ప్రస్తుతం ఇరాన్యు-ఎస్/ఇజ్రాయెల్‌ల మధ్య సంఘర్షణ ఇప్పుడు విధ్వంసకర ప్రాంతీయ యుద్ధం స్థాయికి చేరుకోవడం, హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని లేకపోతే నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేయడం తాజా పరిణామాలు. గత 20 సంవత్సరాల్లో మొదటిసారి అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రెíక్ ఈగిల్, ఎ-10 వార్‌థగ్ యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ రెండూ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ భూభాగంలో కూల్చివేతకు గురయ్యాయి. విచిత్రమే మంటే ఈ యుద్ధ విమానంలో ఇద్దరు పైలెట్లు ప్యారాచూట్ ద్వారా సురక్షితంగా ఇరాన్ భూభాగంలో దిగినట్టు కనిపించింది. ఇజ్రాయెల్ బుషెహర్ అణుకేంద్రం సమీపంలో దాడులు జరిపింది. ఒకవేళ ఈ అణుకేంద్రంపై వైమానిక దాడులు జరిపితే రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉన్నదని ఇరాన్ ఐక్యరాజ్య సమితిలో హెచ్చరించడం గమనార్హం.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి స్థాయిలో తన పట్టును కొన సాగిస్తున్న నేపథ్యంలో, బ్రండ్ క్రూడ్ ధరలు బ్యారల్‌కు 114 డాలర్లకు, గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు పెరగడం గమనార్హం. మరోవైపు ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలతో ఇరాన్‌కు వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఇరాన్ ప్రాక్సీలైన యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాద గ్రూపులు మార్చి 28 నుంచి ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగిన తర్వాత పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు యుఎస్/ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏడువేల మంది ఇరాన్ ప్రజలు మరణించారు. లెబనాన్, ఇరాన్‌లనుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం ఈ “అనవసర” యుద్ధం తెచ్చిన మరో విపరిణామం. నిర్దిష్ట లక్ష్యంగా తమ నేతలను ఇజ్రాయెల్/యుఎస్‌లు హతమారుస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్య దేశాల్లోని 18 అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. వీటిలో యాపిల్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థ లుండటం గమనార్హం.
పాకిస్తాన్‌కు శృగభంగం
యుద్ధం నిలుపుచేసే యత్నాల్లో భాగంగా మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు దేశాల ప్రయత్నాలు పూర్తిగా విఫల మయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించేదిలేదని ఇరాన్, ఇజ్రాయెల్‌లు కుండబద్దలు కొట్టడంతో పాకిస్తాన్‌కు అంతర్జాతీ యంగా తన స్థానమేంటో తెలిసొచ్చింది. యుద్ధంలో పాల్గొంటున్న ఇరాన్, ఇజ్రాయెల్‌లతో చర్చలు జరిపే పరిస్థితి లేనప్పుడు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు రావడమే తప్పు. కానీ డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు యు.ఎస్. తరపున ఒక దళారీలాగా వ్యవహరించింది తప్ప, మధ్యవర్తిత్వం వహించే స్థాయి పాకిస్తాన్‌కు లేదన్న సంగతి ఇరాన్, ఇజ్రాయెల్‌లు చెప్పకనే చెప్పాయి. విచిత్ర మేమంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కేవలం ఇండియాకు మాత్రమే ఉన్న దని, ప్రధాని నరేంద్రమోదీ తలచుకుంటే దీనికి చరమగీతం పాడగలరని ఇటు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ స్పష్టం చేయడం విశేషం. ఇరాన్, ఇజ్రాయెల్‌ల వైఖరి స్పష్టమైన నేపథ్యంలో చర్చలు జరపడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఇస్లామాబాద్ రాక నిలిచిపోయింది. ఇస్లామాబాద్ ఛానల్ విఫలం కావడంతో తుర్కియే, ఈజిప్టులు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. మధ్యవర్తిత్వ చర్చలను ఇస్తాంబుల్ లేదా దోహా కేంద్రంగా జరిపేందుకు గల అవకాశాలపై అవి పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్/యుఎస్‌లు దాడులు కేంద్రీకరిస్తున్న తాజా పరిణామాల నేపథ్యంలో, మధ్యవర్తిత్వం లేదా చర్చలకంటే పోరాటానికే ఇరుపక్షాలు ప్రాధాన్యమిస్తుండటం తాజా పరిణామం. విచిత్రమేమంటే మొదట్లో సౌదీ అరేబియా కూడా ఈ చర్చల్లో పాల్గొన్నప్పటికీ ఖతార్ వంటి దేశాలు వీటిని వ్యతిరేకించడం గమనార్హం.
పీకల్లోతు ఊబిలో ట్రంప్
ప్రస్తుతం ఈ యుద్ధంలో డోనాల్డ్ ట్రంప్ పీకల్లోతు కూరుకుపోయారు. ముందుకు పోలేక, వెనక్కు రాలేక, ఇంటా బయటా పెరిగిపోతున్న యుద్ధ వ్యతిరేక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. యుద్ధం వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు ఒకవైపు, కొద్దిరోజుల్లోనే ఇరాన్ దారికొ స్తుందనుకున్న అంచనా తల్లక్రిందులు కావడం మరోవైపు ట్రంప్ యంత్రాంగానికి కునుకు లేకుండా చేస్తున్నది. పాకిస్తాన్ నుంచి ఇరాన్‌పై దాడులు జరపాలన్నది యుఎస్ ఉద్దేశం. పైకి మాత్రం పాకిస్తాన్ నాయకత్వం అటువంటిదేమీ లేదని బుకాయిస్తున్నా, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు తలొగ్గక తప్పదు. ఒకవేళ అటువంటి అనుమతిని ఇచ్చినట్లయితే పాకిస్తాన్‌పై నేరుగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో, అమెరికాకు నచ్చజెప్పే సామర్థ్యం లేని పాక్ నాయకత్వం పరిస్థితి కుడితిలో పడ్డట్టయింది. పాకిస్తాన్‌కు సైనిక హార్డ్‌వేర్, ఐదోతరం స్టెల్త్ విమానాలు, క్షిపణులు ఇస్తామని ఆశ చూపి, పాకిస్తానీ సైనిక, నేవీ స్థావరాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం ట్రంప్ యంత్రాం గంలో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలోని “పస్ని” వద్ద యు.ఎస్ – నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పాక్ సైనికాధికార్లు రహస్యంగా అంగీకారం తెలిపారన్న వార్తలు వచ్చాయి. గత జనవరిలో రెండు దేశాల సైన్యాలు “ఇన్‌స్పైర్డ్ గ్యాంబిట్-2026” పేరుతో విన్యాసాలు జరపడం కూడా బలపడుతున్న సంబంధాలకు నిదర్శనం. ఒకవేళ పాకిస్తాన్ భూభాగం నుంచి అమెరికా దాడులు చేసినట్లయితే దేశంలోని 30శాతం షియా ముస్లింలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయ మని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పాక్ ప్రేలాపనలు
ఒకవేళ ఇరాన్ తమపై దాడులు చేస్తే, తాము భారత్‌పై ప్రతిదాడులకు దిగుతామని హెచ్చరించడం పాకిస్తాన్ పైత్యం పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం. ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధంలో ఏ సంబంధం లేని గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకు పడుతుండటాన్ని చూసిన పాకిస్తాన్ ఈవిధమైన ప్రేలా పనలు చేయడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం! భారత్ గల్ఫ్ దేశాల మాదిరి కాదన్న సంగతి, ఆపరేషన్ సిందూర్‌లో చావుదెబ్బతిన్న పాకిస్తాన్‌కు ఇంకా అర్థం కాకపోవడం ఆ దేశ పాలకుల మూర్ఖత్వానికి నిదర్శనం. ఒకవేళ అదే జరిగితే ఆపరేషన్ సిందూర్-2 యాక్టివేట్ అయి, ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉనికే లేకుండా చేయగల సామర్థ్యం భారత్ సొంతం. తన మాట వినని భారత్‌పై కోపంతో రగిలిపోతున్న ట్రంప్, ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు రహస్య ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వస్తున్న వార్తలు, పాకిస్తాన్ ప్రకటనను బలపరుస్తున్నాయి. అంటే భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడంలో పాక్‌కు వెన్నుదన్నుగా యుఎస్ ఉన్నదనేగా అర్థం. అటువంటి హామీ లేకుండా పాక్ ఇంత ధైర్యంగా ప్రకటనలు చేయదనేది నిష్టుర సత్యం.
ఇంధన సంక్షోభంపై భారత్ దృష్టి
మధ్యప్రాచ్య పరిణామాల వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి బయట పడే మార్గాలపై భారత ప్రభుత్వం ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90లక్షల మంది భారతీయుల క్షేమంపై శ్రద్ధ వహిస్తోంది. తాము ముంబయి, ఢిల్లీ నగరాలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులకు పాల్పడతామని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించడమే కాదు, ఒకవేళ అటు వంటి దుస్సాహసానికి పాల్పడితే ఈసారి పాకిస్తాన్ ఊహించని రీతిలో భారత్ ప్రతిస్పందన వుంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
నిశ్శబ్దంగా ముందుకెళుతున్న ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ తాను అనుకున్న లక్ష్యాలను నిశ్శబ్దంగా ఛేదిస్తూ వెళుతోంది. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 470 బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లను ధ్వంసం చేయడం ద్వారా దాని ప్రతీకార దాడుల శక్తిని 90% వరకు తగ్గించగలిగానని ఇజ్రాయెల్ చెబుతోంది. అంతేకాదు ఇరాన్‌కు చెందిన 90% నేవీని కూడా దెబ్బతీసానని స్పష్టం చేస్తున్నది. ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంవల్ల ప్రస్తుతం ఇజ్రాయెల్ విమానాలు స్వేచ్ఛగా ఇరాన్ భూభాగంలో ఎగురుతున్నాయి. ఇదే సమయంలో “రింగ్ ఆఫ్ ఫైర” (ఇరాన్ ప్రాక్సీలు) ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా దక్షిణ లెబనాన్‌లోని కొన్ని పరిమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలోని హిజ్‌బుల్లా సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి లిటానీ నదివరకు సెక్యూరిటీ జోన్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన పౌర, పారిశ్రామిక ప్రాంతాలపై దాడులను ముమ్మరం చేసింది. మషహర్ పెట్రోకెమికల్ జోన్ పై దాడులు జరపడం ఇందులో భాగమే. ఇదే సమయంలోఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలని డిజిటల్ వేదికల ద్వారా యు.ఎస్. ప్రచారం చేస్తోంది.
విజేత ఎవరు?
ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒకవేళ యుద్ధమే ముగిసిపోతే, నిశ్శబ్ద విజేతలుగా చైనా, రష్యాలు నిలుస్తాయి. చైనా ఇరాన్‌లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను వృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా పనిలో పనిగా తన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను కూడా ప్రారంభిస్తుంది. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా దీర్ఘకాలిక ఇంధన కాంట్రాక్టు ఒప్పందాలు కుదుర్చుకొని, రాజకీయంగా తన పలుకుబడిని మరింత పెంచుకుంటుంది. మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా యు.ఎస్. వనరులన్నీ దెబ్బతిన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దృష్టి కేంద్రీకరించడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో రష్యా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద గందరగోళ పరిస్థితులు సర్దుమణిగి, గల్ఫ్ దేశాల్లో ధ్వంసమైన చమురు, గ్యాస్ వనరులు తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా కాలం పట్టవచ్చు.
దౌత్య విజేతగా భారత్
బ్రిక్స్ కూటమి ఛైర్మన్‌గా, ఈ యుద్ధంలో తటస్థ వైఖరి అవలంబించిన భారత్ “దౌత్యపరంగా విజేత”గా నిలుస్తుంది. యుద్ధానంతరం కొత్త ఇరాన్ నాయకత్వం, పశ్చిమదేశాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి భవిష్యత్తులో ఇంధన సమస్య రాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఒక రూట్ మ్యాప్‌ను తయారుచేసే అవకాశముంది. యుద్ధానంతరం ఇరాన్ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఐఎంఎఫ్ 600 బిలియన్ డాలర్లు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు 15ఏళ్ల పాటు నడుస్తుంది. ముఖ్యంగా ఇరాన్‌లో ధ్వంసమైన ఉక్కు, ఇంధన, అణు మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను, పశ్చిమ దేశాలకు అనుగుణంగా రూపొందించే యత్నాలు జరుగుతాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ఉత్తర సిరియా, ఇరాక్‌ల్లో బఫర్‌జోన్‌పేరుతో తుర్కియే తన ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకునే యత్నం చేస్తుంది. తూర్పు మెడిటరన్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమన్ వరకు సముద్ర కారిడార్ వరకు విస్తరించిన ప్రాంతంలో భద్రత ప్రాంతీయ స్థిరత్వాన్ని శాసిస్తుంది. ఇవీ యుద్ధానంతరం జరగబోయే పరిణామాలు!

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్