భారత విదేశాంగ విధానం భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంతోనే రూపురేఖలను సంతరించుకుంటూ వచ్చింది.కాంగ్రెస్‌ 1925లో మొట్టమొదటిసారి విదేశాంగశాఖను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రోద్యమం గురించి, భారతీయుల సహజ హక్కు గురించి విదేశాలకు వెల్లడిరచడం దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తి కలిగిన జవాహర్‌లాల్‌ నెహ్రూ మన విదేశాంగ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌, యునైటెడ్‌ నేషన్స్‌కు మనదేశం వ్యవస్థాపక సభ్యురాలు కూడా! స్వాతంత్య్రానంతరం కామన్‌వెల్త్‌ దేశాల్లో సభ్యురాలిగా చేరిన భారత్‌, ఇండొనేషియన్‌ నేషనల్‌ రివల్యూషన్‌ వంటి ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది.1950 దశకంలో నైతికంగా మనదేశ ప్రతిష్ట అత్యున్నతస్థాయిలో ఉండటంతో, తూర్పు, పశ్చిమ దేశాల నుంచి మంచి సహకారం అందింది. ముఖ్యంగా అలీనవిధానాన్ని అనుసరిస్తూ, ప్రపంచంలోని ఇతరదేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో, అప్పటి మన దౌత్యవేత్తలు జాగ్రత్తగా మన విదేశాంగ విధానాన్ని నడిపినప్పటికీ, ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలను నిలువరించ లేకపోయారు. ముఖ్యంగా దక్షిణాసియా కూడా ఈ ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల్లో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. నెహ్రూ కశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించడం ద్వారా చేసిన తప్పిదానికి ఇప్పటికీ భారత్‌ మూల్యం చెల్లిస్తూనే ఉంది.

అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధం మన విదేశ వ్యవహారాలను బాగా ప్రభావితం చేశాయి. మన విదేశాంగ మంత్రులంతా నెహ్రూ, స్వరణ్‌సింగ్‌, వైబీ చవాన్‌, ఏబీ వాజపేయి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్‌, నట్వర్‌సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీ, జస్వంత్‌సింగ్‌, సుష్మ స్వరాజ్‌ వంటి వారంతా కొద్ది మార్పులతో సంప్రదాయకమైన పద్ధతిలోనే వెళ్లారు. ప్రస్తుతం ఎస్‌ జైశంకర్‌ ఆ శాఖను సమర్ధంగా నిర్వహిస్తున్నారు. దేశంలో శశి థరూర్‌ వంటి నిపుణులు ఉన్నారు.

1960-70 మధ్యకాలంలో పాకిస్తాన్‌, చైనాలతో యుద్ధాలు, దక్షిణాసియా దేశాలతో నెలకొన్న వివాదాలు మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఈ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా, చైనాలు నిలవడంతో, ఇందుకు ప్రతిక్రియగా నాటి యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌తో ‘‘ఇండో సోవియట్‌ ట్రీటీ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ అండ్‌ కోఆపరేషన్‌’’ పేరుతో 1971 ఆగస్టు నెలలో ఒక ఒప్పందంపై మనదేశం సంతకాలు చేసింది. తర్వాత యుఎస్‌ఎస్‌ఆర్‌ అందించిన ఆర్థిక, సైనిక సహకారంతో మనదేశం క్రమంగా పటిష్టమైన స్థితికి చేరుకున్న నేపథ్యంలో, అఫ్ఘానిస్తాన్‌లో రష్యా సైనికుల ప్రవేశాన్ని మనదేశం ఖండిరచలేని స్థితిలో మౌనం వహించడం పశ్చిమదేశాలకు ఆగ్రహం కలిగించింది. 1980 చివరి ప్రాంతంలో మనదేశం అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో మన సంబంధాలు క్రమంగా మెరుగుపడటం మొదలైంది. ఇదే సమయంలో యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌, చైనాలతో కూడా మన స్నేహం కొనసాగింది. ఇక దక్షిణాసియా దేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌ దేశాలతో వ్యవహరించడంలోనే మన విదేశాంగశాఖ అత్యధిక దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది.

ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత

1991లో సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ప్రచ్ఛన్నయుద్ధం ముగిసి, ఏకధ్రువ ప్రపంచం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో మన విధానంలో మార్పులు తప్పలేదు. ముఖ్యంగా అమెరికాతో ఆర్థిక, దౌత్య సంబంధాల బలోపేతానికి కృషి జరిగింది. అంతమాత్రాన ఇది అమెరికా వైపు మొగ్గు కాదు. ఇదే సమయంలో యూరోపియన్‌ యూనియన్‌ వాణిజ్య విభాగం, జపాన్‌, ఇజ్రాయెల్‌, మెక్సికో, బ్రెజిల్‌ వంటి దేశాలతో స్నేహసంబంధాలను ప్రారంభించింది. ఆగ్నేయాసియా దేశాల సంఘం, ఆఫ్రికన్‌ యూనియన్‌, అరబ్‌ లీగ్‌, ఇరాన్‌ దేశాలతో కూడా తన స్నేహాన్ని క్రమంగా విస్తరించింది. విచిత్రంగా రష్యాతో మొదట్నుంచీ మనకు సైనికపరంగా ఎంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ మనకు రెండో అతిపెద్ద సైనిక భాగస్వామిగా మారడం విశేషం. ఇక అమెరికాతో మన వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా, నరేంద్ర మోదీ హయాంలో ఆసియన్‌ ప్రాంతాలపై వాణిజ్యపరంగా దృష్టిని కేంద్రీకరించడం కీలకం.

తొలి ప్రధానిగా, విదేశాంగశాఖను కూడా నెహ్రూయే నిర్వహించారు. పంచశీల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెహ్రూ తర్వాతికాలంలో వచ్చిన ప్రధానులు కూడా, విదేశాంగ శాఖ మంత్రి ఉన్నప్పటికీ అంతర్జాతీయ వ్యవహారాల్లో వారే కీలక నిర్ణయాలు తీసుకునేవారు. భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రధాని సెక్రటేరియట్‌ను మరింత విస్తరించారు. క్రమంగా 1970 నాటికి ప్రధాని కార్యాలయం ‘సూప్రా`మినిస్ట్రీ’గా వ్యవహరించడం మొదలైంది. విదేశాంగశాఖ అధికార్లతో పాటు, ప్రధాని కార్యాలయ అధికార్లు కూడా తాము సేకరించిన సమాచారం ఆధారంగా ప్రధానమంత్రికి సలహాలిచ్చేవారు. రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) కూడా విదేశాల్లో నిర్వహించే తమ కార్యకలాపాలపై నేరుగా ప్రధానికే నివేదించడం మొదలైంది. విదేశాంగ విధానంపై గట్టి నియంత్రణ, సలహాదారులపై పూర్తిగా ఆధార పడటం ఇందిరాగాంధీ హయాంలో (1966`77, 1980`84) చాలా అధికంగా ఉండేది. తర్వాత అధికారంలో కి వచ్చిన ఆమె తనయుడు రాజీవ్‌ గాంధీ (1984`89) కాలంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ప్రధాని నియంత్రణ కొంత బలహీన పడిరదనే చెప్పాలి. అయితే విదేశీ వ్యవహారాలపై నిర్ణయాలను ప్రధాని లేదా ప్రధాని కార్యాలయం లేదా మంత్రిమండలి, ఎవరు తీసుకునేవారనేది చెప్పడం కష్టం. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అప్పటికి రాబోయే పదేళ్ల కాలంలో చోటుచేసుకునే ‘గ్లోబల్‌ స్ట్రాటిజిక్‌ డెవలప్‌మెంట్స్‌’ను అంచనా వేసేందుకు ఒక టాస్క్‌ ఫోర్స్‌ను నియమిం చడం ఇందుకు ఉదాహరణ. దీనికి కె. సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించారు. దీని నివేదికను ఇప్పటివరకు బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయ్యాక మనదేశం దాదాపుగా అలీనవిధానానికి దూరం జరిగిందనే చెప్పాలి.

గణతంత్ర భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచంలోని 201 దేశాలతో సంబంధాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో పాలస్తీనా, హోలీ సీ (దీన్నే సీ ఆఫ్‌ రోమ్‌, పెట్రైన్‌ సీ, అపోస్టోలిక్‌ సీ అని కూడా అంటారు. ఇది కేథలిక్‌ చర్చి, వాటికన్‌ సిటీ కేంద్ర పాలనా సంస్థ), నియు (దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న స్వయం పాలిత ద్వీప దేశం, న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా సంబంధాలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్‌ ద్వీపం)లతో కూడా మనదేశం సంబంధాలను నెరపుతోంది. ప్రపంచంలో అత్యధిక సైనికవ్యయం చేసే దేశాల్లో మూడోస్థానం, సైనిక దళాల పరంగా రెండోస్థానం, జీడీపీ పరంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కొనుగోలు శక్తిపరంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతు న్న భారత్‌, ప్రాంతీయంగా బలీయ శక్తిమాత్రమే కాదు, సంభావ్య సూపర్‌ పవర్‌ కూడా! ఇంతటి బలీయమైన భారత్‌ తన విదేశాంగ విధానాన్ని అత్యంత వ్యూహాత్మకంగా, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగించడం సహజమే. పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యతనివ్వడం, సార్క్‌, యాక్ట్‌ ఈస్ట్‌ విధానం (దీన్ని పి.వి. నరసింహారావు లుక్‌ ఈస్ట్‌ పాలసీ పేరుతో తొలిసారి అమలు చేశారు) ద్వారా ఆగ్నేయాసియా, ఆసియన్‌ దేశాలతో సంబంధాలను కొనసాగించడానికి మన విదేశాంగ విధానం వ్యూహాత్మక రీతిలో కొనసాగుతోంది.

 అయితే మన విధానంలో కొంత అస్పష్టత లేకపోలేదు. మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేయకపోవడం, రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో అనుసరిస్తున్న తటస్థ వైఖరి విషయాల్లో ఈ అస్పష్టత కనిపిస్తుంది. ప్రస్తుతం భారత్‌ ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్‌, క్వాడ్‌, జి20, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి సంస్థల్లో సభ్యురాలు. అలీనోద్యమానికి వ్యవస్థాపక సభ్యురాలిగా మనదేశం ఇప్పటికీ అలీనదేశాల గ్రూపుపై నిశ్శబ్దంగా తన పలుకుబడిని కొనసాగిస్తోంది. తూర్పు ఆసియా సదస్సు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, జి8G5, ఐబీఎస్‌ఏ డైలాగ్‌ ఫోరం వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా భారత్‌ పలుకుబడి కొనసాగుతోంది. ఆసియా మౌలిక సదుపాయాల బ్యాంక్‌, షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌లలో భారత్‌ సభ్యురాలు. కామన్‌వెల్త్‌ దేశాల సభ్యురాలిగా ఆయా దేశాలతో తన సంబంధాలను కొనసాగిస్తోంది.

మోదీ సిద్ధాంతం

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించిన విదేశాంగ విధానాన్ని ‘మోదీ సిద్ధాంతం’గా వ్యవహరిస్తున్నారు. ఆయన మే 26, 2014న ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొత్తంమీద మోదీ విదేశాంగ విధానం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి కొనసాగుతోంది. అవి` సంవత్‌, సంస్కృతి ఏవం సభ్యత్‌, సురక్ష, సమ్మాన్‌, సమృద్ధి. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత అనేది మోదీ విధానంలో కీలకం. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అగ్రరాజ్యాలతో ఆయన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించారు. అంతేకాదు ‘పారాడిప్లొమెసీ’ భావనను ఆయన ప్రవేశపెట్టారు. దీని ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, నగరాలు ఇతర దేశాలతో లేదా నగరాలతో సంబంధాలను కొనసాగించవచ్చు. వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన కొన్ని దేశాలను మినహాయించి మిగిలిన దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఆయన ప్రాధాన్యతనిచ్చారు. అధికారంలోకి రాగానే యు.ఎన్‌.లోని ఐదు శాశ్వత సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించేందుకు మోదీ కృషి చేశారు. దేశ పగ్గాలు చేపట్టిన తొలి వందరోజుల్లోనే యు.ఎన్‌.లో శాశ్వత సభ్యత్వం కోసం మోదీ ప్రభుత్వం బిడ్డింగ్‌ దాఖలు చేసింది. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో చైనా విస్తరణను అడ్డుకునేందుకు పదునైన వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. సముద్రమార్గ సిల్క్‌రోడ్‌ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ‘‘ప్రాజెక్ట్‌ మౌసమ్‌’’ను రూపొందించగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఉంది. ఫిజీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ 2015లో ఆ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 14 పసిఫిక్‌ దేశాల అధినేతలతో సమావేశం కావడం విశేషం. ఈ సందర్భంగా ఫోరం ఫర్‌ పసిఫిక్‌ ఐలాండ్స్‌ కొఆపరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ దేశాలతో డిజిటల్‌ కనెక్టివిటీ పెంచడానికి ‘పాన్‌ పసిఫిక్‌ ఐలాండ్స్‌ ఈ`నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ 14 దేశాలకు ఆన్‌ ఎరైవల్‌ వీసా సదుపాయాన్ని కల్పించడం విశేషం. ఆసియన్‌, తూర్పు ఆసియా దేశాలతో ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ని అమలుచేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం మనదేశ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలో లేనప్పటికీ, భౌగోళికంగా ఈ ప్రాంతం మన దేశానికి చాలా కీలకం. ఎందుకంటే అధికమొత్తంలో వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం గుండా వెళుతుంటాయి. ఇదే విధానం కింద ఇండో`పసిఫిక్‌ ప్రాంతంలో తటస్థ శక్తిగా భారత్‌ను నిలిపేందుకు యత్నిస్తున్నారు. మధ్య ప్రాచ్యాన్ని మన దేశ విదేశాంగ శాఖ పశ్చిమాసియాగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాంతం గుండా జరిగే వాణిజ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. అదీకాకుండా గల్ఫ్‌ దేశాల్లో మనదేశానికి చెందిన ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో ఈ దేశాలతో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ‘‘లింక్‌ వెస్ట్‌’’ పాలసీని అమలు చేస్తోంది.

 అమెరికాతో సంబంధాల విషయానికి వస్తే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో పెరిగిన సాన్నిహిత్యాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీతో మంచి స్నేహసంబంధాలను కొనసాగించారు. గత ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ అమెరికా సందర్శించి ట్రంప్‌తో జరిపిన చర్చల్లో ఇరుదేశాల వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్‌ నుంచి అమెరికాకు 66 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువుల ఎగుమతులు జరుగుతు న్నాయి. అయితే అమెరికా దిగుమతులపై భారత్‌ విధించే టారిఫ్‌లు సగటున 12% ఉండగా, అమెరికా విధించే సుంకాలు సగటున 2.2శాతం ఉండటంతో ట్రంప్‌ టారిఫ్‌లు పెంచుతామంటూ హెచ్చరికలు మొదలు పెట్టారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యలోటును తగ్గించాలన్న పట్టుదలతో, భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఆగస్టు 1వ తేదీనుంచి 25% టారిఫ్‌ విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు రష్యాతో సైనిక పరికరాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ విధిస్తామని కూడా హెచ్చరించారు. వీటిపై భారత్‌ పైకి స్పందించనప్పటికీ, అమెరికానుంచి ఎఫ్‌`35 యుద్ధ విమానాల కొనుగోలును నిలిపివేస్తూ నిర్ణయించింది. దీంతో అమెరికాకు ఒక్కసారిగా రూ.లక్షకోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ విధానాలపై దేశీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ విధంగా అమెరికా ఆయువుపట్టును కొట్టడంలో భారత్‌ విజయం సాధించింది. ఇది మరే ఇతర దేశానికి సాధ్యంకానిది! ఇక రష్యా. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగు తున్నాయి. ఈ స్నేహ బంధాన్ని తెంచడానికి అమెరికా, యూరప్‌ దేశాలు చేసిన యత్నాలు ఫలించలేదు. నిజానికి మరింత బలపడ్డాయి. అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాల డీల్‌ నిలిచిపోవడంతో, రష్యా మనకు సుఖోయ్‌-57 యుద్ధ విమానాలను ఇవ్వడానికి ముందు కొచ్చింది. టెక్నాలజీ బదలాయింపు, సోర్స్‌కోడ్‌ ఇవ్వడంతో పాటు, మనదేశంలోనే తయారుచేసేందుకు రష్యా ఆఫర్‌ ఇచ్చింది. ఇప్పటికే ఎస్‌-400 (సుదర్శనచక్ర) రక్షణ వ్యవస్థను మనకు ఇవ్వడమే కాకుండా, ఎస్‌`500 కూడా ఇవ్వడానికి ముందు కొచ్చింది. ఇది అన్నికాలాల్లో నిలిచే స్నేహం!

పాకిస్తాన్‌తో…

ప్రధానిగా నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాక్‌పై మనం అప్పటివరకు అనుసరించిన విధానంలో సమూల మార్పులు వచ్చాయి. పాక్‌ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించడం మొదలైంది. 2016లో యూరీ ఉగ్రసంఘటన తర్వాత తీవ్రవాదాన్ని సహించేది లేదన్న విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పాక్‌ ఆక్రమిత భూభాగంలోని ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ దాడులు నిర్వహించి, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అనుసరిస్తామని స్పష్టం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఇరు దేశాల సంబంధాలు ఎన్నడూలేని స్థాయికి దిగజారి పోయాయి. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన దౌత్యవిధానాల వల్ల పాశ్చాత్య దేశాలు కశ్మీర్‌ విషయంలో పట్టించుకోవడం మానేసాయి. టర్కీ, చైనా, మలేసియా తప్ప మరే ఇతర దేశం పాక్‌కు మద్దతుగా నిలవడం లేదు. 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్‌ నిర్వహిం చిన బాలాకోట్‌ దాడులు ఉగ్రవాదులపై మనదేశం అనుసరించే కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

వాస్తవానికి పాక్‌ పట్ల మనదేశం ‘‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’’ అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఉగ్రవాదు లకు ఆర్థిక సహాయాన్ని శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్న పాకిస్తాన్‌ను ఫైనాన్సియల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) బ్లాక్‌ లిస్టులో పెట్టాలని మనదేశం గట్టిగా కోరింది. నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో సంభవించిన ఒక సానుకూల పరిణామం కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి ఎటువంటి వీసాలు లేకుండా సిక్కులు ప్రయాణించడానికి వీలుకల్పించే ఒప్పందం కుదరడం. పాకిస్తాన్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో వున్న దేరా బాబా నానక్‌ గురుద్వారా దర్శనానికి మనదేశ సిక్కులకు ఎటువంటి వీసా లేకుండానే అనుమతిస్తున్నారు. తాజాగా ఏప్రిల్‌ 22న పెహల్గావ్‌లో 26 మంది అమాయక టూరిస్టులను పాక్‌ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడంతో, ఆగ్రహించిన భారత్‌ ఇందుకు ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో మే నెలలో పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. కేవలం 23 నిముషాల్లో పాక్‌ ఉగ్రవాద వ్యవస్థను మట్టి కరిపించిన మనదేశం, సాంకేతికంగా, ఆధునిక యుద్ధరీతుల్లో తన సత్తా ప్రపంచానికి చూపింది. ఎంచుకున్న అన్ని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఈ దాడుల్లో పాకిస్తాన్‌ కేవలం ప్రయోగశాలగా మాత్రమే మిగిలింది. పాకిస్తాన్‌కు చైనా సరఫరా చేసిన హెచ్‌క్యు`9, ఎల్‌వై`80 రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడమే కాదు, మనదేశ దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, అమెరికాకు చెందిన ఎఫ్‌`16 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ దాడులతో చైనా, అమెరికాల ఆయుధ మార్కెట్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిరది. చైనా రక్షణ పరికరాల డొల్లతనం ప్రపంచానికి వెల్లడైంది. టర్కీ అందజేసిన డైరెక్టర్‌ డ్రోన్లు కూడా విఫలం కావడంతో అవాక్కవడం ఆ దేశం వంతైంది. పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థలోని బలహీనతలను ఈ దాడులు బహిర్గతం చేశాయి. ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటికి తోడు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడిని మనదేశం పెంచింది. ఈవిధంగా సైనికేతర అంశాలను కూడా పాక్‌పై ప్రయోగించడం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరికొత్త విధానం. బాలాకోట్‌, ఆపరేషన్‌ సిందూర్‌లు పరిమిత లక్ష్యాలపైనే దృష్టి పెట్టినప్పటికీ, అణ్వస్త్ర ప్రయోగం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పింది. గతంలో మాదిరిగా ఇప్పుడు తానొక అణ్వస్త్రదేశంగా పాకిస్తాన్‌ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిరది. భారత్‌ దాడులు పాక్‌ అణ్వస్త్రాలను ప్రయోగించలేని స్థితికి తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ దాడులతో పాకిస్తాన్‌ రాడికలైజేషన్‌ విధానాలనుంచి వెనక్కి మరలితేనే శాంతి సాధ్యమన్నది మరోమారు స్పష్టమైంది.

చైనాతో సంబంధాలు

1962 నాటి యుద్ధం నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర అనుమానాలతోనే కొనసాగుతున్నాయి. 1967లో జరిగిన నాథూలా, ఛో లా సంఘటనలు, ఆక్సాయ్‌చిన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ల విషయంలో కొనసాగుతున్న వివాదాలు ఇరుదేశాల సంబంధాలకు అడ్డంకిగా మారాయి. 1996లో చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ తన దక్షిణాసియా పర్యటనలో భాగంగా భారత్‌ను కూడా సందర్శించారు. 1998లో భారత్‌ అణుపరీక్షలు నిర్వహించి నప్పుడు, అప్పటి రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ, ఈ పరీక్షలు చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించామని ప్రకటించడంతో మళ్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. టిబెట్‌ చైనాలో అంతర్భాగమని భారత్‌ లాంఛనంగా 2003లో గుర్తించగా, సిక్కిం మనదేశంలో అంతర్భాగ మని చైనా గుర్తించింది. తర్వాతి కాలంలో చైనా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి స్థాయికి ఎదిగింది. వాణిజ్య సంబంధాలు బలోపేతమైన నేపథ్యంలో సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా ఉత్సాహం చూపడం మొదలు పెట్టింది. 2008లో డబ్ల్యుటీఓ దోహా చర్చల సందర్భంగా అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అంగీకరించడమే కాదు, అమెరికా తరహాలో పౌర అణు ఒప్పందం కుదుర్చు కోవడానికి కూడా రెండుదేశాలు ముందుకు వచ్చాయి. అయితే ఆఫ్రికాలో ఆర్థికపరంగా పెట్టుబడుల విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం, డోక్లామ్‌ ప్రతిష్టంభన, భూటాన్‌ సమస్య మళ్లీ ఉభయ దేశాల మధ్య సమస్యకు దారితీసినా ఇవి వేగంగా పరిష్కారానికి నోచుకున్నాయి. 2020లో గల్వాన్‌ సైనిక సంఘర్షణ తర్వాత ఇరుదేశాల సంబంధాలు మళ్లీ అట్టడుగుకు చేరుకున్నాయి. మనదేశంలో వివిధ రంగాల్లో చైనా కంపెనీల కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. తర్వాత ఊహాన్‌ నుంచి విస్తరించిన కరోనా వైరస్‌కూడా ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీసింది. అనంతరం వాస్తవాధీన రేఖ వద్ద పర్వత శిఖరాలను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నాలకు ముందే, మన సైన్యాలు వాటిపైకి చేరుకోవడంతో, చైనా బిత్తరపోయింది. ఆ తర్వాత మనదేశంలో 250 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఎ.సి.లు, రిఫ్రజిరేటర్లు, కూలర్ల దిగుమతులను కూడా మనదేశం ఆపేసింది. భారత్‌`చైనాల మధ్య సయోధ్యకు రష్యా విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ చైనా వైఖరి ఇందుకు సానుకూల వాతావరణాన్ని కల్పించడంలేదు.

యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత భారత విదేశాంగ విధానంలో వచ్చిన కీలక మార్పు ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీ. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్‌కు ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు బలహీనంగా ఉండేవి. ఈ అసమతుల్యతను సరిదిద్దడంతో పాటు, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం మనదేశానికి ఎంతో లాభదాయక మన్న విషయాన్ని గుర్తించిన పి.వి. ప్రభుత్వం 1990లో లుక్‌ ఈస్ట్‌ పాలసీని ప్రవేశపెట్టింది.  బర్మా (మయన్మార్‌) వంటి దేశాల్లో ఇంధన వనరులున్న నేపథ్యంలో ఈ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో భారత్‌ ముందుకు సాగింది. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక కీలక నిర్ణయం తీసుకొని ‘సరళీకృత ఆర్థిక విధానాన్ని’ అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే పి.వి.నరసింహారావు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, సింగపూర్‌ దేశాల్లో పర్యటించారు. 1992 ఆసియన్‌ సమావేశాల్లో భారత్‌ చర్చల భాగస్వామిగా పాల్గొనడం విశేషం. తర్వాత 2002 నుంచి భారత్‌ ఆసియన్‌ దేశాలకు సదస్సు స్థాయి భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. ఆవిధంగా ‘బిమ్‌స్టిక్‌’, ‘గంగా`మెకాంగ్‌ కోఆపరేషన్‌’ వంటి ప్రాంతీయ గ్రూపుల్లో భాగస్వామి కావడమే కాదు, 2005 డిసెంబర్‌లో జరిగిన తూర్పు ఆసియా సదస్సులో సభ్యురాలైంది. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ వంటి పశ్చిమ దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడం మొదలుపెట్టింది.

ఉగ్రవాదంపై పోరు

కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో 1990 దశకం మధ్య కాలంలో భారత్‌ విజయం సాధించింది. కార్గిల్‌ యుద్ధం, భారత్‌ సాధించిన గొప్ప దౌత్య విజయానికి చిహ్నం. పాకిస్తాన్‌లో పనిచేస్తున్న వివిధ ఉగ్రవాద గ్రూపులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా, ఈయూ దేశాలు గుర్తించాయి. 1998లో భారత్‌ రెండోసారి అణుపరీక్షలు నిర్వహించడంతో, అమెరికా, జపాన్‌, ఈయూ దేశాలు మనదేశంపై ఆంక్షలు విధించాయి. అయితే 2001 నాటికి ఈ ఆంక్షల్లో చాలావాటిని ఆయా దేశాలు తొలగించాయి. 2001 సెప్టెంబర్‌ ఉగ్రదాడుల తర్వాత భారత్‌, అల్‌`కాయిదా ఉగ్రవాదుల గురించిన విస్తృత సమాచారాన్ని అమెరికాకు అందించింది. భారత్‌ ప్రకటించిన ‘ఉగ్రవాదంపై పోరు’ విధానంతో పాటు, ఆర్థికంగా క్రమంగా బలోపేతం కావడంతో వివిధ దేశాలతో దౌత్య సంబంధాలు దృఢతరం కావడం మొదలైంది.

ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి-యు.ఎన్‌., ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సంస్కరణల కోసం భారత్‌ చేసిన యత్నాలు మిశ్రమ ఫలితాలనిచ్చాయనే చెప్పాలి. యు.ఎన్‌. భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అన్ని దేశాలు మద్దతిస్తున్నప్పటికీ, చైనా మోకాలడ్డుతోంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకపోయినా, భారత్‌తో అమెరికా పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం విశేషం. అణ్వస్త్రవ్యాప్తిని నిరోధించే విషయంలో భారత్‌ విశ్వసనీయ చరిత్ర నేపథ్యంలో తానీ ఒప్పం దాన్ని కుదుర్చుకున్నానని అమెరికా సమర్థించుకున్నా, మిగిలిన అణు సరఫరా దేశాలు సమ్మతించలేదు. 2010లో బరాక్‌ ఒబామా మనదేశంలో పర్యటించి నప్పుడు యు.ఎన్‌. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అణుసరఫరా గ్రూపు, వాసెనార్‌ అరేంజ్‌ మెంట్‌, ఆస్ట్రేలియా గ్రూపు, మిస్సైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రీజైమ్‌లో చేరడానికి కూడా అమెరికా సమ్మతించింది. 2018 జనవరి నాటికి భారత్‌ వాసెనార్‌ అరేంజ్‌మెంట్‌, ఆస్ట్రేలియా గ్రూప్‌, మిస్సైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రిజైమ్‌ల్లో సభ్యత్వాన్ని పొందింది. అణు సరఫరా గ్రూపులో ఇప్పటికీ మనదేశానికి సభ్యత్వం లభించలేదు.

– జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE