భారత నౌకాదళంలో సీనియర్‌ అధికారిణులు. శత్రుసేనల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సముద్ర మార్గంవైపే  ఎప్పుడూ చూపు సారించి ఉంచే దళ యుద్ధ విమానాలకు వారే సారథులు!  విమానాలతో పాటు హెలికాప్టర్లకూ వారే పైలట్లు! అంటే, మహిళా ఫైటర్లు. భారత నావికా బృందం, అందులో సంగ్రామ విమాన విభాగం. మరెంతో వన్నె తెచ్చేలా-ఆ లోహ విహంగాలను వనితలే నడిపించడం.ఇవన్నీ స్త్రీ శక్తిని వినువీధిన ప్రత్యక్షం చేస్తున్నాయి. ఆ శక్తియుక్తులు కలగలసి తళుక్కున మెరుస్తోంది ‘ఆస్థా’. దళంలో చేరినపుడు ఈమె వయసు 23! ఆమెకు విశాఖ, దుండిగల్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌, ‌కేరళలతో ఎంతెంతో అనుబంధం. దేశ రాజధాని నగరాన ఇదే పేరు ధగధగ. ఆస్థా… ది గ్రేటెస్ట్.

భారత రక్షణ, భద్రతలన్నీ సేనల బాధ్యతలు. ముఖ్యంగా సరిహద్దు ప్రదేశాల్లో. అందులోనూ సముద్రపరంగా అత్యంత కీలక కర్తవ్యం. తీరప్రాంత పరిరక్షణపైనే నేవీ దృష్టి కేంద్రీకృతం. ఇండియన్‌ ‌నేవీది అపార పరాక్రమం. అరవై లక్షలకు మించిన సిబ్బంది. రాశి, వాసిలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇండియన్‌ ‌నేవల్‌ ‌షిప్స్ (ఐఎస్‌ఎస్‌)‌ది చెదరని ముద్ర. త్రివిధ దళాల్లో తనదైన ప్రత్యేకత నిండిన నావికాదళం పేరు చెప్పగానే 1961,1965, 1971 నాటి సంఘటనలు మన కళ్లముందు మెరుస్తాయి.

ఆపరేషన్‌ ‌విజయ్‌. ‌మన సముద్ర ద్వీప ప్రాంతంలోని నౌకల మీద పోర్చుగీస్‌ ‌సైన్యం దాడిని మెరుపువేగంతో తిప్పికొట్టడం. పాకిస్థాన్‌ ‌జలాంతర్గా మిని ధ్వంసం చేసి, సముద్ర జలాల్లో ముంచేసిన చరిత్రాత్మక ఘట్టం. ది గ్రేట్‌ ఐఎన్‌ఎస్‌ ‌రాజపుత్‌. అలాగే నిర్ఘాట్‌, ‌నిపత్‌ ఐఎన్‌ఎస్‌లు కూడా. ఇవన్నీ పాక్‌ ‌సేనను నిలువరించాయి. భారత్‌-‌పాక్‌ ‌సంగ్రామంలో పేరొందిన ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ఉం‌డనే ఉంది. ఐఎన్‌ఎస్‌ ‌ఢిల్లీ, గోదావరి, తల్వార్‌, ‌తదితరాలు యుద్ధ నౌకలది శత్రు వ్యూహ విధ్వంసమే లక్ష్యం. నదుల పేర్లతో ఉన్న మరికొన్ని – ఐఎన్‌ఎస్‌ ‌గంగ, గోమతి.

సింధుఘోష్‌ ‌వంటి పేరు పొందిన జలాంతార్గాములు (సబ్‌మెరైన్స్) ‌మనకున్నాయి. బ్రహ్మోస్‌ ‌తరహా ఆయుధ సంపత్తి సరేసరి. సాగరిక, ఇంకెన్నో అగ్ని క్షిపణులు, పృథ్వీ క్షిపణులూ ఉన్నాయి మనకు. రాకెట్‌ ‌లాంచర్ల బలం అండదండగా ఉంటోంది. అడ్మిరల్‌, ‌వైస్‌, ‌రీర్‌, ‌కమ్మొడోర్‌, ‌లెఫ్టినెంట్‌ ‌కమాండర్ల వ్యవస్థలు. నౌకాదళంలోని యుద్ధ విమానాలకు సంబంధించి – ఫైటర్‌ ‌పైలట్లది విలక్షణ పాత్ర.

మరి, మన నేవీ ఏవియేషన్‌లో అటువంటి పైలట్ల మహిళల్లో తొలి స్థానం ఎవరిదీ అంటే… ఆస్థాదే! ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌ (‌మీరట్‌)‌లో ఇంజినీరింగ్‌ అభ్యసించారు. షార్ట్ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా నౌకాదళంలో ప్రవేశించించారు. ఆ ‘కమిషన్‌’ ఒక నియామక విధానం. దీనితో నియమిత కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. శాశ్వత కమిషన్‌ ‌సైతం ఉంది. ఆ విధంగా సైన్యంలో కొనసాగవచ్చు. దీక్షా దక్షతలు బట్టి పొడిగింపు వర్తిస్తుంటుంది. నాయకత్వ నైపుణ్యమే ఇక్కడ ప్రధానాంశం.

మూడేళ్ల క్రితం మనం ‘మిలాన్‌’ ‌నిర్వహించాం. మిత్రదేశాలతో కలిసి శక్తి ప్రదర్శన. సముద్రంలో నౌక వెళ్తుంటే, పై నుంచి హెలికాప్టర్‌ ‌దిగడం, ఒక నౌక నుంచి మరో చోటకి పయనించడం, జలాంతర్గాములను ఎదిరించి నిలవడం…. ఆకట్టు కొనే విన్యాసాలు!

తాజాగా మరి రెండు నౌకలు నేవీలోకి రంగ ప్రవేశం. అవి నిస్తార్‌, ‌నిపుణ్‌. ఇవి జలాంతర్గా ములకు సహకారం అందిస్తాయి. సాంకేతికత నానాటికీ విస్తరిస్తూ, సరికొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో నారీమణుల సమధికోత్సాహం ఎన్నెన్నో ఆశలు రేకెత్తిస్తోంది.

గర్జించుగాక! రంగత్తరంగాబ్ధి సంఘటితోద్భ టమ్ము నౌకాదళమ్ము

విజృంభించుగాక! దోర్వీర్య విక్రమకనద్ధాకధాత్రీ తలమ్ము సైనిక బలమ్ము

జ్వలియించుగాక! శుంభద్వేగనచలద్దశ దిశాంచలము ఆయుధ శతము

వ్యాపించుగాక! దివ్యద్వియద్వీథి సంభ్రమణోజ్వలమ్ము విమాన బలము!

ధరణీతలి దద్దరిల్ల భరతభూమి జృంభించును!

యుద్ధ సిద్ధమై శత్రు వ్యూహమ్ములు ఛేదించును!

మహాప్రళయె ఝంఝానిల మధిత వార్థులుప్పొంగును శీతనగమ్ముపై త్రివర్ణకేతనము శోభిల్లును!

చతుస్సింహ ముద్రాంకిత జయపతాక రాజిల్లును!

అనేలా అతివ పటిమ విరాజిల్లుతోంది. నౌకాదళ యుద్ధ విమానాల ప్రథమ చోదకురాలిగా ఆస్థా ఒక రికార్డునే సృష్టిస్తోంది.

ఆమెది సాధారణ కుటుంబం. ఆమెలోని పోరాటస్ఫూర్తి అసాధారణం. భారత సైన్యంలో చేరాలన్నది తొలి నుంచీ ప్రగాఢ ఆశయం. నిజానికి ఆమె కుటుంబంలో మరెవ్వరూ సైనిక దళాల్లో లేరు. జాతీయతా దీప్తి తనకు సహజ సిద్ధంగా లభించింది. ఆమె ఆలోచనలన్నీ దేశసేవ చుట్టూ తిరుగుతుండేవి.

ఉత్తరప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ అయ్యాక, కేరళలోని ఎజిమల ప్రాంతంలోనికి వెళ్లి, ఇండియన్‌ ‌నావల్‌ అకాడమీలో చేరారు.అనంతరం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. ఒక తరహా విమానాన్ని సమర్థంగా నడిపి ఉన్నత స్థాయి అధికార బృందాల దృష్టిలో పడింది. ఆమె నిబద్ధత వారి ప్రశంసలందుకున్నారు.

మిలిటరీ ఏవియేటర్లు అంటేనే మెరుపు వేగానికి ఉదాహరణలు. అసలు ఏవియేషన్‌ అనేది సైనిక విమానాలతో సాగించే పయనం. విమానాల్లో ఎన్నో విధాలు ఉంటాయి. యుద్ధ విమానాలతోపాటు రవాణా వాహకాలు, బాంబర్లు, ఆ కోవలోనే హెలికాప్టర్లతో సాగించే విన్యాస కృత్యాలు. వైమానిక దాడులు చేయాలి. గాలిలో పోరాటాలు జరపాలి. ఇతరత్రా సైనిక కార్యకలాపాలు నిర్వర్తించాలి. ప్రత్యర్థి విమానాల్ని ఎదుర్కోవాలి. భూమిపైన లక్ష్యాలు ఛేదించడానికి బాంబర్లగానూ వ్యవహరించాలి. అవసర సమయాల్లో సైనికుల తరలింపు అంతా ఆ విమానాల్లోనే. ఆయుధాలు, సాధనాలు, పరికరాలను రవాణా చేయడంలో పూర్తి అప్రమత్తత వహించాలి. దాడులు, నిఘాలు, రవాణాలు, అత్యవసర సందర్భాల్లో ప్రయోగాల పరంపరలు! ప్రతి నిమిషం సాహసపూరితం. ఉత్కంఠభరితం. క్షణాల్లో నిర్ణయాలు తీసుకొని, మరుక్షణం అమలు చేయాలి. ఎదురయ్యే అవరోధాలను నిలువరించాలి. ఈ నైపుణ్యాలన్నిటిని అందిపుచ్చుకొన్న ఆస్థా తన కర్తవ్యపాలనలో రాటు తేలారు.

 విశాఖ ఉంది ఐఎన్‌ఎస్‌ ‌డేగా! ఇది భారత నౌకాదళానికి చెందిన వైమానిక కేంద్రం. తూర్పు తీరంలో ఉక్కు కవచంలా ఉంటోంది. అదీ విమానా శ్రయానికి సమీపంలో. మూడున్నర దశాబ్దాలనాడే ఏర్పాటైంది. మొదట్లో నాలుగు హెలీప్యాడ్‌లు ఉండేవి. ఎయిర్‌ఫీల్డ్‌కు ఆనుకుని సదుపాయాలు విస్తృతమయ్యాయి. ఈ ఎయిర్‌స్టేషన్‌ ‌పేరు ‘డేగ’ అయింది. తీక్షణమైన చూపు. రెప్పపాటులోనే ధాటి చూపగల నేర్పు. అంతకు మించిన ఓర్పు. శత్రువుల్ని మట్టి కరిపించగల సత్తా. మిగ్‌-29 ‌ఫైటర్‌ ‌జెట్‌లతోపాటు అనేక విమానాల స్థావరం- విశాఖ డేగ. తమిళనాడులో రజాలి, పరందు ఉన్నట్లుగానే, తెలుగునాట. ఈ డేగకన్ను. సాగరనగరం విశాఖలో త్రివిధ దళాల కేంద్ర స్థావరం. ఇక్కడే ఆ మధ్య ‘అరిఘాత్‌’ ‌రంగ ప్రవేశం చేసింది. అరి అంటే శత్రువు. వెన్నులో వణుకు పుట్టించేదన్నమాట. అటు తర్వాత స్టార్‌-ఎస్‌ 4 అణుజలాంతర్గామి. తయారైంది అంతా స్వదేశీ పరిజ్ఞానంతోనే. ఇదే డిఫెన్స్ ‌కేంద్రంలో ‘థియేటర్‌ ‌లెవల్‌ ‌కమాండ్‌’ ఏర్పాటు కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

పదాతి, నావికా, వైమానిక దళాలు మూడూ ఒక దగ్గరే ఉండి ఉమ్మడి ‘ఆపరేషన్‌’ ‌నిర్వహించా లన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఇటువంటి ఆశావహ పరిణామాల నడుమ జెట్‌ ‌ట్రైనర్‌గా అనుభవం గడించిన ఆస్థా అనతికాలంలోనే నేవల్‌ ఏవియేటరుగా ప్రత్యేకత సంతరించుకున్నారు. వింగ్స్ ఆఫ్‌ ‌గోల్డ్ ‌పురస్కారాన్ని ఈ మధ్య అందుకున్నప్పుడు పులకించిందామె. ఉన్నతాధికారులు కితాబు ఇచ్చినట్లు; ఆమె చేరికతో, మహిళా ఫైటర్‌ ‌పైలట్‌ ‌కావడంతో మొత్తం భారతీయ నావికాదళంలోనే స్త్రీ మూర్తులపరంగా నూతన శకం మొదలైంది.

ఏ రఫేల్‌ ‌యుద్ధ విమానాన్నో ఆస్థా నడిపితే? మిగ్‌-29 ‌కె వంటి విమానానికి సారథ్యం వహిస్తేనో? నారీ నాదం అంతటా మారు మోగు తుంది. మహిళా పైలట్ల గురించిన పుస్తకం పేరు- వింగ్స్ ఆఫ్‌ ‌గోల్డ్. ఆ ‌పేరుతో గల పురస్కారం ఏవియేటర్‌గా ఆస్థాకు దక్కడం నిశ్చయంగా జయజయరావం!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE