కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తెలంగాణలో ప్రస్తుతం కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. పేర్లు ఏవైనప్పటికీ, ప్రాజెక్టులు ఎలా రూపకల్పన చేస్తున్నప్పటికీ, అభివృద్ధి పేరుతో చేపడుతోన్న కూల్చివేతల వల్ల తీవ్ర కలకలం చెలరేగుతోంది. హైడ్రా, మూసీ రివర్, ఖమ్మం భూదాన్ భూములు ఇలా మొన్నటిదాకా రాష్ట్రంలో కూల్చివేతల ప్రకంపనలు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల పేరుతో బుల్డోజర్లతో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఫలితంగా నిరుపేదలు, చిరు వ్యాపారులు, దశాబ్దాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్లు తీవ్ర నరకయాతన పడుతున్నారు. ఇన్నేళ్లుగా, దశాబ్దాలుగా లేని అభ్యంతరం ఉన్నపళంగా ఇప్పుడే ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తున్నారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఉపశమనం కలిగించకుండా, ఖాళీ చేయడానికి సమయం కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్లతో విరుచుకు పడటంతో తమ ఉపాధి దెబ్బతినడమే కాకుండా.. తమ జీవనోపాధికి ఆధారాలు పూర్తిగా బుల్డోజర్ల పాలవుతున్నాయని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూల్చివేతలు చేపడితే.. అక్రమ నిర్మాణాలు, అక్రమాలు అని గుర్తిస్తే.. ఒక ప్రణాళిక ప్రకారం ప్రత్యామ్నాయం చూపించడమో వేరేచోటుకు మార్చుకునేందుకు సమయం ఇవ్వడమో చేయాలి గానీ, ఉన్నట్టుండి నిర్మాణాలు కూల్చివేసి, తమ వ్యాపార సామగ్రి అంతా నేలమట్టం చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నిస్తున్నారు. తమలాంటి బడుగు జీవులపై ప్రతాపం చూపిస్తే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం కూల్చివేసింది తమ నిర్మాణా, వ్యాపారాలను కాదని, తమ జీవనోపాధి అని మండిపడుతున్నారు. ఫుట్‌పాత్‌ల క్లీనింగ్, క్లియరింగ్ పేరుతో జీహెచఎంసీ బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది. ఫలితంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఒకే రోజు దాదాపు 800 మంది చిరు వ్యాపారులు రోడ్డుపాలయ్యారు. జీహెచఎంసీ చేపడుతున్న ఈ అప్రకటిత కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలపై పగబట్టి నట్టుగా చేయొద్దని వినతులు వెల్లువెత్తుతున్నాయి.
పొట్టచేతపట్టుకొని బతుకు జీవుడా అంటూ ఆరుగాలం కష్టపడే బడుగుజీవులపైనా ప్రభుత్వం పంజా విసురుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ 4వ తేదీన ఒకే రోజు.. ఉదయం రహదారుల విస్తరణ, ఫుట్‌పాత్‌ల క్లీనింగ్ ముసుగులో రోడ్లపై అమ్మకాలతో జీవనోపాధి పొందే చిరువ్యాపారులపై బుల్డోజర్లను దింపడంతో తమ జీవితాలు రోడ్డుపాల య్యాయని రోదిస్తున్నారు. ముందస్తు నోటీసులు గానీ, ప్రత్యామ్నాయ చర్యలు గానీ చేపట్టకుండా ఏకంగా చర్యలకు దిగిన అధికారులపై బాధిత చిరు వ్యాపారులంతా తిరగబడ్డారు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని ఆందోళనకు దిగారు. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. నిత్యం శ్రమిస్తూ కుటుంబాలను పోషించుకుంటోన్న తమపై ప్రభుత్వం ఇలా కక్ష గట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో పలుచోట్ల అధికారులు జరిపిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ తీరును నిరసిస్తూ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
ఏప్రిల్ 4వ తేదీ తెల్లారేలోగా బుల్డోజర్లు, జేసీబీలతో జీహెచఎంసీ అధికారులు పలుచోట్ల రంగంలోకి దిగారు. ఆరు జోన్ల పరిధిలోని 798 నిర్మాణాలు కూల్చివేశారు. వాటిలో 340 పర్మినెంట్ నిర్మాణాలు ఉండగా, 458 తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయి. దీంతో చిరు వ్యాపారాలు చెల్లాచెదుర య్యాయి. ఆ చిరు వ్యాపారుల కుటుంబాల జీవితాలు అంధకారమయ్యాయి. మోండా మార్కెట్, ఆరాంఘర్, మదీనా ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పోలీసులు, అధికారులు తమ బలగాలతో కూల్చివేతలు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా, నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఒక్కసారిగా యంత్రాలతో విరుచుకు పడటంతో ఏండ్ల తరబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పాతబస్తీలోని లాడ్‌బజార్, రికాబ్‌గంజ్ రోడ్‌తోపాటు ఖైరతాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, ఆరాంఘర్ వరకు ప్రధాన రహదారులపై ఉన్న తోపుడు బండ్లు, చిన్నపాటి డబ్బాలను స్వాధీనం చేసుకొన్నారు. గడువు ఇవ్వాలని బాధితులు వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని బాధితులు నిరసన తెలిపినా కనికరించలేదు. జేసీబీల ఎదుట నిలబడి ఆందోళనకు దిగారు. నిరసనలతో ట్రాఫిక్ పోలీసులు సైతం వెనక్కి తగ్గారు.
దుకాణాల్లోని సామగ్రిని తీసుకొనేందుకు చిరు వ్యాపారులు అరగంట సమయం ఇవ్వాలని వేడుకొన్నా వినకుండా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఓ హైకోర్టు అడ్వకేట్ ఒకరు బాధితుల పక్షాన అధికారులను వేడుకున్నా వినిపించుకోలేదు. అధికారుల ఆదేశాలతో దుకాణాలను బుల్డోజర్ డ్రైవర్లు క్షణాల్లో నేలమట్టం చేశారు. మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో జీహెచఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతలను పలువురు ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకొన్నారు. జేసీబీ డ్రైవర్‌తోపాటు జీహెచఎంసీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకొంది. కూల్చివేతలకు ఉపయోగించే బుల్డోజర్, జేసీబీ వాహనాలపైకి చేరుకున్న నేతలు అధికారుల చర్యలను నిలదీస్తూ ఇప్పటివరకు జారీచేసిన నోటీసులు ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి కూల్చివేతలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు.
గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదని, కాంగ్రెస్‌ని గెలిపిస్తే తమ పొట్టలు కొడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారం చేసుకొని బతుకుతున్నామని, ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదని ఫుట్‌పాత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే, కొన్ని చోట్ల వ్యాపారుల నిరసనలతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన అధికారులు జేసీబీలతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు మూడు దశాబ్దాలుగా అక్కడే పూలు, ఇతర నిత్యావసరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నామని, కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇన్నేళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో తాము వ్యాపారంచేసుకునే సరుకులనుకూడా నేలపాలు చేశారని, మానవత్వం లేకుండా ప్రవర్తించారని కన్నీరు మున్నీ రయ్యారు.
పాదచారుల సౌకర్యం కోసమే ఫుట్‌పాత్‌లను క్లియర్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ చిరువ్యాపారుల కోసం ప్రభుత్వం కేటాయించాల్సిన ‘వెండింగ్ జోన్ల’ ఏర్పాటును విస్మరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా ఇన్నాళ్లుగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలను, నిర్మాణాలను చూసీచూడనట్లుగా వ్యవహరించిన అధికారులు.. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కూల్చివేతలకు దిగడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ఒక ప్రణాళిక ప్రకారం ప్రాంతాల వారీగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. ఆ ప్రత్యేక ప్రణాళికల్లో భాగంగా ఫుట్‌పాత్, వీధి వ్యాపారుల వివరాలు సేకరించి, వాళ్ల వ్యాపారాలు నష్టపోకుండా, ఉపాధి దెబ్బతినకుండా, ఒక కార్యాచరణ రూపొందించి, వాళ్లకు ఇతర ప్రదేశాల్లో వ్యాపార అవకాశాలు కల్పించేలా అధికారులు చొరవ చూపించాలని, నిర్మాణాలు ఉన్నపళంగా కూల్చివేయకుండా, కాస్త సమయం ఇవ్వాలని, ప్రాంతాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి వారితో చర్చిస్తూ, క్రమపద్ధతిలో ఫుట్‌పాత్‌లను క్లియర్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి అధికారులు ఈ కూల్చివేతల ప్రక్రియను ఇలాగే ప్రణాళిక లేకుండా కొనసాగిస్తారా? లేదంటే బాధితులకు ఉపశమనం కలిగించేలా కార్యాచరణ రూపొందిస్తారా? చూడాలి.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068