జూలై 26 కార్గిల్‌ విజయ దివస్‌

కార్గిల్‌ యుద్ధం.. ఈ పేరు వినగానే ప్రతి భారతీయుని హృదయం విజయగర్వంతో ఉప్పొంగుతుంది. భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని పాకిస్తాన్‌ కన్న కలలను కల్లగానే మిగిల్చిన యుద్ధం అది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రుసైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటమది. మంచుకొండల్లో 60 రోజుల పాటు సాగిన ఆ యుద్ధం శత్రుదేశం కుటిల బుద్ధికి గట్టి జవాబు ఇచ్చింది. భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటింది. జులై 26 కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా శత్రువులతో పోరాడి అమరులైన వీర సైనికులను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం.


మే 3, 1999న పాకిస్తాన్‌కు చెందిన 6 నార్తర్న్‌ లైట్‌ ఇన్ఫాంట్రీ సైనికులు ముజాహిద్దీన్‌ల ముసుగులో భారత సరిహద్దు దాటి 8 కి.మీ.లు లోనికి చొర బడ్డారు. ఆఫ్ఘన్‌ కిరాయి మూకల సహాయంతో ఈ ఎత్తైన పోస్ట్‌లను ఆక్రమించుకున్నారు. శ్రీనగర్‌ నుంచి లేప్‌ాను వేరుచేయడం ద్వారా వాస్తవాధీన రేఖ రూపురేఖలను మార్చాలన్నది వారి లక్ష్యం. పాకిస్తాన్‌ సాధారణంగా సరిహద్దుల వెంట తరచూ కాల్పులు జరుపుతూనే ఉంటుంది, ఇందుకు దీటుగా భారత సైన్యం ఎదురు కాల్పుల ద్వారా సమాధానం ఇస్తుంది. ఈ కాల్పుల చాటునే చొరబాటుదార్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు. పాక్‌ కాల్పుల్లో భారత గస్తీ దళానికి చెందిన ఓ జవాను మరణించాడు.

ఆ మర్నాడు లద్దాక్‌లోని గార్కల్‌ గ్రామానికి చెందిన తాషీనామ్‌ గ్యాల్‌ అనే బౌద్ధ పశువుల కాపరికి చెందిన యాక్‌ (జడల బర్రె) తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ సరిహద్దులకు వెళ్లాడు. తాషీనామ్‌ గ్యాల్‌ సరిహద్దుకు దూరం నుంచి బైనాక్యులర్‌ ద్వారా చూస్తే అనుమానిత వ్యక్తులు కనిపించారు. వారు తన యాక్‌ను చంపేసి తిన్నారని గ్రహించాడు. వెంటనే భారత గస్తీ దళాలకు సమాచారాన్ని అందించారు. భారత సైన్యం మొదట సమస్య తీవ్రతను గ్రహించలేకపోయింది. చొరబాటుదార్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని తేలికగానే ఖాళీ చేయించవచ్చని భావించింది. ఈ ప్రాంతంలో శీతాకాలం రాగానే వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల ఇరు దేశాల సైన్యాలు కొన్ని సైనిక స్థావరాలను వదిలి వెనక్కి వెళ్తాయి. వాతావరణం అనుకూలిస్తే తిరిగి వారి వారి స్థానాలకి వెళ్లి గస్తీ నిర్వహిస్తారు. మే 5వ తేదీన మన సైన్యం కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా నాయకత్వంలో ఐదుగురు సైనికుల గస్తీ దళాన్ని అక్కడికి పంపించింది. పాక్‌ సైన్యం వీరిని పట్టుకొని చిత్ర హింసలు పెట్టి చంపింది.

అదే సమయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ముషారఫ్‌, లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అజీజ్‌లు కార్గిల్‌ ప్రాంతంలోని సైనికుల గురించి మాట్లాడుకున్న ఆడియో టేపులను భారత సైన్యం ఛేదించింది. ద్రాస్‌, కక్సార్‌, ముషో సెక్టార్లలో చొరబాట్లు జరిగాయని గ్రహించింది. ఈలోగా మే 9న పాకిస్తాన్‌ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్‌ ఆయుధాగారం ధ్వంస మైంది. పరిస్థితి తీవ్రత అర్థమైపోయింది. కార్గిల్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది పాకిస్తాన్‌ సైన్యమేనని స్పష్టమైంది.

ఆపరేషన్‌ విజయ్‌ ప్రారంభం

మన సైనికులపై పాకిస్తాన్‌ దాడికి పాల్పడ్డారన్న వార్త దావానలంలా వ్యాపించింది. చిన్న చిన్న ఘర్షణలు సరిహద్దుల్లో సర్వసాధారణమైనా ఈ సంఘటన రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. పాకిస్తాన్‌ మోసం, క్రూరత్వంపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమైంది.

పాకిస్తాన్‌ చొరబాట్లకు దీటైన బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పోరాటం మొదలు పెట్టింది. పెద్ద సంఖ్యల్లో సైనికుల్ని కార్గిల్‌కు తరలించింది. కీలకమైన జాతీయ రహదారి-1డి పాక్‌ శతఘ్ను దాడికి గురయ్యే పరిధిలో ఉండటంతో సైన్యాన్ని, ఆయుధాలను తరలించడం చాలా క్లిష్టమైపోయింది. చాలా ఎత్తైన ప్రదేశం కావడంతో విమానాల ద్వారా సామాగ్రిని చేరవేయడం కూడా కష్టమైపోయింది. శత్రువుల దగ్గర ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. మానవ రహిత విమానాలు, అమెరికా సమకూర్చిన ఫైర్‌ ఫైండర్‌ రాడార్‌ల ద్వారా పాకిస్తాన్‌ పర్యవేక్షణ కొనసాగించింది . చాలా చోట్ల మందు పాతరలు అమర్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జూన్‌ రెండో వారానికి గాని భారత్‌ పట్టు సాధించలేకపోయింది.

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌

మే 26న భారత వాయుసేన ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’పేరుతో దాడులు మొదలు పెట్టింది. మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ల సహాయంతో వైమానికదళం శత్రుసైన్యంపై లేసర్‌ గైడెడ్‌ బాంబుల వర్షం కురిపించి కొన్ని స్థావరాలను నేలమట్టం చేసింది.

టోలోలింగ్‌ స్వాధీనం

ద్రాస్‌ సెక్టార్‌లో ఎన్‌హెచ్‌ 1డీ చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం మొదటి ప్రాధాన్యతగా భావించింది భారత సైన్యం. జూన్‌ 6న భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులు మొదలు పెట్టింది. జూన్‌ 9న బటాలిక్‌ సెక్టారులో రెండు కీలక స్థావరాలను తిరిగి స్వాధీన పరచుకుంది.

సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్‌ పర్వత శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం 110 డిగ్రీల చలిగాలుల మధ్య పోరాటం సాగించాల్సి వచ్చింది. కర్నల్‌ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో సైన్యాన్ని అర్జున్‌, భీమ, అభిమన్యు అని మూడు భాగాలుగా చేసి త్రిముఖ వ్యూహం పన్ని జూన్‌ 14, 1999న టోలోలింగ్‌ను స్వాధీనం చేసుకొని జాతీయ జెండా ఎగుర వేశారు.

టైగర్‌ హిల్స్‌ పోరాటం

టోలోలింగ్‌ గెలుపుతో సైన్యంలో ఆత్మ స్థైర్యం పెరిగింది. ఇక్కడి నుంచి లడక్‌ మార్గం జాతీయ రహదారి 1డిలో దాదాపు 20 కిలోమీటర్ల పరిధి వరకు భారత్‌ అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత శత్రువులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టింది. యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి. తర్వాత టైగర్‌ హిల్స్‌ మీద దృష్టి పెట్టింది. జూన్‌ 29న భారత సైన్యం టైగర్‌ హిల్‌ సమీపంలోని పాయింట్‌ 5060, పాయింట్‌ 5100 అనే రెండు కీలక స్థావరాలను స్వాధీన పరచుకుంది. జూలై 2న మన సైన్యం యుద్ద క్షేత్రంలో త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.

టైగర్‌ హిల్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం చాలా కష్టపడిరది. నిట్టనిలువుగా ఉన్న కొండను ఎక్కి సుబేదార్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్‌ ప్రాణాలకు తెగించి శత్రు స్థావరాలపై గ్రెనైడ్‌ విసిరి ధ్వంసం చేశాడు. శరీరంలో బుల్లెట్లు దిగుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా లెక్కచేయక శత్రు సైనికులకు చుక్కలు చూపించాడు.

జూలై 4న దాదాపు11 గంటల పోరు తరువాత భారత సైన్యం టైగర్‌ హిల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. జూలై 5న ద్రాస్‌ సెక్టార్‌ పై పూర్తి నియంత్రణ సాధించింది. జూలై 7న బటాలిక్‌ సెక్టారులోని జుబర్‌ హైట్స్‌ను స్వాధీనం చేసుకుంది. సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాయింట్‌ 5140 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధానికి లెఫ్టినెంట్‌ కర్నల్‌ యోగేష్‌ కుమార్‌ జోషి నాయకత్వం వహించారు. సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక దానికి లెఫ్టినెంట్‌ సంజీవ్‌ సింగ్‌, మరొక దానికి లెఫ్టినెంట్‌ విక్రం బాత్ర నాయకత్వం వహించారు. ఇద్దరూ విజయం సాధించి పాయింట్‌ 5140ని స్వాధీన పరచుకున్నారు. ఆ తర్వాత జూలై 8న కెప్టెన్‌ విక్రం బత్రా, కెప్టెన్‌ అనుజ్‌ నయ్యర్‌ ఆధ్వర్యంలో సైన్యం పాయింట్‌ 4875 స్వాధీనానికై బయల్దేరింది. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం జూలై 11న ఆ ప్రాంతం మన వశమైంది. బటాలిక్‌ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీన పరచుకోవడంతో పాకిస్తాన్‌ వెనక్కి వెళ్లడం మొదలైంది.

కార్గిల్‌ విజయ్‌ దివస్‌

జూలై 14న ఆపరేషన్‌ విజయ్‌ విజయవంత మైందని భారత ప్రధాని వాజపేయి ప్రకటించారు. జూలై 26న కార్గిల్‌ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్‌ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల 20 రోజుల తర్వాత పాక్‌ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది.. ఈ యుద్ధంలో భారత సైన్యం దాదాపు 130 స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది.

ఈ విజయ సాధనలో 527మంది సైనికులు బలిదానం చేశారు. 1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150మంది గాయపడ్డారు.

పాక్‌ సైనికులు దాదాపు 12 వందలకు పైగా మరణించి, అంతకు మూడిరతల మంది గాయ పడినా, ఈ లెక్కలను అధికారికంగా గుర్తించలేదు.

కార్గిల్‌ యుద్ధం నేర్పిన పాఠాలు

యుద్ధంలో ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా వాయుసేన వినియోగం ప్రాముఖ్యతను కార్గిల్‌ యుద్ధం రుజువు చేసింది. మెరుగైన గూఢచర్య వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అవసరమని కార్గిల్‌ యుద్ధం నేర్పింది. అణ్వాయు ధాలు కలిగి ఉండటం వలన పూర్తి స్థాయి యుద్ధం జరగకుండా నిరోధించవచ్చని కార్గిల్‌ యుద్ధం సూచించింది. ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌ ఒంటరిగా మారడానికి యుద్ధం ఒక కారణమైంది.

కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులలో 75 శాతానికి పైగా శత్రువు శతఘ్ని కాల్పుల బారిన పడినవారే. శతఘ్నులను గుర్తించే రాడార్లు అవసరమంటూ భారత సైన్యం 1994న కోరింది. పాకిస్తాన్‌ వద్ద ఆ రాడార్లు 1999 కంటే ఎంతో ముందునుంచే ఉన్నాయి. ఆ రాడార్లు భారత సైన్యం వద్ద కార్గిల్‌ యుద్ధ సమయంలో ఉండి ఉన్నట్లయితే భారత్‌ మరణాలను తగ్గించుకోవటమే కాకుండా శత్రువును మరింతగా దెబ్బతీయగలిగి ఉండేది.

భారత సైన్యానికి పాకిస్తాన్‌ సైన్యానికి సరఫరా చేసిన వాటికంటే మెరుగైన శతఘ్ని గుర్తింపు రాడార్లను సరఫరా చేయటానికి అమెరికా 1997లోనే అంగీక రించినప్పటికీ ఆ సంబంధిత ఫైలు భారత రక్షణ మంత్రిత్వ శాఖలో అధికారుల నిరాసక్తత కారణంగా పెండిరగ్‌ ఫైళ్లలో ఒకటిగా మిగిలిపోయింది.

ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని కార్గిల్‌ యుద్ధ అనుభవం నొక్కి చెపుతోంది. చీఫ్‌ అఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ నియామకం అవసరమని కార్గిల్‌ సమీక్షా సంఘం సిఫార్సు చేసినా మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాతగానీ ఆ నియామకం అమలులోకి రాలేదు. భారత సైన్యం సరిహద్దుల వెంబడి పోస్టులను శీతాకాలంలో ఖాళీ చేసి మళ్లీ వేసవికాలం సమీపించ గానే తిరిగి వాటిలోకి ప్రవేశించేది. దీన్ని అవకా శంగా మార్చుకున్న పాకిస్తాన్‌ సైన్యం వాస్తవాధీన రేఖ దాటి పర్వత శ్రేణులను ఆక్రమించుకొని తిష్టవేసింది. పాకిస్తాన్‌ చొరబాటును నిలువ రించడంలో, సరిహద్దులను పర్యవేక్షించడంలో మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ యుద్ధం నేర్పింది.

– క్రాంతిదేవ్‌ మిత్ర, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE