జూలై 23 తిలక్‌ జయంతి

శివాజీ స్థాపించిన స్వరాజ్య పతన శిథిలాలపై బ్రిటిష్‌ ఆధిపత్యం బలపడిరది. 1857 స్వాతంత్య్ర సమరం నిష్ఫలమైందిÑ విభిన్న విప్లవోద్యమాలు, క్రాంతికారీ ప్రయత్నాలు, పరదేశ ప్రభుత్వపు పునాదులను కదలించలేకపోయినట్లు కనిపించింది. ప్రఖ్యాతులైన ఆలోచనాపరులు కొందరు ఈ విదేశీశక్తితో మైత్రితో మెలగడం, నమ్రతతో విజ్ఞప్తులు పంపుకొని ఎక్కువ అధికారాలను పొందడానికి, విదేశీ పరిపాలనను కొనసాగించడానికి ప్రయత్నించడం – వేరే మాటల్లో ఈ దేశంలో విదేశీ ప్రభుత్వానికి బలం చేకూర్చే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. దేశం అనే దేహంలో బానిసత్వపు విషం బాగా వ్యాపించడం మొదలయింది. ఆత్మ గౌరవం, అభిమానం నశించి, సరళీయమైన ఆలోచనలు, ఆచారాలు, జీవన ప్రణాళిక, రాజ్యవ్యవస్థ, సమాజ సరళిని అమలు చేయడమే కాకుండా వారి క్రీస్తు ఉపాసన పంథాను స్వీకరించడం సైతం సగర్వంగా భావించడం కూడా ప్రారంభించారు. మనదైన ప్రతి దాని విషయంలోను ఒక ఈసడిరపు భావన ఎక్కువ కాజొచ్చింది. ఇక ` పురాతన పరంపరను అనుసరించుకొని ఉన్నవారిలో అంధ విశ్వాసాలు, పూర్వాచారుల సద్బోధనల నుండి పొందిన కొన్ని వికృత సంస్కారాలు, వేదవేదాంతాది చైతన్య కారకమైన జ్ఞాన సంపత్తి విషయంలో అజ్ఞానం, జ్ఞానానికి సంబంధించి విపరీత ధోరణులు, నిష్క్రి యాత్వం, పిరికితనం` మొదలైనవాటి ఫలితంగా, ‘‘నా విష్ణుః పృథివీపతిఃవ’ అనే శుద్ధమైన, ఆర్యోక్తికి వికృతార్థాలు కల్పించి శరణాగత భావనతో ఆ పరదేశీరాజులే మన పాలిటి అపర విష్ణువులనే గర్హనీయమైన ధోరణి ఎక్కువైంది. క్లుప్తంలో` ప్రతి వారిలోను అస్తిత్వ భావన మటుమాయమైన భీషణ పరిస్థితి దాపురించింది. ఈ భయంకర అంధకారం లోను, తమోమయ జీవనంలో ఆశాకిరణమనేది కనిపించకుండా పోయింది. సర్వనాశనం అనివార్య మనిపించే అట్టి స్థితిలో, భారత పరంపరకు అనుగుణంగా ఒక మహత్తర తేజస్సు మానవ రూపంలో అవతరించింది. ఈ మహత్తర తేజస్వరూపమే లోకమాన్య బాలగంగాధర తిలక్‌.

కర్తవ్య నిర్వహణ

మహాగంభీరమైన విషయాలను సైతం సునాయాసంగా యోచించగల మెరుపు వంటి చురుకైన బుద్ధిబలం తిలక్‌ వారసత్వం. సహజంగా జ్ఞానార్జనాభిలాషి, జ్ఞాన వితరణాభిలాషి అయి, జాతి ప్రధాన సమస్యను గుర్తించి తన సహజ అభిలాషలకు విముఖులై, కఠోరము కష్ఠనిష్ఠురములతో కూడిన రాష్ట్రోత్థాన వ్రతాన్ని స్వీకరించారు. పారతంత్య్రంలో పడి ఉల్లాసంతో దొర్లాడుతూ, పరదాస్యంలోనే భోగం ఉందనీ, ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపించుకోవడంలో మన జీవిత సార్థకత, దేశసేవ అంతా ఇమిడి ఉందనీ భావిస్తూన్న సమాజాన్ని నిద్రలేపి, విదేశీయులతో పోరాడుతూనే నిజాయితి, నిర్భయతల కూడిన దేశ నిర్మాణం కోసం సర్వస్వం అర్పించగల సాహస ప్రవృత్తినీ, నెలకొల్పే మహత్తర కార్యాభారాన్నీ లోకమాన్యుడు తమపై వేసుకున్నారు. ‘‘స్వరాజ్యము నా జన్మహక్క’’ని ఘన గంభీర గర్జన చేసి, పారతం త్య్రంలో దొర్లాడుతున్న దేశీయులు స్వరాజ్యసాధన విషయమై తమపై ఉన్న మహత్తర బాధ్యతను గూర్చి తీవ్రంగా ఆలోచించేలా చేశారు.

‘సురాజ్యము కన్న స్వరాజ్యమే శ్రేష్టమైనది’, ‘స్వాతంత్య్రమువల్ల లభించిన గంజియైనను పరతంత్రమువల్ల లభించిన పంచభక్ష్య పరమాన్న ములకన్న శ్రేష్టమైనద’ను తేజస్వీ మహామంత్రాన్ని ఉద్బోధించారు.

ప్రజల ముందు స్వరాజ్యాశయాన్ని ప్రతి పాదించినవారు తిలక్‌కు పూర్వం కూడా ఉన్నారు. దాదాభాయ్‌ నౌరోజి వంటి వారు ఇదే ఉద్ఘాటించారు. వారి పంథా, తిలక్‌ సమకాలీనుల పంథా వేరు అయినప్పటికీ ఆశయం మాత్రం ఒకటే. అయితే తిలక్‌ అతివాద జాతీయ పోరాట మార్గం స్వీకరించడంలోనే ఆయన అసాధారణత, విశిష్ఠత ఉన్నదా? అనే ప్రశ్న వస్తుంది. సాయుధ విప్లవ పంథాతో పోల్చిచూస్తే ఈయన మార్గం ఎంతో మందమైనదవుతుంది. మరి అలాంటప్పుడు ఆయనకు అసామాన్యుడనడానికి కారణమేమిటి?

అసామాన్యత వైశిష్ఠ్యం

స్వరాజ్యం, స్వరాష్ట్రం మొదలైన విషయాల్లో ఆనాటి పెద్ద, చిన్న నాయకులందరిలోనూ వ్యాపించి ఉన్న ‘అపూర్వ’, అయోమయ అభిప్రాయాలతో నిండిన వాతావరణంలో తిలక్‌ సుస్పష్టంగా భారతీయ రాష్ట్ర నిర్దుష్ట స్వరూపాన్ని చూపించడంలో పైప్రశ్నలకు జవాబు ఉన్నది. ‘‘అంతకుపూర్వం మనకు జాతీయజీవనం లేదుÑ మన దేశ ఏకత్వం మన హృదయాల మీద ముద్రించి ఉండలేదుÑ అనేక విభేదాలతో నిండి ఛిన్నాభిన్నమై ఉన్న మన సమాజం ఎప్పుడూ ఐక్యంగాను, అఖండంగాను ఉండలేదుÑ మన సమాజమే కాకుండా ఈ దేశంలో ఇదే బ్రిటిష్‌ పాలనలో నివసిస్తూ ఉన్న ముస్లిం, క్రైస్తవ, పార్శీ వంటి విభిన్న పంథీయాలతో మనకు సామాన్య అవసరాలున్నాయి. మన ఆకాంక్షలొకటే, కనుక మనమంతా ఒకే కొత్తజాతిగా రూపొందాంÑ ఆసేతు శీతనగమూ బ్రిటిష్‌వారు తమ పరిపాలనను నెలకొల్పిన తర్వాతనే మొదటిసారిగా మనం ఒక జాతిగా రూపొందాం. వివిధ జాతులతో ఒక ఖండంవలెనున్న ఈ దేశం బ్రిటిష్‌వారి క్రిందకు వచ్చిన తర్వాతనే మొదటిసారిగా మనలో ఐక్యభావన ఉద్భవించింది. విభిన్న భాషలు, విభిన్న పంథాలు, చిన్న చిన్న ప్రాదేశిక రాజ్యాలతో ఉన్నందువల్ల మనది కూడా యూరపు వలెనే బహుళజాతీయ జీవనం. దీని నుండి మొదటిసారిగా ‘మనం మన జాతి’ అనే భావన కల్గిందంటే అది బ్రిటిష్‌వారంటే మనకున్న వ్యతిరేకత వలన ఉద్భవించిందే’’.

ఇవి ఆనాడు ప్రబలంగా ఉన్న అభిప్రాయాలు. జాతీయ భావన అనేది ప్రాదేశిక, రాజకీయ, ఆర్థిక విషయాలకు మాత్రమే సంబంధించినదనే పాశ్చాత్య రాజకీయ అభిప్రాయాలవల్ల ఏర్పడిన తప్పుడు భావాలతో వారు (ఆనాటి ప్రజలు) ప్రాదేశిక జాతీయతను నిర్మించ నిశ్చయించారు. ఈ భావనల దృష్టిలో మనకు రాష్ట్రీయ పరంపర, ధర్మం, సంస్కృతి, తత్వజ్ఞానాదులు లేవుకదా? కొత్తగా ఏర్పడుతున్న జాతిలో మరి సంఘర్షణలను నివారించేందుకు ధర్మరహిత రాష్ట్ర, భాష, సమ్మిళిత సంస్కృతి, ఇత్యాది తప్పుడు భావాలు పాదకొనడం మొదలయింది. మన ప్రాచీన, శాస్త్ర, ధర్మం, తత్వజ్ఞాన యుక్త రాష్ట్ర జీవనాలను కాదని, సహజంగా మనదైన దీనికి విరుద్ధమైన కొత్త జాతీయతను దీనిలో సృష్టించాలనే వెర్రిని అవలంబించడంవల్ల నిజమైన దేశభక్తిని, రాష్ట్రభక్తిని కల్గించడం దాదాపు అసాధ్యమైపోయింది. ఈ పరిస్థితిలో రాష్ట్రోద్ధారణ, అందుకై సర్వస్వార్పణము చేయాలని, అందుకు ఎన్ని కష్టాలైౖనా పడేందుకు సిద్ధం కావాలనే భావాన్ని వ్యక్తులలో కలుగజేయడం కూడా దాదాపు అసాధ్యమైపోయింది.

హిందూ రాష్ట్ర మహదాశయం

ఈ దురవస్థ నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే లోకమాన్యుడు, ఒకసారి సూటిగాను, మరొకసారి పరోక్షపదాల్లోను విశుద్ధ హిందూ రాష్ట్ర భావాన్ని ప్రబోధించి, అయోమయ స్థితిలో ఉన్న కొత్త విద్యావంతులకు (ఇంగ్లీషు విద్యావంతులకు) సరియైన మార్గాన్ని చూపారు. రాష్ట్ర జ్ఞానానికి సంబంధించి అయోమయ భావాలున్నదీ ఈ వర్గానికే; సమాజంలో ఒక విధమైన ప్రాముఖ్యత ఉన్నదీ ఈ వర్గానికే. వీరు ప్రజలకు నాయకులు కావడానికి ఇంగ్లీషువారి కుటిలనీతి ముఖ్య కారణం; పూర్వాచార పరాయణులు సంకుచితులుగాను, అకర్మణ్యులుగాను, ఉపేక్షా భావనాపరులుగాను ఉండడం కూడా కొంత కారణమే` నాయకత్వాన్ని చేతుల్లో ఉంచుకున్న ఈ ఆంగ్ల విద్యావిభూషితుల అయోమయ భావాలను తొలగించడం అవసరం. అందుకుగాను జన బాహుళ్యంలో గణేశ మహోత్సవాలు, శివాజీ జన్మదినోత్సవాలు ప్రారంభించి మన ప్రాచీన జీవనగంగా ప్రవాహాన్ని ఇటీవల శివాజీ రూపంలో దర్శనమిచ్చిన జీవన గంగతో కలిపి, భారతీయ రాష్ట్ర పునరుద్ధరణ అంటే హైందవ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ధార్మికాది సర్వరంగాల్లోనూ సర్వాంగీణ ఉన్నతిని సాధించడమేననే దృఢమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కేవలం వివరణ, వ్యాఖ్యానాలతో కొందరు సంతృప్తి చెందకపోవచ్చు; అందువల్ల ఆయన తన ఉపన్యాసాలలోను, రచనలలోనూ అసందిగ్ధంగా హిందూ రాష్ట్ర పదాన్ని ఉపయోగించి, ఎలాంటి అసమానానికి, సందిగ్ధతకు తావు లేకుండా చేశారు.

విద్యావంతుల భ్రమలు : వాటి దుష్పరిణామాలు

కాని ఆయన స్వల్పకాలమే జీవించి ఉన్నందున ‘ఒక సంవత్సరములో స్వరాజ్యం’ ఇత్యాది మోహాత్మకములు, నిరాధారములైన నినాదాలతో మోసపోలేదు. హిందూ ముస్లిం ఐక్యత లేనిదే స్వరాజ్యం సంపాదించలేదను తప్పుడు భావాజాలను ఏర్పరచుకొనలేదు. హిందూ ముస్లిం ఐక్యత అనే మృగతృష్ణ వెంటబడి ఈ నవ విద్యావంత వర్గం భ్రమా సాగరంలో ఏ విధంగా మునకలు వేస్తోందీ చూచాయగా చూచినవారికి సైతం కనబడుతుంది. ఈ అయోమయ స్థితివల్ల అమలు జరిగిన అవమానకరమైన దేశ విభజన; కాశ్మీర్‌ విభజన, (ప్రధానమంత్రి పండిత నెహ్రూ ప్రకటనలను బట్టి ప్రస్తుతంలో ఈ విభజన శాశ్వతమే ననిసపిస్తుంది); లక్షలాది దేశీయులు నిర్వాసులు కావడం; వారి కష్టాలు; అస్సాం, ఝార్ఖండ్, తిరువాన్కూరు, మలబార్‌, కొచ్చిన్‌లలో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణులు; నిరంతరంగా ఎక్కువవుతున్న ‘‘స్వతంత్రస్థాన్‌’’ కోర్కెలు; ఇత్యాది అసంఖ్యాకములైన విచారకర సంఘటనలు జరగడం; నే (నా) టి ప్రభుత్వం, వారి కాంగ్రెసు పక్షం ఇంకా అనేకములైన లజ్జాకర శరణాగత ప్రణాళికలను తయారుచేయడం మొదలుగా గల బాధాకరమైన పరిస్థితి రావడం, ఇంకా రానుండడం` ఇదీ ప్రతి నిజమైన దేశ భక్తుడూ చూడగలిగినది.

లోకమాన్యుని దూరదృష్టి

ఈ అయోమయత్వపు అనర్థ ఫలితాలను మొగ్గలోనే త్రుంచివేసేందుకు వాటి బీజాలను సైతం నాశనం చేసేందుకు, తిలక్‌ హిందూ రాష్ట్ర ఇతిహాసానికి సంబంధించిన పునీత సత్య సిద్ధాంతా లను నొక్కి వక్కాణించడంలో ఆయన దూరదృష్టిని గుర్తించవచ్చు. వారి సుదీర్ఘ కారాగారవాసం, ఆ సమయంలో జరిగిన అనేక కుట్రలు, ముస్లింలను స్వతంత్ర శక్తిగా నిర్మించేందుకు బ్రిటిష్‌వారు, వారిచేతి కీలుబొమ్మలు అవలంబించిన కుటిలవైఖరి – ఇత్యాది చేతిలోలేని అనేక కారణాలవల్ల వారి రాష్ట్ర సత్య స్వరూపావిష్కరణ కార్యక్రమం దేశమంతా విస్తరించలేకపోయింది. తదనంతరం కూడా తగినంత ఉత్సాహంతోను తత్వనిష్ఠతోనూ ఎవరూ ముందుకు రాలేకపోయారు. అందువల్ల నేడు మనం ప్రస్తుత దురవస్థను, ఇందులో ఉద్భవించిన సిద్ధాంత సంఘర్షాదులను అనుభవించవలసి వచ్చింది.

– గురూజీ

– 27.07.1956 జాగృతి వారపత్రిక నుండి (కొన్ని భాగాలు)

About Author

By editor

Twitter
YOUTUBE