ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేర్చే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సందిగ్ధతలకు శాశ్వత ముగింపు పలుకుతూ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభ చేసిన తీర్మానానికి పార్లమెంటు ఉభయసభలు ఆమోదముద్ర వేశాయి. ఈ చారిత్రక నిర్ణయం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయం. దీనివల్ల రాష్ట్రంలో సుస్థిర పరిపాలనకు అత్యంత బలమైన పునాది పడింది. ఇన్నాళ్లూ రాజధాని లేదనే లోటు తీరడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన, అత్యంత స్పష్టమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడింది. పరిపాలనాపరమైన స్థిరత్వం కారణంగా దేశవిదేశాల పెట్టుబడిదారుల్లో అపారమైన నమ్మకం పెరిగి, ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది.

ఏ రాష్ట్రానికైనా రాజధాని నగరం కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన చోదక శక్తిగా పనిచేస్తుంది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల అద్భుతమైన ఆర్థిక ప్రగతిలో అక్కడి రాజధానులైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మహానగరాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 40 శాతానికి పైగా ఆదాయం ఒక్క బెంగళూరు నుంచే వస్తోంది. వస్తు సేవల పన్ను, ఆదాయ పన్ను, ఆస్తి పన్ను తదితర మార్గాల ద్వారా సమకూరే ఆ సంపదను ఇతర ప్రాంతాల సంక్షేమానికి వెచ్చిస్తున్నారు. అదే స్ఫూర్తితో అమరావతిని సైతం రాష్ట్రానికి ఒక బలమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక అమలవుతోంది. 189 కి.మీ.ల ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో, అద్భుతమైన జల, రోడ్డు, రైలు, వాయు మార్గాల అనుసంధానంతో అమరావతి రూపుదిద్దుకుంటోంది.

మౌలిక సదుపాయాలు – నిర్మాణ పనులు

తాజా పరిణామాలతో అమరావతి నిర్మాణ పనులకు అపూర్వమైన సార్థకత, స్థిరత్వం లభించాయి. రూ.58 వేల కోట్ల భారీ వ్యయంతో 94 అభివృద్ధి పనులకు భారత ప్రధానమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టారు. ఇందులో రూ.49 వేల కోట్లతో అమరావతిలో చేపట్టే 74 పనులు ఉన్నాయి. శాసనసభ, సచివాలయం, ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల భవనాలతో పాటు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రాజధానిలో వరద నివారణ పనులు, జలాశయాల నిర్మాణం జరుగుతోంది. రూ.5,028 కోట్లతో తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులు, రూ.3,620 కోట్లతో ఎనిమిది జాతీయ రహదారులు, మూడు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగాయి.

నవ నగరాల భావన

అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించ నున్నారు. అందుకోసం అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉన్న విజయవాడ ` గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అమరావతిని 53,748 ఎకరాల్లో నిర్మించాలని భావించారు. భూసేకరణకు బదులు భూసమీకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన 29,966 మంది రైతులు 34,400 ఎకరాల స్థలం ఇచ్చారు. రైతులిచ్చిన భూమిని అభివృద్ధి చేసి తిరిగి వారికి 25 శాతం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. రైతులిచ్చిన భూమిని విక్రయించడం ద్వారా లక్ష కోట్లకు పైగా వచ్చే ఆదాయంతో రాజధానిని అభివద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాంతానికి నీటి వసతి, రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధా నత ఉంది. అన్ని ఆదాయ వర్గాలకు చెందిన ప్రజలూ సౌకర్యంగా జీవించేలా నగర నిర్మాణ ప్రణాళికలను సీఆర్డీఏ రూపొందించింది. అభివృద్ధిని కేవలం 217 చ.కి.మీ.ల రాజధాని ప్రాంతానికే పరిమితం చేయకుండా, 189 కి.మీ.ల పొడవునా నిర్మించే ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ విస్తరించనున్నారు. 30 శాతం పచ్చదనం, జలాశయాలతో సరికొత్త హరిత నగరంగా నిర్మిస్తున్నారు. విశాలమైన రహదారులు, తాగునీరు, మురుగునీరు, వర్షపునీటి పారుదల వ్యవస్థలు, విద్యుత్, కేబుల్ వ్యవస్థలను భూగర్భంలోనే ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకం (నందిగామ), వారసత్వ సంపద (పాత అమరావతి), వ్యవసాయా ధారిత (గుంటూరు), భారీ పరిశ్రమలు (సత్తెనపల్లి), తేలికపాటి పరిశ్రమలు (తెనాలి), ఎలక్ట్రానిక్స్ (గుడివాడ), విమానాశ్రయ అనుబంధ పరిశ్రమలు (గన్నవరం), బహుళార్థక రవాణా పార్కు (నూజివీడు), ఆహారోత్పత్తులు (నూడివీడు) ఆర్థిక రంగాలను మేళవిస్తూ నవ నగరాల భావనతో సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నడిచి వెళ్లే దూరంలోనే నివాసాలు, కార్యాలయాలు ఉండేలా వసతులు కల్పిస్తున్నారు. నిర్మాణ దశలోనే ప్రభుత్వానికి సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయం పన్నుల రూపంలో రానుంది. ఈ నగరం ప్రస్తుతం 20 వేల మందికి ఉపాధి లభిస్తుండగా, 35 ఏళ్లలో సుమారు 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అంచనా.

రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల విస్తరణ రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. గోరంట్ల నుంచి హిందూపురం వరకు 34 కి.మీ.ల మేర రూ.809 కోట్ల రూపాయలతో నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద రూ.1,459 కోట్లతో స్వదేశీ పరికరాలతో రాకెట్లను పరీక్షించే అధునాతన క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో పాటు విద్యాసంస్థలు, అత్యాధునిక ఆసుపత్రులు, విమానాశ్రయాలు, సముద్ర తీర ఓడరేవుల నిర్మాణం భారీ ఎత్తున రాష్ట్రంలో జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అభివృద్ధికి రూ.11,444 కోట్లు  కేటాయించడం పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరట.

సాంకేతిక విప్లవం – పారిశ్రామిక ప్రగతి

అమరావతే రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ, నిర్ణయాల ద్వారా సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో రాష్ట్రం పలు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రంగా, డేటా సెంటర్లకు నిలయంగా మారు తోంది. ఆసియాలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ శంకుస్థాపన చేసింది. దీని ద్వారా ఐదేళ్లలో రూ.1,25,000 పెట్టుబడులు రానున్నాయి. సముద్రగర్భ కేబుల్ ద్వారా 12 దేశాలకు అనుసంధానం కానున్న ఈ ప్రాజెక్టు వల్ల 1,88,000 మందికి ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఏటా రూ.10,000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. భవిష్యత్ సాంకేతికతకు నిలయంగా అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ సము దాయాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే 15 దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను స్థాపించేం దుకు అంగీకారం తెలిపాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. తిరుపతి, కర్నూలు జిల్లాల్లో అధునాతన సెమి కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతున్నాయి. రూ.1,80,000 కోట్ల పెట్టుబడితో హరిత ఉదజని ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతుండటంతో రాష్ట్రం హరిత ఇంధన కేంద్రంగా మారుతోంది.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ నాయకత్వంలో జంట ఇంజిన్ల అభివృద్ధికి ఇది స్పష్టమైన నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న లక్షన్నర కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఈ ప్రగతికి ఎంతగానో దోహదపడుతోంది. రాజధాని నిర్మాణం, విశాఖలో సాంకేతిక కేంద్రాలు, రాయలసీమలో పారిశ్రామిక వాడలతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తోంది. దశాబ్ద కాలం పాటు వెనుకబడిన రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తరలి వస్తుండ టంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సింహభాగం వహించడం ఖాయం.

అస్థిరతకు, వితండవాదానికి పరాకాష్ట జగన్ ‘మావిగన’ ప్రతిపాదన

రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అత్యంత విమర్శనాత్మకంగా, హాస్యాస్పదంగా మారింది. తొలుత శాసనసభ సాక్షిగా అమరావతికి సంపూర్ణ మద్దతు పలికిన ఆయన, అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానుల రాగం అందుకున్నారు. ఆ తప్పుల వల్ల ఏ ఒక్క ప్రాంతాన్నీ అభివృద్ధి చేయకపోగా, ఏకైక రాజధానిగా ఎదుగుతున్న అమరావతిని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. దీనితో విసిగిపోయిన అన్ని ప్రాంతాల ప్రజలు ఎన్నికల్లో ఆయనను ఘోరంగా తిరస్కరించారు. తాజాగా పార్లమెంటు ఉభయసభలు అమరావతికి చట్టబద్ధత కల్పించిన శుభ తరుణంలో, ఆయన ‘మావిగన’ పేరిట మచిలిపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ఏకంగా 110 కి.మీ.ల పరిధిలో కొత్త రాజధానిని ప్రతిపాదిం చడం ఆయన రాజకీయ అస్థిరతకు నిదర్శనం. అమరావతి వ్యయంలో కేవలం 10 శాతంతోనే ఈ భారీ నగరాన్ని నిర్మించవచ్చని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అసలు గుంటూరు నుంచి మచిలిపట్నం వరకు ఇంత భారీ విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం కోసం రైతులు ఉచితంగా భూములు ఎందుకు ఇస్తారన్న కనీస వాస్తవాన్ని ఆయన విస్మరించారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి పూటకో ప్రకటనలతో రాష్ట్ర భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టడం సరికాదు. తన ఐదేళ్ల పాలనలో ఒక్క భవనం నిర్మించలేని నాయకుడు, ఇప్పుడు కొత్తగా ఊహాజనిత నగరాలను తెరపైకి తేవడం తన వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ తాజా వింత ప్రతిపాదన స్పష్టం చేస్తోంది.

తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE