అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగుతుందా? ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకూ సమాధానం లేదు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ పైకి భీకర ప్రకటనలు చేస్తున్నా ఈ రెండు దేశాలూ యుద్ధం నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో చర్చలకు వచ్చినట్టే వచ్చి, పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా హెచ్చరిస్తుంటే, ఉపసంహరించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ తేల్చి చెబుతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధానికి సంబంధించి తాజాగా రెండో విడత చర్చల కోసం అమెరికా నిర్దిష్ట కాలవ్యవధి లేకుండా గడువును పొడగించింది. ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. యుద్ధం ముగించటా నికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి ముందుకు రాకుంటే ఇరాన్ చమురు పైపులైన్లు పేలిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది వ•సుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. దిగ్బంధనం కేవలం అమెరికా వ్యూహం మాత్రమే కాదని.. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే చర్య అని అంటున్నారు. అమెరికాకు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. తమ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం కలిగినా అమెరికాకు మద్ధతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సగ్‌హబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. ‘మా లెక్కలు వేరు. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావులు’ అని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, ఆస్తులపై ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుని బెదిరింపులకు ఓ కారణం ఉంది. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఇప్పటికే కీలకమైన ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండి పోతోంది. ఉత్పత్తి ఆపితే చమురు బావిలో పీడన సమస్య కారణంగా కింద ఉన్న నీరుపైకి ఉబికి వచ్చి, చమురు శిలల్లోకి చొచ్చుకు పోతుంది. కొంతకాలం తర్వాత మళ్లీ తవ్వడం ప్రారంభిస్తే నీరే వస్తుంది. ఇవన్నీ చమురు బావుల జీవితకాల ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని అయితే పూర్తిగా వినియోగానికి రాకుండా పోవచ్చు. కొన్ని రోజుల్లోనే ఖర్గ్ ద్వీపంలోని చమురు స్టోరేజీ ట్యాంకులు నిండిపోతాయి. కీలకమైన ఇరాన్ చమురు బావులు వ•తపడక తప్పదు. దీంతో ఆ దేశ ప్రధాన ఆదాయానికి గండి పడనుంది’ అని ఇటీవల •••ఎస్ ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు
అమెరికాకు నష్టం పెద్దదే
యుద్ధంలో ఇరాన్‌ను సైనికంగా తీవ్రంగా నష్ట పరిచామని, ఒప్పందానికి రావాల్సిన పరిస్థితి కల్పించామని అమెరికా చెప్తోంది. కానీ వాస్తంగా ఇరాన్ కూడా అమెరికాను గట్టిగా దెబ్బ తీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించిన తర్వాత ఆ దేశం గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరా లను లక్ష్యంగా చేసుకుంది. కమాండ్ సెంటర్లు, నిల్వ కేంద్రాలు, విమానాలు ఉంచే ప్రాంతాలు, రన్‌వేలు, రాడార్ వ్యవస్థలపై దాడులు చేసింది. అమెరికా దగ్గర అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలున్నా.. ఇరాన్ తన పాత ఎఫ్-5 యుద్ధ విమానయానాలతో ఈ దాడులు చేయడం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టాలను అమెరికా బయటకు చెప్పడం లేదు. యుద్ధం ప్రారంభమైన తొలి వారం లోనే అమెరికా 11 బిలియన్ డాలర్ల మేర ఖర్చు పెట్టింది. యుద్ధం ప్రారంభంలో 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ మొత్తం క్రితం ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధాన్ని కొనసాగించడానికి పెట్టే ఖర్చుతోపాటు దెబ్బతిన్న వాటిని బాగు చేయడానికి కొన్ని బిలియన్ల డాలర్ల మేర అవసరం కానుంది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో 200 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్‌ను పెంటగాన్ కోరినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. యుద్ధంలో జరిగిన నష్టాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం పారదర్శకంగా లేకపోవడంపై కొందరు సొంత రిపబ్లికన్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వివరాలు అడిగినా చెప్పడం లేదంటున్నారు.
ఇరాన్ లొంగక తప్పదా?
కాగా అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన లను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతి పాదనలో పేర్కొంది. చర్చలకు సిద్ధమైతే అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రతిపాదన వైట్‌హౌస్‌కు అందింది. కానీ దీనిని పరిశీలించడానికి సుముఖంగా ఉందో లేదో స్పష్టం కాలేదు.
ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభి ప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి, ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి చెప్పారు. పాకిస్థానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్క రించడం, అమెరికా దిగ్బం ధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి.
మొజ్తబా ఎలా ఉన్నారో?
అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ నాయ కత్వంలో విబేధాలు వచ్చినట్లు ఇప్పటికే బయట పడింది. చర్చల్లో సరళతర వైఖరిని అవలంబించాలని పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, ఇతరత్రా మితవాద నేతలు ప్రతిపాదించగా దీనికి అతివాద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్ చీఫ్ అహ్మద్ వాహిది, ఆయన ఆంతరంగిక బృందం పదేపదే అడ్డుకున్నారని బయటపడింది. అమెరికాతో చర్చలు, యుద్ధం పట్ల తీవ్రమైన, రాజీపడని వైఖరిని ఇరాన్ ప్రతినిధులు ప్రదర్శించేలా చేయడంలో అహ్మద్ వాహిది సఫలమయ్యారు. అమెరికాతో మళ్లీ సైనిక ఘర్షణకు దిగేందుకే ఐఆర్జీసీ మొగ్గు చూపుతోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చుట్టూ అనేక అనుమానాలు, చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా దాడిలో చనిపోయిన తన తండ్రి అలీ ఖమేనీ స్థానంలో మోజ్తబా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల ముందు పెద్దగా కనిపించలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష వీడియో సందేశం, ఆడియో ప్రసంగం విడుదల కాలేదు. మొజ్తబా అధికారిక ప్రకటనలు సోషల్ మీడియా పోస్టుల రూపంలో లేదా ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాత్రమే ప్రకటిస్తున్నారు. సుప్రీం లీడర్‌ను ప్రత్యక్షంగా కలవడానికి కూడా ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అమెరికా ఆయన స్థావరం తెలుసుకొని దాడి చేసే ప్రమాదం ఉందనే అనుమానంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోజ్తబా ఖమేనీకి చేరవలసిన సందేశాలు చేతిరాతలో రాసి, వ•సి వేసిన కవర్లలో నమ్మదగ్గ వ్యక్తుల ద్వారా పంపిస్తు న్నారు. తిరిగి అదే మార్గంలో ఆయన ప్రతిస్పందన బయటకు వస్తోంది. అమెరికా దాడుల్లో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, పలుసార్లు శస్త్ర చికిత్స చేయించుకున్నారని చెబుతున్నారు. ఆయన ముఖం, పెదవులపై కూడా గాయాలు కావడంతో మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయినప్పటికీ, మానసికంగా చురుకుగా ఉండి పాలనలో పాల్గొంటున్నారని చెబుతున్నారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై అనుమానం
అసలు పాకిస్థాన్‌ను నమ్మొచ్చా? అమెరికాతో రెండో విడత చర్చల అనిశ్చిత నేపథ్యంలో ఇరాన్ అనుమానం ఇది. అమెరికా ప్రయోజనాలకు అను గుణంగానే పాకిస్థాన్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఇరాన్ భావిస్తోంది.మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలే కానీ, ఒకరివైపు ఉండటం సరికాదని అంటున్నారు. చర్చల విషయంలో ఇప్పటివరకు వారి చర్యలు చూస్తే వారు నిష్పక్షపాతంగా వ్యవహ రించగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ తమకు మంచి మిత్ర దేశమేనని, కానీ చర్చలకు సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజా• అన్నారు. పాకిస్థాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించ గలదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. లెబనాన్ విషయంలోనూ అమెరికా అంగీకరించలేని విధంగా డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చిందని, ఆ సమయంలో పాక్ నేతలు ఎవరూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదని, ఇస్లామాబాద్‌లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. పాకిస్థాన్ తమకు మంచి మిత్ర దేశమేనని, కానీ చర్చలకు సరైన మధ్యవర్తి కాదని రెజాయి వ్యాఖ్యానించారు. ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో రెజాయి ఇలా అనడం చేయడం పాకిస్థాన్‌కు ఊహించని విఘాతమే.
ఇదిలాఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ స్నేహం అమెరికా నిఘా వర్గాలను ఆందోళన పరుస్తోంది. మునీర్ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగ పడవచ్చు. కానీ వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చ రిస్తున్నాయి. మునీర్‌కు ఎప్పటి ఇరాన్ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులతో, ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలున్నాయని పాక్ మాజీ జనరల్ అహ్మద్ స•ద్ చెబుతున్నారు. ముఖ్యంగా దాని ఖుద్స్ ఫోర్స్ నేత ఖాసీం సులేమానీ, ఐఆర్‌జీసీ కమాండర్ హోస్సెన్ సలామీతో సంబంధా లున్నట్లు వెల్లడిం చారు. దీంతో ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తు న్నాయి. పాకిస్థాన్ మీద అమెరికా విధాన నిర్ణేతల అనుమానాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్‌కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. అమెరికా మీద దాడి చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసుకున్న అల్ ఖైదా చీఫ్ బిల్ లాడెన్ కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సైన్యం కీలక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ గడ్డ మీదే లాడెన్‌ను మట్టు బెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ హెచ్చరిస్తోంది.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్