నవంబర్ మాసం భారత్‌కు అన్ని విధాలుగా కలిసి వచ్చిన మాసం. ముఖ్యంగా భారతీయ క్రీడారంగం వేర్వేరు క్రీడల్లో పతకాలు పంట పండిరచింది. కప్పులను సాధించింది. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని భారత్ ఇదే నెలలో దక్కించుకుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల విషయానికి వస్తే… ప్రతిభావంతులైన కొందరు యువకులు పూణేలో అంగారక గ్రహంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితిని కృత్రిమంగా సృష్టించి అలాంటి ఒక వాతావరణంలో డ్రోన్లు ఎగురవేయడానికి ప్రయత్నించి చాలావరకు సఫలీకృతులయ్యారు. ఇదే మాసం చివరి ఆదివారం నాడు రేడియోలో ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలందుకున్నారు. ఇది నాణేనికి ఒకవైపు అనుకుంటే ఇలా క్రీడాకారులను, శాస్త్ర, సాంకేతిక రంగ నిపుణులను స్వయంగా కొనియాడిన ప్రధాని నవంబర్ నాణేనికి మరోవైపున అన్నట్టుగా మన భారతీయ పరంపరను, సామాజిక, రాజకీయ, తాత్త్వికతను ఆధునిక జాతీయవాద దృక్పథానికి అద్దుతున్నట్టు కనిపించారు. పుట్టపర్తి నుంచి గోవా (అయోధ్య, ఉడుపి సహా) దాకా తన చేతల ద్వారా, ప్రసంగాల ద్వారా ఆయన పంచిన సామాజిక, ఆధ్యాత్మిక, సేవాతత్పరతా సుగంధాలు భావితరాలకు ప్రబోధాలై, మార్గదర్శకాలై నవభారత నిర్మాణంలో స్వదేశీ భావనకు కొత్త కోణాలను సంతరింప చేస్తున్నాయి. నవంబర్ 19న మొదలుపెట్టి నవంబర్ 28 వరకు సాయిరామ్ నుంచి జైశ్రీరామ్ దాకా ప్రధాని నరేంద్ర మోదీ సాగించిన 10 రోజుల ప్రబోధయాత్ర భారతీయ చరిత్రలో మహోన్నతమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆధ్యాత్మికత నుంచి అణ్వాయుధం దాకా జాతిని ముఖ్యంగా జెన్ జెడ్ అని పిలుచుకుంటున్న దేశ జనాభాలో సింహభాగంగా ఉన్న యువతను చైతన్యపరచడంలో గతంలో ఏ ప్రధాని పూనుకొనని కార్యాచరణను మోదీ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఆయన కార్యాచరణ అతి త్వరలో ఫలవంతం అవుతుందనేందుకు ప్రధాని చేపట్టిన యాత్రకు ఆబాలగోపాలం స్పందించిన తీరు ప్రబలమైన సాక్ష్యంగా మిగిలింది. ఆధ్యాత్మిక ఐక్యత జాతీయ ఐక్యతకు అంతస్సూత్రమన్న వాస్తవాన్ని జాతికి ఆయన గుర్తు చేస్తున్నారు.

నవంబర్ 19, పుట్టపర్తి
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక ఆవాసంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి గ్రామం ప్రశాంత నిలయ మైంది. సత్యం, ధర్మం, ప్రేమ, అహింస, సేవలే జీవనధారగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో ఆధ్యాత్మిక భావనతో పాటుగా తోటివారి పట్ల సేవా భావాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు మంచినీళ్ల నుంచి ఉన్నతమైన చదువులను అందించడం, ఉచితంగా వైద్యం అందించడం వరకు వరకు సేవా కార్యక్రమాల్లో అంత ర్జాతీయ సమాజానికి ఒక నమూనాగా నిలిచింది. ఏప్రిల్ 24, 2011 యావత్ భక్తజన కోటిని విషాదంలో ముంచుతూ సత్యసాయిబాబా శివైక్యం చెందారు. అప్పటిదాకా వారి సుభాషితాలతో మానవత్వాన్ని మహోన్నత స్థానంలో నిలిపిన ప్రశాంతి నిలయం మూగబోయింది. ఆ తర్వాత 14 సంవత్సరాలకు సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవంలో ఆయన నడయాడిన ఆ పవిత్ర భూమిలో అదే తరహాలో ప్రజలను చైతన్యపరిచే సరికొత్త గళం వినిపించింది. అయితే ఈసారి బాబా తరహాలో మంచి విషయాలను చెప్పింది ఏ ఆధ్యాత్మికవేత్తో, సామాజికవేత్తనో, సమాజసేవకుడో కాదు. ఆ పాత్రను పోషించింది ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన పలుకులతో ప్రశాంతి నిలయం పులకరించింది. విద్యార్థుల నుంచి సాధారణ భక్తుల వరకు వేలాదిగా ప్రజలు మోదీ ప్రసంగాన్ని ఆసాంతం ఆలకించారు. సాయిరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మానవ జీవితంలో సేవను అత్యున్నత స్థానంలో ఉంచారంటూ సత్యసాయిబాబాను స్మరించుకున్నారు. దశాబ్దాల కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ప్రధానికి ప్రసంగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ పుట్టపర్తిలో వినిపించిన ఆయన వాణి ఆధునిక మానవుల్లో మానవసేవే మాధవ సేవ అన్న అనాదికాలపు నానుడిని శాశ్వతం చేసింది.
‘‘సత్యసాయిబాబా సంస్థలు వాటి కార్యకలాపాల ద్వారా ఆధ్యాత్మికత, సేవ వేరు కాదని, ఒకే సత్యానికి చెందిన వేర్వేరు వ్యక్తీకరణలు అని నిరూపిస్తున్నాయి. బాబా మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ వారు స్థాపించిన సంస్థల సేవా కార్యకాలా పాలు నానాటికి ప్రవర్థమానమవుతుండటం దీనికి నిదర్శనం’’ – మోదీ
నవంబర్ 25, అయోధ్య
అయోధ్యలో తెలతెలవారుతోంది. సరయూ నదీ ప్రవాహపు గలగలల సవ్వడికి స్వరాన్ని అందిస్తున్న ట్టుగా శ్రీరాముడిని నగరానికి తిరిగి స్వాగతించే గానంతో మహా నగరం ఆధ్యాత్మిక శోభను సంత రించుకుంది. సూర్యుడి తొలి కిరణాలు మందిర శిఖరాన్ని దేదీప్యమానం చేస్తున్నాయి. అక్కడే సాధారణమైన వస్త్రధారణలో నిలబడి ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన కన్నుల్లో భారత జాతిని సమున్నత స్థానంలో ఉంచే సంకల్పం కనిపిస్తోంది. ఆయన చేతుల్లో 22 అడుగుల పొడవైన కాషాయ రంగు ధర్మధ్వజం ఉంది. సూర్యుడు, ఓంకారం, కోవిదార్ వృక్షం చిహ్నాలుగా కలిగి ఉంది. ఆ చిహ్నాలు రామచంద్రుడు ఆచరించిన న్యాయం, సత్యం, త్యాగానికి ప్రతీకలు. ధర్మధ్వజం గాలిలో రెపరెపలాడిన క్షణాన కోట్లాదిగా హిందూ బంధువుల హృదయాలు భక్తి భావనతో పులకించిపోయాయి. ఇది ఒక ఉత్సవం కాదు. బానిసత్వపు శృంఖలాలను ఛేదించిన ఒక మహోన్నతమైన, చరిత్రాత్మకమైన ఘట్టం. ఆ సమయంలో ప్రధాని మోదీ అత్యంత శాంతిపూర్వకమైన స్వరంతో ప్రసంగిస్తున్నప్పటికీ ఆయన మాటల్లో గర్జనలు వినపడుతున్నాయి. ఆకాశవీధిలో సమున్నతంగా కనిపిస్తున్న ధర్మధ్వజం దశాబ్దాలనాటి గాయాలను మాయం చేసింది. శతాబ్దాలుగా భారత్ అలవాటు చేసుకున్న బానిస మనస్త్తత్వాన్ని వచ్చే పదేళ్ల కాలంలో రూపుమాపాలనే వజ్ర సంకల్పాన్ని భారతీయులకు అందించింది. ఈ సంకల్పం కేవలం కాగితాలకు పరిమితమయ్యేది కాదు. అది ప్రతీ భారతీయుడి జీవన పర్యంతం చేసుకున్న లక్ష్యం. రామ మందిరం నెలకొన్న అయోధ్యా నగరం 45 కోట్ల మందికిపైగా భక్తజనుల పాదముద్రలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ఉద్యమం. శ్రీరాముడు కేవలం మందిరంలో మాత్రమే కాదు ప్రతీ ఒక్కరి హృదయంలో కొలువై ఉన్నాడు.
