‘నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాని నాకేటి వెరపు’అన్న భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి పలుకులు నటుడు కోట శ్రీనివాసరావు తీరుకు చాలా వరకు వర్తిస్తాయి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడమే కాదు… నచ్చని అంశాలను నిక్కచ్చిగా చెప్పడం ఆయన నైజం. కొన్ని ప్రమాణాలు, పద్ధతులు, సంస్కారం పాటిస్తూ, వివాదరహితుడిగా పేరున్నా మనసులోని మాట వెల్లడిలో మొహమాట పడలేదు. అది ధర్మాగ్రహమే తప్ప ఈర్ష్యాసూయలు కావని ఆయనను బాగా ఎరుగున్న వారు చెబుతారు. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి సంబంధించి స్వభాష నటీనటులకు అవకాశాలు దక్కక పోవడం పట్ల ఆవేదన చెందేవారు. తెలుగు భాషంటే మక్కువ. రంగస్థలం, వెండితెర రెండు కళ్లుగా భావించిన ఆయన 83 ఏళ్ల వయస్సులో జూలై 12న నటన‘కోట’ను ఖాళీ చేసి సెలవంటూ వెళ్లిపోయారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
ఆయన నటనే కాదు.. వ్యక్తిత్వం విలక్షణమే. రెండున్నర దశాబ్దాల పాటు రంగస్థలాన్ని, నాలుగు దశాబ్దాలు వెండితెర నటనను శ్వాసించిన నట దిగ్గజం నేల కొరిగింది. అవకాశాలు రాకుండా ఎందరో కునారిల్లుతుంటే, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలను వడిసి పట్టాలన్నది ఆయన విధానం. అందుకు ఆయన నట జీవితమే నిదర్శనం. ప్రతినాయకులుగా కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, గిరిబాబు శకం ముగింపు దశలో ఆ తరహా పాత్రలకు ఆయన పెట్టని ‘కోట’ అయ్యారు. ‘గుమ్మడి కాయంత కృషికి అవగింజంత అదృష్టం’ అవసరమని విశ్వసించి స్వయం ప్రతిభతో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు.
ప్రతిభకు పట్టం కట్టండి. అందచందాలకు, డాబుదర్పాలకు కాదని, భాష, భావం తెలియని పరభాషా నటీనటులు,సాంకేతిక నిపుణుల కంటే స్థానిక కళాకారుల్లోని ప్రతిభను,నైపుణ్యాన్ని వెలికితీయాలన్నది ఆయన ఆకాంక్ష. ‘ఏ భాషలోనైనా స్థానికులకే పెద్ద పీట. మన భాషకు వచ్చేసరికి ఎందుకీ వివక్ష?’ అని ప్రశ్నించేవారు. మాతృభాష కళాకారులు, సాంకేతిక నిపుణుల తరపున గొంతెత్తిన ఏకైక నటుడు బహుశా ఆయనే కావచ్చు. సొంతభాషతో పాటు హిందీ సహా దక్షిణాది భాషా సినిమాల్లో నటించిన ఆయన పరభాషా నటీనటులకు వ్యతిరేకం కాదు. అయితే, తెలుగు భాష పట్ల అవగాహనలేని, తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తిలేని వారికి పెద్ద పీట వేయడంపై బాహాటంగానే నిరసనవ్యక్తం చేసేవారు. స్వభాషలో సమర్థులైన కళాకారులు ఉండగా, పరభాషా వారి కోసం వెంపర్లాట ఎందుకన్నది ఆయన వాదన. అది రుచించని ‘వి’చిత్రసీమలో కొందరికి కంటగిం పయ్యారు. అయినా వెరవలేదు. అవకాశాలు రావేమోనని బెంగపడలేదు. వేషాలను అర్థించలేదు. వచ్చిన వాటిని కాదనలేదు. నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించినట్లు ‘ఆయన అందరికి నచ్చడు, ఎవరిని మెప్పించడానికి ప్రయత్నించడు’. అదే కోట ప్రత్యేకత.
సినిమా కార్మికుల మేలు కోరే వారిలో ఆయన ముందుండేవారు. చిత్ర పరిశ్రమలోని అందరి ఆర్థిక స్థితి సమం కాదని, అయినా ప్రతి ఒక్కరు మూడు పూటలు భోజనం చేయగలగాలి అనేవారు. పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు తన వంతు ప్రయత్నం చేసేవారు. అందుకు సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం (1994)నాటి సందర్భం ఓ ఉదాహరణ. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదంతో, ఉభయ వర్గాల సంక్షేమం కోసం నిరాహారదీక్షకు దిగి పరిస్థితి చక్కబడేలా చేశారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. అయితే, అది తన గొప్పతనం కాదని, అన్నం పెట్టే పరిశ్రమకు ఆసరగా నిలవడం తన వంతు బాధ్యతని కృతజ్ఞతగా చెప్పేవారు.
1970 దశకం ఉత్తరార్ధంలో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన శ్రీనివాసరావు తిరిగి వెండితెరపై కనిపించేందుకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఒకే ఒక సినిమా (ప్రతిఘట)తో రాత్రికి రాత్రి తీరికలేనంత నటుడిగా మారారు. ఆ చిత్రంలో ఆయనతో కేవలం రెండు, మూడు దృశ్యాలు చిత్రించాలనుకున్న దర్శకుడు, ఆయన సంభాషణ ఉచ్చారణ తీరుకు మురిసి తన పాత్ర నిడివి పెంచారని కోట చెప్పేవారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు.అది తన అదృష్టంగా భావించారే కానీ విర్రవీగలేదు. ‘టైం అంటూ వస్తే టైం ఉండదు.దానిని సద్వినియోగం చేసుకోవడమే మన పని’అనేవారు. . ‘ఈ రూపురేఖలు సినిమాకు పనికి వస్తాయా? అని ఊగిసలాడిన నాకు ఇంతటి గుర్తింపు వచ్చింది. మలిచిత్రం ‘ప్రతిఘటన’లోని కాశయ్య పాత్రకు స్పెషల్ జ్యూరీ నంది పురస్కారం, నట ప్రస్థానంలో తొమ్మిది సార్లు నందులు అందుకున్నాను. కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఇదంతా అదృష్టం కాక మరేమిటి?’ అని సమాధానమిచ్చేవారు. అంతోఇంతో తన కృషి ఉన్నా, గుర్తింపు ముఖ్యమని, ఎంత బంగారు పళ్లానికైనా గోడవాటు కావాలని దాటేసే వారు. ‘ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాదిరాళ్లు’ అంటూ, నాటకాల్లో చక్కటి పాత్రలతో ప్రోత్సహించిన దర్శకులు, సహానటులను తాను 300 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు.
తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ నుంచి త్వరలో విడుదల అయ్యే (మలిచిత్రం) ‘హరిహర వీరమల్లు’ దాకా ఏడు వందల యాభయ్‌కి పైగా చిత్రాలలో నటించినా, ప్రతి చిత్రాన్ని సవాల్‌గా భావించారు. పాత్ర పోషణంలో వైరుధ్యం,వైవిధ్యం చూపారు. చేతికి అందిన సంభాషణలను యథాతథంగా చెప్పడం కాదు. వాటిని పలకడంలో సహజత్వాన్ని ప్రదర్శించారు. దర్శకుడి అనుమతితో వాటిని మెరుగుపరచి ‘మేనరిజం’ జత చేయడం ఆయన ప్రత్యేకత.
మంచి పాత్రలు చేయాలన్న తపనే కానీ పారితోషికాలు పెంచుకోవాలనే ధ్యాసపెట్టలేదనేవారు. డబ్బు అవసరమే కాని ‘డబ్బే’ ప్రధానం కాదన్నది ఆయన విధానం. కొందరు నిర్మాతలు, నటులు సినిమా బడ్జెట్, పారితోషికాల గురించి చెప్పే గొప్పలను మెచ్చేవారు కాదు. ప్రతివారి జీవితంలో కష్టాలు, దుఃఖం ఉంటాయని, అవి వృత్తిపై ప్రభావం చూపకూడదనే వారు. అలా ఆచరించి చూపారు కూడా. కడుపున పుట్టినవారు కళ్లముందే కనుమరుగైతే కలిగే వేదన వర్ణనాతీతం. అలాంటి అనుభవం చవిచూసిన తమలాంటి వారికి మరణం ఒక లెక్క కాదని, అయితే వారసుల భవిత కోసం మనసును దిటవు చేసుకోవాలని, వ్యాపకమే వేదన మరపునకు ఔషధం అనే వారు. అలా…నటనను కొనసాగించారు. ‘కష్టానికి కుంగిపోతే నమ్ముకున్న వారి పరిస్థితేమిటి’ అని ఆచరించి చూపిన ఆయన, క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకొనే వారికి స్ఫూర్తిదాయకం కావాలి.
ప్రజాప్రతినిధిగా…
హిందూధర్మం పట్ల అమిత అభిమానం గల శ్రీనివాసరావుకు ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి లేపోయినా బీజేపీ అగ్రనేత అటల్ బిహారి వాజ్‌పాయ్ పట్ల అపార అభిమానం ఉండేది. అది గమనించిన పార్టీ నేత సిహెచ్. విద్యాసాగర్ రావు తన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆహ్వానించారు. అదే కోట క్రియాశీలక రాజకీయాలకు పునాది. 1999 శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయవాడ ‘తూర్పు’ నుంచి బీజేపీ తరపున తలపడి కాంగ్రెస్ అభ్యర్థి ఐలాపురం వెంకయ్యపై 57వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. రాజకీయాలు తనకు సరిపడవంటూ, 2004 తర్వాత వాటికి దూరంగా, బీజేపీకి మద్దతుగా కొనసాగారు.
ముద్దు పలుకుల ‘సరోజం’ దివికి…
అందంతో పాటు అభినయం బి.సరోజాదేవి సొంతం. అనుకోకుండా పదమూడేళ్ల ప్రాయంలో కన్నడ చలన చిత్ర రంగ ప్రవేశం చేసి కేవలం ఏడేళ్లలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వంద చిత్రాల్లో నటించిన అరుదైన నటిగా చరిత్రకెక్కారు. పాఠశాల వార్షికోత్సవంలో ఇచ్చిన ప్రదర్శన ఆమె వెండితెర జీవితానికి బాటలు వేసింది. ఆ కార్యక్రమం చూసిన ప్రముఖ దర్శకనిర్మాత హొన్నప్ప భాగవతార్ తన ‘కాళిదాసు’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది విజయవంతం కావడంతో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి.
సినిమా పరిశ్రమకు స్వర్ణయుగంగా చెప్పుకొనే 1960వ దశకంలో దక్షిణాదిలో తిరుగులేని తారగా వెలుగొందారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ‘అభినయ సరస్వతి,జగదేకసుందరి’గా మన్ననలు అందుకున్న ఆమె తెలుగులో నటించిన చిత్రాలు నాలుగు పదులలోపే. అయినా తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందారు. తెలుగులో ‘పాండురంగ మహాత్మ్యం’ తొలి చిత్రం. ‘చిన్నన్నయ్య… చిన్నన్నయ..’ అనే ముద్దుముద్దు పలుకులు సుభద్ర (శ్రీ కృష్ణార్జునయుద్ధం), ‘హల’ దేవకన్య (జగదేకవీరునికథ) పాత్రలు మదిలో మెదులుతాయి. పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992), కేంద్ర ప్రభుత్వ జీవన సాఫల్య పురస్కారం (2008),ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం,రాజ్‌కుమార జీవన సాఫల్య పురస్కారం, ఎంజీఆర్ పురస్కారంతో పాటు అనేక సంస్థల నుంచి సత్కారాలు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్నారు. ఉత్తరాది పత్రికలు‘మద్రాస్ కా సుందర్ తార’ అని అభివర్ణించాయి. జవాహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘మీరు బాగా ప్రకాశిస్తున్నారు’(తుమ్ బహుత్ చమక్ తీహో)అన్న ఆయన ప్రశంస గొప్ప మధురానుభూతి అని ఒక ముఖాముఖిలో చెప్పారు. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్‌గా వ్యవహరించిన సరోజాదేవి, ఈ తరం చిత్రాలో నటించే ఒకనాటి నటీనటులకు తగు గౌరవం దక్కడంలేదని ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు.‘మన వెనుకటి తరం వారిని గౌరవించుకోలేకపోతే, తరువాతి తరాల నుంచి అదే గౌరవాన్ని ఎలా ఆశించగలం’ అని ప్రశ్నించేవారు. ప్రస్తుతం నటించే అలనాటి నటీనటుల పేర్లకు (టైటిల్స్) ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో జులై 14న ‘జగదేకసుందరి’దివికేగింది.
డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్