బోనాలు తెలంగాణ జానపద సంస్కృతీ, సంప్రదాయాలకు దర్పణం. ఆషాఢం రావడంతోనే భాగ్యనగరిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం వారం ఉత్సవ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆషాఢ తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ఉత్సవాలు ప్రారంభమై మిగిలిన మూడు ఆదివారాల్లో వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవార్ల ఆలయాల్లో వైభవంగా జరుగుతాయి. వాటికి సమాంతరంగా జంటనగరాల నలుమూల, శివారు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలలో బోనాలు జరుపుకుంటారు. రాష్ట్రంలోని పల్లెల్లో మఖ కార్తె ప్రవేశంతో ఈ వేడుకను నిర్వహించుకుంటారు.
శక్తితత్వం సమస్త ప్రకృతిని ముందుకు నడిపి స్తోందని విశ్వాసం. ఆ శక్తి సంవిధానాన్ని పలు రూపాలుగా ఆరాధించడం ఆర్ష సంప్రదాయం. వివిధ మతాల, జాతుల ప్రజలు సామరస్యంగా కలసిమెలసి అపురూపంగా నిర్వహించుకొనే వేడుకల్లో బోనాలు ముందు వరుసలో ఉంటుంది. శతాబ్దాల సహజీవనానికి ఇది చిరునామాగా నిత్యనూతనంగా సాగిపోతోంది. బోనాలు ఆరంభ వికాసాలను, ప్రధానంగా భాగ్య నగరంలోని సంబరాలను మననం చేసుకుంటే…
గోల్కొండ జగదాంబిక…
చారిత్రక ఆధారాలను బట్టి కాకతీయులు గోల్కొండ కోటను కట్టక ముందు యాదవ కులస్థులు అక్కడ మేకలు, గొర్రెలను మేపేవారు. అప్పటికే అక్కడ గల ఆలయం (ఎల్లమ్మ)లో తరచూ బోనాలు సమర్పించేవారు. అనంతర కాలంలో నిర్మితమైన కోటను ‘గొల్లకొండ’గా పిలిచే వారని, కాలక్రమంలో గోల్కొండగా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. అక్కడి జగదాంబిక ఆలయంలో మొదటగా నిర్వ హించే ఈ బోనాలును చెలిమి బోనాలు అంటారు.
బల్కంపేట ఎల్లమ్మ
ఒకనాటి బెహలూఖాన్‌గూడ నేటి బల్కంపేటలో శతాబ్దాల క్రితం ఊట బావిలో ఆవిర్భవించిన ఎల్లమ్మ తల్లి నాటి నుంచి విశేషపూజలు అందుకుంటోంది. ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా శయన రూపంలో గల అమ్మవారి విగ్రహం కనిపించింది. దానిని గ్రామస్థుల సహకారంతో ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అలాగే చిన్నపాటి గుడి కట్టించారు. అనంతరం సంస్థానాధీశుడు రాజా శివరాజ బహద్దూర్ నూటపాతికేళ్ల క్రితం (1919) అమ్మవారికి ఆలయం నిర్మించారు. అమ్మవారు జలధివాసినిగా ఆవిర్భవించినందున అమెను ‘జలదుర్గ’ అవతారంగా పూజిస్తారు.
ఉజ్జయిని మహంకాళి
సికింద్రాద్‌లోని మహంకాళి బోనాలు లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో అమ్మవారి మూర్తి దారుశిల్పంగా ఉండేదట.1815 ప్రాంతంలో నర్సయ్య అనే సైనికోద్యోగి ఉజ్జయిని నుంచి తెచ్చిన కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిం చారట. బదిలీపై అక్కడికి వెళ్లిన నర్సయ్య అప్పట్లో అక్కడ ప్రబలిన కలరా బారినుంచి తనను కాపాడి స్వస్థలానికి చేరిస్తే అమ్మవారికి గుడికడతానని మొక్కుకున్నాడని, ఆ మొక్కు ఫలితమే నేటి ఆలయమని చరిత్ర చెబుతోంది.
లాల్ దర్వాజా మహంకాళి
లాల్ దర్వాజాలోని మహంకాళి అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. సింహవాహిని మహంకాళిగా పూజిస్తారు. నాడు ప్లేగు, కలరా మహమ్మారి నుంచి అమ్మవారు కాపాడారని, నేటికీ ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువైన ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, పెద్దమ్మతల్లి, అంకాలమ్మ, రేణుకమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. అమ్మ అనుగ్రహించే ఫలితాలను బట్టి జానపదులు శక్తి రూపాలకు పేర్లు నిర్ణయించు కున్నారని తెలుస్తోంది. పిల్లలను చల్లగా కాచే తల్లిని పోచమ్మగా, ఆడపడుచు లకు అండగా ఉండే ముత్యాలమ్మ, ఊరి సరిహద్దు లకు రక్షణగా ఉండే పోలేరమ్మ, మహమ్మారులనే మటు మాయంచేసే మాంకాళమ్మా.. ఇలా శక్తిమాత లకు ఆషాఢంలో సభక్తికంగా బోనాలు సమర్పిస్తారు.
బోనమంటే…
బోనమంటే భోజనమని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. కరవుకాటకాలు నెలకొన్నప్పుడు, రోగకారక పరిస్థి తులు ఎదురైనప్పుడు, ఉపద్రవాల సంభవించి నప్పుడు శక్తి స్వరూపాలకు వైవిధ్య భరితమైన అన్న పదార్ధ్దాలను నివేదించాలని ‘కాళికా పురాణం’ సూచించింది. కొత్త కుండలో బియ్యం, పాలు, బెల్లం, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఈ కుండకు సున్నంరాసి, పసుపు కుంకుమ, వేపకొమ్మలతో అలంకరి స్తారు.దానిపై గండదీపం పేరిట జ్యోతిని వెలిగించి మహిళలు శిరస్సున దాల్చి, మేళతాళాలతో వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
బోనం కోసం వినియోగించే పూజాద్రవ్యాల్లో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉం డడవల్ల సామాజిక శాస్త్రవేత్తలు వీటిని ‘ఆరోగ్య బోనాలు’ అని సూత్రీక రించారు. వీటిలో ఉపయోగించే నిమ్మకాలు, వేపమండలు, జ్యోతిలో వ్యాధినిరోధకాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. వేదాంతపరంగా చూస్తే, బోనపు కుండ మానవ శరీరానికి ప్రతీక. అందులోని అన్నం జీవశక్తికి సంకేతం. కుండపై వెలిగే జ్యోతి మన ఆత్మజ్యోతి. దానిని పరంజ్యోతితో మమేకం చేయా లన్నదే బోనాల వేడుకల అంతరార్థంగా చెబుతారు. పాంచభౌతికమైన మట్టికుండలాంటి ఈ శరీరాన్ని సర్వాత్మకంగా దైవశక్తికి బోనంగా సమర్పిం చడం ద్వారా అమ్మతల్లి అనుగ్రహానికి పాత్రులు కావచ్చన్నదే బోనాలు ఉత్సవాల పరమార్థంగా చెబుతారు. ‘సాగనంపు’ ఘట్టం ద్వారా.. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను చీరసారెలతో సాగనంపినట్లు అమ్మతల్లికి పసుపు కుంకుమలు, పండ్లుపూలు కానుకగా ఇచ్చి ఆమె నెలవుకు తిరిగి పంపడం ద్వారా ఆషాఢ బోనాలు పరిసమాప్తమవుతాయి.
– స్వామి