అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం – ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. భారతకాలమానం ప్రకారం జులై 15, మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్ గ్రేస్’ వ్యోమనౌక శుక్లాతో పాటుగా మరో ముగ్గురు వ్యోమగాములను అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియాగోకు దగ్గర్లోని పసిఫిక్ సముద్ర తీర ప్రాంతానికి సురక్షితంగా చేర్చింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 02.31 గంటలకు డ్రాగన్ సముద్ర జలాలపైకి చేరింది. అంతకుమునుపు ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరిన డ్రాగన్ పసిఫిక్ సముద్ర జలాలకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉండగా డ్రాగన్‌కు చెందిన డ్రోగ్‌చూట్లు తెరుచుకున్నాయి. అప్పటికి డ్రాగన్ వందల కి.మీ.ల వేగంతో సముద్రం వైపునకు వస్తోంది. డ్రోగ్‌చూట్లు విచ్చుకున్న కారణంగా దాని వేగం గణనీయంగా తగ్గిపోయింది. మరికాసేపటికి దాని వేగాన్ని మరింత తగ్గించడానికి అన్నట్టుగా పారాచూట్లు తెరుచుకున్నాయి. చిక్కటి చీకట్లో ప్రత్యేకమైన వీడియో కెమెరాలతో లైవ్‌లో దర్శనమిస్తున్న డ్రాగన్ ఎక్స్‌రేలో చూస్తున్నట్టుగా పల్చటి గాలిబుడగల మధ్య నుంచి వేలాడుతున్నట్టుగా భూమిపైకి వస్తోంది. అంతా బాగుంది అనుకున్న తరుణంలో దట్టమైన బూడిద రంగు మేఘాలు డ్రాగన్‌ను చుట్టుముట్టాయి. కనపడకుండా చేశాయి. దీంతో భూమ్మీద నుంచి దాని రాకను పర్యవేక్షిస్తున్న స్పేస్ ఎక్స్ బృందం ఒకింత ఉద్రిక్తతకు గురైంది. అయితే కాసేపటికి మబ్బుల నుంచి వెలుపలకు వస్తున్న వ్యోమనౌకను చూసి ఊపిరి పీల్చుకుంది. సముద్రా నికి చేరువ అవుతున్న సమయంలో దానిపైకి ఫోకస్ లైట్ పడిరది. నింగి నుంచి నేలకు జారుతున్న గాఢమైన ఆకుపచ్చని తారలా డ్రాగన్ వెలిగి పోతూ కనిపించింది. కాసేపటికి అది నెమ్మదిగా సముద్ర జలాల్లోకి ఓ గాలి బుడగలా దిగి తేలియాడసాగింది. తన రంగు మార్చుకుంది. నల్లటి సముద్రంలో తెల్లటి వెలుగుల్లో మెరిసిపోసాగింది. మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ ఆరు నిముషాల తర్వాత తాము వెలుపలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ డ్రాగన్ నుంచే స్పేస్‌ఎక్స్ బృందానికి రేడియో సందేశం పంపించారు. ఆ సరికే డ్రాగన్‌ను సురక్షితంగా నౌక మీదకు సురక్షితంగా చేర్చడానికి అవసరమైన సిబ్బందితో ఆ చుట్టుపక్కల మోహరించిన స్పీడ్ బోట్లలో ఒకటి వేగంగా నీటిని చీల్చుకుంటూ డ్రాగన్ దగ్గరకు చేరుకుంది. ఎలాంటి వెలుగులు విరజిమ్మని డ్రాగన్ భూమి వాతావరణంలో వేడిమి కారణంగా అది కుంపట్లో కాల్చిన పనస గింజలా కనిపించింది. స్పీడ్ బోట్‌లో ఉన్న ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు పబ్లిక్ పార్కులో రాకెట్‌ను పోలిన జారుడు బల్లపైకి పిల్లలు లంఘించి నట్టుగా వ్యోమనౌక మీదకు ఎగిరి దుమికాడు. డ్రాగన్‌ను తాళ్లతో బంధించి, దానిపైనే ఉండిపోయాడు. ఆ తర్వాత స్పీడ్ బోటు తోడు రాగా షానన్ నౌక దగ్గరకు డ్రాగన్‌ను చేర్చారు. మార్గ మధ్యంలో సిబ్బందిలో మరో వ్యక్తి కూడా డ్రాగన్‌పైకి చేరుకున్నాడు. నౌక మీద నుంచి అక్కడి సిబ్బంది విసిరేసిన తాళ్లను వ్యోమనౌకకు ముడిపెట్టారు. నౌక సిబ్బంది డ్రాగన్‌ను తాళ్లతో నెమ్మదిగా లాగుతుండగా ఆ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా సముద్రంలోకి దూకారు. ఈత కొట్టు కుంటూ వెళ్లి వెనకనే వస్తున్న స్పీడ్ బోట్‌ను చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్ సిబ్బంది తాళ్లతో లాగుతుండగా షానన్ పైన వృత్తాకారంలో అమర్చిన మెత్తటి పరుపు మీదకు డ్రాగన్ చేరుకుంది. డ్రాగన్‌ను నౌక మీదకు చేర్చడానికి దాదాపు 15 నిముషాలు పట్టింది. సిబ్బందిలో ఇద్దరు డ్రాగన్ తలుపు తీసుకొని లోపలకు అడుగుపెట్టారు. బయట సిబ్బందికి వ్యోమగాములకు చెందిన సామగ్రిని లోపల నుంచే అందించారు. బైట ఉన్న సిబ్బంది ఆ తర్వాత తెరిచి ఉన్న తలుపునకు ఓ చెక్కబల్ల లాంటి దాన్ని చేర్చారు. నలుగురిని బైటకు తీసుకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కాస్త సమయం పట్టింది. యాక్సియోమ్-4 మిషన్ కమాండర్, అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ను భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.49 గంటలకు డ్రాగన్ నుంచి వెలుపలకు తీసుకొని వచ్చారు. ఆయన తర్వాత మరో మూడు నిమిషాలకు మిషన్ పైలట్ శుభాంశు శుక్లా, అనంతరం మిషన్ స్పెషలిస్ట్, పోలాండ్ వ్యోమగామి స్వావోష్ ఉజ్‌నాన్‌స్కీ విస్‌నియస్కీ, హంగరీకి చెందిన వ్యోమగామి టిబోర్‌కాపు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వెలుపలకు వచ్చారు. నలుగురూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

భూమి మీదకు క్షేమంగా తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా పైన అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ సందేశంలో శుక్లాకు అభినందనలు తెలిపారు. ‘‘రోదసీ యాత్రను ముగించుకొని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు హృదయపూర్వక స్వాగతం. యాక్సియోమ్ మిషన్-4ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చడంలో ఒక పైలెట్‌గా ఆయన పోషించిన పాత్ర భారత్ రోదసి పరిశోధనలతో పాటుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ తోడ్పాటుకు ఒక మైలు రాయిని నెలకొల్పింది’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోది శుక్లాకు స్వాగతం పలికారు. ప్రధాని ఎక్స్‌లో రాసు కొచ్చిన ఓ సందేశంలో ‘‘అంతరిక్షంలో చరిత్రాత్మక మిషన్‌ను పూర్తి చేసుకొని భూమికి దిగ్విజయంగా తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు యావత్ జాతితో కలిసి స్వాగతం పలుకుతున్నాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఆయన ప్రదర్శించిన అంకితభావం, సాహసం, మార్గదర్శక స్ఫూర్తి 140 కోట్ల మంది కలలకు స్ఫూర్తిని ఇచ్చింది. అది మన మానవరహిత మిషన్ – గగన్‌యాన్‌కు మరో మైలు రాయిని నెలకొల్పింది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
లక్నోలో కుటుంబ సభ్యుల సంబరాలు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నివసిస్తున్న శుక్లా తల్లిదండ్రులు అతడు భూమి మీదకు తిరిగి చేరుకోవడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. భావోద్వేగానికి గురయ్యారు. బంధు, మిత్రులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శుక్లా తల్లి ఆశా శుక్లా మాట్లాడుతూ, అంతరిక్షంపై చిన్నప్పటి నుంచి పెంచుకున్న మక్కువే అతడిని రోదసీకి పంపించేలా చేసిందని తెలిపారు. శుభాంశును క్షేమంగా భూమిపైకి చేర్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తండ్రి శంభుదయాల్ శుక్లా మాట్లాడుతూ అతడు కుటుంబాన్ని, యావత్ దేశాన్ని గర్వపడేలా చేశారని అన్నారు.
18 రోజులు.. 7 ప్రయోగాలు..!
శుక్లా ఐఎస్‌ఎస్‌లో ఉన్న కాలంలో ఏడు ప్రయోగాలు చేశారు. ఆయన చేసిన ప్రయోగాల్లో టార్డిగ్రేడ్, మయోజెనిసిస్, పెరట్లో పండిరచే ఆకుకూర విత్తనాలు, సైనోబ్యాక్టీరియా, మైక్రో ఆల్గే, పంట విత్తనాలు, వాయేజర్ డిస్‌ప్లేలు ఉన్నాయి. మొదటగా టార్డిగ్రేడ్‌లు ఎనిమిది కాళ్ల సూక్ష్మజీవులు. ఇవి అత్యంత ఉష్ణోగ్రతతో కూడిన లేదా రేడియో ధార్మికతతో కూడిన ప్రతికూలవాతావరణంలోనూ జీవించగలవు. శుభాంశు శుక్లా భారత్‌లోని టార్డిగ్రేడ్ లపై ఐఎస్‌ఎస్‌లో అధ్యయనం చేశారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో అవి మనుగడ సాగించే తీరును, పునరుత్పత్తిని, కాలానుగుణంగా వాటిల్లో వచ్చే మార్పులను పరిశీలించారు. ఇక రెండవ ప్రయోగం మయోజెనిసిస్‌కు సంబంధించినది. ఇది కండరాల్లోని కణాలకు ఉద్దేశించినది. వ్యోమగాములు ఎక్కువ కాలం రోదసీయాత్రలు చేసినప్పుడు వారి కండరాల సాంద్రత క్షీణిస్తుంది. దాంతో అవి బలహీన పడతాయి. భారత వ్యోమగామి ఈ కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణకు గురిచేశారు. వాటిలో మార్పులను పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాముల కండరాల