2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు, దేశంలో ఏకంగా 126 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి, వాటిలో 36 జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనవి. ఇప్పుడు ప్రభావిత జిల్లాల సంఖ్య 2కు, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల సంఖ్య సున్నాకు తగ్గింది. ఇది నిస్సందేహంగా నరేంద్ర మోదీ ప్రభుత్వపు అత్యంత అద్భుతమైన విజయాలలో ఒకటి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్రాల పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలు అత్యంత శ్రద్ధతో అనుసరించిన సమగ్రమైన, సునిర్వచిత వ్యూహం ఫలితంగా, భారత్ జీవనాధారాన్ని పీడిస్తున్న నక్సలిజం అనే మహమ్మారి తుడిచిపెట్టుకుపోయింది.
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన హోం మంత్రి అమిత్ షా, దాని అద్భుతమైన విజయాన్ని వివరిస్తూ పార్లమెంటుకు ఇలా తెలిపారు: 2014 నుండి ఇప్పటి వరకు 4,839 మంది నక్సలైట్లు లొంగిపోగా, పోలీసు బలగాలు 2,218 మందిని అరెస్టు చేశాయి, ఆపరేషన్లలో 706 మంది హతమయ్యారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలు ఎంతగా చొచ్చుకుపోయాయో తెలిపే మరో గణాంకం ఏమిటంటే, రాత్రిపూట 68 ల్యాండింగ్ హెలిప్యాడ్‌లతో పాటు 596 పటిష్టమైన పోలీస్ స్టేషన్లు, కొత్తగా 406 సీఆర్పీఎఫ్ క్యాంపులు నిర్మితమయ్యాయి.
ఈ ఆపరేషన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని చూస్తుంటే, 12 కోట్ల జనాభా ఉన్న ఈ జిల్లాలన్నింటిలో ప్రజాస్వామ్యాన్ని దాదాపుగా నాశనం చేసిన ఈ భయంకరమైన సమస్యను నిర్మూలించ డానికి గత ప్రభుత్వాలు ఏం చేశాయి అని ఆశ్చర్యం కలుగుతుంది. గత ప్రభుత్వాలు ఎందుకు విఫల మయ్యాయి? అని ప్రశ్నకు వాటికి నక్సలిజాన్ని తుడిచి పెట్టాలనే సంకల్పం లేకపోవడమే అనే సమాధానం వస్తుంది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలకు సంకల్పం ఎందుకు కొరవడింది? అనే ప్రశ్నకు రాజకీయాలు! అనే సమాధానం చాలా సులభం వస్తుంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య మొదలైంది. 1969లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద చీలిక వచ్చిన తర్వాత, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి పార్లమెంటులో కమ్యూనిస్టుల మద్దతు అవసరమైనప్పుడు, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో స్నేహపూర్వకంగా మెలగడం ప్రారంభించింది. అప్పటి నుండి, కాంగ్రెస్‌కు కమ్యూనిస్టుల పట్ల, వారి తీవ్రవాద రాజకీయ బంధువుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి ఏర్పడింది. అంతేకాకుండా, కాంగ్రెస్ ‘‘ప్రగతిశీల’’ పార్టీగా కనిపించాలని కోరుకుంది, అందుకే మధ్య భారతదేశమంతటా వ్యాపించి, చెదపురుగుల్లా దేశ కీలక భాగాలను తినేస్తున్న నక్సలిజంపై తీవ్రంగా దాడి చేయలేదు. దీనివల్ల గత ప్రభుత్వాలు బలహీనంగా స్పందించడంతో, నక్సలిజం, రెడ్ కారిడార్ డజను రాష్ట్రాలకు, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వ్యాపించాయి.
అందువల్ల, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ ముప్పును అంతం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిం చింది. హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో సమగ్రమైన, బహుముఖ విధానాన్ని అమలు జరిగేలా చూశారు. గత ప్రభుత్వాల విధానం ఫలితాల నివ్వడంలో విఫలమైంది. ఎందుకంటే నక్సల్ ముప్పును నిర్మూలించడం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభావిత జిల్లాలలోని స్థానిక ప్రజలకు అది ఎన్నడూ విశ్వాసాన్ని కలిగించలేదు. అందువల్ల, భయం కారణంగా, ప్రభావిత జిల్లాల ప్రజలు నక్సల్ బృందాలకు ‘‘విధేయులుగా’’ ఉండిపోయారు.
నరేంద్ర మోదీ హయాంలో పరిస్థితులు మారడం ప్రారంభించాయి. 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ హయాంలో నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 16,463 హింసాత్మక ఘటనలు జరగ్గా, 2014-2024 మధ్య మోదీ హయాంలో ఈ సంఖ్య 7,744కు తగ్గింది. అదేవిధంగా, మన్మోహన్ సింగ్ హయాంలో 1,851 మంది భద్రతా సిబ్బంది మరణించగా, మోదీ ప్రభుత్వ మొదటి పదేళ్లలో ఈ సంఖ్య 509కి పడిపోయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో పౌరుల మరణాలు కూడా 70 శాతం మేర గణనీయంగా తగ్గాయి.
ఈ ముప్పును అంతం చేయాలన్న హోం మంత్రి అమిత్ షా సంకల్పాన్ని, 2024లోనే ఆయన ‘మార్చి 31, 2026నాటికి నక్సలిజం అంతమవుతుంది’ అని ప్రకటించడమే తెలియజేస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని ప్రభుత్వాలు, పోలీసు బలగాలు, ఏజెన్సీలు పనిచేయడానికి ఇది ఒక కచ్చితమైన గడువును నిర్దేశించింది. ఇంత విస్తారమైన భౌగోళిక ప్రాంతంలో వ్యాపించిన అంతర్గత భద్రతా ముప్పును అంతం చేయడానికి, ఇంతకు ముందెన్నడూ ఏ భారత నాయకుడు కూడా ఇంతటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించలేదు. రెండేళ్ల క్రితం అలాంటి గడువును నిర్దేశించడం నిజంగా షా సాహసమే. ఒకవేళ ఆయన తన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైతే? ఇది ఒక పెద్ద రాజకీయ ప్రమాదమే అయినా, మోదీ-షా డబుల్ ఇంజిన్ లక్ష్యాన్ని సాధిస్తామనే ఏకాగ్రతతో, దృఢ సంకల్పంతో, విశ్వాసంతో ఉంది.
భద్రతా బలగాలు నక్సల్స్‌ను ఏరివేయడం ప్రారంభించినప్పటికీ, ప్రజాస్వామ్య పాలన చట్రంలో ఉండటం అంటే ఏమిటో ప్రజలకు తెలియ జేసేందుకు ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో నక్సల్స్‌ను ఏరివేస్తూనే, 12,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, వందలాది పోలీస్ స్టేషన్లను పటిష్టం చేసింది. 361 కొత్త శిబిరాలను ఏర్పాటు చేసింది. భద్రతా దళాలు, ప్రజల రాకపోకలను నిర్ధారించడానికి ఈ రహదారి ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. కొన్నేళ్లుగా నక్సల్స్ పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నారు. అందువల్ల ఈ కొత్త శిబిరాలు అత్యంత కీలకమయ్యాయి.
ప్రభుత్వం 8500కు పైగా మొబైల్ టవర్లు పనిచేసేలా కూడా చూసింది. సమాచార మార్పిడిని నిలిపివేయడానికి, స్థానికులు ఒకరితో ఒకరు, పోలీసులతో మాట్లాడుకోకుండా నిరోధించడానికి నక్సల్స్ మొబైల్ టవర్లను కూల్చివేశారు. అంతే కాకుండా, దశాబ్దాలుగా ప్రజలకు అందని ఉచిత రేషన్ సరఫరాను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఇది మాత్రమే కాదు. వామపక్ష ప్రభావిత జిల్లాల్లో 1,804 బ్యాంకు శాఖలు, 1,321 ఏటీఎంలు, 37,850 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను స్థాపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక చేరికను నిర్ధారించింది. గతంలో నక్సల్స్ ప్రభావంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్, తపాలా, డబ్బు పంపే సేవలను నేరుగా అందించేందుకు 5,899 పోస్ట్ ఆఫీసులను కూడా ప్రారంభించింది. అలాగే, 46 పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐలు), 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, మాడ్వి హిడ్మా వంటి నేతలను ఏరివేయడంలో సీఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ దళాల దృఢ సంకల్పాన్ని చూసినప్పుడు, తమ ఆట ముగిసిందని నక్సల్ నాయకత్వం నిర్ణయించుకుంది. అప్పుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీతో పాటు వంద లాది మంది సాయుధ కార్యకర్తలు సహా అగ్ర నాయ కులు నెమ్మదిగా లొంగిపోవడం ప్రారంభమైంది.
అమిత్ షా గమనించినట్లుగా, కాంగ్రెస్ పాలనలో 12 కోట్ల జనాభా ఉన్న 12 రాష్ట్రాలు ‘రెడ్ కారిడార్’లో చిక్కుకుని పేదరికంలో మగ్గాయి. ఈ హింసలో 20,000 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 5000 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కశ్మీర్, ఈశాన్య భారత్‌లోని చొరబాట్ల కంటే మావోయిస్టు హింసే పెద్ద సమస్య అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అంగీకరించినప్పటికీ, దానిని అంతంచేయడానికి సింగ్ ప్రభుత్వం ఏమీ చేయలేదు.
మోదీ-షా కూటమి నక్సలిజాన్ని నిర్మూలించ డానికి కృషి చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు లకు దీనిని అంగీకరించే సంస్కారం కూడా లేదు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో చాలా మంది నక్సల్స్ పాల్గొన్నారు. 2010లో ఒరిస్సాలో, 2018లో హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ నక్సల్స్, సానుభూతిపరులతో కలిసి వేదిక పంచుకోవడం కనిపించిందని షా పార్లమెంటుకు తెలిపారు. 172 మంది భద్రతా సిబ్బందిని హతమార్చిన హిడ్మాను భద్రతా దళాలు మట్టుబెట్టి నప్పుడు, ఇండియా గేట్ వద్ద నక్సల్ సానుభూతి పరులు చేసిన నిరసనపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్, నక్సల్స్‌కు ఆయన మద్దతు తెలిపిన అత్యంత సిగ్గుచేటైన సంఘటన. భద్రతాదళాలు కరడుగట్టిన నక్సల్స్‌ను మట్టుబెట్టినప్పుడల్లా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రభుత్వంపై దాడి చేశాయి. అయినప్పటికీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తామే ప్రజాస్వామ్య పతాకధారులమని నటిస్తున్నారు! కానీ, ప్రతికూలతలో కూరుకుపోయి, మోదీ ప్రభుత్వపు ఈ అసాధారణ విజయాన్ని అంగీకరించడానికి ఇష్టపడని ఈ పార్టీలను మనం విస్మరించాలి. వాస్తవం ఏమిటంటే, భారత్‌ను నక్సల్-ముక్త్‌గా మార్చడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చే వరకు దేశం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ముప్పు నుండి దేశాన్ని విముక్తి చేసినందుకు ఈ ఇద్దరు నాయకులకు దేశం అపారమైన కృతజ్ఞతతో రుణపడి ఉంది.

ఎ. సూర్య ప్రకాష్