పంచ సరోవారాల్లో  హిమాలయ పర్వతశ్రేణిలోని మానస సరోవరం ఒకటి.   టిబెట్‌ ‌ప్రాంతంలోని   కైలాస పర్వతం దగ్గరలో సముద్రానికి  సుమారు 4,590 మీటర్ల ఎత్తులో గల ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తునగల  తీయని నీటి సరస్సులలో ఒకటిగా చెబుతారు. దీని  పరిధి దాదాపు 90 కిలోమీటర్లు.  స్కంద పురాణం, రామాయణ, మహాభారతంలో  దీని ప్రస్తావన ఉంది.

మానససరోవరాన్ని బ్రహ్మ సరోవరమనీ అంటారు. ఆయన మనసులో నుంచి పుట్టినది కనుక ఆ పేరు వచ్చిందని చెబుతారు. బ్రహ్మదేవుడు ఆది దంపతుల అవసరార్థం దీనిని సృష్టించాడని, భగీరథుడు గంగావరణత కోసం దీని ఒడ్డునే ఘోర తపస్సు చేశాడని ఐతిహ్యం. ఇది హిందూ, బౌద్ధ, జైన మతస్థులకు పవిత్ర తీర్థ స్థలం. బౌద్ధులు దీనిని ‘అనోత్తర సరస్సు/అనవతప్త’ అని పిలుస్తారు. ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద్ధ రామం’ ఉంది. బుద్ధుడి ఉద్భవానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందని బౌద్ధుల నమ్మకం. జైనమత తొలి తీర్థం కరుడు ఆదినాథుడు ఇక్కడే మోక్షం పొందాడని విశ్వాసం. కైలాస పర్వతాన్ని టిబెటన్‌ ‌భాషలో ‘రిన్‌పోచి’ అని పిలుస్తారు. ఆ దేశస్థులు ఈ గిరిని అతి పవిత్రంగా పరిగణిస్తూ, ఈ పర్వతంపై పాదం మోపడాన్ని పాపంగా భావిస్తారు. అందుకే వారు మోకాళ్లపై పర్వతాన్ని ఎక్కుతారు. అత్యధిక హిందువులు ఆ పర్వతం చుట్టూ (52 కిలోమీటర్లు) ప్రదక్షిణ చేస్తారు తప్ప పర్వతాన్ని అధిరోహించరు.

కైలాస-మానస సరోవర యాత్ర శారీరకంగా క్లిష్టమైనదైనా ఆధ్యాత్మికంగా అంత్యత విశిష్టమైనదిగా, పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒకసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని,  కైలాసగిరిని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని ప్రజలు, ముఖ్యంగా… హిందూ భక్తులు ఆశిస్తూ ఉంటారు. ఆసియాలోని నాలుగు గొప్ప నదులు – బ్రహ్మపుత్ర, సింధు,కర్నలి, సట్లెజ్‌లకు ఈ సరోవరం జలమే ఆధారం. అంతకుమించి వేదమాత విహరించే స్థలం కనుక, ఈ సరస్సులోని నీరు సేవించిన వారికి నేరుగా కైలాస ప్రాప్తి కలుగుతుందని, ఇక్కడి స్నానం వల్ల నూరు జన్మాల పాపాలు పరిహారమవుతాయని విశ్వాసం. వేదాధ్యయనం చేయ(లే)కపోయినా, శాస్త్రాలను ఆచరించలేక పోయినా ఇక్కడ స్నానమాడి, జలాన్ని తీర్థంలా సేవిస్తేనే జన్మ ధన్యమన్నది నమ్మకం. అందానికి ప్రతిరూపాలు హంసలు ఈ సరోవరంలో విహరించేవని హిందువుల నమ్మకం. ఈ ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి రెండు గంటలపాటు ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. దీనిని చూచేందుకు యాత్రికులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ సమయంలో దేవతలు స్నానం చేయటానికి అక్కడికి రావడమే ఆ కాంతికి కారణమని భక్తుల నమ్మకం.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏటా జూన్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య కాలంలో 23 నుంచి 25 రోజుల పాటు కైలాస్‌ ‌మానస సరోవర యాత్ర నిర్వహిస్తుంది. కోవిడ్‌, ఇతర రాజకీయ కారణంగా ఆరేళ్లుగా యాత్ర నిలిచిపోయింది. 1950 దశకం వరకు భారతీయుల కైలాస సందర్శనం సాఫీగానే సాగింది. 1950లో చైనా టిబెట్‌ని ఆక్రమించు కోవడం, భారత్‌, ‌చైనాల మధ్య కొన్ని వివాదాలతో పర్యటన కష్టతరమైంది. చైనా ప్రభుత్వం 1954లో కైలాస పర్వత సందర్శనాన్ని భారతీయ యాత్రికులకు అనుమతిని నిరాకరించింది. అయినా, కొందరు ఔత్సాహికులు నేపాల్‌ ‌చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాసగిరి సందర్శనకు వెళ్లేవారు. ముఖ్యంగా 1959-1978 మధ్యకాలంలో ఆ గిరి సందర్శనకు ఎవరికీ అనుమతి లేదు. ఆ తరువాత నుంచే భారత ప్రభుత్వం ద్వారా వెళ్లేవారిని పరిమిత సంఖ్యలో అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా మారింది. 1990 తర్వాత టిబెట్‌ ‌పట్ల చైనా కఠినవైఖరి అవలంబించినా, మరోవంక యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను చైనా గుర్తించింది. 1995 తర్వాత ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. 2020లో కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా, ఆ తర్వాత లద్దాకు తూర్పునగల గాల్వాన్‌ ‌లోయలోని వాస్తవాధీన రేఖ వెంట భారత్‌-‌చైనా సైనికుల మధ్య ఘర్షణతో యాత్ర పునఃప్రారంభం కాలేదు. ఇటీవల రక్షణ మంత్రి చొరవతో యాత్రకు మార్గం సుగమమైంది.

ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. ప్రకృతి రమణీయతతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నందున అప్రమత్తత అవసరం. వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడే జలపాతాలు, చుట్టూ పెట్టని కోటల్లా కనిపించే పర్వతాలు, అడుగు జారితే… ఊహించేందుకే భీతి గొలిపే లోయలు. మార్గ మధ్యంలో అత్యంత సవాల్‌తో కూడిన సుమారు 45 కిలోమీటర్ల దూరాన్ని ట్రెక్కింగ్‌ ‌చేస్తూ అధిగమించవలసి ఉంటుంది. అయినప్పటికీ కష్ట నష్టాలకు ఓర్చి మన దేశస్థులు తరతరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఈ యాత్రకు ఒకే మార్గం ఉండేది. అక్కడికి వెళ్లి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టేది. కాలానుగుణంగా, యాత్రికుల అసరాల మేరకు హెలికాప్టర్‌ ‌సర్వీసు ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడినట్లయింది. అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అటుఇటుగా ఉంటాయి. ఎండవానలకు నియమిత వేళలంటూ ఉండవు. కొన్నిసార్లు విపరీతమైన మంచు కురుస్తూ, కొన్నాళ్ల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ‌ప్రయాణం ప్రమాదకరమని అంటారు.

మానస సరోవరం సందర్శన సంకల్పం మంచిదే కానీ, అక్కడి వాతావరణం తట్టుకునేలా శారీరక శక్తి అవసరం. ఈ యాత్ర చేయదలచిన వారు, బయలుదేరడానికి కొంత కాలం ముందు నుంచి రోజుకు రెండు పూటలు నడక, శ్వాసకు సంబంధించిన వ్యాయామం, యోగా అభ్యాసం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE