“దేశ రక్షణకు ముప్పు కలిగించే అక్రమ వలసదారులను కఠినంగా శిక్షించి దేశం నుండి బహిష్కరించాలి. శత్రువులకు లేదా విదేశీయులకు ఆశ్రయం కల్పించడం దేశ క్షేమానికి, సుస్థిరతకు హానికరం. చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారిని అనుమతించడం బలహీనమైన పాలనకు సంకేతంగా భావిస్తారు..” అని రాజనీతిజ్ఞుడు చాణక్య చెప్పిన సూక్తులను తప్పకుండా అమలు చేయాల్సిన వాతావరణం దేశంలో ప్రస్తుతం కనిపిస్తుంది. చాణక్యుడి వలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “భారత్ ధర్మసత్రం కాదు. అక్రమ చొరబాటుదారులకు ఇక్కడ ప్రవేశం లేదు. బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో చొరబడిన వారందరినీ వారి దేశాలకు తరిమేస్తాం..” అని అమిత్ షా తీవ్రంగా హెచ్చరించారు. అక్రమ వలసదారులపై నాడు చాణక్యుడు, నేడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆచరణలో పెట్టాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు`2025’ ప్రకారం అక్రమ వలసదారులకు ఏడేళ్ల కారాగార శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశాలుండడంతో దేశంలోని కుహనా సెక్యులరిస్టులు కలత చెందారు. ఈ బిల్లును తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నేతలు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో చొరబాటుదార్ల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వారిని అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన భారత్ – బాంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయింది. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మతపరమైన నినాదాలతో అలజడి సృష్టిస్తూ చొరబాటుదార్లపై ఆ పార్టీకున్న ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడంతో కంచె ఏర్పాటు పెండింగ్‌లో ఉండిపోయిందని అమిత్ షా స్వయంగా మార్చి 27, 2025న లోక్‌సభలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాత్రను అస్సాంలో కాంగ్రెస్ పోషిస్తోంది. అక్కడ అక్రమ చొరబాటుదారులను తొలగించే క్రమంలో కొన్ని వర్గాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అక్రమ వలసదారులతో చేతులు కలిపింది.

ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారత్‌లో 50 లక్షలకుపైగా విదేశీ వలసదారులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది శరణార్థులున్నారు. అస్సాంలో చేపట్టిన ఎనఆర్‌సీ ప్రక్రియలో 19 లక్షల మందికి పైగా తమ వివరాలు చెప్పకుండా తప్పించుకున్నా రంటే వారి అక్రమాలు అర్థమవుతున్నాయి. అక్రమ వలసదారుల వివరాలపై పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. క్రైస్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం భారత్‌లో 2కోట్లకుపైగా అక్రమ వలసదారులున్నారు. వీరిలో అత్యధికంగా బాంగ్లాదేశ్ నుండి వచ్చిన వారున్నారు. మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ‘ఐడీఎసఏ’ పరిశోధన ప్రకారం దేశంలో కోటిన్నర మందికిపైగా చొరబాటుదారులున్నారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ 2025లో చేపట్టిన పరిశోధన ప్రకారం దేశంలో అక్రమ చొరబాటు దారుల సంఖ్య అధికంగా ఉందని తేలింది. 1997లో బాంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వలసదారుల సంఖ్య ఒక కోటి ఉండగా, 2016 నాటికి అది 2 కోట్లకు చేరిందని హోం శాఖ వర్గాలు ఉటంకిస్తున్నా ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుందని పలు సంస్థలు తెలిపాయి.

ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాం రాష్ట్రంలో ముస్లిం జనాభా 34.22 శాతానికి ఎగబాకింది. 2001లో కంటే ఇది 4 శాతం అధికం. ఇక 2026 నాటికి వీరి జనాభా పెరుగుదల అంచనాలకు అందదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అస్సాంలో నిర్వహించిన ఎనఆర్‌సీ ప్రక్రియలో 1.37 లక్షల అక్రమ వలసదారులను గుర్తించారు.

పశ్చిమ బెంగాల్‌లో 70 లక్షలకుపైగా అక్రమ వలసదారులు ఉన్నారని ఒక మీడియా సంస్థ అధ్యయనంలో తేలింది. ఆ రాష్ట్రంలో ఇటీవల మూడు వేల మందికి పైగా బాంగ్లాదేశ్ చొరబాటు దారులను బీఎసఎఫ్ భద్రతా దళాలు వెనక్కి పంపాయి. త్రిపురలో 10 లక్షల మంది, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లో 5 ýక్షల మంది ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 15 లక్షల మందికి పైగా బాంగ్లా దేశీయులు, రోహింగ్యాలు ఉండగా 2025లో మూడు వేలకుపైగా వలసదారులను ఇక్కడి నుండి పంపించి వేశారు. కొన్ని నివేదికల ప్రకారం మహారాష్ట్ర మురికివాడల్లో 10 లక్షల మందికిపైగా, బెంగుళూరులో 5 లక్షలకు పైగా, తమిళనాడులో 3 లక్షలకుపైగా, యూపీలో 5 లక్షలకుపైగా, హరియాణా, పంజాబ్‌లలో 3 లక్షలకుపైగా అక్రమ వలసదారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 40 వేలకుపైగా రోహింగ్యాలున్నారు. ఇక్కడ శాంతి భద్రతల ఉల్లంఘనలో వీరు కీలక పాత్ర పోషిస్తు న్నారు. దక్షిణాదిలోని కేరళంలో 2 లక్షల మంది ఉండగా, ఏపీలో చొరబాటు దారుల సంఖ్య నామమాత్రంగా ఉంది.

తెలంగాణలో ప్రధానంగా భాగ్యనగరంలో అక్రమ చొరబాటుదారుల సంఖ్య ముఖ్యంగా రోహింగ్యాల సమస్య తీవ్రంగా ఉంది. వారు దాదాపు 2 లక్షలకుపైగా ఉండవచ్చనే పలు అధ్యయనాలు చెబుతున్నా, దీనిపై అధికారిక లెక్కలు లేవు. తెలంగాణ హైకోర్టులో ఒక కేసు సందర్భంగా నగరంలో సుమారు 7000 మంది అక్రమ వలసదారులున్నట్టు ప్రస్తావన వచ్చింది. వీరిలో రోహింగ్యాలు, బాంగ్లాదేశీయులు ఉన్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఈ సంఖ్య 30 వేలకు పైగానే ఉంటుంది. కోర్టులో ఏడు వేల మంది ప్రస్తావన వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని, వెనక్కు పంపించేందుకు సాహసించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒకవైపు వారంటే భయం, మరోవైపు వారి బుజ్జగింపు ఓట్ల రాజకీయాలు అడ్డుపడుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో పాతబస్తీకి ఆనుకొని ఉన్న బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో అక్రమ వలసదారులు కాలనీలు నిర్మించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, స్థానిక మజ్లీస్ నేతల ఒత్తిడితో చొరబాటుదారులకు పలు గుర్తింపు కార్డులివ్వడమే కాకుండా, అక్రమంగా వెలిసిన ఆ కాలనీలకు విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో రోహింగ్యాల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రోహింగ్యాలు వంటి చొరబాటుదారులను తిప్పి పంపించాలని కోరుతూ గత జనవరి నెలలో ‘జాగో భాగ్యనగర్ చలో బాలాపూర’ పేరిట బాలాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్రమ చొరబాటుదారుల పైశాచికత్వంతోనే నగరంలో పలు చోట్ల ఇటీవల వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.

దేశంలోని పలు రంగాలపై అక్రమ చొరబాటు దారుల ప్రభావం పడుతోంది. వీరితో నిరుద్యోగం పెరగడమే కాకుండా కార్మికులకు ఉపాధి కూడా కరవవుతోంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలు అనర్హులకు కూడా దక్కుతుండడంతో అర్హులకు తీవ్ర అన్యాయం జరగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే దేశ శాంతి భద్రతలపై చొరబాటు దారుల ప్రభావం అధికంగా ఉంటుంది. పలు గణాంకాల ప్రకారం పలుచోట్ల బాంబు దాడులు, దేవాలయాలపై దాడులు, ఇతర అల్లర్లలో అక్రమ చొరబాటుదారుల హస్తం ఉంటుందని పలు ఘటనల్లో నిరూపితమైంది. నకిలీ గుర్తింపు పత్రాలు పొందిన వీరు పలు నేరాలకు పాల్పడుతున్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ రవాణా, నకిలీ కరెన్సీ వంటి కేసులు తీవ్రమవుతున్నాయి.

సరిహద్దులో ఉన్న బాంగ్లాదేశ్, పాకిస్తాన్ భారత్ లోకి అక్రమ చొరబాటుదారులను ప్రోత్సాహించి మన దేశాన్ని అస్థిర పర్చాలని నిత్యం కాచుకొని కూర్చొని ఉంటాయి. అస్సాం, పశ్చిమబెంగాల్‌లో అగ్గిని రాజేసుందుకు కుట్రలు పన్నే బాంగ్లాదేశ్‌కు ఇప్పుడు పాకిస్తాన్ కూడా తోడయ్యింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఇటీవల భారతదేశాన్ని హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం బాంగ్లా దేశ్‌తో సరిహద్దు కలిగి ఉంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు ఆ రాష్ట్రంతో ఎలాంటి సరిహద్దు లేదు. అయినా పాకిస్తాన్ ఇలాంటి కుట్రపూరిత ప్రకటన చేసిందంటే బాంగ్లా, పాక్ రెండు దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని నిరూపితమవుతోంది. నేరుగా మనపై యుద్ధం చేసే ధైర్యం లేని ఈ రెండు దేశాలు పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలను ప్రోత్సాహించి భారతదేశాన్ని అస్థిర పర్చాలని చూస్తున్నాయని ఈ ప్రకటనతో తేటతెల్ల మైంది. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికలను కొన్ని రాష్ట్రాల్లో అక్రమ చొరబాటుదారులు నకిలీ గుర్తింపు కార్డులతో శాసిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ‘సర’ ప్రక్రియ చేపట్టి పశ్చిమబెంగాల్‌లో కోటికి పైగా, అస్సాంలో రెండున్నర లక్షలకు పైగా ఓట్లను తొలగించింది.

2017-22 గణాంకాల ప్రకారం 15 వేలకు పైగా చొరబాటుదారులను వారి దేశాలకు తిప్పి పంపారు. చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనఆర్‌సీ నిర్వహించడంలో భాగంగా అస్సాంలో చేపట్టిన ప్రక్రియపై రాజకీయ దుమారం రేగినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆ రాష్ట్రంలో అక్రమ వలసలను ఒక దాడిగా పేర్కొంది. అక్కడి ఎనఆర్‌సీ ప్రక్రియను పర్యవేక్షించిన కోర్టు ప్రభుత్వానికి అక్రమ చొరబాటుదారులను నియంత్రించే బాధ్యత ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 2013-14లో ఎనఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైనా 2019లో బీజేపీ ప్రభుత్వం చొరవతో అస్సాంలో చివరి జాబితా విడుదల చేశారు. ఎనఆర్‌సీని దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. సీఏఏ బిల్లును పార్లమెంట్ 2019లో ఆమో దించింది. 2024-25లో ఈ ప్రక్రియ ప్రారంభ మైంది. ఈ రెండు చట్టాలతో పాటు ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025’ కూడా పూర్తి స్థాయిలో చేపడితే దేశంలో అక్రమ వలసదారులను కట్టడి చేసే అవకాశాలున్నాయి.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు దీన్ని తప్పుపడుతూ శరణార్థులను ప్రభుత్వం వేధిస్తుందంటూ విమర్శి స్తున్నాయి. శరణార్థులకు, అక్రమ వలసదారులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చొరబడేవారు అక్రమ వలసదారులయితే, ప్రభుత్వం అనుమతితో ఆశ్రయం కోసం వచ్చిన వారు శరణార్థులు. భారతదేశానికి అధికారికంగా టిబెట్ నుండి శరణార్థులు, శ్రీలంక నుండి తమిళులు పెద్ద ఎత్తున వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ దేశాల నుండి కూడా వచ్చి భారత్‌లో శరణార్థులుగా ఉంటున్నారు.

హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టు భారత దేశం ‘ధర్మసత్రం’ కాదు అనే భావనను ఆచరణలో పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడిన కుహనా సెక్యుల రిస్టులు ఇలాంటి విప్లవాత్మక చర్యలను తప్పుపడుతూ ఎలాగూ ముందుకు రారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి జాతీయ వాదులే నడుంకట్టి అక్రమ వలసదారుల నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల దీర్ఘకాలిక కలలైన అయోధ్యలో రామాలయం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, సీఏఏ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అదే చొరవతో ఇప్పుడు అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవాలి. పుణ్యభూమి అయిన భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నే ద్రోహులను వెళ్లగొట్టి మన దేశం చొరబాటుదారులకు ‘ధర్మసత్రం’ కాదని నిరూపించాలి. అదే సమయంలో సనాతన ధార్మిక విశ్వాసా లకు నెలవైన భారత్ సనాతన ధార్మిక దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. ఇంతకాలం బుజ్జగింపు రాజకీయాలతో ముష్కరులకు దేశాన్ని ధర్మసత్రంగా మార్చిన విధానాలకు ఇకపై ముగింపు పలకాలని కోరుకుందాం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE