చిన్నతనంలోనే… అమ్మ, నాన్న కనుమరుగయ్యారు.

పెళ్లయిన కొంతకాలానికే భర్త శాశ్వతంగా దూరమయ్యారు.

కానీ – ఆ వనిత నిరాశతో కుంగిపోలేదు. అనామకురాలిగా రోజుల్ని వెళ్లదీయలేదు. తన జీవితాన్ని తాను ప్రేమించింది. ఆశా జ్యోతిని తనకు తానే వెలిగించుకుంది. జీవన సాఫల్యాన్ని సేవామార్గంతో సాధించుకుంది. తనతోపాటు మరెందరిలోనో కాంతిరేఖల ప్రసారాన్ని సుసాధ్యం చేసింది. ఆమే లక్ష్మీబాయి… ఇంటి పేరు సంగం.

‘సంఘం లక్ష్మీబాయి’  అని పిలవాలి నిజానికి.

తన చుట్టూ ఉన్నవారినీ జీవితాశయం మేర దిద్దితీర్చింది.

ఇప్పటి తెలంగాణ స్వరాష్ట్రం. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సంక్షేమ సలహామండలి కార్యవర్గంలో కీలక బాధ్యురాలు. చదువుకుంది మాత్రం తమిళనాడు రాజధాని మద్రాసు ప్రాంతంలో.

పుట్టింది జులై 27, 1911లో. కాలధర్మం 1979లో.

భారత స్వతంత్ర సాధనా ఉద్యమంలో తనదే ముఖ్యపాత్ర.

స్వాతంత్య్రం తర్వాత ప్రత్యేకించి మహిళల,

బాలికల సంక్షేమ రంగంలోనూ ఆమెదే విశిష్ట భూమిక.

అవి స్వతంత్ర సాధనోద్యమ రోజులు.

అతులిత విక్రమక్రమ మహత్తర మూర్తివయై స్వతంత్ర భా

రతమునకై మహోద్ధతి స్వరక్తము దీసి ప్రతిజ్ఞ చేసి స

మమ్మతి మెయి స్వీయ జీవిత సమర్పణ జేసెడు త్యాగశీలురన్‌

వెతకి` స్వతంత్ర సేన గణనీయము గాక తయారు జేసితే!

అనేంత రోజులే అవన్నీ.

ఆ కాలంలో లక్ష్మీబాయి పుట్టింది. ఉన్న ఊరు ఘటకేసర్‌.

ఈ పేరు వినగానే (రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలూ తలపులోనికి వచ్చేస్తాయి. చరిత్రాత్మక ప్రదేశాలే ఇవన్నీ. మేడ్చల్‌ పరిసర ప్రాంత సముదాయాలతో ఇక్కడంతా విశిష్ట వాతావరణం. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి అంటుంటాం సర్వసహజంగా. కొండాపూర్‌, ఔషాపూర్‌, అంకుష్‌పూర్‌ – ఈ పేర్లలోనే చారిత్రక సంపన్నత గోచరిస్తుంది.

కీసర, కేసర పదాలూ వేటికి అవే సాటి.

ఘట, కేసర్‌, అంకుష్‌… వంటివన్నీ విశేషణాలు.

సమూహం, శిఖరం, కడవ, ప్రకాశవికాసాలు అని అర్థాలు.

పూలచెట్టులోని సుగంధం, పరాక్రమ క్రమంలో  సింహం జూలు తరహా విక్రమత్వం.

అంటే పరిమళ భరిత వ్యవహారసరళి. ప్రత్యేకించి కొర్రెముల గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది. అక్కడే లక్ష్మీబాయి జననం. విధిని ఎదిరించి నిలవడం అప్పటి నుంచే (బాల్యం మొదలు) అలవాటైంది ఆమెకి.

ఉదార హృదయుల కరుణా కిరణాల ప్రసరణలు ఆమెను మద్రాసుకు చేర్చాయి. అంతటి ఉదారతనే తనలోనూ నింపుకొన్నారు లక్ష్మీబాయి. అదే సహృదయతను తన జీవన పర్యంతమూ కనబరచి, అందరి మదిలోనూ స్థానం సంపాదించారు.

మద్రాసులో ఉన్నవల్లా ఆంధ్ర మహిళాసభ, అదేవిధంగా ఆర్ట్స్‌కళాశాల. అక్కడే విద్యాభ్యాసమంతా సాగింది.

శారదానికేతన్‌తో సైతం అనుబంధముంది. అది ఉన్నవ లక్ష్మీబాయమ్మ వ్యవస్థాపనం.

లక్ష్మీబాయమ్మ స్వాతంత్య్ర సమర యోధ. ఆ కోవలోనే దేశ సేవిక. గుంటూరులో శారదా నికేతన వ్యవస్థాపకురాలు. ఆ నికేతనం వనితాభ్యుదయ కేంద్రం.

సరిగ్గా అదే స్ఫూర్తితో సంగం లక్ష్మీబాయి తనూ సేవాసంస్థను నిర్మించి, నిర్వహించి పర్యవేక్షించారు. సంవత్సరాల తరబడి బాధ్యతలు నిర్వర్తించారు.

ఉన్నవ గురు అయితే సంగం శిష్య ప్రశస్తి.

అందుకే ఇరు జీవితాల్లోనూ సాపత్యం కనిపిస్తూ ఉంటుంది.

మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం అయ్యాక, తిరిగి భాగ్యనగరానికి చేరారు లక్ష్మీబాయి.

ఎక్కడ ఏ ఊళ్లో ఉన్నా సంఘసేవ వైపే చూపు.

నగరంలోని మహిళా కళాశాల వసతి గృహ నిర్వహణ కర్తవ్యం వహించారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఆ బాధ్యతలలోనే తల మునకలయ్యేవారు. ఒక సందర్భంలో – స్వేచ్ఛాసాధక సమాచారం విని మనసారా స్పందించారు. ఆ క్షణం నుంచే స్వాతంత్య్ర ఉద్యమ రంగాన కాలుమోపాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ప్రబల శక్తిగా రూపుదిద్దుకుని విస్తరించింది వెంట వెంటనే.

భారత భారతీ ప్రగతి భాగ్యము పండెను! ఝాన్సి శత్రు సం

హార మొనర్చసాగె మహిషాసుర మర్ధనియై – రణాంగణ

స్వైర విహారమున్‌ సలుపు సాహసమూర్తి యసార శౌర్య సం

చార కథల్‌ పవళ్లును నిశల్‌ దిశలెల్ల ప్రతిధ్వనించె!

అన్నట్లు ఆమెలో కదనోత్సాహం వెల్లివిరిసింది. సంగ్రామ భూమిలోకి ప్రవేశించి, నాద నినాదాలతో పరిసరాల్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఉద్యమంలో ఉదాత్త పాత్ర పోషించారామె.

తన నిర్వహణలో భాగంగా ఎందరెందరో స్త్రీ మూర్తులను భాగస్వామ్యం చేశారు. వారంతా ఇళ్ల నుంచి ఇవతలకి వచ్చి, ఉద్యమ ప్రక్రియల్లో ముందు వరసన నిలిచేలా చేయగలిగారు.

రాజకీయం, సంఘసేవ… ఈ రెండిరటినీ సమన్వయం చేసుకుంటూ` స్వాతంత్య్రం వచ్చేదాకా రాజకీయ రంగాన్ని, వచ్చిన తర్వాత సమాజ సేవారంగాన్ని ప్రభావితం చేయడమే తన గొప్పతనం. ఆ ప్రభావితం ఇంతా అంతా కాదు!

చదివేకాలంలో ‘సైమన్‌ కమిషన్‌’ను ఢీకొట్టారు. అతగాడు జాన్‌ సైమన్‌. తోడుగా ఏడుగిరిని వెనక నిలబెట్టి, ఏకంగా కమిషన్‌ను ఏర్పాటుచేసింది అలనాటి ఆంగ్లేయ పాలకవర్గం. కమిషన్‌ అంటే సేవ. కమీషన్‌ అనేది సంపాదన! సైమన్‌ కమిషన్‌ ఆ వెంటనే కమీషన్‌గా అవతారమెత్తింది! (ఇదంతా జరిగి ఇక మరి రెండేళ్లకు శతాబ్దం అవుతుంది).

అది రాజ్యాంగ అధికారంతో నియమితమైన విచారణ సంఘం. అంతా బ్రిటనీయులే! అందులో ఒక్క భారతీయ ప్రతినిధికీ చోటివ్వలేదు. అంతా బెదిరింపు వ్యవహారం!

‘వాళ్లు వచ్చి ఏం చూస్తారిక్కడ? ఏం చేస్తారిక్కడ?’ అంటూ నిరసన భేరి మోగించింది స్వాతంత్య్రోదమ సేన. అందులో అసంఖ్యాకంగా భారతీయ నారీమణులు. వారిలో పలువురికి నాయకత్వం వహించారు లక్ష్మీబాయి.

‘సైమన్‌ గోబ్యాక్‌’ అంటూ గర్జించారు. అప్పుడు నేతగా లక్ష్మీబాయి… సంగం కాదు… సింగం అయ్యారు!

తీవ్ర ఆందోళన చేపట్టి కొనసాగించారు. బహిష్కరణ ఉద్యమాన్ని ఉద్ధృతంగా విస్తృతపరిచారు.

పోరాట భేరిని మోగించిన ఆమె మీద కక్షగట్టింది నాటి దమన ప్రభుత్వం. నిర్బంధకాండకు దిగింది. అంతేకాక ఉప్పు సత్యాగ్రహంలో ముందు వరసన నిలచి నిరసన ప్రకటించిన వైనానికీ కంటగింపు అయింది. ఆమెను కారాగారం పాలు చేసింది అప్పటి ప్రభుత్వం.

రోజులు, నెలలు కాదు – ఏకంగా సంవత్సరంపాటు చెరసాలలో ఉండిపోయారు లక్ష్మీబాయి. అయినా పట్టువీడలేదు. మడమ తిప్పలేదు.

ఆమె లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా భావించిన దేశ సేవామయి.

కాలం గడిచింది. స్వాతంత్య్రం లభించింది. తదనంతరకాలంలో జీవన కాలమంతటినీ స్త్రీ, శిశు సంక్షేమానికే కేటాయించారామె. సేవాసదన్‌ను ఏర్పాటుచేసి, అనేకులకు ఆసరా కలిగించారు. తనకున్న ఇంట్లోనే సహాయక మందిరాన్ని ఆరంభించారు. అనాథ శరణాలయం అది. అయినా ‘అనాథ’ అనే పదాన్ని నిరసించేవారు లక్ష్మీబాయమ్మ. ‘ఇంతమంది సేవాతత్పరులు ఉండగా, ఎవరైనా అనాథ ఎలా అవుతారు?’ అని ప్రశ్నించేవారు. తన ప్రశ్నకు తానే సమాధానమిస్తున్నట్లు – మహిళా సేవాలయ సంస్థాపకురాలిగా వ్యవహరించి, ప్రజానీకం జేజేలు అందుకున్నారు.

ప్రసూతి గృహం, శిశువిహార్‌, బాలికలకు ఉన్నత పాఠశాల నిర్మాణ నిర్వహణల్లోనూ ఆమెదే ప్రధాన స్థానం, ప్రముఖ స్థాయి. ఎన్నో విధాలుగా సేవవిస్తృతికి ఆమె ఉదాహరణ.

భూ సంస్కరణల అమలుకు ఉపకరించే పాదయాత్రలకు సారథ్యం వహించారామె. యువతీ మండలి అధ్యక్షురాలిగా కూడా ఎంతోమందికి అండదండ అయ్యారు. మహిళా సభ అనగానే, మనందరిముందూ నిలిచే రూపం లక్ష్మీబాయిదే.

ఆత్మబంధువుగా సంభావిస్తారు ఇప్పటికీ వనితలంతా. సాదాసీదాగా ఉన్న ఆమెను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. భాషను అభ్యసించిన విద్వన్మణి, సేవను శ్వాసించిన మహిళామణిగా ఆరాధిస్తుంటారు. చిత్రకళలో పేరొందిన లక్ష్మీబాయి వనితల జీవన చిత్రాన్ని రసరమ్యంగా మార్చేందుకు అన్ని రకాలుగానూ పరిశ్రమించారు. ‘నా అనుభవాలు’ పేరిట ప్రసంగ అంశాలన్నింటినీ పుస్తక రూపానికి తెచ్చారు. ముందుమాటలో ఆమె అన్నట్లు – స్త్రీ ఒక వ్యక్తి కాదు; ఏకైక శక్తి.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE