సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆషాఢ శుద్ధ పంచమి – 30 జూన్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
కాదేది కవిత కనర్హం.. అన్నట్లు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రతి అంశమూ విమర్శనార్హం, అభ్యంతరకరమే. తమకు నచ్చని ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖుల ప్రతి ప్రకటనలోనూ పెడర్థాలు,విపరీతార్థాలు వెదకి రచ్చచేయడం ఆయన ప్రత్యేకత. మంచిని మంచిగా, చెడును చెడుగా పరిగణించి ఆమోదించడం ఆయన నిఘంటువులో లేదని అనేక సందర్భాలు రుజువు చేశాయి. తన స్పందన సమాజ హితమా? హేతుబద్ధమా? పదుగురికి పని కొచ్చేదా? లాంటి ప్రశ్నలు అసంగతం. మనసుకు తోచింది అనేయడమే ప్రధానం. ఆంగ్లం దేశంలో అనివార్యంగా రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. అవసరార్థం ఆ భాషను ఆమోదిస్తూనే, దేశీయ/మాతృభాషలను ఆదరించాలని అనేకులు ఆది నుంచి చెబుతున్నదే. ఆ పంథాలోనే ‘మన సంస్కృతికి మాతృభాషలే రత్నాలు. అవి లేకపోయినా, వాటిని ఆదరించకపోయినా భారతీయులం అనిపించుకోలేం. మన సంస్కృతి, చరిత్ర లాంటి అంశాల అధ్యయనానికి అమ్మ భాషలు మించినవి లేవు.అరకొరగా నేర్చిన విదేశీ భాషలతో పరిపూర్ణత సాధించలేం. కనుక ఆంగ్లం మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు రావడానికి ఎంతో దూరం లేదు’ అని దేశంలోని భాషలప్రాముఖ్యం, వాటి వారసత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాహుల్‌కు అభ్యంతరకరమనిపించాయి.
విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జూన్ 19న హాజరైన అమిత్ షా, దేశీయ భాషల ప్రాధాన్యతను వివరించే క్రమంలో… విదేశీ భాషను వదిలించుకోవడం అంత తేలికకాదన్న సంగతి తెలుసునని, అయినా భారతీయులు స్వభాషలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దానికే విపక్షనేత స్పందించి, ‘ఆంగ్ల భాష మాట్లాడడం సిగ్గు చేటు కాదు…విద్యార్థుల ఉన్నతికి ఊతం’ అని సెలవిచ్చేశారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించడం భారతీయ జనతాపార్టీకి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ుకు ఇష్టం లేదని కూడా ఆక్రోశించారు.
ఆంగ్ల భాష అనవసరమన్న భావన ఎవరికీ లేదు, ఉండనవసరం లేదు కూడా. ‘భుక్తికి ఆంగ్లం.. జీవన రక్తికి అమ్మభాష’ అని అనేకులు వ్యాఖ్యానించే ఉన్నారు. ప్రపంచ దేశాలకు ఆంగ్లం అనుసంధాన భాషని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ భాషా పరిజ్ఞానం వల్ల ఒనగూరే ప్రయోజనాలతోనూ విభేదించనక్కర్లేదు. ఆంగ్లం అంటే ఒకప్పుడు వ్యామోహమైతే, ఇప్పుడు అవసరమనడంలో భిన్నాభిప్రాయం ఉండబోదు. ఆ భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం వంటి నైపుణ్యాలు ఆహ్వానించదగినవే. అదే సమయలో బాల బాలికలను ప్రాథమిక విద్య నుంచే తల్లి భాషకు దూరం చేసే తీరు అభ్యంత రకరం. పరభాషా మోజులో ప్రాంతీయ భాషల అస్తిత్వానికి ముప్పు ముంచుకొస్తోందని చాలా ఏళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా భాషలు ఉన్నాయని, జీవన వైవిధ్యానికి, మానవ వికాసానికి ఇవి ప్రతీకలని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం (యునెస్కో) దాదాపు పాతికేళ్ల క్రితమే పేర్కొంది. కొన్ని వేలమంది మాత్రమే మాట్లాడే భాషలు మనుగడ కోల్పోతుండగా, లక్షల, కోట్ల సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాషలు కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని భాషావేత్తలు, భాషా పరిరక్షణ ఉద్యమ నేతలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు భాషా పరంగానే ఆలోచిస్తే…పిల్లల్లో, యువతరంలో తెలుగు భాష వ్యవహారం తగ్గిపోతుండడం పట్ల కలత చెందుతున్నారు. అందుకే ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని, అదే శాస్త్రీయ విధానమని నినదిస్తున్నారు.
అమ్మ భాషలో చదువుల కారణంగా విద్యార్థుల్లో విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు వెల్లివిరుస్తాయన్నది అక్షరసత్యం. అనేక దేశాలు దీనిని రుజువు చేస్తున్నాయి కూడా. రష్యా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి ఎన్నో దేశాలు కేజీ నుంచి పీజీ వరకు సొంత భాషలోనే బోధిస్తున్నాయి. విజ్ఞాన సముపార్జనలో తిరుగులేని శక్తులుగా వర్ధిల్లుతున్నాయి. ఆయా దేశాల స్ఫూర్తితో.. ఆంగ్లభాష, ఆంగ్ల మాధ్యమాలే సర్వరోగ నివారిణి అనే భ్రమ నుంచి బయటపడాలనే సంగతి ప్రపంచ దేశాలు చుట్టి వచ్చే రాహుల్‌కు తెలియదనుకోలేం. ఎక్కడో దాకా ఎందుకు? కన్నడంలో మాట్లాడే వారే కర్ణాటకలో ఉండాలని అక్కడ ఏలికలు అంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండిరచి, అక్కడ ఆంగ్లంను నిర్బంధం చేయగలరా?
అపరిచిత బోధనా మాధ్యమంలో విద్యాభ్యాసం, ప్రజ్ఞాపాటవాల వికాసానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుందని ప్రపంచవ్యాప్త అధ్యయనాలు, యునెస్కో లాంటి సంస్థలు హెచ్చరించాయి. విజ్ఞానశాస్త్ర మథనంలో భారతీయుల భాగస్వామ్యం ఇనుమడిరచేందుకు సైన్స్‌ను మాతృభాషలో బోధించాలని నోబెల్ పురస్కార గ్రహీత సీవీ రామన్ ఎన్నడో ఉద్ఘాటించారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇతోధికంగా అందిపుచ్చుకునేందుకు అవసరపడుతుందనే ఉద్దేశంతోనే కన్నవారు తమ బిడ్డలను ఆంగ్ల మాధ్యమంలో చేరుస్తున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. స్థితిమంతులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నప్పుడు తమ చిన్నారులను మాతృ(తెలుగు) మాధ్యమానికే ఎందుకు పరిమితం చేయాలనే ప్రశ్న దిగువ ఆదాయ వర్గాలనుంచి ఎదురవుతోంది. అన్ని విద్యాసంస్థల్లో ప్రాథమిక విద్యా మాధ్యమంగా మాతృభాషే ఉంటే ఈ ప్రశ్నకు ఆస్కారమే ఉండదు. అమ్మభాషలో చదివిన వారికి బతుకుతెరువుకు ఢోకా ఉండదనే భరోసా కల్పించగలిగిన నాడు, నేతలు తమకు నచ్చని ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయపెట్టని నాడు స్వదేశీ భాషల్లోనే అభ్యాసం వైపు మొగ్గు చూపవచ్చు.