సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆషాఢ బహళ చవితి – 14 జూలై 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మతానికి, ఆధ్మాత్మికతకు, యోగ సాధనకు ఆమడదూరంలో ఉండే చైనా సర్కారు టిబెటన్ల ఆధ్యాత్మిక నేత, బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నది. తగుదునమ్మా అంటూ సున్నితమైన విషయాన్ని వివాదంగా మార్చి, మరేంపనిలేనట్టుగా మనదేశాన్ని కూడా ఇందులోకి లాగుతోంది. మతం మత్తు మందు అని సూత్రీకరించే కమ్యూనిస్టు పార్టీ, చైనా సర్కారులు అసలు ఏ ముఖం పెట్టుకొని వారసుడిని ఎంపిక చేస్తామంటున్నాయి? పైగా దలైలామాకు ఆయన వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం లేదు గాక లేదు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
శాంతిదూతగా, ఆధ్యాత్మికవేత్తగా యావత్ ప్రపంచం కొనియాడే ఆ మహనీయుడు కొద్దిరోజుల క్రితమే 90వ ఏట అడుగుపెట్టారు. ఈ జులై 6వ తేదీన వారు కొలువైన ధర్మశాలలో పండుగ వాతావరణం నెలకొంది. దైవం మానుష రూపేణా అన్నట్టు కంటి ముందు కనిపిస్తున్న దలైలామా జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా బౌద్ధులు, మతాలకు అతీతంగా వారి భక్తులు, అనుయాయులు ధర్మశాలకు వచ్చారు. వారి ఆయుష్షు కోసమని ప్రార్థనలు చేశారు. భజనలు చేశారు. ఇదే సమయంలో యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక కీలకమైన ప్రకటనను వారు ఇచ్చారు. ముందునుంచీ చెబుతున్నట్టే తన వారసుడి ఎంపిక ప్రణాళిక గురించి మాట్లాడారు. దలైలామాకు చెందిన వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దలైలామా కార్యాలయం 2015లో ఏర్పాటు చేసిన గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ అనే లాభాపేక్ష లేని సంస్థ వారసుడి ఎంపిక ప్రక్రియను చేపడుతుందని వెల్లడిరచారు. ఏ ఒక్కరికీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం కోసమని మరో 40 ఏళ్లు జీవించాలని ఉందని అన్నారు. కాలం చేసిన తర్వాత మళ్లీ జన్మిస్తాననీ భక్తజనానికి ఊరట కలిగించారు. వారి మాటలకు వేడుకల్లో పాల్గొన్నవారందరూ హర్షధ్వానాలు చేశారు. అక్కడే ఉన్న మన కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, రాజీవ్‌రంజన్ సింగ్ దలైలామాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా దలైలామా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.
ఇదంతా చైనాకు కన్నెర్ర అయింది. దలైలామా చేసిన ప్రకటనను తప్పుపట్టింది. ఈ సందర్భంగా ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ మాట్లాడిన మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయి. దలైలామా వారసుడిని లాటరీ ద్వారా ఎంచుకోవాలట. అదెలాగంటే ఒక బంగారు పాత్రలో చీటీలు వేసి వాటిలో ఒక చీటీని తీసి ఎంపిక చేయాలట. అలా చేసిన ఎంపికకు చైనా ప్రభుత్వం ఆమోదముద్ర తప్పనిసరిగా ఉండాలట. టిబెటన్ బుద్ధిజమ్ చైనాలో పుట్టిందట, ఆ మతానికి చైనా స్వాభావిక లక్షణాలు ఉన్నాయిట. ఇలా నోటికి ఏది వస్తే అది అన్నట్టుగా ఆమె మాట్లాడుకుంటూ పోయింది. చివరకు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడాన్ని కూడా తప్పుపట్టింది. ప్రతిసారీ అయినదానికి కానిదానికి అన్నట్టుగానే ఈసారి కూడా ఇది మా అంతర్గత వ్యవహారమని, మీ జోక్యం వద్దంటూ భారత్‌కు సుద్దులు చెప్పే ప్రయత్నం చేసింది. అసలు ఒక మతాధిపతికి వారసుడి కోసం ఈ చీటీల గొడవేమిటి అని చైనా మీద చిరాకుపడినవాళ్లు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. చైనా వాచాలత్వం మీద కిరెన్ రిజిజు వెంటనే స్పందించారు. ప్రస్తుత దలైలామా వారు ఏర్పాటు చేసిన విధివిధానాలకు లోబడి వారికి వారసుడిని నిర్ణయిస్తారని చెబుతూ పరోక్షంగా చైనాకు చురకలు వేశారు. మతపరమైన విషయాల్లో నీ జోక్యం ఏమిటని నిలదీశారు. ఒకప్పుడు చైనాలో కమ్యూనిస్టు నేతలు బుద్ధిజాన్ని తోసిపుచ్చారు. హుషి, చెన్ డుక్సియి లాంటి కొత్త సాంస్కృతిక ఉద్యమానికి చెందిన పలువురు నేతలు బౌద్ధమతాన్ని, ఆ మతం సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండిరచారు. బౌద్ధం మూలాలు భారత్‌లో వేళ్లూనుకొని ఉండటం పట్ల తెగ బాధ పడిపోయారు. ఇలా జరగడం చైనా దురదృష్టమని వాపోయారు. అది చైనా భావజాలం, సమాజం పురోగతికి అతి పెద్ద అడ్డంకి అని శోకించారు. కానీ ఇవాళ అదే కమ్యూనిస్టు పార్టీ టిబెటన్ బుద్ధిజానికి, దలైలామా పరంపరకు స్వయంప్రకటిత ధర్మకర్తగా చెప్పుకుంటోంది.
ఇక టిబెట్ అభివృద్ధికి సంబంధించి చైనా ధోరణి ఇదే రీతిలో ఉంది. టిబెట్ అభివృద్ధి గురించి అనేక దశాబ్దాలుగా తనకు అనుకూలంగా ప్రచారం చేయడంలో తన అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలుగానూ వాడుకుంటోంది. దక్షిణాసియాలో అభివృద్ధికి కేంద్రంగా టిబెట్ ఉందని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టిబెట్ చైనాలో మునిసిపాలిటీలు, తదితర ప్రాంతాలతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ వెనుకపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దలైలామా 90వ జన్మదినోత్సవం చాలాకాలానికి అందివచ్చిన ఒక అవకాశంగా చైనా భావిస్తోంది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దలైలామా వారసుడి పాచికను బైటకు తీసింది. కానీ ఆ పాచిక పారేది కాదని చైనా ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చెప్పినట్టుగా ఆ వ్యవహారం పూర్తిగా దలైలామా చేతుల్లో ఉంది. ఎందుకంటే వారిని దశాబ్దాలుగా అనుసరిస్తున్న ప్రపంచంలోని బౌద్ధ మతస్తులు, అభిమానులు, అనుచరులు, భక్తులు దలైలామా నిర్ణయాధికారమే సరైందని భావిస్తున్నారు కాబట్టి. అసలు బౌద్ధంతో ఏమాత్రం సంబంధం లేని చైనాకు వారసుడి వ్యవహారంతో మాత్రం ఏం పని?