సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆషాఢ శుద్ధ ద్వాదశి – 07 జూలై 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అత్యవసర పరిస్థితి విధించి యాభయ్ ఏళ్లు గడిచాయి. స్వతంత్ర భారత చరిత్ర మీద దాని నీడ, జాడ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అది గర్వకారణమైన నిర్ణయం కాదు. ఆ చీకటియుగం మీద ఇంకా చర్చించవలసినదే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు సర్‌కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబలె సరైన సమయంలో ఒక చర్చకు పిలుపునిచ్చారు. పార్లమెంట్, మంత్రిమండలి, న్యాయవ్యవస్థ, పత్రికా రంగం` వీటిలో ఏవీ పెదవి విప్పే అవకాశం లేని పాడుకాలమే ఎమర్జెన్సీ. ప్రతిపక్షాలు మొత్తం కారాగారంలో ఉన్నాయి. అలాంటి నియంత పోకడల మధ్య జరిగినదే 42వ రాజ్యాంగ సవరణ. 38, 39 రాజ్యాంగ సవరణలు కూడా ఆనాడే జరిగాయి. 42వ సవరణ మేరకే రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులరిస్ట్’ అన్న పదాలు చేరాయి. అలాంటి చీకటియుగంలో రాజ్యాంగంలోకి చొరబడిన ఈ పదాలకు ఉన్న విలువ చర్చనీయాంశమే అవుతుంది. దాని కోసమే పిలుపునిచ్చారు హోసబలె. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పదాలు లేవు. అసలు ఆయన ఆలోచనలలోనే లేవు.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠిక సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమాక్రటిక్ రిపబ్లిక్ అని భారత్‌ను పేర్కొన్నది. జూన్ 25, 1975న అత్యవసర పరిస్థితిని రుద్దారు. 1976లో ఈ సవరణ జరిగింది. ఈ సవరణ, దీని ఉద్దేశం, ఆ రెండు మాటలు చేర్చడం గురించి సరైన చర్చ జరగలేదన్నదే ఎక్కువ మంది అభిప్రాయం. సోషలిస్ట్ అన్న పదం వల్ల విధాన నిర్ణయాలకు సంకెళ్లు పడతాయన్నది పూర్వం నుంచి ఉన్న వాదన. సెక్యులర్ అన్న పదంతో హిందూత్వ వారసత్వం అనే భావనను పలచన చేశారని హిందువుల ఆవేదన. రాజ్యాంగ రచన జరిగిన పాతికేళ్ల తరువాత ఈ రెండు పదాలను చొప్పించడం వెనుక దురుద్దేశమే ఉందని ఆర్‌ఎస్‌ఎస్ సహా చాలా హిందూ సంస్థలు ఆది నుంచి అనుమానిస్తున్నాయి. నిజానికి వారి అనుమానమే నిజమైంది. ఇవాళ సెక్యులరిజం అంటే జనం ఈసడిరచుకునే వాతావరణం ఉంది. ఇందులో సర్వధర్మ సమభావన కంటే, మైనారిటీల బుజ్జగింపునకు రాజమార్గం ఏర్పరిచింది. ఈ పదాలను ఇలా నియంతృత్వం చాటున పీఠికలో చేర్చడం ఒకటి. ఆ పదాలను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ పూర్తిగా నిరాకరించడం మరొకటి. ప్రొఫెసర్ కేటీ షా ఆ పదాలను రాజ్యాంగంలో చేర్పించడానికి పలుసార్లు ప్రయత్నించారు. సెక్యులర్ అన్న పదం సర్వమత సమానత్వం గురించి భారత్‌కు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వాదన. ఆర్థిక అసమానతల నిర్మూలన పట్ల దేశానికి ఉన్న లక్ష్యం సోషలిస్ట్ అన్న పదం ద్వారా వ్యక్తమవుతుందని కూడా కేటీ షా అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని బలపరిచినవారూ ఉన్నారు. కానీ డాక్టర్ అంబేడ్కర్ వారి వాదనతో ఏమాత్రం ఏకీభవించలేదు. సోషలిజం అన్న పదం ప్రజాస్వామ్యం అన్న భావనలోని సరళత్వాన్ని పలచన చేస్తుందనే అన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తున్నది కాబట్టి సెక్యులరిజం అన్న పదం వ్యర్ధమేనని ఆయన భావించారు. నిజానికి భారత రాజ్యాంగమే మతాలకు అతీతంగా ఉందని స్పష్టం చేశారు. డాక్టర్ అంబేడ్కర్ భావననే గౌరవిస్తూ 2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ రెండు పదాలు లేని పీఠికను ప్రదర్శించింది. దీని మీద కొన్ని పక్షాలు గగ్గోలు పెట్టకుండా ఉండలేవు. కానీ దీని మీద చర్చకు సిద్ధం కావలసిందని ఆనాడే బీజేపీ సవాలు విసిరింది. భారత్‌లో అమలవుతున్నది సెక్యులరిజం కాదు, కుహనా సెక్యులరిజం మాత్రమేనని మొదటి నుంచి హిందూత్వ సంస్థలు ఆక్రోశిస్తూనే ఉన్నాయి. కుహనా సెక్యులరిజానికి మరొక వైపున కనిపించేదే మైనారిటీల బుజ్జగింపు. చిరకాలంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నది సెక్యులరిజం కాదు, కుహనా సెక్యులరిజమే అని ప్రజలు అతి తొందరగా విశ్వసించారని చెప్పడానికి రుజువు లాల్‌కృష్ణ అడ్వాణి చేసిన అయోధ్య రథయాత్ర, దానికి వచ్చిన స్పందన.
సోషలిజం అన్న భావన వినడానికి సొంపుగానే ఉంటుంది. కానీ ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రపంచ దేశాలు నియంతృత్వ పోకడలను అనుసరించవలసి వచ్చింది. కొంత పురోగతి కనిపించినా దానిలో మానవత్వం లోపించడం వల్ల చేదు ఫలితాలను మిగిల్చింది. తూర్పు యూరప్, సోవియెట్ రష్యా పతనం తరువాత సోషలిజం అన్న పదం సొమ్మసిల్లి పోవడానికి కారణం కూడా అదే. సంక్షేమంలో ఇందిరకూ, మోదీకీ పోలిక తెస్తున్నవారు ఇదే గమనించాలి. సోషలిజం అంటూ బీజేపీ గొంతు చించుకోదు. కానీ గడచిన పదేళ్లలో ఆ పార్టీ ప్రభుత్వం సంక్షేమం మీద చేసిన ఖర్చు రూ. 34 ట్రిలియన్‌లు. సంక్షేమానికి నరేంద్ర మోదీ కొత్త దిశను చూపారు. సోషలిజం దేశం మీద రుద్ధి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ దిగుమతి సిద్ధాంతాలు వ్యవస్థను ఒక చట్రంలో బంధించి ఉంచుతాయి. కాలానుగుణంగా అడుగువేయనీయవు.
ఎమర్జెన్సీ భారత జీవన విలువలకు గాయం చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో విధ్వంసం సృష్టించింది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని నామమాత్రంగానే అంగీకరించారు. కానీ జాతికి క్షమాపణలు చెప్పలేదు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ హోసబలె అడుగుతున్నది అదే. అలాంటి అత్యాచారాలకు కారణమైనవారే ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ఎమర్జెన్సీ విధించినవారు మీ ముందుతరం వారే కావచ్చు, కానీ అందుకు మీరు క్షమాపణ చెప్పడం ఇవాళ్టి అవసరం అని కూడా హోసబలే స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విధించినందుకు భారత జాతికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది.