శ్రీ‌రాముడు దేవుడే. శ్రీమద్రామాయణం వేదమే. ఆ దేవుడు దశరథుని ఇంట అవతరించాడు. ఆ వేదం వాల్మీకి నోటనవతరించింది. కానీ రాముడు తన నడతతో దైవత్వాన్ని మరుగుపరిచాడు. ఈ గుట్టును బయటపడనీయక భద్రపరిచారు. ఈ గుట్టు రావణ వధ వరకే. రాముడెంత దాచాలని అనుకున్నా అది దాగలేదు. బ్రహ్మరుద్రాదులే దానిని బయటపెట్టారు.

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠ మెక్కిన ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’, అన్నారు ఆధునిక కవి కూడా. రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగా, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవి గాను, సుప్రసిద్ధం. ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. భారతదేశంతో సాంస్కృతిక, మత సంబంధాలు కలిగినవి ఆగ్నేయ ఆసియా దేశాలు. అవి పదకొండు. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, ‌మలేషియా, మయన్మార్‌(‌బర్మా) ఫిలిప్పీన్స్, ‌సింగపూర్‌, ‌ధాయిలాండ్‌, ‌తైమూర్‌-‌లెస్టే (తూర్పు తైమూరు), వియత్నాం. ఈ దేశాలలోను రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకంగా ప్రసిద్ధం.

24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూధర్మం చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు ఆచారాలపై, అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్రను వర్ణించారు. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తనా విధానాలు రామాయణం విశ్లేషించింది.

అష్టాక్షరీమంత్రం ‘ఓం నమో నారాయణాయ’ నుండి ‘‘రా’’ బీజాక్షరం, పంచాక్షరీ మంత్రం ‘ఓం నమ:శ్శివాయ’ నుండి ‘‘మ’’ బీజాక్షరం పొందు పరచినదే రామ శబ్ద వ్యుత్పత్తిగా చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. మూడుసార్లు రామనామం స్మరిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలం లభిస్తుందని సహస్ర నామస్తోత్రం ఉత్తర పీఠిక చెబుతుంది.

భారతదేశం తన పురాణాలను ప్రపంచానికి బోధించడానికి వెళ్లి తన పొరుగువారికి సుమారు ఆసియాలోని 3 వంతుల మందికి ఒక దేవుడిని (రాముడును) ఒక మతాన్ని (హిందూ) ఒక సిద్ధాంతాన్ని (ధర్మాన్ని) ఒక కళను (రామాయణాన్ని నృత్యగానం) ఇచ్చింది. అలాంటి ఓ నమూనాలను సుమారు 2500 సంవత్సరాలకు పూర్వమే వాల్మీకి మహర్షి రామాయణం రూపంలో అందించాడు అంటాడు ఫ్రెంచ్‌ ఇం‌డాలజిస్ట్ ‌సిల్వైన్‌ ‌లెవి.

నైతికవర్తనకు సంబంధించి ప్రపంచానికి పరిచయమైన గ్రంథాలలో ‘రామాయణం’ అగ్రస్థా నంలో ఉంటుంది. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. వారి నాటకాలు, సంగీతం, నృత్య రూపకాలు, చిత్ర లేఖనం, శ్పికళ, రాజప్రదర్శనలలో మాత్రమే కాకుండా పరిపాలనా సిద్ధాంతాలలో కూడా సుమారు 15 వందల సంవత్సరాల నుండి ప్రభావితం చేస్తూ వస్తున్నది. బౌద్ధులు, ముస్లిమ్‌లు అధికంగా ఉన్న దేశాలలో కూడా రామాయణ కథతో వచ్చిన రంగస్థల కళారూపాలకు విశేష ప్రజాదరణ ఉంది. ఇప్పటికీ ఆ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

ఆగ్నేయాసియా పాలకులనేకులు భగవాన్‌ ‌రామ్‌ ‌పేరును తమ పేరుగా స్వీకరించారు. విష్ణువుకు సంబంధించిన ప్రతిమలు, ప్రతీకలు వారి రాజ ముద్రికలను అలంకరించాయి. ఆగ్నేయ ఆసియా నగరాలకు, మహానగరాలకు వాల్మీకి మహర్షి ఇతిహాసంలోని పూజనీయ స్థలాల పేర్లు పెట్టారు. అందులో ముఖ్యమైనది అయోధ్య. ఆగ్నేయ ఆసియా సంస్కృతులలో అప్రతిహతంగా సాగిన రామాయణ వారసత్వం కారణంగా ‘‘ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌కల్చరల్‌ ‌రిలేషన్స్’’ అం‌తర్జాతీయ రామాయణ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. రామాయణం ద్వారా ప్రపంచ అనుసంధానం ఎలా జరుగుతుందో ఈ ఉత్సవాలు గుర్తు చేస్తాయి. తద్వారా రామాయణం ప్రపంచానికి నైతికవర్తన నేర్పే గ్రంథమయింది.

రామాయణాన్ని ధాయ్‌లాండ్‌లో ‘రామకీన్‌’ అం‌టారు. ఈ ఇతిహాసం మీద ఆధారపడే ‘‘ఖోన్‌’’ అనే నృత్యరూపకం అక్కడ తరతరాలుగా ప్రదర్శిస్తు న్నారు. ఫిలిఫైన్స్‌లో ‘మహరద లావన’గా రూపాం తరం చెందింది. అక్కడి సింగ్‌కిల్‌గా రామాయణ నృత్యరూపకం జనరంజకమైంది. జావా ద్వీపంలో ‘కాకావిన్‌’ అనుశ్రుతంగా వస్తున్నది. కంబోడియా, మయన్మార్‌, ‌లావోస్‌ ‌దేశాలలో వారివారి రామాయణ ఆధారిత నృత్య రూపకాలు న్నాయి. వాటికి స్థానిక సంప్రదాయాలు, గాథలు కలిపి ప్రదర్శిస్తారు. మలేషియా, సింగపూర్‌, ‌వియత్నాంలకు సొంత శైలి రామాయణాలున్నాయి. ధాయ్‌లాండ్‌, ‌మయన్మార్‌, ‌కంబోడియా లావోస్‌ ‌దేశాలవారు ‘‘ధేరవాద’’ బౌద్దాన్ని అనుసరిస్తున్న కారణంగా అక్కడ రామాయణంలో బౌద్ధ సంప్రదాయాలు మిళితమయ్యాయి. మాయ న్మార్‌లో రామాయణాన్ని ‘యమాయణ’ లేదా ‘యామా ఔట్‌ ‌డాగా’ గా వ్యవహరిస్తారు. రాముడ్ని యామగా సీతాదేవిని తిడాగా పిలుస్తారు. అక్కడ రామాయణాన్ని ధేరవాద బౌద్ధంలో ఒక జాతక కథగా అభివర్ణిస్తారు. నేటికీ అవి కొనసాగుతున్నాయి.

సుమారు 11వ శతాబ్దం నుంచి ఆయా దేశాలలో రామాయణం ప్రస్తావన కనిపిస్తుంది. ఇండోనేషియా, మలేషియా దేశాలలో బౌద్ధేతర ఛాయలు కనిపిస్తాయి. ధాయ్‌లాండ్‌ ‌జాతీయ కావ్యం ‘రామకీన్‌’ ‌సుమారు 700 సంవత్సరాలకు పూర్వం చక్రి వంశరాజు ‘రామా-1’ పరిపాలనా కాలంలో రచించారని చెబుతారు. రామకీన్‌ను ధాయ్‌లాండ్‌ ‌భూభాగంలో జరిగిన గాధగా తీర్చిదిద్దారు. సంప్రదాయ బర్మీస్‌ ‌నాట్యశైలుల్లో రామాయణం ప్రధాన ఇతివృత్తమైంది. లావోస్‌ ‌జాతీయ ఇతిహాసం ‘ప్రాలాక్‌ ‌ప్రారామ్‌’ ‌పేరుతోనే రామాయణం కనిపిస్తుంది. అందులో భారత్‌లోని గంగానది స్థానాన్ని ‘‘మీకాంగ్‌’’ ‌నది భర్తీ చేసింది. మీకాంగ్‌ ‌నది ఆగ్నేయ ఆసియాకు జీవనాడి. లావోస్‌ ‌ప్రజలు రామాయణాన్ని బుద్ధుని జాతక కథగా, రాముడిని గౌతమబుద్ధుని అవతారంగా పరిగణిస్తారు. బుద్ధుడిని మోక్ష మార్గానికి దూరం చేయడానికి ప్రయత్నించిన ‘మారా’ అనే దుష్టశక్తికి ప్రతీకే రావణుడు అని నమ్ముతారు. చెడుపై మంచి సాధించే విజయంగా రామకథను వారు గౌరవిస్తారు.

ఇండోనేషియాలో ఇప్పటికే రామాయణంతో పాటు భారతీయ పురాణాలు జనాదరణ పొందుతున్నాయి. జావా ద్వీపంలోని యోగ్యకర్త నగరం పేరు రాముడి రాజధాని అయోధ్యకు అపభ్రంశ రూపం. రామాయ ణంపై ఆధారపడిన నృత్యరీతులు అక్కడ హిందూ ఆలయం ప్రాంబనాన్‌లో ఇప్పటికి ప్రదర్శిస్తున్నారు.

తమిళ వర్తకుల ద్వారా రామాయణం మలేషియాలో ప్రవేశించింది. ఆ కావ్యాన్ని అక్కడ ‘హెకాయత్‌ ‌సెరి రామా’గా వ్యవహరిస్తారు. రామాయణం బోధించే విధేయత, ధర్మబద్ధత వలన ఈ కావ్యం ప్రజలలో ఆదర•ణ పొందుతున్నది.

కంబోడియా జాతీయ ఇతిహాసం రీమ్కర్‌, ‌రాముడిని ప్రీహీరీమ్‌ అని, లక్ష్మణుడుని ప్రీహీలీక్‌ అని సీతాదేవిని నీంగ్‌ ‌సేడ అని పిలుస్తుంది. వాల్మీకి రామాయణంలో లేని కీలక ఉదంతాన్ని చేర్చడంతో పాటు ప్రీహీరీమ్‌ ‌కమాండర్‌ ‌హనుమంతుని, మత్స్యకన్య సోవన్‌ ‌మచ్చా మధ్య జరిగిన సంభాషణ వంటివి చేర్చారు. రీమ్కార్‌ ‌చిత్ర లేఖనం ఆధారంగా రూపొందించిన చిత్రాలు రాయల్‌ ‌పేలస్‌ను ఖైమర్‌ ‌శైలిలో అంకోర్‌వాట్‌, ‌బాంటేమ్‌శ్రీ ‌దేవాలయాల గోడలపైన చిత్రించారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో మాదిరిగానే, రీమ్కర్‌ ‌కూడా ప్రియారీమ్‌ను నియాంగ్‌ ‌సేడా నైపుణ్యాన్ని అగ్ని పరీక్ష ద్వారా పరీక్షించమని అడుగుతుంది. ఆమె దానిని దాటి వెళుతుంది. కాని అతనికి ఆమెపై విశ్వాసం లేకపోవడంతో తీవ్రంగా బాధ పడుతుంది. విచారణ తరువాత ఆమె అతడిని విడిచి పెట్టి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ ఆమె మగ కవలలను కంటుంది. తరువాత వారు తమ తండ్రితో కలుస్తారు. నేడు ధాయ్‌ ‌లాండ్‌లో అటు రంగస్థల కళగా, బోధనాపరంగా ప్రాచుర్యం పొందిన ఈ వెర్షన్‌ ‌సియామ్‌ ‌చక్రి రాజవంశానికి చెందిన మొదటి చక్రవర్తి రామ-1 కాలం నాటిది. దశరథ నాటకాన్ని బుద్ధుని జాతక కథగా చూస్తారు. రామ్‌కీన్‌ ‌రచయిత విష్ణు పురాణం, హనుమాన్‌ ‌నాటకాల నుండి ప్రేరణ పొందాడు. అందువల్ల రామ్‌కీన్‌లోని ఉదంతాలకి వాల్మీకి ఇతిహాసంతో ఎక్కువ పోలికలు ఉన్నాయి. దీని కథాంశం ఉప కథాంశాలు అయుతమ నైతికతపై వ్యాప్తి చేసినట్లు కనపడతాయి. ఇది ప్రారాం రూపంలో ప్రానరై (విష్ణువు లేక నారాయణ) దైవిక అంశాన్ని సూచిస్తుంది. ధాయ్‌లాండ్‌లోని అన్ని నాంగ్‌, ‌ఖోన్‌ అనే ప్రదర్శనలకు రామకియన్‌ ‌ప్రధాన ఇతివృత్తం.

ఇండోనేషియా, ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశం అయినప్పటికి రామాయణ (సాధారణ భారతీయ పురాణాలు) ప్రాధాన్యం నిరంతరం గుర్తిస్త్తూనే ఉన్నారు. సాధారణంగా ‘‘వేయాంగ్‌ ‌కులిట్‌’’ అని పిలిచే తోలుబొమ్మలాట ద్వారా వారు ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ప్రదర్శన అనేక రాత్రులు జరుగుతుంది. జావానీస్‌ ‌రామాయణ నృత్య రూపకాలు ‘వాయాంగ్‌ ‌వాంగ్‌’ ‌సంప్రదాయ రీతిలో ఉంటాయి. సాధారణంగా ప్రాంబన్‌ ‌హిందూ ఆలయం, యోగ్య కర్తపుర విసాత సాంస్కృతిక కేంద్రంలో, అలాగే రీజెన్సీ యోగ్యకర్త హోటల్లో వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణంలో ప్రధానంగా జావాకు సంబంధించిన కొన్ని చేర్పులు కనిపిస్తాయి. సర్వ శక్తిమంతుడైన దేవత దాయన్‌, ‌జవానీస్‌ ‌సంరక్షక దేవుడు.

ఆగ్నేయాసియా సంస్కృతిలో రామాయణం ముద్రలు నేటికి కన్పిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రానికి ఉత్తరాన ఉన్న భూభాగాల్లో వ్యాపారం చేసిన భారతీయులు రాముని వ్యక్తిత్వాన్ని తరతరాలకు మార్గదర్శక ప్రేరణగా చూపగలిగారు. రామావ తారం సజీవంగా, విశ్వసనీయంగా మారి సాధారణ ప్రేక్షకులను నైతికపథంలో నడిపింది. వాల్మీకి మహర్షి మనిషిని లేదా సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలన్న తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగారు.

చెడుపై మంచి సాధించే విజయాన్ని కీర్తించే నైతిక గాధ రామాయణం. ఇది భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక సంప్రదాయాలను నైతికతను కీర్తించే వ్యవస్థకు మాతృకగా నిలిచింది. మరీ ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో అయితే సంగీత నాటకరీతుల్ని, చిత్ర నాట్యకళలను ఆచార వ్యవహారాలను, పరిపాలనా విధానాన్ని రామాయణం గాఢంగా ప్రభావితం చేసింది. ఆయా దేశాల్లో ఇప్పటికి రామాయణ ఆధారిత రంగస్థల ప్రదర్శనలు ఉంటాయి. వందల ఏళ్లయినా ప్రజాదరణ పొందు తూనే ఉన్నది. కారణం రామకథ సమాజాన్ని పరిశీలించి రాసిన మానవ జీవితం సుఖదు:ఖాల సమ్మేళనం. వాల్మీకి మహర్షి కూడా ఇదే ఆశయంతో రచన సాగించారు.

మూలం:

1) India and Java Part-1, Bijan Raj Chatarjee P-29 to 42
2) Hindusim in Java, Bijan Raj Chatarjee
3) Anup K. Chatterjee — ఆగ్నేయ ఆసియాలో వివిధరకాల రామయణాలు తేది.16.07.2024.

4) Versions of Ramayana, Author not known.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE