెన్‌ట్లీ, ఆస్టన్‌ ‌మార్టిన్‌ ‌వంటి వాహనాల ధరలు తగ్గుతాయి. వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌ ఉపకరణాల విషయంలో వినియోగదారులు, పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. బ్రిటన్‌ ‌నుంచి భారత్‌ ‌దిగుమతి చేసుకునే స్కాచ్‌ ‌విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్‌ 150% ‌నుంచి 75%కు తగ్గించడం వల్ల వీటి ధరలు బాగా తగ్గనున్నాయి. రాబోయే పదేళ్లకాలంలో ఈ సుంకాలను 40%కు తగ్గిస్తారు. దీంతో మనదేశ వినియోగదారులకు మరింత తక్కువ ధరకే విస్కీ లభించే అవకాశముంది. ఆల్కాహాలిక్‌ ‌బేవరేజెస్‌పై సుంకాల తగ్గింపు వల్ల అంతర్జాతీయ బ్రాండ్‌లు మన వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లో లభించనున్నాయి. బాటిల్‌ ‌ధరపై రూ.300 పరిమితి విధించడం వల్ల ఈ ప్రయోజనాలు పరిమితిలోనే ఉంటాయనేది నిపుణులు చెబుతున్న మాట! ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్‌ ‌కంపెనీలు భద్రతాపరంగా సున్నితమైన పనులను మినహాయించి ఇతరాలపై రెండు బిలియన్‌ ‌డాలర్ల వరకు టెండర్లలో పాల్గొనవచ్చు. అంటే ఏటా మనదేశంలో యు.కె. 40వేల విలువైన టెండర్లలో పాల్గొనడానికి వీలవుతుంది. వీటి మొత్తం విలువ రూ.4.09 లక్షల కోట్లు! ఎఫ్‌టీఏ నేపథ్యంలో 6 బిలియన్‌ ‌పౌండ్ల పెట్టుబడులు బ్రిటన్‌కు రానున్నాయి. వీటివల్ల యు.కె. వ్యాప్తంగా 2200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. యు.కె.కు చెందిన కార్మికులకు ఏటా 2.2 బిలియన్‌ ‌పౌండ్ల మేర వేతనాలు పెరుగుతాయి. వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు, పాదరక్షలు వంటివి బ్రిటన్‌ ‌పౌరులకు తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.

భారత్‌ ‌నుంచి ఎగుమతులు

భారత్‌ ‌నుంచి నూటికి నూరుశాతం ఎగుమతులపై బ్రిటన్‌ ఏ ‌విధమైన సుంకాలు విధించదు. వీటిల్లో వస్త్రాలు, పాదరక్షలు, 95% వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ రసాయనాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు ఉన్నాయి. ఏటా భారత్‌ ‌నుంచి యోగా, చెఫ్‌లు వంటి 1800 మంది సాంస్కృతిక, వెల్‌నెస్‌ ‌రంగాలకు సంబంధించిన నిపుణులను యు.కెలో పనిచేయడానికి అనుమతిస్తారు. నర్సులు, ఆర్కిటెక్ట్‌లు ఇతర నిపుణులను గుర్తిస్తారు. బ్రిటన్‌లో సంస్థలను నడుపుతూ, ఫ్రీలాన్సర్లుగా ఉంటున్నవారికి అక్కడి 36 రకాల సేవారంగాలు అందుబాటులోకి వస్తాయి. 35 రంగాలకు సంబంధించిన భారతీయ నిపుణులు ఇంగ్లండ్‌లో ఇక రెండేళ్లపాటు పనిచేయవచ్చు. దీనివల్ల ఏటా 60వేలమంది ఐ.టి. నిపుణులకు ప్రయోజనం ఉంటుందని వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. టీసీఎస్‌, ‌టెక్‌మహేంద్ర, ఇన్ఫోసిస్‌, ‌హెచ్‌సీఎల్‌, ‌విప్రో వంటి సంస్థలకు ఇది ప్రయోజనకరం కాగలదు.ఈ ఒప్పందం ప్రకారం భారతీయ నిపుణులకు మూడేళ్లపాటు యు.కె.సామాజిక భద్రత చెల్లింపు నుంచి మినహాయింపునిస్తారు.

2022లో చర్చలు ప్రారంభం

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య 2022 జనవరిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే 6వ తేదీ నాటికి ఈ చర్చలు ముగిసి ఒప్పందం కోసం ఒక సూతప్రాయ అంగీకారానికి రాగా, జులై 24న సంతకాలు జరిగాయి. మే, 2021 లో అప్పటి బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌, ‌మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయినప్పుడు రెండు దేశాలమధ్య మరింత లోతైన సంబంధాలు కొనసాగించడానికి ఒక అంగీకారానికి వచ్చారు. ఫలితంగా ఇరుదేశాలమధ్య అడ్డంకులు తొలగిపోతూ ఎఫ్‌టీఏకు దారితీసాయి. జనవరి, 2022లో ఎఫ్‌టీఏపై చర్చలు మొదలయ్యాయి. చర్చలు అదే ఏడాది దీపావళి పండుగలోగా పూర్తికావాలని బోరిస్‌ ‌జాన్సన్‌ అన్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో బ్రిటన్‌ ‌మంత్రి కెమి బెడనోచ్‌ ‌మాట్లాడుతూ ‘‘మాకు చర్చలు ఎంత వేగంగా ముగిసాయన్నది కాదు, ఎంత నాణ్యవంతంగా జరిగాయన్నది ప్రధానం’’ అని అన్నారు.డిసెంబర్‌, 2023‌నాటికి 13 రౌండ్ల చర్చలు జరిగాయి. 2024లో రెండు దేశాల్లో ఎన్నికల కారణంగా చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అయితే చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. నిపుణులకు వీసాలివ్వాలని భారత్‌ ‌చేస్తున్న డిమాండ్‌పై ప్రతిష్టంభన ఏర్పడింది. జనవరి 10, 2024న 14వ రౌండ్‌ ‌చర్చలు మొదలయ్యాయి. యు.కె.లో భారతీయ కార్మికులకు సామాజిక భద్రతా చెల్లింపులకు భారత్‌ ‌చేసిన డిమాండ్‌ ‌ను కెమి బెడనోచ్‌ ‌నిరాకరించారు. మార్చి నెలలో మళ్లీ చర్చలు జరిగాయి. ఎఫ్‌టీఏకు ముందు ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని బ్రిటన్‌ ఒత్తిడి తెచ్చింది. బ్రిటన్‌ ‌వాణిజ్యవేత్తలు మనదేశంతో కుదుర్చుకునే ఎఫ్‌టీఏ అంత ప్రయోజనకరం కాదన్నారు. బదులుగా గల్ఫ్ ‌కోఆపరేషన్‌ ‌కౌన్సిల్‌తో ఒప్పందం మంచిదన్నారు.

భారత ప్రభుత్వం ఎన్నికలపై దృష్టి పెట్టడంతో 14వ రౌండ్‌ ‌చర్చలు నిష్ఫలమయ్యాయి. మార్చి 12, 2024న ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్‌ ‌ప్రధాని రిషి సునాక్‌లు ఫోన్‌లో మాట్లాడారు. చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అయితే భారత్‌లో ఎన్నికలు ముగిసేవరకు చర్చలు తాత్కాలికంగా నిలిచి పోయాయి. ఏప్రిల్‌ ‌ప్రారంభంలో మనదేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త ప్రభుత్వం పదవీ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోగా ఎఫ్‌టీఏ చర్చలు కొలిక్కి రావాలనేది తమ అజెండా అని స్పష్టం చేసింది. యు.కె. విధిస్తున్న కార్బన్‌ ‌ట్యాక్స్ ‌నుంచి మినహాయింపు, భారత కార్మికులకు వీసాల జారీలో రాయితీలు, సామాజిక భద్రత ఒప్పందం కోసం భారత్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. మే 28, 2024న మనదేశానికి చర్చలకు రావలసిన బ్రిటిష్‌ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం యు.కె.లో ఎన్నికల కారణంగా రాలేదు. తర్వాత ఎఫ్‌టీఏకు సంబంధించి వస్తుసేవలు, పెట్టుబడులు, మేధోసంపత్తి హక్కులు వంటి వాటితో సహా 26 చాప్టర్లపై చర్చలు పూర్తయ్యాయి. రూల్స్ ఆఫ్‌ ఆరిజిన్‌ (ఒక వస్తువు ఉత్పత్తి అయ్యే దేశానికి వర్తింపజేసే నిబంధనలు. ‘ఆర్థిక జాతీయత’ను ఈ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు), విద్యుత్‌ ‌వాహనాలపై విధించే సుంకాలపై రాయితీలు, స్కాచ్‌ ‌విస్కీ, సామాజిక భద్రత ఒప్పందం, కార్బన్‌ ‌బోర్డర్‌ ‌ట్యాక్స్, ఆర్థిక సేవల సరళీకరణ వంటి అంశాలు, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం అపరిష్కృతంగానే ఉండిపోయాయి.

కొత్త ప్రభుత్వాల నేతృత్వంలో ఓ కొలిక్కి

జూన్‌ 4, 2024 ‌నాటికి మళ్లీ నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పా టు కావడాన్ని, యు.కె. వ్యూహాత్మక నిపుణులు, ఎన్నికల పరిశీలకులు ఒక సానుకూల పరిణామంగా చూశారు. జూన్‌ 14, 2024‌న 50వ జి7 సదస్సులో ప్రధాని మోదీ, యు.కె. ప్రధాని రిషి చర్చలను ఒక కొలిక్కి తేవాలని నిర్ణయించారు. తర్వాత బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో సర్‌ ‌కెయిర్‌ ‌స్టార్మర్‌ ‌ప్రధాని అయ్యారు. ఇద్దరు ప్రధానులు ఫోన్‌లో మాట్లాడుకొని ఎఫ్‌టీఏను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. 2024లో రియో డి జెనైరోలో జీ20 సదస్సులో మోదీ, స్టార్మర్‌లు చర్చల పున:ప్రారంభానికి నిర్ణయించారు. జనవరి 14, 2025న చర్చలు మొదలయ్యాయి. 90శాతం వాణిజ్య ఒప్పందం పూర్తయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏ‌ప్రిల్‌ 9‌న ప్రకటించారు. వలస కార్మికుల వీసాలపై ఒక అంగీకారానికి వచ్చారు. విస్కీ, విద్యుత్‌ ‌కార్లు, ఔషధాలపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు మే 6న ఎఫ్‌టీఏపై ఒక అంగీకారానికి వచ్చామని మోదీ ప్రకటించడంతో కథ సుఖాంతమైంది.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE