‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ అవార్డులతో వెలుగులీనిన హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తుల ఖ్యాతి మరోసారి జాతీయ స్థాయిలో రెపరెపలాడిరది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కార్యక్రమంలో రాష్ట్రానికి ఏకంగా పది జాతీయ పురస్కారాలు లభించడం తెలుగువారికి గర్వకారణం. విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, కాకినాడ జిల్లా పెద్దాపురం నేత, సిల్క్‌చీరలు, బాపట్ల జిల్లా చీరాల చేనేత వస్త్రాలు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేస్ అల్లికలు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరలు హస్తకళల విభాగంలో పురస్కారాలు అందుకోగా, వ్యవసాయ విభాగంలో గుంటూరు మిర్చి, శ్రీకాకుళం జీడిపప్పు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి.
దేశంలోని ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి, వాటిని ప్రోత్సహించడం ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాకు ఒక బ్రాండ్‌ను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆయా ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ఎంపికైన ఉత్పత్తులకు నాణ్యత మెరుగుదల, సాంకేతిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్, బ్రాండిరగ్ వంటి అనేక రకాలుగా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలు, ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేస్తారు.
ఈ పురస్కారాలు కేవలం గుర్తింపు మాత్రమే కాదు. ఆయా ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన కళాకారులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు లభించిన ఒక పెద్ద ప్రోత్సాహం. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జాతీయ అవార్డు రావడం వల్ల ఈ ఉత్పత్తులకు దేశ, విదేశీ మార్కెట్లలో మరింత డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా సులభంగా రుణాలు, ఆర్థిక సహాయం అందే అవకాశం మెరుగుపడుతుంది. ఈ ఉత్పత్తులు తయారయ్యే ప్రాంతాలు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతాయి. అంతరించిపోతున్న సంప్రదాయ కళలకు, చేతివృత్తులకు పునరుజ్జీవం లభిస్తుంది. యువతరం ఈ వృత్తుల పట్ల ఆకర్షితు లవుతారు.
అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు – వాటి విశిష్టతలు
హస్తకళల విభాగం:
బొబ్బిలి వీణ (విజయనగరం జిల్లా):
బొబ్బిలి వీణను భారతీయ సంగీతంలో ఒక ప్రతిష్టాత్మక వాద్యంగా పరిగణిస్తారు. దీని తయారీకి పనస, లేదా రోజ్‌వుడ్ వంటి అరుదైన చెక్కలను ఉపయోగిస్తారు. ఒకే ఒక్క కర్ర దుంగతతో ఎలాంటి అతుకులు లేకుండా తయారుచేస్తారు. దీనిని ‘ఏకశిలా వీణ’ అని కూడా పిలుస్తారు. దీని నాదం మధురంగా, స్పష్టంగా ఉంటుంది. కళాత్మకమైన చెక్కడాలు, సింహతలాటం వంటి అలంకరణలు దీనికి రాజసాన్నిస్తాయి. ఇది దీన్ని జాతీయ, అంతర్జాతీయ సంగీత పరిశీలకులకు ఆకర్షణీయంగా మార్చింది. పూర్వం బొబ్బిలి సంస్థానాధీశులు సంగీతానికి ఇచ్చిన ప్రాధాన్యానికి ఇది నిలువుటద్దం. ఈ వీణకు 2012లో భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సైతం ఈ వీణను బహూకరించడం దీని ఖ్యాతికి నిదర్శనం.
ఏటికొప్పాక బొమ్మలు (అనకాపల్లి జిల్లా):
ఏటికొప్పాక బొమ్మలు ‘అంకుడు కర్ర’ అనే మెత్తటి కొయ్యతో, సహజమైన రంగులతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. పిల్లల కోసం ఆట బొమ్మలుగా, ఇంటి అలంకరణలుగా ఉపయోగిస్తారు. లక్కపిడతలు, గిలకలు, వంటసామాగ్రి సెట్లు వంటివి ప్రసిద్ధి. చెట్ల ఆకులు, బెరడు, విత్తనాల నుండి సేకరించిన రంగులను లక్కలో కలిపి వాడతారు. ఎలాంటి రసాయనాలు వాడరు. అందువల్ల ఇవి పిల్లలకు అత్యంత సురక్షితమైనవి. పర్యావరణ హితమైనవి. ఈ కళ వందల ఏళ్లుగా వస్తోంది. ఇవి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను కూడా పొందాయి.
పెద్దాపురం పట్టుచీరలు (కాకినాడ జిల్లా):
పెద్దాపురం పట్టు చీరలు నాణ్యతకు, మన్నికకు పెట్టింది పేరు. ప్రత్యేకమైన మగ్గంపై నేయడం వల్ల చీరకు ఒక ప్రత్యేకమైన ఆకృతి వస్తుంది. మగ్గంపైనే నూలుకు రంగు అద్దే సాంకేతికత ఈ చీరలకే సొంతం. ఒకప్పుడు పాతూరు గ్రామంలో ‘పాతూరు పట్టు చీరలు’ గా ప్రసిద్ధి చెందిన ఈ నేత కళ, పెద్దాపురం ప్రాంతానికి విస్తరించి తన ప్రత్యేకతను నిలబెట్టు కుంటోంది. ఈ పట్టు చీరలు, వాటి క్లిష్టమైన డిజైన్లు, గొప్ప అల్లికలకు, అద్భుతమైన నైపుణ్యం, శక్తిమంతమైన రంగులు, విలాసవంతమైన అనుభూతికి ప్రసిద్ధి చెందాయి. ధోతీలు, చొక్కాలు కూడా మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి.
చీరాల చేనేత చీరలు (బాపట్ల జిల్లా):
బాపట్ల జిల్లా చీరాల చేనేతలు తెలుగు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. ‘అగ్గిపెట్టెలో పట్టే చీర’గా ప్రఖ్యాతి గాంచిన ప్రాంతం చీరాల. ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం అలాంటిది. ‘కుప్పడం’ అనే ప్రత్యేకమైన నేత పద్ధతి ద్వారా చీరకు ఇరువైపులా పటిష్టమైన, ఆకర్షణీయమైన అంచులను (బార్డర్) నేస్తారు. ‘హ్యాండ్ బుట్టా’ డిజైన్‌లో భాగంగా జరీ డిజైన్ మధ్యలో చేతితో రంగులు అద్దడం మరో ప్రత్యేకత. 120 కౌంట్ నూలుతో నేయడం వల్ల ఈ చీరలు అత్యంత మృదువుగా, తేలికగా ఉంటాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు విదేశీ వస్త్రాలను బహిష్కరించి, చేనేతకు ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర చీరాలకు ఉంది.
వెంకటగిరి చీరలు (తిరుపతి జిల్లా):
తిరుపతి జిల్లాలో వెంకటగిరి చీరలు సున్నితమైన బన్నాలు, అద్భుతమైన జరీ బోర్డర్‌లతో ప్రసిద్ధి చెందాయి. ఈ వస్త్రాలను పరిశుభ్రమైన సిల్క్ థ్రెడ్‌లతో సాయంతో తయారు చేస్తారు. వీటి డిజైన్‌లు సాంప్రదాయక, ఆధునిక శైలులను కలిపి ఉంటాయి. ఈ వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గొప్ప డిమాండ్ కలిగి ఉన్నాయి. అత్యంత సున్నితమైన నూలుతో, జమ్దానీ సాంకేతికతతో వెంకటగిరి చీరలను నేస్తారు. ఈ చీరలపై హంసలు, నెమళ్లు, చిలుకలు, ఆకులు వంటి సుందరమైన జరీ బూటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తేలికగా, ధరించడానికి సౌకర్యవంతంగా ఉండటం వీటి లక్షణం. ఒకప్పుడు రాజవంశీకులు, జమీందారులు మాత్రమే ధరించే ఈ చీరలు, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ చీరలకు కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ ఉంది.
నరసాపురం అల్లికలు (పశ్చిమగోదావరి జిల్లా):
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అల్లికలు వాటి సూక్ష్మమైన చేతి పని, అందమైన కళాకృతికి ప్రసిద్ధి చెందాయి. ఈ అల్లికలు సాధారణంగా కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి మహిళలు తయారుచేస్తారు. దీనినే ‘క్రోచెట్ లేస్’ అంటారు. సన్నని నూలు దారాన్ని, చిన్న కొక్కెంతో అల్లడం ద్వారా అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తారు. 1844లో ఐరిష్ మిషనరీలు ఈ కళను ఇక్కడి మహిళలకు నేర్పించగా, నేడు ఇది అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. టేబుల్ క్లాత్‌లు, డోయిలీలు, కర్టెన్లు, దుస్తులు, అలంకరణ వస్తువులు వంటివి ఇక్కడ తయారవుతాయి. లక్షలాది మంది మహిళలకు ఇది ఉపాధి మార్గంగా నిలుస్తోంది. ఇటీవల ఈ కళకు కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది.
ధర్మవరం పట్టుచీరలు (శ్రీసత్యసాయి జిల్లా):
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టు చీరలు గాఢమైన రంగులు, భారీ డిజైన్‌లతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాయి. ఈ చీరలు రాయలసీమ ప్రాంతంలోని కళాకారుల చేతుల ద్వారా రూపొం దాయి. వీటిని వివాహాలు, మతపరమైన కార్యక్రమాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చీరల తయారీలో వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది.
ధర్మవరం చీరలు వాటి భారీ పట్టు, వెడల్పైన అంచులు, రిచ్ పల్లూలకు ప్రసిద్ధి. వీటిని ‘వివాహ పట్టుచీరలు’గా ఎక్కువగా ఇష్టపడతారు. చీర రెండు వైపులా విభిన్న రంగులతో కనిపించడం (డబుల్ షేడ్) దీని మరో ప్రత్యేకత. ఆలయాల గోపురాలు, ఏనుగులు, నెమళ్ల వంటి సాంప్రదాయక డిజైన్లను చీరలపై నేస్తారు. ఈ చీరల మన్నిక ఎక్కువ. వీటికి కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది.
వ్యవసాయ విభాగం:
గుంటూరు మిర్చి (గుంటూరు జిల్లా):
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చి దాని ఘాటుకు, రంగుకు పెట్టింది పేరు. దేశంలోని ఘాటైన, రుచికరమైన మిర్చిగా గుర్తింపు పొందింది. ఈ మిర్చిని వంటకాలలో ఉపయోగించడంతో పాటు ఎరుపు మిర్చి పొడి, మసాలా తయారీలో కూడా గణనీయమైన ఆవశ్యకతను కలిగి ఉంది. ఈ మిర్చిని సహజ విధానంలో సాగు చేస్తారు, ఇది దాని నాణ్యతను మరింత పెంచుతుంది. ఇక్కడి నేలలు, వాతావరణం మిర్చి సాగుకు అత్యంత అనుకూలం. 334, తేజ, సన్నం వంటి అనేక రకాలు ఇక్కడ పండుతాయి. గంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడి నుండి అనేక దేశాలకు మిర్చి ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. దీని కారం, రంగుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ‘గుంటూరు సన్నం మిర్చి’కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది.
శ్రీకాకుళం జీడిపప్పు (శ్రీకాకుళం జిల్లా):
శ్రీకాకుళం జిల్లాలో పండే జీడిపప్పు ప్రత్యేకమైన రుచి, నాణ్యత కు పేరు. జిల్లాలోని ఉద్దానం ప్రాంతం జీడిపప్పు సాగుకు ప్రసిద్ధి. నాణ్యత, పరిమాణానికి పేరుగాంచింది. ఇక్కడి వాతావరణం వల్ల పప్పులో తియ్యదనం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఈ పప్పును తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తారు. ఈ పప్పు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కలిగి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి గిరాకీ ఉంది. ఈ పప్పు తయారీలో సహజ పద్ధతులు అనుసరిస్తారు. పలాస పట్టణం జీడిపప్పు పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేక ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. స్థానికంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ పంట దోహదపడుతోంది. ఈ ఉత్పత్తులకు జాతీయ అవార్డులు రావడం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, వ్యవసాయ వారసత్వ సంపదకు, ఇక్కడి కళాకారులు, రైతుల నైపుణ్యానికి లభించిన గౌరవం. ఈ గుర్తింపుతో ఈ ఉత్పత్తులు ‘మేడ్ ఇన్ ఆంధ్ర’ బ్రాండ్‌తో ప్రపంచ మార్కెట్‌లో తమదైన ముద్ర వేస్తాయి.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్