బానిస మనస్త్తత్వం అంటే 1835లో లార్డ్ మెకాలే విద్యావిధానం పేరుతో భారతీయులకు నిర్బంధంగా అందించిన కంటికి కనిపించని గరళం. మన సంస్కృతీ సంప్రదాయాలను మనకు దూరం చేయాలి. మెకాలే విద్యావిధానం అంతిమ లక్ష్యం పాశ్చాత్య ఆలోచనా విధానానికి మనల్ని బానిసలను చేయడం. ఆ గరళం నేటికీ మన నరనరాన ప్రవహిస్తోంది. దాని కారణంగా మన సొంత భాషను చిన్నచూపు చూస్తాం. పాశ్చాత్య సంస్కృతిని ఎంతో గొప్పదిగా భావిస్తాం. శ్రీరాముడిని కేవలం ఒక కావ్యంలో, కథలో పాత్రగా చూస్తాం. ఈ బానిసత్వ మనస్తత్వమే చాలా సంవత్సరాలుగా రామతత్త్వాన్ని దూరం చేసింది. రాముడు నిలువెత్తు విలువలకు ప్రతిరూపం. రాజు రాముడి నుండి రామేశ్వరం భక్త రాముడి వరకు, శబరి రాముడి నుండి మిథిలా అతిథి రాముడి వరకు, రాముడు భారతదేశంలోని ప్రతి ఇంట్లో, ప్రతి భారతీయుడి హృదయంలో, భారతదేశం లోని ప్రతి కణంలో ఉన్నాడు. కానీ బానిసత్వ మనస్తత్త్వం ఎంతగా ప్రబలిందంటే రాముడిని కూడా ఊహాత్మకంగా ప్రకటించడం ప్రారంభించారు. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. రాముడు ఒక విలువ, గౌరవం, ఒక దిశ. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందాలంటే, సమాజం శక్తివంతం కావాలంటే, మనలోని ‘‘రాముడిని’’ మేల్కొల్పాలి. మనలో రాముడిని స్థాపించాలి. దీనికి సంబంధించిన ఇలాంటి ఒక సంకల్పం తీసుకోవడానికి ఈ రోజును మించిన మంచిరోజు ఇంకేమి ఉంటుంది? ప్రధాని ప్రబోధం ప్రతీ ఒక్కర్నీ సంకల్ప సిద్ధికి ఉపకరణంగా మారుస్తుంది.
ధ్వజారోహణంలో వేద జాతీయ గీతం
ధర్మధ్వజాన్ని ఆవిష్కరించినప్పుడు వినిపించిన మంత్రాన్ని వేద జాతీయ గీతంగా అభివర్ణిస్తారు. ఈ పవిత్ర శ్లోకం శుక్ల యజుర్వేదం (మంత్రం 22) లోని 22వ అధ్యాయం నుండి వచ్చింది. ఇది ఒక దేశం, దాని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, శక్తి కోసం చేసే ప్రార్థనగా పేర్కొంటారు.
దీని ప్రాధాన్యం వివరిస్తూ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధర్మధ్వజాన్ని ఆవిష్కరిస్తున్న ప్పుడు వినిపించిన మంత్రం వైదిక రాష్ట్రగీతం- వేద జాతీయగీతం. ఇది శుక్ల యజుర్వేదం నుండి వచ్చింది. ఈ ప్రాచీన నాగరికతకు ఎల్లప్పుడూ రాష్ట్ర భావన ఉందని- మనది బ్రిటిష్ వారు సృష్టించిన ఇటీవలి పాతకాలపు కృత్రిమ రాజకీయ వ్యవస్థ కాదని ఇది మరోసారి మనకు గుర్తు చేస్తుంది’’ అని అందులో ఆయన పేర్కొన్నారు.
వేద జాతీయ గీతం అర్థం, ప్రాముఖ్యం
వేద జాతీయగీతం అనేది సామూహిక ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సు కోసం ఆశీర్వాదా లను కోరే సంప్రదాయ వేద శ్లోకం. ఇది సమాజం లోని భిన్న వర్గాలను ఈ విధంగా ప్రస్తావిస్తుంది:
విజ్ఞులైన పండితులు: వేదాలలో ప్రావీణ్యం ఉన్న పండితులు, దైవిక జ్ఞానం కలిగినవారు ఉండాలి.
శక్తిమంతమైన పాలకులు: నాయకులు ధైర్య వంతులు, నైపుణ్యం కలిగినవారు, న్యాయవంతులు కావాలి.
శ్రేయస్సు: ఆవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి, ఎద్దులు భారీ భారాన్ని సమర్థవంతంగా మోస్తాయి. గుర్రాలు వేగంగా పరుగులు తీయాలి.
‘‘2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందాలంటే, సమాజం శక్తిమంతం కావాలంటే, మనలోని ‘‘రాముడిని’’ మేల్కొల్పాలి. మనలో రాముడిని స్థాపించాలి. దీనికి సంబంధించిన ఇలాంటి ఒక సంకల్పం తీసుకోవడానికి ఈ రోజును మించిన మంచి రోజు ఇంకేమి ఉంటుంది?’’ – మోదీ

నవంబర్ 25, కురుక్షేత్ర
కురుక్షేత్ర సమరాంగణాన పార్థుడి రథసారథిగా శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరిస్తే అతిరథ, మహారథు లతో కూడిన కౌరవ సైన్యం కలవరపడి పోయింది. అలాంటి ఒక శంఖారావం కౌరవులు నేలమట్టం కావడానికి, పాండవులు పాలకులు కావడానికి దారి చూపింది. ఇదే కురుక్షేత్రంలో వైరిపక్షాన ఉన్న అయిన వారిని చంపలేను అంటూ నిర్బలుడైన పాండవ మధ్యముడిని ధీరుడిని చేయడానికి పురిగొల్పిన గీతను శ్రీకృష్ణుడు బోధించాడు. యావత్ మానవాళికి మహత్తరమైన మానవ వికాస బోధనలను ప్రపంచానికి అందించాడు. అలాంటి ఒక చోటును ప్రధాని మోదీ తన ప్రబోధయాత్రలో భాగం చేసుకున్నారు. శ్రీకృష్ణుని పవిత్ర శంఖం గౌరవార్థం కొత్తగా నిర్మించిన ‘పాంచజన్య’ స్మారకాన్ని ప్రారంభించారు. మహాభారత అనుభవ కేంద్రాన్ని సందర్శించారు. శ్రీమద్ భగవద్గీత దివ్య ఆవిష్కరణతో ముడిపడిన బ్రహ్మ సరోవర్‌ను దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర స్థలంలోనే శ్రీకృష్ణుడు సత్యం, న్యాయం, రక్షణను అత్యున్నత కర్తవ్యంగా ప్రకటించాడు. సత్యమార్గంలో, కర్తవ్య నిర్వహణలో అమరులు కావడానికి మించిన ఉత్తమమైన పని మానవులకు మరొకటి ఉండదని మోదీ చెప్పారు.
‘‘ఈ పవిత్ర స్థలంలోనే శ్రీకృష్ణుడు సత్యం, న్యాయం రక్షణను అత్యున్నత కర్తవ్యంగా ప్రకటించాడు. సత్య మార్గంలో, కర్తవ్య నిర్వహణలో అమరులు కావడానికి మించిన ఉత్తమమైన పని మానవులకు మరొకటి ఉండదు’’ – మోదీ
నవంబర్ 28, ఉడుపి
ప్రధాని మోదీ భగవద్గీత ఉద్భవించిన కురు క్షేత్రాన్ని సందర్శించిన మూడు రోజులకు ఉడుపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించుకున్నారు. మఠమంతా కలియదిరిగారు. మూలవిరాట్టును పూజించు కున్నారు. చిన్నారులు, పురుషులు, మహిళలు, పండితులు, పామరులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారితో కలిసి లక్ష గళ భగవద్గీత పారాయణంలో పాలుపంచుకున్నారు. గీతలో చివరి 10 శ్లోకాలను పఠించారు. పుట్టపర్తిలో సేవ గొప్పదనాన్ని, అయోధ్యలో మనలో రాముడ్ని మేల్కొల్పాలని, కురుక్షేత్రంలో సత్యమార్గంలో, కర్తవ్య నిర్వహణను మించిన మోక్షం మానవులకు ఏమి ఉంటుందని ప్రబోధించిన ప్రధాని మోదీకి ఉడుపిలో లక్ష మందితో కూడిన శ్రీకృష్ణ భక్త జనసందోహాన్ని చూసేసరికి వారితో యావత్ విశ్వం సంక్షేమానికి పనికి వచ్చే తొమ్మిది సంకల్పాలు చేయించాలనే సత్ సంకల్పం కలిగింది. ఆయన మాటల్లో చెప్పాలంటే..

