కర్ర విరగదు కానీ పాము చావాలి.. ఇది అమెరికా ధోరణి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు..ఇది ఇరాన్ వైఖరి. అహంకార వ్యక్తిత్వం, పట్టువిడుపులు లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్య ఏనాటికీ  పరిష్కారం కాదు. అమెరికా, ఇరాన్ దేశాల పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది. ప్రపంచ మంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు బెడిసికొట్టాయి. దీంతో పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా, శాంతి భద్రతలకు పెను సవాలుగా మారింది. పశ్చిమాసియా పరిణామాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకే పరిమితం కాకుండగా ప్రపంచాన్నే ప్రమాదంలో పడేశాయి.

దాదాపు 21 గంటల పాటు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి. చర్చల ప్రారంభం నుంచే ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కనిపించాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, వాటిని తయారు చేసే సామర్థ్యాన్ని కూడా పొందకూడదని అమెరికా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు. ఇటు గల్ఫ్ దేశాలలో ఇరాన్ ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న మద్దతును అమెరికా తీవ్రంగా వ్యతిరేకిం చింది. దీంతో ఇరు పక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇరాన్ వైఖరిలో ఎలాంటి సానుకూల మార్పు కనిపించడం లేదని, తమ నిబంధనలకు వారు అంగీకరించే వరకు శాంతి సాధ్యం కాదు అని తేల్చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇది అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని, తమ పరిమితులు ఏమిటో, ఎక్కడ సడలింపులు ఇస్తామో, ఎక్కడ ఇవ్వలేమో స్పష్టం చేసినా ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని తెలిపారు

మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలమయ్యాయని చెబుతోంది. తాము దౌత్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికా మితిమీరిన డిమాండ్లు ఒప్పందాన్ని కుదరకుండా అడ్డుకున్నాయని చెప్పింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఈ రెండు, మూడు విషయా ల్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సమావేశంలోనే ఒప్పందానికి చేరుకుంటామని తాము ఆశించ లేదన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను అంగీక రించడంపైనే చర్చల ఫలితాలు ఉంటాయన్నారు. ఇరాన్ ఎదుర్కొన్న భారీ నష్టాలు తమ సంకల్పాన్ని మునుపటికంటే బలోపేతం చేశాయని వివరించారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్ తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తుందని బఘాయీ చెప్పారు.

మరింత ప్రతిష్టంభన

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో సంక్షోభం మరింత తీవ్రంగా మారే ప్రమాదం పొంచి ఉంది. రెండు వారాల తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడతాయి.ఆ దేశంలోని చమురు కేంద్రాలతో పాటు.. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ కూడా అంతే తీవ్రస్థాయిలో ప్రతిఘటి స్తుంది. గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటే సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలకు తీవ్ర ఇబ్బందులు  తప్పవు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలకూ ముప్పు పొంచి ఉంది. లెబనాన్, సిరియాలకు యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. ఇరాన్ మద్దతుతో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన హూతీలు, హిజ్బుల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేస్తాయి.

ఇరాన్ హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది.పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎలఎన్జీ ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ఫలితంగా  అనేక దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. ఇరాన్ దౌత్య మార్గాలను శాశ్వతంగా మూసివేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్‌కు  లోపాయి కారీగా సాయం చేస్తున్న చైనా, రష్యాలు ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వొచ్చు. దీంతో ఇది రెండు దేశాల పోరుగా కాకుండా.. ‘ప్రచ్ఛన్న యుద్ధం’గా రూపాంతరం చెందే అవకాశాలూ ఉన్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయొచ్చు. ప్రస్తుతం పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియం శుద్ధి చేస్తున్నట్లు చెబుతున్న ఆ దేశం.. అణుబాంబు తయారీ కూడా మొదలు పెట్టవచ్చు.

సఫలమై ఉంటే..

ఒకవేళ ఈ చర్చలు సఫలమై ఉంటే గత ఆరు వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరపడేది.ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అమెరికా పాక్షికంగా లేదా పూర్తిగా సడలించే అవకాశం ఉండేది. దశాబ్దాలుగా కుదేలైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. ఆంక్షల కారణంగా అమెరికా స్తంభింపజేసిన నిధులు విడుదలై ఆ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇరాన్ మూసివేసిన హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకొని చమురు,సహజవాయువు రవాణాకు ఆటంకం తొలిగేది. మార్కెట్‌లో చమురు ధరలు యుద్ధానికి ముందు పరిస్థితికి చేరకున్నా గణనీయంగా తగ్గొచ్చు. ఇరాన్ దాడుల కారణంగా ఇబ్బంది పడుతున్న గల్ఫ్ దేశాలకు భారీ ఊరట లభిస్తుంది. హర్మూజ్ జలసంధి గుండా సాగే ఆ దేశాల చమురు, సహజవాయువు ఎగుమతులకు ఇబ్బంది ఉండదు

ఆంక్షల కారణంగా భారత్ చాలా ఏళ్లుగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు. ఒప్పందం కుదిరితే ఇరాన్ చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చు.ఇరాన్ నుంచి భారత్‌కు పైప్‌లైన్ వేయాలన్న ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇరాన్‌లో చాబహర్ పోర్టు మీద భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఒప్పందం కుదిరితే వాటికి భద్రత ఏర్పడుతుంది.

హర్మూజ్ దిగ్బంధనం

ఇరాన్‌తో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకునేలా తక్షణమే సముద్ర దిగ్బంధనాన్ని ప్రారంభించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా, ఇరాన్ ఆర్థిక వనరులను, వారికున్న ప్రధాన బలాన్ని పూర్తిగా దెబ్బతీయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చారు. చట్టవిరుద్ధమైన టోల్ చెల్లించే ఎవరికీ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండదని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరుస్తామని మాటిచ్చిన ఇరాన్, ఉద్దేశపూర్వకంగానే ఆ మాట తప్పిందని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇరాన్ ప్రతిష్ట ఇప్పటికే మంటగలిసిందని, అంతర్జాతీయ చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఆ అంతర్జాతీయ జలమార్గాన్ని అత్యంత వేగంగా తెరవాలని హెచ్చరించారు.

ఇద్దరూ ఇద్దరే..

ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా అధ్యక్షుని తలబిరుసు, ఇరాన్ నేతల మొండితనం, చర్చలకు వేదిక పేరుతో పాకిస్తాన్ అవకాశవాదం చర్చనీయాం శంగా మారాయి. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ మరింతగా ప్రతిఘటిస్తూ నిలబడటం డొనాల్డ్ ట్రంప్ అంచనా లకు తలకిందులు చేసింది. కాల్పుల విరమణపై చర్చలకు ఇరాన్ అంగీకరించినా ఇజ్రాయెల్ మాత్రం ఇందులో లెబనాన్ భాగం కాదంటోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టంగా చెప్పేసింది. ట్రంప్ లాంటి నాయకుడి ముందు తలవంచడం కంటే పోరాటానికే ప్రాధాన్యత ఇస్తోంది.

పాకిస్థాన్ నవ్వులపాలు

పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శాంతి ప్రక్రియ, చర్చల కోసం ఆ దేశాన్ని అమెరికా పావుగా వాడుకుంటోంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశం మధ్యవర్తిత్వం హాస్యాస్పదంగా ఉందని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది. పాకిస్థాన్ నమ్మదగ్గ దేశం కాదని ఇజ్రాయెల్ బహిరంగంగా విమర్శించింది. ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఒక మధ్యవర్తిత్వ దేశం నోట ఇవేం మాటలని ఇజ్రాయెల్ ఎండగట్టింది. కాగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఆయన పరువు తీసింది. ఇరాన్‌పై సైనిక చర్యను వాయిదా వేయాలని కోరుతూ ఆయన చేసిన ట్వీట్‌లో”డ్రాఫ్ట్ – పాకిస్థాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స” అని కనిపించడంతో అది ఆయన సొంతంగా పెట్టింది కాదని, ఎవరో ఇచ్చిన దాన్ని కాపీ, పేస్ట్ చేశారని అర్థమైపోయింది. అమెరికా పంపిన పోస్టును చూసుకోకుండా అలాగే పోస్టు చేయడంతో నవ్వుల పాలయ్యారు. అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చిన సూచనలను తొలగించడం మర్చిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ పొరపాటును గుర్తించి వెంటనే ఎడిట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభావితం చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

భారత్ వ్యూహాత్మక అడుగులు

అమెరికా, ఇరాన్ చర్చల విషయంలో ప్రపంచ మంతా హడావిడి చేసినా.. భారత్ మాత్రం సమతుల్య మైన వైఖరిని ప్రదర్శించింది. దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ అనవసరమైన ప్రకటనలు చేయకుండా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అంతర్జాతీయ సంబంధాల్లో ఎప్పుడు మాట్లాడాలి అనేదానికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని భారత్ అద్భుతంగా అమలు చేస్తోంది. పశ్చిమాసియా సంక్షోభంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, భారతీయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దౌత్యం, చర్చల ద్వారా శాంతిని కోరుతూ, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘లుక్ వెస్ట’ విధానం ద్వారా అరబ్ దేశాలు, ఇరాన్, ఇజ్రాయెల్‌లతో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తోంది. భారత్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుతోంది. తాము పాకిస్తాన్ మాదిరిగా దళారీ పాత్రకు సిద్ధంగా లేమని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్య ఆ దేశానికి చెంప పెట్టులాంటిది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. అక్కడ సత్వరం శాంతి నెలకొనాల్సిన అవసరముందన్నారు. పౌరులపై దాడులను, అంతర్జాతీయ వాణిజ్య రవాణా మార్గాలకు ఆటంకం కల్పించడాన్ని ఖండించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా తక్షణావసరమని పేర్కొన్నారు. ఇరాన్‌తో చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం దెబ్బతినకుండా మన దేశం ప్రయత్నిస్తోంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా తన స్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలుపుకుంటోంది. చమురు, సహజ వాయువు దిగుమతుల కోసం ఈ ప్రాంతంపై ఆధారపడిన మన దేశం హర్మూజ్ జలమార్గంలో రవాణా సజావుగా సాగాలని కోరుకుంటోంది. పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి రక్షణ, సురక్షిత తరలింపు లాంటి అంశాలకు ప్రాధాన్యతిచ్చింది మన దేశం. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో సహాయం చేయడం, రక్షణ, భద్రతా సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. పాలస్తీనాకు మద్దతు ఇస్తూనే, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఇరాన్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది.

క్రాంతిదేవ్ మిత్ర

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE