దక్షిణ భారతదేశంలో భారతీయ నాగరికత, సంస్కృతీ సంప్రదాయాల ఆనవాళ్లు లేకుండా చేయడానికి తమిళనాడు కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో ద్రవిడవాదపు పెద్దలు, క్రైస్తవ మత ప్రచారకులు ఒక జుగుప్సాకరమైన బంధంతో పెనువేసుకు పోయారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అపురూపమైన మన సంపదను మనది కాకుండా చేయడానికి పీకల్లోతు ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. దానిని ఘనమైన భారతీయ నాగరికత కాలిగోటికి సైతం ఏ మాత్రం సరిపోని పాశ్చాత్య నాగరికతతో ముడిపెట్టే పనిలో ఉన్నారు. భారతీయ మూలాలకు క్రైస్తవం అనే అంటుకట్టే సాహసానికి పూను కుంటున్నారు. ఈ అపవిత్రమైన కార్యానికి పెట్టుబడి కోసమని పాశ్చాత్య దేశాల నుంచి మనదేశానికి నిధులు వరద వెల్లువెత్తుతోంది. సామాజిక సేవ ముసుగులో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనేక ప్రభుత్వేతర సంస్థలు – ఎన్జీవోలు ఈ పాపకార్యానికి కాపుకాస్తు న్నాయి. నేర చరిత్రలో నిండా మునిగిన ఓ రెవరెండ్‌్‌ మన నాగరికతను లేకుండా చేయడానికి దేశవిదేశాల్లో తన పలుకుబడిని ఉపయోగించుకొని చేయాల్సిందంతా చేస్తున్నాడు. ఇంతటి దారుణానికి ఒడిగడు తున్న ఈ మూక కడకు తమిళనాడులో తవ్వకాల్లో బైటపడిన శిథిలాల అసలు కాలాన్ని మార్చి, వాటిని తమకు అనుకూలమైన కాలానికి చెందినవిగా నిరూపించడానికి కిందామీదా పడుతోంది.

టెర్రకోట మట్టి కుండ

తమిళనాడులోని కీళడి గ్రామంలో చేపట్టిన పురావస్తు తవ్వకాలు ఈ దారుణానికి కార్యక్షేత్రంగా మారింది. ఇదే విషయమై పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ హరిశంకర్‌ తన పరి శోధనా పత్రంలో పలు దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తవ్వకాల పేరుతో సాగించిన అరాచకాలను తూర్పారపట్టారు. భారతీయ నాగరికతతో ముడిపడిన తమిళనాగరికత క్రైస్తవీకరణకు కుట్రలు పన్నుతున్న డీఎంకే ఎంపీ కనిమొళి, ఆయుధాల ఏజెంట్‌ రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌ తవ్వకాలు జరిగిన చోటున అణువణువును సందర్శించారు. దీనికి అప్పట్లో తవ్వకాలకు నేతృత్వం వహించిన కె. అమర్‌నాథ్‌ రామకృష్ణ కారణమయ్యారు. ఆ ఇద్దరిని ఆయన తవ్వకాలు జరుగుతున్న చోటుకు స్వయంగా తీసుకొని వెళ్లారు. అయితే భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియా లజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా` ఏఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎస్‌ సత్యమూర్తిని మాత్రం అక్కడకు రావడానికి అనుమతించ లేదు సరికదా తవ్వకాల్లో బైటపడిన వస్తువులను కనీసం చూడనైనా చూడనివ్వ లేదు. ఇదిలా ఉంటే భారతీయ ఆత్మనిర్భర భారత్‌ పేరిట దేశీయ పరిజ్ఞానంతో స్వావ లంబన దిశగా ముందుకు సాగుతున్న మనదేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, పరికరాలతో కూడుకున్న ప్రయోగశాలలకు కొదవేముంది? అలాగని తవ్వితీసిన పురాతన వస్తువులను భారత్‌లో ప్రయోగశాలలకు పంపిస్తే వాటి అసలు కాలం బయటపడుతుంది. దాంతో ఇటుక మీద ఇటుక అన్నట్టుగా భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, క్రైస్తవ మతానికి అండగా కట్టుకున్న కలల సౌధం కూలిపోతుంది. అందుకునే ఈ గడ్డమీదనే పుట్టి, ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తున్న దుండుగుల ముఠా పురాతన వస్తువులను విదేశాల్లో ప్రయోగశాలలకు పంపించేలా చేయడంలో అక్కడ తనకున్న పలుకుబడిని విచ్చలవిడిగా వాడుకుంది. వాటి కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. మనదేశ విద్యాసంస్థల్లో పురావస్తుశాస్త్రంలో పెద్ద పెద్ద చదువులు చదివి ప్రభుత్వంలో అత్యున్నత పదవులను పొందిన వారు మన నాగరికతపై ఇంటి దొంగలు అండగా పాశ్చాత్య నాగరికతా ప్రభువులు సాగిస్తున్న దండయాత్రకు దారి చూపించడం దేశ ద్రోహానికన్నా మించిన నేరం. అయినా సరే నిస్సిగ్గుగా, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దుతున్నామనే కనీస స్పృహ లేకుండా పోయిన కొందరు అధికారులు ద్రవిడవాదపు పెత్తందార్లకు, మన దేశ చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసి అందులో ఇసుమంతైన భారతీయత లేకుండా చేసే తమిళనాట ఘనత వహించిన విశ్వవిద్యా లయాల్లో చరిత్రకారులకు, చర్చి ఫాదర్లకు దాసోహమన్నారు. రాత్రికి రాత్రే నివేదికలో రాతలు, అంకెలు మారిపో యాయి. పురావస్తు వస్తువుల కాలమాన పరిస్థితులూ మారిపో యాయి. ఇంతటి నాగరికతా ఘోర విధ్వంసానికి పవిత్ర వైగై నదీ తీరంలో వెలసిన కీళడి గ్రామం కార్యక్షేత్రంగా మారింది. ఇంతకీ ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నది మరెవరో కాదు. హిందీ భాష అంటే మంట, దశాబ్ద కాలానికిపైగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంటే కడుపు మంటతో రగిలిపోతున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ హయాంలోని తమిళనాడు సర్కారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి, నేర చరిత్ర ఉన్న రెవరెండ్‌ జస్పెర్‌ రాజ్‌. వీరందరికి అదుపాజ్ఞల్లో పనిచేసే కొన్ని ఎన్జీవోలు. ప్రజల దృష్టిని డీఎంకే సర్కారు అవినీతి నుంచి, తీరని సమస్యల నుంచి మరల్చడానికి కీళడిలో తవ్వకాల వ్యవహారాన్ని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకోవడానికి ఈ ముఠా ప్రయత్నిస్తోంది. అలాగని మోదీ సర్కారు డీఎంకే రంగస్థలం పైన నడుస్తున్న నాటకం విషయంలో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అనుకుంటే పొరపాటు పడినట్టే. మన వారసత్వ సంపదకు అద్దం పట్టే పురాతన వస్తువుల పుట్టుకను వక్రీకరించిన వారి తలరాతలను మార్చే పనిలో కేంద్రం ఉంది. నివేదికల మీద నివేదికలు అడుగు తోంది. ఇవాళ కాకపోతే రేపైనా అసలు నిజం వెలుగులోకి రాకుండాఉండదు. అప్పుడిక ద్రవిడవాదాన్ని భుజాలకు ఎత్తుకొని, క్రైస్తవాన్ని చంకన పెట్టుకొని, పాశ్చాత్య పోకడలను ఊత కర్రగా చేసుకొని ప్రజల మీద పెత్తనం చేస్తూ భారతీయతను భూస్థాపితం చేయాలనుకునే స్టాలిన్‌ లాంటి రాజకీయ నాయకుల ఆట కట్టవుతుంది.


టెర్రకోట పూసలు

తమిళ నాగరికత ఆనవాళ్లు

కీళడి గ్రామంలో 2013-14, 2014-15, 2015-16 ఇలా మూడు సీజన్లలో పురావస్తు ప్రదేశాల కోసమని తవ్వకాలు జరిగాయి. వీటికి భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా` ఏఎస్‌ఐ సూపరింటెండిరగ్‌ ఆర్కియాలజిస్ట్‌ (ఎస్‌ఏ) కె. అమర్‌నాథ్‌ రామకృష్ణ నేతృత్వం వహించారు. వైగై నది వెంబడి పురావస్తు ప్రదేశాలు, అవశేషాలను కనిపెట్టడం ఈ తవ్వకాల ఉద్దేశం. అందులో భాగంగా వైగై నది వెంబడి దాదాపు 293 పురావస్తు ప్రదేశాలు, వివిధ రకాల పురాతన అవశేషాలు ఉన్న లోయను గుర్తించారు. ఇది నేల మట్టానికి రెండున్నర మీటర్ల దిగువన ఉందని కనుగొన్నారు. ప్రస్తుతం ఏఎస్‌ఐ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం 3.5 కి.మీ.ల వ్యాసార్థంలో 80 ఎకరాల మేర విస్తరించి ఉంది. కొందగై, మణలూర్‌ అనే పురాతన పట్టణాలు కూడా ఈ ప్రాంతంలో భాగం. ఈ తవ్వకాలు ఇక్కడి సాంస్కృతిక పరిణామాలపై కీలకమైన వివరాలను అందిస్తు న్నాయి. అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రాసాగాయి.

ప్రారంభంలో, ఈ ప్రదేశం క్రీ.పూ. 5వ శతాబ్దం, క్రీ.పూ. 3వ శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు. దీన్ని నిర్ధారించడం కోసమని 2017లో ఇక్కడి నుంచి రెండు నమూనాలను కార్బన్‌ డేటింగ్‌ (రేడియో కార్బన్‌ సహాయంతో వయసును నిర్ధారించే ప్రక్రియ) కోసమని అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలో మియామీలోని బీటా అనలిటిక్‌ అనే రేడియో కార్బన్‌ డేటింగ్‌ ప్రయోగశాలకు పంపించారు.

ఎముకలతో తయారుచేసిన నేత పని సామగ్రి

జూలై, 2017లో కార్బన్‌ డేటింగ్‌ ఫలితాలు వచ్చాయి. రెండు నమూనాలు సుమారు 2,200 సంవత్సరాల క్రితం అంటే క్రీ.పూ. 3వ శతాబ్దం నాటివని అవి నిర్ధారించాయి. నాల్గవ దశ తవ్వకం నుంచి పొందిన నమూనాల రేడియో కార్బన్‌ డేటింగ్‌లో ఒక కళాఖండం క్రీ.పూ. 6వ శతాబ్దం నాటిదని తేలింది. మరొక నమూనా కాలాన్ని నిర్దారించడంలో మరింత కచ్చితత్వాన్ని ప్రదర్శించే యాక్సలెరేటర్‌ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ`ఏఎంఎస్‌ డేటింగ్‌ కోసమని బీటా అనలిటిక్‌కు పంపించారు. అది భూమిలో 353 సెం.మీ.ల లోతు నుంచి సేకరిం చింది. ఏఎంఎస్‌ డేటింగ్‌ ఫలితాల్లో ఆ నమూనా 580 బీసీయీ(సాధారణ శకానికి పూర్వం) నాటిదని తేలింది.

కీళడి తవ్వకాల్లో ఇటుక గోడలతో కట్టిన భవనాలు, మట్టి పాత్రలు, టెర్రకోట మట్టికుండలు, పాత్రలు, పూసలు, విలువైన గాజులు, రాళ్లు, చదరంగంలో ఉపయోగించే పావులు, పొత్రం, దంతపు దువ్వెన, ఎముకలతో తయారు చేసిన నేత పనిలో వాడే సామగ్రి, వలయాకార బావులు బైటపడ్డాయి. ఇటుకల్లో కొన్ని 38 సెం.మీ.ల పొడుగు, 26 సెం.మీ.ల వెడల్పు, 6 సెం.మీ.ల మందంతో ఉన్నాయి. మరి కొన్ని 38 సెం.మీ.ల పొడుగు, 23 సెం.మీ.ల వెడల్పు 6 సెం.మీ.ల మందం కలిగి ఉన్నాయి.

ఈ ఆవిష్కరణల గురించి పురావస్తు శాస్త్రవేత్త వేలప్పన్‌ మాట్లాడుతూ తమిళులు నది ఒడ్డున చెరువులలో నీటి కోసం బావులను ఉపయోగించారని సూచించే పురాతన సంప్రదాయాన్ని ఇది రుజువు చేస్తుందని అన్నారు. పురాతన కాలంలో అరుదుగా భావించే ఇటుక భవనాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో బైటపడ్డాయి.

కీళడి ఇనుప యుగం నుంచి ప్రారంభ చారిత్రక కాలానికి పరివర్తనను వివరించే ఓ ప్రదేశం. ఇనుప యుగం, ప్రారంభ యుగం మధ్య ఉన్న సంబంధా లను, చారిత్రక కాలం, తదుపరి సాంస్కృతిక పరిణామాలు అర్థం చేసుకోవడానికి కీళడిలో తవ్వకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

కీళడి తవ్వకాల్లో వెలుగుచూసిన ఆరు వస్తువు లను అధికారులు ఏఎంఎస్‌ డేటింగ్‌ కోసమని బీటా అనలిటిక్‌కు పంపించారు. ఈ వస్తువులు క్రీ.పూ. ఆరు, మూడు శతాబ్దాల మధ్య కాలానివని పరీక్షలో తేలింది. భూమి ఉపరితలం నుంచి 353 సెం.మీ.ల లోతులో బయటపడిన వస్తువులు క్రీ.పూ.580వ సంవత్సరానివని, 200 సెం.మీ.ల లోతులో దొరికినవి క్రీ.పూ. 205వ సంవత్సరానివని పరిశోధనలో వెల్లడైంది. ఈ రెండు లోతుల ఎగువన, దిగువన ఇంకా వస్తువులు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొని, కీళడి తవ్వకాల ప్రాంతం క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందినదిగా ఏఎస్‌ఐ తేల్చింది.

బ్రహ్మి లిపలో కుండపై రాసిన ఆదన్, కువిరన్

ప్రస్తుత తమిళనాడు చరిత్ర క్రీ.పూ. మూడో శతాబ్దంతో మొదలవుతుంది. అయితే గంగా నదీ తీర పట్టణ నాగరికత తరహాలో అప్పట్లో తమిళనాడులో పట్టణ నాగరికత లేదని అధ్యయన కారులు భావిస్తూ వచ్చారు. కానీ, గంగా పట్టణ నాగరికత కాలంలోనే తమిళనాడులో పట్టణ నాగరికత ప్రారంభమైందని కీళడి తవ్వకాల్లో లభించిన తాజా ఆధారాలు చెబుతున్నాయి.

కోడుమణల్‌, అళగాంకుళం గ్రామాల్లో గతంలో లభించిన శాసనాలను బట్టి బ్రాహ్మి లిపి క్రీ.పూ. మూడో శతాబ్దం నాటిదని భావించారు. కీళడిలో బయల్పడిన వస్తువులు ఈ లిపి క్రీ.పూ. ఆరో శతాబ్దానిదని సూచిస్తున్నాయి. కీళడిలో సుమారు 2,600 ఏళ్ల క్రితం నివసించినవారు అక్షరాస్యులని, వారికి చదవడం, రాయడం వచ్చని ఈ ఆధారాలను బట్టి తెలుస్తోందని తమిళనాడు పురావస్తు శాఖ తెలిపింది. కీళడి తవ్వకాల్లో పరిశోధకులకు సుమారు 70 ఎముకలు లభించాయి. వీటిలో 53 శాతం ఎముకలు ఎద్దు, బర్రె, మేకలు, ఆవులు లాంటి జంతువులవి. నాటి ప్రజలు పశుపోషణ చేసినట్లు వీటిని బట్టి స్పష్టమవుతోంది.

ఇక్కడ దొరికిన గవ్వలు, కళాఖండాల్లో, ఇసుక, ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్నట్లు గుర్తించారు.

భారత్‌లో గుర్తించిన అత్యంత పురాతన శాసనం సింధు లోయ నాగరికతది. సింధు లోయ నాగరికత ముగిశాక, బ్రాహ్మి లిపిలో శాసనాలు రూపొందించక ముందు శాసనాలు వేయడానికి గ్రాఫిటీ (గోడ రాతలు) అనే పద్ధతి వాడుకలో ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. సింధు నాగరికత శాసనాల తరహాలో ఈ గ్రాఫిటీ పద్ధతులను అర్థం చేసుకోవాల్సి ఉంది. బృహత్పరికర లేదా మహాపాత్రా (మెగాలిథిక్‌) నాగరికతలో, కాంస్య యుగ నాగరికతలో ఈ పద్ధతుల్లో రాసిన శాసనాలు ఉన్నాయి. కీళడిలో 1001 కళాఖండాల్లో ఈ శాసనాలు కనిపించాయి. 56 కళాకృతులపై బ్రాహ్మి లిపిలో శాసనాలు ఉన్నాయి. ఆదన్‌, కువిరన్‌ ఆద(న్‌) అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవి కుండలపై ఉన్నాయి. ఈ రాతలను సాధారణ పద్ధతికి భిన్నంగా, కుండ పూర్తిగా తయారై ఆరిపోయాక రాశారు. ఒకరి కంటే ఎక్కువ మంది వీటిని రాసి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.

కీళడిలో నాలుగు మీటర్ల ఎత్తున్న కుండను పోలిన కళాఖండాలను పెద్ద మొత్తంలో రెండు చోట్ల కనుగొన్నారు. నాడు కుండల తయారీ పరిశ్రమ భారీగా ఉండేదని వీటి ఆధారంగా ఏఎస్‌ఐ అంచనాకు వచ్చింది.

నాటి మహిళలు ధరించిన ఏడు వేర్వేరు ఆభరణాల్లోని కొన్ని భాగాలను పరిశోధకులు కనుగొన్నారు. టెర్రకోటతో తయారుచేసిన ఆటవస్తువులను కూడా గుర్తించారు.

కార్నీలియం, అకోట్‌తో తయారుచేసిన పూసలు కీళడిలో దొరికాయి. ఇవి సాధారణంగా గుజరాత్‌, మహారాష్ట్రలో లభిస్తుంటాయి. 13 మనిషి బొమ్మలు, మూడు జంతువుల బొమ్మలు, టెర్రకోట మట్టితో తయారుచేసిన 650 ఆటవస్తువులు, 35 చెవిదిద్దులను ఏఎస్‌ఐ గుర్తించింది. అయితే పూజించడాన్ని సూచించే వస్తువేదీ కనిపించలేదు.

తమిళ సంగం యుగం మూడో శతాబ్దం, రెండో శతాబ్దం మధ్యదని ఇప్పటివరకు పరిగణిస్తూ వచ్చారు. కీళడిలో ఇటీవల బ్రాహ్మి లిపిలో లభించిన శాసనాలను బట్టి సంగం కాలం అంతకంటే ఇంకా మూడు వందల ఏళ్లు పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.

భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధు లోయ నాగరికత అయితే రెండవదిగా గంగా పట్టణ నాగరికత ఉంది. గంగా పట్టణ నాగరికత కాలంలో భారత్‌లో మరే పట్టణ నాగరికతా లేదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఈ భావన తప్పని తొలిసారిగా కీళడి ఆధారాలు రుజువు చేశాయి. గంగా పట్టణ నాగరికత కాలంలోనే భారత్‌లో మరో పట్టణ నాగరికత ఉందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గంగా పట్టణ నాగరికత తరహాలో దక్షిణ భారతదేశంలోనూ పట్టణ నాగరికత (తమిళ సంగం) రెండో పట్టణ నాగరికతగా విలసిల్లిందని వీటిని బట్టి చెప్పొచ్చు.ఉత్తర భారతదేశంలోని ప్రజలతో, రోమన్లతో కీళడి ప్రాంత ప్రజలు వ్యాపారం సాగించినట్లు ఇక్కడ లభించిన చాలా కళాఖండాలు సూచిస్తున్నాయి.


ఆరోపణలు.. ఆక్రోశాలు..!

కేంద్ర ప్రభుత్వం కీళడి తవ్వకాల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, తవ్వకాలను ఆపడానికి ప్రయత్నిస్తోందని డీఎంకే ప్రభుత్వం,ఆ పార్టీ నేతలు, తమిళ విద్యావేత్తలు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ‘‘హిందూత్వ ఎజెండా’’ ఉందని విమర్శించారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు ద్రావిడ దేశంలో అంటే, ‘‘దక్షిణ భారతదేశంలో సెక్యులర్‌ సంస్కృతికి తిరుగులేని రుజువు’’గా నిలిచాయని చెప్పుకొచ్చారు. అక్కడ ఏ విధమైన హిందు చిహ్నాలు, హిందు దేవతల విగ్రహాలు దొరకలేదని నమ్మబలికారు.

ఏఎస్‌ఐ సాధారణంగా ఒక ప్రధాన పురావస్తు ప్రదేశంలో తవ్వకాలను ఐదు సీజన్లలో (వానలు కూరవని పొడి వాతావరణంలో) చేపడుతుంది. ఏఎస్‌ఐ 2016-17లో కీళడిలో రెండవ సీజన్‌ ముగిసిన తర్వాత, ఎస్‌ఏ కె. అమర్‌నాథ్‌ రామకృష్ణను నియమ, నిబంధనలకు లోబడి గౌహతి సర్కిల్‌కు బదిలీ చేసింది. ఇది తమిళనాడులో వివాదానికి దారితీసింది. ఏఎస్‌ఐ తవ్వకాలను నిలిపివేయడానికి అమర్‌నాథ్‌ రామకృష్ణను బదిలీ చేసిందని డీఎంకే సర్కారు, ఆ పార్టీ నేతలు విమర్శలకు దిగారు. తవ్వకాలకు కావాలనే నిధులని కూడా నిలిపివేసిందంటూ అటు ఏఎస్‌ఐపైన, ఇటు కేంద్ర ప్రభుత్వంపైన అభాండాలు వేయడం మొదలుపెట్టారు. అమర్‌నాథ్‌ తన బదిలీ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఒక నిర్దిష్ట సర్కిల్‌లో ఎస్‌ఏ గరిష్ట పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుందని ఏఎస్‌ఐ తెలిపింది. ఆ నిబంధనకు లోబడే ఆయన్ను బదిలీ చేసినట్టు పేర్కొంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా మరో 26 మంది అధికారులను బదిలీ చేసినట్టు తెలిపింది. అమర్‌నాథ్‌ రామకృష్ణ బెంగళూరు సర్కిల్‌ పరిధిలో మూడు సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆయన ఆ కాలంలోనే కీళడిలో తవ్వకాలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐ అమర్‌నాథ్‌ స్థానంలో జోధ్‌పూర్‌ సర్కిల్‌లో డిప్యూటీ ఎస్‌ఏగా పనిచేసిన పీఎస్‌ శ్రీరామన్‌ను నియమించింది. అయితే తదుపరి తవ్వకాలలో ఏ ప్రమాణాలు, ఆనవాళ్లు దొరకలేదు.

కీళడిలో తవ్వకాలను ఆపడం లేదా ఆలస్యం చేయాలనే ఉద్దేశం తమకు లేదని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత రెండు సంవత్సరాలుగా జరిగిన పనులకు సంబంధించిన నివేదిక సకాలంలో అందని కారణంగా మూడవ సీజన్‌ తవ్వకానికి నిధుల కేటాయింపులో జాప్యం జరిగిందని వెల్లడిరచింది. కొద్ది కాలానికి మంత్రిత్వ శాఖకు నివేదిక అందింది. మూడవ సీజన్‌ తవ్వకాలకు నిధులు మంజూరు అయ్యాయి.

అమర్‌నాథ్‌ కీళడిలో వెలికితీసిన పురాతన నాగరికతపై ఏఎస్‌ఐకు సమర్పించిన నివేదిక  వివాదానికి దారి తీసింది. నివేదికను సవరించాలని ఏఎస్‌ఐ ఆయన్ను కోరింది. అయితే అందుకు అమర్‌నాథ్‌ నిరాకరించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. నివేదికలోని కొన్ని పరిశోధనల డేటింగ్‌ను ఏఎస్‌ ఐ వేలెత్తి చూపింది. తొలి కాలానికి ఆధారాలను హడావుడిగా సమర్పించినట్టు ఉందని పేర్కొంది. మరింత విశ్లేషణ అవసరమని అంది. అయితే, నివేదికను తిరిగి రాయడానికి ఆయన నిరాకరించారు. శాస్త్రీయ పద్ధతులను, కఠినమైన పురావస్తు ప్రమాణాల ఆధారంగా నివేదికను పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. కాలక్రమం, స్తరిత శిలా శాస్త్రపు`స్ట్రాటోగ్రాఫిక్‌ క్రమాలు, పదార్థ సంవర్ధనం` మెటీరియల్‌ కల్చర్‌, ఏఎంఎస్‌ డేటింగ్‌ ఫలితాలకు తగ్గట్టుగా నివేదికను రూపొందించినట్టు తెలిపారు. ఏఎస్‌ఐ నివేదికను తిరగరాయాలంటూ కోరడంపై డీఎంకే, వీసీకే, ద్రావిడ కళగం నాయకులు, చరిత్ర కారులు వక్రభాష్యం చెప్పారు. తమిళ వారసత్వాన్ని అణచివేసే ప్రయత్నంగా దుష్ప్రచారం చేశారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి షెఖావత్‌ మాట్లాడుతూ అమర్‌ నాథ్‌ కనుగొన్న వాటికి సాంకేతికంగా ధ్రువీకరణకు నోచుకోలేదని తెలిపారు. వాటికి మరిన్ని డేటింగ్‌ ఫలితాలు, డేటా, ఆధారాల ఆవశ్యకతను మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకే ఒక తవ్వకంతో మొత్తం తర్కాన్ని మార్చలేమని అన్నారు. తమిళ నాడులో డీఎంకే సర్కారు మంత్రి వ్యాఖ్యలకు లేనిపోని అర్థాలను జోడిరచింది. కేంద్ర ప్రభుత్వానికి ‘‘తమిళులను రెండవ తరగతి పౌరులుగా చూడాలనే అపరిమితమైన కోరిక’’ ఉందని ఆరోపించింది. కేంద్రం ‘‘లేని సంస్కృత నాగరికతను’’ ప్రోత్సహిస్తూ తమిళ నాగరికతను అణచివేయడానికి ప్రయత్ని స్తోందని ఎండీఎంకే పార్టీ విమర్శించింది.

అమర్‌నాథ్‌ బదిలీ తర్వాత ఆయన స్థానంలో ఎస్‌ఏగా పనిచేసిన పీఎస్‌ శ్రీరామన్‌ 2017లో మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో కీళడిలో మూడవ దశ తవ్వకాలకు, 2017`18 మధ్య కాలంలో కొడుమనల్‌లో చేపట్టిన తవ్వకాలకు నేతృత్వం వహించారు. కీళడిలో మొదటి రెండు దశల తవ్వకాల్లో కనుగొన్న ఇటుక నిర్మాణా లకు సంబంధిం చిన మరిన్ని ఆనవాళ్లు బైటపడలేదని పేర్కొన్నారు. ఆయన 2019లో పదవీవిరమణ చేశారు. కీళడిలో మూడవ దశ తవ్వకాలపై, కొడుమనల్‌లో తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఏఎస్‌ఐ ఇటీవల శ్రీరామన్‌ను కోరింది.


కుట్రలు.. కుతంత్రాలు..!

భారత్‌ను ముక్కలు ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తున్న అరాచక శక్తులు కీళడి మీద కన్నేశాయి. పాలక డీఎంకే, చర్చి ఫాదర్లు, మోసపూరిత ఎన్‌జీవోలు అనే అపవిత్రమైన త్రయం తమిళ సంస్కృతిని క్రైస్తవీకరణ చేయడానికి ప్రయత్ని స్తోంది. కీళడిలో చేపట్టిన తవ్వకాలతో వెలుగులో వచ్చిన పురాతన వస్తువులను వేరువేరుగా చూస్తోంది. హిందూ నాగరికతను ప్రతిబింబిస్తూ ద్రవిడవాదంతో ఏ మాత్రం సంబంధం లేని వస్తువులను నామ రూపాల్లేకుండా చేస్తోంది. తద్వారా తమిళుల సొంత నాగరికతను భూస్థాపితం చేస్తోంది. క్రైస్తవంతో రంగరించిన సరికొత్త అక్రమ నాగరికతకు పురుడు పోసే పనిలో ఈ అపవిత్రమైన త్రయం ఉంది. ఈ మాట ఎవరో అనామకుడు అన్నారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ రెండు పోస్ట్‌` డాక్టోరల్‌ పరిశోధనలను తన ఖాతాలో వేసుకొన్న ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ బీఎస్‌ హరిశంకర్‌ అన్నారంటే మాత్రం దాని గురించి మన బుర్రలకు పనిపెట్టాల్సిందే. అంతటి శాస్త్రవేత్త కేవలం మాటలతో సరిపుచ్చక ‘‘కీళడి తవ్వకాల్లో అంతర్జా తీయ జోక్యాలు’’ (గ్లోబల్‌ ఇంటర్‌వెన్షన్స్‌ ఇన్‌ కీళడి ఎక్స్‌కావషియన్స్‌) పేరిట ఒక శాస్త్రీయమైన అధ్యయన పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రం కేసరి వీక్లీలో ప్రచురితమైంది. అందులో ప్రస్తావించిన అంశాలు తవ్వకాల వెనుక వివాదాల తేనెతుట్టెను కదిపాయి. తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

తవ్వకాల వెనుక చరిత్రను తారుమారు చేసే స్వార్ధపూరితమైన దురుద్దేశాలు దాగి ఉన్నాయి. ఇందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, తూత్తుకుడి ఎంపీ కనిమొళి హస్తం ఉంది. స్వయంప్రకటిత పురావస్తు శాస్త్రవేత్తలు కీళడిలో తవ్వకాలకు సంబంధించి అన్ని నిబంధన లను ఉల్లంఘించారు. దేశవ్యాప్తంగా పురావస్తు ప్రాంతాల్లో తవ్వకాలు బహిరంగంగా జరుగుతుండగా కీళడిలో మాత్రం అత్యంత గోప్యంగా మూడో కంటికి తెలియకుండా జరిపారు. తవ్వకాల గోప్యత ఎంత దాకా వెళ్లిందంటే బైటపడిన వస్తువులను చూడ్డానికి సాక్షాత్తూ భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా` ఏఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎస్‌ సత్యమూర్తి వంటి పురావస్తుశాస్త్రవేత్తలను అనుమతించ లేదు. వారిని తవ్వకాలు జరిగే చోటుకు రానివ్వలేదు. తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తులు కీళడిలో వెలుగులోకి వచ్చిన నాగరికతకు భారతీయ నాగరికతకు ఏ మాత్రం సంబంధం లేదని నిరూపించడానికి కంకణం కట్టుకున్నారు. వేర్పాటువాదాన్ని పెంచి పోషించడానికి, ద్రవిడ జాతిని స్థాపించడానికి అనుకూలమైన ఫలితాలను తవ్వకాల నుంచి రాబట్టడానికి అత్యంత దారుణమైన పనికి పాల్పడ్డారు. అందులో భాగంగా దేశంలో విస్తృతమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ తవ్వకాల్లో బైటపడిన వస్తువులు ఏ కాలానికి చెందినవో నిర్ధారించడానికి అమెరికాలో ప్రయోగశాలకు వాటిని పంపించారు. తమకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టుకున్నారని ఆ పత్రం వెల్లడిరచింది.

తవ్వకాల నుంచి చర్చి చరిత్ర సృష్టి

డాక్టర్‌ హరిశంకర్‌ ‘‘కీళడి: ఓ చర్చి చరిత్రను సృష్టించే తవ్వకం’’ (కీళడి: డిగ్గింగ్‌ టు క్రియేట్‌ ఏ చర్చ్‌ హిస్టరీ) పేరిట మరో వ్యాసాన్ని రాశారు. కీళడిలో తవ్వకాలకు నేతృత్వం వహించిన కె. అమర్‌ నాథ్‌ రామకృష్ణకు, నేర చరిత్ర కలిగిన రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌కు మధ్య సంబంధాలను చూసీ చూడనట్టుగా వదిలేయకూడదని హెచ్చరించారు. రాజ్‌కు, కనిమొళికి మద్దతు ఇవ్వడంలో అమర్‌నాథ్‌ రామకృష్ణ ప్రదర్శించిన అత్యుత్సాహం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆయన కీళడిలో అపోస్తల్‌ థామస్‌ చరిత్రకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయని నిరూపించేందుకు వామపక్షాలకు, చర్చి చరిత్రకారులకు అనుకూలంగా తవ్వకాలపై ఒక నివేదికను రూపొందించారనడంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని హరిశంకర్‌ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేరళలో పట్టణంలో చేపట్టిన తవ్వకాలకు(ఇక్కడ రోమన్‌ సామ్రాజ్యపు అవశేషాలు బైటపడ్డాయిట!), కీళడిలో తవ్వకాలకు ముడిపెట్టడం ద్వారా హిందూ నాగరికతలో వేళ్లూనుకున్న తమిళ నాగరికత రూపురేఖలు మార్చడానికి పెద్ద కుట్ర జరిగింది. ఆ క్రమంలో అప్పటి తమిళనాడు రాష్ట్ర పురావస్తు విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌.శివనాథన్‌ దీనికి అవసరమైన వేదికను సిద్ధం చేశారు. పట్టణంలో తవ్వకాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త పీజే చెరియన్‌ను చెన్నయ్‌కు పిలిపించారు. ఆయనతో ఒక బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇప్పించారు. కీళడిలో బైటపడినవాటికి, పట్టణంలో బైటపడినవాటికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని చెరియన్‌తో చెప్పించారు.

ఎన్‌జీవోల ఇష్టారాజ్యం!

తమిళనాడులో ఎన్‌జీవోలకు తవ్వకాల్లో బైటపడిన పురాతన వస్తువులపై పూర్తి పెత్తనం ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్త పీజే చెరియన్‌ నిర్వహణలోని పామా అనే ఎన్‌జీవోకు వాటిపై అంతే పట్టు ఉంటుంది. లోర్డు ఆనందం, విన్సెంట్‌ చిన్నదురై లాంటి కాథోలిక్‌ ఫాదర్‌లతో నిండి ఉన్న రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌కు చెందిన తమిళ్‌ మయం అనే ఎన్‌జీవోదీ ఇదే దారి. సాధారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిపే పురావస్తు తవ్వకాల్లో బైటపడిన వస్తువులను అధ్యయనం చేయడం కోసమని కర్నాటకలోని బెంగళూరులో భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ` ఏఎస్‌ఐకి చెందిన కార్యాలయానికి పంపిస్తుంటారు. అయితే అలా పంపిస్తే హిందూ నాగరికతతో ముడిపడిన తమిళ నాగరికత వెలుగులోకి వస్తుందనే అనుమానంతో ఈ దుష్ట దుర్మార్గపు ఎన్‌జీవోలు కోర్టు మెట్లు ఎక్కాయి.

కేళడిలో బైటపడిన వస్తువులను కర్ణాటకకు పంపించవద్దని కోరుతూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. వీటికి ఇంత బరితెగింపునకు కారణం విదేశాల నుంచి అప్పనంగా వచ్చి పడే నిధులు. దేశం మొత్తమ్మీద చూస్తే తమిళనాడులో ఉన్న ఎన్‌జీవోలకు పెద్ద మొత్తంలో విదేశాల నుంచి నిధులు అందుతున్నాయి. కేంద్ర హోమ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం 2013`14 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడులో ఎన్‌జీవోలు విదేశాల నుంచి దాదాపు రూ.547 కోట్లను అందుకున్నాయి.

జస్పేర్‌ రాజ్‌తో కనిమొళి కుమ్మక్కు

తమిళ్‌ మయం అనే ఎన్‌జీవోను నడుపుతున్న రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌ నేర చరిత్ర మామూలుగా లేదు. ఒకప్పుడు అటు శ్రీలంకలోనూ, ఇటు భారత్‌లోను వేర్పాటువాదానికి, హింసాత్మక ఘటనలకు కారణమైన లిబరేషన్‌ తమిళ్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలమ్‌`ఎల్‌టీటీఈకి ఆయుధాల ఏజెంట్‌గా రెవరెండ్‌ జస్పేర్‌ రాజ్‌ ఉన్నాడు. ఆయుధాలను అక్రమంగా రవాణా చేసేవాడు. రాజ్‌ను తమకు అప్పగించాలని అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ భారత్‌ను కోరిందని పేర్కొంటూ డాక్టర్‌ సుబ్రమణియన్‌ స్వామి సెప్టెంబర్‌ 9, 2013న ట్వీట్‌ చేశారు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్‌ ఆ ట్వీట్‌ను తన వ్యాసంలో ప్రస్తావించారు.

కనిమొళి అతడితో కలిసి చెన్నయ్‌ సంగమమ్‌ పేరిట ఒక జానపద సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌టీటీఈతో ఉభయులకు గల సంబంధాలను బహిర్గతం చేసిన ఆ కార్యక్రమం తీవ్రమైన విమర్శలను ఎదుర్కోంది. ఇదిలా ఉండగా కీళడిలో పురాతన వస్తువులు వెలుగులోకి రావడం మొదలుకావడంతోనే ఆ విషయం వారిద్దరికీ తెలిసింది. సెప్టెంబర్‌ 24, 2016న కీళడిలో తవ్వకాలకు నేతృత్వం వహించిన అమర్‌నాథ్‌ రామకృష్ణ రాజ్‌ను, కనిమొళిని వెంటపెట్టుకొని మరీ తవ్వకాలు జరుగుతున్న చోటుకు తీసుకొని వెళ్లారు. వారిద్దరిని కందకాల్లో తిప్పారు. అణువణువు చూపించారు. అప్పుడే తమిళనాడులో వెలుగులోకి వచ్చిన హిందూ నాగరికత మూలాలతో కూడిన తమిళనాడు నాగరికతను నామరూపాల్లేకుండా చేసే ఓ కుట్రపూరితమైన కార్యక్రమం పురుడు పోసుకుంది.

ఇప్పటివరకు నాగరికతకు సంబంధించి ఉత్తర, దక్షిణ భారతాలు అనే పేరుతో జరుగుతున్న వేర్పాటు వాద కుట్ర కొత్త రూపాన్ని దాల్చింది. ఆర్య నాగరికత, ద్రవిడ నాగరికత అనే ద్వంద్వ కపటోపాయానికి కాలం చెల్లింది. మన నాగరికతకు మనుగడ లేకుండా చేస్తున్న దుష్ట శక్తులు తవ్వకాల్లో బైటపడిన పురాతన వస్తువులు సాకుగా చూపి పాశ్చాత్య నాగరికతను మరీ ముఖ్యంగా క్రైస్తవ నాగరికతను భారతీయుల మీదకు రుద్దే దారుణమైన కార్యక్రమానికి కీళడిని వేదికగా చేసుకోవడం గమనార్హం.

దేశంలో పురావస్తు పరిశోధనల కోసం తొలిసారి తవ్వకాలు నిర్వహించిన వారు బ్రిటిష్‌ పురావస్తు నిపుణుడు జాన్‌ మార్షల్‌ (1920). హరప్పా, మొహెంజదారోలలో సింధు నాగరికత ఆనవాళ్లు ఆనాడే బయటపడినాయి. మోర్టీమ్‌ వీలర్‌, కన్నింగ్‌ హామ్‌ తరువాత తోడ్పడ్డారు. వారు ఆంగ్లేయులే అయినా సింధు నాగరికతను సిలువెక్కించలేదు. ఆ పని ఇప్పుడు జరుగుతోంది. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారంటూ అంతకు ముందే జర్మన్‌ జాతి మూలాలున్న మ్యాక్స్‌ ముల్లర్‌ వంటి కుహనా పండితుల వాదనలను ఆ తవ్వకాలలోకి చొప్పించ లేదు కూడా. జాత్యహంకార మ్యాక్స్‌ ముల్లర్‌ మధ్య ఆసియా నుంచి ‘ఆర్య’ విషవాయువును సృష్టించే ప్రయత్నం చేస్తే, జాతివ్యతిరేక ద్రవిడ పిడివాదులు దక్షిణ భారతం నుంచి భారతీయ వ్యతిరేక విషపు గాలిని దేశం మీదకు వీచేటట్టు చేయాలని చూస్తున్నారు. తస్మాత్‌ జాగ్రత్త.

– జ్యోశ్యుల

About Author

By editor

Twitter
YOUTUBE