మన మొదటి సంకల్పం నీటిని సంరక్షించడం, నదులను కాపాడటం. మన రెండవ సంకల్పం చెట్లను నాటడం. ‘మాకే నామ్ ఏక్ పేడ్’ (‘తల్లి పేరు మీద ఒకే చెట్టు’ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. అన్ని మఠాల బలం ఈ కార్యక్ర మంలో చేరితే, దాని ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుంది. మూడవ సంకల్పం దేశంలో కనీసం ఒక పేదవాడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. నాల్గవ సంకల్పం స్వదేశీ ఆలోచనగా ఉండాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా, మన మందరం స్వదేశీని స్వీకరించాలి. నేడు భారతదేశం ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ మంత్రంపై ముందుకు సాగుతోంది. మన ఆర్థిక వ్యవస్థలు, మన పరిశ్రమ, మన సాంకేతికత, అన్నీ తమ సొంత కాళ్లపై దృఢంగా నిలబడి ఉండాలి. కాబట్టి, మనం బిగ్గరగా వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్ అని చెప్పాలి
ఐదవ సంకల్పంగా, మనం సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలి. ఆరవ సంకల్పం ఆరోగ్య కరమైన జీవనశైలిని అవలంబించడం, చిరు ధాన్యాలు పండిరచడం, మన ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించడం. మన ఏడవ సంకల్పం ఏమిటంటే, యోగాను జీవితంలో భాగం చేసుకో వాలి. ఎనిమిదవ సంకల్పంలో భాగంగా పూర్వ గ్రంథాల రాతప్రతుల సంరక్షణలో సహకరించండి. మన దేశంలోని పురాతన జ్ఞానం చాలావరకు రాతప్రతులలో దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని కాపాడు కోవడానికి, కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం మిషన్‌పై పనిచేస్తోంది. మీ మద్దతు ఈ అమూల్యమైన వారసత్వాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. దేశంలోని మన వారసత్వానికి సంబంధించిన కనీసం 25 ప్రదేశాలను సందర్శిస్తాము అనే విషయాన్ని తొమ్మిదవ సంకల్పంగా చేసుకోవాలి.
‘‘ఎర్రకోట నుండి శ్రీ కృష్ణుడి కరుణ సందేశాన్ని తెలియజేస్తాము. అదే ప్రాకారాల నుండి, మేము ‘‘మిషన్ సుదర్శన్ చక్ర’’ ప్రకటిస్తాము. మిషన్ సుదర్శన్ చక్ర అంటే దేశంలోని కీలక ప్రదేశాలు, పారిశ్రామిక, ప్రభుత్వ రంగాల చుట్టూ శత్రువు చొచ్చుకుపోలేని భద్రతా గోడను నిర్మించడం. శత్రువు ధైర్యం చేస్తే, మన సుదర్శన చక్రం వారిని నాశనం చేస్తుంది.’’ – మోదీ
నవంబర్ 28, గోవా
సూర్యుడు, సముద్రం, ఇసుక, రాత్రి జీవితం ఆకర్షణగా విలసిల్లుతున్న గోవాలో 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇది చాలా మందికి అసాధా రణంగా అనిపించవచ్చు, కానీ గోవాలోని రాముడి విగ్రహం శతాబ్దాల ద్వైత వైష్ణవ ధర్మం, 550 సంవత్స రాల పార్తగలి మఠం వారసత్వంలో పాతుకు పోయింది. ప్రధానమంత్రి చెప్పినట్లుగా, ఈ విగ్రహం విశ్వాసం, సాంస్కృతిక మార్పునకు చిహ్నం.

గోవా సాధారణంగా సూర్యకాంతితో నిండిన బీచ్‌లు, ట్రాన్స్‌క్లబ్‌లు, పోర్చుగీస్ విల్లాలు, ఫెని, నైట్ లైఫ్, ఎప్పుడైనా పార్టీ చేసుకునే స్ఫూర్తితో ముడిపడి ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం కేవలం రాష్ట్రంలో బైట వ్యక్తులకు మాత్రమే ముడిపడి ఉంటుందని చాలామంది అపోహపడ్డారు. అందుకనే దక్షిణ గోవాలోని పార్తగలిలోని శ్రీ సంస్థాన్ గోకర్న్ పర్తగలి జీవోత్తం మఠంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77 అడుగుల భారీ రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు.
గోవాను దాని పోర్చుగీస్ గతంతో, బలమైన క్రైస్తవ ప్రభావంతో ముడిపెట్టే చాలామందికి, రాష్ట్రంలోని ఎత్తైన రాముడి విగ్రహం ఇది ఎలా జరిగింది ఇక్కడే ఎందుకు జరిగింది? అనే స్పష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
దీనికి సమాధానం గోవా ఆధ్యాత్మిక చరిత్రలో ఉంది. ఇది దాని వలస పాలనకు ముందు నుండి శతాబ్దాల మతపరమైన, సాంస్కృతిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.
శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠం ఇది భారతదేశంలోని పురాతన, ప్రముఖ ద్వైత వైష్ణవ మఠాలలో ఒకటి. ఈ విగ్రహావిష్కరణ వేడుక గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజానికి చెందినది. శతాబ్దాలుగా వైష్ణవ ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఈ మఠానికి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రధాని మోదీ విగ్రహంతో పాటు రామాయణ థీమ్ పార్క్‌ను ప్రారంభించారు, ప్రత్యేక పోస్టల్ స్టాంపు, స్మారక నాణెంను విడుదల చేశారు. ఆయన 15,000 మందికి పైగా హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిం చారు, భారతదేశంలోని పశ్చిమ కొంకణ్ తీరంలో హిందూ సంప్రదాయాలను పరిరక్షించడంలో మఠం గొప్ప పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. గోవా దేవాలయాలు, స్థానిక సంప్రదాయాలు విధ్వంసాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని సభికులకు గుర్తు చేశారు.
ఐక్యతా (గుజరాత్) విగ్రహాన్ని రూపొందిం చడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించిన ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా ప్రదర్శించారు. దీనిని ఐక్యత, భక్తి, భారతదేశ సాంస్కృతిక కొనసా గింపునకు చిహ్నంగా మోదీ అభివర్ణించారు.
ద్వైత వైష్ణవులకు గోవా కీలకం
పైకి చూస్తే, గోవా రాముడి ఎత్తైన విగ్రహం కోసం అసంభవమైన ప్రదేశంగా అనిపించవచ్చు. కానీ గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజం, ద్వైత వైష్ణవులకు, గోవా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.
ద్వైత వైష్ణవం అనేది 13వ శతాబ్దపు ఆధ్యాత్మిక వేత్త మధ్వాచార్యుడు స్థాపించిన హిందూ తాత్విక సంప్రదాయం. ఇది దేవుడు, ఆత్మ రెండు వేర్వేరు వాస్తవాలు అని బోధిస్తుంది. ఈ సంప్రదాయంలో విష్ణువు సర్వోన్నత దేవుడు. రాముడు, కృష్ణుడు వంటి విష్ణువు అవతారాలు ఆరాధనకు కేంద్రంగా ఉన్నాయి.
రాముడిని విష్ణువు అవతారంగా పరిగణించి నందున, ద్వైత అనుచరులు రాముడి పట్ల భక్తిని పరమాత్మ పట్ల భక్తిగా చూస్తారు. అందుకే ద్వైత వైష్ణవ దేవాలయాలు, మఠం, ఆచారాలలో రాముడికి ప్రధాన స్థానం ఉంది.
550 సంవత్సరాల క్రితం వెలసిన పార్తగలి మఠం, గౌడ సరస్వత బ్రాహ్మణుల కోసం ఏర్పాటైన మొదటి వైష్ణవ మఠం. ఇది దక్షిణ గోవాలోని కనకోనా లోని కుషావతి నది ఒడ్డున, కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ మఠం శతాబ్దాలుగా గోవా, తీరప్రాంత కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చిన సారస్వత హిందువులకు సాంస్కృతిక కేంద్రంగా ఉంది.
ఒక మఠం అనేది ధార్మిక బోధన, ఆరాధన, సమాజ మార్గదర్శకత్వానికి కేంద్రంగా పనిచేసే ఆధ్యాత్మిక మఠం.
1510 నుండి 1961 వరకు, గోవా పోర్చుగీస్ పాలనలో ఉంది. ఆ సమయంలో, అనేక హిందూ సంస్థల మాదిరిగానే, ఈ మఠం కూడా మిషనరీ ఒత్తిడి, ఆంక్షలు, ఆవర్తన స్థానభ్రంశాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ అవి మనుగడ సాగించాయి. పార్తగలి మఠం కూడా అలాగే ఉంది.
ఇది సారస్వత్ సమాజానికి చెందిన శ్రీరాముని పురాతన, గౌరవనీయమైన విగ్రహం అయిన శ్రీ వీర మూలరామ (అసలు రాముడు) దేవరుతో సహా పవిత్ర విగ్రహాలు, గ్రంథాలు, ఆచారాలను సంరక్షిం చింది.
పార్తగలి మఠం మొదట వలసరాజ్య పూర్వ కాలంలో, తరువాత వలసరాజ్యాల కాలంలో సాంస్కృ తిక పరివర్తన తరంగాల మధ్య ఒక ప్రాంతంలో హిందూ కొనసాగింపునకు బలమైన కోటగా మారింది,
గోవాలో నిండైన రామభక్తి
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయోధ్యలో గోవా భవన్ కోసం భూమిని సేకరించే ప్రణాళికలను ప్రకటించడం ద్వారా, 77 అడుగుల కాంస్య విగ్రహానికి మద్దతు ఇవ్వడం ద్వారా రాముడి పట్ల తన ప్రభుత్వానికి ఉన్న భక్తిని పదేపదే నొక్కిచెప్పారు. ఫిబ్రవరి 2024లో, సావంత్ తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగా నిర్మించిన రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడా నికి అయోధ్యకు వెళ్లారు, దీనిని ‘‘రాష్ట్ర మందిర్’’ అని పిలిచారు.
జనవరి 22, 2024న, ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున, గోవా రాష్ట్రవ్యాప్తంగా భారీ వేడుకలు జరిగాయి. కానకోనా, మార్గోవా వంటి పట్టణాల్లో ర్యాలీలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు జరిగినట్లు పనాజీకి చెందిన హెరాల్డ్ గోవా నివేదించింది. ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలు మూడు రోజుల పాటు ధార్మికపరమైన కార్యక్రమాలను నిర్వహించాయి.
కర్ణాటకలోని ప్రసిద్ధ ద్వైత కేంద్రం ఉడుపి (250 కి.మీ. దక్షిణం) తరహాలో కాకుండా, పార్తగలి మఠం పశ్చిమ తీరంలోని స్థానిక సారస్వత్ సమాజంలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన వైష్ణవ సంప్రదా యాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ మఠం 550 సంవత్సరాల వేడుక రాముడికి పెద్ద ఎత్తున నివాళి అర్పించడానికి సరైన క్షణం, ప్రదేశం. ఆ క్రమంలో గోవాను పార్టీలకు స్వర్గధామం అని పిలవడం సరికాదు. ఇక్కడ కొలువైన ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం గోవాలో బీచ్‌లు, రాత్రి జీవితం కింద చాలా పురాతనమైన ఆధ్యాత్మిక ప్రవాహం ప్రవహిస్తుందని గుర్తు చేస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకున్న గోవా ప్రజల చేత పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత సహా తొమ్మిది సంకల్పాలను చేయించారు. అదే సమయంలో గోవా పవిత్ర భూమికి దాని స్వంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది. శతాబ్దాలుగా, భక్తి, సాధు సంప్రదా యాలు, సాంస్కృతిక క్రమశిక్షణ నిరంతర ప్రవాహం ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసింది. గోవా దాని సహజ సౌందర్యంతో పాటు, ఈ భూమి ‘దక్షిణ కాశీ’ అనే గుర్తింపును కూడా కలిగి ఉంది అంటూ ఘనమైన భారతీయ ఆధ్యాత్మిక చరిత్రను యావత్ భారతీయులకు గుర్తు చేయడం ద్వారా ఇలా చరిత్ర అడుగున మరుగునపడిపోయిన అనేక ధార్మిక కేంద్రాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క భారతీయుడిది అని తన ప్రబోధ యాత్ర ముగింపులో ప్రధాని మోదీ పరోక్షంగా చెప్పారు.
‘‘ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించే వ్యవస్థలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి..’’ – మోదీ
దేశానికి, సమాజానికి మంచి జరగాలి
అయోధ్యలో డా. మోహన్ భాగవత్
భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు. ఈ రోజు మన కలలు, మన త్యాగాలు, మన సంకల్పాలు నెరవేరిన రోజు. రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి పోరాడిన మన పూర్వులు, మన సాధువులు, మన కార్యకర్తలు, మన విద్యార్థులు-వారంతా ఈ రోజు మనతోనే ఉన్నారు. వారి ఆత్మలు ఈ క్షణంలో సంతోషంగా, శాంతిగా ఉంటాయి.
అనేక మంది కలలు కన్నారు. అనేక మంది ప్రయత్నాలు చేశారు. అనేక మంది త్యాగాలు చేశారు. మన పరమ పూజ్యులైన అశోక్ సింఘాల్‌జీ మహారాజ్, మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, దాల్మియాజీ, అనేకమంది సాధువులు, ప్రజలు, విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. వారు ఈ మందిరం కోసం ఎంతో కష్టపడ్డారు. వో జో స్వప్న దేకా తా ఉస్సే భీ అధిక్ భవ్య ఔర్ అధిక్ సుందర్ యే మందిర్ బన్ గయా హై(వారు మందిరానికి సంబంధించి ఎలాంటి స్వప్నాన్ని అయితే చూశారో అంతకు మించి భవ్యమైన, సుందరమైన మందిరం నిర్మితమైంది). ఇది మన అందరి సామూహిక సంకల్పం ఫలితం.
రామరాజ్య ధ్వజం – ఇది కేవలం ఒక చిహ్నం కాదు. ఇది మన ధర్మం, మన న్యాయం, మన శాంతి, మన సమృద్ధికి ప్రతీక. ఈ ధ్వజం ఒకప్పుడు ఆయోధ్యలో ఎగురవేసి, ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును వ్యాపింపజేసేది. ఇప్పుడు అది మళ్లీ మన మందిర శిఖరంపై ఎగురుతోంది. మనం దీనిని చూస్తున్నాం. ఇది మన చరిత్రలో మహత్తర క్షణం. 500 సంవత్సరాల కల ఇన్నాళ్లకు నెరవేరింది. 500 సంవత్సరాలు పక్కన పెట్టినా, ఇది 30 సంవత్సరాల పోరాటం. ఇప్పుడు మందిరం నిర్మితమైంది. శాస్త్రీయ ప్రక్రియలు పూర్తయ్యాయి. ధ్వజారోహణం జరిగింది.
ఈ ధ్వజంలో కాషాయ వర్ణం ధర్మాన్ని సూచిస్తుంది. కోవిదార చెట్టు రూపం ఇది రఘుకుల వంశాన్ని, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ధ్వజం మనల్ని ఏకం చేస్తుంది. మనల్ని బలోపేతం చేస్తుంది. మన దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శకుడిగా మార్చగలదు.
మనం అందరం కలిసి పని చేయాలి. మన దేశాన్ని బలమైనదిగా, సమృద్ధిగా, శాంతియుతంగా నిర్మించాలి. రామరాజ్య ఆదర్శాలను అమలు చేయాలి. సనాతన ధర్మానికి అనుసరించే అందరికీ, భారతీయులందరీ మనసుల్లో ఈ క్షణం తపస్సు, భక్తి సంకల్పాన్ని రేకెత్తించాలి. మన దేశానికి, మన సమాజానికి మంచి జరగాలి.

– మహేష్ ధూళిపాళ్ల