సాంద్రత క్షీణించకుండా ఉండటానికి ఉపకరించే మార్గాన్ని కనిపెట్టవచ్చు. శుక్లా దీని తర్వాత భూమిపైన దొరికే పెసర, మెంతివిత్తనాలను తన కూడా ఐఎస్‌ఎస్‌కు తీసుకొని వెళ్లారు. వాటిని అక్కడి ట్రేలలో ఉంచారు. మరో ప్రయోగంలో భాగంగా పంట విత్తనాలపై కూడా ఆయన అధ్యయనం చేశారు. తద్వారా అక్కడి వాతా వరణంలో విత్తనాలు, మొక్కల పెరుగుదలను పరిశీలించారు. ఈ రెండు ప్రయోగాలూ భవిష్యత్తులో ఐఎస్‌ఎస్‌లో ఉండేవారికి ఆహార అవసరాలు తీర్చడానికి ఉపకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభాంశు అధ్యయనం చేసిన వాటిలో సైనోబ్యాక్టీరియా కూడా ఉన్నాయి. ఇవి ఆక్సిజన్‌ను, పోషకాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఐఎస్‌ఎస్‌కు అత్యంత కీలకమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంలో రీసైకిలింగ్ ప్రక్రియను మరింత సమర్థమంతంగా వినియోగించు కోవచ్చు. శుక్లా ప్రయోగాల్లో ఒకటైన మైక్రో ఆల్గే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన జీవ ఇంధనంగానూ ఉపయోగపడతాయి. వీటిపై అధ్యయనం అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి ఓ దారి చూపుతుంది. శుక్లా నిర్వహించిన ఏడు ప్రయోగాల్లో వాయేజర్ డిస్‌ప్లే ఒకటి. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో కంప్యూటర్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించినప్పుడు అవి వారి మెదడు, కళ్లు, ఇతర శరీర భాగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందీ తెలుసుకోవచ్చు.
వందల్లో సూర్యోదయాలు
శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లో ఉన్న కాలంలో భూమి చుట్టూ 310 సార్లు ప్రదక్షిణలు చేశారు. సాధారణంగా భూమి మీద 18 రోజుల్లో 18 సార్లు మాత్రమే సూర్యోదయాన్ని చూడగలం. కానీ శుక్లా అంతే సమయంలో 300కు పైగా సూర్యోదయాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
భారతీయ అంతరిక్ష కేంద్రం-బీఏఎస్‌కు బీజం
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి భూమికి 400 కి.మీ.ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం` ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం, అక్కడ 18 రోజులు గడిపి 60కి పైగా ప్రయోగాలు చేయడం, భూమికి సురక్షితంగా తిరిగి రావడం భారత అంతరిక్ష ప్రస్థానంలో కొత్త మలుపునకు ఊతమిచ్చింది. మానవులను రోదసికి పంపించి అక్కడ వారితో ప్రయోగాలు చేయించడానికి ఉద్దేశించిన గగన్‌యాన్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో గగనంలో భారతీయ అంతరిక్ష కేంద్రం`బీఏఎస్ ఏర్పాటుకు బీజం వేసింది. శుక్లాను ఐఎస్‌ఎస్‌కు పంపించడానికని మనదేశం చేపట్టిన మిషన్‌కు ఉన్న చరిత్రాత్మకమైన, సాంకేతికపరమైన, నిర్వహణాపరమైన ప్రాముఖ్యతను తక్కువ చేసి చూడకూడదు. భారత ప్రభుత్వానికి, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ`ఇస్రోకు నాసాతో, అమెరికన్ ప్రైవేట్ స్పేస్`టెక్ కంపెనీ యాక్సియోమ్ స్పేస్‌తో చేతులు కలపడం ద్వారా మిషన్‌ను సాకారం చేయడంలో ఎంతో ముందు చూపు ఉంది. ఈ భాగస్వామ్యం అధునాతన రోదసీ పరిశోధనలకు ఒక సంకేతంగా నిలుస్తుంది. మున్ముందు అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారం, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలు మరింత పెరగడానికి తోడ్పడుతుంది.
భారత్ దేశీయ పరిజ్ఞానంతో మానవులను రోదసిలోకి పంపించడానికి అవసరమైన సామర్థ్యా లను సాధించడమనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని తనకు తానుగా ఏర్పరుచుకుంది. అదే సమయంలో భూమికి దగ్గర్లోని కక్ష్యలో బీఏఎస్‌ను ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా ఆ లక్ష్యంలో భాగంగా చేసుకుంది. ఇస్రో గగన్‌యాన్ మిషన్‌కు కీలకమైన మానవ అవసరాలకు తగినట్టుగా ఎల్‌వీఎం3 పేరిట అత్యంత శక్తిమంతమైన వాహక నౌకకు ఒక సమగ్రమైన రూపాన్ని ఇచ్చే పనిలో ఉంది. బీఏఎస్ గగన్‌యాన్‌ను అనుసరిస్తున్నట్టుగా రోదసిలో భారత్ ప్రస్థానం ముందుకు సాగనుంది.
అయితే మానవసహిత అంతరిక్ష మిషన్ అత్యంత క్లిష్టమైనది. మిషన్‌కు ప్రణాళిక చేసుకోవడం దగ్గర నుంచి రోదసిలో మనుగడ సాగించడానికి అవసరమైన వ్యవస్థల నిర్వహణలో వ్యోమగాములకు శిక్షణ వరకు ఇలా కేవలం సాంకేతికంగానే కాకుండా నిర్వహణపరంగానూ అది ఎంతో క్లిష్టమైనది. భారత్‌కు ఈ నేపథ్యంలో గగన్‌యాన్ మిషన్ చేపట్టడానికి ముందు నిర్వహణాపరమైన అనుభవం ఎంతో కావాలి. ఈ ప్రయాణంలో గ్రూప్ కెప్టెన్ శుక్లా పాల్గొన్న లాంటి మిషన్లు అమూల్యమైన అడుగు జాడల్లాంటివి. ఈ దశలో ఇతర దేశాల అంతరిక్ష ఏజెన్సీలతో, ప్రైవేటు భాగస్వాములతో జట్టు కట్టడం ఎంతో ముఖ్యం. భారత్ ఈ క్రమంలో భారతీయ వైమానిక దళం నుంచి ఎంపిక చేసుకున్న శుక్లా సహా నలుగురు అధికారులకు గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో విస్తృతమైన శిక్షణ ఇప్పించడంలో రష్యాతో తనకు ఉన్న పటిష్టమైన దౌత్య సంబంధా లను వినియోగించుకుంటుంది. అమెరికాతో భారత్‌కు ఉన్న మంచి దౌత్య సంబంధాలు శుక్లాతో పాటుగా బ్యాకప్ గ్రూప్ కెప్టెన్ నాయర్‌కు టెక్సా స్‌లోని హూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లో మిషన్‌కు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇప్పించడంలో ఉపయోగపడ్డాయి. మనదేశం భారత సంతతికి చెందిన తేజ్‌పాల్ భాటియా సీయీవోగా ఉన్న యాక్సియోమ్ స్పేస్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా మిషన్‌ను కక్ష్యలోకి తీసుకొనివెళ్లడంలో కీలకమైన పాత్ర పోషించిన స్పేస్‌ఎక్స్ రాకెట్ అందుబాటులోకి వచ్చింది. ఇదంతా కూడా ఇస్రోకు గగన్‌యాన్ మిషన్‌కు అవసరమైన విస్తారమైన డేటాను సేకరించు కోవడంలోనూ, మిషన్‌ను మరింత మెరుగుపరుచు కోవడంలోనూ ఉపకరిస్తుంది. శుక్లా ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు ఉండి భద్రంగా తిరిగి భూమికి చేరుకోవడంతో భారత్ ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌కు మద్దతు లభించినట్టయింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ ఉద్దేశం ముగ్గురు వ్యోమగాము లను వ్యోమనౌకలో భూమి నుంచి 400 కి.మీ.లపైన కక్ష్యలో మూడు రోజులు పరిభ్రమించేలా చేసి, వారిని తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడం.
వ్యోమగాముల కలల తీరం – ఐఎస్‌ఎస్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం – ఐఎస్‌ఎస్ భూమిని ఆవరించి ఉన్న కక్ష్యలో పరిభ్రమించే అతిపెద్ద అంతరిక్ష వాహనం. ఇది వ్యోమగాములు, అంతరిక్ష యాత్రికులకు ఓ ఇల్లు. ఐఎస్‌ఎస్ ఓ అద్వితీయమైన ప్రయోగశాల. దీనిని అనేక దేశాలు కలసికట్టుగా పనిచేసి నిర్మించాయి. వ్యోమగాములు రోదసీలోనే విడివిడిగా ఉన్న భాగాలన్నింటినీ కలపడం ద్వారా ఐఎస్‌ఎస్‌కు రూపకల్పన చేశారు. ఇది భూమికి దాదాపు 402.336 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. గంటకు 28,163.52 కి.మీ.ల వేగంతో తిరుగుతుంది. దానర్థం అది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అమెరికా సమాఖ్య ప్రభుత్వానికి చెందిన ఓ స్వతంత్ర ఏజెన్సీ ఐన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్`నాసా రోదసిలో మనుషుల జీవనాన్ని, పనితీరును తెలుసుకు నేందుకు దీనిని వినియోగిస్తోంది. ఇలా తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో మానవులను కనీవినీ ఎరుగని రీతిలో రోదసీలోకి పంపించడాన్ని సుసాధ్యం చేస్తుంది.
ఐఎస్‌ఎస్ తొలి భాగానికి అంకురార్పణ నవంబరు, 1998లో జరిగింది. రష్యాకు చెందిన ఓ రాకెట్ రష్యన్ జార్యా అనే నియంత్రణ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించింది. అమెరికా దేశానికి చెందిన ఎండీవర్ అనే రోదసీ నౌక రెండు వారాల తర్వాత జార్యాను కక్ష్యలో కలుసుకుంది. అంతరిక్ష సిబ్బంది యూనిటీ నోడ్‌ను జార్యాతో జోడిరచారు. తర్వాతి రెండేళ్లలో ఐఎస్‌ఎస్ కోసమని మరిన్ని భాగాలను జోడిరచారు. మొట్ట మొదటగా ఐఎస్‌ఎస్ సిబ్బంది నవంబర్ 2, 2000లో చేరుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మరిన్ని భాగాల జోడిరపుతో నిర్మాణం కొనసాగింది. నాసా, ప్రపంచమంతటా ఉన్న దాని భాగస్వాములు 2011 నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేశాయి. ఐఎస్‌ఎస్ పరిమాణంలో ఓ ఐదు పడక గదుల ఇల్లు లేదా రెండు బోయింగ్ 747 జెట్‌లైనర్లు అంత ఉంటుంది. ఇందులో ఆరుగురికి చోటు ఉంటుంది. అదే ఐఎస్‌ఎస్‌ను భూమి మీద తూచినప్పుడు దాని బరువు 45,359.237 కిలోలు లేదా 45.359 టన్నులు ఉంటుంది. దీనికి బిగించిన సౌర ఫలకాల అమరిక అంచుల నుంచి కొలిచిన ప్పుడు అది ఓ ఫుట్‌బాల్ స్టేడియం అంత ఉంటుంది. ఇదంతా అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు పంపించిన ప్రయోగశాల మాడ్యూల్స్‌ను కలుపుకొని వేసిన లెక్కలు.
ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధన చేసుకోవడానికి ఉపకరించే ప్రయోగశాలలకు తోడు అనేక ఇతర విభాగాలు ఉంటాయి. రష్యా ప్రప్రథమంగా పంపించిన మౌలిక వ్యవస్థలతో కూడిన మాడ్యూళ్లు ఇది పనిచేయడానికి ఎంతగానో అవసరపడతాయి. అవి మానవులు బస చేయడానికి చోటును కూడా సమకూరుస్తాయి. నోడ్స్ అని పిలిచే మాడ్యూళ్లు దీనిలో విభాగాలను ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేస్తాయి. ఐఎస్‌ఎస్ తన రెక్కలను చాపుతున్నట్టుగా సౌర ఫలకాలు ఉంటాయి. ఇవి దీనికి విద్యుచ్ఛక్తి కోసమని సూర్యుడి నుంచి సౌర శక్తిని సేకరిస్తాయి. సౌర ఫలకాలు లంగోటీని పోలిన ట్రస్ అనే పొడవైన దాని ఆధారంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమై ఉంటాయి. ట్రస్ పైన అమర్చిన రేడియేటర్లు దీనిలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
ఐఎస్‌ఎస్‌కు ఆనుకొని వెలుపలి వైపు రోబొటిక్ బాహువులు బిగించి ఉంటాయి. ఇవి రోదసి కేంద్రం నిర్మాణంలో ఎంతగానో సాయపడటమే కాకుండా వ్యోమగాములు అందులో నుంచి వెలుపలకు వచ్చి శూన్యంలో నడుస్తున్నప్పుడు వారికి వెన్నుదన్నుగా ఉంటాయి. రోదసి యాత్రికులు వెలుపలకు తెరుచుకునే ఎయిర్‌లాక్స్ గుండా బైటకు వచ్చి అంతరిక్షంలో నడుస్తుంటారు. డాకింగ్ పోర్టులు ఇతర వ్యోమనౌకలను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కావడానికి అనుమతిస్తాయి. ఈ పోర్టుల ద్వారానే కొత్త రోదసీ యాత్రికులు, సందర్శకులు ఇక్కడికి చేరుకుంటారు. వారు భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడంలో రష్యన్ సూయిజ్ సేవలందిస్తుంది. రష్యన్ సూయిజ్‌కు చెందిన రోబోటిక్ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌కు అవసరమైన వస్తువులను డాకింగ్ పోర్టుల ద్వారా సరఫరా చేస్తుంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన అంతరిక్ష నౌకలు కూడా ఇలాంటి పనిలోనే ఉంటాయి. భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కు దేన్నయినా రవాణా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఉదాహరణకు ఒక గ్యాలన్ నీరు అంటే 3.78 లీటర్ల నీటిని ఐఎస్‌ఎస్‌కు చేర్చాలంటే 83,000 డాలర్ల ఖర్చవుతుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి తాగడానికి, తదితర అవసరాలకు రోజుకు 12 గ్యాలన్ల నీరు కావాలి. అంత నీరు పంపించాలంటే నాసాకు ఖర్చు తడిసి మోపెడంత అవుతుంది. అందుకని ఐఎస్‌ఎస్ అందుబాటులో ఉన్న ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టే ఓ సంమిశ్రమైన నీటి వ్యవస్థను కలిగి ఉంటుంది. అది పునరుపయోగించే స్నానపు నీరు, అంతకు ముందు ఉండిపోయిన వ్యోమగామి చెమట, మూత్రం, తదితరాలను శుద్ధి చేసిన తర్వాత వచ్చే తాగు నీటిని వ్యోమగాములకు సమకూరు స్తుంది. ఐఎస్‌ఎస్ అదే సమయంలో అత్యవసరం కోసమని దాదాపు 530 గ్యాలన్ల నీటిని సైతం నిల్వ ఉంచి పెడుతుంది. నాసా నీటి వ్యవస్థలు ఐఎస్‌ఎస్‌లో నీటి ఎద్దడి లేకుండా మనుషుల నుంచి, పరిశోధన కోసమని తెచ్చిన జంతువుల శ్వాస నుంచి తేమ, చెమట, మూత్రం, నీటి సింకుల నుంచి వాడగా వచ్చిన నీరు, స్నానపు నీటిని సేకరిస్తుంటాయి. ఇదే విషయమై ఐఎస్‌ఎస్ నీటి వ్యవస్థను అలబామాలో మార్షల్ ఫ్లయిట్ సెంటర్ నుంచి నిర్వహించే లేనె కార్టర్ మాట్లాడుతూ ‘‘మీరు అది మూత్రాన్ని శుద్ధి చేయగా వచ్చిన నీరు అని అనుకోనంతవరకు అచ్చం మన దగ్గర బాటిల్‌లో దొరికే నీటిలాగే మంచి రుచిగా ఉంటుంది’’ అని అన్నారు. అలాగని అక్కడున్న వ్యోమగాములందరూ మూత్రాన్ని శుద్ధి చేయగా వచ్చిన నీటిని తాగుతారు అని అనుకుంటే పొరపాటే. ఐఎస్‌ఎస్‌లో రెండుగా ఉన్న నీటి వ్యవస్థల్లో ఒకటి అమెరికాది ఐతే మరొకటి రష్యాది. అమెరికా నీటిలో ఎలాంటి మలినాలు లేకుండా ఉండటానికి అయోడిన్ వాడుతుంటే రష్యా మాత్రం అయోడిన్‌కు బదులుగా వెండి లోహాన్ని వినియోగిస్తుంటుంది. భూమికి దాదాపు 400 కి.మీ.ల ఎత్తున ఉన్న ఐఎస్‌ఎస్‌లో ఉన్న మనుషులకు ఊపిరాడటానికి ఎలక్ట్రోలిసిస్ – విద్యుద్విచ్ఛేదనం అనే ప్రక్రియ పనికొస్తుంది. ఇది ఆక్సిజన్‌ను తయారు చేస్తుంది. ఇందుకోసమని ఆక్సిజన్ ఉత్పాదక వ్యవస్థ – ఓజీఎస్ ఐఎస్‌ఎస్‌లో ఉంటుంది. ఇది నీటిని ఎలక్ట్రోలైజ్ చేయడం ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి ఐన ఆక్సిజన్‌ను ఐఎస్‌ఎస్ కేబిన్‌లలోకి పంపిస్తారు. ఓజీఎస్ పర్యావరణ నియంత్రణ, జీవ మద్దతు వ్యవస్థ – ఈసీఎల్‌ఎస్‌ఎస్‌లో ఓ భాగంగా పనిచేస్తుంటుంది. ఈసీఎల్‌ఎస్‌ఎస్‌లో ఓజీఎస్‌తో పాటుగా నీటిని తిరిగి సేకరించే వ్యవస్థ – డబ్ల్యూఆర్‌ఎస్ ఉంటుంది. ఓజీఎస్, డబ్ల్యూఆర్‌ఎస్ ఈ రెండూ కూడా కాడెద్దుల్లా కలిసికట్టుగా పనిచేస్తుంటాయి.
ట్యూబుల్లో ఆహారం నుంచి క్యారెట్ హల్వా దాకా..!
మానవుడు రోదసిలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అంటే 1961లో తన ఆకలి తీర్చుకోవడానికి చిన్నపాటి అల్యూమినియం గొట్టాల నుంచి లేహ్యం లాంటి ఆహారాన్ని తినేవాడు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న టెక్నాలజీకి తోడు ఇంటి దగ్గర ఏవైతే తింటున్నారో దాదాపు అలాంటి ఆహారాన్ని అంతరిక్షంలో వ్యోమగాములు ఇష్టంగా తినే మంచి రోజులు వచ్చేశాయి. రోదసిలో ఐఎస్‌ఎస్ ఆవిర్భ వించిన కొద్ది రోజులకే అందులో బస చేసిన వారికి మన పుల్కాలను పోలిన టోర్టిల్లాలను రుచి చేసే భాగ్యం దక్కింది. టోర్టిల్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎస్‌ఎస్‌కు ఎంతో మంది యాత్రికులు వస్తూపోతున్నప్పటికీ అందరికీ ఇష్టమైన ఆహారంగా నిలిచిపోయింది. టోర్టిల్లాతో ఉన్న సౌలభ్యం ఏమిటంటే దీనితో అల్పాహారం, హామ్‌బుర్గర్‌లు, జెల్లీ సాండ్‌విచ్‌లు చేసుకోవచ్చు. ఆ తర్వాతి కాలంలో పిజ్జాలు, కాయగూరలు, పండ్లు, ఐస్‌క్రీమ్ ఐఎస్‌ఎస్ తలుపు తట్టాయి. వ్యోమగాముల జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. శుభాన్షు శుక్లా తాజాగా ఐఎస్‌ఎస్‌లో తోటి వ్యోమగాములకు క్యారెట్ హల్వా రుచి చూపించారు.
ఐఎస్‌ఎస్‌తో ఏదైనా సాధ్యమే
మానవులు నిత్యం రోదసీలో ఉండటాన్ని ఐఎస్‌ఎస్ సుసాధ్యం చేసింది. ఇది తన కార్యకలాపా లను ప్రారంభించుకున్న నాటి నుంచి మనుష్యులు నిత్యం అందులో ఉంటూనే వస్తున్నారు. వ్యోమ గాములు దీంట్లో ఉన్న ప్రయోగశాలలను ఉపయో గించుకుంటూ భూప్రపంచంలో కానీ మరెక్కడ కానీ చేయలేని పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధన భూమిపైన మానవాళికి ప్రయోజనాలు చేకూరు స్తుంది. అంతరిక్షంలో చేస్తున్న పరిశోధనను మన దైనందిన జీవనంలో వినియోగించుకుంటున్నాం. పరిశోధన ఫలితాలను ‘స్పినోఫ్స్’ అంటారు. అంటే అనుత్పాదకతలు అని అర్థం. మానవులు మైక్రో గ్రావిటీ – సూక్ష్మ గురుత్వాక్షరణలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు వారి దేహానికి ఏమౌతుందనే దానిపైన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు. నాసా, భాగస్వామ్య దేశాలు అంతరిక్ష నౌకను ఆరోగ్యంగా ఎలా ఉంచేదీ నేర్చుకు న్నాయి. నేర్చుకున్న పాఠాలన్నీ కూడా భవిష్యత్తులో చేపట్టే శోధనలకు కీలకమౌ తాయి. నాసా ప్రస్తుతం ఇతర ప్రపంచాలను కనుక్కోవడానికి పనికొచ్చే ఓ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అంతరిక్షంలో ఐఎస్‌ఎస్ ఏర్పాటుతో ఆ కసరత్తుకు దశాబ్దాల క్రితమే తొలి అడుగు పడిరది. నాసా ఐఎస్‌ఎస్ నుంచి నేర్చు కున్న పాఠాలను రోదసిలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దూరతీరాలకు చేరుకునే మానవ సహిత యాత్రలను చేపట్టడానికి వాడుకుంటుంది.
వ్యోమగాముల కర్మాగారం
అమెరికాలో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ – నాసా, స్పేస్‌ఎక్స్ తరహాలో మనదేశంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో వ్యోమగాములను, శాస్త్రవేత్తలను తయారుచేస్తుంటుంది. వారి ద్వారా రోదసిలో పరిశోధనలను చేయిస్తుంటుంది. ఇస్రోలో చేరాలని ఆశించేవారు. ఏరోనాటిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ఏరోస్పేస్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ చేసి ఉండాలి. అదే ఇస్రోలో ఉన్నత హోదాల కోసమైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. భారత్‌లో ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాలు ప్రతిభ, ప్రవేశ పరీక్షల ద్వారా జరుగుతాయి. అందుకోసమని సీపీజీయీటీ, ఐఐటీ జేఏఎం, జీఏటీయీ లాంటి ప్రధానమైన ప్రవేశపరీక్షలు ఉన్నాయి. భారత్‌లో స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లుగా ఐఐటీ-మద్రాస్, ఐఐటీ`బాంబే, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ`ఖరగ్‌పూర్, ఐఐటీ -హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) – ఢిల్లీ పేరొందాయి.
గుర్తుకొస్తున్నాయి..
శుక్లా డైరీలో కొన్ని పేజీలు..!
జూన్ 26, 2025 గురువారం
నా చిన్ననాటి కల నేటితో నెరవేరింది. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టాను అనేకంటే తేలుతూ వచ్చాను అంటే సరిపోతుంది. నాలో ఆనందం ఆకాశాన్ని?! అంటింది. అలా లోపలకు వస్తున్న నన్ను అప్పటికే అక్కడ ఉన్న వ్యోమగాముల్లో ఒకరు ఆలింగనం చేసుకున్నారు. వెల్‌కమ్ డిర్రక్ ఇచ్చారు. ఆ డిర్రక్‌ను తాగుతూ వాళ్లతో మాట కలిపాను. అయినప్పటికీ నా చూపులతో మొత్తం రోదసి కేందాన్న్రి చదివేస్తున్నాను. అప్పుడే ఐఎస్‌ఎస్ నియమాల గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత అక్కడి ఆనవాయితీ పక్రారం నాలోని భావోద్వేగాన్ని ఒక పస్రంగం రూపంలో వినిపించాను. జన్మను ఇచ్చిన తల్లిదండుల్రకు, నన్ను ఇక్కడ దాకా తీసుకొనివచ్చిన నా మాతృభూమికి ధన్యవాదాలు తెలిపాను. ఆ తర్వాత అందరం కలిసి భారరహిత స్థితిలో డిన్నర్ చేశాము.
********
జూన్ 28, 2025 శనివారం
ఈ రోజు నా జీవితంలో ఎంతో పత్య్రేకమైన రోజు. మన పధ్రాని మోదీజీతో వీడియో కాల్‌లో మాట్లాడాను. వారు భూమి మీద.. నేను ఐఎస్‌ఎస్‌లో. మీరు భారత జాతీయ పతాకాన్ని అంతరిక్ష కేందర్రలో ఎగురవేశారు అని మోదీజీ అన్నప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అదే మాట వారితో అన్నాను. ఈ ఘనత నా ఒక్కడిది కాదు 140 కోట్ల మంది భారతీయులది అని. అందుకు మీరు మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ కోట్లాది భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు అని మోదీజీ అన్నారు. ఆ మాట నా హృదయాన్ని తాకింది. నన్ను భావోద్వేగానికి గురిచేసింది. నా పేరును పస్త్రావిస్తూ మీ పేరులో శుభం ఉంది.. మీ యాత భారత అంతరిక్ష రంగంలో నవయుగానికి శుభారంభం అని మోదీజీ అన్నారు. అంతటి మహానాయకుడు నాకు చేతులు జోడిరచి నమస్కరిస్తుంటే ఏం చెయ్యాలో అర్థంకాక చేష్టలుడిగిపోయాను. రోదసి నుంచి ఏమేం చూశారని పధ్రాని నన్ను అడిగారు. అందుకు సమాధానంగా కొద్దిసేపటి కిత్రం కిటికీ నుంచి చూస్తుంటే హవాయి దీవులు కనిపించాయి. ఒక్క రోజులో సూర్యోదయ, సూర్యాస్తమయాలను 16 సార్లు చూశాను అని చెప్పాను. మరి భూమి, భూమిపైన భారత్ ఎలా కనిపించింది అని మోదీజీ అడిగారు. అందుకు బదులుగా రోదసి నుంచి చూసినప్పుడు భూమి ఎలాంటి హద్దులు లేకుండా కనిపించింది. దేశాలు కనిపించలేదు. రాష్టాల్రు అసలే కనిపించలేదు. భూమి మనందరి ఏకైక నివాసంగా కనిపించింది. భారత్‌ను తొలిసారి చూసినప్పుడు మ్యాప్‌లో చూసినదాని కన్నా చాలా పెద్దగా, గొప్పగా కనిపించింది. నా జన్మభూమి ఎంతో అద్భుతమైనది అని పధ్రానితో అన్నారు. నా మాటలకు వారు ఎంతో సంతోషించారు. నన్ను అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మోదీజీ తో మాట్లాడిన ఘట్టం ఈ డైరీతో పాటుగా నా జ్ఞాపకాల్లో పదిలంగా మిగిలిపోతుంది.
********
జూలై 8, 2025 మంగళవారం
ఈ రోజు మేఘాలయా, అస్సాం రాష్టాల్ల్రో చదువుకుంటున్న బాల బాలికలతో మాట్లాడాను. దీని కోసమని హ్యామ్ రేడియోను వాడుకున్నాను. నిజంగా విద్యార్థులంటే ఇలాగే ఉండాలి కదా అని అనిపించింది వాళ్ల మాటలు వింటుంటే. మా మధ్య 10 నిమిషాలపాటు జరిగిన సంభాషణలో 20 పశ్న్రలు వేశారు. ఉన్నది కొద్ది సమయమే అయినా వాళ్లడిగిన పశ్న్రలన్నింటికి వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా సమాధానాలిచ్చాను. టైమ్ విషయంలో భూమ్మీదలాగానే ఐఎస్‌ఎస్‌లో సూర్యుడిని ఫాలో అవుతారా అని ఒక స్టూడెంట్ అడిగాడు. అందుకు నేను ఐఎస్‌ఎస్‌కు సూర్యుడితో సంబంధం ఉండదు కాబట్టి గీన్ర్‌విచ్ మీన్ టైమ్‌ను ఫాలో అవుతామని చెప్పాను. కొందరు విద్యార్థులు అడిగిన పశ్న్రలు వ్యోమగామిగా నేను శిక్షణ పొందిన రోజులకు నన్ను తీసుకొనివెళ్లాయి. అయితే 10 నిమిషాలే కాబట్టి అంతా రాపిడ్ ఫైర్ సెషన్‌లాగా సాగిపోయినట్టు నాకు అనిపించింది. ఆరోగ్యపరంగా ఐఎస్‌ఎస్‌లో తీసుకోవాల్సిన జాగత్త్రలు, ఇలాంటి అనేక విషయాలను వాళ్లతో పంచుకున్నాను. చివరగా.. తలుచుకుంటే మీలో ఒకరు చందుడ్రి మీద అడుగుపెట్టవచ్చు అని అన్నాను. నా మాటలకు వాళ్లు కేరింతలు కొడుతున్న శబ్దం నాకు హ్యామ్ రేడియోలో వినిపించింది.
********
జూలై 13, 2025 ఆదివారం
ఈరోజు ఐఎస్‌ఎస్‌కు వీడ్కోలు పలికే రోజు. నన్ను, నా దేశాన్ని అంతరిక్షంలో సమున్నతంగా నిలిపిన ఈ యాత చరితాత్మ్రకమైనది. ఇది నాకు మాతమ్రే కాకుండా యావత్ భారతావని సమష్టి సాధనకు ఓ మైలురాయి లాంటిది. ఈ మిషన్ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించింది. ఐఎస్‌ఎస్‌లో మేం చేసిన పదులకొద్దీ పయ్రోగాలు మనదేశంలో యువతకు స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను. హద్దుల్లేకుండా కన్న కలలను నిజం చేసుకోవడానికి ఇదొక మార్గదర్శిగా మిగిలిపోతుంది. ఇలా అనుకుంటూ వీడ్కోలు పస్రంగం చేస్తుండగా 1984లో వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి నుంచి పలికిన ‘సారే జహాసే అచ్చా..’ గుర్తుకొచ్చింది. నేను కూడా అదే పలికాను. బరువెక్కిన హృదయం ఒకవైపు, అనిర్వచనీయమైన ఆనందం మరోవైపు నన్ను కుదిపే స్తుండగా పస్రంగాన్ని ముగించాను. ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారందరికీ వీడ్కోలు చెప్పాను.
– జాగృతి డెస్క్